Jump to content

సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మొదటి సంపుటము/అండమాన్ దీవులు

వికీసోర్స్ నుండి

అండమాన్ దీవులు- ఈ దీవుల గుంపు బంగాళాఖాతపు తూర్పుభాగమున నున్నది. అగ్నిపర్వత సంబంధములగు నీదీవులు హుగ్లీ ముఖద్వారమునకు 580 మైళ్లలోను, ఆసియా భూభాగమున మిక్కిలి సమీప స్థలమగు బర్మాలోని సెయిస్ అగ్రము (Cape Negrais) నకు 120 మైళ్లలోను కలవు. 1955 భారత ప్రభుత్వపు లెక్కల ననుసరించి, వీని వైశాల్యము 8,148 చదరపు మైళ్లు, బ్రిటిష్ ప్రభుత్వకాలములో 1858 నుండి యావజ్జీవ దేశాంతరవాస శిక్షితుల కిది నిర్బంధ ప్రదేశముగా(Penal settlement) నుపయోగింప బడెను. ఈనాడు భారత ప్రభుత్వ రాష్ట్రములలో నొకటియై, ఇవి దక్షిణ ముననున్న నికోబార్ దీవులతో కలసి "అండమాన్ మరియు నికోబారు దీవులు" అను పేరుతో, డి-విభాగ రాష్ట్రములకు చెంది, "ఛీఫ్ కమిషనర్ " అను అధికారిచే పాలింపబడు చున్నవి. భారత జాతీయ పతాకచ్ఛాయ క్రింద నేడిచ్చట 30,948 మంది ప్రజలు నివసించుచున్నారు (1951).

పెద్దవియు చిన్న వియును కలసి, ఇందు మొత్తము 204 దీవులు కలవు.

వీనిలో దగ్గరగా చేరియున్న ఐదు పెద్దదీవులు కలసి మహా—అండమాన్ (Great Andaman) అని పిలువబడు చున్నవి. వీటిలో ముఖ్యములై నవి:- (1) ఉత్తర-అండమాన్ (2) మధ్య—అండమాన్ (3) దక్షిణ-అండమాన్.

చిన్న దీవులు దాదాపు 200 కలవు. వీనిలో ముఖ్యములై నవి. (1) అండమాన్ ద్వీప సమూహము (Andaman Archipelago) (2) లేబిరిన్ ద్వీపము (Labyrinth Island).

మహా—అండమాన్ 219 మై. పొడవును, 82 మై. వెడల్పును గలిగియున్నది. నాలుగు ఇరుకైన జలసంధులు ఈ దీవులను విడదీయు చున్నవి.

చిన్న అండమాన్ (Little Andaman) ఈ దీవుల సమూహములో దక్షిణపు కొస నున్నది. దీని పరిమాణము దాదాపు 26 మైళ్ళ పొడవును, 16 మైళ్ళ వెడల్పును నైయున్నది. ఇది రట్ లండ్ దీవికి (Rutland Island) 31 మైళ్ళదూరములో నున్నది. దీనికి సమీపమున(రట్ లండ్ దీవికి) నున్న మేనర్సు జలసంధి (Manners Strait) మద్రాసు తీరప్రాంతమునకును, అండమాన్ దీవులకును మధ్య ప్రధానమైన వర్తకపు రహదారీ(Commercial Highway) గా నున్నది.

పేరు :— అండమాన్ అను పేరు మలయా భాషలో "హన్ డుమాన్" (హనుమాన్. సం.) నుండి ఏర్పడియుండుట సంభవమని చెప్పబడుచున్నది.

వర్ణన (Topography); భౌతికలక్షణములు:- మహా-అండమాన్ దీవులు కొండల పరంపరలచే నిండియున్నవి. వీటి మధ్య మిక్కిలి ఇరుకైన లోయలున్నవి. మిక్కిలి దట్టములైన ఉష్ణమండలారణ్యములచే ఈ భాగము లన్నియు ఆవరింపబడి శ్యామవర్ణము (Lush green) గా కనబడు చుండును. తూర్పు తీరమున ఈ కొండలు ఎక్కువ ఎత్తు గలవిగా నున్నవి. వీటిలో "సేడిల్ శిఖరము" (Saddle Peak) ఎత్తు 2,400 అడుగులు. ఇది ఉత్తర అండమానులో నున్నది.

"చిన్న అండమాన్” (Little Andaman) దాదాపు చదునుగా నున్నది. సెలయేరులుగాని, ఎడతెగక పారు నదులుగాని ఈ దీవులలో లేవు.

ఎల్ల తావులయందును ప్రకృతి దృశ్యము హృదయాకర్షకమైన సౌందర్యముగలిగి, వైవిధ్యముతో గూడి యుండును. నౌకాశ్రయముల దాపునగల అఖాతము లందు పగడపు తలములు రంగు రంగులతో, సమ్మోహనకరములై యుండును.

తీర రేఖ చీలియుండుటచే చక్కని నౌకాశ్రయము లేర్పడి యున్నవి. వీటిలో పోర్టు బ్లెయిర్ (Port Blair), పోర్టు కారన్ వాలిస్, బోలింగ్టన్ అనునవి ప్రసిద్ధికెక్కినవి. వీనిలో పోర్టు బ్లెయిర్ (దక్షిణ అండమాన్) దక్షిణ ఆసియాలోని ఉత్తమ నౌకాశ్రయములలో నొకటియై ఈ దీవులకు రాజధానియై యున్నది.

బర్మాలోని ఆరశాన్ యోమా (Arakan yoma) పర్వత పంక్తులలో నున్న నెగెయిస్ అగ్రము (Cape Negrais) నుండి సుమత్రా దీవిలోని పన్ హెడ్ (Achin Head) వరకు 700 మై. పొడవుగల ఎత్తైన పర్వత వంక్తులు సముద్రములోనుండి అడ్డముగా వ్యాపించి యున్నవి. అండమాన్ దీవులు ఈ పర్వత శ్రేణిలో ఒక భాగమై యున్నవి. 'నూతన జాతి' శిలానిర్మాణములు(Newer Rocks) అండమాన్ ద్వీపసమూహములోను, నికోబార్, సుమత్రా దీవులయందును కనబడుచున్నవి.

శీతోష్ణస్థితి:- అండమాను దీవులు ఉష్ణమండలములో చేరి, ఎప్పుడును వెచ్చదనము గలిగియున్నను, చక్కని సముద్ర వాయువుల ప్రభావముచే, ఆరోగ్యవంతముగా నున్నవి. ఉత్తరాయణ కాలములో ఇచట అధికమైన వేడిమి యుండును. వర్షపాతము క్రమము లేక హెచ్చు తగ్గులతో గూడి యుండును. నైరృతి ఋతుపవన కాలములో అత్యధికములైన వర్షములు కురియుచుండును. తుపాను అంతగా ఈ ప్రాంతమునకు తగులవు. కానీ బంగాళాఖాతములో వీచెడి ప్రతి తుపాను యొక్క ప్రభావమును ఇక్కడ కనబడు చుండును. వీచెడి తుపానులు దిక్కును, తీవ్రతయును తెలిసికొని, బంగాళాఖాతములో తిరిగెడి అనేకములైన ఓడలకు తెలియజేయుటకు మిక్కిలి అనుకూలమైన స్థానములో నీ దీవులున్నవి. అందుచే 1868 సం॥ నుండి, పోర్టు బ్లెయిర్ లో నొక చక్కని వాతావరణ పరిశీలనా కేంద్రము నెలకొల్పబడి యున్నది.

సహజవృక్షసంపద, జంతుజాలము :- 1883 సంవత్సరములో ఆటవిక శాఖా కార్యాలయ మొకటి ఇక్కడ నెలకొల్ప బడినది. పోర్టు బ్లెయిర్ చుట్టును 156 చ.మై. అటవీ పరిశోధన కార్యకలాపమునకు ప్రత్యేకింప బడినది. ఖైదీలను కూలీలగా నుపయోగించి, ఈ పని సాగింపబడెను. "పేడౌక్" (Padouk) (pterocorpus dalbergioides) అను ఒక జాతివృక్షము ఇచ్చట పెరుగుచున్నది. ఇది కేవల మీ ప్రాంతజన్య మైనట్టిది. ఇండ్లు, పడవలు, కఱ్ఱసామగ్రి మొదలగు వానికి టేకు, మెహాగనీలవలె నే ఇది ఉపయుక్త మగుటచే, ఇది యూరపులోని వర్తకకేంద్రములకు విరివిగా ఎగుమతి చేయబడు చున్నది.

కోకో (koko), 'సేటిన్ ఉడ్' మొదలగు మేలిజాతి కలప ఇచ్చట లభ్యమగు చున్నది.

తేయాకు, నైబీరియాకాఫీ, కోకో, మేనిలాజనుము, టేకు, కొబ్బరి, పూలజాతులు, పండ్ల చెట్లు, కూరగాయలు మొదలగునవి ఫలసాయము చేయుటకయి ఇచ్చట ప్రవేశ పెట్టబడినవి. కొబ్బరి ఇచటి ప్రజల ముఖ్యాహారము. సంవత్సరమునకు 1,50,00,000 కొబ్బరికాయలు ఎగుమతి అగుచున్నవి. అడవులు బర్మా అడవులజాతికి చెంది, కొన్ని మలయాజాతులనుగూడ కలిగినవై యున్నవి. చిత్తడినేలలో పెరుగు రావిచెట్లవంటి చెట్లు (Mangrove swamps) నుండి ప్రశస్తమగు వంటచెరకు దొరకు చున్నది. రెండవ ప్రపంచ సంగ్రామము తరువాత 'షార్క్ లివర్ ఆయిల్' పరిశ్రమ అభివృద్ధి చెందసాగినది. జంతు జాలము విషయములో నిచటి అడవులు కొరవడి యున్నవి. చిన్నరకపు పంది (Sus andenesis) ఒకటి ఇచటి ఆదిమవాసులు ఆహారమునకు ఉపయోగ పడుచున్నది. ఒక మాంసాహార జంతువు (Paradoxirus tytleri) కూడ కనబడు చున్నది. మొత్తము 19 రకముల జంతుభేదము లిచ్చట కలవు. గబ్బిలములును, ఎలుకలును జంతువులలో 75 శాతముగానున్నవి. ఇట్లు జంతుజాలము తక్కువగా నుండుటను బట్టి ఈ దీపు లొకానొకప్పుడు ఆసియా భూభాగముతో కలిసియుండెడివన్న సిద్ధాంతము సంశయాస్పద మగుచున్నది. డేగ, బుల్ బుల్ మొదలగు అనేక పక్షిజాతులు కనబడుచున్నవి. కాని ఇవే నికోబార్ దీవులలో వేరురకముగా నున్నవి. చేపలలో ప్రత్యేక జాతులు లభ్యమగు చున్నవి. తాబేళ్లు (Turtles) సమృద్దిగా దొరకుచు, కలకత్తా మార్కెటుకు ఎగుమతి చేయ బడుచున్నవి.

ప్రజలు:- నీగ్రోజాతి భేదమునకు చెందిన ఆదిమ నివాసులు ఇచట కలరు, మగవారి సగటు ఎత్తు 4 అ.10½ అం. ఆడువారి సగటు ఎత్తు 4అ. 6 అం. మరుగుజ్జు వారైనను సుపరిమాణములైన శరీరములు కలిగియుందురు. కారు నలుపు రంగు, కొంచెము గుండ్రముగా నుండు తల; చిన్నదియై, వెడల్పుగల ముఖము; వెడల్పు ముక్కు ఆకారముగలవారు. పొట్టిగా నల్లగా నుండు వీరి జుట్టు ఉంగరములు తిరిగి, మిరియపు గింజలవలె కనబడును.

తీరవాసులు, దేశాంతర్భాగ వాసులు అని ప్రజలు రెండు తెగలుగా నున్నారు. తిరిగి వీరు 12 ప్రత్యేక వర్గములు (Tribes) గా కనబడుచున్నారు. మలయాలోని 'సెమాంగ్ (Semangs) లకును, న్యూగినీలోని 'పాపువాను'(Papuans) లకును వీరు పోలిక కలిగి యున్నారు. వీరిలో ప్రభుత్వ వ్యవస్థ లేదు. కాని కొందరి నాయకులను (Heads) వీరు అనుసరించుచుండుట కలదు. సంగీతము,నాట్యము సాధన చేయబడుచున్నవి. విండ్లు,బాణములు వీరి ఆయుధములు. తాళ్ళు పేనుటలో, తట్టలు, చాపలు అల్లుటలో వీరికి నేర్పుగలదు. నిప్పు రగుల్చుట వీరికి తెలియదు. కాన, వీరు దానిని పదిలపరచుకొని, కుండలు చేయుటకును, వంటకును ఉపయోగింతురు. తీర ప్రదేశములను దాటి, వారు సముద్రపు దూరప్రదేశములలోనికి పోరు. చనిపోయిన వారిని చెట్టు తొఱ్ఱలలో భద్రపరచుట, మృతుల యెడగల ప్రత్యేక గౌరవమును సూచించు ఆచారము.

భాషాశాస్త్రదృష్టితో, వీరి భాషలు మిక్కిలి గమనింపదగినవిగా నున్నవి. సంధి ప్రధానములై ఇవి వ్యాకరణ సంబంధమగు వికాసములేనిపై యున్నవి. వ్యుత్పత్తితో గూడిన వృద్ధిమాత్రము కనబడుచున్నది. ధా తు వు లు, ప్రత్యయములును భాషనునిర్మించు అంగములై యున్నవి. సామాన్య ధాతువులు తరచు నామవాచకములైయున్నవి. మిక్కిలి సామాన్య భావములను వెల్లడించుచు,మాట్లాడుటకు మాత్రమే ఉపకరించుచు, ఈ భాషలు వ్రాతకు కావలసిన సవరణల విషయములో కొరవడి యున్నవి. ముఖవైఖరిని బట్టియు, సంజ్ఞలను బట్టియు చాలవరకు వారి భావములు వెల్లడియగుచుండును.

"ఇచటి ప్రజలు ఉత్సాహవంతులుగాను, ఆనందశీలురుగాను, ఆటపాటలయందు ఆసక్తి గలవారుగాను ఉన్నారు. వీరు అసూయాపరులును, మోసకాండ్రును, పగబట్టువారును అయియున్నారు. కోపము వచ్చినచో ఎంతటి ఘోరమునకయినను తలపడెదరు. అభిమానముతో చూడదగిన వారేకాని, నమ్మదగినవారు కారు” అని బ్రిటీషువారు తమ అనుభవముల ననుసరించి ఆదిమవాసులను గూర్చి అభిప్రాయము వెల్లడించియున్నారు.

కొన్ని చారిత్రక విషయములు:-1858 నుండియు బ్రిటీషు వారిచే నీ దీవులు ప్రభుత్వ శిక్షితుల ఆవాస భూములుగా వాడబడెను. ఫిబ్రవరి 8, 1872లో రాజు ప్రతినిధియగు మేయో ప్రభువు ఈ దీవులకుపోగా, అప్పుడు ఆయనను ఒక ఖైదీ చంపెను. 1942 నుండి, రెండవ ప్రపంచ యుద్ధము ముగియువరకును ఇవి జపాను వారిచే ఆక్రమింపబడి యుండెను. నేడివి భారతరాష్ట్రములలో నొకటిగా పరిగణింపబడి యున్నవి.

నవభారత వ్యవస్థలో అండమాన్ దీవులు:-"అండమాన్ మరియు నికోబార్ దీవులు" అని పిలువబడు నీ భారత రాష్ట్రమునకు సంబంధించిన యీనాటి కొన్ని వివరములు ఈ దిగువ నీయబడుచున్నవి.

(1958 భారత ప్రభుత్వ ప్రచురణ ననుసరించి) మతముల ననుసరించి జనాభా :-

హిందువులు: 9,294; సిక్కులు: 126; జైనులు: 1 బౌద్ధులు : 1,604; జోరాస్ట్రియన్లు : 2; మహమ్మదీయులు :4,783; క్రైస్తవులు : 9,494; ఆదిమవాసులలో వర్గములకు (Tribals) చెందినవారు : 20; వర్గములకు చెందనివారు (Non-tribals) : 5,646.

అక్షరాస్యతః- పురుషులు: 34.2 శాతము. స్త్రీలు: 12.3 శాతము. మెత్తము 25.8 శాతము. ఆర్ధికము:- (కోట్ల రూపాయలలో)

సంవత్సరము ఆదాయము ఖర్చు మిగులు లేక తగులు( + లేక- )
1953-54 1.36 2.38 -1.02
1654-55 1.30 2.91 -1.61

పరిశ్రమలు:- కలపపని ముఖ్యము. పోర్టు బ్లెయిర్ లో రంపపు మిల్లు ఆరణ్యశాఖచే నడపబడుచున్నది. ఇచ్చటనే ఒక అగ్గిపెట్టెల కర్మాగారము "వెస్టర్న్ ఇండియా మేచ్ ఫ్యాక్టరీ" అను కంపెనీచే నడుపబడుచున్నది. చేనేత మగ్గములతో బట్టలు నేయబడుచున్నవి. కొబ్బరిపీచుతో చేయబడు పరిశ్రమలు గలవు.

విద్యః- ఇచ్చట నేడు 1 ఉన్నత పాఠశాల, 2 మాధ్యమిక పాఠశాలలు, 22 ప్రాథమిక పాఠశాలలు కలవు. ప్రాథమిక పాఠశాలలు బేసిక్ పాఠశాలలుగా మార్పబడుచున్నవి. 1955లో.. విద్యార్థుల సంఖ్య 200.

ఆరోగ్యశాఖ:- 5 హాస్పిటళ్ళు, 12 చిన్న వైద్యశాలలు కలవు. పోర్టు బ్లెయిర్ లో మంచి "సివిల్ హాస్పిటల్" కలదు.

సహకారోద్యమము:- 20 సహకార సంఘములు పనిచేయుచున్నవి. వీనిలో 14 అమ్మకము-కొనుగోలు సంఘములై యున్నవి.

భవితవ్యము:- ప్రస్తుతపు భారత ప్రభుత్వమువార అండమాను దీవుల అభ్యుదయమును గూర్చి ఆలోచించి పథకములు వేయుచున్నారు. అండ మాన్ దీవులకు బ్రిటీషువారి కాలములో నేరస్థుల ఆవాస భూమిగా ఏర్పడిన అపఖ్యాతిని ప్రజలు విస్మరించి, అచ్చటికి కొందరు వలస పోవలయును, వ్యవసాయ రంగమున, పారిశ్రామిక రంగమున అభివృద్ధికర కార్యకలాపములను ప్రవేశ పెట్టి స్వయంపోషక రాష్ట్రముగా చేయవలయును. నౌకాశిక్షణ కేంద్రముగా దీనిని చేయవలయును. ఈ సుందర భూములు విహార యాత్రావరులకు దర్శనీయ క్షేత్రముగా వాసికెక్కునట్లు తగు చర్యలు గైకొనవలయును. ఇట్లు కృషి చేసినయెడల అండమాను దీవులు భావిదశ ప్రకాశవంతముగా నుండుననుటకు అవకాశములు గలవు.

క. రా. మా.

[[వర్గం:]]