సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మూడవ సంపుటము/గెటే (Goethe)
గెటే (Goethe) :
జర్మన్ వాఙ్మయమునందు నవయుగోదయమునకు మూలపురుషుడై, యూరోపియన్ సాహిత్య ప్రపంచమునకు మకుటము లేని మహారాజని సమకాలికులచే కొనియాడబడిన జర్మన్ రచయిత జొహాన్ వుల్ఫ్ గాంగ్ వాన్ గెటే క్రీ. శ. 1749 ఆగస్ట్ నెల 28 వ నాడు జర్మనీ దేశము నందలి 'ఫ్రాంక్ ఫర్ట్-ఆన్ ది మెయిన్' పట్టణమున సంపన్నుల యింట జన్మించెను. న్యాయవాదియైన తండ్రినుండి చిత్తస్థైర్యమును, రసజ్ఞురాలైన తల్లివలన చక్కని కవితాశక్తియు ఆతని కలవడెను. అతని బాల్యము సంస్కృతి సూచకములైన పుస్తకములతో, చిత్రములతో, సంగీతముతో నిండిన వాతావరణము నడుమ గడచెను. పిన్ననాటనే గెటే ఇంగ్లీష్, ఫ్రెంచి, లాటిన్ భాషల నభ్యసించెను. అప్పుడు ఫ్రాంక్‌ఫర్ట్‌లో ప్రదర్శింపబడిన ఫ్రెంచినాటకము లతనికి రంగస్థలముపై నభిమానమును కలిగించెను. క్రైస్తవ మతగ్రంథ మగు బైబిల్‌లోని కథ లాతనిని అమితముగ ఆకర్షించెను. పది సంవత్సరముల ప్రాయమునందే గెటే కవిత్వ రచన మారంభించెను.
తండ్రి కోర్కెపై, గెటే పదునారవ యేట న్యాయశాస్త్రము నభ్యసించుటకు లైవ్ జిగ్ విశ్వవిద్యాలయ మున కేగెను ; కాని చదువుమాత్ర మచుట క్రమబద్ధముగ సాగలేదు. గ్రంథపఠనమునం దాతని కాసక్తి లేకుండెను. తన కచట సంఘటిల్లిన ప్రణయోదంతమునే కథావస్తువుగా గ్రహించి, యతడొక నాటకము నపుడు రచించెను. తన హృదయమును అత్యంతము సంచలింపచేసిన వివిధానుభూతులను అతడు చిన్న గీతికలలో వర్ణించుచు, ఆత్మాశ్రయ కవిత్వమునకు పెక్కు క్రొత్త సొగసులను తీర్చెను. ఈ విధముగ లైవ్ జిగ్ లో మూడేండ్లు గడచిన వెనుక అతడు తీవ్రమైన యనారోగ్యమునకు గురియగుటచే ఇంటికి తిరిగి పోవలసివచ్చెను. శరీరము చాల నీరసించుటచే సుమారు రెండుసంవత్సరముల పాటాతడు మంచము పట్టియుండెను. అప్పుడతనికి వాన్‌క్లెటెన్‌బర్గ్ అను స్నేహశీలతో సన్నిహిత సంబంధ మేర్పడెను. ఆమె స్నేహ ప్రభావమున గెటే తన దృష్టిని ఆధ్యాత్మిక పథము మీదికి మరల్చెను. మతమును గూర్చి, దైవమును గూర్చి, ముక్తిని గూర్చి పెక్కు రచనలలో గెటే వెల్లడించిన భావము లన్నిటికిని ఆతని హృదయక్షేత్రమునం దపుడే బీజ నిక్షేపము కావింపబడెను. అపు డతడు ప్రచురించిన మధుర గీతములను తానే గడ్డిపువ్వులతో పోల్చెను.
శరీరమునకు స్వస్థత చిక్కిన తరువాత గెటే న్యాయశాస్త్ర పఠనమును ముగించుటకు ఈ పర్యాయము స్ట్రాస్‌బర్గ్ విశ్వవిద్యాలయమున కరిగెను. అచ్చట అతనికి ప్రసిద్ధ జర్మన్ రచయిత హెర్డర్ తో సఖ్యమేర్పడెను. ఈ మైత్రికి పర్యవసానముగ సాహిత్యము నందలి వివిధ రీతులను గూర్చి గేటేకు సునిశ్చితమైన దృక్పథమేర్పడెను. ఉత్తమ సాహిత్యమునకు స్వచ్ఛందమైన యనుభూతియే నికషోపలము వంటిదని హెర్డర్ విశ్వాసము. అతనితోడి మైత్రి వలన గెటే జర్మన్ జానపదవాఙ్మయ సౌందర్యమును, హోమర్, షేక్స్‌పియర్ మహాకవుల కావ్యనాటకము లందలి రసరామణీయకములను చక్కగా గ్రహించెను. నాటి నుండి యతడు ఫ్రెంచి సాంప్రదాయిక కవిత్వపు నియమ బంధములను త్రెంచివేసి, తన వ్యక్తిత్వమునకు అనుకూలమైన నూత్నపథములలో కవిత్వ రచనకు ఉపక్రమించెను. అచట నొక పల్లెపడుచుపై తనకు జనించిన యనురాగమును వెల్లడించుచు గెటే రచించిన భావగీతములు జర్మన్‌భాషలోని గేయ వాఙ్మయమునందు అత్యున్నత స్థానమును ఆర్జించుకొన్నవి. ఈ గీతముల విశిష్టతకు మూలమందు అడుగడుగున కానవచ్చు రసధ్వని, వాచ్యముగ వాని యందు ప్రకటితమైన భావముల కంటె అవి స్ఫురింపజేయు వ్యంగ్యార్థము అత్యంత రమణీయముగ నుండుటయే వాని ప్రశస్తికి ముఖ్య కారణము.
గెటే 1771 లో న్యాయశాస్త్రమున పట్టభద్రుడై ఫ్రాంక్‌ఫర్ట్ పట్టణమునకు తిరిగివచ్చి న్యాయవాద వృత్తిని స్వీకరించెను. మూడేండ్ల తరువాత, 1774 లో “ది సారోస్ ఆఫ్ యంగ్ వెర్తర్" అను నవల నతడు ప్రకటించెను. ప్రకృతిని, పసిపాపలను, కల్లకపటము లెరుగని కష్టజీవులను, నిరాడంబర జీవితమును ప్రేమించు సుకుమార హృదయు డొకడు సమాజమునందు వ్యాపించియున్న స్వార్థపరత్వమును, కాఠిన్యమును చూచి భరింపలేక, పరునకు భార్యగా నిశ్చయింపబడిన పడుచుపై తనకు గలిగిన ప్రేమను అణచుకొనలేక, నిరర్థకమును, నిరాశాపూరితము నగు బ్రతుకు బరువును మోయలేక, తుద కాత్మహత్య గావించుకొనుట ఇందలి ఇతివృత్తము. ఆ నవల ప్రకటితమైన యనతికాలముననే జర్మన్ పాఠక లోకమును ఆశ్చర్య చకితము గావించి, క్రమముగ గెటే కీర్తిలతలను యూరప్ ఖండమునందంతటను అలముకొన జేసెను. అతని కృతులలోనికెల్ల తలమానికమని పండితులచే భావింపబడుచున్న 'ఫాస్ట్' నాటకమునకు సైతము అంకురార్పణ మపుడే జరిగెను.
తరువాత 1775 లో గెటే 'ఎగ్మాంట్' అను విషాదాంత నాటకమును రచించుచుండగా 'వీమార్' పరిపాలకుడగు కార్ల్ అగస్టస్ అతనిని సగౌరవముగ తన సభ కాహ్వానించెను. క్రమముగ వారి స్నేహము దృఢమగుటచే, కార్ల్ అగస్టస్ గెటేకు తన కొలువులో నొక మంత్రిపదవి నొసగి, యావజ్జీవిత మతనిని తన చెంతనుంచుకొనెను. నాటినుండి రాజకీయ వ్యవహారములలో తల మున్కలగుచుండుటవలన గెటే కొంతకాలము సాహిత్య వ్యాసంగమునకు స్వస్తి చెప్పవలసివచ్చెను. ఈ నూతన వాతావరణమునం దతడు అవకాశము లభించినపు డెల్ల వృక్ష, జంతు, ఖనిజ, భూగర్భశాస్త్రముల నభ్యసించుచు, తన పరిశోధనలకు పర్యవసానముగా వృక్షజీవితము నందలి పరిణామములనుగూర్చి యొక వ్యాసమును ప్రకటించెను. రాజకీయ వ్యవహారము లతని కళామయజీవితమునకు అంతరాయమును కలిగించుచుండుటచే 1786 లో అతడు విహారార్థము ఇటలీదేశమునకేగి, రెండేండ్లపాటచ్చట నుండెను. అతని కళాకౌశలమచట పునరుజ్జీవితమై, “ఇఫిజీనియా”, “టాసో” వంటి ప్రశస్తరచనల రూపమున వ్యక్తమయ్యెను. ఇటలీనుండి వీమార్ పట్టణమునకు తిరిగివచ్చినతరువాత గెటే ప్రభుత్వ కార్యనిర్వహణము నందు జోక్యము కలిగించుకొనక తన కాలమును శాస్త్ర సాహిత్య కార్యకలాపములలో గడపెను.
“ఫాస్ట్" నాటకపు ప్రథమభాగము తొలిసారి 1790లో ప్రకటితమయ్యెను. ఆకాలమున విషయవాంఛలకు వశుడై తన భోగలాలసతకు బలిగా శరీరాత్మలతో సైతానునకు అమ్ముడుపోయిన జర్మన్ మాంత్రికుడైన జాన్ఫాస్టు యొక్క గాథ వివిధభాషలలో బహుకావ్య నాటకముల రూపమున బహుళ ప్రచారము నందియుండెను. ఆ కథను తిరిగి గెటే తన నాటకమునకు ఇతివృత్తముగా గ్రహించి, సృష్టిరహస్యమును, జీవిత పరమావధిని గ్రహించుటకు విఫల ప్రయత్నములను గావించుచున్న ఫాస్ట్ హృదయా వేదనలో యావన్మానవులు భావమధనమును ప్రతిఫలింప జేసి, ఫాస్ట్‌కథకు విశ్వజనీనతను ఆపాదించెను. జీవిత చరమ లక్ష్యములను గూర్చిన శుష్కమైన యోచనల యందును, క్షణికమైన ప్రాపంచిక సుఖానుభూతుల తళుకులందును గడచు కాలము వ్యర్థమనియు, మానవుడు తోడి మానవునకు సేవచేసిన క్షణమే సార్థకమనియు నొక సందేశము నందు అంతర్లీనమై యున్నది. గెటే తన యావజ్జీవితము ఈ నాటకమునకు మెరుగులు దిద్దుచునే యుండెననిన, అతనికీ నాటక మెంత యభిమాన పాత్రమైనదో తెలియగలదు.
తరువాత 1794 లో గెటేకు జర్మన్ రచయిత షిల్లర్ తో సఖ్యమేర్పడెను. అప్పుడే గెటే రచించిన నవలలలో మిక్కిలి ప్రసిద్ధమైన “విల్హెల్మ్ మెయిస్టర్” ప్రకటితమయ్యెను. అతని భావగీతములలో అత్యంత మధురమైనవి కొన్ని ఈ నవలలో నున్నవి. గెటే 1806 లో క్రిస్టియానే అను యువతిని పెండ్లియాడెను.
“ఫాస్ట్" నాటకమును కొంత సంస్కరించి ప్రథమ భాగమును 1808 లో మరల గెటే ప్రకటించెను. అంతకు ముందెన్నడును అంతటి విశిష్టమైన నాటకము జర్మన్ భాషలో రచింపబడలేదని విద్వాంసులు ఏకగ్రీవముగ నంగీకరించి, తమ హర్షమును వెలిబుచ్చిరి. అప్పుడే నెపోలియన్ దండయాత్రల మూలమున యూరప్ ఖండమంతయు కల్లోలితస్థితిలో నున్నను, గెటేమాత్రమిక రాజకీయములతో ప్రమేయము పెట్టుకొనక, తన కాలమును శాస్త్రపరిశోధనయందును, సాహిత్య సేవయందును గడిపెను. "నా జీవితమునుండి కవిత్వము - సత్యము” అను శీర్షికతో అతడు తన యాత్మకథను అపుడే ప్రకటించెను. తుదినాళ్ళలో నతడు తన దృష్టినంతను “ఫాస్ట్ " నాటకముపై కేంద్రీకరించి, 1831 లో ద్వితీయభాగమును కూడ పూర్తి చేసి లోకమున కర్పించెను. తరువాత కొలది కాలమునకే 1832 మార్చి నెల 18 వ నాడు గెటే మరణించెను.
రచయితగా గెటేలో ముఖ్యముగా ప్రశంసింపదగినది అతని విశ్వజనీనదృష్టి. దైనందిన జీవితములోని సామాన్య సంఘర్షణలవెనుక దాగియున్న చిరంతన సత్యములను అతడు సునిశితముగ పరీక్షించి, తన నవలలలోను, నాటకములలోను వెల్లడించెను. కాళిదాస మహాకవికృతమైన శాకుంతల నాటకానువాదమును చదివి గెటే వెల్లడించిన యానందోత్సాహములు అతనిని మన కత్యంత సన్నిహితుని గావించినవి.
అ. రా.