Jump to content

సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మొదటి సంపుటము/అప్పయదీక్షితులు

వికీసోర్స్ నుండి

అప్పయదీక్షితులు  :- ఆచార్యదీక్షితు లనబడిన నరసింహ దీక్షితులు విజయనగరాధీశుడగు కృష్ణరాయల (క్రీ. శ. 1509-1530) ఆస్థానకవి. ఈయన మొదటి భార్య స్మార్తకుటుంబమునకు చెందినది. రెండవ భార్య యగు తోటరాంబ శ్రీ వైకుంఠాచార్య వంశజ. ఈమెకు జన్మించిన నలుగురు కుమారులలో పెద్దవాడు రంగ రాజాధ్వరి. ఈయన 'అద్వైతముకురము', 'వివరణ దర్పణము' అను గ్రంథములను రచించెను. ఈయనబొమ్మ మహీపాలుని (క్రీ. శ. 1528) ఆస్థానకవిగా నుండెను. అద్వైతము, విశిష్టాద్వైతము, పూర్వమీమాంస ఈ వంశములో పూర్తిగా ప్రవేశించినవి. ఈ రంగరాజాధ్వరి కుమారుడే అప్పయదీక్షితులు. భారద్వాజసగోత్రుడు. కాంచీపురమునకు దగ్గర నున్న అడయప్పలం అనుగ్రామమున ఈయన కన్యామాసమున 4654వ కలివత్సరమున జన్మించెనందురు. అప్పయ దీక్షితేంద్ర విజయములో దీక్షితులు క్రీ. శ. 1558 లో జులై 15వ తేదీన జన్మించెనని శివానంద యోగీంద్రుడు వ్రాసెను. ఈ రెండు తేదీలకు ఆరేండ్ల వ్యవధి కన్పించుచున్నది. పదునేడవ శతాబ్ది చివరిభాగములో నున్న జగన్నాథ పండితుడు ఇతని సమకాలికుడను కథ లున్నవి. కాని కాలకంఠేశ్వరుని ఆలయము అప్పయదీక్షితుల ఆధ్వర్యవమున క్రీ. శ. 1582 లో నిర్మింపబడెనని అడయప్పలపు శాసనములు తెలుపుచున్నవి. క్రీ. శ. 1549, 1566, 1601 లకు చెందిన అడయప్పలపు శాసనములలో అప్పయ దీక్షితుల ప్రసక్తి గలదు. చినబొమ్మ భూపాలుని ఆస్థానమున వేలూరులో చాల కాల మీతడు వసించెనని, అచట కనకాభి షేకముతో గౌరవింపబడెనని చారిత్ర కాధారముల వలన తెలియవచ్చుచున్నది. దీక్షితులు యాదవాభ్యుదయ వ్యాఖ్యారంభమున రామరాయ, తిమ్మరాజ చినతిమ్మరాజులను పేర్కొనినాడు. చిన తిమ్మరాజు క్రీ. శ. 1542 నుండి 1550 వరకు సేనాపతిగా నుండెను. ఆతర్వాత అప్పయదీక్షితులను చేరదీసినవాడు వేలూరు వాడగు చినబొమ్మనాయకుడు (1549 - 1578). మొదటి వేంకటపతి (క్రీ. శ. 1585) కాలమున కువలయానంద విధి రసాయనములు రచింపబడినవి. క్రీ. శ. 1580 నాటికే సేవప్ప శాసనములు ఈతని కీర్తిని కొనియాడ సాగినవి. తంజావూరి నేలిన నరసింహుని ఆస్థానమున గూడ అప్పయదీక్షితులు కొంతకాలము గడపెను. పాండ్యదేశమున వసంతమండపములో ఏక పాదమూర్తి ప్రతిష్ఠావిషయమున, శైవులకు, వైష్ణవులకు వివాదములు బయలుదేరగా, తిరుమల నాయకుడీతనిని మధురకు తీసికొనిపోయెననియు అచట దీక్షితులమూలమున ఆ ప్రతిష్ఠ నిర్విఘ్నముగా జరిగెననియు తెలియుచున్నది.

"చిదంబర మిదం పురం ప్రథితమేవ పుణ్యస్థలం
సతాశ్చ విన యోజ్జ్వలాః సుకృతయశ్చ కాశ్చి త్కృతాః
వయాంసి మమ సప్తతే రుపరినైవ భోగే స్పృహా
నకించి దహ మర్థయే శివపదం దిదృక్షే పరమ్"

అను శ్లోకమును దీక్షితులు అంత్య సమయమున చెప్పిరి.

డెబ్బది రెండేండ్లు నిండిన తరువాత చిదంబరమున మరణించిరి. దీనిని బట్టి అప్పయదీక్షితులు క్రీ. శ. 1525 ప్రాంత మున జన్మించిరనియు, క్రీ. శ. 1598 ప్రాంతమున మరణించిరనియు చెప్పవీలగుచున్నది.

అప్పయ దీక్షితులు నూటనాలుగు గ్రంథములను రచించెనని నీలకంఠదీక్షితులు శివలీలార్ణవమునచెప్పి నాడు. వీటిలో ఆత్మార్పణ స్తుతి యనబడు శివపంచాశిక, ఆర్యా శతకము, దశకుమార చరిత సంగ్రహము, పంచరత్న స్తవము, శివకర్ణామృతము, వైరాగ్య శతకము, 'ఆనంద లహరి, భక్తామర స్తవము, శాంతి స్తవము, రామాయణ తాత్పర్య నిర్ణయము, రామాయణ తాత్పర్య సంగ్రహము, రామాయణ సార స్తవము, రామాయణ సొర సంగ్రహము, భారత స్తవము, వరదరాజాష్టకము, ఆదిత్య స్తోత్రరత్నము, శివ కామి స్తవ రత్నము, శివమహిమా కలిక స్తవము అనునవి కావ్యములు. వసుమతీ చిత్రసేన విలాసమను నాటకము కూడ ఒకటి ఇతడు రచించినది కలదు. ఇతడు వేదాంత దేశికుని కావ్యములను, గోవింద దీక్షితుని హరివంశసార చరితను, కృష్ణమిశ్రుని ప్రబోధ చంద్రోదయమును వ్యాఖ్యానించెను.

దీక్షితులు వేంకటపతిరాయల అనుజ్ఞ ననుసరించి, కువలయానంద కారికలు అను అలంకార గ్రంథమును రచించితినని చెప్పికొనినాడు. రంగరాజాధ్వరియే ఈయనను వేంకటపతివద్దకు పంపెనని ఆశాధరు డనినాడు, ఈ కారికలను తన చంద్రాలోకము నుండి దొంగిలించినాడని జయదేవు డీతనిని తన ప్రసన్న రాఘవమున ఎత్తి పొడిచినాడు. కాని చంద్రాలోకములోని అలంకార ప్రకరణమున కీకారికలు వార్తికములవంటివి. చిత్రమీమాంసయను మరియొక అలంకార శాస్త్ర గ్రంథమును ఇతడు రచియించివాడు. ఈ గ్రంథము అతిశయోక్తి (అలంకారము) తో ఆగిపోయినది. దీనిని ఖండించుటకు జగన్నాథ పండితుడు చిత్రమీమాంసా ఖండనమును రచించి, అంతటితో నాగకి, తన రసగంగాధరమున మాటిమాటికి దీక్షితులను ఎత్తిపొడుపు మాటలతో నిందించుచు విమర్శించినాడు. కాని అప్పయదీక్షిత రచితమని చెప్పబడు 'ఆంధ్రత్వమాంధ్ర భాషాచ నాల్పస్య తపసఃఫలమ్ ' అను శ్లోకమును బట్టి దీక్షితులు తెలుగు దేశము నందుము. తెలుగు భాష యందును మిక్కిలి యాదరముకలవాడని తెలియుచున్నది. శబ్దార్థ సంబంధములను వివేచించు వృత్తి వార్తికమును దీక్షితులు రచియించినాడు.

భట్టోజీ దీక్షితులు వేదాంత శాస్త్రమును అప్పయ దీక్షితులవద్ద అభ్యసించెను. భట్టోజీ సిద్ధాంత కౌముది మొదలగు వ్యాకరణ గ్రంథములను రచించిన తర్వాత వేదాంతము చదువవలెనని అప్పయ్య దీక్షితుల ఇంటికి చేరినపుడు, ఆతడు తన కౌముదిని శిష్యులకు పాఠము చెప్పుచుండెనట! పాఠమైన తరువాత తన పేరు, వచ్చిన పని, భట్టోజీ విన్నవించుకొనెను, కాని తన పేరు చెప్పక, శిష్యులతోపాటు కౌముదీ పాఠమును వినినందులకు సేతుస్నానము చేసిరానిదే భట్టోజీతో ఇతర విషయములను ప్రస్తావించ వీలులేదని అప్పయ్యదీక్షితు లన్నారట! యథావిధిగా సేతుస్నానము చేసివచ్చి, భట్టోజీ వేదాంతమును చదువసాగె నట.

అప్పయ్య దీక్షితులు ధర్మశాస్త్రములలో ప్రవీణుడు, బాల వితంతువైన తన పుత్రికకు పునర్వివాహము చేయ సంకల్పించియు ఆతడు ధర్మశాస్త్రములకు, సంఘమునకు. ఆచారమునకు వెరచి, ఊరకుండెనని చెప్పుదురు. అప్పయ దీక్షితులు ఖండదేవునిచే మీమాంసక మూర్ధన్యుడని ప్రశంసింపబడినాడు. అతిదేశ లక్షణ పునరాక్షేపము, పూర్వ మీమాంసా విషయసంగ్రహదీపిక, ధర్మ మీమాంసా పరిభాష, విధిరసాయనము, ఉపక్రమ పరాక్రమము, నాద నక్షత్రమాల, మయూఖావలి, చిత్రపటము అను పూర్వ మీమాంసా గ్రంథములు ఇతడు వ్రాసినవి. భాట్ట మీమాంసకుడైనను అప్పయ దీక్షితులు ఇచటగూడ క్రొత్త సిద్ధాంతములను తెచ్చెను. ప్రకరణాంతరము గూడ కర్మభేద ప్రమాణమేయని బ్రహ్మ సూత్ర శాంకరభాష్య వేదాధికరణమున తన పరిమళ వ్యాఖ్యలో నిరూపించినాడు. వాద నక్షత్రమాలలో నవ్యన్యాయభాష గలదు. వాక్యార్థ విచారమైన ఈ గ్రంథమున ముఖ్యమైన పూర్వోత్తర మీమాంసాధి కరణములు వివేచింపబడినవి, శాస్త్రదీపిక పై వ్యాఖ్య మయూఖావళి, శ్లోక వార్షిక దృష్ట్యా లఘువార్తిక మనబడిన చిత్రపటమున పూర్వ మీమాంసా శాస్త్రములోని అధికరణములు సంక్షిప్తముగా ప్రతిపాదితములు.

పూర్వ మీమాంసాశాస్త్ర విషయములను పూర్తిగా వేదాంత గ్రంథములలో గూడ చొప్పించిన అప్పయ దీక్షితులకు స్మార్త వైష్ణవములు రెండును ప్రేమా స్పదములే. అనేక విశిష్టాద్వైత గ్రంథములను వ్యాఖ్యా నించినను,

"మహేశ్వరే వా జగతామధీశ్వరే
జనార్దనే వా జగదంత రాత్మని
నవస్తుభేద ప్రతిపత్తి రస్తుమే
తథాపి భక్తి స్తరుణేందు శేఖరే”

అని కాంచీపురములో నొక పండితసభలో అప్పయ్య దీక్షితులు పల్కెనట ! శివునకును, విష్ణువునకును వస్తుభేద ప్రవృత్తి లేకున్నను తనకు శివుని పైననే చిత్తము నిలిచి యున్నదట.

శ్రీకంఠుని శైవ వేదాంతమును సుప్రతిష్ఠితము చేయుటకు శ్రీకంఠ భాష్యమునకు శివార్కమణిదీపిక అను వ్యాఖ్యను, శివాద్వైత నిర్ణయము అను గ్రంథమును రచించి ఇతడు శైవ విశిష్టాద్వైతమును ప్రవచించినాడు. విశిష్టాద్వైత వ్యాప్తికై రామానుజుడువలె ఈయన శైవ వేదాంత వ్యాప్తికై నిరంతర కృషి సలిపెను. అనేక మీమాంసా న్యాయములకు విశిష్ట తాత్పర్యము ప్రాముఖ్యము ఇతనిచే చూపబడినవి.

న్యాయ రక్షామణి, పరిమళ, సిద్ధాంతలేశ సంగ్రహము అను దీక్షితుల వేదాంత గ్రంథములు అతి ముఖ్యమైనవి. శంకరభాష్య వ్యాఖ్యయగు భామతిపైగల కల్పతరు వ్యాఖ్యకు టీకగా వ్రాయబడిన పరిమళ వ్యాఖ్యలో దీక్షితులు అవచ్ఛేద వాదము, నానాజీవ వాదము, క్రమముక్తి, సర్వముక్తి మొదలగు విశిష్ట సిద్ధాంతములను సోపపత్తికముగా నిరూపించినారు. అద్వైత వేదాంతమున గల భిన్న భిన్న సిద్ధాంతములను సమగ్రముగా నొకచో చేర్పబడిన మహాగ్రంథము సిద్ధాంతలేశ సంగ్రహము. వ్యవహారమున భాట్టమీమాంసకుడు, వేదాంత మార్గమున భామతి ప్రస్థానావలంబి, భక్తిమార్గమున శివాద్వైతీయు నగు అప్పయ దీక్షితులు సర్వతోముఖ పాండిత్యము, అద్వితీయ ప్రతిభ గల మహా వ్యక్తి.

పొ.ను.

[[వర్గం:]]