Jump to content

సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మూడవ సంపుటము/గృహ జంతువులు; పెంపుడు జంతువులు

వికీసోర్స్ నుండి

గృహజంతువులు, పెంపుడుజంతువులు :

గృహజంతువులను ప్రజలు తమ స్వప్రయోజనము నాశించి పెంచుకొనెదరు. పలురకములైన పశువులు, మహిషములు, గుఱ్ఱములు, గొఱ్ఱెలు, మేకలు, పందులు, ఒంటెలు, గాడిదలు, కోళ్లు గృహజంతువులలో ముఖ్యములైనవి. ఈ జంతువులన్నియు మానవునకు ఫలితముల నొసగునవియే. ఇవికాక పెంపుడు జంతువులను కొందరు మక్కువతోడను, గారాబముతోడను పెంచుకొనియెదరు. కుక్కలవంటి కొన్ని పెంపుడుజంతువులు మాత్రమే ఉపయోగకరములు. పిల్లులు, పావురములు, చిలుకల వంటి పిట్టలు, సీమకుందేళ్లు, సీమపందికొక్కులు, తాబేళ్లు, దుప్పులు, సింహములు, పెద్దపులులు, చిరుతపులికూనలు మున్నగు జంతువులు వినోదముకొరకు పెంచబడుచున్నవి. పాములవాడు పాములను మచ్చిక చేసికొని వాటిద్వారా జీవయాత్ర గడుపుకొనుచున్నాడు. పైన ఉదహరించబడిన జంతువులను సేకరించి వాటికి వసతులను కల్పించు విధానములను గూర్చియు, వేర్వేరు ఋతువులలో వేర్వేరు వాతావరణ, పరిసర పరిస్థితుల ననుసరించి వాటికివ్వదుగు ఆహార పానీయాది విషయములను గూర్చియు, గర్భము ధరించిన దశయందును, ప్రసవసమయమునను, శిశువుల యొక్క బాల్యదశయందును, వాటిని పెంచి పోషించు పద్ధతులనుగూర్చియు, ఈ దిగువ సంక్షిప్తముగా వివరింపబడినది. ఈ జంతువుల నన్నిటిని సాధారణముగా పీడించు రోగములనుగూర్చి తరువాత ముచ్చటించెదము.

ఎన్నిక : పెంపుడు జంతువులను అభిమానించువారు కలితీలేని మేలిరకములకు చెందిన కుక్కలను సేకరించుటకు యత్నింతురు. ఇట్టి మేలిరకములను సంపాదించవలె నన్నచో వాటి తాతముత్తాతల పుట్టుపూర్వోత్తరములను విచారింపవలెను. ఇట్టి సమాచారములను ఆ జంతువులలో వ్యాపారము చేయువారివద్దను, గొప్ప నగరమ్ములయందుండు "కెన్నెల్ క్లబ్బుల” (Kennel clubs) యందును మాత్రమే లభింపగలదు. వివిధ జాతులకు చెందిన పెంపుడు జంతువులలో పరిమాణమునందును, ఇతర లక్షణముల యందును ఎంతో వైవిధ్యము కలదు. ఎవరి అభిరుచి ననుసరించి వారు ఇట్టి జంతువులను సేకరించి, శ్రద్ధాసక్తులతోడను, మక్కువతోడను పెంచుకొనియెదరు. ఈ పెంపుడు జంతువుల ఉత్పత్తివిషయములో 'జాతి' (breed) ప్రధాన మైనట్టి, నిశ్చితమైనట్టి పాత్ర వహించును. సరియైన ఆహారము నొసగి, సమర్ధవంతముగ వాటిని పెంచి పోషించిననే గాని, వాటి ఉత్పత్తి పాటవము శక్తిమంతము కాజాలదు. పెక్కు మేలిరకములకు చెందిన పెంపుడుజంతువుల ఉనికి కొన్ని నిర్ణీత ప్రాంతములకే పరిమితమై యున్నది. అట్టి నిర్ణీత ప్రాంతముల యందు పెంచుటవలననే, వాటి పాటవము అభివృద్ధి నొందగలదు. దాదాపు విస్పష్టమైన పన్నెండు జాతులకు చెందిన భారతీయ జంతుసంతతి ప్రముఖముగ పేర్కొన బడుచున్నది. పనిచేయుటకైనను లేక పాలనిచ్చుటకైనను పనికివచ్చు మేలిజాతి జంతువులను వాటి జన్మస్థలము నుండియే యేరుకొని తేవలయును. అచ్చటి జంతువుల యందు శుద్దరక్తము హెచ్చు శాతములో నుండగలదు. దానికి తోడుగా, ప్రభుత్వ వ్యవసాయ క్షేత్రముల యందును, ఇట్టి జంతువ్యాపారము చేయువారి యొద్దను సిసలైన శుద్ధజాతి జంతువులు లభ్యము కాగలవు. గుఱ్ఱములకు సంబంధించిన ఇట్టి సమాచారము 'టర్ఫ్‌క్లబ్బుల' యందు దొరకగలదు. అండోత్పత్తికి గాని, మాంసోత్పత్తికిగాని ఎల్లప్పుడును సిసలైన మేలుజాతి కోళ్ళనే ఎన్నుకొనవలెను. ఇవిగూడ ప్రభుత్వ వ్యవసాయక్షేత్రము లందును, కొందరు ఇతర వ్యక్తులవద్దను లభించును.

ఆధునిక కాలమున ప్రభుత్వ కేంద్రములయందు ఆవులకును, గుఱ్ఱములకును, గొఱ్ఱెలకును, మేకలకును మేలి జాతి జంతువులయొక్క శుక్లములతో ఉచితముగ కృత్రిమ గర్భధారణము బహుళముగా గావింపబడుచున్నది. ఉన్నత పశుసంపదాభివృద్ధికి ఇట్టి అవకాశములను వినియోగించుకొనవలసి యున్నది.

గృహవసతి : ఎట్టి ఆచ్ఛాదనముతో నిర్మించిన శాలల యందైనను వివిధములైన గృహజంతువులను ఉంచ వచ్చును. ప్రధానముగా యజమానియొక్క ఆర్థిక పరిస్థితి ననుసరించి, మానవులకు వలెనే ఈ జంతువులకును వాసయోగ్యమైన ఆశ్రయము నేర్పరుప దగును. బలమైన గాడ్పులు వీచు ప్రదేశములలో ఈ శాలలకు గోడలు అవసర మగును. పాదములు దిగబడకుండునట్లును, జారుటకు వీలులేనట్లును నేలభాగమును రాతితోగాని, సిమెంటుతోగాని బలిష్ఠముగా నిర్మించవలెను. ఇట్లు చేసినచో పశువులశాల పరిశుభ్రముగ నుండగలదు. ప్రత్యేకముగా అమర్చిన తొట్టెలయందు వీటికి ఆహారము నొసగెదరు.

కోళ్ళను వృక్షములుగల పశువుల దొడ్డిలోనుంచి, చుట్టును ఇనుపతీగచే అల్లికను నిర్మింపవలెను. ఆ ప్రాంత మంతయు నేలపై సున్నపు నీటిని చిలుకరించవలెను. గ్రుడ్లు పెట్టుటకై చిన్నచిన్న పేటికల నేర్పరుపవలెను. నడుమనడుమ కోళ్ళను ఇంటిగదులయందుగూడ నుంచ వచ్చును.

ఈ జంతువులకు సమీపముననే ఎల్ల వేళలయందును నీరు సిద్దముగా ఉంచవలెను. లేదా, దినమునకు అధమము నాలుగు పర్యాయములయినను వాటికి దాహ మార్పవలెను. ఒంటెవిషయములో ఈ నియమము అవసర ముండదు. ఈ జంతువునకైనను అవకాశమున్నపుడెల్ల నీటిని అందించుచునే ఉండవలెను.

ఇతర జంతువులకంటె గేదెలకు, దున్నలకు భిన్నమగు లక్షణమొకటి కలదు. ఈ రెండుజాతుల జంతువులును ఉష్ణప్రాధాన్య లక్షణముగలవి. ఇవి త్వరగా వాటి శరీరములనుండి ఉష్ణమును పోగొట్టుకొనజాలవు. అందులకై ఇవి బురదగుంటలయందును, చెరువులయందును, కాలువల యందును వాటి శరీరమును శీతలమొనర్చు కొనుటకై తనివితీరునట్లుగా దీర్ఘ కాలము పడియుండును.

గృహజంతువుల పరిపోషణమునకై తమ తమ ఆర్థిక పరిస్థితికి తగినట్లు సౌకర్యముల నొనగూర్చుచుందురు. పెంపుడు జంతువుల విషయమున అట్లుగాక, పసిబిడ్డల రక్షణమునకు గైకొను శ్రద్ధాసక్తులే వాటియెడలగూడ మనము చూపెదము; అట్టి గారాబమే వాటియెడలకూడ చూపెదము . పసిబిడ్డలకువలెనే వాటికిగూడ సమాన స్వేచ్ఛ నొసగెదము. సామాన్యముగ కుక్కలు, పిల్లుల కొరకు ప్రత్యేకముగా పరుపులు కుట్టించి పరుండ బెట్టుటయో, లేక మనప్రక్కలలోనే అవిపడుకొనుటయో జరుగుచుండును. సీమకుందేళ్లు, సీమపందికొక్కులు కొయ్య పెట్టెలయందును, గడ్డిపరుపుల మీదను పండుకొనును. కొన్ని అసాధారణమైన పెంపుడు జంతువుల నివాసమునకై, వాటి సహజగృహము (natural abodes) లను బోలు ఆశ్రయములు నిర్మింపబడును.. ఆహార పానీయములు: మానవుడు భుజించు ఎట్టి ఆహారమునైనను కుక్కలు తినగలవు. తియ్యని పదార్థములు కుక్కలకు హానికరములను జనవాక్యము కలదు. కాని ఈ అభిప్రాయము నిరాధారమైనది. యధార్థమునకు కుక్కలు తియ్యని పదార్థములను ముట్టనే ముట్టవు. వరి, గోధుమ, జొన్న ధాన్యములతో తయారైన పదార్థములు, పప్పుదినుసులు, కాయగూరలు, మాంసము, పాలు మున్నగునవి కుక్కలకు అనువైన ఆహారములు. యజమాని భుజించు పదార్థములే కుక్కకుకూడ ఆహారమగుటచే, దాని కవసరమగు బలవర్ధక పదార్థములన్నియు అందు లభింపగలవు. శాకాహారమువలన గూడ కుక్కలు ఆరోగ్యకరముగను, పుష్టికరముగను జీవింపగలవు. జంతువులు వాటి సహజజ్ఞానముచే (instinct) చాలినంత ఆహారమును మాత్రమే తినగలుగును. అందుచే కుక్కలకు సరిపడు పరిమాణముగల ఆహారము నివ్వ వచ్చును.

ముఖ్యముగా ఫలోత్పాదకములైన గేదెలకును, ఆవులకును ఆహారమును సమపాళములో మితముగానిచ్చుట పొదుపుతనము దృష్ట్యా ప్రధానమైన విషయము. పశువులఆహారమును రెండు తరగతులుగా విభజింపవచ్చును.

1. గడ్డి: ఏరకమైన గడియైనను పశువులకు ఘనమైన పరిమాణములో లభింపగలదు. వరిగడ్డి, జొన్నచొప్ప, జనపచొప్పు, పచ్చగడ్డి మున్నగునవి పశువులకు కడుపు నిండు ఆహారపదార్థములు.

2. సారభూతమైన ఆహారములు : (Concentrates) బియ్యపుతవుడు, గోధుమతవుడు, పప్పులపొట్టు, జొన్న తొక్కు, మున్నగునవి సారభూతమైన ఆహార పదార్థములు. వీటివలన పశువులకు శక్తి సామర్థ్యములు కలుగును. తెలకపిండి, సెనగలు, ఉలవలు, ప్రత్తిగింజలు మున్నగు మాంసకృత్తులవలన పశువుల అంగనిర్మాణము, శరీర సౌష్ఠవము పెంపొందగలదు.

సారభూతమైన ఆహారములో ఒకవంతు మాంసకృత్తులును, (proteinations), 4 వంతులు బలవర్ధక పదార్థములు (energy feeds) ను కలిసియుండవలెను. పశువులకు ఒక్కరకమగు ఆహారముకాక, పలురకములగు పదార్థముల నివ్వవలెను. ఒక పదార్థములో లోపించి యున్న శక్తిని ఇతరపదార్థములు పూరించగలుగుటయే దీనికి కారణము.

పశువులు దినమునకు 6 నుంచి 8 గంటలవరకు పచ్చిక బయళ్ళయందు మేతమేయవలెను. దీనికితోడుగా ఇంటి వద్ద దినమునకు 15 పౌనుల ఎండుగడ్డియు, 3 పౌనుల సారభూతమైన ఇతర ఆహారములను ఇయ్యవలెను. ఇది కాక, ప్రతి 10 పౌనుల పాలకును ఆవుకు 3 పౌనుల సారభూతమైన ఆహారమును, ప్రతి 10 పౌనుల పాలకును గేదెకు 4 పౌనుల సారభూతమైన ఆహారమును ఇయ్యవలెను. కష్టించి పనిచేయు ఎద్దులకును, దున్నలకును ఒక గంట శ్రమకు 1 పౌను సారభూతమైన ఆహారము నియ్యవలెను. వీటితోపాటుగా 1ఔన్సు బొమికల ఆహారమును (bonemeal), మరియొక ఔన్సు ఉప్పును ఇయ్యవలెను.

గుఱ్ఱములకుగూడ ఈ విధముగనే ఆహారమునిచ్చి పోషింపవలయును. అయినను వ్యక్తిగతముగ, పశువుల యొక్క బరువును అనుసరించి వాటియొక్క ఆహారములు ఎక్కువగా మారుచుండును. అందుచే పైన పేర్కొనిన సూచనల నన్నిటిని యుక్తాయుక్తముల నెరిగి జాగరూకతతో పాటింపవలెను.

గర్భధారణస్థితి: పశువులు గర్భధారణస్థితి యందున్నపుడు వాటికి ఆహారమునిచ్చు విషయములో మిక్కిలి శ్రద్ధ వహింపవలెను. సారభూతమైన పదార్థములను, బొమికల ఆహారములను ఇతోధికముగా నివ్వవలెను. పశువులు ఈనుటకు ఒక వారము ముందుగా తేలికయైన ఆహారము నియ్యవలెను. లేనిచో, వాటికి మలబద్దకము చేయును. చూడి జంతువులను చివరదశలో పనిభారము నుండి తప్పింపవలెను.

గర్భధారణకాలము : ఆవులు, గేదెలు సుమారు 280-290 రోజులు; గుఱ్ఱము 330-345 రోజులు; గొఱ్ఱెలు, మేకలు 144-151రోజులు; ఒంటె 410 రోజులు; గాడిద 365 రోజులు, కుక్క 58-63 రోజులు; పిల్లి 63-65 రోజులు; సింహము పెద్దపులి 105 - 110 రోజులు ; ఏనుగు 20-22 నెలలు.

ప్రసవము : పుట్టిన దూడలకు గాయములు తగుల కుండుటకై, పశువులు ఈనుసమయమున గడ్డితో చక్కగా ప్రక్కను అమర్చవలెను. ప్రసవవేదన అధికముగా కలు గుచో, పశువైద్యుని పిలిపింపవలెను. అట్టి సమయమున తెలిసీ తెలియని వైద్యము చేయుట తరచుగా హానికర మగును.

ప్రసవానంతరము మూడు, నాలుగు దినములవరకు పశువులకు తేలిక యైన ఆహార మియ్యవలెను. లేనిచో, ఒక్కొక్కప్పుడు శ్రమచేయు సమయములో గర్భాశయము వెలుపలికి పొడుచుకొనివచ్చును. ఏ కారణముచేతనైనను అట్లు వెలికివచ్చిన యెడల, దానిని వెంటనే సరిచేయవలెను. లేనిచో గర్భాశయము తిరుగులేని తీవ్ర ప్రమాదమునకు గురియై, ప్రాణనష్టముగూడ సంభవింపవచ్చును. పాలిచ్చు పశువులకు పైన పేర్కొనిన అదనపు ఆహారము నియ్యవలెను.

దూడల రక్షణము : క్రొత్తగా పుట్టిన దూడలయొక్క ముక్కు రంధ్రములు రసితో నిండియుండి ఊపిరి యాడక బాధ పడుచుండును. పుట్టినతోడనే ముక్కులు పిండి. రసిని లాగివేయవలెను. అనంతరము వాటి శరీరములను గోనెసంచితోగాని లేక వస్త్రముతోగాని తడి ఆరునట్లుగా తుడువవలెను. పుట్టిన వెంటనే దూడ తల్లి యొద్ద జున్ను పాలు త్రాగునట్లు చేయుట అవసరము. సాధారణముగా సంభవించు బాలారిష్ట దోషములకు జున్నుపాలు విరుగుడుగా పనిచేయును.

పుట్టిన కొలది మాసములవరకు దూడలకు పాలే ముఖ్యాహారముగ నుండవలెను. తరువాత అవి ఇతర పదార్థములు తినగల్గును.

మొదటి ఒకటి, రెండు దినములవరకు కోడిపిల్లలకు ఆహారమే అవసర ముండదు. తరువాత అవి బియ్యపు నూకలను, కాయకూరలను తినగల్గును.

సాధారణ రోగములు : అధిక సంఖ్యాకములైన జంతువులకు ముఖ్యముగా అజీర్ణము, నులిపురుగుల బాధ, గాయములు సంభవించును. కాగా సూక్ష్మ విషక్రిముల (bacteria) వలనను, విషపునీరు (virus) వలనను కొన్ని కొన్ని ప్రత్యేకములైన జాడ్యములు వెంటాడును. కొన్ని జాతుల జంతువులను పట్టి బాధించు రోగములు చిత్ర విచిత్రములైనవి. ఉదాహరణమునకు, గుఱ్ఱములయందు కుంటితనము, ఆవులయందు స్తనపాకము (mastitis=పొదుగు వాపు) మున్నగునవి.

ఒక్కొక్కప్పుడు పశువులు, గొఱ్ఱెలు, మేకలు అమితముగా ఆహారమును తినుటచే, జీర్ణించుకొని సుఖముగా మలమును విసర్జింపజాలక యుండును. అట్టి సమయములో కృత్రిమముగా విరేచనౌషధ మియ్యవలెను. ఒక్కొక్క సమయములో కొన్ని పదార్థములు గర్భములో పులిసిపోయి విషపూరితమైన వాయువును విపరీతముగా సృష్టించును. ఇట్టి వాయువు బయల్వెడలజాలక పశువులకు తీవ్రమైనబాధ కల్గించును. ఇందువలన, విషవాయువు గర్భములో జీర్ణించి ఊపిరి సలుపక ప్రాణోపద్రవము కూడ సంభవింపవచ్చును. కర్పూరతైలము (turpentine), కార్బలి కామ్లము (carbolic acid). ఈ బాధను కొంతవరకు నివారింపగలవు.

రాయలసీమవంటి కొన్ని ప్రాంతములలో భూమియందు అధికమైన క్షారపదార్థము (calcium) లుండుటచే, జంతువుల మూత్రకోశమునందు సన్ననిరాళ్లు ఏర్పడును. వరిగడ్డి తినుటచే ఇట్టిరోగములు ప్రకోపించును. శస్త్ర వైద్యముచే ఇవి నివారింపబడగలవు.

భారతదేశము నందలి పశువులకు మాంసకృత్తులు (proteins) పోషకపదార్థములు (Vitamin A) గల ఆహారములు లేక ఆరోగ్యమున కుంటుపడియున్నవి. మాంసకృత్తుల కొరత, చాలినన్ని పాలు లేకపోవుటచే సంభవించును. ఇందువలన కుక్కపిల్లలకు బానకడుపు ఏర్పడును. ఈ బానకడుపు చికిత్సకు లొంగక తరచుగా మరణమునకు దారితీయును. ఇతరదేశములలో జంతురోగములు భాస్వరము (phosphorus), క్షారము (calcium) తామ్రము, (copper) మణిశిల (cobalt) వంటి లోహపదార్థముల కొరతవలన సంభవించుచున్నవని తెలియుచున్నది. బలవర్థకాహారములు లేమిచే జనించు జాడ్యములను అట్టి పదార్థములచే పూరించి నివారణ చేయవచ్చును.

పెక్కు రకములయిన పురుగులు (parasites) జంతువుల నాశ్రయించుకొని జీవించుటవలన, అనేకములైన జంతుజాతులు వర్దిల్ల లేక పోవుచున్నవి. ఈ పురుగులవలన వ్యవసాయదారునకు గూడ చాల నష్టము సంభవించును. ఒక్కొక్కప్పుడు ఈ పురుగులు ప్రాణాపాయముకూడ కలుగజేయును. రక్తమునం దిమిడియుండు కొన్ని ప్రాక్తనజాతి (protozoam) క్రిమికీటకములు శరీరమును కృశింపజేసి నిర్వీర్యము చేయును. ఇట్టి పరాన్న జీవులచే (parasites) ఉత్పన్నమగు దాదాపు అన్ని రోగములను శ క్తిమంతముగా నివారింపవచ్చును. కాని అట్టి రోగములు సంక్రమింపకుండ అరికట్టుటకు ఇతోధికముగా కృషిచేయవలసి యున్నది.

జంతుజాల మంతయు, చెడుగాలులు వీచుతరుణములో నెమోనియా (ఊపిరితిత్తులవాపు) జాడ్యమునకు గురి యగును. అల్పజంతువులు చికిత్స చేయబడక పూర్వమే మృతి జెందును. సల్ఫానమైడులు (sulphanamides), ఆంటిబయటిక్సు (antibiotics) ప్రయోగము వలన ఈరోగము నివారణ మగును.

పశువులలోను, గొఱ్ఱెలు, మేకలలోను పొదుగువాపు (Mastitis) విరివిగా గోచరించును. ఇట్టి జాడ్యముల వలన సంసారులకు ఆర్థికముగ నష్టముగలుగుట యధార్థమైన విషయము. ప్రారంభదశలో ఈ పొదుగువాపును ఆంటీబయటిక్సు సహాయముతో నివారించనిచో, పొదుగు శాశ్వతముగా నిరుపయోగమై చెడిపోవును. రోగగ్రస్తమైన అట్టి పొదుగునుండి తీసినపాలను త్రాగినచో, గొంతు వ్రణములును, క్షయరోగములుకూడా ప్రాప్తించును.

ప్రేగు సంబంధమైన రోగములవలన, గుఱ్ఱములకును, గాడిదలకును తీవ్రమైన శూలనొప్పి (colic) జనించును. విరేచనము కావించుటచేతను, ఔషధములిచ్చుట చేతను. ఈ బాధనుండి వాటికి విముక్తి కలిగించవచ్చును. శ్రమించి పనిచేయు జంతువులకు ఏర్పడు కుంటితనమును నివారించుట యొక సమస్యగా పరిణమించినది. ఈ కుంటితనము అనేక కారణములచే సంభవించుచున్నది. ఈ రోగ కారణములను నిపుణులైన వైద్యులు నిర్ణ యింపవలసియున్నది. సాధారణముగా ఇది కౌంటర్ ఇర్రిటేషను (counter-irritation) వలన నివారణ మగును.

కుక్కలు అజీర్ణరోగమునకు గురియగును. వీటికి చికిత్స చేయ వీలగును. కోళ్ళయొక్క గొంతు క్రిందిభాగము విస్తరించుటచే, (enlargement) ఒక్కొక్కప్పుడు గింజలు తిను సమయమున అవి గొంతుకకు అడ్డుపడి ఊపిరియాడక బాధపడును. పక్షులుగూడ అట్టి సందర్భమున అటునిటు కొట్టుకొనును. అడ్డుపడిన గింజలను శస్త్రచికిత్సచే లాగివైచి వాటి బాధను బాపవచ్చును. ఒక్కొక్క తరుణమున గ్రుడ్లు పెట్టునపుడు అవి అతుకుకొనును. ఆ ప్రదేశమున గ్లిజరిన్ వంటి జిగురు పదార్థమును ప్రయోగించినచో గ్రుడ్డు సులభముగ బయటకు వచ్చివేయును. ఆహార కారణము వలనను, విషపునీరు, క్రిమికీటకాది పరాన్నజీవులవలనను, అన్నిజాతుల జంతువులలో సామాన్యముగా నీళ్ళ విరేచనములు (diarrhoea) జిగటవిరేచనములు (dysentery) సంభవించును. క్రమబద్ధమైన ఆహారము వలనను, సల్ఫాస్ (sulfas), ఆంటీబయటిక్స్ (anti-biotics), క్రిమి సంహారకౌషధముల వలనను ఇట్టి రోగములను నివారణ చేయవచ్చును.

క్రిమి, విషపునీటి రోగములు (Bacterial of Viral diseases):— పైన పేర్కొనిన సాధారణ జాడ్యములే కాక, జంతువులు కొన్ని నిర్ణీతకాలములలో క్రిమి రోగములకును (bacterial) విషపునీటి (Viral) రోగములకును గురియగును. దాదాపు క్రిమిసంబంధమైన జాడ్యములన్నియు సల్ఫాస్, ఆంటిబయటిక్స్ ఔషధములను ప్రయోగించుటవలన నివారణమగును. కాని విషపునీటి రోగములలో ( Viral diseases) ఏదియును ఔషధముల వలన నివారణ కాజాలదు. టీకాలు పొడిపించుట వలనను, ఆంటిసీరా (antisera) ను ప్రయోగించుటవలనను పెక్కు రోగములు చికిత్సచే లొంగుట కవకాశముగలదు.

ఒక్కసారి టీకాలుపొడుచుట వలననే జీవితములో ఎన్నటికిని జంతువులకు రిండర్ పెస్ట్ (rinderpest) అను అంటువ్యాధి సోకకుండునట్లు రక్షణచర్యలు తీసికొన వచ్చును. ప్రతి సంవత్సరము తొలకరి వర్షములు ప్రారంభమగుటకు పూర్వమే బ్లాక్ క్వార్టర్ (Blackquarter), హెమరాజిక్ సెప్టిసీమియా (hemorrhagic septicemia) అను రోగములను జంతువులకు టీకాలు వేయుటవలన నివారింప సాధ్యమగును. ఈ మూడు విధములయిన టీకాలు జంతువులను అంటురోగములనుండి కాపాడగలుగును.

స్ట్రాంగిల్సు (Strangles), ఫార్సియా (Farcia) అను రోగములనుండి గుఱ్ఱములను రక్షించుటకై ప్రతి సంవత్సరమును వాటికి టీకాలు పొడిపించవలెను. ఇటీవల ఒకవిధమగు ఆఫ్రికా గుఱ్ఱపుజాడ్యములు అంటురోగ రూపములో భారతదేశమున పలుప్రాంతములందు తలయెత్తినట్లు తెలియవచ్చినది. వీటిని నివారించుటకు శక్తిమంతములైన టీకామందులు లభ్యమగుచున్నవి. కాని వీటివలన రోగము నివారణమైనట్లు తెలియదు. ఆన్‌థ్రాక్స్ (anthrax) గొఱ్ఱె మశూచి (sheep-pox), మేక మశూచి (goat-pox) అను వ్యాధులనుండి రక్షించుటకై గొఱ్ఱెలకు, మేకలకు సంవత్సరమున కొకసారి, టీకాలు వేయబడును. రాజస్థాన్, పంజాబువంటి ప్రదేశములయందుగల ట్రైపానా సోమియాసిస్ (trypana somiasis) అను ప్రాంతీయ రోగములనుండి ఒంటెలను, గుఱ్ఱములను, గాడిదలను రక్షించుటకు ప్రతిసంవత్సరము వాటికి ఔషధము లివ్వబడును. కుక్కలకు సంక్రమించు రోగములన్నిటిలో "పిచ్చికుక్క కాటు" (rabies) అత్యంత ప్రమాదమైనది. ఈరోగము ఇతరకుక్కలకును, మనుష్యులకును వ్యాపించును. ఇందులకు రోగనివారకమగునట్టియు (prophylactic), రక్షక మగునట్టియు (protective) టీకాలు లభ్యముకాగలవు. పిచ్చికుక్కకాటు (Rabies) నుండి రక్షించుటకై కుక్కలకు 9 మాసముల కొకసారి టీకాలు వేయవలెను. మనఃక్షోభము (distemper) వలన కలుగు పిచ్చితనము కుక్కలకు కలుగు మరియొక ప్రమాదకరమైన రోగము. 21/2 మాసముల వయస్సుగల కుక్కపిల్లలకు టీకాలు వేయవచ్చును. ఒక్కొక్కప్పుడు కుక్కనోటిలో మొటిమలవంటి పొక్కులు (nodules) లేచును. మందులవలన అప్పుడప్పుడు ఇవి అణగిపోవును. అట్లు కానిచో, శస్త్రచికిత్సవలన తాత్కాలిక ఉపశమనము కలుగగలదు. ఇట్లే, ఆడ, మగకుక్క లయొక్క జననేంద్రియముల (genitalia) మీద గ్రంధులు (tumors) విరివిగా లేచును. సంయోగముద్వారా ఈ సుఖ సంకటవ్యాధి వ్యాపించును. శస్త్రచికిత్సవలన వీటిని రూపుమాపుట ద్వారానే తాత్కాలికోపశమనము కల్గును.

ముఖ్యముగా మశూచికము వలనను, నులిపురుగుల వలనను, ఇంకను పెక్కు జాడ్యములవలనను కోళ్ళు మరణమొందు చున్నవి. కోళ్లు రెండుమాసముల వయస్సులో నున్నపుడు కొన్ని ఔషధములను సమ్మేళనము చేసి టీకాలుపొడుచుటద్వారా వీటిలో కొన్నిరోగములను నివారింపవచ్చును. పైవాటిలో స్పిరోచటోసిస్ (spirochatosis)అను వ్యాధినుండి కోళ్ళను రక్షింపవలెనన్నచో 'టిక్ ' అను రక్తము పీల్చు నొకవిధమగు కీటకములను, కోళ్ళను దాచు ప్రదేశములకు చేరకుండునట్లు అరికట్టవలెను. ఈరోగము సోకినపుడు, పాషాణసంబంధమగు ఔషధములచే (arsenical drugs) చికిత్స చేయవలెను. కోళ్ళు తరచుగా అంగిలివాపు (Diptheria) వలన బాధపడును. అట్టి సమయములో ఒక విధమైన జిగట పదార్థము గొంతుకు అడ్డముతగిలి ఉచ్ఛ్వాస నిశ్వాసములను అరికట్టును. జిగటపదార్థమును పటకారుతో తీసివైచి, 'పెనిసిల్లిన్ ఇంజక్షన్లతో బాధను నివారణ చేయవచ్చును. కొక్కిడియోసిస్ (coccidiosis) అనబడు రోగము, త్రాగెడు మంచినీటితో స్వల్పముగా 'సల్ఫాస్' (sulfas) ను కలిపినయెడల కోళ్ళకు సోకజాలదు. అప్పుడప్పుడు కడుపులోనికి మందుల నిచ్చుటద్వారా కోళ్ళను క్రిమికీటకముల, నులిపురుగుల బారినుండి తప్పింపవలెను.

యస్. వెం.