సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మొదటి సంపుటము/ఆంధ్రదేశ చరిత్రము III
ఆంధ్రదేశ చరిత్రము III క్రీ. శ. 1324-1875: -రాజకీయస్థితి క్రీ.శ. 1324 - 14 వ శతాబ్ది ప్రథమ పాదమున ఆంధ్రదేశము ఉత్తర హిందూస్థానమునుండి ముస్లిం దండయాత్రలకు తరచుగ గురియగుచుండెను. ఆంధ్రభూమినంతయు దాదాపు ఏకచ్ఛత్రాధిపత్యముగ నేలిన కాకతీయ సామ్రాజ్యము తురుష్క జైత్రయాత్రా దావానలమున కాహుతి యయ్యెను. క్రీ.శ.1323 తరువాత దేశమున శాంతి భద్రతలు కొరతపడెను.
తురుష్కుల బారినుండి హైందవ ధర్మమును రక్షించుటకై ఆంధ్రావనిలో అచట నచట ప్రయత్నములు సాగుచుండెను. తత్ఫలితముగ క్రీ. శ. 1331 తూర్పుతీరమంతయు తురకల పాలనమునుండి విడివడి స్వతంత్రమయ్యెను. పశ్చిమ భాగమున చాళుక్య సోమదేవుడును, మూడవ బల్లాలదేవుడును ఢిల్లీ ముస్లిం బానిసత్వమును తొలగద్రోసి, కంపిలి ముస్లిం రాజప్రతినిధి పై తిరుగబడి యోడించిరి. ఈ కార్యమున వీరికి హరిహర రాయలు, బుక్కరాయలు సహాయపడిరి. తుంగభద్రానదీ దక్షిణ తటమున విజయనగర సామ్రాజ్యము (క్రీ.శ. 1336) ను, పూర్వపు కాకతీయ రాజ్యభాగమున వెలమ రాజ్యమును, కృష్ణా గోదావరీ పరిసరములందు రెడ్డి రాజ్యమును (క్రీ. శ. 1330) నెలకొనెను. కళింగాంధ్ర మున తూర్పు గాంగులును, కోరుకొండలో రెడ్లును, పిఠాపురమున కొప్పుల నాయకులును, ఓరుగల్లు పరిసరములందు ప్రోలయ, కాపయనాయకులును, పరిపాలించుచుండిరి. హిందూరాజ్యము లన్నిటికి ప్రక్కలోని బల్లెమువలె బహమని రాజ్యము (క్రీ.శ. 1347) విజయనగర రాజ్యమునకు ఉత్తరమున స్థాపితమయ్యెను. దీనికి రాజధాని గుల్బర్గా నగరము.
విజయనగర సామ్రాజ్యము, క్రీ.శ. (1336-1675) :- I. సంగమ వంశము క్రీ. శ. 1336-1486) : దక్షిణభారత దేశము నంతయు ఏకచ్ఛత్రము క్రిందికి తెచ్చినవారు విజయనగర సామ్రాజ్య స్థాపకులగు హరిహరరాయలు, కంప రాయలు, బుక్కరాయలు, మారప, ముద్దప అను పంచ సహోదరులు. వీరిలో హరిహరరాయలు, బుక్క రాయలు కాకతీయులకును, కంపిలి రాజునకును సేవకులై యుండిరి. వీరు క్రీ. శ. 1327 లో ఢిల్లీకి బందీలుగా గొంపోబడిరి. మరల కంపిలి రాజప్రతినిధియగు మాలిక్ మహమ్మదు అనువానికి సహాయులుగ వీరు ఢిల్లీ సుల్తానుచే దక్షిణము నకు పంపబడిరి. అప్పుడు విద్యారణ్యస్వామి ప్రోద్బలముతో వీరు విద్యానగరమును నిర్మించిరి. అదియే విజయనగరము (హంపి). హరిహరరాయాదులు సంగమ రాజపుత్రులగుటచే వీరిది సంగమవంశ మయ్యెను.
హరిహరరాయలు I (క్రీ. శ. 1336-1357) బుక్కరాయలు I ను (క్రీ. శ. 1344-77), కొన్ని యేండ్లు కలిసి రాజ్యము చేసిరి. క్రీ. శ. 1344 లో బుక్క రాయలు యాదవరాజ్యమును, పశ్చిమతీరమునందలి తులునాడును జయించెను. “పూర్వ పశ్చిమ సముద్రాధీశ్వర" అను బిరుదు వహించి, హరిహరరాయలు, బుక్క రాయలు క్రీ. శ. 1346 లో తక్కిన సోదరులతోకూడి శృంగేరిలో గురుసమక్షమున విజయోత్సవము జరుపుకొనిరి. ఈ మహాసామ్రాజ్య నిర్మాతలగు వీరులు హోయసల సామంతులుగాక ఆంధ్రు లనుట నిక్కు వము.
బహమనీరాజ్యము (క్రీ. శ. 1347-1525) నకును తద్విచ్ఛిన్నానంతరము ఏర్పడిన గోలకొండ, బీదరు, అహమదునగరు, బిజాపూరు, బరారు అను అయిదు తురక రాజ్యములకును, విజయనగర రాజ్యమునకును మధ్య సతతము సమరములు సాగుచునే యుండెను. రాయచూరు లోయ, తూర్పుతీరమున కృష్ణానది యుత్తర భాగము, తరచుగ చేతులు మారినను తుంగభద్రానది దక్షిణతీరము మాత్రమే ఎల్లప్పుడును విద్యానగరాధీశుల అధీనమందే యుండెను. అల్లాయుద్దీను బహమన్ షా క్రీ.శ.1349, 1354 లలో విజయనగరముపై దండెత్తెను. కాని రెండవతూరి బుక్క రాయలచే పరాజితు డయ్యెను. బుక్కరాయలు I బహమనీ సుల్తానులు-మహమ్మదు I ముజాహిదులతో యుద్ధము చేసి గెలిచెను. ఇతని పుత్రుడు కుమార కంపన II మధుర ముస్లిం రాజ్యమును అంత మొందించెను. క్రీ. శ. 1374 లో బుక్క రాయలు చైనా చక్రవర్తికి రాయబార మంపెను,
ఇతని తరువాత హరిహరరాయలు II (క్రీ.శ. 1377- 1404) రాజ్యమునకు వచ్చెను. ఈ మహారాజు తురకల నుండి చౌల్, దబూల్ రేవులను జయించెను. క్రీ. శ. 1382-85 సంవత్సరముల మధ్య కొండవీటి రెడ్లనుండి కర్నూలు, నెల్లూరు, గుంటూరు మండలములలో కొన్ని రాజ్యభాగములను ఇతడు వశపరచుకొనెను. క్రీ.శ. 1388-89 లో ఫిరోజిషా బహమనీతో యుద్ధముచేసెను. హరిహరుని మరణానంతరము విరూపాక్ష రాయలు I ను (క్రీ. శ. 1404-1405), బుక్క రాయలు II ను (క్రీ. శ. 1405-1406) కొద్దికాలము పాలించిరి, తదనంతరము దేవరాయలు I ( క్రీ. శ. 1406-1422) క్రీ.శ. 1406 లో పట్టాభిషిక్తు డయ్యెను. ఫిరోజ్ షా ఏటేట విజయనగరము పై దండెత్తుచునే యుండెను.
కొండవీటి రెడ్డి రాజులు సుల్తానుపక్షమున దేవరాయలతో పోరుచుండిరి. దేవరాయల మిత్రుడు కాటయ వేమారెడ్డి యుద్ధమున హతుడయ్యెను, క్రీ. వ. 1419 లో దేవరాయలు పానుగల్లు దుర్గమును పట్టుకొనెను. దేవరాయలు చనిపోగా, పుత్రుడు రామచంద్రరాయలు (క్రీ. శ. 1422) కొన్ని నెలలు పాలించెను. తరువాత, తమ్ముడు విజయరాయలు (క్రీ.శ. 1422-1426) రాజ్యమునకు వచ్చెను. బహమనీ సుల్తాను అహమదుషా విజయనగరము పై దండెత్తి అమాయిక ప్రజలను హింసించి, చంపెను. మృతిచెందిన జనులు 20,000 లకు మించగనే ఆనందోత్సవములను జేయుచుండెను, దేవా యతనములను పాడుచేయించుచుండెను. క్రీ.శ. 1426 లో దేవరాయలు II, అదివరకు తండ్రితో పాలించి రాజ్యమునకు వచ్చెను. ఇతనినే ప్రౌఢదేవరాయలందురు.
ప్రౌఢదేవరాయలు క్రీ. శ. 1422- 1446) కొండవీటి రెడ్డి రాజ్యమును గెలిచి, రాజమహేంద్రవరపు రెడ్డి రాజ్యమును బలపరచెను. కేరళమునకుబోయి క్విలాన్ ను, ఇతర రాజులను గెలిచెను. ఇతని రాజ్యము గుల్బర్గానుండి సింహళము వరకును, ఒరిస్సానుండి మళయాళమువరకును విస్తృతిగాంచెను. దేవరాయలు సైన్యములో తురకలను చేర్చికొని, తన సైనికులకు విలువిద్యలో ప్రావీణ్యము గరపెను. ఇతడు రాయచూరుపై దండెత్తి పుత్ర మరణము వలన వెనుదిరిగెను. ఇతనితరువాత వచ్చిన రాజులు విజయరాయలు II క్రీ. శ. (1446 - 1447), మల్లి కార్జునరాయలు (క్రీ. శ. 1447- 1465) బలహీనులగుటచే ఈయదను జూచుకొని బహమనీ అలాయుద్దీను II, కపిలేశ్వర గజపతియు విజయనగరముపై దండెత్తిరి. విజయనగర సామంతులు సాళువ నరసింహరాయలు, అతని సేనాపతి తుళువ ఈశ్వరరాయలు ప్రబలులై యుండిరి. మల్లి కార్జునరాయల అనంతరము విరూపాక్షి రాయలు II (క్రీ. శ. 1465-1485) రాజయ్యెను. ఇతడు విషయలోలుడు. తురకలు గోవా మున్నగు రేవులను వశపరచుకొనిరి. చంద్రగిరి అధిపతి సాళువ నరసింహరాయలు కపిలేశ్వరుని మరణానంతరము గోదావరి వరకుగల భూమిని జయించి ఓడ్రులను తరిమెను. పురుషోత్తమ గజపతితో కలిసి మహమ్మదు III (క్రీ.శ. 1478 - 1481) లో యుద్ధము చేసెను. విరూపాక్ష రాయల అనంతరము ప్రౌఢరాయలు రాజయ్యెను. (క్రీ.శ.1485) క్రీ.శ. 1486 లో ప్రౌఢరాయలను పదభ్రష్టునిజేసి సాళువ నరసింహరాయలు విజయనగర సింహాసన మాక్రమించెను.
II. సాళువవంశము (క్రీ. శ. 1486-1505) : నరసింహ రాయలు (క్రీ. శ. 1486-1491) బలవంతులయిన సామంతుల తిరుగుబాటుల నణచెను. క్రీ.శ. 1489 లో పురు షోత్తమగజపతి గుండ్లకమ్మవరకు వచ్చి ఉదయగిరిని ముట్టడించి గెలిచెను. నరసింహరాయలు తుళువదేశము, హనొవర్, భట్కల్, బకనూరు, మంగుళూరు రేవులను సాధించి, అశ్వముల దిగుమతి సాగించెను. తమిళదేశమును జయించెను. క్రీ. శ. 1491 లో నరసింహరాయల మరణా నంతరము పెద్దకొడుకు తిమ్మభూపతి రాజ్యమునకు వచ్చెను. కాని కొద్దికాలములోనే ఇతడు హత్యగావింప బడెను. తరువాత చిన్న కొడుకు ఇమ్మడి నరసింహరాయలు (క్రీ. శ. 1491-1505) రాజయ్యెను. తుళువ నరసనాయకుడు రాజసంరక్షకుడుగ తానే రాజ్యము చేసెను.
III. తుళువవంశము : నరసనాయకుడు (క్రీ. శ. 1491-1503) రాయచూరులోయను గెలిచెను. క్రీ.శ. 1496లో రాజ్యమున తిరుగుబాటులు నడచుటకై కన్యాకుమారి వరకు విజయయాత్ర సాగించెను. శ్రీరంగపట్టణపు నంజరాజును గెలిచి క్రీ. శ. 1497 లో పడమటితీరమున గోకర్ణమువరకు గెలిచెను. ప్రతాపరుద్ర గజపతితో యుద్ధము చేసెను. నరసనాయకుడు సాళువ నరసింహ రాయలు ప్రారంభించిన రాజ్యవిస్తృతిని కొనసాగించి పుత్రుడు కృష్ణరాయల యొక్క సర్వతోముఖముగ ఉత్కృష్టమైన యుగమునకు పునాదులు నిర్మించెను. క్రీ. శ. 1503 లో తుళువ నరసనాయకుడు చనిపోగా కుమారుడు ఇమ్మడి నరసనాయకుడు (వీరనరసింహ రాయలు) రాజసంరక్షకు డయ్యెను. క్రీ.శ. 1505 లో రాజు సాళువ ఇమ్మడి నర సింహరాయలు చంపబడగా, తుళువ వీరనరసింహరాయలు (క్రీ. శ. 1505-1509) తుళువ వంశపు రాజయ్యెను. ఇతని పరిపాలన కాలమంతయు యుద్ధములతో గడచెను. ఆరవీటి రామరాయలు, పుత్రుడు తిమ్మరాయల రాజు సేవ వలన యూసఫ్ ఆదిల్ ఖాను తుంగభద్రానది దక్షిణతీరమును వశముచేసికొన ప్రయత్నించి విఫలు డయ్యెను. వీరనర సింహరాయలు పశ్చిమతీరమున స్థిరపడుచున్న పోర్చుగీసు వారితో మైత్రి నెరపి, తన సైన్యశిక్షణమునకు అల్ మైడా సహాయముకోరెను. క్రీ.శ. 1509 లో ఇతని మరణానంతరము శ్రీకృష్ణరాయలు సింహాసన మారోహించెను.
శ్రీకృష్ణదేవరాయలు (క్రీ. శ. 1509-29) రాజ్యమునకు వచ్చుసరికి అతని వయస్సు 25 సంవత్సరములు. అతడు సాటిలేని సకల కళాసమ్రాట్టు, అసమాన చక్రవర్తియు, అపజయ మెరుగని నిష్కళంక జీవియు నయిన శ్రీకృష్ణరాయల యశస్సువలననే విజయనగర నామథేయము శాశ్వతమయినదనుట నిక్కు వము. విదేశీయులు ఇతనినిగూర్చి ఎంతో సహజముగ వర్ణించి యున్నారు. ప్రజారంజకుడయిన శ్రీకృష్ణదేవరాయలు చక్కని శరీరదార్ధ్యము గలిగియుండెను. అతడు నిరుపమాన ధైర్యస్థైర్యములు గలవాడు. సైనికులచే ప్రేమింపబడినవాడు,
కృష్ణరాయలు తురుష్కులకు చక్కని పాఠము నేర్పెను. ఏపేట జరుపు దండయాత్రలు చాలించి ముస్లిములు బీదరుకు పారిపోయిరి. రాయలు ఆనతితో ఆల్బె క్వెర్క్, భట్క్ ల్ యొద్ద కోటగట్టించెను. గుల్ బర్గా పై దండెత్తి రాయలు మహమ్మదు II బహమనీ ఖైదునుండి విడిపించి, యవన రాజ్య స్థాపనాచార్య అను బిరుదందెను. (క్రీ. శ. 1511). పెనుగొండను, ఉమ్మత్తూరును శివసముద్రమును గెల్చి, జయింపబడిన రాజ్యభాగములకు సాళువగోవిందరాయలను రాజప్రతినిధిగ నిల్పెను. కొండవీడు, విజయవాడ, కొండపల్లి దుర్గములను గెలిచెను.కళింగములో పొట్నూరు సింహాద్రి వరకు జయించి, అచట జయ స్తంభమును నిలిపెను. సైన్యములు కటకము వరకు వెళ్ళగా, తాను రాజమహేంద్రవరము నకు తిరిగివచ్చెను. ప్రతాపరుద్ర గజపతి రాయలతో సంధి నెరపి కూతు నిచ్చి పెండ్లిచేసెను. రాయలు తాను గెల్చిన కృష్ణకు పడమటి దేశమును కనికరముతో గజపతి కిచ్చి వేసెను. పోర్చుగీసుల సాయముతో రాయలు క్రీ. శ. 1520 లొ రాయచూరు నాక్రమించి తురుష్కుల నోడించెను. క్రీ. శ. 1523 లో బీజపూరుపై దండెత్తి గుల్బర్గాను ముట్టడించెను. ఈ విజయ పరంపరల అనంతరము శ్రీకృష్ణ దేవరాయలు క్రీ. శ.1528 లొ తన ఆరేండ్ల కుమారుని రాజు చేసెను. మంత్రి తిమ్మరుసు బాలుని చంపించెనని అనుమానించి, రాయలు మంత్రిని ఆతని కుటుంబమును కారాగారమున నుంచెను. క్రీ.శ. 1529 లో తమ్ముడు అచ్యుతదేవరాయలకు రాజ్యము నొసంగి, కృష్ణరాయలు వార్థక్యము రాకముందే దివి కేగెను. దక్షిణావని నంతయు నొక్కటిగ పాలించిన ఈ విజయశాలి యొక్క రాజనీతిజ్ఞత స్వరచితమైన ఆముక్త మాల్యదలో రూపొందినది. కృతికర్తయు, కృతిభర్తయు నయిన కృష్ణదేవరాయలు కళలకు పట్టుగొమ్మ; కల్పవృక్షము. ఆంధ్రభోజుడు. ఈ రాజాధిరాజు ప్రపంచ మందంతటను గౌరవింపబడియున్నాడు. సార్వభౌముని యశశ్చంద్రికలు శాశ్వతముగ విశ్వమంతట నల్లుకొనినవి.
అచ్యుతదేవరాయలు (క్రీ. శ. 1530-42) కృష్ణరాయలకు సవతి తమ్ముడు. ఇతడు కృష్ణరాయలు మరణించినపుడు చంద్రగిరిలో నుండెను. కృష్ణరాయల అల్లుడు రామరాయలు అచ్యుత రాయలకు పోటీగ, కృష్ణరాయల 1½ సం. ల మగశిశువును రాజుగ ప్రకటించి అచ్యుతరాయలు రాజధాని చేరులోపల చంద్రగిరిలో తిరుపతిలో పట్టాభిషేకము చేసికొనెను. కృష్ణరాయల మృతివార్త వినగనే ఇస్మెల్ ఆదిల్ షా రాయచూరు లోయను ఆక్రమించెను. అచ్యుతరాయలు రాజధానికి చేరినతోడనే రామరాయలతో సంధి చేసికొనెను. ఆ పసి బాలుడు మృతుడయ్యెను. అచ్యుత రాయలు గజపతి దండయాత్ర నరికట్టెను. దక్షిణదేశమున సామంతుల తిరుగుబాటులు నణచి, అచ్యుతరాయలు పాండ్యరాజు పుత్రికను పరిణయమాడెను. క్రీ. శ. 1534 లో తురకల నుండి రాయచూరు లోయను గెలిచెను. క్రీ. శ. 1535లో రామరాయలు అచ్యుతరాయలను ఖైదుచేసి, ఆ మహారాజు తమ్ముని కుమారుడగు సదాశివరాయలను రాజుగ నిల్పెను. రాజధానిలో ఇట్లు కృష్ణరాయల మరణానంతరము రామరాయలు రాజులను మార్చుటచేతను, సామం తులు ప్రబలు లగుట చేతను తిరుగుబాటులు జరిగెను. తిరుగుబాటుల నణచుటకై రామరాయలు దక్షిణమునకు వెళ్ళగనే అచ్యుతరాయలు స్వతంత్రించెను. రామరాయలు తిరిగి వచ్చుసరికి ఇబ్రహీము ఆదిల్ ఖాను రాజధానిని ' ముట్టడించియుండెను. ఈ సుల్తాను రామరాయలకు,అచ్యుతరాయలకు సంధి కుదిర్చెను. సంధి ననుసరించి అచ్యుతరాయలు రాజుగను, రామరాయలు రాజ్యరక్షకుడుగను ఉండుటకు అంగీకరింపబడెను. అచ్యుత రాయల మరణమువరకు ఈ షరతులు అమలులో నుండెను.
అచ్యుత రాయల తరువాత కొడుకు వేంకటరాయలు I (క్రీ. శ. 1542) రాజయ్యెను. రామరాయలు సదాశివరాయలను ఖైదునుండి విడిపించెను. బీజాపూరుసుల్తాను సాయ మాశించెను. తిరుమలరాయలు ప్రజలచే రాజుగ ప్రకటింపబడి బీజాపూరు ఆదిల్ షాను ఓడించి వేంకటరాయలు I, అతని వంశ్యులను చంపించెను. రామరాయలు తిరుమలరాయలను ఓడించి చంపి, క్రీ.శ.1543 లో సదాశివరాయలను రాజుగ ప్రకటించెను. సదాశివరాయలు (క్రీ. శ.1543-76) రాజ్యము చేయుచుండగా, రామరాయలు క్రీ. శ. 1550 ప్రాంతమున తానే రాజ బిరుదమును వహించెను. రామరాయలు రాజ్యాంగమున అతి ముఖ్యమైన కార్యములకు తురుషులను నియోగించెను. పంచ ముస్లిము రాజ్యముల అంతర్గత విషయములలో తాను సంబంధము కల్పించుకొనుచుండెను. రామరాయల అట్టి నడవడికయే కడకు విజయనగర సామ్రాజ్యమునకు మొప్పము తెచ్చెను. రక్షసి - తంగిడి (తళ్ళికోట) యుద్ధమునకు కీలకమయ్యెను. దక్షిణమున దేవాలయములను పాడుచేసి చర్చీలుగా మార్చి, ప్రజలను క్రైస్తవమతమునకు మార్చుచున్న పోర్చుగీసు వారి దుండగముల నాపుటకై రామరాయలు చినతిమ్మరాయలను, విఠల రాయలను పంపెను. క్రీ. శ. 1547 లో పోర్చుగీసు వారితో సంధిచేసికొనెను. క్రీ. శ. 1558 లో శాంథోమ్, గోవాలపై దండెత్తి కప్పము గొనెను. క్రీ.శ. 1560 లో అహమ్మదు నగరు సుల్తాను బీజపూరుపై దండెత్తగా రామరాయలు బీజపూరు సుల్తానుకు తోడ్పడి జయమును గాంచెను. అంతియ కాక బీదరునుకూడ గెలిచెను. మరల బీజపూరు సుల్తాను రామరాయలు కలిసి, అహమ్మద్ నగర్, గోల్కొండలతో పోరు సల్పిరి. క్రీ.శ. 1563లో జరిగిన సంధివలన గోల్కొండ సుల్తాను, పానుగల్లును కోవిల కొండను, వదలుకొనెను. కాని అతనికి రామరాయలపై కసి పెరిగేను,
సుల్తాను లొండొరులమధ్య రామరాయలు, ఎంత భేధ తంత్రమును ప్రయోగించినను, ఐదుగురు సుల్తానులు తమతమ వైషమ్యములను అడ్డుకొని, సంధులు చేసికొని. విజయనగరముపై యుద్దమున కాయత్తము కాదొడగిరి. క్రీ.శ. 1564 లో ఐక్య ముస్లిము సైన్యములు బీజపూరు నుండి యుద్ధమునకు బయలుదేరెను. రామరాయలు తనకు జయము నిశ్చయ మను అతి ధైర్యమున నుండెను. శత్రుసైన్యములు తల్లికోట యొద్ద విడిసెను. హైందవ సైన్యములు అచటికి 30 మైళ్ళదూరమున నున్న రక్షసి. తంగడి యను గ్రామముల సమీపమున జేరెను. వీరి బలము 5 లక్షలు, ముస్లిముల సైన్యము 24 లక్షలు, కపటోపాయమున తురుష్క సైన్యములు హైందవ సైన్యములపై బడెను. ఐనను రామరాయలు సైన్యములను నేర్పుగ నడిపించెను. రామరాయలు విజేతయగునట్లే తోచెను. కాని విధిప్రాబల్యముచే రామరాయల సైన్యములోని ఇరువురు ముస్లిము సేనానులు తమ 70,000, 80,000 సైన్యముతో విడిపోయి శత్రుపక్షమున జేరిరి. రామరాయలకు ఓటమి తప్పలేదు. అంతియ కాక రామరాయలు శత్రువుల చేజిక్కి చంపబడెను.
అపజయవా ర్త విజయనగరము చేరగనే రామరాయల తమ్ముడు తిరుమలరాయలు 1550 ఏనుగులమీద విలువగల వస్తువులను, ఖైదీ చక్రవర్తి సదాశివరాయలనురాణివాసమును తీసికొని పెనుగొండకు పలాయన మయ్యెను. తురకలు రాజధానియందు ప్రవేశించి విచ్చలవిడిగ చరించి, నాశనముచేసి కొల్ల గొట్టిరి. సకలసంపదలతో తులదూగుచున్న విజయనగర మహాపట్టణము అకస్మాత్తుగ నేలమట్టము గావింపబడెను.
IV. ఆరవీటి వంశము : ఆరవీటివంశమునకు నరపతి వంశమనియు "పేరు గలదు. ఆరేండ్ల అరాజకము పిమ్మట పెనుగొండలో నున్న తిరుమలరాయలు (క్రీ. శ. 1570-1571) రాజయ్యెను. మధుర, తంజావూరు. జింజీ ప్రభువులు స్వతంత్రులైరి. రామరాయల పుత్రుడు పెద తిరు మలరాయల కోరికపై బీజపూరు సుల్తాను పెనుగొండను ముట్టడించెను. తిరుమలరాయల ఆస్థిపై అహమదునగరు నిజాముషాహ బీజపూరుపై దండెత్తగా, బీజపూరు సుల్తాను వెనుదిరిగెను. (క్రీ.శ.1567). మువ్వురు సుల్తానులు కలిసి ఆదవానిని గెలిచిరి. తిరుమల రాయలు తన పుత్రులలో ఒకడగు శ్రీరంగరాయలను తెలుగుదేశముపై పెనుగొండలోను, రామరాయలను కన్నడదేశముపై శ్రీరంగపట్టణమందును, వేంకటపతి రాయలను తమిళదేశముపై చంద్రగిరి యందును రాజప్రతినిధులుగ నిలిపెను. తాను క్రీ. శ. 1570 లో పట్టాభిషేకము చేసికొనెను. రెండేండ్ల తదుపరి కుమారుడు శ్రీరంగరాయలు (కీ. శ. 1572-1585) రాజయ్యెను. క్రీ.శ. 1585 లో అతడు మరణింపగా, వేంకటరాయలు II (క్రీ. శ. 1586-1614) రాజపదవినందెను.
వేంకటరాయలు 28 సంవత్సరములు సమర్థతతో పరిపాలించెను. తురకల నదల్చి రాజ్యములోని తిరుగుబాటుల నణచి గోలకొండ నవాబుతో యుద్ధము చేసి జయించెను. ఉదయగిరిని గెలిచెను. ఇతని కాలమున డచ్చివారు, పోర్చుగీసువారు తూర్పు తీరమున ఫాక్టరీలను కట్టిరి. డచ్చివారి ఫ్యాక్టరీలు మచిలీపట్టణము (క్రీ.శ. 1605), నిజాముపట్టణము, చెన్న పట్టణము (క్రీ.శ. 1608) పులికాటు అను తావులలో నుండెను. ఇంగ్లీషువారి ఫ్యాక్టరీలు మచిలీ పట్టణము, నిజాం పట్టణము (క్రీ. శ 1612) పులికాటు (క్రీ. శ. 1621). మద్రాసు (క్రీ.శ.1640) అను తావులలోను ఏర్పడెను. క్రీ. శ. 1614 లో వేంకటరాయలు మృతిచెందగా, అతని అన్న కుమారుడు శ్రీరంగరాయలు II రాజయ్యెను.
శ్రీరంగరాయలు II అవివేకి. సామంతులు ఇరుపక్షములుగ సిద్దమయిరి. ఎదురు పక్షమువారు వేంకటరాయల కృత్రిమ సంతానమయిన కుమారుని బలపరచిరి. ఈ పక్ష నాయకుడు గొబ్బూరి జగ్గరాయలు; రాజపక్ష నాయకుడు యాచమ నాయడు. జగ్గరాయలు రాజును కారాగారమందుంచి వేంకటరాయల కృత్రిమ కుమారుని రాజుచేసెను. యాచమనాయడు జగ్గరాయని గెలిచి శ్రీరంగరాయల పుత్రుడయిన రామరాయలను (క్రీ.శ. 1618-1630) గద్దెపై నిలిపెను. తోపూరు (తిరుచునాపల్లి జిల్లా) యుద్ధములో (క్రీ.శ. 1616) జగ్గరాయలు ఓడిపోయెను, రామరాయలు గెలిచెను.
రామరాయల రాజ్యకాలమంతయు (క్రీ.శ.1618-1630) యుద్ధములతో గడచెను. క్రీ.శ. 1630 లో ఈ రాజు మరణించెను. తరువాత వెంకటరాయలు III (క్రీ. శ. 1630 - 1642) రాజపదవినం దెను. రామరాయల పినతండ్రి తిమ్మరాయలు వెంకటరాయలను బాధించెను. తిమ్మరాయలు క్రీ. శ. 1635 లో హత్యగావింపబడెను. వేంకటరాయల పక్షము వాడయ్యు శ్రీరంగరాయలు III ఏలొకోబీజపూరుసుల్తాను క్రీ.శ. 1638, 1641లలో దండెత్తి వచ్చునట్లు చేసెను. మొదటితూరి తురకల నోడించుటకు దక్షిణ దేళపు సామంత ప్రభువులు తోడ్పడిరి. రెండవసారి రండోలాఖాను దండయాత్ర చేసి నెల్లూరును సమీపించెను. గోలకొండనవాబు తూర్పుతీరముపై దండెత్తెను. వేంకటరాయలు III నారాయణవనం (చిత్తూరుజిల్లా) అడవులకు పారిపోయి క్రీ. శ. 1642 లో దివంగతు డయ్యెను.
వేంకటరాయల తమ్ముని కుమారుడు శ్రీరంగరాయలు III (క్రీ. శ. 1642-49-75) రాజ్యభారము వహించెను. ఇతడు తాను పన్నిన కుట్రలకు తానే గురి యయ్యెను. బీజపూరు, గోలకొండ సుల్తానులు పరస్పరము సంధిచేసికొనిరి. దక్షిణమున సామంతుల తిరుగుబాటు, వారి ప్రోద్బలముపై బీజపూరు, గోలకొండ నవాబుల దండయాత్రలు, ఒక్క పెట్టున విజృంభించెను. మొగలు చక్రవర్తి కర్ణాటక రాజ్యమును గెలిచి పంచుకొనుటకు గోలకొండ, బీజపూరుల కానతిచ్చెను. క్రీ. శ. 1645 లో దక్షిణమునందలి సామంతులకోడి శ్రీరంగరాయలు వేలూరు చేరెను. అచట మరు సంవత్సరము యుద్ధములో బీజపూరు సేనలచే నోడింపబడెను. శ్రీరంగరాయలు తంజావూరు, తరువాత మైసూరు చేరుకొనెను. క్రీ. శ. 1652 లో బీజపూరును కర్ణాటకమును అతడు గెలిచెను. అతడు మైసూరులో కొలువు దీర్చుచు వేలూరును జయింప కలలు గాంచుచుండెను. కట్టకడపట క్రీ.శ. 1675 లో. శ్రీరంగరాయలు III స్వర్గస్థుడయ్యెను.
మూడు శతాబ్దములు హైందవ సంస్కృతిని సంరక్షించిన విద్యా (విజయ) నగర సామ్రాజ్యము ఈ విధముగా అంతరించెను. వెలమ రాజ్యము : ప్రస్తుతపు వేంకటగిరి రాజుల పూర్వు లయిన వెలమరాజులు రేచర్ల వంశ్యులు. ఆ వంశమునకు మూలపురుషుడు చెవ్వి రెడ్డి. నిక్షేపమొకటి దొరకుటవలన ఇతడు ధనికుడయ్యెనని వాడుక కలదు. వెలమరాజులు కాకతీయ సామంతులుగ నుండి, తదనంతరము కాపయనాయకుని కాలములో నల్లగొండ ప్రాంతములో స్వతంత్రులైరి. అశ్వపతి, నరపతి, గజపతుల తాకిడికి నిల్వలేక వారు కర్ణాటకమునకు వచ్చి రాయల సామంతులైరి.
వెలమ రాజులలో ఐదవతరమునకు చెందినవారు సింగమనాయడు I, వెన్నమనాయడు, ఏచమనాయడు అను మువ్వురు. 14వ శతాబ్ది రెండవపాదములో ఏచమనాయడు కొలచెలమ యుద్ధములో తురకల నోడించెనట సింగమనాయడు తక్కిన ఇర్వురితో కలిసి రాచకొండ రాజ్య మేర్పర్చుకొనెను. సింగమనాయడు కాపయనాయకుని నోడించెనట ! తర్వాత జల్లిపల్లి దుర్గము ముట్టడించి క్రీ. శ, 1360 లో శత్రువుల చేతులలో మృతుడయ్యెను. అనపోతనాయడు, I, మాదానాయడు I (క్రీ.శ. 1360-84)—వీరు ఆరవతరమువారు; వీరు సింగమనాయని పుత్రులు. వీరు -మొగులూరు, ఇనుకుర్తి, జల్లిపల్లి, యుద్ధములలో (క్రీ. శ. 1361) తమ తండ్రిని చంపిన క్షత్రియరాజులను వధించి వారి రక్తముతో తండ్రికి తర్పణములు విడిచిరట ! కాపయనాయకుడు వీరి నణచుటకు ప్రయత్నించి 1369 ప్రాంతమున భీమవరమునొద్ద వెలమరాజులచే జయింపబడెను. తర్వాత అనపోత నాయడు,ఓరుగల్లు, భువనగిరులతో సహ కాపయ రాజ్యమును తన రాజ్యముతో కలుపుకొని ఆంధ్ర సురత్రాణ, అనుమన గంటి పురవరాధీశ్వర అను కాపయ బిరుదములను ధరించి స్వతంత్రుడయ్యెను. అతడు కొండవీటి రాజ్యములోని ధరణికోటపై దండెత్తి ఓడిపోయెను. ఈ అదను చూచుకొని మహమ్మదుషా I బహమని తెలంగాణముపై దండెత్తెను. కాని అనపోతనాయనిచే తరుమబడెను. మరి యొకమారు ముస్లిము సైన్యములు దండెత్తి రాగా అనపోతనాయడు గోలకొండనిచ్చి సంధిచేసికొనెను.
అనపోతనాయడు, మాదానాయడు తాము దిట్టపరచిన రాజ్యమును రెండు భాగములుగ విభజించి రాచకొండ రాజధానిగ ఉత్తరభాగమును అనపోతనాయడును, దేవరకొండ రాజధానిగ దక్షిణభాగమును మాదానాయడును పంచుకొనిరి. ఇతర రాజ్యసంబంధ విషయములలో రెండు రాజ్యములు ఐకమత్యము కలిగియుండెను.
ఏడవతరము వారు సింగమనాయడు II, వేదగిరి నాయడు I తెలుగు చోడ అన్నమదేవుని పక్షమున వీరు అనవేమా రెడ్డితో పోరు సల్పిరి. కాని వీరు జయించిరని చెప్పజాలము. క్రీ. శ. 1386 లో కాటయ వేమారెడ్డి వెలమ రాజ్యములోని రామగిరిని గెల్చెను. అంత సింగమనాయడు. రెడ్డిరాజ్యముపై దండెత్తెను (1387).1390 లో వెలమలకు కుమారగిరి రెడ్డికి సంధి పొసగెను, ఇదే సమయమున గజపతి వెలమరాజ్యముపై దండెత్తి ఓడి, కూతును సింగమనాయని కిచ్చి పెండ్లి చేసెనట. కుమారగిరి మరణానంతరము అన్న దేవచోడుడు దేవరకొండ కేగి వేదగిరినాయని సాయముతో రాజమహేంద్ర వరమునకు బయలు దేరెను. త్రోవలో వేములకొండకడ ఐదుగురు రాజులను ఓడించెను. రెడ్లనుండి బెండపూడి గెల్చెను. అన్నదేవుని సింహాసనముపై నిల్పి, తన మంత్రి మాదానేనిని అతనికి రక్షకునిగా రాజమహేంద్రవరములో నిల్పెను.
వెలమరాజులకును బహమనీ సుల్తానులకునుగల సుహృద్భావము చెడగొట్టుటకై విజయనగర హరిహర రాయలు II 1384 లో తెలంగాణము పై దండెత్తి ఓరుగల్లును సమీపించెను. అతనిని కొత్తకొండకడ ముస్లిము సైన్యములు అడ్డగించెను. విజయనగర సైన్యములు తిరుగుబాట పట్టెను. మరల 1397 లో హరిహరరాయలు II సైన్యములను పంపెను. యువరాజు బుక్క రాయలు సుల్తానును, ఆంధ్రరాజులను ఓడించెను.
వెలమ వంశమునందు ఎనిమిదవ తరమువారు- అనపోత నాయడు II, రామచంద్ర, మాదానాయడు II. రెడ్లకును తెలుగుచోడులకును జరిగిన యుద్ధములలో అన్న దేవుని పక్షమున ముస్లిము సైన్యములతోపాటు వెలమనాయకులు పోరి విజయములను గొనిరి. గుండుగొలను యుద్ధములో గజరావు తిప్ప కాటయవేముని చంపెను. కాటయ వేమునికిగల 'తలగొండుగండ' అను బిరుదము వహించెను. విజయనగర సైన్యములు ఓడిపోయెను. కాని, సుల్తాను, అన్న దేవచోడుడు, నదిని దాటి రాజమహేంద్రవరము చేరలేక పోయిరి. రెడ్ల సేనాధిపతి దొడ్డయ అల్లాడ రెడ్డి విజయనగర సాయముతో శత్రుసైన్యములను చెండాడెను (1417). రెడ్లకు సాయము నరికట్టుటకై సుల్తాను పానుగల్లును, నల్లగొండను, పట్టుకొనేను, రెడ్ల హస్తములలో అన్న దేవుడు హతుడయ్యెను. బహమనీ సుల్తాను వెలమలు కలిసి విజయనగర సైన్యములను బాధించిరి. కాని తూర్పుతీర నాయకత్వ మాశించి బహమనీ సుల్తాను. కొండవీటి పెదకోమటి వేమారెడ్డితో స్నేహము చేసికొనెను. ఇది సహింపక వెలమలు ధరణికోటపై దండెత్తి గెల్చిరి. పెదకోమటి వేముడు వెలమలపై దండెత్తి రామచంద్రనాయని, మాదానాయని, వేదగిరినాయని చంపెను.
అనపోతనాయడు II, దేవరాయలు I తో మైత్రి చేసికొనెను, అంత దేవరాయలు పానుగల్లు, నల్లగొండలపై దండెత్తి తురకల నోడించెను. అనపోతనాయడు తెలంగాణములోని బహమనీ రాజ్యపు స్థలములను పట్టు కొనెను. తరువాత కొండవీటి రాజ్యముపై దండెత్తి, గెలిచి పెదకోమటి వేముని యొక్క 'నందికంత పోతరాజు' అను కత్తిని తీసికొని పోయెను.
తొమ్మిదవ తరమువారు లింగమనేడు, సర్వజ్ఞ సింగమనాయడు అనువారు. లింగమనేని విజయములు వెలుగోటివారి వంశావళిలో మిక్కుటముగ వర్ణింపబడినవి. ఇతడు రాజమండ్రి రెడ్డి రాజులగు వేమ, వీరభద్రా రెడ్లను, సింహాద్రి, సప్తమాడెము అనుతావులను గెల్చెను. తురకల గెల్చి 33 దుర్గములను పట్టుకొనెను. విజయనగర సామంతులను గెల్చి, దేవరాయలచే కానుకల నందెను. కొండవీటి మన్నీలను చెదరగొట్టెను. లింగమనేని రాజమహేంద్రవర దండయాత్ర 1427 ప్రాంతమున జరిగెను. కళింగములో ఆవంచ గెల్చెను. రెడ్డిరాజులకు దేవరాయలు II సాయపడుటవలన లింగమనేడు వెనుదిరిగెను. ఇతడు విజయనగర రాజ్యములో కొండవీడు, నాగార్జునకొండ, కర్నూలు, కంచివరకు వెళ్ళెను (1437).
బహమని అహమద్ షా 1433 లో తెలంగాణముపై దండెత్తెను. సింగమనేడు III తలయొగ్గెను. 1435 లో సుల్తాను తెలంగాణమును తన కొడుకులకు వ్రాసి యిచ్చెను. అప్పటినుండి వెలమరాజులు బమహనీ షాలకు సామంతులై తిరుగుబాటుల నణచిరి. 1457 లో రాజ్యమునకు వచ్చిన హుమాయూను హిందువులకు శత్రువులగుటచే వెలమలు తిరుగబడిరి. తురకలు దేవరకొండను ముట్టడించిరి. లింగమనేని కోరికపై కపిలేశ్వర గజపతి హం వీరుని సైన్యములతో బంపెను. శత్రువులు ఓడింపబడిరి. రాచకొండ వెలమల వశమయ్యెను. 1460 లో హం వీరుడు ఓరుగల్లును, తురకల నుండి ఉత్తర జిల్లాలను గెలిచెను. లింగమనేడు తిరిగి వెలమరాజ్యము నంతయు గెల్చెను. కాని గజపతులకు కప్పము కట్టవలసియుండెను. దేవరకొండ చరిత్రము లింగమనేనితో ముగిసెను.
సర్వజ్ఞ సింగమనేడు III 1425 లో రాజయ్యెను. ఇతడు 1433 లో అహమద్ షాకు లొంగిపోయెను. మ్కాని తురక రాజ ప్రతినిధి అతనిని రాచకొండనుండి తరుమగా బెల్లంకొండకు పారిపోయెను. 1455 వరకు అచట నుండెను. చివరకు సింగమనేడు III గజపతి సామంతులతో జరిగిన యుద్ధములో చనిపోయెను. ఈ రాజు కవిసార్వభౌముడగు శ్రీనాథుని గౌరవించెను.
లింగమనేడు సింగమనాయని తరువాత వెలమలు కర్ణాటకమునకుపోయి రాయల సామంతులుగ నుండిరి. 15 వ తరమువాడగు రాయపనాయడు సింగమనాయన II తమ్ముని వంశ్యుడు. మధ్య 5 తరములవారు ప్రసిద్ధులుగ తెలియరారు. రాయపనేని రాజధాని వెలుగోడు, మహానంది ప్రాంతములందు యుద్ధము చేయుచు ఇతడు మరణించెను. ఇతడు గజపతుల సామంతుడు కానోపును.
17 వ తరమువాడు రాయపనేని మనుమడు గని తిమ్మానాయడు. ఇతని రాజధాని గని (కర్నూలు మండలము). ఇతడు కృష్ణరాయలకు, అచ్యుత రాయలకు సామంతుడు. శ్రీశైలమందలి భిక్షావృత్తియొక్క మఠముపై దండెత్తి గెల్చెను. విజయనగర శత్రువులైన తురకల నెందరినో గెలిచెను. తిమ్మానాయడు మల్లాపుర సమీపమున ఆంధ్ర మన్నె రాజుల నోడించేను. 1530 లో గోలకొండ నవాబు కొండవీటిని పట్టుకొనగా విజయనగరము తరఫున తిమ్మానేడు పోరాడి ఓడించెను. 1544 లో హావడి ఔబల రాజుతో పోరుచు మృతినొందెను.
18 వ తరమువారు తిమ్మానాయని కొడుకులు పెద తిమ్మానాయడు, నాయన నేడు, ఎరతిమ్మా నేడు అనువారు. ఎరతిమ్మానేడు రామరాయల యుద్ధములలో పాల్గొనెను. 1563 లో విజయనగరమునకు గోలకొండకు జరిగిన యుద్ధములలో ఇతడు పోరెను. అనేక దుర్గములను గెల్చి రామరాయలచే బహుమతులను బడసెను.
19 వ తరమువారు కస్తూరి రంగమనాయడు, చెన్నా నాయడు. వీరు శ్రీరంగరాయలు I, వేంకటరాయలు II సేనలో నుండిరి. విజయనగరమునకును మహమ్మదీయులకును జరిగిన యుద్ధములలో పేరుగాంచుచు. వీరు 1579 లో మట్ల తిమ్మానేనిని కోడూరు యుద్ధములో చంపిరి. గోల్కొండ, విజయనగరము పై దండెత్తి, గెలుపు అసాధ్యమగుటచే వెనుదిరిగెను. మొరసు దేశములో కోవూరు అధిపతియగు తిమ్మప్ప గౌడ కప్పము కట్టకపోవుటవలన వేంకట రాయలు II కస్తూరి రంగమ నాయని పంపగా అతడు ఇతరులతో కలిసి తిమ్మప్పను గెలిచెను. అతడు కొండవీటి తురుష్క ప్రతినిధియగు అఫ్జల్ ఖానును ఓడించెను. గోల్కొండ యుద్ధములలో వెలుగోటి చెన్నా నాయడు విజయనగర రాధీశులకు జయమును సంపాదించెను. చెన్నానాయడు, యాచమ నాయడు నంజర్ భానును తరిమి గండికోటనుపట్టుకొనిరి. 20 వ తరమువారు వేంకటపతి నాయడు, యాచమ నాయడు. వీరిలో యాచమనాయడు, శ్రీరంగరాయలు II తరఫున వేలూరిలో 1616 లో శ్రీరంగరాయల పుత్రుడు రామదేవరాయల పట్టాభిషేకమును నడిపించెను.
21, 24 తరముల వారైన కుమార యాచమనాయడు, సింగమనాయడు, శ్రీరంగరాయలు III సామంతులు, వీరు అతని యుద్ధములలో పాల్గొనిరి. 1643 లో గోల్కొండ నవాబు దండెత్తినపుడు వేముగల్లు సమీపమున జరిగిన యుద్ధములలో సింగమనాయడు తురకలను చెండాడెను. 1659 లో పెనుగొండను పట్టుకొనుటకైశ్రీరంగరాయలు ప్రయత్నము చేసినపుడు కుమార యాచమనాయడు గోల్కొండ సేనలో నుండెను. అతడు పెనుగొండకు పోయి శత్రుసంహారము చేసెను.
రెడ్డిరాజ్యము (క్రీ. శ. 1320-1450): శైలపుర నామాంతరముగల కొండవీడు, నగరమని ప్రసిద్ధిగాంచిన రాజమహేంద్రవరము ముఖ్య రాజధానులుగ రెడ్డి రాజులు ఒక్కశతాబ్దము పైగా దాదాపు ఆంధ్రదేశము నంతయు స్వతంత్రముగా పరిపాలించిరి. క్షత్రియులతో సంబంధ బాంధవ్యములు కలిగియున్నప్పటికిని రెడ్డిరాజులు చతుర్థ కులజులు. వీరి మూలపురుషుడు దొంతి అల్లాడ రెడ్డి స్పర్శ వేధిని సంపాదించి ధనికుడయ్యెనను నొక కథ కలదు. ఈ వంశకర్త వేమారెడ్డి. అతని కొడుకు కోమటి ప్రోలా రెడ్డి ; మనుమడు ప్రోలయ వేమారెడ్డి.
ప్రోలయ వేమా రెడ్డి (1320- 56) రెడ్డిరాజ్య స్థాపకుడు. ఇతడు 1820 ప్రాంతమున ధరణికోటలో ప్రతాపరుద్రుని అధికారము ధిక్కరించి స్వాతంత్య్రమును ప్రకటించెను. తమ్ములసాయముతో రాజ్యమును విస్తరింప జేసెను. రాజధానిని అద్దంకికి మార్చెను. శత్రువులనుండి మోటుపల్లిని గెల్చెను. 1335 నాటికి తూర్పుతీరమంతయు జయించి కళింగమున విజయములను గాంచెను. 1345 ప్రాంతమున తురుష్కులనుండి బ్రాహ్మణాగ్రహారములను గెలిచి బ్రాహ్మణుల కిచ్చెను. 1352 లో కొంత రాజ్యము విజయనగరాధీశులకు ఓడిపోయెను.
కళింగ విజయములనాటికే, వేమారెడ్డి, కోరుకొండ రెడ్లను, పిఠాపుర కొప్పుల నాయకులను జయించియుండును. 1345 నాటికి కాపయ నాయకుని గెలిచెను. 'కళింగరాయమాన మర్దన' అను బిరుదు నరసింహ చక్రవర్తి (1328 - 54 ) పై విజయము సూచించును. ఇతని ప్రశస్తికి తార్కాణములుగ పాండ్యరాజ గజ కేసరి, రాచూరి దుర్గ విభాల, చెంజిమల చూరకార మున్నగు బిరుదులు కలవు. ఇతని ఆస్థానమున రామాప్రెగడ మహా మంత్రిగను, ప్రబంధ పరమేశ్వరుడగు ఎఱ్ఱాప్రెగడ ఆస్థాన కవిగను, కొండవీటి రాచవారి సుగంధవస్తు భాండా గారాధ్యక్షుడుగ ప్రసిద్ధికెక్కిన తిప్పయసెట్టి తండ్రి అవచి దేవయసెట్టి ప్రాపుగను ఉండిరి.
అనపోతా రెడ్డి (1356-1371) తండ్రి తరువాత రాజ్యమునకు వచ్చెను. ఇతని కాలమున రాజ్యపు ఉత్తర భాగమున తెలుగు చోళులు తిరుగబడిరి. ఇతని మోటుపల్లి వర్తక శాసనములు దేశ సౌభాగ్య సూచక ములు• అనపోతా రెడ్డి రాజ ధానిని కొండవీటికి మార్చెను.
1358 లో అనపోతా రెడ్డికి, ముమ్మడి ప్రోలవరము రాజధానిగపొలించుచున్న ఏరువ తెల్గుచోళులతో ఘర్షణము వచ్చెను. మూరవరము యుద్ధములో అనపోత రెడ్డి ఓడెనని చోడ శాసనములు చెప్పుచున్నవి. 1366 లో అన్న దేవచోడుడు రాజుకాగా అనపోతారెడ్డి అతనిని తరిమి తమ్ముని భీమలింగని సింహాసనముపై నిల్పెను. 1368-70 సం. మధ్య రెండుమార్లు వెలమలు ధరణి కోటపై దండెత్తిరి; రెండవసారి రెడ్లు విజయము గాంచిరి.
అన వేమా రెడ్డి (1371-86) అనపోతా రెడ్డి తమ్ముడు. ఇతని రాజ్యకాలమున దేశము సుభిక్షముగ నుండెను. ఇతడు అన్న దేవచోడుని అడచి, భీమలింగానికి కూతునిచ్చి పెండ్లి చేసెను. 1375 నాటికి దక్షిణ కళింగమున సామంత రాజుల గెలిచెను. 1376 లో వెలమల పై దండెత్తి గెలిచెను. 1385-86 లో కొంత రాజ్యమును విజయనగర రాజులు కోడిపోయెను.
కుమారగిరి రెడ్డి (1386-1404) రాజ్యకాలమున రాజ్యము విస్తృతి నందెను. దేశమున శాంతి నెలకొనెను, ప్రజలు సుఖించిరి; 1395 లో కుమారగిరి విస్తృతమైన తూర్పు రాజ్యమును విడదీసి రాజమహేంద్రవరము రాజధానిగా కాటయవేమా రెడ్డి కిచ్చెను. 1386 లో కాటయవేముడు కళింగముపై దండెత్తి మాక్లేది, వజ్రకూటము, వీరఘట్టము, రామగిరి గెలిచెను. 1387 లో వెలమలకు, విజయనగర రాజులకు సంధి పొసగెను. 1390 ప్రాంతమున రెండవ కళింగ జైత్రయాత్రలో సింహాచల, వింధ్యపర్వతములమధ్య గల రాజులు జయింపబడిరి. గజపతి - వీరనరసింహ IV (18374- 1424) ఓడి కప్పము చెల్లించెను. బహుమతులు పంపెను. కుమారగిరి వసంతరాయ బిరుదాంకితుడయి బహమనీ సుల్తాను (ఫిరోజ్ షా 1397-1428) తో స్నేహముగ నుండెను. హరిహరరాయలు II తన కుమార్తె హరిహరాంబను కాటయవేముని కొడుకు కాటయ కిచ్చి పెండిలి చేసిరి.
పెదకోమటి వేమారెడ్డి (1404-1420): ఇతడు సర్వజ్ఞ చక్రవర్తి అను బిరుదు వహించెను. ఈ వీరనారాయణుడు దిగ్విజయము చేసినట్లు వర్ణనము వేమభూపాల విజయములో కలదు. ఇతడు రాజమహేంద్రవర రెడ్డి రాజ్యముతో శత్రుత్వము పూనెను. వెలమలతోను, విజయనగర రాజులతోను విరోధించి రాజ్య విస్తృతిని జేసేను. అన్న దేవచోడుడు ఉండిరాజులతో స్నేహము నెరపెను. రాజమహేంద్రవరపు రెడ్లపై దండెత్తి అపజయము గాంచెను. బహమని సుల్తానుతో మైత్రి చేసికొనెను. ఉత్తరమున కాశీవరకును, దక్షిణమున రామేశ్వరము వరకును పోయి దానధర్మములను జేసెను. ఇతనికి సర్వజ్ఞ చక్రవర్తి అను బిరుదు కలదు. ఈతని యాస్థానమున శ్రీనాధమహాకవి విద్యాధికారిగ నుండెను. వాణిజ్య వంశధరుడగు అవచి తిప్పయ (తిరుమల నాథ) సెట్టి సుగంధవస్తు భాండాగారమునకు అధ్యక్షుడుగా నుండెను.
రాచ వేమారెడ్డి (1420-1432) : కొండవీటి రాజులలో కడపటివాడు. 1428-29 ప్రాంతమున శ్రీనాథుని వెలమ లింగమనేని కడకంపి 'నందికంత పోతరాజు' అను రెడ్లక త్తిని తెప్పించెను. ఇతడు ప్రజారంజకుడు కానందున ఒక భటునిచే చంపబడెను. విజయనగర దేవరాయలు II కొండవీటి రాజ్యముమ ఆక్రమించెను. 1432 నాటివి విజయనగర శాసనములు కొండవీటిలో గలవు.
'రాజమహేంద్రవర రెడ్డి రాజ్యము (1395-1450) : కాటయవేమారెడ్డి (1395-1416) ఇతడు కుమారగిరి రెడ్డికి ప్రధానియు, సేనాపతియునై యుండెను. తన ప్రభువు మరణించిన తరువాత కొండవీటికి శత్రువయ్యెను. అన్న దేవచోడుడు, పెదకోమటి వేమారెడ్డి యొక్కయు, వెలమ రాజుల యొక్కయు సాయముతో కాటయ వేముని ఓడించి, 'పూర్వ సింహాసనాధీశ్వర అను బిరుదు వహించెను. కాటయవేముడు దేవరాయల సహాయముతో అన్న దేవుని ఓడించెను. అన్న దేవుడు తురుష్కుల సాయమును సంపాదించెను. గుండుగొలను యుద్ధములో కాటయవేముడు హతుడయ్యెను. విజయనగర సైన్యములు ఓడిపోయెను. 1407 లో కాటయ వేముడు కళింగముపై దండెత్తి గెలిచెను. తురుష్కులతోపాటు 'పద్మనాయక రాజులు కాటయవేముని శత్రువులు. హరిహరరాయలు, దేవరాయలు I ఇతని మిత్రులు, బంధువులు.
కుమారగిరిరెడ్డి (1416): కాటయ వేముని కొమరుడు. స్వల్పకాలము పాలించి మృతుడయ్యెను. అంతట అతని సోదరి అనితల్లి రాజమహేంద్రవర రెడ్డి రాజ్యమునకు రాణి అయ్యెను. అనితల్లి (1416-1450) : కాటయ వేముని కూతురు, ఈమె పక్షమున మామగారు అల్లాడ రెడ్డి (1416-25) రాజ్యమును రక్షించుచుండెను. తరువాత రాణితో నామె భర్త వీరభద్రా రెడ్డి (1425-50) రాజ్యము చేసెను. అల్లాడ రెడ్డి భార్య అన వేమా రెడ్డి దౌహిత్రి. అల్లాడ రెడ్డి రెండవపుత్రుడు వీరభద్రా రెడ్డి అనితల్లిని వివాహమాడెను. బహమనీ సుల్తానును, చోడులను వెలమలను ఓడించెను. 1417 నాటికి అన్న దేవుని, అతని కుమారుడు వీరభద్రుని హతమార్చెను. కళింగముపై దండెత్తి ఝాడె సప్తమాడెములు, బారుహ, దొంతి, జంతుర్నాడు, ఒడ్డాది, రంభ అనువాటిని గెల్చి 'గజపతిదళ విభాళ ' అను బిరుదును గాంచెను. 1420 లో బహమనీసుల్తాను- ఫిరోజిషాను ఓడించెను. మాల్వాసుల్తాను ఆల్పఖాన్ లేక హోషాంగ్ కళింగ దండయాత్రనుండి మరలివెళ్ళునపుడు అల్లాడరెడ్డిచే ఓడిన వాడయ్యెను. అల్లాడ రెడ్డికి దేవరాయలు మిత్రుడు. అల్లాడ రెడ్డి `పెదకోమటి వేముని యుద్ధములో నోడించెను.
అనితల్లి, వీరభద్రా రెడ్ల పాలనలో వీరభద్రుని అన్నగారు వేమా రెడ్డి రాజ్యము నడిపించుచుండెను. వేమారెడ్డి విజయములు గమనింపదగినవి. రెడ్డి సైన్యములు బంగాళములో పండువా వరకు వెళ్ళెను. రెడ్డి రాజ్యము ఈ కాలమున ఉచ్ఛదశయం దుండెను. ప్రజల సౌఖ్యసంపదలను శ్రీనాథుడు తన కావ్య రాజములలో వర్ణించియున్నాడు.
1426 ప్రాంతమున వేమ వీరభద్రా రెడ్లు కళింగ జైత్రయాత్రకై వెడలి జీడికోట, మాకవరము, సప్తమాడెములు, ఝాడె, కలువపల్లి, ఒడ్డాది, కటకము గెలిచిరి .వీరు శృంగవరపుకోట, తోతుగడ్డ జయించి సముద్రతీరమున జయస్తంభములను నిల్పిరి. చీకటికోట గెలిచి చిల్క సముద్రమును దాటి, కసింకోట, కప్పకొండ గెలిచిరి. భాను దేవుడు IV రెడ్లతో సంధిచేసికొని కప్పము కట్టుచుండెను. కపిలేశ్వర గజపతి 1437-44 ప్రాంతమున రెడ్లపై దండెత్తి ఓడింపబడెను. యుద్ధములో రెడ్లకు దేవరాయల సైన్యములు తొడ్పడెను. 1426-27 లో రెడ్లు వెలమ దండయాత్రను తిరుగ గొట్టిరి. రెడ్లు బహమనీ అహమదుషా (1422 - 35) మిత్రులు. వీరభద్రా రెడ్డి పండువా సుల్తాను స్నేహితులు. దేవరాయలు II, మల్లి కార్జున రాయలు (1444 - 47) గజపతుల నడ్డుటకు రెడ్లకు సాయపడుచుండిరి.
1450 లో కపిలేశ్వర గజపతి రెడ్డి రాజ్యమును గెలిచి, 1455 లో కొండవీటిని గెలిచి, 1465 నాటికి తూర్పు తీరము నంతటిని తన పాలనము క్రిందికి తెచ్చెను. రాజ ప్రతినిధులను నిల్పెను. ఇటుల ఆంధ్ర దేశమున రెడ్ల పాలన మంతరించెను.
డా. వి. య.
[[వర్గం:]]