Jump to content

సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మొదటి సంపుటము/అంటువ్యాధులు-ఎల్లోపాతి

వికీసోర్స్ నుండి

అంటువ్యాధులు-ఎల్లోపాతి

ఘటసర్పి (డిఫ్తీరియా) :- ఇది ఘటనర్పి సూక్ష్మక్రిములవలన సంభవించును. ఇది తుంపరల వలన కలిగిన సంపర్క దోషమువలనను, రోగి ఉపయోగించిన గ్లాసులు, చెంచాలు మొదలగు పరికరముల ద్వారమునను 'వ్యాపించును. కొందరు మటసర్పి వాహకులు నోటిలో క్రిములున్నను తామిందులకు గురికాకుండుటయు కలదు. ఇది గొంతుక వద్ద ప్రారంభించి, పిమ్మట ముక్కులోనికిని, గొంతులోపలి ఊపిరిగొట్టములోనికిని వ్యాపించవచ్చును. చెవి, కంటిగ్రుడ్డు పై పొర, భగరంధ్రము, చర్మమునందలి గాయములు మున్నగు తావులందుకూడ ఘ ట సర్పి రావచ్చును. ఉపరితలముపై ఈ క్రిములు వృద్ధిచెంది సన్నని పొరను ఉత్పత్తి చేయును. శరీరజన్య విషము(టాక్సిన్) కూడ క్రిముల మూలముననే ఉత్పత్తి యగును. అవి శరీరములోనికి ఇంకి హృదయ కండరములను సరిదిద్దు నాడులకు హానిచేయును. పిల్లల యొక్క స్వర పేటికా మార్గములందు ఊపిరి పీల్చకుండా అడ్డు కలుగుట తీవ్ర ఫలితములకు కారణమగును. అంకురించు కాలము 2 మొదలు 4 దినముల వరకుండును. ప్రతి పిల్లకు ఆల్ ము ప్రెసిపిటేటెడ్ టాక్సాయిడ్ సూది టీకాల నిచ్చుటయు, బిడ్డ మొదటిసారిగా బడికి పోవునపుడు మరియొక అదనపు మోతాదును ఇచ్చుటయు ఇందులకు తీసికొనవలసిన నిరోధక చర్య. విదేశములలో ఈ పద్ధతిని అవలంబించి వ్యాధిని కనీస సంఖ్యకు తగ్గింపజాలిరి. ఈ వ్యాధి వచ్చిన పిల్లలను వేరుగ నుంచవలెను. వారికి శరీరజన్య విషవ్యతిరేకమయిన ఔషధములను (ఆంటీ టాక్సిన్ సీరం) అవసరమైన మోతాదులో ఉదయము, సాయంకాలము వ్యాధి నిర్మూలింపబడువరకు ఇవ్వవలెను. కనీసము మూడు వారముల విశ్రాంతి అవసరము. స్వర పేటి కా మార్గమునకు అడ్డు కలిగిన యెడల శస్త్రచికిత్స అవసరము. పెన్సిలిన్, ఘటసర్పి క్రిములపై పనిచేయగలదు. కావున దానిని ఇవ్వవచ్చును. శరీరజన్య విష వ్యతిరేకౌషధము ఉపయోగించుట వలన ఈ వ్యాధిచే చనిపోవువారి సంఖ్యను నూటికి 25 మొదలు 50 వరకు ఉన్న దానిని నూటికి 2.5నకు తగ్గింపజాలిరి.

విష పైత్యజ్వరము (ఇన్ఫ్లుయంజా) :- ఇది రసి వలన కలుగును. తుంపురులచే సంపర్కదోషము వలన వ్యాపించును. శీతకాలములో నిది దేశ ప్రాధాన్యము కల వ్యాధి. అంటువ్యాధుల కాలములో ఇది వ్యాపించుట కవకాశము కలదు. అంకురించు కాలము 1 మొదలు 3 దినముల వరకు ఉండును. పొడిదగ్గుతో 5 దినములపాటు జ్వరము ఉండుట దీని యొక్క లక్షణము. శ్వాస ప్రాంతపు పై భాగమునకు చిక్కు కలుగుటయే పొడిదగ్గు వచ్చుటకు కారణము. జ్వరము తగ్గిన కొన్ని దినముల వరకు రోగికి బలహీనత పొడిదగ్గు ఉండును. ముక్కున కిరుప్రక్కల నున్న యెముకలలో వాపు, చీము ఏర్పడుట (పైనొసై టిస్), శ్లేష్మాధిక్య జ్వరము (న్యూమోనియా) వచ్చుట మున్నగు క్లిష్ట పరిస్ధితులు ఇందు ఏర్పడ వచ్చును. ఈ వ్యాధిని క్రిమి వ్యతిరేక ఔషధముల ద్వారా తగ్గింప వీలు కలుగును.

కోరింతదగ్గు (హూ పింగ్ కాఫ్) :- ఇది బహు తీవ్రమైన సంపర్క దోషము వలన సంభవించు వ్యాధి. క్రిములచే కల్గి, తుంపురుల వలన సంపర్క దోషముచే వ్యాపించును. అంకురించు కాలము 7 మొదలు 14 దినముల వరకు ఉండును. ప్రారంభదశలో పడిసెము, దగ్గు ఉండును. ఒక వారము దినముల తర్వాత తీవ్రమైన దగ్గు, బాధ, బొబ్బరించుట ప్రారంభమగును. రక్తములో(సహజముగా 20 శాతమునకు బదులు) 70-80 శాతము లింఫాసైట్సు ఉండుట కాననగును. సంవత్సరము లోపు వయస్సుగల పిల్లలకు ఇది వచ్చిన యెడల మరణించు ప్రమాదము ఎక్కువగా నుండును. శ్వాసనాళ శ్లేష్మాధిక్య జ్వరము, లోపలనున్న క్షయవ్యాధి బైటపడుట, చంటి బిడ్డగుణము మొదలగునవి కలుగవచ్చును. ఈ వ్యాధి 6 మొదలు 8 వారముల వరకు ఉండును. ఉపశమనౌషధములను, ఆర్యోమైసిన్ వంటి బ్రాడ్ స్పెక్ట్రం క్రిమి వ్యతిరేకౌషధములను ఇచ్చుట ఇందులకు చేయవలసిన చికిత్స. ఇందుమూలమున వ్యాధి తీవ్రత తగ్గి, దగ్గుబాధ రోజునకు పెక్కు పర్యాయములు రాకుండ ఉపశాంతి కలుగును. ఇందులకు తీసికొనవలసిన నిరోధక చర్యలు- 1. నిరోధక సూదిమందు ఇచ్చుట, 2. ఆ వ్యాధిగల పిల్లలను వేరుగా నుంచుట.

గవదబిళ్లలు ( మంప్సు ) :- ఈ వ్యాధి రసి (వైరస్) వలన కలుగును. అంకురించు కాలము 17 మొదలు 18 దినముల వరకు ఉండును. కొద్ది జ్వరము, బుగ్గల యొద్ద మాంసగ్రంధుల వాపు ఉండును. ఇందు వచ్చు క్లిష్ట పరిస్థితులు- 1. వృషణములు వ్యాచుట, 2. కీళ్ళ నొప్పులు, 3. స్వాదుపిండము(పాంక్రియాస్) వాయుట, 4. మెదడు వావు. వ్యాధి లక్షణానుసారముగా చికిత్స చేయవలేను.

గ్లాండులరు జ్వరము :- ఇది పిల్లలలోను పెద్దలలోను ఒక రకపు రసివలన వ్యాపించు వ్యాధి. అంకురించు కాలము 5 దినములు మొదలు 10 దినముల వరకు ఉండును. ఈ క్రింది రకములుగా ఈ జ్వరము వ్యాప్తిలో నున్నది. 1. మెడలగ్రంధులు వాచి, పెద్దవై, జ్వరము వచ్చుట, 3. గొంతు నొప్పి యుండుట. రక్తములో తెల్లకణములు హెచ్చుగా నుండును. సహజముగ 4 శాతమునకు బదులు మానొసైటులు 60-75 శాతము ఉండును. వ్యాధి లక్షణానుసారముగ చికిత్స చేయవలెను.

స్కార్లెటు జ్వరము :- ఇది ఇంగ్లండు మొదలగు శీతల దేశములలో మాత్రమే వచ్చును. ఇది సంపర్క దోషమువలన సంచలిం చెడు జ్వరము. స్ట్రెపోకాకస్ హిమవిటికస్ అను ప్రత్యేక క్రిముల వలన కలుగును. గొంతు కంతయు మంటతో వాచుట, చర్మముమీద పొక్కులు లేచుట ఉండును. నాలుక యొక్క కొనలు ఎఱ్ఱబడి మధ్య భాగము తెలు పెక్కును. జ్వరముండును. విషజన్య రక్త దోషము కలిగినచో వ్యాధి తీవ్రరూపములు ధరించును. రోగిని తక్కినవారి నుండి వేరుచేయుట, స్ట్రెప్టో కోకల్ద్ర వమును సూదిమందుద్వారా ఇచ్చుట, పెన్సిలిన్ మొదలగు సూదిమందు లిచ్చుట- ఇందులకు జరుగవలసిన చికిత్సలు.

విషసర్పి రోగము ( ఎతిసెవెలస్) :- తీవ్రమగు ఈ అంటురోగము హిమొలైటిక్ స్ట్రెప్టోకోకస్ తొ స్థానిక సంపర్క దోషము వలన సంభవించును. జ్వరము, చర్మము మీద ఎఱ్ఱటి వాపు ఉండును. ఇది సాధారణముగా ముఖముమీద, పిల్లలకు నాభిస్థానము ప్రక్కన కలుగును. పెన్సిలిన్ ఇచ్చుట ఇందుకు తగిన చికిత్స.

దొమ్మరోగములు (ఆంత్రాక్సు ) :- జంతువులకును, లేక వాటి చర్మములకును, రోమములకును సమీపమున నుండు వారికి సంపర్క దోషముచే క్రిములవలన వచ్చు వ్యాధి. రోగపీడితమైన జంతువుల రోమములచే చేయబడిన కుంచెలను క్షురకర్మకు ఉపయోగించి దీనికి గురి యగుదురు. అంకురించుకాలము 24 మొదలు 72 గంటల వరకుండును. చర్మముమీద ఒక పొక్కు లేచి అందు చీము కలిగి దాని చుట్టును ఉబ్బును. జ్వరము వచ్చును. ఒకప్పుడు ఊపిరితిత్తులుకూడ దీనికి గురికావచ్చును. పెన్సిలిన్ మరియు ఆంత్రాక్సు సీరం ఇచ్చుట ఇందులకు సరియగు చికిత్స.

పెంచారోగము ( గ్లాండర్సు):- ఇది ఒక అంటురోగము. ముక్కునుండి కారుట, ఒకప్పుడు చర్మము పై పొక్కులు లేచుట, ఎముకలందు, కీళ్లయందు నొప్పులు ఉండును. జబ్బుగల గుఱ్ఱములను కాచువారికి సూర్మక్రిములు లోన ప్రవేశించుట వలన కలుగును. ఇది చాల ప్రమాదకరమయిన రోగము.

టులరీమియా :- గుఱ్ఱపు ఈగ కాటువలన కలుగు ఈ రోగము క్రిములచే అంకురించును. అమెరికా సంయుక్త రాష్ట్రములు, రష్యా, జపాన్ దేశములలో ఈ వ్యాధి విస్తారముగా కన్పడును. మెడ క్రింది మాంస గ్రంధులు పెరుగుట, టైఫాయిడ్ను పోలిన జ్వరము వచ్చుట దీని లక్షణములు. ఒక రకపు ఆంటీసీరము మరియు స్ట్రెప్టోమైసిన్ ఈ రోగమును అరికట్టుటలో మంచి ప్రయోజనకారులుగ నున్నవి.

సిటాకోసిస్ :- ఇది రామచిలుకలకు ఒక రసి వలన వచ్చు వ్యాధి. ఈ వ్యాధిగల పక్షులు విసర్జించిన పదార్ధపు గాలిని పీల్చుట వలన ఆ వ్యాధితో సంపర్క దోషము వాటిల్లును. అంకురించు కాలము 7 మొదలు 12 దినముల వరకు ఉండును. పిమ్మట రోగికి టైఫాయిడ్ను పోలిన ఒక రకపు జ్వరము వచ్చును. ఊపిరి తిత్తులకు వ్యాధి సోకిన చిహ్నములు కానవచ్చును. దీనినుండి కోలుకొనుటకు రెండు మూడు వారములు పట్టును. ఇందువలన సంభవించు మరణముల శాతము 16-35 వరకు ఉండును. రోగ లక్షణానుసారముగా చికిత్స చేయవలెను.

బోర్ హంవ్యాధి :- ఛాతి లో తీవ్రమగు నొప్పి, జ్వరము ఉండును. ఇందులకు గురియైన కండరములను నొక్కినచో నొప్పి కలుగును. ఈ వ్యాధి రెండు మూడు దినములలో తగ్గిపోవును. వ్యాధి లక్షణానుసారముగా చికిత్స చేయవలెను.

రొంప (Common Cold) :- ఇది సాధారణముగ వచ్చు వ్యాధి. ఇది రసి వలన వచ్చును. జనసమ్మ ర్ధముగల ప్రదేశములలో ఎక్కువమంది ఈ వ్యాధికి గురియగుట జరుగును. తుంపురుల వలన, సంపర్క దోషము ద్వారా ఇది వ్యాపించును. మొదట తలనొప్పి, ముక్కు లో తేమ లేకుండుట- వీనితో ప్రారంభమై తర్వాత ముక్కునుండి కారుట మొదలిడును. దీని వలన చెవినొప్పి, దగ్గు కలుగవచ్చును. ఇందులకు వ్యాధి లక్షణాను సారముగ చికిత్సయు, ఒకటి రెండు రోజుల విశ్రాంతియు అవసరము.

సంపర్కదోషజన్యమైన కాలేయరోగము (Infective Hepatitis) ఇది రసివలన కలుగును. అంకురించు కాలము 17 మొదలు 35 దినముల వరకు ఉండును. ఈ వ్యాధి అంతర్గతముగా నున్న వారికి కామెరల బాధ కలుగదు. అవియే సంపర్క దోషమును వ్యాపింపజేయు ముఖ్యసాధనములు. కాకి రసి వలన, తుంపురుల వలనను, మలమూత్రముల వలనను, ఈ వ్యాధి వ్యాపించును. ఈ వ్యాధి మొదటి వారములో ఆకలి లేకుండుట, తలనొప్పి, జ్వరము, వాంతులు ఉండును. తర్వాత కామెర్లు వచ్చును.మూత్రములో పైత్యరసముండుటచే మూత్రము ఎఱ్ఱగా నుండును. ఒడలు దురద పెట్టును. ఇది 6 లేక 8 వారములలో తగ్గిపోవును. కాలేయము పూర్తిగా చెడి, మరణము సంభవించుట అరుదు. సూదులను సంపూర్ణముగా శుభ్రము చేయకుండ సూదిమందు ఇచ్చినయెడల కూడ ఇది ఒకరి నుండి మరియొకరికి వ్యాపించుటకు అవకాశము గలదు. ఇది అంకురించుకాలము 56-289 రోజులు. (సగటు 101 రోజులు). దీనికి జరుగవలసిన చికిత్స యందలిముఖ్య విషయములు 1. విశ్రాంతి, 2. గ్లూకోసు నీళ్ళు త్రాగుట, 3. వ్యాధి లక్షణానుసారముగ చికిత్స. ఆరోగ్యము చక్కబడువరకు రోగి పనిలో ప్రవేశింపరాదు.

మెనిం జైటీస్ (Meninjitis) :- మెదడు చుట్టునుగల పొరలలో మెనింగోకోకస్ అను క్రిముల వలనను, లేక రసీ వలనను వాపు వచ్చును.

సెరిబ్రోస్పైనల్ జ్వరము (Serebro Spinal fever);_దగ్గు తుమ్ముల మూలకముగ, తుంపురులు చిందుట వలన ఇది ఒకరినుండి మరియొకరికి ప్రాకును. మెనింగో కా కై దీని యుత్పత్తికి కారణము. శరీరమందంతటను వ్రేళ్ళ యందును నొప్పులతోను, జ్వరముతోను భరించరాని తలనొప్పితోను ప్రారంభమయి శరీర మంతయు ఒకప్పుడు వివర్ణమగును. మెడ బిగువుగా నగును. మడమ పట్టుకొని కాలు పై కెత్తిన, తొడలో నొప్పి కలుగును. తల నొప్పి, వాంతులు ఉండును. ఒకప్పుడు అసాధారణముగ రోగి శరీరము చల్లబడును. సూదిని వెన్నెముకల మధ్యనున్న సందులోనికి పోనిచ్చి పొరలలోపలి ద్రవమును (సెరిబ్రో స్పయినల్ ద్రవము) తీసినయెడల దానిలో చీము, క్రిములు ఉండును.

ఇందుకు జరుగ వలసిన చికిత్స:-1. ప్రతిదినము పెన్సిలిన్ సూదిమందు వెన్నెముకద్వారా మజ్జపై నుండు పొరలలోనికి ఇచ్చుట, 2. సల్ఫా ఔషధములను నోటి ద్వారా ఇచ్చుట, 3. శరీరము చల్లబడిన యెడల ఎడ్రినల్కార్టికల్ ఎక్స్ట్రాక్టును ఇవ్వవలెను. ఇతర రకములమెనంజైటిస్ వ్యాధులను గూర్చి వ్యాధి నిరూపణ చేయుటకు మార్గములు:-

1. వెన్నెముక మధ్యనుండి ద్రవమును తీసి క్రిములను పరీక్షించవలెను. న్యూమోకాకై, స్టీఫిలో కాకై, స్ట్రెప్టో కాకై వలన కలిగిన ఎడల పై చికిత్స చేయవలెను.

2. క్షయవలన కలిగిన మెనంజై టీస్ అగుచో, వెన్నెముకనుండి తీసిన ద్రవము స్వచ్ఛముగా నుండును. కాని పరీక్షించిన, క్షయవ్యాధి క్రిములుండవచ్చును. ప్రతిదినము స్ట్రెప్టోమైసిన్ సూదిమందు ద్వారమునను, నొకొటినిక్ ఆసిడ్ హైడ్రజైడ్ గోలీలను ఇచ్చుటవలనను చాలమంది ఇందుండి విముక్తులై బ్రతికిరి. ఈ వ్యాధికి 6 నెలలనుండి 2 ఏండ్ల వరకు చికిత్స చేయవలెను.

బినైన్ లింపసైటిక్ మెనింజైటీస్ :- ఇది రసివలన సంభవించు రోగము. వెన్నెముకల మధ్యనుండి తీసిన ద్రవము నందు లింపోనైట్స్ ఉండును. రోగి త్వరలోనే స్వస్థత పొందును.

మెనంజిజం:- అనగా వైద్యశాస్త్రరీత్యా మెనం జైటిస్ వ్యాధి యొక్క లక్షణములు గోచరించెడు పరిస్థితి. వెన్నెముకమధ్య ద్రవమును తీసి చూచిన అది నిర్మలముగా నుండును. ఈ పరిస్థితి తనంతట తానే చక్కబడును.

మెదడువాపు (Encaphalitis Lethargica) :- నాడీ మండలమునకు ఒక విధమైన రసివలన సంపర్క దోషము వాటిల్లును. ఇది తీవ్రముగను దీర్ఘముగను ఉండు లక్షణముగల వ్యాధి. ఈ వ్యాధి తీవ్రమైన పరిస్థితిలో— నిద్ర, మత్తు, కనురెప్ప వాయుట, మెల్ల, ఒకే వస్తువు రెండుగ కనబడుట, జ్వరము, అధికనిద్ర ఉండును. ఇది అంటువ్యాధిగ వ్యాపించినచో పెక్కుమంది మృతికి కారణమగును. కానీ సాధారణముగ ప్రారంభమునుండియు సాధువుగనేయుండి కష్టనష్టములు లేకుండగనే గడచి పోవును. తర్వాత రోగియందు వణుకు రోగము (పార్కింసన్ వ్యాధి) లక్షణములు కనుపించును. రోగలక్షణానుసారముగ ఇందుకు చికిత్స చేయవలెను.

పొంగు, మసూచి, గవదబిళ్ళలు, రసులు కూడ మెదడువాపు వ్యాధికి కారణములు కావచ్చును. ప్రాథమిమైన టీకాలు వేసిన 6 మొదలు 14 దినముల తరువాత రోగి మెదడు వాపు వ్యాధికి గురియై చనిపోవుటగాని, శారీరకమైన లేక మానసికమైన స్వస్థతను కోల్పోవుట కాని జరుగవచ్చును. ఇందు సాధారణముగ క్లిష్టపరిస్థితులు రావు. ప్రాథమికమైన టీకాలను ఆలస్యముగా వేయించుట ఇట్టి పరిస్థితుల రాకకు దారితీయును. శిశువునకు మొదటి సంవత్సరములోనే టీకాలు వేయించుట ఇందులకు తీసికొనవలసిన నిరోధక చర్య.

(ఇతర అంటువ్యాధులు ఉష్ణమండల వ్యాధులు అను వ్యాసములో వర్ణింపబడినవి).

డా. వెం. రా.


[[వర్గం:]]