సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మూడవ సంపుటము/గుణగ విజయాదిత్యుడు
గుణగ విజయాదిత్యుడు (క్రీ. శ. 848 - 91):
క్రీ. శ. 625 నుండి సుమారు నాలుగు శతాబ్దులకాలము తూర్పు చాళుక్యవంశపురాజులు వేంగి రాజధానిగా ఆంధ్రదేశమును అతి వైభవముగా పరిపాలించిరి. ప్రఖ్యాతులైన వీరిలో గుణగ విజయాదిత్యుడు అగ్రగణ్యుడు. ఇతని రాజ్యకాలములో తూర్పు చాళుక్యసామ్రాజ్యము అనేక మార్గాల విస్తరించెను. ఇతనికీర్తి నలుదిశల వ్యాపించెను. అయిదవ విష్ణువర్ధనునికి రాష్ట్రకూట రాజపుత్రికయగు శీలామహాదేవియందు జన్మించిన నలుగురు పుత్రులలో గుణగ విజయాదిత్యుడు అగ్రజుడు. ఇతడు క్రీ. శ. 848 లో తండ్రి మరణానంతరము వేంగీ సింహాసనమును అధిష్ఠించెను.
గుణగ విజయాదిత్యుడు రాజ్యమునకు వచ్చుసరికి ద్రవిడదేశములో పల్లవులు; నేటి మైసూరురాష్ట్రములో గాంగులు, నోలంబ పల్లవులు, నేటి తెలంగాణ ప్రాంతములో రాష్ట్రకూటులు. వారికి ఉత్తరముగా చేది హైహయులు పరిపాలనము చేయుచుండెడివారు. ఈ రాజవంశములమధ్య పరస్పరము యుద్ధములు జరుగు చుండెడివి. గుణగ విజయాదిత్యుడు తన రాజ్యముయొక్క క్షేమముకొరకు, ముఖ్యముగా రాష్ట్రకూటుల విజృంభణమును అరికట్టుటకొరకు ఆనాటి రాజవంశములతో అనేక యుద్ధములు చేయవలసినవాడయ్యెను. ఈతడు సుమారు 43 సంవత్సరములకాలము రాజ్యము చేసెను. ఈ దీర్ఘకాలములో అధికభాగము యుద్ధములు చేయుటతోనే సరిపోయెను.
ఇతడు రాజ్యమునకు వచ్చిన మొదటి సంవత్సరములోనే దక్షిణసీమలో ఉన్న బోయజాతివారు అలజడి కలిగించిరి. ఈ బోయలు పల్లవరాజులకు సామంతులుగా ఉండెడివారు. వీరుచేయు కల్లోలములను అణచివేయు నిమిత్తము పాండురంగడను బ్రాహ్మణసేనానిని విజయాదిత్యుడు దక్షిణదిశకు పంపించెను. ఈ సేనాని బోయల ముఖ్య కేంద్రములైన నెల్లూరు, కట్టెం దుర్గములను నాశనముచేసి వారి భూములను వేంగీరాజ్యములో చేర్చెను. దానితో తృప్తినొందక పాండురంగడు ఇంకను దక్షిణముగా దండువెడలి పులికాట్ సరస్సువరకుగల ప్రాంతమునెల్ల జయించి వేంగీసామ్రాజ్యములో చేర్చెను. భవిష్యత్తులో బోయలు తిరిగి అలజడులు కలిగించకుండ కట్టుదిట్టముచేయు నుద్దేశముతో విజయాదిత్యుడు ఈ ప్రాంతమున కంతటికిని కందుకూరు ముఖ్యపట్టణముగా జేసి పాండురంగని పాలకునిగా నియమించెను.
ఇది జరిగిన కొద్దికాలమునకే విజయాదిత్యునికి అప్పటి రాష్ట్రకూటరాజై న అమోఘవర్షునితో పోరు ప్రారంభమై లింగవల్లి వద్ద ఘోరయుద్ధము జరిగెను. ఇందులో వేంగీ చాళుక్యసైన్యములు ఓడిపోయి విజయాదిత్యుడు తాత్కాలికముగా రాష్ట్రకూటులకు లోబడవలసివచ్చెను ఇట్లు రాష్ట్రకూటులకు లోబడియున్న కాలములో అమోఘవర్షుని కోరికను అనుసరించి విజయాదిత్యుడు, రాష్ట్రకూట రాజుపై తిరుగుబాటుచేసిన గాంగులమీద దండయాత్ర సాగించవలసి వచ్చెను. దండువెడలిన విజయాదిత్యుడు దారిలో నోలంబరాజైన మంగిని ఓడించి కడకు గంగివాడి ప్రవేశించి, అక్కడ గాంగులనుగూడ ఓడించెను. గాంగులు లోపలిభాగమునకు పారిపోయి గంగకూటమను చోట తలదాచుకొనిరి. కాని విజయాదిత్యుడు వెంటనంటి పోయి అక్కడకూడ వారిని ఓడించి తిరిగి రాష్ట్రకూటుల ఆధిపత్యమును వారు అంగీకరించునట్లు చేసెను
ఈ దండయాత్ర ముగిసినతరువాత రాజధానికి తిరిగివచ్చి కొంతకాలమువరకు విజయాదిత్యుడు తన రాజ్య వ్యవహారములలో నిమగ్నుడయ్యెను. క్రీ. శ. 800 సం. లో అమోఘవర్షుడు మరణించగా రెండవకృష్ణుడు రాష్ట్రకూట రాజ్యమునకు ఏలికఅయ్యెను. ఇది జరిగిన కొన్నిరోజులకే ఘూర్జర ప్రతీహారవంశపు రాజైన భోజుడు రాష్ట్రకూట రాజ్యముమీద దండెత్తివచ్చి మాలవరాష్ట్రమును వశపరచుకొనెను . పూర్వము అమోఘవర్షుని కాలములో తనకు జరగిన అవమానమునకు ప్రతీకారము చేయుటకయి తగిన సమయముకొరకు వేచియున్న విజయాదిత్యుడు, కృష్ణరాజునకు ఈ విధముగా కలిగిన కష్టమును పురస్కరించుకొని స్వాతంత్ర్యము ప్రకటించెను. పాండురంగ సేనానిని రాష్ట్రకూటులపై దండుతో పంపించెను. కృష్ణరాజునకు ఈ సమయములో, అతని బావమరదియు, దాహళ మండలమునకు రాజును అయిన సంకిలుడు బాసటగా నిలిచెను కాని వీరిద్దరు కలిసికూడ వేంగీచాళుక్య సైన్యముల ధాటికి తట్టుకొనలేకపోయిరి. ఈ విధముగా ఓడిపోయి కృష్ణరాజు తన రాజ్యమును సహితము వదలిపెట్టి దాహళమండలములో తలదాచు కొనెను. ఈలోగా ద్రవిడ దేశములో ఒక ఉపద్రవము సంభవించెను. అక్కడి చోళరాజు ఒకడు - పాండ్య, పల్లవరాజుల వత్తిడికి తట్టుకొనలేక గుణగ విజయాదిత్యుని సహాయమును అర్థించెను. ఈచోళరాజునకు సహాయార్థము విజయాదిత్యుడు సైన్యమును పంపించి పాండ్య పల్లవ రాజులను ఓడించి వారివద్దనుండి అపారధనమును సంపాదించెను.
తరువాత విజయాదిత్యుడు రాష్ట్రకూటులమీద మరియొక దండయాత్ర సాగించెను. ఈ యాత్రలో వేంగీ చాళుక్య సైన్యములు కళింగదేశములోనుండియు, కళింగమును అంటియున్న చక్రకూటమండలములో నుండియు, పోవలసివచ్చెను. దీనివలన విజయాదిత్యునకు, కళింగరాజయిన భూపేంద్రవర్మతోను, చక్రకూట మండల పరిపాలకుడైన బద్దెగ రాజుతోను పోరు సంభవించెను. కడకు భూపేంద్రవర్మను, బద్దెగరాజును ఓడించి విజయాదిత్యుడు దాహళమండలము ప్రవేశించి దాని రాజధాని అయిన కిరణపురమును ముట్టడించెను. అక్కడ జరిగిన యుద్ధములో ఓడిపోయి సంకిలుడు, కృష్ణునితో లోపలి భాగమునకు పారిపోయెను. కిరణపురమును దహించి విజయాదిత్యుడు శత్రువులను వెంబడించెను. దారిలో దాహళ, నిరూట, దలెనాడు మొదలయిన దుర్గములను స్వాధీనము చేసికొని శత్రువులిద్దరును తలదాచుకొన్న అచలపురమును ముట్టడించెను. ఇక్కడ జరిగిన యుద్ధములో కూడ కృష్ణరాజు ఓడిపోయి సంధికోరెను. రాష్ట్రకూటరాజ్యము యావత్తు వేంగీ చాళుక్యుల అధీనములోనికి వచ్చెను. కాని, విజయాదిత్యుడు కృష్ణరాజును కనికరించి, అతని రాజ్యమును అతనికి ఇచ్చివేసి, రాష్ట్రకూట బిరుదములను కొన్ని ధరించి, వారి రాజ్యచిహ్నములైన గంగా యమునలను, పాలి ధ్వజమును మాత్రము పరిగ్రహించి, తన రాజధానికి తిరిగి వచ్చెను.
ఈ రాష్ట్రకూట దండయాత్రానంతరము విజయాదిత్యుడు మూడు, నాలుగు సంవత్సరములు మాత్రమే రాజ్యము చేసెను. ఈ కాలమంతయు ప్రశాంతముగనే గడచిపోయెను. ఈ విధముగా మొత్తము 43 సంవత్సరముల కాలము రాజ్యముచేసి క్రీ. శ. 891 లో ఈ మహారాజు దివంగతు డయ్యెను.
గుణగ విజయాదిత్యుడు పరరాజులతో అనేక యుద్ధములు జయప్రదముగా సాగించుటకును, 43 సంవత్సరముల కాలము దేశములో ఏ విధమయిన ఆంతరంగిక కలహములు అలజడులులేకుండ శాంతియుతముగా రాజ్య మేలుటకును ఇతని ఆశ్రితవర్గము ఒక ముఖ్యకారణము. వీరిలో పాండురంగసేనాని, వినయడిశర్మ, రాజాదిత్యుడు అనువారు ముఖ్యముగా ప్రశంసాపాత్రులు. పాండురంగనిని పండరంగడుగా కొన్ని శాసనములు వాక్రుచ్చు చున్నవి. పాండురంగ సేనాని తూర్పు చాళుక్యవంశరాజుల ప్రాపకములో ఉండుచు, వారికి నమ్మినబంటుగా ప్రఖ్యాతి చెందిన బ్రాహ్మణ వంశ్యులలో నొకడు. ఇతని తండ్రి కటకరాజు ఎల్లప్పుడు విజయాదిత్య మహారాజును అంటిపెట్టుకొని ఉండి. అతడు నొలంబులతో చేసిన యుద్ధ ములో మరణించెను. పాండురంగడు మొట్టమొదటిసారి వేంగీ సామ్రాజ్యపు దక్షిణ సరిహద్దులలో బోయలతో జరిగిన యుద్ధములలో ప్రముఖపాత్ర వహించి మహారాజును ఆకర్షించెను. పాండురంగని శక్తిసామర్థ్యములు, స్వామిభక్తి పరాయణత గుర్తించి మహారాజు ఇతనిని దక్షిణసీమకు పాలకునిగా నియమించెను. తరువాత చాల కాలము వరకు పాండురంగని వంశ్యులు ఈ ప్రాంతములోనే వేంగీ చాళుక్యుల ఉద్యోగులుగా ఉండుచు వచ్చిరి. కందుకూరు ముఖ్యపట్టణముగా పాండురంగడు ఈ ప్రాంతమును పాలించుచు తన విజయములకు సూచకముగా నేటి నెల్లూరుజిల్లాలోని శ్రీహరికోట ద్వీపమునకు సమీపమున తన పేర పాండురంగము అను గ్రామమును కట్టించెను. ఈ గ్రామములోనే ఒక శివాలయము కూడ కట్టించి అక్కడ తన పేర పాండురంగేశ్వరుని ప్రతిష్ఠించెను. అంతటినుండి తన తండ్రివలెనే ఇతడు కూడ గుణగ విజయాదిత్యుడు సాగించిన యుద్ధము లన్నిటిలోను మహారాజునకు కుడిభుజముగా ఉండెడివాడు. ఈ విధముగ ఆ మహారాజు ఆర్జించిన అనేక విజయములకు ఇతడు కారణము అయ్యెను. కృతజ్ఞతా సూచకముగ మహారాజు ఇతనికి ద్వితీయ భీభత్సుడను బిరుదమును ప్రసాదించెను.
విజయాదిత్యునకు ఎక్కువగా సహాయపడిన వారిలో అతని ఆశ్రితవర్గములోని వినయడిశర్మ మరియొకడు. ఇతడు కౌశికగోత్రుడు, ఆపస్తంబసూత్రుడు, తైత్తిరీయ శాఖాధ్యాయి అయిన తుక్కశర్మకు పౌత్రుడు. దామోదర శర్మకు పుత్రుడు. ఉప్పుటూరు గ్రామవాస్తవ్యుడు. వేదవేదాంగములలోను, రణవిద్యలోను అసమాన పాండిత్యము, ప్రతిభకలవాడు. ఇతడు, గుణగ విజయాదిత్యుడు నొలంబ రాజైన మంగితో చేసిన యుద్ధములో అమూల్యమైన సలహా నిచ్చి మహారాజుయొక్క విజయమునకు కారణ మయ్యెను. ఈ సహాయమునకు తన కృతజ్ఞత వెలిపుచ్చుచు మహారాజు ఇతనికి గుద్రవాడ విషయములో త్రాండిపఱ్ఱు అను గ్రామమును అగ్రహారముగా ఇచ్చెను.
రాజాదిత్యుడను మరియొక బ్రాహ్మణసేనాని ఈకాలములో ప్రసిద్ధుడుగా ఉండెడివాడు. ఇతనితండ్రి కుమారమూర్తి తొండమండలములో కాడువెట్టి అను పల్లవరాజునకు ఆశ్రితుడుగా ఉండుచు అభిప్రాయ భేదము కారణముగా ఆ ప్రాంతమును వదలి వేంగీరాజ్యమునకు వలస వచ్చి, ఉండి అను గ్రామములో స్థిరపడెను. రాజాదిత్యుడు విజయాదిత్యుడు చేసిన అనేక యుద్ధములలో చాల సహాయపడెను. ఈ సహాయమునకు కృతజ్ఞతా సూచకముగ మహారాజు ఇతనికి కాట్లపఱ్ఱు అను గ్రామమును దానముచేసెను.
తన విజయపరంపరలకు, శాంతియుత పరిపాలనకు ప్రఖ్యాతులైన సేనానులు, మేధావంతులయిన అమాత్యులు ముఖ్య కారకులయినప్పటికిని, సచివాయత్తసిద్ధులని వ్యపదేశోక్తిగా చెప్పబడు మహారాజులలో విజయాదిత్యుని ఒకనిగా పరిగణించుటకు వీలులేదు స్వయముగా ఇతడు మహాపరాక్రమశాలి, గొప్పసేనాని, దక్షుడైన రాజ్య పాలకుడు. తన పరాక్రమమునకు తన విజయములకు, వైభవ ప్రాభవములకు చిహ్నములుగా మనుజపరాక్రమ, రణరంగశూద్రక, పరచక్ర రామ, నృపతిమార్తాండ, వీరమకరధ్వజ, అరసంక కేసరి, గుణక్కెనల్ల, త్రిపురమర్త్య మహేశ్వర, భువనకందర్ప, సమస్త భువనాశ్రయ మొదలైన బిరుదములను ధరించెను.
పరాక్రమశాలి అయిన గొప్పసేనానిగా, దక్షుడైన పరిపాలకుడుగా మాత్రమేకాక, గుణగ విజయాదిత్యుడు కళాప్రియుడు గాను, విద్యాపోషకుడుగాను కూడ వాసికెక్కెను. పెక్కు దేవాలయములు ఈ మహారాజు యొక్క కళాప్రియత్వమునకే కాక వేంగీ చాళుక్య యుగమునాటి వాస్తు, శిల్పకళాభివృద్ధికి కూడ చక్కని నిదర్శనములు. వేద వేదాంగములు, పురాణేతిహాసములు మొదలయిన విద్యలలోను, ఇతర కళలలోను ప్రవీణులు, షట్కర్మనిరతులు అయిన బ్రాహ్మణోత్తములకు సాతులూరు, ఉరవటూరు మొదలయిన గ్రామములను అగ్రహారములుగా ఇచ్చి విజ్ఞానాభివృద్ధికి ఎంతో దోహదము చేసెను. విజయాదిత్యుడు ఎక్కువ ధర్మచింతన కలవాడు. దేవాలయములకు, మఠములకు ఎన్నో భూరిదాన ధర్మములు చేసెను. కల్పోక్తములయిన తులాభార దానములు అనేకములు చేసెను.
ఈ విధముగా ఉదాత్తక్షాత్ర మహితుడు, రాజనీతి ప్రవీణుడు. దయార్ద్రహృదయుడు, దానధర్మ పరాయ ణుడు, అయి వాసికెక్కిన గుణగ విజయాదిత్య మహారాజు ప్రఖ్యాతులయిన తూర్పు చాళుక్యవంశ రాజులలో అగ్రగణ్యుడని, ఆంధ్రదేశమును పరిపాలించిన రాజులలో ప్రథమశ్రేణికి చెందినవాడనియు నిస్సందేహముగా చెప్పవచ్చును.
ఆర్. న. రా.