Jump to content

సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మొదటి సంపుటము/అరిస్టాటిల్ (3. రాజకీయము)

వికీసోర్స్ నుండి

అరిస్టాటిల్ (3. రాజకీయము) :- అరిస్టాటిల్ ప్లేటోకు శిష్యుడైనను ప్లేటోకును వీనికిని ఎంతేని వ్యత్యాసము కలదు. ప్లేటో యొక్క నైతిక దృష్టి అరిస్టాటిల్ యందును కలదు. కాని ప్లేటో యొక్క కవితా శక్తియు, భావచాతుర్యమును అరిస్టాటిల్ గ్రంథములయందగపడవు. ప్లేటో రచనలు సంభాషణ రూపమున నుండుటచే అతి మనోహరములై యున్నవి. కాని అరిస్టాటిల్ గ్రంథములు శాస్త్రరీత్యా వ్రాయబడినవి. కవితాశక్తి గాని, అపూర్వమైన శైలిగాని అందు కానరావు. అతని ఉపన్యాసముల నుండి శిష్యులు గ్రహించిన విషయములను అనంతరము వారే, గ్రంథరూపమునకు దెచ్చిరని పలువురి అభిప్రాయము.

అరిస్టాటిల్ పద్ధతి శాస్త్రపద్ధతి. భావనాశక్తి ప్లేటో యందు ప్రధానమైనది. అరిస్టాటిల్ గ్రంథములయందు వాస్తవిక దృష్టి ప్రధానము, ఆదర్శములు, భావములు ప్లేటోకు సత్యమైనచో, వాస్తవ ప్రపంచము కూడ అరిస్టాటిల్ కు ముఖ్యమైనది. దేశ కాల పరిస్థితులకు సంబంధము లేని ఆదర్శములు, తత్త్వములు అతనికి పనికిరావు. అతనిది శాస్త్రపద్ధతి కనుక రాజ్యమునుగూర్చి వ్రాయబూనుటకు మునుపు అతడు నాటి రాజ్యాంగములను. వాని చరిత్రను, చక్కగా పరిశీలించెను. అతడు రచించిన "పొలిటిక్సు" అను గ్రంథము ఆకాలపు పరిస్థితులపై ఆధారపడి వాస్తవికముగ నున్నది.

మానవుని అనేక వాంఛలను తృప్తిపరచుటకుగాను నానాసంస్థలు ఏర్పడును. కాని ఈ సంస్థ అన్నిటికన్నను రాజ్యము ఉత్తమమైనది. ఇతర సంస్థలు మానవుని ప్రత్యేక వాంఛల కొరకును, సంకుచితములయిన కోర్కెల కొర కును ఏర్పడి యుండవచ్చును. కాని రాజ్య మను సంస్థ మానవుని ఉత్కృష్ట ఆశయములకొరకు ఏర్పడినది. ఉత్కృష్ట ఆశయములు, వాక్ఛక్తి—ఇవియే మానవుని జంతుజాలమునుండి ప్రత్యేకించునవి. ఇవి మానవునకు స్వాభావికములు. కనుక రాజ్యముకూడ మానవునకు స్వాభావికమైనది. రాజ్యము లేకున్న మానవునకు వాస్తవముగ నైతిక జీవన మసంభవము. రాజనీతి సకలశాస్త్రములకును మూలము. నైతిక ఆదర్శములు రాజనీతి యందలి భాగములు.

మానవులందు కొందరు బలవంతులు, ఇతరులు దుర్బలులు; కొందరు ధీమంతులు, ఇతరులు జడులు కనుక బలవంతులును, ధీమంతులును యజమానులుగ నుండుటయు, దుర్బలులు, జడులు సేవకులుగ నుండుటయు సహజమును, న్యాయమును. అల్పకార్యములను సేవకులు నెరవేర్పకున్న యజమానులకు ఉత్కృష్టజీవనము కాని, రాజ్యమునకు శ్రేయము కాని చేకూరవు. రాజ్య వ్యవహారములందు పాల్గొను పౌరులు అల్పవ్యవహారముల యందు నిమగ్నులగుట రాజ్యమునకు నష్టము.

పాలిటిక్సు అను గ్రంథమునందు అరిస్టాటిల్ ప్లేటో యొక్క ముఖ్యాభిప్రాయములను తీవ్రముగ విమర్శించి యున్నాడు. రాజ్యైక్యము రిపబ్లిక్ లోని ముఖ్యాంశము. సామూహిక జీవన మిందులకు ముఖ్యమార్గము. రాజ్యైక్యము ముఖ్యమైనదేకాని వ్యక్తి ప్రత్యేకతయును ముఖ్యముకదా యని అరిస్టాటిల్ వాదించెను. వ్యక్తులను సంపూర్ణముగ రూపుమాపి ఐక్యమును సాధించునట్టి రాజ్యమునకు విలువ యుండునా? అంతియ కాదు. ప్లేటో సూచించినట్టి సామూహిక జీవనపద్ధతి సాధ్యము కానిది. సంసారము, ఆస్తి, స్వామ్యము అను వాటి యందు మానవులకు ఆసక్తి నశించుననుటకూడ అసంభవము.

పౌరుల సమాజము రాజ్యమనియు, రాజ్యమును నిర్వహించు పౌరవర్గము ప్రభుత్వమనియు అరిస్టాటిల్ నిర్వచించి రాజ్యమునకును, ప్రభుత్వమునకును గల వ్యత్యాసమును స్పష్టపరచెను. రాజ్యభారమును వహించుటయు, ప్రభుత్వమునకు లోబడి ప్రవర్తించుటయు పౌరుని ముఖ్య లక్షణము లని, అతని అభిప్రాయము. ప్రభుత్వమునకు సంబంధించిన సమస్యల నతడు అతి సూక్ష్మముగ విమర్శించి, ఆదర్శ రాజ్య రచనయందు ముఖ్యముగ గమ నింప వలసిన విషయములను విపులముగ పేర్కొనెను. పరిస్థితులు కన్వయింపని ఆదర్శములు నిరర్ధకములు. అంతియకాక అరిస్టాటిల్ రాజ్యముల చరిత్రను, ఆకృతిని చక్కగ పరిశీలించెను. కనుక రాజ్యములను వర్గములుగ విభజించుట కనుకూలమైన మార్గములను, ప్రమాణములను కూడ అతడు సూచించి యున్నాడు.

ఇక రాజ్యములయందు సంభవించుచుండు మార్పులు క్రాంతులు మరియొక ముఖ్యమైన సమస్య. ఈ సమస్యను కూడ అరిస్టాటిల్ సంపూర్ణముగ పరిశోధించి వీనిని నివారించు మార్గమును వర్ణించి యున్నాడు. ప్రజలయందు సమత్వ వాంఛయే వీటికి కారణము. ఆర్థిక విభజన మందును, అధికార విభజనమందును, న్యాయదృష్టియే రాజ్యముల అంతఃకలహముల నివారణకు పరమౌషధము. నానావిధములయిన రాజ్యముల లక్షణములను సమన్వయించునట్టి రాజ్యమే సుస్థిరముగ నుండగలదని అరిస్టాటిల్ మతము.

జి. ఎన్. యస్.

[[వర్గం:]]