సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మొదటి సంపుటము/ఆంధ్రదేశ చరిత్రము II
ఆంధ్రదేశ చరిత్రము II (క్రీ. శ. 624-1323) : తూర్పుచాళుక్యులు 624 - 1064 :- తూర్పు చాళుక్య రాజగు కుబ్జవిష్ణు విర్ధనుడు వేంగిలో క్రీ. శ. 624 లో రాజ్యపాలనము ప్రారంభించెను. ఈతని యొక్కయు ఈతని వంశపువారి యొక్కయు చరిత్రము వారివారి తామ్ర శిలా శాసనముల వల్లను, నాణెముల వల్లను, ఆ కాలపు వాఙ్మయము వల్లను, సమకాలపు రాజుల శాసనముల వల్లను తెలియుచున్నది,
క్షత్రియులును, చంద్రవంశీయులును అగు చాళుక్యులు ప్రథమమున అయోధ్యనుండి దక్షిణాపథమునకు వచ్చిరి. జయసింహుడు వంశకర్త. అతని మనుమడు మొదటి పులికేశి బిజాపూరు జిల్లాయందలి వాతాపి లేక బాదామి నగరము రాజధానిగా జేసికొనెను. అతని మొదటి కుమారుని (కీర్తివర్మ) శాసన మొకటి బాదామి గుహ యందలిది 500 శతాబ్దమును తెలుపును. బాదామి శిలాశాసనకర్త మొదటి పులికేశి 465 శతాబ్దపు (క్రీ. శ. 543) నాటి వాడు. కీర్తివర్మ కుమారుడు రెండవ పులి కేశి. ఈతని సతారా శాసనమున క్రీ. శ. 618 లో తన తమ్ముడు కుబ్జవిష్ణువు యువరాజని పేర్కొనబడెను, ఈతడే క్రీ. శ. 623 - 624 లో దుర్జయుల నోడించి, వేంగి మండలమును జయించి తన తమ్ముని కుబ్జవిష్ణుని యువ రాజుగా నియమించెను. కృష్ణానది దక్షిణ తీరమున నున్న పల్లవులను, పిష్ఠ పురమున విష్ణుకుండినులను జయించి దేశమును స్వాధీనపరచుకొనెను, ఉత్తరమున విశాఖపట్టణము జిల్లాను స్వాధీనపరచుకొనెను. దక్షిణమున గుంటూరు, నెల్లూరు జిల్లాలను జయించెను. ఈ తీరస్థ ఆంధ్రదేశమునకు ఏలూరుకడ నున్న పెదవేగిని రాజధానిగా ఏర్పరచుకొని కుబ్జవిష్ణువర్ధనుడు క్రీ. శ. 624 నుండి 641 వరకు రాజ్యమేలెను. ఈతని తిమ్మాపురము, చీపురుపల్లి, చేజెర్ల, శాసనములు ఈతని దానములనేగాక ఈతని రాజ్యవి స్తీర్ణమునుగూడ తెలుపును. ఈతని రాజ్యమునకు ఉత్తరమున కళింగగాంగులు, దక్షిణమువ కాంచీపుర పల్లవులు, పశ్చిమమున చాళుక్యులు; రాష్ట్రకూటులు పరిపాలించుచుండిరి. కుబ్జవిష్ణువు. అతనిభార్య అయ్యన దేవి ముషి.నికొండ గ్రామమును బెజవాడ యందలి జైన మఠమునకు, జైన గురువులకు దాన మొసంగిరి. ఈ దానమును వీరి మనుమని మనుమడు మూడవ విష్ణువు స్థిరపరచెను. ఈతని కాలమున చైనా దేశమునుండివచ్చిన బౌద్ధయాత్రికుడు యు అన్ ష్వంగు తెలుగుదేశమునకువచ్చి వేంగి, ధరణికోట, అమరావతి, శ్రీశైలములను దర్శించి అప్పటి రాజకీయ, మతవిషయములను గురించి వ్రాసెను.
కుబ్జవిష్ణువర్ధనుని తరువాత ఇతని కుమారుడు జయసింహ వల్లభ మహారాజు రాజ్యమునకువచ్చి క్రీ.శ.641 మొదలు క్రీ. శ. 673 వరకు రాజ్య మేలెను. ఈతని తండ్రికి 'విషమసిద్ధి' యను బిరుదముండినట్లే ఇతనికి 'సర్వసిద్ధి' యను బిరుదముండెను. వేంగి, దక్షిణ కళింగ, మధ్య ఆంధ్రదేశములను జయించి గిరి, వన, జల, స్థల దుర్గములను పెక్కింటిని స్వాధీనపరచుకొని పల్లవ, దుర్జయ, విష్ణుకుండిన రాజుల నోడించి తరిమి వేసి, దేవ బ్రాహ్మణ మాన్యముల నెక్కువగా దానముచేసి, కన్నడ, తెలుగు, సంస్కృత భాషలను, జైన, బాహ్మణ గురువులను పోషించుచు తీరస్థ ఆంధ్ర దేశమున సుస్థిర పరిపాలనము చేయసాగెను. ఈతని శాసనమును, ఇంతకు పూర్వపు రాజవంశమగు విష్ణుకుండిన మాధవవర్మయొక్క శాసనమును పొలమూరు గ్రామమున దొరికినవి. విష్ణు కుండిన మహారాజు చేసిన దానమును తిరిగి ఇతడు అసనపుర వాస్తవ్యుడును, పూర్వాగ్రహారీకుడును అగు శివశర్మ కొడుకు రుద్రశర్మకు స్థిరపరచెను.
ఈ తూర్పు చాళుక్యరాజులు తామ్రశాసనములనుబట్టి వీరి వంశక్రమ, రాజ్యకాలములు తెలియుచున్నవి. కుబ్జ విష్ణువు 18 సంవత్సరములు, ఆతని కొడుకు జయ సింహుడు 33 సంవత్సరములు, అతని తమ్ముడు ఇంద్ర భట్టారకుడు 7 రోజులు, అతని కొడుకు విష్ణువర్ధనుడు 9 సంవత్సరములు, ఆతని కొడుకు మంగిరాజు 25 సంవత్సరములు, అతని కొడుకు జయసింహ 13 సంవత్సరములు, అతని సవతి తమ్ముడు కొక్కిలి ½ సంవత్సరము, అతని అన్న విష్ణురాజు 35 సంవత్సరములు, అతని కొడుకు విజయాదిత్యుడు 18 సంవత్సరములు, అతని కొడుకు విష్ణువర్ధనుడు 35 సంవత్సరములు రాజ్యమేలిరి. వీరి కాలమున అనేక భూములు, గ్రామములు బ్రాహ్మణులకు, దేవాలయములకు దానమివ్వబడెను.తరుచు పశ్చిమ చాళుక్యుల నోడించి వారి రాజ్య మాక్రమించిన (క్రీ. శ. 753 లో) రాష్ట్రకూటులు వీరి నోడించుచు వీరివల్ల కప్పములను గైకొనుచుండెడివారు.
విష్ణువర్ధనుని కొడుకగు నరేంద్ర మృగరాజ బిరుదాంకితు డగు రెండవ విజయాదిత్యుడు (క్రీ.శ. 807-846) క్రీ. శ. 834 నుండి 846 వరకు, అనగా అతని ఆఖరి 12 సం. లు రాష్ట్రకూటులతో 108 యుద్ధములు సలిపి, వారిని వారి సామంతులగు పశ్చిమ గాంగులను ఓడించి 108 శివాలయములను కట్టించెను.అనేక భూదానములను, అగ్రహారములను, వేదాధ్యయన సంపన్నులగు బ్రాహ్మణులకు, దేవాలయములకు, యుద్ధమున మడసిన వారి ఆత్మశాంతికిని, తాను చంపిన పాప పరిహారమునకును దాన మొసగెను, ఈతని తరువాత ఈతని కొడుకు 5 వ విష్ణువర్ధనుడు 1½ సంవత్సరములును, తరువాత ఆతని కొడుకు మూడవ విజయాదిత్యుడు 44 సంవత్సరములును రాజ్యము చేసిరి. (క్రీ.శ. 848-892) మూడవ విజయాదిత్యునే గణక విజయాదిత్యుడందురు. మూడవ విజయాదిత్యుని సేనాధిపతియగు పాండురంగడు ఈతని దానములకు కార్యకర్త గనుండెను. పాండురంగడు తన అద్దంకి దానశాసనమున 80 పుట్ల ధాన్యము చల్లుటకు వీలైన భూమిని ధర్మవరం ఆదిత్య (సూర్య) భట్టారక దేవునికి దానమిచ్చెను. ఈతడు బోయలకొండ కోటను స్వాధీనము చేసికొని వారి కొట్టములను (12 కొట్టముల భూమిని) జయించెను. ఈ గణక విజయాదిత్యుడు పూర్వ చాళుక్య రాజులలో కెల్ల సుప్రసిద్ధుడు. బహు పరాక్రమ శాలి. పరిపాలనలో కడు సమర్ధత గలవాడు. తన సేనాపతి పాండురంగని సహాయమున ఇతడు పెక్కు చిన్న చిన్న రాజ్యములను జయించెను. నెల్లూరును తగుల బెట్టెను. కందుకూరు కట్టెములను స్వాధీనము చేసి కొనుచు నోలంబ రాజగు మంగిని చంపెను. పశ్చిమగాంగులను ఓడించి తరిమెను. కన్నడ రాజును ఓడించి అతని స్నేహితుడు, దహలరాజగు సంకిలుని మానభంగ మొనర్చెను. వారి యొక్క కిరణ, అచల పురములను తగులబెట్టెను. పశ్చిమమున రాష్ట్రకూటులను, ఉత్తరమున కళింగ గాంగరాజులను ఓడించి కప్పముగై కొనెను. దక్షిణ కోసలముపై దండెత్తి చక్ర కొట్టమును కాల్చివేసెను. ఏనుగ గుంపులను గ్రహించెను. దక్షిణమున
పల్లవులను, పాండ్యులను ఓడించి వారినుండి బంగారము గైకొనెను. పంచమహాశబ్ద బిరుదమును వహించెను. కాని రాష్ట్రకూటుడగు అమోఘవర్షుని కాలమున ఆతనిచే ఓడింపబడి కప్పము గట్టెను. కాని అతడు చనిపోయిన తరువాత (888) అతని కొడుకు కృష్ణుని ఓడించి గణక విజయాదిత్యుడు సర్వదక్షిణాపథ రాజ్యమును త్రికళింగ సహితముగా జయించి పరిపాలించెను. పాండురంగ సేనాధిపతి కళింగ గాంగులను ఓడించిన తరువాత వేములవాడ, బస్తరు రాజ్యములను గ్రహించి, బద్దెగరాజుని సామంతునిగా జేసికొని, దహల, కిరణ, నిరాత, అచల, దళెపురములను పట్టుకొని తగులబెట్టి రాష్ట్రకూట రాజగు కృష్ణుని, అతని సహాయులను, సామంతులుగా జేసెను. ఈ రాజు కాలమున అనేక అగ్రహారములు బ్రాహ్మణులకు, దేవాలయములకు, మంత్రులకు, సేనాధిపతులకు ఇవ్వబడెను. చాళుక్య రాజ్యము ఉన్నత స్థితికి పెరిగెను.
ఈతని అద్దంకి శాసనమున ఈ క్రింది తరువోజ వృత్తము (శాసనములలో దొరికిన మొదటి తెలుగు పద్యము) కలదు. జయసింహుని (641-673) విప్పర్తి శాసనముగూడ ప్రాచీన తెలుగుభాష యం దున్నది. గద్యమయము. తూర్పుచాళుక్య రాజులందరు తెనుగుననే దానశాసనములను వ్రాయించిరి.
"స్వస్తిశ్రీమత్ సకల లోకాశ్రయ జయసింఘ |
వల్లభమహారాజులకున్ ప్రవర్ధమాన విజయ రా !
జ్య సంవత్సరంబుల్ ఎణుంబోది అన్నేణ్ణి అమ్మన్ పూణ్ణ|
మనాణ్డుం మ్లానిండి రాజుల ముట్ళు- కలిముడి రాజుల్-
క్రీ. శ. 9వ శతాబ్దమునాటికి పద్యమయశాసనము లేర్పడినవి. ఈతని శాసనము వలనను, వేములవాడ చాళుక్యుల శాసనములవలనను పంపకవి యొక్క విక్రమార్జున విజయము వలనను ఈతని చరిత్ర తెలియుచున్నది.
గణక విజయాదిత్యుని తరువాత ఆతని తమ్ముని కొడుకు మొదటి చాళుక్య భీముడు 892 నుండి 921 వరకు రాజ్య మేలెను. ఈతని అత్తిలి తామ్ర శాసనమున ఈతడు శకసంవత్సరము 814 (క్రీ. శ. 892 ఏప్రిల్ 17) మేష చైత్ర బహుళ తదియ సోమవారమునాడు పట్టాభిషిక్తు డయినట్లు కలదు. తెలుగు దేశమున శకాబ్ద మును వాడుట ఇదియే మొదలు. తన పేరున రెండు ఈశ్వరాలయములు కట్టించెను. ఈతని శిలాశాసన మొకటి బెజవాడ ఇంద్రకీల పర్వతముమీద గోవింద మఠమునొద్ద కలదు. అది ఆతని 17వ రాజ్య సంవత్సము నాటిది. అందు ప్రాచీన తెలుగుపదములు కలవు. దానివలన పార్థివేశ్వరుని ప్రతిష్ఠ జరిపినట్లు తెలియును. ఈతని తరువాత ఈతని పెద్దకుమారుడు విజయాదిత్యుడు 6 మాసములు రాజ్యమేలెను. పిమ్మట అతని పెద్దకుమారుడు అమ్మరాజు రాజ్యమునకు వచ్చి 921 నుండి 927 వరకు పాలించెను. ఈతడు తనకు సహాయ మొనర్చిన సేనాధిపతులకు పెక్కు దానశాసనముల నిచ్చెను. ఎడేరు శాసనమున ఇతనికి గల 'రాజమహేంద్ర' బిరుదమును బట్టి ఇతడే గోదావరికి ఉత్తరపు టొడ్డుననున్న రాజమహేంద్రవరమున కా పేరు పెట్టెనని తెలియును. అమ్మరాజు తరువాత అతని కొడుకు విజయాదిత్యుడు చిన్న వాడగుటచే తాడప (తాళరాజు) రాజ్యమును గ్రహించెను. కాని ఆతని నోడించి చాళుక్య భీముని రెండవకుమారుడు విక్ర మాదిత్యుడు రాజ్యమును గ్రహించి, రమారమి ఒక సంవత్సరము రాజ్యమేలెను. తరువాత తాడపుని కొడుకు యుద్ధమల్లు రాజ్యమును పట్టుకొని 928 నుండి 934' వరకు పరిపాలించెను. ఈతని బెజవాడ శాసనమునుబట్టి కుమారస్వామికి గుడి కట్టించె ననియు, శాసనమున ప్రాచీన తెలుగుపద్యములుగల వనియు తెలియును. అమ్మరాజు సోదరుడు రెండవ భీముడు యుద్ధమల్లుని పారద్రోలి 934 నుండి 945 వరకు రాజ్యమేలెను. ఈతడు అనేక దానములు చేసెను. ద్రాక్షారామ భీమేశ్వరాలయములు ఈతనిచే ప్రతిష్ఠితములు, ఈతని తరువాత ఈతని రెండవ కుమారుడు రెండవ అమ్మరాజు 945 నుండి 970 వరకు పరిపాలించెను. ఈతని దానములు తెలుపు శాసనములు పెక్కులు గలవు. మలయంపూడి శాసనమున పాండురంగని మునిమనుమడు దుర్గరాజు కట్టించిన జైనాలయమునకు చేసిన ధర్మము కలదు, తాడికొండ శాసనము (958) దేవాలయమున కిచ్చిన 4గ్రామముల ధర్మమును తెలుపును, ఎలవీపర్రు శాసనము స్వర్ణభాండాగార అధ్యక్షునికి చేసిన గ్రామదానము తెలుపును. కలుచుంబర్రు శాసనము అత్తిలివాడు విషయమందలి గ్రామము జైనాలయము బాగు చేయించుటకు జైనగురువు అర్హ నందికిచ్చిన ధర్మము తెలుపును. వేములపాడు శాసనము దుర్గ రాజుకోరికపై వేద సంపన్నుని కిచ్చిన అగ్రహార దానము తెలుపును. పాములవాక శాసనము ఎలమంచి కళింగ విషయమున చేసిన భూదానమును తెలుపును. రెండవ అమ్మరాజు ఇట్లనేక దానధర్మములను చేసెను. అతనికి యుద్ధమల్లుని కొడుకు బాడపునితో యుద్ధము ప్రాప్తించగా ఓడిపోయి కళింగమున తలదాచుకొనెను. తరువాత తనసోదరుడు దానార్ణవునకు బాడపతాళపులకు 970-973 మధ్య అనేక యుద్ధములు జరిగెను. ఇదే సమయమున పశ్చిమమున రాష్ట్రకూటులు ఓడిపోవుట, తిరిగి పశ్చిమ చాళుక్యులు తమ రాజ్యమును సంపాదించి పరిపాలించుట జరిగెను. అయినను తూర్పు ఆంధ్రదేశము బాడప మహారాజు పాలనమున 999 వరకు ఉండెను. కాని దేశమున శాంతిలేకుండెను. ఈ సమయ మున చోళచక్రవర్తి రాజరాజు వేంగిపై దండెత్తెను.
క్రీ. శ. 973-1000 మధ్య అనగా 27 సంవత్సరములు తూర్పు తెలుగుదేశము అరాజకముగా నుండెను. బాడపునకు తరువాత తాళపునకును, అమ్మరాజు సంతతివారికినిజరిగిన అనేక యుద్ధములవలన దేశము అధోగతి పాలయ్యెను. చోళ దేశమున రాజరాజచోళుడు 985 లో సింహాసన మెక్కెను. క్రీ. 999 లో రాజరాజు వేంగిదేశముపై దండెత్తి జయించెను. ఈతడు దానార్ణవుని పెద్దకుమారుడగు శక్తివర్మకు రాజ్య మిచ్చి తన కూతురు కుండవాంబను శక్తివర్మ తమ్ముడు విమలాదిత్యునికిచ్చి వివాహ మొనర్చి చోళ-చాళుక్య సంబంధమును దిట్టపరచెను. శక్తివర్మ పభుపర్రు గ్రామమున శివాలయములకు భూములను ఒసంగెను. ఆతడు 12 సం.లు పరిపాలించిన తరువాత విమలాదిత్యుడు రాజ్యమునకు వచ్చెను. ఈతని రణస్థిపూడి దానశాసనమునుబట్టి క్రీ. శ. 1011 మే నెలలో తాను పట్టాభిషి క్తుడయినట్లును ఆ గ్రామమును తన మంత్రియగు వజ్రకు దానమిచ్చి నట్లును తెలియుచున్నది. క్రీ.శ. 1013 లో తంజావూరు జిల్లాలోని తిరువైయ్యారు గ్రామమున పంచనదేశ్వరస్వామికి వెండిచెంబులు సమర్పించెను. 1012 లో తంజావూరున తన మామగారిత పాటు తన బావమరది రాజేంద్రచోళుడు సింహాసన'మెక్కు సందర్భమున ఆ మహోత్సవము చూచుటకై వెళ్లెను. 1018 లో రాజేంద్రచోళుని కొడుకు రాజాధిరాజుకూడ తండ్రితోపాటు సింహాసన మెక్కగా అది చూచుటకు తిరిగి విమలాదిత్యుడు తంజావూరు వెళ్ళి 1022 లో అక్కడనే మరణించెను. కనుక 1022 శ్రావణ మాసములో అతని పెద్ద కొడుకు రాజరాజు,రాజమహేంద్రవర సింహాసనమెక్కెను. కాని 1019 లోనే రాజ్యమునకు వచ్చెను. ఈతని భార్య అమ్మంగదేవి, ఈతని మేనమామయగు రాజేంద్రచోళుని కూతురు. ఇట్లే వీరి కొడుకు రాజేంద్రచోళుడు (ఉభయ కులోత్తుంగ చోళదేవుడు) తన మేనమామయగు రాజేంద్రదేవుని కూతురగు మధురాంతకిని వివాహమాడెను. ఈ మేనరికపు వివాహమువల్ల చోళ చాళుక్య సంబంధములు మరింత గట్టిపడెను. ప్రాయశః విమలాదిత్యుని రెండవ కుమారుడు సప్తమ విజయాదిత్యుడు పశ్చిమ చాళుక్య చక్రవర్తి రెండవ జయసింహుని సహాయమున రాజమహేంద్రవర సింహాసనమును పట్టుకొనుటచేత (తన తండ్రి విమలాదిత్యుడు 1018 లో తంజావూరు వెళ్ళినపుడు) చోళ రాజేంద్రుడు అతనిని, అతనికి సహాయమొనర్చిన జయసింహుని, కళింగ రాజులను ఓడించి, 1022 సం. ఆగస్టు 16 న రాజరాజ నరేంద్రునికి పట్టాభిషేక మొనర్చెను. కాని తిరిగి 8 సంవత్సరములకు విజయాదిత్యుడు తన అన్నను పదభ్రష్టుని గావించెను. తాను 1031 జూనులో పట్టాభిషిక్తుడా యెను. అతనికి తిరిగి జయసింహుడు సహాయ మొనర్చెను. కనుక చోళరాజు రాజేంద్రుడు రాజరాజుకు సహాయమొనర్చెను. 1032 లో కలిదిండి వద్ద గొప్ప యుద్ధము జరిగెను. తుదకు చోళులు గెలిచిరి. రాజరాజ నరేంద్రునికి తుదకు 1035 లో సింహాసన మిప్పించిరి. ఇతడు పదిసంవత్సరములు శాంతియుతముగా పాలించెను. కాని 1044 లో రాజేంద్రచోళుని మరణానంతరము తిరిగి పశ్చిమ చాళుక్య చక్రవర్తి మొదటి సోమేశ్వరుడు వేంగీ రాజ్యమును, కళింగమును జయించెను. కాని చోళ రాజాధిరాజు ధరణికోట కొల్లిపాక యుద్ధములలో పశ్చిమ చాళుక్యులను ఓడించెను. కాని వేంగి రాజ్యమును వారి హ స్తములనుండి తీసికొనలేకపోయెను. అయినప్పటికీ రాజరాజ నరేంద్రుడు సోమేశ్వరునితో సంధిచేసికొని 'పరిపాలింపగలిగెను. సోమేశ్వరుని ప్రధానియగు నారాయణభట్టుకు నందంపూడి గ్రామమొసంగెను. ఈతడే నన్నయకు ఆంధ్రభారత రచనయందు సహాయమొనర్చిన వాడు (1051 – 1052). రాజరాజు శివపూజా ధురంధరుడు. వైదిక మతాభిమాని. వర్ణాశ్రమ ధర్మములను నిలిపెను.వేదశాస్త్రములను పోషించెను. యజ్ఞయాగాది కర్మలకు భూములను, ధనమును ఇచ్చెను. పురాణ, ఆగమ, వేదాంత శాస్త్రములు నేర్చినవాడు. అనేక దేవాలయములు, అగ్రహారములు, సత్రములు కట్టించెను.
క్రీ. శ. 1081 లో తన పరోక్షమున తిరిగి తన సవతి తమ్ముడు విజయాదిత్యుడు రాజ్యమును గ్రహించెను. ఇతడు తన కొడుకు శక్తివర్మకు రాజ్యమిచ్చెను (1061). కాని అతడొక సంవత్సరము రాజ్యపాలన జరిపి యుద్ధమునందు చనిపోయెను. కనుక ప్రజల కోరికపై తాను రాజ్యమును స్వీకరింపవలసివచ్చెనని విజయాదిత్యుడు వేంగిని పరిపాలించెను. ఈతడు ఇంతకుముందు పశ్చిమ చాళుక్య చక్రవర్తులకు సామంతుడుగానుండి నోలంబ వాడి, కోలారు దేశములలో వారి మాండలికుడుగను, సేనాధిపతిగాను ఉండి తుదకు వేంగిరాజ్యమును పట్టుకొనెను. అయినను చోళ చక్రవర్తి వీర రాజేంద్రుడు వేంగిపై దండెత్తి విజయాదిత్యుని పారద్రోలి క్రీ. శ. 1068 లో వేంగి రాజ్యమును రాజేంద్ర చోళునికే పట్టము కట్టెను. విజయాదిత్యుడు కళింగగాంగ రాజరాజు వద్ద (1069-70) శరణు జొచ్చెను. 1070 లో చోళరాజగు అధి రాజేంద్రుడు చనిపోయెను. కనుక చాళుక్య రాజరాజ నరేంద్రుని కొడుకు రాజేంద్రచోళుడు రాజధానిని స్వాధీన పరచుకొని సింహాసన మెక్కెను. ఈ సమయమున కళింగ గాంగ రాజరాజు తన సేనాపతియగు బణపతిని వేంగివై దండెత్త పంపెను. అతడు చోళుల సైన్యమును ఓడించగా వారు గాంగ రాజరాజుతో సంధి చేసికొనిరి (1072). తన జీవిత కాలము వేంగిని విజయాదిత్యుడు పాలించుటకును, కళింగ రాజరాజునకు రాజేంద్రుని మరదలు రాజసుందరి నిచ్చి వివాహము చేయుటకును అంగీకరింపబడెను. వీని ఫలితముగా 1076 వరకు విజయాదిత్యుడు వేంగి రాజుగా పరిపాలించి ఆ సంవత్సరమున చనిపోయేచు. అపుడు రాజేంద్రచోళ లేక కులోత్తుంగచోళ తెలుగు లేక వేంగి దేశమును, తన రెండవ కుమారుడు ముమ్మడి చోళ రాజరాజు (1076-78), ఆతని తర్వాత మూడవ కుమారుడు వీర చోళ (1078-84), తరువాత పెద్దకుమారుడు రాజరాజ చోడగంగు (1085-89). ఆ తర్వాత తిరిగి వీరచోడ (1089-92), ఆతరువాత విక్రమచోళ (1093-1118) రాజ ప్రతినిధులుగా వరుసగా పాలింపజేసెను. 1118 లో కులోత్తుంగుడు తన రాజధానికి విక్రమచోళుని పిలువ నంపెను. వేంగి అరాజక మయ్యెను. 1119 లో కులోత్తుంగుడు చనిపోగా విక్రమచోళుడు ద్రామిళ, వేంగి దేశములకు చక్రవర్తి యయ్యెను. కాని వేంగి పై ఆరవ విక్రమాదిత్యుడు దండెత్తి దానిని స్వాధీన పరచుకొని 1126 వరకు మాత్రమే పాలించెను. అప్పటినుండి తిరిగి వేంగి విక్రమచోళుని స్వాధీనములోనికి వచ్చెను. ఇతడు వెల నాటి చోడులను తన రాజప్రతినిధులుగా నియమించెను.
ఈకాలమున తెలుగు దేశమును వేరువేరు వంశములు పాలించెను. ఎలమంచిలి, పిష్ఠపురము, కోనమండలము, వెలనాడు, పాకనాడు, పొత్తపినాడు మొదలగు దేశ విభాగములు వేర్వేరు వంశములక్రింద పాలింపబడు చుండెను. వీరిలోకెల్ల తెలుగు చోళులు, లేక పొత్తపి చోళులు ప్రసిద్ధులు, కడపజిల్లాలోని కొంతభాగమును, చిత్తూరు జిల్లాలోని కొంత భాగమును కలిసి పొత్తపినాడన బడెను. ఈ తెలుగు చోళులు ప్రథమమున తూర్పు చాళుక్య వంశములోనివారే కర్నూలు జిల్లాలోని పెడకల్లు రాజధానిగా జటాచోడుని కొడుకు భీముడు పాలించెను. కైలాసనాథాలయ శాసనమునుబట్టి ఈ తెలుగు చోళులు చోళత్రినేత్ర, కరికాల రాజుల సంతతియనియు, జటాచోడ భీముడు గొప్ప రాజనియు అతడు గణక విజయా దిత్యుడు, చాళుక్య భీముడు, కొల్లభిగండ విజయా దిత్యుడు, ఆతని కూతురు సంతతివాడనియు, ఆతని చెల్లెలు అమ్మరాజు భార్య అనియు, అతనిని చంపి, దానార్ణవుడు రాజ్యమునకు వచ్చుటచేత అతనిని జయించి వధించి పొత్తపినాడులో స్వతంత్రుడయ్యె ననియు తెలియును (972). వైదుంబులను ఓడించియు, రాష్ట్ర కూటులను తిరస్కరించియు తన రాజ్యమును విస్తరింప జేసెను. ఈ వంశమువారు వేరువేరు శాఖలై కొణిదెన, పొత్తపి, నెల్లూరు, ఏరువ, కందూరు, హేమవతి మొదలగు ప్రదేశములలో చిన్న చిన్న రాజ్యముల నేర్పరచుకొని 16 వ శతాబ్ది మధ్య భాగమువరకు ఆంధ్ర దేశములో పరిపాలించిరి. వీరి శాసనములు కంచిలో దొరుకుట చేత కొంత కాలము దాని నాక్రమించిరని తెలియును. 14 వ శతాబ్దమున వీరు కాకతీయులకు కప్పము కట్టుచు వారి క్రింద సామంత రాజులుగా పరిపాలించుచుండిరి.
వీరిలో ఒకశాఖ 1050 - 1300 మధ్య గుటూరు జిల్లాలోని కమ్మనాడు నేలిరి. కొణిదెన రాజధాని. బల్లీశ్వర, కామీశ్వర, త్రిభువన మల్లీశ్వర ఆలయములు ముగ్గురు రాజుల పేర వెలయించిరి. వీరు ప్రధమమున వేంగి చాళుక్యులకును, తరువాత పశ్చిమ చాళుక్యులకును, తరువాత కాకతీయులకును సామంత రాజులుగా నుండిరి. వీరు సూర్యవంశపు క్షత్రియులుగా వర్ణింపబడిరి. వీర నేక దాన శాసనములను ఇచ్చిరి. బల్లి యచోళుడు 10 వ శతాబ్ది మధ్యభాగమున పరిపాలించెను. ఈతని కాలమున రేనాడు (కడప) దేశమును వదిలి తూర్పుగా గుంటూరు, నెల్లూరు జిల్లాలకు వచ్చి చేరిరి.
చోడబల్లి కుమారుడు నన్ని చోడుడు (1050 - 1100) కుమార సంభవ గ్రంథకర్త. ఈతడు నన్నయకాలము వాడు. ఈతని గ్రంథమున పేర్కొనబడిన చాళుక్యరాజు రాజరాజ నరేంద్రుడని తోచును. ఈతడు పాక నా డేలెను. పొత్తపి రాజధాని. ఈ తరువాత కామదేవుడు (1100 - 1115) పాలించెను. ఈతని శాసనములు త్రిపురాంతకమున కలవు. మంత్రి భీమయ, ఈతడు కులోత్తుంగ చోళమహారాజునకు సామంతుడు. ఈతని తరువాత ఈతని కుమారుడు కన్నారచోడుడు 1115-1133 మధ్య పాలించెను. ఈత డనేక దానశాసనముల నిచ్చెను. గుద్దవాడి నాడు (రామచంద్రపురం తాలూకా) లోని పెద్ద డాక రేమి (ద్రాక్షారామము) భీమేశ్వరునికి తన తల్లిదండ్రుల పుణ్యము నిమి త్తము అనేక ధర్మములను జేసెను. ఇట్లే కాళహస్తీశ్వరునికి కమ్మనాడులోని దేవాలయములకు అనేక ధర్మములు చేసెను. కులోత్తుంగ, విక్రమచోళులకు సామంతుడు. వారి బిరుదములు వహించెను. క్రమముగా దక్షిణమునకు తన రాజ్యమును విస్తరింప జేసెను. ఈతని కాలమున రెండవ ప్రోలరాజు కాకతీయరాజ్యమును తూర్పునకు సాగించుచుండెను, కనుకనే ఈతని ధర్మములను కొన్నిటిని అతడు స్థిరపరచెను. కామచోడుడు, అతనికొడుకు త్రిభువనమల్లుడు 1137 నుండి 1151 వరకు రాజ్యమేలిరి. ఉభయులు కలిసి కొణిదెన గ్రామమున ధర్మములు చేసిరి. వీరి శాసనములనుబట్టి కమ్మనాడు, గుండికర్రు, మొట్టవాడి వీరిపాలన మందుండెను. వీరు వేంగి రాజ్యమునకు లోబడి పాలించు చుండిరి. పశ్చిమ చాళుక్య రాజులను వేంగినుండి పారదోలిరి. వెలనాటి చోళులతో సఖ్యముగా నుండిరి. వీరి కాలమునుండి కాకతీయులు (రుద్రదేవ, గణపతిరాజులు) దేశముపై దండెత్తి ఆక్రమించుకొనిరి. బల్లి చోడుని కాలమున (1211-22) కొణిదెన తెలుగు చోళుల అధికారము తగ్గెను. ఇట్లే వెల్నాటిచోళుల అధికారముకూడ తగ్గెను. గణపతిదేవుడు వేగిదేశమును క్రమముగా స్వాధీన పరచుకొనెను.
పొత్తపి (కడవ) తెలుగుచోళులు :- వీరు కడపజిల్లా పుల్లంపేట తాలూకాలోని టంగుటూరు వద్దనున్నపొత్తపి రాజధానిగా తెలుగు చోళవంశములోని వేరొకశాఖ 200 సం. లు రేనాటిని పాలించిరి. వీరు పశ్చిమ చాళుక్యులకు, తరువాత చోళులకు సామంతులుగ నుండిరి. 13 వ శతాబ్ద ప్రారంభమున కాకతీయులచే జయింపబడి సామంతులయిరి. కరికాలవంశమునకు చెందిన తెలుగు బిజ్జన మనుమడు మల్ల దేవుడు పొత్తపిని పాలించెను. వాని వంశములోని బెట్టరస 1121 నుండి 1125 వరకు పాలించెను. విక్రమచోళుని విజయమునకై నందలూరువద్ద దానశాసనము ఇచ్చెను. ఈతని కాలమున అత్యనచోళుడు రేనాడులో కొంతభాగము నేలుచుండెను. ఈతడుపశ్చిమ చాళుక్యులకు సామంతుడు. ఈతనిక్రింద సామంతుడొకడు ముదివేము అగ్రహారమును 108 మహాజనులకు దానమిచ్చెను. సిద్ధరస కొడుకు విమలా దిత్యుడు 1125 లో నందలూరులోను, శ్రీ కాళహస్తిలోను చాల దాన శాసనములను ఇచ్చెను. ఈతడు విక్రమచోళుని మహా మండలేశ్వరుడు. ఈతని శాసనములు అరవభాషలో కొన్నిగలవు. 1130 లో మల్లిదేవు ములికె (300 గ్రామములు), సిందనాడి (1000 గ్రామములు) దేశములను వల్లూరు రాజధానిగా పాలించెను. ఈతడు పశ్చిమచాళుక్య సోమేశ్వరుని సామంతుడు. ఈతడు తెలుగు పల్లవులను జయించి పాకనాడులోని కొంతభాగము నేలెను. ఈతని మనుమడు మల్లిదేవు 1159 లో పాలించెను. ఈతడు నెల్లూరు తెలుగు చోడరాజగు నల్లసిద్ధిచే ఓడింపబడి (1159) వానికి సామంతుడుగా రాజ్యమేలెను. కొంత తరువాత రాజగు ఓపిలిసిద్ధి 1224 లో కమ్మనాటిని జయించి, కాకతిగణపతి అనుగ్రహమున కొణిదెన రాజధానిగా 6000 దేశమును పాలించెను (1280 వరకు). గణపతి దేవుని జయమునకై కొణిదెన శంకరేశ్వరునికి మొగలి చెరువు గ్రామమును దానమిచ్చెను. గణపతిదేవుడు తన ప్రతినిధిగా ఓపిలిసిద్ధిని ‘పొత్తపి, పాకనాడు, కమ్మనాడు, వెలనాడులపై నియమించెను. అరవ లిపిలో పాండ్య రాజగు సుందరపాండ్యుని (1216-38) శాసనములు నందలూరు, వేపాక, అత్తిరాల, పొత్తపినాడులలో దొరకుటచేత ఈ ఓపిలిసిద్ధి అతని సామంతుడయ్యెనని తోచును. ఈతని తరువాత భీమదేవుడు కాకతిగణపతి సామంతుడుగ పాలించెను (1235). కాకతీయ రాజ్యానంతరము (1325) విజయనగర రాజులకు లోబడి ఆ తరువాత గజపతి రాజులకు లోబడి 15 వ శతాబ్దాంతమువరకు ఈ వంశపు రాజులు పశ్చి మాంధ్రదేశమును పాలించుచు దైవబ్రాహ్మణ భక్తి కలిగి వారికి అనేక భూదానములను చేయుచు కీర్తి గడించిరి.
నెల్లూరు తెలుగు చోళులు (1100-1350): తెలుగు చోళవంశమున ఈ శాఖమిక్కిలి ప్రసిద్ధి గాంచెను. 12 గురు రాజులు 250 సం. లు ఏలిరి. వారి రాజ్యము ఒకప్పుడు ఆంధ్రలోని చాలభాగమును హోయసల తెలుగుపల్లవ, చోళరాజ్యములలో కొంతభాగము కలిగి యుండెను. వీరు ప్రథమమున చోళ చక్రవర్తులకును, తరువాత కాకతీయులకును సామంతులుగా నుండిరి. కాని వీరు 13 వ శతాబ్దమున చాల ఉచ్ఛదశయందుండిరి. వీరి చరిత్ర చాల భాగము వీరి శిలాతామ్ర శాసనము లవల్లను, వాఙ్మయమువల్లను తెలియును. తెలుగు, సంస్కృతము, అరవము, గ్రంథ. కన్నడ భాషలయందును లిపుల యందును శాసనముల నిచ్చిరి. మరియు ఆకాలపు చోళ, హోయసల, కాకతీయ, వెలనాటి చోళరాజుల శాసనములు, వాఙ్మయముకూడ వీరి చరిత్రమును మనకు బాగుగా తెలుపును. కరికాల వంశమున మధురాంతక పొత్తపిచోళు డుదయించెను. అతని వంశమున తెలుగు బిజ్జ డుదయించి కావేరిదాటి మధురను జయించెను. ఆ తరువాత మనుమసిద్ధి 1175 నుండి 1192 వరకు నెల్లూరు రాజధానిగా రాజ్య మేలెను. ఈతని శాసనములు శ్రీకాళహస్తి, కొవ్వూరు, నెల్లూరు, పొత్తపి గ్రామములలో దొరకినవి. నెల్లూరి శాసనమున రాజు ఎర్రంపల్లి గ్రామమును పూంగినాడులోని నెల్లూరి నాగూరీశ్వరునకు దానమిచ్చెను. ఈతడు చోళ మహారాజునకు సామంతుడు. ఈతని సమకాలికులు చోళ రాజాధిరాజకులోత్తుంగ, కాకతిరుద్ర దేవ, వెలనాటిచోడ, గోంక, పృథ్వీశ్వర కోట వంశపు భీమకోట రాజు, యాదవవంశపు సారంగధర, తెలుగు పల్లవ వంశపు విజయాదిత్య, అల్లు తిక్క, నాగవంశపు సత్తిరాజు, కొణిదెన నన్నిచోడుడు, పొత్తపిచోడకామ, మల్లిదేవ. ఈతని తరువాత ఈతని తమ్ముడగు బెట్టదేవుని కొడుకులు దాయభీమ, నల్లసిద్ధి ఉమ్మడిగా 1187 నుండి 1214 వరకు రాజ్యమేలిరి. వీరు కులోత్తుంగుని సామంతులు.అనేక దేవబ్రాహ్మణ మాన్యముల నొసంగిరి. వీరు రేనాడు,పూంగినాడు, తొండమండలముపై రాజ్యమేలిరి. కంచిని స్వాధీనపరచుకొని కప్పము వసూలు చేసిరి. 1183-1192 మధ్య స్వతంత్రు లయిరి.
ఎర్రసిద్ధ 1195-1217 మధ్య పాలించేను. గండగోపాలాది బిరుదములను పొందెను. ఈతడు మూడవ కులోత్తుంగుని సామంతుడు. ఈతని కుమారులు మనుమ, బెట్ట, తమ్ము సిద్దుల సహాయముతో రాజ్యము విస్తరింప జేయగలిగెను. మనుమసిద్ధి (1198-1210) అనేక దానములను అగ్రహారములను దేవబ్రాహ్మణులు కొసంగెను. ఈతడు మూడవ కులోత్తుంగుని సామంతుడుగా నుండి ఆతని చివరికాలమున స్వతంత్రుడయ్యెను (1204). తమ్ముసిద్ధి (1205-1209) శాసనములు చోళదేశమున గలవు. కంచి నెల్లూరు పట్టణముల మధ్యస్థదేశముకూడ ఈతని కైవస మయ్యెను. అయినను ఈతడు కులోత్తుంగుని సామంతుడుగా నుండెను. అతనితో ఓరుగల్లు కోటపై దండెత్తి గణపతి నోడించెను (1208), నల్లసిద్ధి రాజుగా పట్టాభిషిక్తు డయినను అతని తమ్ముడు తమ్ముసిద్ధి అతని కటాక్షమున రాజ్యమేలెను. యాదవరాయ వంశముతో వీరికి బంధుత్వ మేర్పడెను. ఈతని తరువాత మనుమసిద్ధి కుమారుడు తిక్క (1209–1248) రాజ్యమేలెను, ఈతనికి 'తేంకనాదిత్య', 'జగదొబ్బగండ', అను బిరుదము లుండెను.ఈతడు కూడ మూడవ కులోత్తుంగుని సామంతుడుగా రాజ్యమేలెను. ఈత డనేక దానశాసనములు నిచ్చెను. మూడవ రాజరాజు కాలమున కంచిలోని దేవాలయములకు ఈతడు, ఈతని సామంతులు పెక్కు దానములు చేసిరి. మూడవ రాజ రాజు 13 వ రాజ్యకాలమున ఉత్తర ఆర్కాటు జిల్లాలోని గుడి మల్లందేవునికి గండగోపాల మాడలు దానమిచ్చుటచేత ఆ ప్రదేశము తిక్కరసకు లోబడినదని తోచును. ఈతని శాసనములు కంచి దేవాలయములలో నున్నవి. ఈతనికి చోళ తిక్కయను బిరుదము కలదు. చోళ రాజరాజునకు సామంతుడుగానుండి అతనితో కలిసి హోయసల రాజులను ఓడించెను. ఈతని అల్లుడు అల్లుతిక్క కంచినుండి పాలించుచు ఆత్మకూరున దేవుని ప్రతిష్ఠించి చాల ధర్మములు చేసెను (1246). శ్రీ వరద రాజస్వామి భక్తులమని వ్రాసికొనిరి. 1257 లో తిక్కభూపతి కంచిని పట్టుకొనెను. ఈతడు గొప్ప వీరుడేగాక పరిపాలనా కౌశలము కలవాడు. ఈతడు తన పేరుతో చాల నాణెములను ముద్రింపించెను. ఆ కాలపు రాజవంశము లన్నింటితోను సంబంధము కలిగి మంచి పేరును, కీర్తిని సంపాదించెను. నెల్లూరు, చెంగల్పట్టు, ఉత్తర ఆర్కాటు, కడపజిల్లాలు అతని పాలనములో నుండెను. తిక్కనకవి తన నిర్వచనోత్తర రామాయణమున తిక్కభూపతి కర్ణాట సోమేశ్వరుని, శంభురాజుని, ఇంకా ఇతర రాజులను ఓడించెననియు చోళ రాజరాజును సింహాసనాసీనుని చేసెననియు (పాండ్యరాజు బారినుండి తప్పించి), తాను కూడ కంచినుండి పరిపాలన సాగించెననియు వ్రాసెను. కేతనకవి తిన దశకుమార చరిత్రలో తిక్కభూపతి పాండ్యరాజువద్ద (మారీవర్మ సుందరపాండ్య) కప్పము గైకొనె ననియు వ్రాసెను. తిక్క సమర్థులైన సేనాధిపతులు, మంత్రులు గలవాడు. తెలుగు చోళుల సైన్యములు ధైర్య శూరత్వములు కలిగి గొప్ప అనుభవముతోను, నేర్పుతోను యుద్దము చేయుచుండెను. కనుక దక్షిణ దేశ మునందంతటను తెలుగువారి కీర్తి ప్రతిభలు హెచ్చెను. ఉత్తర ఆర్కాటు జిల్లాలోని శంభూవరాయలను జయించుటలో నేమి, పశ్చిమ చాళుక్య చక్రవర్తుల సైన్యములను పారద్రోలుటలో నేమి, పాండ్యులను హత మార్చుటలో నేమి, నెల్లూరు తెలుగు చోళులు కీర్తిని సంపాదించిరి,
1238 నుండి 1250 వరకు తిరిగి రాజేంద్ర చోళుని ప్రభ వెలిగెను, కాకతీయులతోడి స్నేహము తెలుగు చోళులకు లాభించెను. అయినను కొన్ని సంవత్సరములయిన తరువాత జటావర్మ సుందరపాండ్య గొప్పసేనను సమకూర్చుకొని గండగోపాల (తిక్క) నోడించి చంపెను. కంచి, నెల్లూరు మండలములు పాండ్యుల స్వాధీనమయ్యెను. కాకతి గణపతి ఓడి పరారయ్యెను. తిక్క 1239 నాటికే హోయసల రాజగు నరసింహు నోడించి కల్యాణిపురమును తగులబెట్టెను. దీనికి ప్రతీకారముగా 1240 లో నరసింహుని కొడుకగు సోమేశ్వరుడు నెల్లూరుపై దండెత్తెను. కాని ఓడిపోయెను. తిక్కనకవి, కేతనకవి కూడ కర్నాట సోమేశ్వరు డోడిపోయి పరారి అయినాడని వ్రాసిరి. తిరిగి 1257 లో తిక్కరాజు కంచిని స్వాధీన పరచుకొని సోమేశ్వరుని చంపాపురివద్ద ఓడించెను. ఇట్లే దేవగిరి యాదవులను ఓడించెను. వెలనాటి చోడ రాజగు పృథ్వీశ్వరుని ఓడించి చంపెను. శంభూవరాయ కాడవరాయ రాజులను ఓడించెను. వారినుండి కప్పము గైకొనెను. తన ఆఖరి రాజ్య కాలములో కొడుకగు మనుమసిద్ధి,అల్లుడగు అల్లు తిక్కలను తనతో కూడ పరిపాలించుటకు నియమించెను. తరువాత రాజ్యమును విభజించి అల్లుతిక్కకు కంచిరాజ్యమును, మనుమసిద్ధికి నెల్లూరు రాజ్యమును ఇచ్చెను. అల్లుతిక్క స్వతంత్ర రాజుగా తన పేరుతో శాసనములను ఇచ్చెను (1248- 1272).
1249 లో పాండ్యులు దండెత్తిరి. కాని కాకతీయుల సహాయమున అల్లుతిక్క వారిని కంచినుండి పారదోలెను. కాకతీయ గణపతి రుద్రమదేవులతో స్నేహముచేసెను. తెలుగు పల్లవరాజగు విజయగండ గోపాలునితో కూడ స్నేహము చేసెను. ఈ వంశములవారి శాసనములు కంచి యందు కలవు. మనుమసిద్ధి (1248-67) అనేక శాసనములు ప్రకటించెను. 1250 లో తనకు ఆరోగ్యము కలుగుటకు నందలూరిలోని దేవునికి దానధర్మములు చేసెను. ఈతడు మూడవ వీర రాజేంద్రచోళుని సామంతుడు. 1257 నందలూరు శాసనమునుబట్టి ఇతని వంశ క్రమము, ఇతని కోడూరు గ్రామ ధర్మము తెలియును. ఈతని 1258 సం. శాసనము నల్లసిద్ధికి, యాదవులకు జరిగిన యుద్ధమును తెలుపును. మనుమసిద్ధి రాజ్యాభివృద్ధికై తెలుగుపల్లపు లిచ్చిన దాన శాసనములు కొన్నిగలవు. ఈతని దాన శాసనములు కొన్ని కంచి యందుగలవు. 1265 నుండి తన కొడుకు రెండవతిక్కతోసహా పరిపాలించెను. కాకతీయ గణపతిదేవుని సహాయములో ఈతడు రాజ్యము చేసెనసి తెలియును. చోళరాజగు మూడవ రాజేంద్రుని ప్రభ తగ్గినను, ఈ తెలుగు చోళులు ఇంకను అతని సామంతులమని పేర్కొనుచుండిరి. ఈతని ఆఖరి రోజులలో 1250 సం. నుండి ఈతనికి, ఈతని దాయాదులకు జరిగిన పోరాటములో ఈతడు కాకతీయులను, వారు పాండ్యులను సహాయము కోరగా పాండ్యులు దండెత్తి నెల్లూరును పట్టుకొని ఈతనిని సింహాసనమునుండి తొలగించగా, కాకతీయులు వచ్చి తిరిగి పాండ్యులను పారదోలి అతని సింహాసన మతని కిప్పించిరి. ఈ సందర్భముననే తిక్కన సోమయాజి కాకతీయ గణపతిని ఓరుగల్లునందు సందర్శించి తనరాజునకు సహాయము కోరెను. గణపతి తిక్కన కవిత్వము విని ఆనందించి ఆతనికి 9 లక్షల బంగారు నాణెములను 68 గ్రామములను బహుమాన మిచ్చెను. గొప్ప సేనతో వెలనాడు దేశమును జయించి రాజధానిని (త్సందవోలును) తగులబెట్టి, నెల్లూరు ముట్టడించి, పట్టుకొని మనుమసిద్ధిని సింహాసనముపై నెక్కించెను. 24 దుర్గములు, 68 పట్టణములు పట్టుకొని మనుమసిద్ధికి కానుకగా నిచ్చెను. మనుమసిద్ధికి మన్మగండ గోపాల బిరుదముండెను. ఈతడు యాదవులతో పోరాడెను, ఈతని సేనాపతి ఖడ్గతిక్కన యుద్ధమున గెలిచెను. కాని చనిపోయెను. పెన్నానదీ తీరమందు సోమశిల వద్ద యుద్ధము జరిగెను. యాదవులు సామంతులుగా నుండిరి. ఇట్లే ఖడ్గతిక్కన తెలుగు పల్లవరాజగు విజయుని ప్రాయేరువద్ద ఓడించెను. విజయు పూర్తి పేరు విజయగండ గోపాలుడు. పెంట్రాల, కడప యందలి తెలుగు పల్లవులు మనుమసిద్ధి యధికారమునకు లోబడి యుండిరి. దక్షిణ పల్లవరాజగు కొప్పెరుంజింగ పాండ్యుల వల్ల ఓడింపబడినను, తొండమండలము నుండి తెలుగు చోళులను తరిమివేసి వేంగి రాజ్యములోనికి చొచ్చుకొని వచ్చి ద్రాక్షారామములో శాసనములు చెక్కించెను. ఈతడు 1249 - 50 లో కాకతీయ గణపతిచే ఓడింపబడి తెలుగుదేశము పై తన యధికారమును వదులుకొనెను. కానీ దక్షిణదేశమున 1243 నుండి 1259 వరకు పాలించెను. చిదంబరము దేవాలయమును బాగుచేయించెను. తుద కీతడు 1259 లో గణపతిచే పూర్తిగా ఓడింపబడెను. మనుమసిద్ధి, గణపతి పక్షమున పోరాడెను. పాండ్యులను, కాయస్థులనుకూడ ఓడించెను. హోయసాల రాజగు నరసింహ నెల్లూరుపై దండెత్తగా అతనిని ఓడించి పారదోలెను, రేనాడు పరిపాలించు పశ్చిమ గాంగరాజులను ఓడించెను. ఈతడు బహు పరాక్రమశాలియనుట కీతని బిరుదములే సాక్ష్యము. కేతన, తిక్కనల వ్రాతలనుబట్టి ఈ రాజు కాలమున తెలుగు చోళులు బహు పరాక్రమశాలు లని తెలియుచున్నది.
మనుమసిద్ధి తరువాత రెండవ తిక్క 1265 నుండి 1281 వరకు పాలించెను. ఇతడుకూడ తండ్రివలె బహుపరాక్రమశాలి. అద్దంకి యాదవులు ఈతనికి సామంతులు. ఈతడు కాకతీయుల సహాయమున శత్రువులను పరిమార్చుచుండెను. రుద్రమదేవి ఇతని సమకాలికురాలు. ఈతని తరువాత 1281-1299 వరకు తిక్కని సోదరుడు మన్మగండ గోపాలుడు పాలించెను, ఈతడు దేవాలయములకు బ్రాహ్మణులకు, కవులకు, సామంతులకు చాలదానములు చేసెను. కొణిదెన చెన్న కేశవస్వామికి 1297 లో కొంత భూదానము చేసెను. ఈతని కాలమున ఆఖరి చోళరాజు మూడవ రాజేంద్రుడు చనిపోవుటతో చోళరాజ్యము అంతరించెను. నెల్లూరు చోళులు పూర్తిగ స్వతంత్రులైరి. కాని 1296 తరువాత కాకతీయ ప్రతాపరుద్రుని సామంతులుగా పాలించిరి. 1291-96 మధ్య అనేకసార్లు మన్మగండ గోపాలుడు ఓడింపబడి పదభ్రష్టుడై తుదకు సామంతుడుగా సింహాసన మెక్కెను (1297).
కాకతీయులకు యాదవ రామచంద్రులకు జరిగిన యుద్ధములలో మన్మగండ గోపాలుడు ప్రతాపరుద్రునకు సహాయ మొనర్చెను. ఇట్లే కళింగదేశముపై దండెత్తి కాకతీయ సామంతులగు కొలనిరుద్ర, అన్నయలకు సహాయపడెను. అల్లుతిక్క చనిపోయిన తరువాత కంచి రాజ్యమును నెల్లూరు రాజ్యములో కలిపివేసెను. ఈతని తరువాత రాజగండ గోపాలుడు (1299-1325) పాలించెను. ఈతడు ప్రతాపరుద్రుని సామంతుడు. 1316 లో ఆతని సేనాధిపతి ముప్పెడి నాయకుడు కంచికివచ్చి, మానవీరుని (తెలుగు-చోళ) పరిపాలకునిగా నియమించి 1002 గండగోపాల మాడలు ఖరీదుగల రెండు గ్రామములు దేవునకు సమర్పించెను. ఈతడు స్వతంత్రుడుగానే శాసనముల నిచ్చెను, త్రిభువన చక్రవర్తి యను బిరుదును పొందెను. ఈతని కాలమున కాకతీయ మహారాజు ప్రతాపరుద్రుడు పాండ్యదేశమును జయించియు, కంచిని స్వాధీనపరచుకొనియు, నెల్లూరు తెలుగు చోళులను, కొలని రుద్రదేవులను సామంతులుగా జేసికొనియు, కళింగమును జయించియు, విశాలాంధ్రదేశముపై చక్రవర్తిగా నుండెను. నెల్లూరు చోళులలో వీరగండ గోపాల (1292-1302) ఆఖరిరాజు. ఈతని శాసనములు చాలా భాగము దక్షిణ దేశమున దొరికినవి.ఈతనికి కూడ త్రిభువన చక్రవర్తి బిరుదము కలదు. ఈతడును, ఈతనికి ముందున్న రాజులును చోళ సంప్రదాయములను గ్రహించి దానిని దేశమున వ్యాపింప జేసిరి. దేవాలయములు కట్టు పద్ధతులు, వాటి పరిపాలన, దేశ భాషలు, మర్యాదలు, మొత్తముమీద రాజ్యపరిపాలనా విషయములు చోళులవై యున్నవి. పాండ్యుల దండయాత్రలవల్ల నేమి, కాకతీయుల దండయాత్రలవల్లనేమి ఇద్దరు ముగ్గురు రాజులు ఒకే కాలమున నెల్లూరు మండలమున రాజ్యపాలన చేయుటవల్లనేమి, సామంతులు తరచు తిరుగుబాటు చేయుటవల్లనేమి, నెల్లూరు తెలుగు చోళుల రాజ్యము యొక్క ప్రభ తగ్గిపోయెను. ఓరుగల్లు రాజ్యము 1323 లో తుగ్లకు వశమయ్యెను. అప్పటికి నెల్లూరు చోళులు అస్తమించిరి.
కాకతీయాంధ్రరాజుల చరిత్రము : తామ్ర శిలాశాసనములు, శిల్పములు, వాఙ్మయము, ముఖ్యాధారములుగా ఈ రాజుల వంశక్రమ కాలనిర్ణయములు, మత విషయములు, ఆర్థిక రాజకీయ విషయములు తెలిసికొనగలము. కాకతీయను దుర్గ కులదేవతగా కలవారు కాక తీయులు. వీరు చతుర్థకులజులు. తూర్పు చాళుక్యుల వలెనే వీరిదికూడ వరాహముద్ర. వీరిలోని మొదటి రాజులు వారిలోవలెనే జైనమత పోషకులు. జైనమతస్థులు 'కాకతి' లేక 'కూష్మాండి' ని ఆరాధించెడివారు. కనుక ఈ వంశమున కాపేరు వచ్చెను. రెండవ ప్రోలరాజు జైన మతస్థుడు. తరువాత శైవుడు. అతని తరువాతి రాజులందరు శివభక్తులు. 10 వ శతాబ్దపు తూర్పు చాళుక్య శాసనమునుబట్టి (అమ్మరాజ దానార్ణవుల కాలమున) గుండియ రాష్ట్రకూటుని మనుమడును, ఎరియరాష్ట్ర కూటుని కుమారుడునగు గుండ్యన లేక కాకర్త్య గుండ యను నాతని ప్రేరేపణచేత నతవాటి నివాసుల నుద్దే శించి ఈ శాసన మివ్వబడినది. కాకర్త్య గుండ్యన రాష్ట్రకూట వంశమువాడైనను, తూర్పుచాళుక్యరాజులకు సామంతుడుగ నుండెను. ఈతడే కాకతీయవంశకర్త. ఈతని కాలము 950 ప్రాంతము. 970 నుండి 999 వరకు తూర్పు చాళుక్యవంశము అంతఃకలహములతో క్షీణించెను. ఈ కాలమున కాకతి గుండ్యనయు, అతని సంతతి వారు తమ రాజ్యమును వృద్ధిపరచు కొనిరి. కాకతీయ శాసనములనుబట్టి ఈక్రింది వంశావళి, కాలనిర్ణయము చేయబడినవి :
మొదటి ప్రోలరాజు (1050-1080) త్రిభువనమల్ల బేతరాజు (1080-1115) రెండవ ప్రోలరాజు (1115-1158) పద్ర దేవ (1158-1195) మహాదేవ (1195-1198) గణపతి (1198-1281) 1 రుద్రాంబిక (1258-1296) 1 ప్రతాపరుద్ర (1290-1826)
మొదటి ప్రోల కొఱవి, సబ్బి దేశములకు (ఓరుగల్లు మండలము) రాజై తూర్పుచాళుక్యరాజులకు సామంతుడయి యుండెను. ఈతని సేనాని బమ్మ దక్షిణమున కంచి చోళుల నెదుర్కొ నేను. ఈతనికొడుకు 'బేత' పశ్చిమ చాళుక్యులకు సామంతుడుగ నుండి గోదావరికి పశ్చిమోత్తర ప్రాంతమున పాలించుచుండెను. అనుమకొండ రాజధాని. ఈతడు శివభక్తుడు. ఈతని కొడుకు రెండవ ప్రోల. ఈతడును మొదట పశ్చిమ చాళుక్యులకు సామంతుడుగా నుండి తరువాత తైలపదేవుని ఓడించెను. నేలకొండపల్లి నేలు గోవిందుని, మంత్రకూటపు రాజగు గుండయను, వేములవాడ జగదేవుని ఓడించి సామంతులుగా చేసికొనెను. 1158 లో బిజ్జలునికి సహాయము చేసి కళ్యాణిపురమును నాశనము చేసెను. ఈతడు వెలనాటి చోడులతో యుద్ధముచేయుచు చనిపోయెను. ఈతని కొడుకు రుద్రదేవుడు రాజ్యమునకు వచ్చెను. అప్పటికి తూర్పున చాళుక్యరాజ్యము క్షీణించి వెలనాటి చోడ, తెలుగు చోడ కొలను వంశముల స్వాధీనముననుండెను. పశ్చిమ చాళుక్య రాజ్య మస్తమించి కళచురి, లింగాయితుల స్వాధీన మయ్యెను. గోదావరికి ఉత్తరమున యాదవులు తమ రాజ్యమును విస్తరింప చూచుచుండిరి. ఇట్టి సమయమున రుద్రదేవుడు పెద్ద సైన్యమును సమకూర్చుకొని, ధర్మపురి నుండి గోదావరి తీరస్థ భద్రాచలమువరకుగల ప్రదేశము నేలు దొమ్మెరాజు నోడించి ఆ దేశమును తన రాజ్యములో కలుపుకొనెను. మైలిగ దేవుని జయించి పొలవాస దేశములు ఆక్రమించెను. భీముడేలు వర్ధమానపురమును గాల్చి అతనిని పారదోలి, చోడోదయుని సామంతునిగా జేసికొనేను. ఆఖరి వారిద్దరును తెలుగు చోడరాజులు. తరువాత వెలనాటి చోడుల నెదుర్కొనెను. శ్రీశైల త్రిపురాంతకములను స్వాధీన పరచుకొనెను. ఈ జయములందు ఈతని మంత్రి ఇనగాల బ్రమ్మి రెడ్డి సహాయపడెను (1162). 1186 సంవత్సరమునాటికి వెలనాటి చోడరాజులను జయించి కప్పము గైకొనెను. నతవాడి, ఇందులూరి, కొలను వంశీయుల సహాయమున కృష్ణా గోదావరీనదీ మండలముల వరకు కాకతీయ రాజ్యాధి కారము వ్యాపించెను. ఆ వంశముల వారితో సంబంధ బాంధవ్యములను వృద్ధి పరచెను. 'రెడ్డి కులజులగు రేచర్ల కామచమూపతి ఇతనికి కుడిభుజము, ఆతని కొడుకు బేతి రెడ్డి 1195-1202 మధ్య అనేక యుద్ధము లలో సహాయ మొనర్చి, ముఖ్యముగా యాదవులతో పోరాడి తుదకు ప్రాణముల నర్పించెను. ఈతని తమ్ముని కొడుకు రుద్రసేనాని అనేక రణరంగములందు గెల్చి కాకతీయ రాజ్య విస్తరణకు కారకుడయ్యెను. కరీంనగర శాసనమునుబట్టి గంగాధరుడను బ్రాహ్మణ మంత్రి రాజ్యపాలనయందు సమర్థుడై అనేక దేవాలయములను కట్టించి సర్వ కళలను పోషించెను. ద్రాక్షారామ శాసనమునుబట్టి కాకతి రుద్రునికి 'విద్యావిభూపణ' బిరుదముండెను. ఈతడు రచించిన నీతిసారమును బద్దెన కవి నీతిశాస్త్ర ముక్తావళియను పేర తెనిగించెను. మల్లికార్జున పండితుడును, అతని శిష్యుడు పాల్కురికి సోమనాథుడును ఈ రాజపోషణమును పొందిరి. పల్నాటి యుద్ధానంతరము (1176-1182) వెలనాటి చోడరాజులు ప్రభ తగ్గెను. 1186 లొ కాకతి రుద్రుడు వెలనాటి గొంకరాజు నోడించి వారి రాజ్యమును నాశన మొనర్చెను.
పల్నాటి యుద్ధానంతరము నతవాటి, హైహయ వంశపు రాజుల సహాయమున కాకతీయ సామ్రాజ్యము తూర్పుతీరము వరకు వ్యాపించెను. ఏక శిలానగరము లేక ఓరుగల్లు రుద్రదేవుని కాలమున నిర్మింపబడెను. రుద్రేశ్వరాలయము మొదలగు అనేకాలయములు కట్టబడెను. చిత్రకళలు, ముఖ్యముగా శిల్పకళలు దేవాలయములందు వృద్ధిచెందెను. మంటప స్తంభములమీద శాసనములు, బొమ్మలు చెక్కబడెను. యాదవుల రాజగు జైతుగి ఆంధ్రరాజగు రుద్రునిపై దండెత్తి అతనిని చంపెను. అందుచేత రుద్రుని తమ్ముడు మహాదేవుడు రాజ్యమేలెను. ఈతని కాలమున జైతుగి తిరిగి దండెత్తివచ్చి మహాదేవుని జంపి అతని కుమారుని గణపతిని ఖైదీగా తీసికొని పోయెను, ఈతడు దేవగిరిలో 1209 వరకు ఖైదీగా నుండి ఆసంవత్సరము జైతుగి దయవల్ల విడువబడెను. ఈతడు ఖైదులోనున్న కాలమున సామంత రాజులు స్వతంత్రులైరి. కాని రేచర్ల రుద్రసేనాని, బొప్పదేవ సేనాని మున్నగువారు శత్రువులు నణచివేసిరి. 1212-1225 మధ్య గణపతి దేవుని వెలనాటి జయములు పూర్తి యయ్యెను. కోట, నతవాటివంశములతో సంబంధములను జేసెను. జాయపనాయకు నోడించి ఆతనిని తన గజ సైన్యాధ్యకునిగా నియమించెను. ఆతని సోదరీ ద్వయమును వివాహమాడెను. కొలనిమండలమును జయించి సోమయమంత్రికి ఆదేశమునిచ్చెను. ఆ తరువాత వారి సహాయమున కళింగమును జయించెను. కొలని సోమయ మంత్రి కోడులనాడు జయించి గోదావరి దాటి, మన్య ప్రాంతములను జయించి కళింగములోని దక్షిణ భాగములను జయించెను (1235-53). గుంటూరు, నెల్లూరు, కడప జిల్లాలలో పరిపాలించు తెలుగు చోళరాజులను 1245 - 50 మధ్య జయించెను. ఇదేసమయమున దక్షిణదేశమున చోళరాజులు పాండ్యులచేతను, పల్లవులచేతను ముట్టడింపబడుట చూచి గణపతి తన సేనానియగు సామంతభోజుని గొప్ప సైన్యముతో పంపి కంచి మొదలుగాగల దక్షిణ దేశములను జయించెను.
ఈతని తరువాత ఈతని పుత్రిక రుద్రాంబ 1258 నుండి 1296 వరకు రాజ్యమేలేను. ఈమె చాళుక్య వీరభద్రుని భార్య. ఈమె కూతురు ముమ్మక్క. ఆమె కుమారుడు ప్రతాపరుద్రుడు. రుద్రమదేవి రాజ్యమునకు వచ్చిన వెంటనే దక్షిణ దిశనుండి చోళులు, తెలుగు చోళులు, పల్లవులు దండెత్తిరి. కాని ఆమె సేనాని త్రిపురాంతకుడు వారినందరిని పారదోలెను. ఇక ఉత్తరము నుండి యాదవులు దండెత్తిరి. దేవగిరి రాజు మహాదేవుడు దండెత్తి కొంతకప్పము గైకొని పోయెను. ఈమె ఓరుగల్లున రాతిగోడను కోటలోపల కట్టించి దానికి మెట్లు కట్టించెను. పెక్కు అగ్రహారములను భూదానములను ఇచ్చెను. ఈమె తరువాత ఈమె దత్తుడు, మనుమడు ప్రతాపరుద్రుడు 1290 నుండి 1326 వరకు రాజ్యమేలెను. ఈతడు 1254 లో జన్మించుటచేత రాజ్యమునకు వచ్చుసరికి 36 సం.ల వయస్సుకలిగియుండెను. 1290 నుండి 1296 వరకు రుద్రాంబకు రాజ్యపాలనమున సహాయముచేసెను. తాను స్వయముగా రాజైన తరువాత నెల్లూరు చోళులను జయించెను. వారినుండి కప్పమును గైకొనెను. ఈతడు రాజ్యమునకు వచ్చిన సంవత్సరమున అల్లా యుద్దీను
ఖిల్జీ ఢిల్లీ చక్రవర్తి అయ్యెను. 1294 లో అల్లాయుద్దీను' దేవగిరి యాదవుల నోడించి కప్పము గైకొనెను. 1303లో తిరిగి దండెత్తి కాకతీయులచే ఓడింపబడి పరారయ్యెను. గండికోట ప్రాంతముల నేలు కాయస్థులు తిరుగుబాటు చేయగా వారిని ఓడించెను. ఘాజీ తుగ్లకు కొడుకు ఆలుఫ్ ఖాన్ తిరిగి ఓరుగల్లుకోటను ముట్టడించెను. కాని నాడు ఢిల్లీకి పోవలసి వచ్చెను. 1322 లో తిరిగి యెక్కువ సైన్యముతో వచ్చి ఆలుఫ్ ఖాను కోటను ముట్టడింపగా చేయునది లేక ప్రతాపరుద్రుడు సకుటుంబముగా లొంగిపోయెను. ఆతనిని ఢిల్లీ పంపగా దారిలో మృతినొందెను (1323). ప్రతాపరుద్రుడు తన సైన్యమును, ఉత్తర దిశయందలి కోటలను వృద్ధి పరచక యుండుటయు, ప్రోలయ వేమారెడ్లు తమ స్వాతంత్య్రమును వెల్లడి చేయుటయు, యుద్ధరంగమున పద్మనాయకులపై భారమంతయు మోపి రెడ్లు తాము పోరుసల్పక యుండుటయు ఈ అపజయమునకు ముఖ్య కారణములు.
కాకతీయ రాజులు విద్యాపోషణము చేసిరి. అనేక అగ్రహారముల నిచ్చిరి. విశేషముగా దేవాలయములను కట్టించిరి. సర్వకళలనుపోషించిరి. మల్లికార్జునుని నిరోష్ఠ్య రామాయణము, ఉదారరాఘవము, విద్యానాథుని ప్రతాపరుద్ర యశోభూషణములను అలంకారశాస్త్రము, అగస్త్యుని బాలభారతము, గంగాధర కవియొక్క భారత నాటకము, నరసింహ కవియొక్క కాదంబరీ నాటకము, విశ్వనాథుని సౌగంధి కాపహరణము, అప్పయార్యుని జినేంద్ర కళ్యాణాభ్యుదయము, త్రిపురాంతకుని ప్రేమాభి రామము, మాదన మార్కండేయ పురాణము, భాస్కర కవి రామాయణము, ఏకామ్రనాథుని ప్రతాప చరిత్రము, ఆ కాలవు వాఙ్మయాభివృద్ధిని తెలియజేయుచున్నవి. రాజ్య విస్తీర్ణము, పరిపాలనా విషయములు అప్పటి శాసనములను బట్టియు, వాఙ్మయమును బట్టియు తెలియుచున్నవి. రాజ్యమున ఇప్పటి తెలంగాణము, రాయలసీమ, కోస్తా జిల్లాలు, తొండమండలము, కంచి మండలము ఇమిడి యుండెను. చక్రవర్తి ఓరుగల్లున అష్టప్రధానులతో రాజ్యము చేయుచుండెను. అతడే సర్వసేనాని. న్యాయ స్థానమున కధ్యక్షుడు. ఆ కాలమున 77 రాజ్యాంగ నియోగము లుండెననియు, ఒక్కొక్కదానికి ఒక్కొక్క అధ్యక్షుడుండెననియు, ఈ నియోగములన్నియు పద్మనాయకుల యాజమాన్యమున పనిచేయుచుండెననియు తెలియును. రాష్ట్రము లేక మండలము, సీమ, నాడు, గ్రామము విభాగములు. రాజప్రతినిధులు, వారిక్రింది సామంతులు. తగు రక్షక సైన్యముతో పాలించుచుండిరి. గ్రామపరిపాలనము రెడ్డి, కరణము, తలారి వశమున నుండెను. వ్యవసాయమునకై పెద్ద తటాకములు త్రవ్వబడెను. పన్నులు ధాన్యరూపమున వసూలు చేయుచుండిరి. అనేక విధముల సుంకములు, భూమి, నీటిపన్నులు, సామంతు లిచ్చెడి కప్పములు, న్యాయస్థానములందు వసూలగు రుసుములు, వర్తకము వల్లను, వస్తువులు అమ్మకముమీదను వసూలుచేయబడు పన్నులవల్లను, సముద్రమునుండియు, ఖనిజవస్తు సామగ్రి నుండియు, ఆటవిక సంపదవల్లను వచ్చు ధనమంతయు ధనాగారమును నింపుచుండెను. ఆకాలమున నాణేములను ముద్రించుచుండిరి. ఈ రాజులు శైవమతస్థు లగుట చేత నంది విగ్రహముగల బంగారు, వెండి మాడలు విశేషముగా ముద్రింపబడు చుండెను. కృషీవలులకై అరణ్యములను నరకి భూములను వ్యవసాయమున కనుకూలముగ జేసిరి. పెక్కు గ్రామములను నిర్మించిరి. విశాలాంధ్రదేశము, కళింగము, దక్షిణ భాగము, ఉత్తరచోళ మండలము, కాకతీయసామ్రాజ్య భాగములే.
రా. సు.
[[వర్గం:]]