సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మూడవ సంపుటము/గుడివాడ
గుడివాడ :
ఆంధ్రప్రదేశమునందలి కృష్ణాజిల్లా నందుగల గుడివాడ ఒక ప్రసిద్ధనగరము. గుడివాడ యూనియన్ బోర్డు 1937లో పురపాలక వ్యవస్థగా మార్చబడినది. 1956 ఆగస్టు 1 వ తేదీన ఈ పట్టణము ప్రథమశ్రేణికి చెందిన పురపాలక సంఘముగా గుర్తింపబడినది. సంవత్సరమునకు ఈ 'మునిసిపాలిటీ' ఆదాయము సుమారు 6 లక్షల రూపాయలు. సహకార ప్రణాళికక్రింద ఇటీవల నిర్మింపబడుచున్న 'రాజేంద్రనగర్ ' కాక, మిగిలిన పట్టణమంతయు పూర్వపుపద్ధతిలో కట్టబడిన ఇరుకు సందులతో కూడి యున్నది. ప్రధానమయిన బాటలుమాత్రము విశాలముగా సిమెంటు చేయబడియున్నవి. తాలూకా కేంద్రమే గాక ఈ నగరము రెవెన్యూ డివిజనుకుగూడ ముఖ్యస్థానము. ఈ డివిజనులో కైకలూరు, గుడివాడ తాలూకాలు చేరియున్నవి. ఈ నగరముయొక్క జనసంఖ్య 1951 వ లెక్కలనుబట్టి 32,008
చారిత్రకప్రసిద్ది - శిథిలావశేషములు : తూర్పు చాళుక్యులు వేంగీమండలమును పరిపాలించు రోజులలో, వేంగీ పట్టణమునుండి సముద్రతీరమునకు పోవు వర్తక మార్గములో గుడివాడ ఒక కేంద్రముగా నుండెడిది. అంతే గాక, 'కుదుర' రాజ్యపాలకులకు గుడివాడయే రాజధానిగా నుండెడిది.
గుడివాడకు పశ్చిమముగా - లామపాడుదిబ్బ ప్రాంతములో పూర్వము 99 గుళ్ళు, 99 తటాకములు ఉండెడివని ఇతిహాసములు చెప్పుచున్నవి. ఈ లామపాడునందే శాతవాహనరాజులనాటి నాణెములు, రోమక నాణెములు దొరికినవి.
పాతగుడివాడలో 'లంజదిబ్బ' అను పేరుతో వ్యవహరింపబడు వృత్తాకారముగల దిబ్బఒకటి ఉన్నది. దీనిని కేంద్రప్రభుత్వమువారు పురావస్తు ప్రాముఖ్యముగల స్థలముగా ప్రకటించి సంరక్షించుచున్నారు. ఒకప్పుడు ఇక్కడ రాతిపెట్టె ఒకటి దొరికినదనియు, అందులో రత్నములు, బంగారురేకులు మొదలైనవి యుండెననియు తెలియుచున్నది. 1870 లో 'బాస్వెల్' అను దొర దీనిని చూచి, దీనికిని అమరావతి దిబ్బకును సన్నిహిత సంబంధ ముండవచ్చునని అభిప్రాయపడెను. 1878 లో 'సీవెల్ ' దొర ఈ దిబ్బను సందర్శించి, ఇక్కడి శిథిలములకు సాంచీస్తూప సామ్యమున్నట్లు పేర్కొనెను. తెలుగు దేశములో ఉన్న 'సానిదిబ్బ' 'లంజదిబ్బ' అను స్థలములు పూర్వము బౌద్ధభిక్షురాండ్రుగు స్వామినులకు నివాసములై ఉండెడిననియు, సంఘములో కట్టుబాటులు సడలి పోయి వారు అవినీతిపరులైన పిమ్మట నిరసన పూర్వకముగా ప్రజలు ఆప్రదేశములకు ఈ పేర్లు పెట్టినట్లు చారిత్రకుల అభిప్రాయము. ఇవికూడ అట్టి బౌద్ధస్తూపముల అవశేషములే యనుటలో సందేహము లేదు. ఇక్కడకూడ కొన్ని రోమక నాణెములు దొరకినవి. గుడివాడ తాలూకా వరిపంటకు ప్రశస్తమైనది. ఇచ్చట ఇరువదియారు బియ్యపుమిల్లులు పెద్దవి రాత్రిం బవళ్ళు పనిచేయుచుండును. ఇక్కడినుండి ప్రతివారము సుమారు 15 లక్షల రూపాయలు విలువగల బియ్యము ఎగుమతి అగుచుండును.
ఈ నగరములో పురపాలక సంఘమువారిచే మూడు ఉన్నత పాఠశాలలు నిర్వహింపబడుచున్నవి. ఇందులో ఒకటి బాలికలకు ప్రత్యేకింపబడినది. ఇవికాక 1950 లో ప్రారంభమై క్రమాభివృద్ధిని చెందుచు, ప్రస్తుతము డిగ్రీ కోర్సులకు శిక్షణ గఱపుచున్న కళాశాల కూడ ఉన్నది. 15 సంవత్సరముల క్రిందట స్థాపించబడిన 'ఆంధ్ర ప్రావిన్షియల్ హోమియోపతిక్ మెడికల్ కాలేజి అండ్ హాస్పిటల్'లో హోమియోపతిక్ వైద్యశాస్త్రము ఆధునిక పద్ధతులలో బోధింపబడుచున్నది. ఇది దక్షిణ హిందూదేశమున కంతటికిని ఏకైక హోమియో కళాశాలయై యున్నది. కేంద్రప్రభుత్వము వారిచే గుర్తింపబడిన ఈ కళాశాలకు, వైద్య విద్యాభ్యాసముకొరకై విదేశములనుండి గూడ విద్యార్థులు వచ్చుచున్నారు.
సంగీత సాహిత్య సంస్థలు : లలితకళా నిలయముగా విరాజిల్లుచున్న ఈ నగరములో సుమారు 25 సంవత్సరముల క్రిందట స్వర్గీయ శ్రీ కోడూరు శ్రీరాములుగారి స్మృతిచిహ్నముగా 'శ్రీరామవిలాస సభ' ఏర్పడి నృత్య నాటక, సంగీత శాస్త్రముల పోషణము జరుగుచున్నది. ఇటీవల ఈ సంస్థ 'ఆంధ్రప్రదేశ సంగీతనాటక అకాడమి'కి అనుబంధించబడినది. రాష్ట్రప్రభుత్వము ఈ సంస్థయొక్క కృషిని గుర్తించి విరాళమిచ్చెను. 1956 లో 'ఆంధ్ర నలంద' అను పేరుతో ఒక సాహితీసంస్థ ఏర్పడి ఏటేట కవి పండిత సత్కారములుచేయుచు వివిధ రంగములలో సాహిత్యకృషి సాగించుచున్నది. 1955లో ప్రారంభమైన 'ఆంధ్ర రచయితల సంఘము' తరచుగా సాహిత్యసభలు జరుపుచు సాహిత్యరంగములో ముందడుగు వేయుచున్నది. ఈ నగరము దివ్యజ్ఞాన సమాజముయొక్క 'సర్కార్స్ ఫెడరేషన్'కు కేంద్రమై యున్నది.
దేవాలయములు; సత్రములు : ఇచ్చటి గుడులు పురాతనములు, ప్రశస్తములైనవి. వీటిలో శ్రీ భీమేశ్వరస్వామి, శ్రీ వేణుగోపాలస్వామి వారల ఆలయములు ముఖ్యమైనవి. శ్రీ భీమేశ్వరస్వామి ఆలయములో నున్న శాసనములను బట్టి ఈ ఆలయమును “గణపతిదేవ మహారాజు సకల సేనాధిపతియైన మచ్చర రిపుగండ మాచ్చెలపుర వరాధీశ్వర శ్రీ మన్మహాసామంత్త నామిరెడ్డి తీర్పరి గృద్రారమునకు వెలనాంటికి నధికారి” మల్యబోయిండు "కాకతిరాజ్య ప్రవర్థ మానశకవర్షంబులు 1158"కు పూర్వము కట్టించినట్లు స్పష్టపడుచున్నది. మల్యబోయిని కొడుకు పోతనబోయిండు, మేనల్లుడు గుండెబోయిండు, సాతమ సెట్టియు,ఇతరులును "గుడివాడకుందేశ్వర శ్రీమహాదేవర" దీపారాధన వగైరాలకు అప్పటప్పట దానములు చేసి శాసనములు వ్రాయించినట్లు కన్పించుచున్నది. ఈ శాసనములలో నూనె కొలతకు “గరుడమానిక " ను ఉపయోగించిరి. ఈ కున్దమహేశ్వరుడే తరువాత భీమేశ్వరుడుగా, సత్యముగల దేవుడుగా ప్రసిద్ధిచెందెను. విజయనగర సమ్రాట్టు అగు తుళువ వీరనృసింహరాయల పాలన కాలమునాటి మాడయ్య అను కవి వ్రాసిన మైరావణ చరిత్రలో భీమేశ్వరస్తవము ఈరీతిగా చేయబడినది :
చ. “వలనుగ నాత్మలోన గుడి
వాడ పురాధిపు భీమలింగ నిం
దలచి, కరంబు లెత్తి ప్రమ
దంబున మ్రొక్కి నుతించి, భక్తి ని
శ్చలమతి నివ్వటూరి పుర
శాసను మద్గురు మల్లి కార్జునిన్
గొలిచి తదాజ్ఞచే బ్రకట
కోమల కావ్య కళావివేకి నై ."
పై ఆధారములనుబట్టి ఆ రోజులలో 'గృధ్రవాడ’ 'గుడివాడ' నామములు రెండును ఈ పట్టణమునకు వాడుకలో ఉన్నట్లు కన్పించుచున్నవి.
ఈ భీమేశ్వరాలయములో ఒక జైనవిగ్రహము దొరకగా, స్థానికముగా నున్న జైన వ్యాపారులు ఈ విగ్రహమును చూచి వారి మతసిద్ధాంతము ప్రకారము అది సర్వలక్షణ శోభితమై ఉన్నదని భావించి, దానిని వేరొకచోట ప్రతిష్ఠ చేసి, పాలరాతితో సుందరమయిన దేవాలయమును నిర్మించి 'అనుదినమును పూజలు చేయుచున్నారు. దక్షిణాపథములో ఇంతటి సుందర జైనాలయము మరియొకటి లేదని ప్రసిద్ధి. పూర్వము అసంఖ్యాకముగా గుళ్ళతో నిండి ఉండుట చేతనే ఈ గ్రామమునకు 'గుళ్ళవాడ' 'గుడులవాడ' అని పేరు వచ్చియుండె ననియు, చివరకు అది గుడివాడగా మారినదనియు చెప్పెదరు.
గుడివాడలో రెవెన్యూ డివిజనల్ ఆఫీసు, రెజిస్ట్రేషన్ ఆఫీసు, సబ్ కోర్టు, మున్సిఫ్ - మేజిస్ట్రేటు కోర్టులు, జుడిషియల్ సెకండ్ క్లాస్ మేజిస్ట్రేటు కోర్టులును, అసిస్టెంటు సూపరింటెండెటు ఆఫీసుయును, ఇంకా అనేకములగు ఇతర ప్రభుత్వ కార్యాలయములును కలవు.
స్టేట్ బ్యాంకు, ఇండియన్ బ్యాంకు, ఆంధ్ర బ్యాంకు, భారతలక్ష్మీ బ్యాంకు, సెంట్రల్ బ్యాంకుల శాఖలును, కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంకును ప్రజల ఆర్థిక వ్యవహారములలో తోడ్పడుచున్నవి.
విజయవాడ, భీమవరము, బందరు పట్టణములకు పోవు మీటర్ గేజ్ రైలుమార్గమునకు గుడివాడ కూడలిగా నున్నది. ఇక్కడినుండి బందరు - విజయవాడ రోడ్డును కలుపుచు పామర్రు, కంకిపాడు గ్రామములకును, ఏలూరు, భీమవరము, తిరువూరు, బంటుమిల్లి, బందరు నగరములకును రాజమార్గములు కలవు. ఈ పట్టణము లన్నిటికి ఇక్కడినుండి బస్సు రవాణా సౌకర్యములు ఉన్నవి.
గ. సీ.