సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మూడవ సంపుటము/గెలిలియో
గెలిలియో :
మొట్టమొదటి సారిగా మానవునిలో పరిశోధనాభిలాషను, వైజ్ఞానిక జిజ్ఞాసను రేకెత్తించిన మహామేధావి గెలిలియో. వైజ్ఞానిక విషయములలో పలువురు మహామహులు తమతమ నమ్మకము లాధారముగా ప్రవచించిన పెక్కు సిద్ధాంతములకన్న ఒక సామాన్య వ్యక్తి నిదర్శనాత్మకమైన ప్రయోగదృష్టితో నెలకొల్పిన స్వల్ప విషయమైనను వేయి మడుంగులు విలువకలిగి యుండునని చాటిన ధీరు డాతడు.
గెలిలియో ఇటలీదేశమున ఒక నిర్థన గౌరవ కుటుంబములో క్రీ. శ. 1564 సం. ఫిబ్రవరి 18వ తేదీన జన్మించెను. చిన్న నాటినుండియు అతనికి ఆటవస్తువులు, యంత్రములు మొదలైనవానిని తయారు చేయుటయందు అధికమైన ఆసక్తి ఉండెడిది. గెలిలియో పదునేడవ యేట (1581) లో వైద్యవిద్య నభ్యసించుటకై 'పైసా' విశ్వవిద్యాలయమున చేరెను. అచ్చట ఒకనా డొక చర్చిలో వ్రేలాడగట్టబడిన దీపము ఊగులాడుట చూచి, తన నాడితో దానిని పోల్చి, "లోలకముల సమకాలికత్వము” (Pendulum isochronism) అను సూత్రమును కనిపెట్టెను. తరువాత లోహపు గుండు నొక దానిని దారముతో వ్రేలాడగట్టి, లోలకము కురుచ అగుచున్న కొలది అది ఊగుటకు తక్కువ కాలము పట్టుననియు, అది ఊగుచున్న దూర మెంత అయినను ఒకసారి ఊగుటకు పట్టుకాలము మారదనియు నిశ్చయించెను.
యూక్లిడుయొక్క గణిత గ్రంథములను చూచుట తటస్థించుటచే, నాత డట్లే గణిత, భౌతికశాస్త్రము లందు మంచి పాండిత్యము సముపార్జించెను. ప్రాచీనుడగు అర్కిమెడీసు వ్రాసిన ద్రవస్థితిశాస్త్ర (Hydrostatics) విషయములు శ్రద్ధగాచదివి, ద్రవస్థితిత్రాసు (Hydrostic balance) ను కనుగొనెను. 1584 సం. నాటికి 'పైసా' విశ్వవిద్యాలయము నందే ఈతడు గణిత శాస్త్రాచార్యుడుగా నియమితు డయ్యెను.
గెలిలియోకు పూర్వము శాస్త్రజ్ఞులలో ప్రయోగాత్మకముగా విషయ నిరూపణ మొనరించు అలవాటు లేకుండెను. అట్టిస్థితిలో వారికి మొట్టమొదటిసారిగా వైజ్ఞానిక దృష్టిని కలుగజేయుటకై ప్రయత్నము సలిపినవా డాతడు. మానవుడు తాను చూచు విషయము లన్నియు ఎందుల కట్లు జరుగుచున్నవని ప్రశ్నించుట కన్న అవి ఎట్లు జరుగుచున్నవను విషయమును గూర్చి విచారించుట ఈతని దృష్టి. అనగా ఒక కార్యము ఎందులకు జరిగినదని విచారించుటకన్న ఆ కార్యము జరిగిన క్రమమును పరిశీలించుట వైజ్ఞానిక దృష్టి యని అర్థము.
రెండువేల సంవత్సరముల క్రిందట చనిపోయిన అరిస్టోటిల్ సిద్ధాంతములనే ఈతని కాలపువారు విశ్వసించు చుండిరి. కాని గెలిలియో స్వేచ్ఛగా నాలోచించు శక్తిమంతుడు, అరిస్టోటిల్ సిద్ధాంతము ప్రకారము రెండు వస్తువుల నొకేదూరము నుండి ఒకేసమయమున భూమిపై పడవేసినపుడు వాటిలో బరువైన వస్తువు రెండవదానికన్న వేగముగా భూమిని చేరవలెను. గెలిలియో దీనిని అశాస్త్రీయమని నిరూపించుచు, పైసానగరమున ఏటవాలుగా నున్న ఒక ఎత్తైన భవనము మీది నుండి గురు, లఘు పరిమాణములు గల రెండు ఇనుప గుండ్లను జారవిడిచి, రెండును ఒకేసమయమున భూమిని చేరునని నిదర్శన పూర్వకముగా నిరూపించెను.
చిత్రము - 114
గెలిలియో
క్రీ. శ. 1592 నుండి 1610 వరకు 'పడువ' (padua) విశ్వ విద్యాలయము నందు గణిత శాస్త్రాచార్యుడుగా నుండి, గొప్ప ఉపాధ్యాయుడుగాను, ఉపన్యాసకుడు గాను చాల ప్రసిద్ధిగాంచెను. ఆ రోజులలో ఆయన గాజు గోళమునకు పొడుగాటి గొట్టము తగిలించి, గొట్టముయొక్క కొనను నీటిలో ముంచి, కొంతవరకు నీటితో పూరింపబడిన గొట్టమును ఉష్ణమాపకముగా ఉపయోగించెను. అట్లు గెలిలియో మొదటి ఉష్ణమాపకమును తయారుచేసెను.
గెలిలియో మొదటి నుండియు కోపర్నికస్ సిద్దాంతము లందు నమ్మకము కలిగియున్నను, దానిని బహిరంగపరచ లేదు. అరిస్టోటిల్ సిద్ధాంతము ప్రకారము ఖగోళమునందు మార్పులేమియు జరుగవు. (Incorruptability of heavens). గెలిలియో 1604 లో అంతరిక్షమున తేజోవంతముగాప్రకాశించు ఒకానొక నక్షత్రమును గమనించి, దానిని సూర్య కుటుంబమున కెంతో ఆవలగల ఒక స్థిరమైన నక్షత్రమని నిరూపించెను. ఆకాలము నందే వెలుతురు, రంగు, గతిశాస్త్రము (Dynamics), యంత్ర గతిశాస్త్రము (Mechanics) మొదలగు విషయములపై గ్రంథములను రచించెను. స్ల యిడు రూలు తయారుకాక పూర్వమే సంవర్గమానములు (Logorithms) కనిపెట్ట బడక పూర్వమే క్రీ. శ. 1606లో ప్రొపోర్షనల్ కాంపస్ (proportional compass) అనుదానిని తయారుచేసెను. దీనితో గుణకారభాగహారములను త్వరగా చేయవీలగును. దీనిని ఆయన 'జ్యామెట్రికల్ మిలటరీ కాంపస్ ' (Geometrical Military Compass) అనెను.
క్రీ. శ. 1609 లో గెలిలియో 'కుంభకటకము' (Convex Lens), 'పుటకటకము' (Concave Lens) లను చేర్చి, వానిని సీసపు గొట్టములో నమర్చెను. అదియే ప్రథమ దూరదర్శినియంత్రము. దీని సాయముతో ఖగోళములో ననేక అద్భుత విషయములను కనిపెట్టెను. 'పాలపుంత' (Galaxy) నిండ నక్షత్రములే కలవనియు, చంద్రుని నిండ మిట్టపల్లములు, పర్వతశ్రేణులు, లోతైన లోయలు కలవనియు, కాంతికూడ అన్ని భాగములయందు సమముగా లేదనియు కనుగొనెను. క్రీ. శ. 1610 లో బృహస్పతి గ్రహమునకుగల 11 ఉపగ్రహములలో నాల్గింటిని గెలిలియో కనుగొనెను. అవి బృహస్పతి గ్రహముచుట్టును పరిభ్రమణము చేయునని కనిపెట్టెను. శుక్ర గ్రహముయొక్క కళలు (Phases) కోపర్నికస్ ఎట్లుండునని జోస్యము చెప్పెనో, అట్లేయున్నవని ఇతడు నిరూపించెను.
గెలిలియో యొక్క గొప్పతనమును గుర్తించి 'పడువా' విశ్వవిద్యాలయమువారు ఆయనను జీవిత పర్యంతము గణితాచార్యునిగా నియమించిరి. గెలిలియో తన దూరదర్శిని యంత్రమును అభివృద్ధిచేసి, సూర్యుని పరీక్షించెను. సూర్యునియందు కొన్నిమచ్చలు కలవనియు, సూర్యుడంతయు తేజోవంతమైన గోళము కాదనియు, సూర్యునిలోని మచ్చలు క్రమముగ కదలుచుండుటచే సూర్యుడుకూడ ఒక అక్షము (Axis) మీద తిరుగుననియు నిరూపించెను. 1611లో రోములో సన్మానమును పొందుటకు వెళ్ళి అచ్చటగల పెద్దలకు తన దూరదర్శినిద్వార సూర్యునిలోని మచ్చలు మొదలైనవానిని చూపెను. కాని చాలమంది అది అంతయు ఏదో కనికట్టు విద్యక్రింద జమకట్టి ఆయనపై కత్తికట్టిరి. గెలిలియో శనిగ్రహము చుట్టును వలయములు (Rings) ఉన్నట్లు తెలిసికొనెను. 1614లో ఈయన మొదటి సూక్ష్మదర్శినినిచేసి, ఈగలు మొదలగువాని ఒంటిమీదగల రోమములను పెద్దవిగా కనిపించునట్లు చూపెను. కాంతి యొక్క వేగమును నిర్ణయించుటకు ప్రయత్నించెను కాని, ఈయన కనుగొన్న బుధ చంద్రుల సాయముతో కొలది కాలములోనే రోమర్ (Romer) కాంతివేగమును కనుగొనెను.
గెలిలియో చేయు పరిశోధనములన్నియు మతాధికారులు విశ్వసించుచున్న భావములను, అరిస్టోటిల్ సిద్ధాంతములను ఖండించుచుండుటచే రోమన్ చర్చికి ఆతనిపై ద్వేషము కలిగెను. ఆయనను పాషండుడనిరి. కోపర్నికస్ వ్రాసిన గ్రంథములను, గెలిలియో సమకాలికుడగు కెప్లర్ వ్రాసిన గ్రంథములను మతగురువులు నిషేధించిరి. 1615 లో గెలిలియోను ఎనిమిదవ పోప్ అర్బన్ (Pope urban VIII) అను నాతడు రోమ్‌లో గౌరవించెను. కాని గెలిలియో కోపర్నికస్ సిద్ధాంతములను బాహాటముగా సమర్థించుటచే మతవిరుద్ధములగు ప్రచారములను మానుకొనవలెననియు, లేనిచో అతడు కఠిన కారాగారశిక్షకును, చిత్రహింసకును గురికావలసి యుండుననియు పోప్ అర్బన్ హెచ్చరించెను.
1615 లో గెలిలియో 'పడువా' నుండి ఫ్లారెన్సుకు తిరిగివచ్చెను. 1632 లో “టోలమీ, కోపర్నికస్‌ల జగత్సిద్ధాంతముల చర్చ" ("Dialogue Concerning the two chief world systems of ptolemaic and Copernican") అను గ్రంథము ప్రకటించెను. దీనితో ఈయనకు చర్చితో తలపట్లవరకు వచ్చెను. విరోధులు పరవళ్ళు త్రొక్కిరి. మతాధికారుల నిరంకుశ ధర్మవిచారణ సభలో గెలిలియోను చిత్రహింసలకు గురిచేసి అతడు ప్రవచించిన అభిప్రాయములు మార్చుకొనుచున్నట్లుగా క్షమార్పణ ప్రమాణమును వ్రాయించి సంతకము చేయించిరి. మూఢులైన మతాధికారుల హింసలనుండి బయట పడుటకు గెలిలియో తన పరిశోధనలు తప్పని చెప్పెను. వృద్ధాప్యము, కుటుంబనష్టములు మొదలగు వానివలన గెలిలియో కృశించిపోయెను. ఆతనిని తన గృహము వదలిపోరాదని కట్టడిచేసిరి. అజ్ఞానుల దౌర్జన్యమువలన లోకసత్యములు కొంతకాలము వరకు మరుగు పడవచ్చును. కాని, సత్యము శాశ్వతముగా దాగలేదు అనుటకు గెలిలియో జీవితమునందలి ఈ ఘట్టము తార్కాణము.
గెలిలియో శారీరకముగా కృశించుచున్నను, అతని బుద్ధిసూక్ష్మత తగ్గలేదు. ఆ కాలముననే ఆయన వస్తువుల యొక్క స్వేచ్ఛాపతనమును గురించియు, ద్రవస్థితిని (Hydrostatics) గురించియు కావించిన పరిశోధనలు న్యూటన్ చలనసూత్రములకు (Laws of motion) మార్గదర్శకములుగా నుండి, ఆర్కి మెడీసు సిద్దాంతములను ధ్రువపరచుచున్నవి.
1636 లో “నూతనశాస్త్ర విజ్ఞానముపై సంభాషణము" అను గ్రంథమును ఇతడు వ్రాసెను. 1637 లో గెలిలియో చంద్రునిలోని పర్వతముల ఎత్తును నిర్ణయించెను. ఇవియే ఆయన జరపిన కడపటి పరిశోధనములు.
గెలిలియో ఆరోగ్యము త్వరగా క్షీణింప మొదలిడెను. ఆయనకు చెవుడు, గ్రుడ్డితనము కలిగెను. ఆరోజులలో ఆయనను చూచుటకు జాన్మిల్టన్ మొదలగు వారు వచ్చిరి. లోలకము, గడియారమును నిర్మించుటలో ఎట్లు పనికివచ్చునని జీవితాంతమువరకును ఆలోచించెను. కాని గృహచ్ఛిద్రములు, మతాధికారుల సాధింపులు, బెదరింపులు, అనారోగ్యము మొదలగువానితో కృశించి, చివరకు క్రీ. శ. 1642 జనవరి 8వ తేదీన గెలిలియో చనిపోయెను. చనిపోయినతర్వాతకూడ మతాధికారులు అతని శవ సంస్కారమునకు అనుజ్ఞ నీయలేదు. సమాధిపై స్మారక చిహ్నముంచుట 95 సంవత్సరముల పిదపగాని జరుగలేదు. మరణశాసనము చెల్లదనిరి; అముద్రిత గ్రంథములను నాశనము చేసిరి.
గెలిలియో ప్రపంచ ప్రఖ్యాత పురుషులలో నొకడు. విషయ పరిశీలనమునందు నిశితమైన ప్రశ్నలనిడు అతని దృక్పథమే అతనికి అధికమైన ప్రఖ్యాతిని తెచ్చి పెట్టినది. ఒక్కమాటలో చెప్పవలెనన్న, గెలిలియో మానవులకు విజ్ఞానమునేగాక, వైజ్ఞానిక దృక్పథమునుగూడ ప్రసాదించిన మహామేధావి.
ఎ. స. మూ.