Jump to content

సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మొదటి సంపుటము/అస్సామీ భాషా సాహిత్యములు

వికీసోర్స్ నుండి

అస్సామీ భాషా సాహిత్యములు :- అ స్సా ము నందు అనేక అనాగరకజాతులకు చెందిన భాషలు వ్యవహారమున గలవు. ఈ ముఖ్యకారణమునుబట్టి దానికి 'భాషా శాస్త్రజ్ఞుల స్వర్గము' అను పేరు వచ్చెను. 'అసామియా' (అస్సామీ భాష) అనునది అస్సామునందలి ముఖ్యభాష. దేశమునందలి ఈభాగమునకుగల 'అస్సాము' అను ప్రాచీన నామమునుబట్టి ఆభాష కీ పేరు కలిగినది. అస్సామునకు, కామరూపము, ప్రాగ్జ్యోతిషము అనునవి ప్రాచీనతరము లయిన పేళ్ళు. అస్సామియా అనునది సంపూర్ణవికాసము నొందిన అర్వాచీనమైన ఇండో-ఆర్యను భాష. అది మాగధి అను అపభ్రంశము (భాషా విశేషము) నుండి పుట్టియుండవచ్చును. అందలి వ్యాకరణమునందును, పదములందును టిబెట్టు భాష యొక్కయు, బర్మాభాషయొక్కయు ప్రభావము విశేషముగా గోచరించును. అందలి పదజాలమున స్వల్పముగా ఆస్ట్రికు భాషాసంబంధము కూడ కలదు. క్రీ. శ. 7వ శతాబ్ది యొక్క పూర్వార్థమునాటికే కామరూప రాజగు భాస్కరవర్మ యొక్క ముఖ్యపట్టణమును యువాన్ ఛాంగు దర్శించెను. అక్కాలమున అచ్చటి భాష మధ్య భారతమునందలి భాషకంటే కొంచెము భిన్నముగా, అనగా, అప్పటి ఆర్య - టిబెట్టు - బర్మాభాషల యొక్క మిశ్రముగా - అతనికి గోచరించెను.

క్రీ. శ. 8.10 శతాబ్దులలో ఇరువది ముగ్గురు సిద్ధపురుషులు 'చర్యా' లేక 'చర్యాపదములు' అను గూఢతత్త్వ బోధకము అయిన గేయములను వ్రాసిరి. ఆ గేయము లందు సహజయానమునకు సంబంధించిన గూఢతత్వములును, శృంగార సంప్రదాయములును ముఖ్యవిషయముగా ప్రతిపాదింపబడినవి. అవి మొత్తముమీద ప్రాగ్భారతమునకు చెందినవై యున్నవి. ఈ చర్యాపదములకు గాని, చర్యాపదములను వ్రాసిన కవులకుగాని బౌద్ధమతము యొక్క గూఢతత్వమునకు కేంద్రమై పర్తిల్లిన కామరూపముతో సంబంధము ఊహింపబడు చున్నది.

అస్సామీ సాహిత్యయుగము ప్రశస్తమైన పద్య వాఙ్మ యోత్పత్తితో ప్రస్ఫుటముగా బయలు వెడలెను. దాని కాధారములు భారతీయములై సుప్రసిద్ధములైన రెండు వీర కావ్యములును, పురాణములునై యున్నవి. 'మాధవ కందళి' (క్రీ. శ. 1400) అను నాతడు ఆయుగమునందలి కవులలో మిక్కిలి యెన్నదగిన వాడు. అతడు శ్రీమద్రామాయణాంతర్గతము లయిన మధ్యకాండము లైదింటిని సజీవమును, సహజమునైన అస్సామీ భాషలో పద్యరూపముగా అనువదించెను. హరివరవిప్రుడు, హేమసరస్వతి అను నిరువురు కవులును రాజగు దుర్లభనారాయణుని (క్రీ.శ.1300) కి సమకాలికులు. దుర్లభనారాయణుని కొడుకగు ఇంద్రనారాయణుడు పరిపాలించు కాలమున “కవి రత్న సరస్వతి” కావ్యరచన యొనర్చెను. 'రుద్రకందళి' అను మరియొకకవి 'ఈ యుగమునకు చెందిన తామ్రధ్వజుడను నింకొకరాజును పేర్కొనెను. 'హరివరుడు' ఈ యుగమునందలి ఉత్తమకవులలో రెండవస్థానము నాక్రమించినవాడు. జై మినీయ- అశ్వమేధ పర్వమున వర్ణింపబడిన శ్రీరామునకు కుశలవులతోను, అర్జునునకు తన కుమారుడయిన బభ్రువాహనునితోను, ప్రవర్తిల్లిన యుద్ధముల వృత్తాంతమును అతడు పునఃకథన మొనర్చెను. 'హేమసరస్వతి' వామనపురాణమునందలి ప్రహ్లాద హిర ణ్యకశిపులు కథను నూరు పద్యములుగా అనువదించెను. అనేక పురాణములు ఆధారముగా రచితమైన 'హర గౌరీ సంవాదము' అను రెండవ గ్రంథముకూడ అతని రచనగానే ఊహింపబడు చున్నది. కవిరత్న సరస్వతీ రుద్రకందళులు మహాభారత - ద్రోణపర్వమునగల జయ ద్రధవధ అనెడి పర్వమునకు సంబంధించిన స్వల్ప భాగములను ఆస్సామీ పద్య కావ్యముగా కూర్చిరి.

క్రీ. శ. పదునేనవ శతాబ్ది యొక్క అంతమందు శంకర దేవుని అభినవ వైష్ణవోద్యమ (1449-1568) రూపమున దేశమున నొక మహాశక్తితోగూడిన (మత) పునరుద్ధరణము ఆరంభమయ్యెను. ఇ య్యుద్యమముతో సంబంధము లేని మంకరుడు, దుర్గావరకాయస్థుడు, పీతాంబరుడు' అను ముగ్గురు కవులు పదునారవ శతాబ్ది ప్రథమ భాగమున తమ రచనలు కావించిరి. వారిలో మంకరకవి దుర్గావరకవి- ఇరువురును 'మనసా' అను పేరుగల సర్ప దేవత యొక్క ఆరాధనమునకు సంబంధించిన యొక నూతన మతసిద్ధాంతమును ప్రతిపాదించు నిమిత్తమై అస్సామీ భాషలో నొక గేయకావ్య పరంపరను వ్రాసి, తన్మూలమున నొక నూతన పురాణమును సృజియింప యత్నించిరి. దుర్గావరకవి రామాయణమునందలి కరుణ రసాత్మకములయిన ఘట్టములను ఎడ నెడ సాధారణ పద్యములతో మేళవించుచు, నొక చిన్న కీర్తనావళిగా రచించెను. పీతాంబరకవియు ఈ రచనా విధానము ననుసరించి, ఉషా పరిణయము, భాగవత దశమస్కంధము చండీ-ఆఖ్యానము అను గ్రంథములను వ్రాసెను. ముగ్గురు కవుల గ్రంథములకును, వారి సమకాలికులగు ఇతర వైష్ణవకవుల గ్రంథములకును రూపమునందును,విషయమునందును భేదముకలదు. పొచాలి లేక పొంచాలి అనబడేడి ఈ (రచనా) రూపము అనాడు వంగదేశము నందు సర్వసాధారణ మయిన రీతియై యుండెను. ఆనాటి (కావ్య) విషయము బుద్ధికికంటె ఇంద్రియములకే ఎక్కుడు ప్రీతికరమయినదై ఉండెను.

శంకరదేవకవి ప్రతిపాదించిన నూతన వైష్ణవ సంప్రదాయమునందలి ముఖ్యసిద్ధాంతము అద్వైతతత్త్వము. ఈ సంప్రదాయమునకు చెందిన భక్తులు విష్ణు - కృష్ణుని నామమును లో నావృత్తిచేయుట (జపించుట), ఆతని నామములను ఉచ్చరించుట, లేక అతని దివ్యలీలలను గాన మొనర్చుట, ఆ భగవంతుని చేరుటకు ముఖ్యమార్గములని విశ్వసించిరి. దీనికి 'ఏకశరణ నామధర్మము' అని పేరు. ఈ మతము ఏకేశ్వరోపాసనమునే విధించి, తదనుయాయులు ఇతర దేవతారాధనమును చేయగూడదని నిషేధించును. ఈ వైష్ణవ సంప్రదాయము రాధాకృష్ణమత సంప్రదాయముతో నేకీభవింపదు. ఈ యుద్యమము దానితోబా టొక సారస్వత విప్లవమునుగూడ కల్గించెను. శంకరదేవ కవియు, అతని ప్రియశిష్యుడును, మాధవదేవ కవియు అనేకములయిన కీర్తనములను, రూపకములను, పద్యకథలను తదితర సారస్వత ప్రక్రియలను రచించిరి. ఈ సాహిత్యయుగము ఏకమతగ్రంథ యుగము అనగా భాగవతయుగము; ఏక దేవయుగము అనగా విష్ణు-కృష్ణ యుగము అని పేర్లు. శంకరదేవకవి భాగవత పురాణము నందలి పండ్రెండుస్కంధములలో ఎనిమిది స్కంధములను అనువదించినట్లు తెలియుచున్నది. ఆ పురాణము నందలి శేషించిన స్కంధములను అనువదించుట కయి ఇతనిచే నితర విద్వాంసులు ప్రోత్సహింపబడిరి. శంకరదేవకవి కృతులలో అత్యుత్తమ రచనయైన 'కీర్తనఘోష' అను గ్రంథము భాగవతసారరూప మనవచ్చును. శంకరదేవకవి భాష చాలవరకు సరళమైనది. అందలి స్వరమాధురిలో సౌందర్య గాంభీర్యములు రెండును ప్రవ్యక్తము లగు చుండును.

వరగీతములు (Bargitas) అను అనేక కీర్తనములను, పత్నీప్రసాదము. కాళీదమనము, కేళీ గోపాలము, రుక్మిణీ హరణము, పారిజాతహరణము, రామవిజయము, అను నాటకములను రచించుపట్ల ఇతడు సృజనాత్మక ప్రతిభతోను, ధైర్యముతోను భాష యొక్క పరిధిని విస్తృత మొనర్చి 'ప్రజబులి' భాషయందు నూతనమైన జాతీయ (idiom) ప్రయోగ సంప్రదాయమును కల్పించెను.

మాధవదేవకవి వరగీతములను 'చోరధరా' 'పింప రాగుఛువా' మున్నగు నాటకములను వ్రాసెను. వాటి యందు అతని గురువు యొక్క కృతులందుకంటే ఎక్కుడు కోమలమైన శిల్ప కౌశలము కనిపించును. శంకరదేవకవి కృతులందు దాస్య భావము ప్రవ్య క్తమగుచుండ, మాధవ దేవకవి రచనలందు వాత్సల్యము అతిశయించును, మాధవదేవకవి శ్రీకృష్ణుని బాల్య క్రీడలను అమితోత్సాహముతో వర్ణించెను. బాలకృష్ణదేవుడు తన తల్లియగు యశోదకును, బృందావనమునందలి గోపికలకును ప్రదర్శించిన లీలలును, అతడు వారి ఆజ్ఞకు బద్ధుడగుటయు ఆ కవికి అనిర్వాచ్యమైన ఆశ్చర్యమును కలిగించెను. 'నామఘోషా' అనునది ఆతడు రచించిన మహోత్కృష్టమైన కావ్యము. అందాతని ఉత్తమ భక్తియు, తత్వజ్ఞతయు తేటపడుచున్నవి.

శంకరదేవ కవికి సమకాలికులయిన మరి యిరువురు ప్రముఖ కవులు కలరు. వారు అనంత కందళి, రామ సరస్వతి అనువారలు. వారిలో మొదటికవి వైష్ణవ గుర్వా దేశమును పురస్కరించుకొని భాగవతము యొక్క ఉత్తరార్థమునందలి దశమస్కంధమును అనువదించెను. రెండవకవి వినమ్రతతో ఆ సాధువునకు అనుయాయియై అతని నుపాసించెను. కందళికవి రచించిన 'కుమార హరణము' లోక ప్రసిద్ధమైనది. అందు ఉషానిరుద్ధుల ప్రణయకథ వర్ణితమైనది. అతడు భాగవతమునందలి అనేక స్కంధములను అనువదించెను. రామాయణమును స్వతంత్ర కావ్యముగా రచించెను. మాధవ కందళి కవి యొక్క భావాది చౌర్య మీతని కృతులందు కొంతవరకు కనుపించును. రామసరస్వతి కవి ప్రచురముగా మహా భారత విషయములను చేపట్టి వ్రాసెను. వాటిలో నతడు ముఖ్యముగా వనపర్వమును విపులముగా పెంచుచు కొన్ని విషాదాంత కావ్యములుగా రచించెను. (ఇట్టి రచనయందు అతనికి 'సాగర్' ఖరి' వంటి అనుయాయులు అనేకులు కలరు. సాగర్ ఖరి కవి 'ఖటాసుర వధ'ను వ్రాసెను.) సరస్వతీకవి 'భీమ చరితము, అను మృదుహాస్య భరితమైన కావ్యమును రచించెను, శ్రీధర కందళికవి రచించిన 'కాన్ భొవా' (కర్ణభక్షకుడు) అను రచన మరియొక రమ్యమై హాస్యరస విశిష్టమైన కావ్యము. ఇక్కవి ఘును (గుండి) చా= యాత్రా అను కావ్యమును కూడ నిర్మించెను.

గోపీనాథ పాఠకకవి (క్రీ. శ. 17 వ శతాబ్ది ప్రారంభము), దామోదర దాసకవి, లక్ష్మీనాథ ద్విజకవి, పృథురామ ద్విజకవి మున్నగు నితర రచయితలు మహాభారత భాగములను పద్యరూపమున అస్సామీ భాషలోనికి అనువదింప గడగిరి. హృదయానంద కాయస్థ కవియు తదితరులయిన అప్రధానకవులును రామాయణ భాగములను భాషాంతరీకరించిరి. 19 వ. శతాబ్ది యొక్క ఆదియందు శ్రీకంఠ సూర్య విప్రకవి, హిందీభాషలోని తులసీదాసు యొక్క 'రామచరిత మానస' మను గ్రంథమును పద్య కావ్యముగా అస్సామీ భాషలో వ్రాసెను. గోవింద మిశ్రుడు, రత్నాకర మిశ్రుడు, భగవద్గీతను అత్యంత సామర్థ్యముతో పద్యరూపమున రచించిరి. గోపాల చరణ ద్విజుడు (క్రీ. శ. 16. వ. శతాబ్ది), భవానంద మిశ్రుడు (క్రీ. శ. 16 వ. శతాబ్ది), విద్యాచంద్ర భట్టాచార్యుడు (18 వ. శతాబ్ది) అను కవులు హరివంశమును చక్కగా అనుసరించి వ్రాసిరి. పిదప పురాణములు అనేక పద్య రచయితల దృష్టి నాకర్షించెను. కాని అత్యుత్తమకవులు తమ దృష్టిని భాగవతపురాణముపై ప్రసరింపజేసి రని చెప్పవచ్చును. శంకరదేవకవి, అనంతకందళికవి, అనిరుద్ధ

కాయస్థకవి, కేశవదాస కాయస్థ కవి, నిత్యానంద కాయస్థ కవి (క్రీ. శ. 17 వ శతాబ్ది), తదితరులును భాగవత పురాణ రచనా నిమగ్నులైరి. ఇతర పురాణములను అనువదించిన వారును, అనుసరించి వ్రాసిన వారును ఈ క్రింద పేర్కొనబడు చున్నారు. విష్ణుపురాణమును భాగవత మిశ్రుడును (క్రీ. శ. 17 వ శతాబ్ది); బృహన్నారదీయ పురాణమును భువనేశ్వర వాచస్పతి మిశ్రుడును (క్రీ. శ. 18 వ శతాబ్ది ఆదియందు): ధర్మపురాణమును కవిచంద్రద్విజుడును (క్రీ. శ. 18 వ శతాబ్ది); బ్రహ్మ వైవర్తపురాణమును బలరామద్విజ- దుర్గేశద్విజులును(క్రీ. శ. 18 వ శతాబ్ది); మార్కండేయ పురాణమును రుచినాథ కందళియు (కీ. శ. 18 వ శతాబ్ది), రంగనాథ చక్రవర్తియు (క్రీ.శ. 17 వ శతాబ్ది) వ్రాసిరి.

ప్రాచీనమైన అస్సామీ సాహిత్యమునందు పెక్కు పద్యకథా కావ్యములు (Verse Romances) ను కలవు. కలాప చంద్ర కృతమైన 'రాధా చరితము,' రామద్విజ కవి రచితమైన మృగావతీ చరితము, ద్విజవర ప్రణీతమైన మాధవసులోచనో పాఖ్యానము, ప్రకృతమునకు ఉదాహరణములు. సంచారకవియగు రాజసూర్య విప్ర కృతమైన శియాల్ గోసాయీ (The fox-Saint C 1616) అనునది ఒక అద్వితీయమైన పద్యకథా కావ్యము. రామానందద్విజకవి వ్రాసిన మహామోహకావ్యము కృష్ణ మిశ్రుని ప్రసిద్ధమైన ప్రబోధ చంద్రోదయము నాధారముగా చేసికొని వ్రాయబడినది. హితోపదేశమును. 'ద్వాత్రింశత్పుత్తళిక'ను రామమిశ్రకవి అనువదించెను. (1654-63)

శంకరదేవుడును, మాధవదేవుడును రచించిన వర గీతములను అస్ఫామునగల వైష్ణవ మహంతులు ఆనేకులు అనుకరించిరి. ఇట్టి అనుకరణమునందు గోపాలదేవుడు, అనిరుద్ధుడు, శ్రీరాముడు, యదుమణి, రామానందుడు. అను కవులు కొంత విశిష్టతను గాంచిరి. ఈ కృష్ణగీతములకు 18 వ శతాబ్ది ఆరంభమున రచితములైన శాక్త గేయములును, రాధాకృష్ణ గేయములును చేరినవి. ఈ గేయములను రుద్రసింహుడు (క్రీ.శ. 1696-1714), శివసింహుడు (క్రీ. శ. 1714- 44) అను రాజులును, వారి రాజ్య కాలములందున్న కవులును వ్రాసిరి. అట్టి కవులలో విఖ్యాతుడు రామనారాయణకవిరాజ చక్రవర్తి, అతడు గీతగోవిందమును, బ్రహ్మవైవర్త పురాణమునందలి కృష్ణజన్మ ఖండమును, పురాణాంతర్గత మేయైన ప్రకృతిఖండమునందలి తులసీ - శంఖచూడ ఉపాఖ్యానమును అనువదించెను. అతడు శాకుంతల కావ్యమును కూడ వ్రాసెను. రామచంద్రవర పాత్రుడు అను రాజకీయోద్యోగి యోగినీ తంత్రమును కొంతవరకు అనువదించెను. ఆనందలహరిని అనంతాచార్యుడు అస్సామీ పద్య కావ్యముగా వ్రాసెను. 'మనసా' అను సర్పదేవత యొక్క పూజావిధానము నారాయణదేవుడు రచించిన పద్మపురాణమునందు ప్రశంసింపబడినది. శంకరదేవ కవియొక్క శైలిని మహాదేవకవియొక్క శైలిని, పురస్కరించుకొని వైష్ణవ సంస్థలకు చెందిన పెక్కురు ఉత్తమ పురోహితులు రూపకములను రచించిరి.

దైత్యారిభూషణుడు, వైకుంఠుడు అను కవులు జీవిత చరిత్ర రచనకు ఆరంభకులు. వారందరును శంకర దేవకవియొక్క జీవిత చరిత్రలు రచించిరి. పిమ్మట వచ్చిన కవులు ఆ యాచారమును పాలించిరి. సూర్యఖరి దైవజ్ఞుడును (క్రీ. శ. 1798), రతీకాంతుడును (క్రీ.శ 18 వ శతాబ్ది) తదితరులును అస్సామీయులయిన కోచిరాజుల వృత్తాంతములను పద్యకావ్యములుగా వ్రాసిరి, 19 వ శతాబ్దియందుకూడ "విశ్వేశ్వరుడు, దుతీరాముడు అను నిరువురు కవులు పద్య రూపమున 'ఆహోమరాజ్య పతన చరిత్ర'ను రచించిరి. వ్యావహారిక (useful) కళలను గూర్చి వ్రాయుటకుకూడ పద్యమే ఉపయోగింపబడెను. వకుళ కాయస్థకవి వ్రాసిన కితాబత్ - మంజరి (క్రీ. శ. 1434 సం.) ఇందుల కుదాహరణము. అందు గణితము, ఆయవ్యయ లేఖనము (Book keeping), క్షేత్ర పరిమాపనము (Land Survey) వివరింప బడినవి.

అస్సామీ వచనకావ్యము ప్రజలమైన సంప్రదాయము కలది. ఆ వచనమునకు శంకరదేవుడు, మాధవదేవుడు రచించిన రూపకములు ముఖ్యోదాహరణములు. అవి ప్రజబులి భాషాసంప్రదాయానుసారముగా వ్రాయబడినవి. వైకుంఠ నాథకవి (క్రీ.శ. 1588-1638) భాగవతమును, భగవద్గీతను ప్రౌఢమయిన వచనములో అనువదించెను, వాటిలో నతడు ప్రాచీన కవుల కృతక శైలిని వాక్యప్రక్రియలను అనుసరిం చెను.ఆ కాలమునందే గోపాలచంద్రు డను కవివర్యుడు శంకరదేవకవి రచించిన భక్తి రత్నాకరము అను సంస్కృత గ్రంథమును అతి రమ్యమయిన వచన శైలిలో అనువాద మొనర్చెను. రఘునాథమహంతకృతమయిన (క్రీ.శ. 1658) కథా రామాయణము; పద్మపురాణము; క్రియాయోగసారము(కవి పేరు తెలియదు); కృష్ణానందుని సాత్వతతంత్రము, కథా ఘోష - ఇవి అనంతర శతాబ్దులలో పుట్టిన మత విషయకము లయిన ప్రాచీన వచన కావ్యములు.

వైష్ణవ గురు చరితములయందును బురంజీ (Buranji) అను పేరుగల ఆహోమరాజ్య చరితములయందును, నిత్య వ్యవహారమునగల వచనము ఉపయోగింపబడినది. 17వ శతాబ్దియొక్క అంత్యభాగమునుండి ఈ రెండురకముల వచన వాఙ్మయములు ఎడతెగకుండ పెంపొందినట్లు కనిపించును. పురణి, అసమ, బురంజీ అనుగ్రంథములకు సంపాదకుడు గోస్వామి (క్రీ. శ. 1922). అసమ బురంజీ అనుకృతికి సంపాదకుడు డాక్టరు భూయాన్ (క్రీ.శ. 1945) అనునాతడు. కథాగురుచరితమునకు ప్రకాశకుడు లేఖరు (క్రీ. శ. 1952) అనునాతడు. ఈ కృతులు రచనా సౌందర్యమును బట్టియు; విషయ ప్రతిపాదనమును బట్టియు తొలుదొల్త రచింపబడిన చరిత్ర. బురంజీ వచన కావ్యములకు ఉత్తమ నిదర్శనములు. ఈ రీతిగల చరిత్ర రచనము 19 వ శతాబ్ది ఆరంభమువరకును కొనసాగు చుండెను. ఈ కాలమున కాశీనాథ ఫుకన్ కవియు, మణిరామ, దివాన్ బారువా హరకాంతబారువా అనువారు అస్సామీ చరిత్ర గ్రంథములను సంకలన మొనర్చిరి.

వ్యావహారిక కళలను గూర్చిన గ్రంథములందు కూడ ఈ నూత్న వచనరీతి ఉపయోగింపబడెను. సుకుమార బరకాథు అను కవి వ్రాసిన హ స్తివిద్యార్ణవము (క్రీ.శ. 1734 - ఇది ఏనుగులనుగూర్చి తెలుపు గ్రంథము. దీనికి మూలమొక సంస్కృత కృతి); అశ్వచికిత్సను బోధించు ఘోరా. నిదానము (ఘోటక నిదానము) అను గ్రంథము; గణితమును ప్రతిపాదించు నట్టి కాశీనాథక విరచితమైన అంకర్ ఆర్యా అను గ్రంథము=ఇవి ఈ జాతికి చెందిన వచన కావ్యములు. ఈ కాలమునకు చెందిన మరియొక ప్రసిద్ధమైన గ్రంథముకూడ కలదు. అది శుభంకరకవి వ్రాసిన 'హస్తముక్తావళి' కి అనువాదరూపమునను వ్యాఖ్యాన రూపమునను ఉన్నది.

ఆధునిక యుగము: క్రీ. శ. 1926వ సంవత్సరము నందు జరిగిన యాండాబు (yandabu) సంధి ననుసరించి అస్సాము బ్రిటిషు రాజ్యములో కలుపుకొనబడెను. పిదప పాతిక సంవత్సరములవరకు అస్సాము పెక్కు ఆపత్తులకు గురియయ్యెను. క్రీ.శ.1836 వ సంవత్సరమున విద్యాలయములలోను, న్యాయస్థానములందును వంగ భాష అస్సామీ భాష యొక్క స్థానము నాక్రమించెను. కాని ఆ శతాబ్ది మధ్యభాగములో జాతీయతాభిమానము నిద్రనుండి మేల్కొని గర్జింపదొడగెను. అమెరికను బాప్టిస్టు మిషనరీలు అస్సామీభాషయందును, అస్సామీ భాష పైనను గ్రంథములను ప్రచురించి, జాతీయ చైతన్యమునకు నూతన ప్రాబల్యము చేకూర్చిరి. కాశీనాథఫుకన్ రచించిన చరిత్ర (క్రీ.శ. 1844) యు; రెవరెండునాథను బ్రౌను వ్రాసిన అస్సామీ భాషావ్యాకరణ వ్యాసములును (క్రీ.శ. 1844); డాక్టరు మైల్సు బ్రాన్సను యొక్క అస్సామీ నిఘంటువును (1867), ఆనాటి మిషనరీ ప్రచురణములకు ఉదాహరణములు. క్రీ. శ. 1813 వ సంవత్సరము నాటికే వంగదేశమునందలి శ్రీరామపురమున నున్న మిషనరీలు అస్సామీ భాషలో బైబిలును ప్రకటించిరి. క్రీ శ. 1846 వ వత్సరమునందు బాప్టిస్టులు'అరుణోదయ' అను మాసిక పత్రికను వెలువరించిరి. అస్సామీ భాషలోనికి ఆధునిక శైలి ప్రవేశించుట కీపత్రికయే ముఖ్యకారణ మయ్యెను. ఆనందరామ ఫుకను అనునాతని యొక్కయు, ఈ మిషనరీల యొక్కయు ప్రయత్నములే ముఖ్యముగా క్రీ. శ. 1872 వ సంవత్సరమున అస్సామీ భాషకు రాజకీయ గౌరవము తిరిగి లభించుటకు కారణములయ్యెను. అందుచే ఈ కాలమున వొక సారస్వతోజ్జీవనము మొదలయ్యెను.

హేఘచంద్రబారువా అనునతడు అర్వాచీనమయిన అస్సామీసారస్వతమునకు ఆద్యుడగు కవివర్యుడు. అతడు వ్యాకరణములను, నిఘంటువులను రచించి తన్మూలమున అస్సామీ భాషకు ప్రామాణికత్వమును స్థిరపరచెను. అతడు అవహేళనాత్మకమయిన (Satires) బాహిరి రంగ్ చంగ్ భితరి కొవా భాతురీ అను వ్యాసమును(1861), కానీయా - కీర్తన అను నాటికను రచించి సంఘమునందుగల దురాచారములను రూపుమాపుటకు ప్రయత్నించెను. ఆధునిక సాహిత్యమున మొట్టమొదటగా చరిత్రను, జీవిత చరిత్రను వ్రాసినకవి గుణాభిరామ బారువా అను నాతడు, రమాకాంత చౌధురీ తన అభిమన్యువధ (క్రీ. శ. 1875) అను కావ్యమునను, భోలానాథదాసు అను కవి తన సీతాహరణ కావ్యమునందును, (క్రీ.శ.1888) మొదటిసారిగా ప్రాసరహితమయిన పద్యరచన (Blank verse) నవలంబించిరి.

లక్ష్మీనాథబారువా అను కవి ఆధునికమైన అస్సామీ వాఙ్మయమునందు మిక్కిలి గొప్ప వ్యక్తి. అతడు క్రీ.శ. 1889 వ సంవత్సరమున తన మిత్రులయిన చంద్రకుమార అగర్ వాలా, హేమచంద్ర గోస్వామి అనువారి సహకారముతో 'జోనాకీ' అను నొక సంచికను ఆరంభించేను. అతడు హేమచంద్రబారువా యొక్క శైలికి సంపూర్ణతను గూర్చి అద్దానిని వివిధములును, ఆధునికములు అయిన అస్సామీసాహిత్యప్రక్రియలను రచించుటకు ముఖ్యసాధనముగా నొనర్చెను. అతడు రచించిన సాంఘికములును, రాజకీయములును, సారస్వత విషయకములును అయిన అవహేళనాత్మక కావ్యములందు హేమచంద్రకవి ప్రభావము ప్రస్ఫుటముగా కనిపించును. అతడు రచించిన కథానికలందును, నాటకములందును, ప్రహసనములందును, నవలలయందును ముఖ్యముగా అస్సామీ పాత్రలే వర్ణితములగుట ప్రీతిని గొలుపుచుండును. బజ్ వరువా, గోస్వామి, అగర్వాలా అను కవులు 19 వ శతాబ్ది ప్రారంభములో ఆంగ్లేయ సారస్వతము నందు వెలసిన కాల్పనిక తాభిరుచిని (Romanticism) అస్సామీ కావ్య రచనయందు ప్రవేశ పెట్టిరి. ఇప్పటి కావ్యములందు లౌకికత కంటే ఆత్మాశ్రయత అధికమయ్యెను. కావ్య విషయము మిక్కిలి విస్తృతమయ్యెను. సో నెట్సు (Sonnets) (పదునాలుగు పాదములు గల వృత్తము) మొట్టమొదట వ్రాసినవాడు గోస్వామియే, కాని తరువాతి కాలములో అతడు దేశమునందలి పురాతన వస్తుపరిశీలనమునందు నిమగ్నుడయ్యెను. ఆగర్ వాలా రచించిన కావ్యములందు ఆదర్శకత్వము అను గుణము అత్యంత ప్రస్ఫుటముగా గోచరించును. కమలా కాంత భట్టాచార్యుని అపరిణతము అయిన పద్య కావ్యముల యందును, ప్రౌఢములయిన వచన కావ్యములయందును, దేశభ క్తియు, బుద్ధి వైభవమును ముఖ్య గుణములుగా భాసిల్లెను. పద్మనాథ గోహై బారువా అను ప్రఖ్యాతకవి చరిత్రాత్మకములైన నాటకములను, నవలలను సృజించుటయందు విజయము గాంచెను. కవితావిశారదుడగు నతడు స్వీయ విషయములను కథాత్మక కావ్యములుగ వర్ణించెను. పిదప నతడు తన జీవిత శేషమును మత విషయక గ్రంథములను నిష్ఠతో వ్రాయుటకు వినియోగించెను. మరియు నీతడు వచన రచనయం దొక ప్రత్యేకతను గడించెను. లంబోదరవరా, సత్యనాధవరా అనువారిరువురును వచన రచనయందు వైశిష్ట్యమును సంపాదించినవారే, వారిలో సత్యనాధవరా తన రచనలలో కొన్నింటికి బేకన్ కవి వ్యాసములను ఒరవడిగా గ్రహించెను, రజనీకాంత – వరద లై అనునాతడు చరిత్రాత్మకములును కల్పనాత్మకములైన తన నవలలయందు స్కాటు కవిని బంకించంద్ర ఛటోపాధ్యాయుని మించుటకై యత్నించెను. హితేశ్వర్ బర్ బారువా అనునతడు కథా కావ్య రచనయందు వాసి గాంచినాడు. దుర్గేశ్వరశర్మ సహజమును కావ్యోచితమునైన భాష నుపయోగించుట యందు విశిష్టతను గన్నవాడు.

ఇరువదియవ శతాబ్దియందలి రచయితలు ముఖ్యముగా 'జోనాకీ' (అను సంచిక) యొక్క ఆదర్శములను అనుసరింప యత్నించిరి. వాహి (Bahi) అను పేరుగల బజ్ వరువా యొక్క మాస సంచిక వాఙ్మయరంగమున క్రొత్త రచయితలను ప్రవేశ పెట్టుటకును, వారిని సరిదిద్దుటకును ముఖ్యసాధన మయ్యెను. రఘునాథ చౌధురీ అను కవి పక్షులను గురించి వ్రాసిన కావ్యములు అసాధారణ కళాకౌశల్యమున పరాకాష్ఠ నొందెను. వాటియం దాతడు ప్రకృత్యారాధనమును సంకీర్తించెను. అంబికాగిరి, రే, చౌధురి రచించిన కావ్యములయందు గూఢ ప్రేమతత్త్వము, జీవితము యొక్క దుర్దాంతమైన శక్తి సంపద, ఉత్కటమైన దేశభక్తి, వాటి దశాంతరములు అను లక్షణములు లక్షితములయ్యెను. జితీంద్ర నాథుదువరా అను కవి రమ్యము అయిన గేయములను రచించెను. వాటియందు నిరంతర శోక భావ మొకటి వ్యాప్తమై కన్పడును. అతడు భిన్న దేశములలో భిన్న కాలములలో ప్రవర్తిల్లిన కవితారచనలయందలి అందచందములను తనలో జీర్ణించుకొని వాటిని విన్యాస విశేషములచే నవ్యములుగా చిత్రింపగల్గిన సునిశిత బుద్ధి వైభవముకల కవివర్యుడు. ఇతని 'ఓమర్ తీర్థ ' అను గ్రంథము ఉమర్ ఖయ్యామునకు వివరణాత్మకమైన అనువాదము. సూర్యకుమారభూయా, రత్న కాంతవర కాకతీ, లక్ష్మీనాథఫుకను, తైలధవరాజ్ ఖొవా, నళినీబాలా దేవి అను కవుల గేయములు రూపమునందును, విషయమందును ప్రత్యేక గుణవిశేషములు కలవి. డింబేశ్వర నియోగ్, బినందచంద్రబారువా, అతుల్ చంద్ర హాజరికా, దైవచంద్ర తాలూక్ దార్ అను నుత్తమకవుల బృందము 1920 ప్రాంతమున వెలసెను. 1930 వ సంవత్సర ప్రాంతమున వెలసిన కవులలో నెల్ల దేవకాంత బారువా అనునాతడు అత్యుత్తముడు. ఆతని ప్రణయ కావ్యములందు నూతనమైన మీమాంస, విషయ నవ్యత గోచరించును. గణేశచంద్ర గోగోయి ప్రణీతములయిన ప్రేమగీతములలో హృదయమార్దవము, దుఃఖాత్మత ప్రవ్యక్తము లగును. విస్తరఖీతిచేత ఈ యుగమునకు చెందిన ఇతరకవులలో, చంద్రధర బారువా, పద్మధర చలిహా, నీలమణిపుకను, ఉమేశచంద్ర చౌధురీ, కమలేశ్వర చలిహా అను కవుల పేళ్ళు మాత్రమే పేర్కొనబడినవి.

నాటక క్షేత్రమునందు అతులచంద్ర హాజరికా అను కవి బహుగ్రంథకర్తయై విలసిల్లెను. జ్యోతిప్రసాద అగర్వాలా అనుకవి పౌరాణికమైన శోణితకుంవరీ, అను నాటకమును, చారిత్రకము. సాంఘికముకూడ నగు 'కారేంగర్ లిగిరి' అను నాటకమును రచించెను. అవి లక్షణమునందును కళాశిల్ప విషయకముగాను, పరాకాష్ఠ నొందిన నాటకములు, మిత్రదేవ మహాంత, ఇంద్రేశ్వర్ బర్ ఠాకూరు, నకులచంద్ర భూయా ప్రసన్నలాల్ చౌధురీ అను నాటక రచయితలును, తదితరులును అస్సాము నందలి కళాభిమానయుతములైన (Amateur) నాటకశాలల యొక్క ఉపయోగార్ధమై విరివిగా నాటకరచనను సాగించిరి. అస్సామీ నవలారచన ఎక్కుడు ఫలప్రదమైనది కాలేదు. దండివాధ కవితా, దైవచంద్ర తాలూక్ దార్ మున్నగువారు నవలారచయితలలో పేర్కొనదగినవారు.

ఇయ్యుగమున కథానికా (Short Story) రచనము విశేషముగా పెంపొందెను. శరచ్చంద్ర గోస్వామి నిరంతర శ్రద్ధతో నీవాఙ్మయ ప్రక్రియ నారాధించెను. 1930 వ సంవత్సర ప్రాంతమున ఉత్తమకథకు లనేకులు బయలుదేరిరి. మహిచంద్రవరా, హలిరామడేకా అను కవులు హాస్యరస విశిష్టములును, అవహేళనాత్మకములును అయిన కథలను రచించిరి. బిణా బారువా, రమాదాసు, మునీన్ బర్కటకీ, కృష్ణభూయా. నగేంద్ర నారాయణ చౌధురీ, త్రైలోక్యనాధ గోస్వామి అను వారు కథారచనయందు ప్రసిద్ధినొందిన మరికొందరు. లక్ష్మీధర శర్మ వ్రాసిన కథలలో వివేక గాంభీర్యము, అసాధారణ భాషాపటిమ తేటపడును. అబ్దుల్ మాలిక్ అనునతడుతన కృతులందు ప్రవ్యక్త ములయియున్న బీద వారియందలి సానుభూతి, అనర్గళ భాషా విభుత్వము అను గుణములచే అత్యంత సమర్థుడగు కథకుడుగా గణుతికెక్కెను.

లక్ష్మీనాథ బజ్ బారువా అను కవి రచించిన సారస్వత వ్యాసములకు పిదప చిత్ర సేన జఖరియా అనునాతడు సుబోధ మగు వ్యాసగుచ్ఛమును వ్రాసెను. తరుణరామ్ పుకను అనుకవి వేటను గూర్చి వ్రాసిన కథలు రమ్యమయిన ధారాశుద్ధితో నలరారుచున్నవి. సూర్య కుమార భూయా, సోణారామ, చౌధురీ, ఆనంద చంద్ర ఆగర్వాలా మున్నగు రచయితలు విశిష్టములైన పెక్కు వ్యాసములను వివిధములయిన పత్రికలలో ప్రచురించిరి. వాణీకాంత కాకతికవి ప్రాచీనమును, అర్వాచీనము నయిన అస్సామీసారస్వతమును ఆధునిక విమర్శనదృష్టితో పరామర్శించెను. విరించికుమార్ బారువా, ఉపేంద్ర చంద్రలేఖారు, తీర్థనాథశర్మ, మహేశ్వర్ నియోగ్ మొదలగు యువకవులు 1930-40 సారస్వత రంగమున కృషి చేయగడగిరి.

సుమారు 1940 వ సంవత్సర ప్రాంతమున నూతన విమర్శన దృష్టిగల క్రొత్తతరమునకు చెందిన కవులు అప్పటికి అమలులోనున్న సారస్వత నియమములపై తిరుగుబాటు కావించిరి. అప్పటికే కథానికారచన యందు మానసికవృత్తి పృథక్కరణమునకు (psycho-analysis) స్థానము లభించెను. స్వేచ్ఛా వృత్తములను అల్పసంఖ్యాకు లయిన కవులు వాడిరి. లక్ష్మీనాథ బజ బారువా రచించిన నూతనజీవిత చరిత్రయందు ఈ నూత్న విమర్శన దృక్పథము ప్రకాశము నొందెను.

ద్వితీయ ప్రపంచ సంగ్రామమువలన అస్సామీజనుల సుఖమయ జీవితమున నొక విలక్షణమయిన అలజడి కలిగెను. సారస్వతాభివృద్ధి కుంఠిత మయ్యెను. మరల ప్రచురింపబడదొడగిన పుస్తకముల యొక్కయు, పత్రికల యొక్కయు—— ధోరణినిబట్టి చూడ వాటి యందలి ప్రాచీన సారస్వత - ఆదర్శభంగము భయావహమయి కన్పట్టెను. కృశించిన అస్సామీ సారస్వతముపై దూరస్థములును, సమీపస్థములు నయిన అనేక సారస్వతముల యొక్క ప్రభావము పడుటచే నది మిక్కిలి వికృతి నొందెను. అట్టి వికృతి ముఖ్యముగా కవిత యందు గోచరించెను. ఈకవిత్వమును కవులు ఉత్సాహముతో జయప్రదముగా సాగించిరి. అమూల్య బారువా, నవకాంత బారువా, హేమ బారువా, హరివర కాకతి మున్నగు కవులు విశ్వవాఙ్మయము యొక్క భిన్న భిన్న ప్రక్రియలను సోత్సాహముగ ప్రచురింపదొడగిరి. ఈ కవి బృందములో నవకాంత బారువా అను కవి అత్యుత్తముడుగా ప్రశంసనొందెను. వీణా బారువా అనునతడు రచించిన జీవనర్ బాటాత్ అను రచనయు, రాధికా మోహన గోస్వామికృత మైన చాక నైయా అనుకృతియు, నవకాంతబారువా అను కవిచే రచింపబడిన కపిలి పరీయా సాధు అను రచనయు, అత్యుత్తమ నవలలుగా నెన్నదగి యున్నవి. మహమ్మదు పియారు మొదలగువారు చిన్న చిన్న నవలలను ప్రచురించిరి. కథానికా రచనము ఇప్పటికిని ప్రబలముగానున్నది. జోగేశ దాస ప్రభృతులు కథానికా రచనయందు కృతహస్తులైరి.

అస్సామీ వాఙ్మయమున ఏకాంకికా రచనమింకను పరిణతినొందియుండలేదు, కళాభిమానులయిన (Amateur) నటకులు దీనిని ప్రదర్శన యోగ్యముగా గ్రహించిరి. ఆలిండియా రేడియో గుహావాటి (Gauhati) వారొసగిన దోహదముచే 'ఏకాంకికా రచన పెంపొందుచున్నది. వీణాదేవి' రచించిన 'ఏబేలార్ నాట్' అనునది ఒక అత్యుత్తమ కృతియై యున్నది. అందు ఒక చిన్న సంఘటనము అనగా నొక మధ్యమతరగతి కుటుంబమునకు చెందిన రెండుతరముల వారికి ఘటిల్లిన భావసంఘర్షణము చక్కగా వివరింప బడినది.

అస్సామీ వాఙ్మయమునందలి జానపద కవితాసంపత్తి చెప్పదగినది. అది గుణముచేతను, విషయముచేతను వైవిధ్యము నొందినది. వనగీతములు, బిహుగీతములు, వివాహగీతములు, జోలపాటలు, బాలక్రీడా గీతములు, బారమాహీగీతములు, ద్వాదశమాసగీతములు, పడవ పాటలు మున్నగునవి ప్రకృతమునకు ఉదాహరణములు. అనేక జానపదకథలును కలవు ! వాటికి నడుమ నడుమ లలితములును కరుణ రసాత్మకములు నైన పాటలు ఇమిడియుండును. అస్సామీ వాఙ్మయమున వీరగీతములును పెక్కులు గలవు. చరిత్రాత్మక గీతములలో వదన -బరఫు కనరగీతము పేర్కొనదగినది (క్రీ. శ. 19-వ శతాబ్ది). అస్సామీ వాఙ్మయమున సారస్వత వ్యాసములను వ్రాసిన వారిలో మహేశ చంద్రదేవ గోస్వామియు,తదితరులైన యువకులు అనేకులును కలరు. ఈ వాఙ్మయమున సారస్వత విమర్శనముకూడ విశేషముగా పెంపొందినది. ఉపాధ్యాయ వృత్తికి చెందిన కొందరు విమర్శకులు ఆధునిక సమస్యలపై వ్రాయుటకు బదులుగా ప్రాత విషయములను గూర్చి మాత్రమే వ్రాసిరి. మొత్తము మీద ఆధునిక సారస్వత వాతావరణము సజీవముగా, వీర్యవంతముగా, ఆశాజనకముగా నున్నదని చెప్పనగును, {{right|డా. మ. ని.

[[వర్గం:]]