Jump to content

సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మొదటి సంపుటము/అరిస్టాటిల్ (4. సాహిత్య శాస్త్రము)

వికీసోర్స్ నుండి

అరిస్టాటిల్ (4. సాహిత్య శాస్త్రము) :- తక్కిన శాస్త్రములం దెంత ప్రామాణికముగా తన రచనలను సాగించెనో సాహిత్య శాస్త్రమునందును అంత ప్రామాణికముగా అరిస్టాటిల్ తన రచనను సాగించెను. శాస్త్రమునందు నేటికి మనకు నిలిచినవి అతని రచనలలో రెండు మాత్రమే. (1) పొయెటిక్స్ (Poetics); (2) రిటారిక్ (Rhetoric), మొదటి రచన ప్రధానముగా దుఃఖాంత నాటకములకు లక్షణ గ్రంథము ; కాని, ఆనుషంగికముగా మహాకావ్య, సుఖాంత నాట కాదులకుగూడ లక్షణములు చెప్పబడినవి. రెండవ రచన 'ఉపన్యాస' విధానమునకు, భాషా వైచిత్య్రములకు లక్షణగ్రంథము.

అరిస్టాటిల్ కు పూర్వము సాహిత్య చర్చను సోక్రటీస్, ప్లేటో మొదలగువారు చేసినారు. కాని ఒక క్రమపద్ధతిలో ప్రణాళికానిబద్ధముచేసి శాస్త్రీయముగా చర్చించిన ప్రథమ గౌరవము అరిస్టాటిల్ కే దక్కును. కొన్ని సందర్భములం దీతడు తన గురువైన ప్లేటో అభిప్రాయములకు అతనిని పేర్కొనకయే మార్పులను గూడ సూచించియున్నాడు. (1) పొయెటిక్స్ : ఇది సంపూర్ణ గ్రంథము కాదనియు తన ఉపన్యాసముల కొర కాతడు సిద్ధము చేసికొన్న చిత్తు ప్రణాళిక మాత్రమే యనియు కొందరి అభిప్రాయము. ఏది యెట్లున్నను దీని విలువ మాత్రము వాచ్యాతీత మైనది. అర్వాచీన సాహిత్య చర్చకంతయు నిదియే పునాది యని చెప్పవలెను. అరిస్టాటిల్ కు తెలిసిన సాహిత్యము హోమర్ మొదలగువారి కావ్యములు, గ్రీకుల ప్రాచీన దుఃఖాంత నాటకములు మాత్రమే. ఉత్తమమైన వచన వాఙ్మయమును కాని, షేక్స్పియరు వంటి మహానాటక రచయితల నాటకములను కాని ఆత డెరుగడు. అయినను ఉన్న వానినే ఆధారముగా జేసికొని ఇంచు మించుగా సార్వకాలిక మనదగిన ఉత్తమలక్షణ గ్రంథము నాతడు రచింపగలిగినాడు. ఇది క్రీ. పూ. 330 ప్రాంతముల రచింపబడినది. ఇం దైదు భాగములున్నవి. ఒక్కొక్క భాగమునందు మరల విభాగములు కలవు. కళాస్వరూపము, మానవుని యనుకరణాభిలాష, సుఖ దుఃఖాంత నాటకముల యుత్పత్తి, దుఃఖాంతనాటక నిర్వచనము, అందలి షడ్భాగములు, వానిని గూర్చిన విపులమగు చర్చ, ఇతివృత్త విచారము, దుఃఖాంత నాటకముల ప్రయోజనము, శైలి, ఐక్యత్రయము, విషాదాంత నాటక నాయకుడు, మహా కావ్య లక్షణము, నాటక రచనలో సంభావ్యములగు దోషములు, వానిని తొలగించుకొను మార్గములు మొదలగునవి చర్చింపబడినవి. ఇట్లొక క్రమపద్ధతిలో తార్కికముగా సాహిత్యశాస్త్రమును రచించిన ప్రథముడు అరిస్టాటిల్. అరిస్టాటిల్ సిద్ధాంతములు నేటికిని శిరోభాగ్యములే యనుటలో నతిశయోక్తిలేదు.

దుఃఖాంతనాటక ప్రయోజనమును గూర్చి నిర్వచింపకయే ఆతడుపయోగించిన “కథార్సిస్" అను పదమును, ఐక్యత్రయ సిద్ధాంతమును పెక్కు వాదోపవాదములకు, వ్యాఖ్యానములకు గురియైనవి. 'బుచెర్' అను నతడు 'పొయెటిక్స్' కు ఆంగ్లానువాదముతోబాటు విపులము, ప్రామాణికము, ఉత్తమము నగు వ్యాఖ్యానమును గూడ రచించి ప్రకటించియున్నాడు.

(2) రిటారిక్ : ఇందు మూడు భాగము లున్నవి. ఒక్కొక్క భాగమునందు మరల పెక్కు విభాగము లున్నవి. చక్కగా నుపన్యాస మిచ్చుటయే నా డొక కళగా పాటింపబడినది. నాడు రాజకీయ, సాంఘిక వ్యవహారములందు పాల్గొనెడి ప్రతి గ్రీకు పౌరునకును ఉపన్యాస పాటవము ముఖ్యావసరమై యుండెను. ఉపన్యాస ప్రయోజనమేమి? శ్రోతలను వశముచేసి కొనుటయే కదా? దానిని సాధించుటకు ఉపన్యాసకుని శైలి, వాదసౌలభ్యము, క్రమపూర్వక మైన విషయ ప్రకటనము - ముఖ్యమైనవి. వీనిని గూర్చిన విపులమగు చర్చయే యిందలి విషయము.

పో, శ్రీ. అ.

[[వర్గం:]]