Jump to content

సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మొదటి సంపుటము/అపేక్ష - సరఫరా

వికీసోర్స్ నుండి

అపేక్ష - సరఫరా  :- ఈ ప్రపంచమున ఎల్లెడలను ప్రజలు ఏదో సమయమందు ఏదోకొంత శ్రమపడుచుందురు. రిక్షావాడు ఉదయమునుండి సాయంత్రము వరకు ఎండలో వానలో రిక్షా లాగుచుండును. కూలివాడు సామానులు మోయుచునో, పొలములో నాట్లు వేయుచునో ఉండును. పదిగంటలగుసరికి పట్టణములలో కందిరీగల పుట్టరీతిగా కారులమీద, సైకిళ్ళమీద, కాలినడకను పిన్నలు పెద్దలు మహాప్రవాహముగ కార్యాలయములకు పోవుచుందురు. ప్రపంచమున ప్రతి మానవుడు ఏదో ఒక పనిలో నిమగ్నుడై ధనార్జనకై కష్టించు చున్నాడు గదా! ఎందులకు మానవుడింత కష్టించును ? ఈ ఆర్థిక వ్యాపారము వలన మానవునకు కలుగునదేమి?

అనంత మైన ఈ ఆర్థిక వ్యాపారమునకు మూల కారణము మానవుని వాంఛలు. ఈ వాంఛలను సంతృప్తి పరచుటకై వస్తువులను ఉత్పత్తి చేయవలెను. వస్తూత్పత్తి సాధనములు పరిమితములు. పరిమితములైన వస్తూత్పత్తి సాధనములతో బహుళమగు మానవ వాంఛలను సంతృప్తి పరచు సమస్యయే ఆర్ధిక శాస్త్రమందలి ముఖ్య వస్తువు.

ఆపేక్ష (Demand) :- అ పేద అనగా ఒకనికి ఒక వస్తువును కొనుటయందు గల వాంఛ. ఒక్క వాంఛ మాత్రమేగాక దానితోపాటు కొనుగోలుశక్తి యుండిననే అది 'ఆపేక్ష' అనబడును. ఒక వస్తువునుండి తాను పొందు ప్రయోజనము (Utility) ను బట్టి అతడు ఎక్కువ గాని, తక్కువగాని మూల్యము (Price) ను ఇచ్చుటకు ఇష్టపడును. ఇది ఆ వస్తువునకై అతనియందుగల 'అపేక్ష ' యొక్క బలమును నిర్ణయించును. ఏదైనను ఒక వస్తువునకై ఒక వ్యక్తికిగల అపేక్ష వేర్వేరు మూల్యములున్నపు డెట్లు మారునో తెలిపెడు దానిని 'అపేక్ష పట్టీ' అందురు. ఒకడు అరటిపండ్లు ఒక్కొక్కపండు ఒక పైసయగుచో ఒక డజను పండ్లను కొనును, కాని పండు రెండుపైసలగుచో అరడజను మాత్రమే కొనును. మూడు పైసలగునచో నాలుగింటిని మాత్రమే కొనును, దీనికి కారణమేమన అతని పరిమిత ఆదాయములో అరటిపండ్లు అతని కొసగు ప్రయోజనమునుబట్టి కేటాయింపబడిన వాటా 12 పైసలు మాత్రమే. అంతకుమించి అరటిపండ్ల కొరకు అతడు ఖర్చు పెట్టినచో తదితరములగు వస్తువులలో ఎంతో కొంత భాగము త్యాగము చేయవలసి యుండును. ఈ 12 పైసలలో మూల్యము హెచ్చుగనున్న తక్కువ పండ్లను, తక్కువగనున్న ఎక్కువ పండ్లను కొనగల్గును. ఇంతియేగాక ఇతర వాంఛలను తీర్చుకొను అవసరము ఎక్కువగ నున్నచో అసలు అరటిపండ్లను కొనుటయే మానివేయవచ్చును. వేర్వేరు వాంఛలు తమతమ ప్రాబల్యమునుబట్టి అతని ఎన్నికలో ప్రాముఖ్యమును పొందును. ఆ ప్రాబల్యమే అత డేయే వస్తువులను యెంతెంత కొనవలయునో నిర్ణయించును. ప్రతివ్యక్తి ఇట్లు వివిధ వాంఛల సంతృప్తివల్ల కలిగెడు ప్రయోజనమును తూచితూచి తన ఆదాయమునుండి సాధ్యమైనంత ప్రయోజనము లభించు విధముగ తన వాంఛలను సంతృప్తి పరచుకొనుచుండును. ఒక వ్యక్తి యొక్క ఈ ప్రవర్తన మానవ సమాజములందు కొనువారందరికి వర్తించును. ఈ ప్రవర్తనము ననుసరించియే 'అపేక్షా సిద్ధాంతము' ప్రవచింపబడినది, ఇదియే మన "మూల్యము హెచ్చిన అపేక్ష తగ్గును. మూల్యము తగ్గిన అపేక్ష హెచ్చును." అనెడి సూత్రము.

సరఫరా (Supplies) :- ఒక వస్తువు యొక్క నిల్వల నుండి వేరువేరు మూల్యములకు వర్తకులు అమ్మజూవు వస్తు పరిమాణమును 'సరఫరా' అందురు. ఒక వస్తువునకు కొనువారు ఇచ్చుమూల్యమునుబట్టి విపణియందు సరఫరా మారుచుండును. విషణి యందు మూల్యము హెచ్చినచో వర్తకులు అధికలాభములు పొందుటకై ఎక్కువ సరకును అమ్మజూపుదురు. మూల్యము తగ్గినచో తక్కువ సరకును అమ్మజూపుదురు, దీని నే 'సరఫరా' సిద్ధాంతమందురు. ఇది అపేక్షా సిద్ధాంతమునకు వ్యతిరేకముగ నడచు చుండును. ఏలయనగా కొనువారు సాధ్యమైనంత చవుకగ కొనుటకు ప్రయత్నింతురు. వర్తకులు సాధ్యమైనంత ప్రియమగు మూల్యమునకు అమ్మజూతురు. వర్తకులు వేర్వేరు మూల్యములకు ఎంతెంత పరిమాణముగల సరకును సరఫరా చేయుదురో తెలియజేయునది 'సరఫరా పట్టీ' అనబడును.

మూల్యము (Price) :- విపణియందు ఏ వస్తువు యొక్క మూల్యమైనను ఆ వస్తువు యొక్క అపేక్ష, సరఫరాలపై ఆధారపడియుండును. ఒక విపణి యందలి అపేక్ష పట్టీని సరఫరాపట్టీతో పోల్చిచూచిన యెడల ఏదోఒక మూల్యము వద్ద విపణియం దా వస్తువునకు గల అపేక్ష, సరఫరాలు సరిసమానముగ నుండును. ఇట్లు సరఫరా, అపేక్షలను సరిసమానము చేయగల మూల్యమే ఆ విపణియందా వస్తువు యొక్క 'నిశ్చలమూల్యము' (Equilibrium Price) తరచు విపణి యందలి అపేక్ష యొక్కము, సరఫరా యొక్కయు పరిస్థితులనుబట్టి మారుచుండు మూల్యమును 'విపణి మూల్యము' (Market value) అందురు. గడియారములోని లోలకము ఏవిధముగ ఒక మధ్య బిందువును ఆధారముగ జేసికొని అటునిటు ఊగునో అట్లే 'విపణి మూల్యము' నిశ్చల మూల్యము నాధారముగ చేసికొని హెచ్చుచు, తగ్గుచు ఉండును. తాత్కాలికముగ విపణి మూల్యము హెచ్చినను, తగ్గినను తుదకు నిశ్చల మూల్యముతో సమానమగును. నిశ్చల మూల్యముకంటే విపణి మూల్యము హెచ్చుగా నున్నచో వర్తకులు ఎక్కువ సరకును సరఫరా చేయుదురు. 'అపేక్ష' తక్కువగా నుండును. కావున విపణిమూల్యము నిశ్చలమూల్యముతో సమానమగును. నిశ్చల మూల్యముకంటె విపణిమూల్యము తక్కు వగానున్నచో అపేక్ష హెచ్చును. సరఫరా తక్కువగా నుండును. అప్పుడును విపణిమూల్యము నిశ్చల మూల్యముతో సమానము కాక తప్పదు.

ఉత్పత్తి వ్యయము (cost of production);- ఆర్థికశాస్త్ర వేత్తలు విపణియందు ఒక వస్తువు యొక్క మూల్యము ఎట్లు నిర్ణయింపబడునను ప్రధాన సమస్యను ప్రథమమునుండియు చర్చించుచునేయున్నారు. ఈసమస్య పైన ఆనేక వాదోపవాదములు చెలరేగినవి. అయినను కొన్ని ముఖ్యాంశములపై ఏకాభిప్రాయము కలదు. మూల్యము విపణియందలి సరఫరా, అపేక్షల స్థితిగతులను బట్టి నిర్ణయింపబడును. ఇంకను సునిశితముగ పరీక్షించినచో సరఫరా పక్షమున ఉత్పత్తి వ్యయమును, అపేక్షా పక్షమున ప్రయోజనమును మూల్యమును నిర్ణయించునని తేలుచున్నది. సరఫరా స్థితిగతులను నిర్ణయించునదిగా ఉత్పత్తి,వ్యయము మన దృష్టిలో ముఖ్యాంశమగు చున్నది. ఉత్పత్తివ్యయ మనగా నేమి ? ఒక ఉత్పత్తిదారుడు ఒక వస్తువును ఉత్పత్తిచేయుటకు అవసరమైన ఉత్పత్తి సాధనములను సంతరించుకొనుటకు కొంత ధనరూపమైన వ్యయమగును. దానినే ఉత్పత్తి వ్యయమందురు. ఇందులో అనేక రకములగు ఖర్చులు చేరును. (అ) ముడిసరకులను కొనుటకగు వ్యయము (ఆ) కూలి ఖర్చులు, జీతములు. (ఇ) వ్యాపారమం దుంచిన పెట్టుబడిపై వడ్డీ. (ఈ) మరమ్మతు ఖర్చులు (ఉ) నిర్వహణకై సామాన్యముగ ఇవ్వబడు ప్రతిఫలము (ఊ) వ్యాపార ఖర్చులు. ఉదా : ప్రకటన ఖర్చులు, అమ్మకపు ఖర్చులు ఉత్పత్తి వ్యయము - మొదలైన ఖర్చులతో కూడియుండును. పరోక్షముగ కూడ వ్యాపారమున కొంత వస్తు సముదాయము, కొందరి శ్రమ ఉపయోగింపబడి యుండ వచ్చును. ఉత్పత్తిదారు తానే నిర్వాహకుడు, ఆసామి లేదా సొంతదారుడు అగుచో అతనికి చెందిన యంత్రాగార స్థలముపై అదై, పెట్టుబడిపై వడ్డీ, నిర్వహణము చేసినందులకు అతనికిచెందు ప్రతిఫలము-వీటిని అతడు ధనరూపమున చెల్లింపకున్నను వాటిని ఉత్పత్తి వ్యయములో యథార్థ వ్యయభాగములు (Real cost) గా పరిగణింపవలెను.

వస్తువులు విలువలను గూర్చిన చర్చలలో ఇటీవలి వరకు ఉత్పత్తి వ్యయము ధనరూపమైన వ్యయమనియే భావింప బడుచు వచ్చెను. ఇట్టి భావనపై ఆధారపడి చేయబడిన వాదనల సారాంశము మూల్యము వల్లనే మూల్యము నిర్ణయమగునని చెప్పుట మాత్రమే. ఎందువలన అనగా . ధనరూపమైన ఉత్ప త్తివ్యయము కూడా మూల్యమే. ఒక వస్తువు యొక్క మూల్యము ఉత్పత్తిదారునిచేత చెల్లింపబడినపుడు అదియే అతని ఉత్పత్తి వ్యయములో ఒక భాగము అగును. అట్లయిన ఉత్పత్తి వ్యయము యొక యథార్థ స్వరూపమేమి ? ధనరూపమైన ఉత్పత్తి వ్యయములు నిజ స్వభావమును కనుగొనుటకు అనేకులు యత్నించిరి, ఉత్పత్తి సాధనములు పరిమితములు. ఈ పరిమితమైన ఉత్ప త్తిసాధనము లొక్కొక్కటి కొంత పరిమాణములో ఒక ఉత్పత్తి శాఖలో వినియోగింపబడు నెడల మరియొక ఉత్పత్తిశాఖ వాటిని వినియోగించు అవకాశము కోల్పోయిన దన్నమాట. మొదటి ఉత్పత్తి శాఖలోనికి ఆయా ఉత్పత్తి సాధనము లను ఆకర్షించుటకు అధమము అది రెండవ శాఖలో గడింపగలిగినంతటి ప్రతిఫలమైనను ఇవ్వజూపవలెను. కావున ఒక వస్తువును ఉత్పత్తి చేయుటకగు వ్యయము, అందు ఉపయోగింపబడిన సాధనములతో మరియొక వస్తువును ఉత్పత్తి చేసిన దానికుండెడి విలువనుబట్టి నిర్ణయమగును. తుట్టతుదకు తేలునదేమనగా ఒక వస్తువు యొక్క యథార్థ వ్యయము ఆ వస్తువును ఉత్పత్తి చేయుటకు ఉపయోగింపబడిన సాధనములు మరొక విధముగ ఉపయోగింపబడనందువలన త్యాగము చేయబడిన ప్రయోజనమునకు సమానము. పరిమితమైన సాధనములతో బహుళములగు వాంఛలను సంతృప్తి పరచుట అసాధ్యముగాన కొన్ని వాంఛలను త్యాగము చేయుట తప్పనిసరియగును. అందువలననే యథార్థ వ్యయము త్యాగము చేయబడిన ప్రయోజన పరిమాణమును తెలియజేయును.

కె. పు.


[[వర్గం:]]