Jump to content

సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మూడవ సంపుటము/గుజరాతుదేశచరిత్రము

వికీసోర్స్ నుండి

గుజరాతుదేశచరిత్రము :

భారతప్రభుత్వ ప్రాంతీయ పునర్విభజనానంతరము రెండుమూడు ప్రదేశములు కలిసి ఒక ప్రాంతముగా ఏర్పడెను. కాని వేరువేరు ప్రాంతములందలి భాష, నాగరికత కొంతవరకు వేరువేరుగా నుండును. భాష, యందును, నాగరికతయందును, మార్పులు వచ్చుటకు కారణము ఆ ప్రాంత పరిపాలనాధికారులే. అదేవిధముగ మహాగుజరాతు ప్రదేశమునందు గుజరాతు, సౌరాష్ట్రము, కచ్ఛిప్రాంతములు కలిసియున్నవి. ఈ మూడుప్రాంతములు కలిసి 'మహాగుజరాతు' అయినప్పటికిని, వీని భాషా సంస్కృతులయందు కొంత భేదమున్నది. దీనికి కారణము రాజకీయ పరిస్థితులే. మొదట కచ్, మహారాష్ట్రుల పరిపాలనయం దుండెను. సౌరాష్ట్రమున అనేక చిన్న రాజ్యములుండి, అనేకజాతులకు సంబంధించిన రాజులు రాజ్యము లేలిరి. గుజరాతు బ్రిటీషు ప్రభుత్వాధీనములో నుండెను. కాన, సామాజిక వ్యవహారములలో కొంత భేదము వచ్చినది. వీనిచరిత్ర వివిధకాలములలో వివిధ రీతులలో నడచినది. ఆ చరిత్రను పూర్తిగా పరిశీలించినచో, బహు విచిత్రముగ నుండును.

క్రీ. శ. ఆరవశతాబ్దమునందు ఈ ప్రాంతమున కొందరు విదేశప్రజలు స్థావరముల నేర్పరచుకొనిరని శాస్త్రజ్ఞుల నమ్మకము. కాని వీరు ఏ యే ప్రదేశములనుండి ఏతీరున వచ్చినదియు ఎవరికిని తెలియదు. ఆతరువాత, కొన్ని పరిశోధనల ఫలితముగా తేలినదేమన, ప్రథమమున గుజరాతుప్రాంతమున స్థావరములు ఏర్పరచుకొనినవారు "కాస్మయం" అను ప్రదేశమున నివసించియుండవచ్చు ననియు, ఈ కాస్మయం ప్రదేశమునకు వారు రష్యా, దక్షిణోత్తరములనుండి వచ్చిరనియు, వీరు ఒకే పర్యాయము పెద్ద సమూహముగా వచ్చిరనియు, ఈ సమూహమునకు ' శ్వేతసమూహ' మని పేరనియు తేలినది. ఈ సమూహము నందలి కొందరు రాజస్థానము, కచ్ ప్రాంతములలోగూడ స్థావరములు ఏర్పరచుకొనిరి.

గుజరాతుభాష 'శౌర సేని' అపభ్రంశమునుండి పుట్టినది. ఈ అపభ్రంశమును మూడుకాలములక్రింద విభజించిరి. (1) శౌర సేని అపభ్రంశభాష క్రీ. శ. 900 - 1100 వరకు ; (2) మధ్య అపభ్రంశ భాష 1100-1500 వరకు ; (3) అంతిమ అపభ్రంశభాష 1500-1600 వరకు. గుజరాతుభాష అంతిమ అపభ్రంశభాషనుండి ఉద్భవించినది. గుజరాతుభాషను ఆదిగుజరాతు ; మధ్యగుజరాతు, అర్వాచీన గుజరాతు అని మూడు భాగములుగ విభజించిరి. ఆది గుజరాతు 1600-1700 వరకు; మధ్యగుజరాతు 1700–1750 వరకు; 1750 నుండి అర్వాచీన గుజరాతు. కొందరు శాస్త్రజ్ఞులు 1300 – 1400 నడుమ మధ్య అపభ్రంశమునుండి గుజరాతీభాష పుట్టినదనికూడ వాదింతురు.

గుజరాతుయొక్క ప్రాచీనసంస్కృతిని తెలియపరచు ఆధారములు మిక్కుటముగా లేకపోవుటచే దాని ప్రాచీన సంస్కృతి అంతగా చెప్పుకోదగినది కాదనియు, అట్టి నిదర్శనములు కొన్ని యున్నను, వాటిచే పూర్తిసంస్కృతి తెలియదనియు చరిత్రకారులమతము. ప్రాచీన గుజరాతు సంస్కృతిని తెలియజేయు కొన్ని ఆయుధములు, శిల్పములు సబర్మతీనదీ మైదానమందును, అచటికి సమీపమున నున్న “సాడోలియా" అను గ్రామమందును, సబర్మతీ నదియందును దొరకినవి. ఇచ్చట లభించిన ఆయుధములు రాతితో చేయబడినవి. వాటి పిడులపై అనేకవిధములైన చెక్కడములు, శిలావిగ్రహములుకూడ దొరకినవి. అందలి శిల్పకళ చూపరులకు అద్భుతము కలిగించునదిగ ఉన్నది. కాన నీ ప్రాంతమున నొక ప్రాచీననగరముండె నని చెప్పుదురు.

సబర్మతీనదీ ప్రాంతమున దొరకిన ఆయుధములును, మూడవశతాబ్దమున దక్షిణ భారతదేశమందు దొరకిన ఆయుధములును ఒకేవిధముగ నున్నవి. కాన మొదట దక్షిణదేశమున జనసంఖ్య ఎక్కువ యుండుటచే ఇచటి వారు గుజరాతునకును, ఉత్తరదేశమునకును వెళ్ళినట్లు శాస్త్రజ్ఞు లూహించుచున్నారు

పురాతన గుజరాతు చరిత్రను రెండు భాగములుగ విభజింపవచ్చును. (1) ప్రాచీన పాషాణయుగము (2) నూతన పాషాణయుగము. ప్రాచీన పాషాణయుగమున రాతితో ఆయుధములను తయారుచేసిరి. కాని అవి చూచుటకు అందముగగాని, సున్నితముగగాని లేవు. నూతన పాషాణయుగమున రంగు రంగుల రాతి ఆయుధములు తయారయ్యెను. ఈ ఆయుధములు నునుపుగను, చూచుటకు అందముగను ఉండి పనితనమును కలిగి యుండెను. ఇట్టి ఆయుధములు, శిల్పములు “లాంధరజ్ " అనుచోట త్రవ్వకములు జరుగగా అందు బయల్పడెను. త్రవ్వకముల ఫలితముగా లభించిన వస్తుజాలము “మోహంజదారో” నాగరికతకంటె మూడు నాలుగు వేల సంవత్సరములకు పూర్వమైనవని తెలియుచున్నది. ప్రాచీన పాషాణయుగమున ఎక్కువ జాతులు లేవనియు, 'హేమరట్' అనుజాతి యుండెననియు పరిశోధనలవలన తెలిసెను. నూతన పాషాణయుగమున ముఖ్యజాతులు నాలుగనియు (బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అనునవి) ఈ కాలమున గూడ 'హేమరట్' జాతి అను నది ఉండెననియు, ఈ జాతివారు పై నాలుగు జాతులతో కలియక కొండప్రాంతములలో ఉండెడివారనియు వీరు ఎక్కువగా చేపలను, జింకలను వేటాడి వాటివలననే జీవించెడివారనియు ప్రాచీన చరిత్రలు తెలియజేయు చున్నవి. 1700 సంవత్సరములకు పూర్వపుయుగమునకు తామ్రయుగమనియు 1500 సంవత్సరములకు పూర్వపు యుగమునకు లోహయుగమనియు పేర్లు.

గుజరాతు చరిత్ర అనేక మహత్తర సంఘటనలతో నిండి యున్నది. భారతదేశ స్వాతంత్ర్యము కొరకు ఎన్నో పర్యాయములు ఈ ప్రాంతీయులు యుద్ధరంగమున తమ శౌర్యమును ప్రదర్శించిరి. ప్రాచీన చరిత్రను తెలియజేయు శాసనములు ఈ ప్రాంతమున నెన్నోగలవు. ఇందు అశోకుని, రుద్రదాముని, స్కంధగుప్తుని శాసనములు ఎక్కువగా కన్పించును.

గుజరాతుచరిత్రలో " మైత్రక, వలభీయుగ" మనునది గలదు. మైత్రక, వలభీ అను రాజులు మహా పరాక్రమ వంతులు. తమ క్షాత్రతేజమున 300 సంవత్సరములు గుజరాతును ఈ వంశమువారు పరిపాలించిరి. మైత్రక, వలభీలు మొదట మాళవ, సత్యాద్రిరాజుల మన్ననలను పొంది తమ స్వామిభక్తిని నిరూపించుకొని, తత్ఫలితముగా కొంత రాజ్యమును పొంది, దానిని తమ పరాక్రమముచే విస్తరింపజేసికొనిరి. అదియే గుజరాతు. 'వలభీ' అను పేరుతో ముఖ్యపట్టణమును నెలకొల్పిరి. వీరి సైన్యము గుప్తరాజుల సైన్యమును ఓడించి, తమ పరిసర ప్రాంతములకు తిరిగి రాకుండునట్లుగా జేసెను. వలభీ యందు మహాపండితులును, కోటీశ్వరులైన వైశ్యులును ఉండిరి. ఈ పండితులనే ఆనందపురిబ్రాహ్మణులని కూడ యందురు. వీరు భారతదేశమందు విద్వత్తులో మొదటివారని చెప్పుదురు. ఇచట నలందా విశ్వవిద్యాలయమువంటి విద్యాలయ ముండెను. ఈప్రాంతమున జైను లెక్కువగా నుండిరి. కాని విద్యాధికులు బౌద్ధులే. వలభీయందలి విద్యాలయములో మాగధీ, పాలీ అపభ్రంశ భాషలను, సంస్కృతమున బోధించు చుండెడివారు. ఇచటి జైనసిద్ధాంత సంగ్రహాలయములను వైశ్యస్త్రీలు అతిశ్రద్ధతో సంరక్షించిరని వినికిడి. కొందరు నేటికిని జైనసిద్ధాంతములనే ప్రమాణములుగా తలంతురు. మైత్రక రాజవంశజులు విద్యాభిమానులు; భగవద్భక్తులు. వీరు అనేక దేవాలయములను కట్టించిరి. వీరు కట్టించిన ఆలయములలో నేటికిని వేణుగోపాలస్వామి మందిరము వలభీనగరమం దున్నది. ఈ నగరము నౌకాయానమునకు ప్రసిద్ధి. ఈ వంశము తరువాత “ధుమలీ సైంధవ” వంశ మనునది వచ్చి సప్తసముద్రములపై యధికారము సంపాదించినదని చెప్పుదురు. సోలంకీ యను రాజు గుజరాతు సరిహద్దులను పెంపొందించెను. ఇతడు కర్నాటక, రాజస్థాన్, మాళవ రాజ్యములపై దండెత్తి వానినుండి కొంతభాగమును తన రాజ్యములో కలుపుకొనెను. ఇతడు సోమనాథుని ఆలయమును కట్టించెను. ఇది గొప్ప యాత్రాస్థలము. నేటికిని సోమనాథుని దర్శించుటకు యాత్రికులు వెళ్ళుచునే యుందురు.

సోలంకీ తరువాత కోటయాధీశు డను వాడు గుజరాతును పరిపాలించెనని కొందరు చరిత్రకారులు చెప్పుదురు కాని, ఇతనిని గూర్చిన చరిత్ర అంతగా తెలియదు. నాటి ప్రసిద్ధపట్టణములు, గ్రామములు నేటికి గూడ ఆ పేరుతో ప్రసిద్ధిచెందియున్నవి. పూర్వకాలమున ఈ దేశమందు శిల్పశాస్త్రము నానా ముఖముల వృద్ధిజెందెను. నాటి ప్రజలకు దేశాభిమానము మెండుగ నుండెడిది.

ఈ ప్రాంతము క్రీ. శ. 1300-1400 వరకు పరదేశీయుల హస్తగతమయ్యెను. క్రీ. శ. 1411 లో తిరిగి, ఇది స్వతంత్ర రాజ్యముగా మారెను. తిరిగి ఇది క్రీ. శ. 1573లో మహమ్మదీయుల అధీనమయ్యెను. భారతీయ సైన్యములో గుజరాతు సైన్యము మహమ్మదీయుల కాలములో ప్రఖ్యాతి గాంచెను. ఈ సైన్యము రాజస్థాన్, మాళవ, ఢిల్లీ రాజ్యముల ముఖ్యపట్టణములలో నుండెడిది. గుజరాతునందు “తోపుఖానా” యనునది ప్రసిద్ధిచెందినది. ఈ తోపుఖానా అహమదాబాద్, సూరత్ పట్టణములకంటె విస్తృతముగా నుండెడిది. మొగలులను ఎదుర్కొనుటకై వీరు అనేక సాహసకృత్యములుచేసిరి. మొగలులు గుజరాతును స్వాధీనపరచుకొనియు, అచ్చట చక్కని రాజ్యాంగ వ్యవస్థను ఏర్పాటుచేయలేకపోయిరి. ఇచటి ప్రజలు విదేశీయ పరిపాలనయందు నలిగిపోయిరి. 1734 నుండి ఈ దేశవాసులలో నవచైతన్యము పొడచూపెను. అదేసమయమున మహారాష్ట్రులు విజృంభించి మహమ్మదీయుల నిరంకుశత్వమును అణచుటకై అచ్చటచ్చట మొగలులకు వశమైన కోటలను స్వాధీనపరచుకొనిరి. ఈకాలముననే గుజరాతు, పూనానగరాధికారముక్రిందికి వచ్చెను. కొద్దికాలములోనే ఈ రాజ్యము చిన్న చిన్న రాజ్యములుగా విభజింపబడెను.

భారతదేశమును పారతంత్ర్య పంకమునుండి విడిపించిన గాంధీమహాత్ముడు ఈ రాష్ట్రమునకు చెందిన వాడే. చతుర్విధ సిద్ధాంతములతో కూడుకొనిన గాంధీ వాదము ఇచ్చటనే దృఢపడినది. క్రీ. శ. 1921 నుండి 1942 వరకు జరిగిన సత్యాగ్రహ సంగ్రామమందు గుజరాతు సంస్కృతి వికసించెను.

గుజరాతు సంస్కృతి: మానవునికి ప్రకృతి సరిహద్దు వంటిది. ఈ ప్రకృతి ననుసరించి మానవుడు తన సంస్కృతిని పెంపొందించుకొనును. ప్రాచీన కాలమున ఆర్యులు మొట్టమొదట గుజరాతునందు స్థావరముల నేర్పరచుకొనిరి. ఈ ప్రాంతము సముద్రసామీప్యమున నుండుటచే వ్యాపారమునకు అనుకూలమైనది. ఇచ్చట పూర్వకాలము నుండియు దేశీయుల, పరదేశీయుల కలయిక జరుగుచునే యున్నది. నాటినుండి నేటివరకు ఇచటి ప్రజలు ఉదారులు, ధార్మికులు. వ్యాపార విషయమున మంచి యోగ్యత గలవారు, ఈ ప్రాంతీయులకు రాజకీయ సంబంధముకంటె వ్యాపారసంబంధము ఎక్కువ. ఓడలను తయారు చేయుటయందు వీరు నిపుణులు. చాలకాలము నుండి వీరికి ముఖ్యవృత్తి ఓడలను కట్టుటయే. ఈ ప్రదేశము నౌకాశ్రయములకు అనువుగ నుండుటచే, 1920 సంవత్సరములో మొదటిసారిగా ఆంగ్లేయిలు 'సింధియా' అను కంపెనీని ఇచ్చట ప్రారంభించిరి. ఈ ప్రాంతమున జైన, బౌద్ధ మతములు సమాన బలముతో వ్యాపించెను. రానురాను ఈ రెండు మతములు విజృంభించి ఒకదానిని మరియొకటి అణచవలెనను పట్టుదల పెరిగెను. ఇది ఇట్లుండగా, ఆర్యవైదికమతము గూడ ఇచట పెంపొందెను. జైన, బౌద్ధ సంఘర్షణల ఫలితమే ఈ ఆర్య వైదికమత ప్రాబల్యము. ఆర్యవైదిక మతమునందు గల లోపముల కారణముగా జైన, బౌద్ధమతములు దీనిని ఖండించెను. ఇచట పారసీకులు, అరబ్బులు ఎక్కువ సంఖ్యలో నుండిరి. విదేశీయుల హస్తగతమైన తరువాత ఈ ప్రాంతము అనేక సంఘర్షణలకు గురికావలసివచ్చెను. సోలంకీరాజుల కాలమున ఏ సంస్కృతి ఈ ప్రాంతమున వికసించినదో, అదే నేడుకూడ ప్రచారములో నున్నది. కాని క్రొత్తమార్పులు ఎక్కువగా గానరావు. రాజకీయ, సైనిక వృత్తులలో ఈ ప్రాంతము ప్రాముఖ్యత వహించుటకు మూలరాజ్, సిద్ధరాజ్, కుమారపాల్, తగేపాల్ అనువారలు ముఖ్యులు. ఈ ప్రాంతము మహమ్మదీయ పరిపాలనలోనికి వచ్చిన తరువాత, ఇచ్చటి సంస్కృతిలో కొన్ని మార్పులు కలిగెను. అక్బరు కాలమున ఈ ప్రాంతమును ఒక మహమ్మదీయుడు పరిపాలించెను. ఆతనిని అక్బరు ఓడించి అతని రాజ్యమును తన రాజ్యమున కలుపుకొనెను. అక్బరు సృష్టించిన “దీన్ ఇల్లాహి” అను మతము ఈ ప్రాంతమున కొంతవరకు ప్రబలెను. ఇచట ముస్లిములు ఎక్కువగా ఉండుటచే, అక్బరుయొక్క నూతన మతము ప్రచారమునకు వచ్చి విస్తృతి జెందుటకు కారణమయ్యెను. ఈ మతము అచటి హిందూ, ముస్లిములకు ఐక్యతను సమకూర్చెనని కూడ చెప్పుదురు. గుజరాతునందు నివసించుచుండిన మహమ్మదీయులకు అరబ్బీ, పార్సీభాషలు వచ్చినప్పటికిని, వారు గుజరాతు భాషనే తమ మాతృభాషగా అంగీకరించిరి. మహమ్మదీయ యుగముననే ఇచట భక్తిమార్గము వెల్లివిరిసెను. ఈభక్తి మార్గమును ప్రవేశపెట్టినవారు వల్లభాచార్య, చైతన్యులు. వీరిరువురు కృష్ణభక్తి ప్రధానమని శ్రీకృష్ణుని అద్భుత లీలలను తెల్పు గీతములను రచించి, పామర జనుల యందు భక్తి మార్గమును ప్రవేశ పెట్టి హిందూ సంప్రదాయమును కాపాడిరి.

గుజరాతుభాష మృదుమధుర మైనది. హేమచంద్ర నరసింహ మెహతా, భక్తమీరా మొదలగు భక్తులు ఈ ప్రాంతమున జన్మించినవారే. ప్రారంభమున ఇచ్చటి కవులు పద్యమునందే అనేక భక్తి కావ్యములను రచించిరి. ఆ తరువాత గద్యరచన, మతసంబంధమగు సాహిత్యము, కథాసాహిత్యము, రాసా, వర్ణనాత్మక వ్యాసములు, నవలలు, క్రమేణ వృద్ధిలోనికి వచ్చెను. సంగీత, నాట్యములనిన యిచ్చటి వారికి బహుప్రీతి. కావుననే సంగీతము వృద్ధిచెందినది. శ్యామలా సంగీత మనునది బహుముఖముల వృద్ధిచెందెను. రసమూర్తి యైన శ్రీకృష్ణుడు తన మురళీ నాదముచే ఈ ప్రాంతీయులకు భక్తిసారమును చవి చూపెను. శ్రీకృష్ణుడు ఇచ్చటి వారికి యిష్టదైవము. శ్రీకృష్ణుని బాల్య క్రీడలను అతని మహిమను గూర్చి పాడు పాటలు అతి శ్రావ్యములై యుండును. వీరు భక్తి గీతములు పాడుచు, పరమానందములో భక్తి సారమును గ్రోలుచు తన్మయత్వమును పొందుదురు. మీరాబాయి వ్రాసిన శ్యామలాగీతములకు తగు సంగీతమును గూర్చి వానినెంతో భక్తిశ్రద్ధలతో భజింతురు.

గుజరాతు స్త్రీల వస్త్ర, భూషణములు ఇతర ప్రాంతములకంటె భిన్నమై యుండును. వీరి వేషభూషణములు గోపికాంగనల వంటివని ప్రతీతి. వీరి ఆభరణములు కొంత మొరటుగానే యుండును. కొంతవరకు తెలంగాణ ప్రాంతమున నివసించు లంబాడివారి ఆభరణములను పోలి యుండును. లంగాలపై (పావడ) బంగారు జరీతో లతలుగా కుట్టి చూచుటకు అందముగా నుండు పనితనము కలిగి యుండును. అదే విధముగ పైటవస్త్రము పైనను ఇట్టి జరీపనియే కనపడును. సోలంకీరాజు పరిపాలనకాలమునను, తరువాతి కాలమునను కొన్ని సంగీతశాస్త్ర గ్రంథములు ఇచ్చట లభించెను. అవి ' సంగీత ప్రకాశ, 'సంగీత రత్నావళి', 'మానసోల్లాస్ ' అనునవి. సంగీత గ్రంథములను చూడ, గుజరాతీ ప్రజలు సంగీత ప్రియులని తెలియుచున్నది. ఈ ప్రాంతమున శ్రీ సంగీతాచార్య ఓంకారనాథ్ ' అను నతడు నివసించెను. అతడు సమస్త భారతదేశమున ప్రసిద్ధి కెక్కిన వాడు.

ప్రాచీన కట్టడములు నేటికిని కొన్ని గుజరాతులో కాననగును. గుజరాతీ కళాపరిచయము లోధల్ అను చోట మనకు కల్గును. 'లోధల్' నందు అనేక చక్కని కట్టడములు గలవు. ఇచట రాసలీలను అనగా శ్రీకృష్ణుని శృంగారచేష్టలను ఒక ఆలయ కుడ్యములపై అత్యంతాకర్షకముగా శిల్పులు చెక్కియుండిరి. జైనబౌద్ధ విగ్రహములు, ధర్మచక్రము మొదలగునవి ఎన్నియో ఇచ్చట కాననగును. “గిరినార్" అనుచోట మౌర్యుల శాసనములు గలవు. ప్రాచీనకాలపు కట్టడములు కొన్ని నేటికిని అదే దశయందున్నవి. ఆ కట్టడములవలన ఈ ప్రాంతమున నిష్ణాతులైన వాస్తుశాస్త్రజ్ఞులున్నట్లు తెలియును. అదియునుగాక మొగలుల కాలమున కట్టడములందు గుజరాతు వాస్తుశాస్త్రజ్ఞుల హస్తమే ప్రధానమైనదని చెప్పుదురు. ఇచటివారు వాస్తుశాస్త్రమునందే గాక చిత్రకళ యందు కూడ ఆరితేరినవారని చెప్పవచ్చును. వస్త్రములపైగల జరీ పనితనము చూపరులకు వింతగొల్పును. జరీ పనితనము ఇచటివారి చిత్రకళా నై పుణ్యమును తెలియజేయును. గాజుపై వీరు రంగురంగులతో చిత్ర విచిత్రము లైన ఆకృతులను చిత్రించిరి. చిత్ర సమేతములైన పింగాణీ పాత్రలు కూడ పూర్వకాలమందలివి లభ్యమైనవి. ఈ ప్రాంతమున ఒక్కొక్క కళ ఒక్కొక్క స్థాయిలో పెంపొందెను. వీరి ఉత్సవములలో 'డోలోత్సవ' మనునది ప్రసిద్ధిగాంచినట్టిది. ఈ ఉత్సవమును శ్రీకృష్ణ జన్మాష్టమి నాడు ఎంతో వేడుకగా జరుపుకొందురు. తమ గృహాంగణమునందు ఊయెలను కట్టి దాని నత్యంత సుందరముగా నలంకరించి, అందు శ్రీకృష్ణుని విగ్రహమునుంచి, భక్తిశ్రద్ధలతో పూజించి, శ్యామలగీతములను అతి శ్రావ్యముగా పాడుచు, ఊయెల నూపుదురు. ఈ ఉత్సవమునందు ఆబాలగోపాలము పాల్గొని అమితానందమును పొందుదురు. పౌరాణిక యుగము నుండియు క్రమేణ వచ్చుచున్న కొన్ని కళలు ఆంగ్లేయ పరిపాలనా కాలమున మందగించె నని చెప్పుదురు.

ఈ ప్రాంతీయుల ముఖ్యవృత్తి అధికముగా వ్యాపారమే. వీరు సాహసచాతుర్యములు గలవారు. వ్యాపారమునందు ముందంజవేసి ఉన్నతస్థితికి వచ్చినవారు వీరేనని చెప్పవచ్చును. ఇచ్చటిరైతులు ఉదారులు ; ఉత్సాహవంతులు. ఇచ్చటివారు వ్యాపారవిషయమున ఆరితేరినవారు గావుననే, షాజహాన్ తన టంకశాకలయందు గుజరాతుశ్రేష్ఠులను నియోగించెను. వీరు లెక్కలయందు అతి నిపుణులు.

సౌరాష్ట్రము : సౌరాష్ట్రమునకు ప్రాచీననామము సురాష్ట్రము. మహాభారతమున ఈ సౌరాష్ట్రమును 'కృష్ణభూమి' యనిరి. మౌర్య, గుప్తరాజులకాలమున 'సురాష్ట్రమ' ని వ్యవహరించిరి. మహమ్మదీయుల కాలమున ఈ రాష్ట్రమును 'సోదర్ ' అనియు, మహారాష్ట్రుల కాలమున 'కఠియావాడ్' అనియు వ్యవహరించిరి. 1948 నాటికి పూర్వము ఇది చిన్న చిన్న సామంతరాజ్యములుగా విభజించబడియుండెను. 1948 సం॥ న వీనినన్నిటిని కలిపి సౌరాష్ట్రమని పేరిడిరి.

వైదికకాలమున యీ సౌరాష్ట్రముయొక్క భోగోళిక స్థితి వేరుగానుండెను. సింధునది సౌరాష్ట్రమందలి 'ఝాల్‌వాడ్' అను ప్రదేశమున ప్రవహించుచు, 'ఖండాత్ ' అఖాతమున కలియుచుండెడిది. ఐతిహాసిక కాలమందు సౌరాష్ట్ర మధ్యప్రాంతమున దట్టమైన అడవులుండెడివి. కావున జనులాప్రాంతమున నివసించలేదనియు, సాగర తీరముననే యెక్కువగ నివసించిరనియు చరిత్రకారుల ఊహ, సౌరాష్ట్రీయుల సంస్కృతికి 'సాగర సంస్కృతి' యని పేరుగూడ కలదు. కాన పౌరాణికులు సాగరతీరములందు నివసించుటచేతను, అచటనే వారి సంస్కృతికి సంబంధించిన చిహ్నములు ప్రాప్తించుటచేతను వారి సంస్కృతికి 'సాగరసంస్కృతి' యని నామకరణముచేసి యుండవచ్చును. ఆనాడు ద్వారక సామాజిక, సాంస్కృతిక, వ్యాపార కార్యకలాపములకు కేంద్రమైయుండెను.

సౌరాష్ట్రమున త్రవ్వకపు పరిశోధనలవలన బయల్పడిన వస్తుజాలము సింధు సంస్కృతికి సంబంధించినది. ప్రాచీన నవీన శిలాయుగమునకు సంబంధించిన వస్తుజాలము ఈ ప్రాంతమున అధికముగా దొరకెను. ఇచ్చట లభ్యమైన సాంస్కృతిక వస్తుజాలమునుబట్టి ఈ ప్రాంతము సంస్కృతుల సంగమస్థానమని తెలియుచున్నది. సౌరాష్ట్ర, గుజరాతు సంస్కృతులు ఇంచుమించు ఒకే సంస్కృతికి సంబంధించినవై యున్నవి. ఆదిమవాసులైన ఆర్యులు సౌరాష్ట్ర మధ్యభాగమున నున్న దుర్గమారణ్య ప్రాంతమున నివసించిరి. కాలక్రమమున ఆ యడవి ప్రదేశమున నున్నవారు ముఠాలుగా బయలుదేరి బాటసారులను దోచుకొనెడివారు. ఈ సమూహమునకే 'బందిపోటు దొంగలు' అని పేరు. మధ్యకాలమున 'చావడా' అను (రాజపుత్రులకు సంబంధించిన ఒకజాతి) వారు గుంపులుగా బయలుదేరి సముద్రతీరమున ఓడలను దోచుకొనుచుండెడి వారు. ఇట్టి కృత్యములు చేయువారు మొన్నటివరకు కూడ ఉండిరి. ఇప్పటికిని కొన్ని ప్రదేశములలో గజదొంగలు కలరు. కాని వీరిసంఖ్య అల్పము .

శ్రీకృష్ణుడు ఈ ప్రాంతమందు గల ద్వారకను రాజదానిగా జేసికొని పరిపాలించెను. వీనిని 'యాదవ గణ రాజ్య'మనికూడ వ్యవహరించిరి. శ్రీకృష్ణునకు పూర్వము ఈ ప్రాంతమున దైత్యులు నివసించిరి. వీరు కౄర కర్మముల జేయుచు ప్రజలను బాధించెడివారు; అందమైన ఆడవారిని అపహరించుకొని పోయెడివారు. శ్రీకృష్ణుడు పరిపాలనకు వచ్చిన తరువాత, రాక్షస కృత్యములు జేయువారిని హతమార్చి, వారు అపహరించి తెచ్చిన స్త్రీలను విముక్తుల జేసెను. ఇట్లు అపహరింపబడిన స్త్రీలలో కొందరు అస్సామునకు చెందినవారై యుండిరి. వీరు అస్సామునకు పోవక, సౌరాష్ట్రమునందే నిలచిపోయిరి. ఇట్టి వారికి శ్రీకృష్ణుడు నివసించుటకు తగు వసతులను కల్పించెను. ఈ అస్సాము యువతులు నృత్యకళయందు ప్రవీణలు. వీరి నృత్యమునకు శ్రీకృష్ణుని వేణునాదము చక్కనిరూపమును ఏర్పరచినది. కాన నీ ప్రాంతమున కొంత అస్సాము నాగరికత వ్యాపించెను. ఈ ప్రాంతమునకు రాసక, హల్లీసక నృత్యములు శ్రీకృష్ణు డొసగిన దివ్యకళ. నేటికిని ఈ నృత్యములు ప్రచారములో నున్నవి. శ్రీకృష్ణుని పౌత్రుడైన అనిరుద్ధుని భార్య పేరు ఉష ; ఈమె 'లాస్య'మను నృత్యమును, గానవిద్యను, చిత్రకళను పోషించి, వాటి నందరకు నేర్పెను. లాస్యనృత్యమును ఇప్పుడు 'గజరా' అని వ్యవహరించుచున్నారు. 'ఉషా చిత్రకళ' యను పేరుతో నేటికిని సౌరాష్ట్రమందు విచిత్రములైన చిత్రములు కన్పడును. శ్రీకృష్ణయుగమునకు అంధకారయుగమని యనిరి. తగుచరిత్రాధారములు లేకపోవుటయే ఇందుకు కారణము. కాని కొందరు చరిత్ర కారులు ఈ కాలమున మౌర్యులు పరిపాలించిరనియు, దీనిని కౌటిల్యుడు గణరాజ్య మని తన అర్థశాస్త్రమున తెల్పెననియు వాదింతురు. అశోకుడు ఈప్రాంతమున బౌద్ధమత ప్రచారము గావించి, స్తంభములపై శాసనములు చెక్కించెను. మౌర్యుల అనంతరము 'క్షాత్రప'వంశమునకు చెందిన పదునెనిమిదిమంది రాజులు పరిపాలించిరి. వీరిలో 'రుద్రదామన్' అను వాడు ప్రసిద్ధికెక్కెను. రాజకీయ, సాంస్కృతికదృష్టితో చూచినచో, సౌరాష్ట్రముతో రాజస్థాన, మాళవదేశములకు ఎక్కువ సంబంధముగలదని తెలియును. క్షాత్రపులతరువాత గుప్తవంశపు రాజులగు సముద్ర గుప్తుడు, స్కంధగుప్తుడు, కుమారగుప్తుడు ఇచ్చట పరిపాలించినట్లు దేవాలయములను బట్టియు, విగ్రహములను బట్టియు తెలియుచున్నది. గుప్తరాజుల పతనానంతరము గుప్త సర్దారైన 'భట్టాంక్ ' అనువాడు వలభీయందు తన రాజధానిని స్థాపించి, హిందూ సంస్కృతిని వికసింపజేసి సౌరాష్ట్రమును విస్తృతినొందించెను. సౌరాష్ట్రమందు తక్షశిల, నలందలతో పోల్చదగిన విద్యాపీఠములుండెను. విదేశములనుండి వచ్చిన విద్యార్థులు అందువిద్యలనభ్యసించి తిరిగి స్వదేశమునకు వెళ్ళెడివారు. విద్యావిధానము, మహాకవి 'భట్టి' నుండి ప్రారంభమై క్రమముగా వర్థిల్లుచు 1916 వరకు సక్రమ స్థితిలో వికసించెను. వలభీరాజ్య పతనాంతరము దేశమున అశాంతి ప్రబలెను. రాజకీయముగ అనేకములైన మార్పులు వచ్చెను. ఇంటి పరిస్థితులను పురస్కరించుకొని సమయమునకు తగు లాభమును పొందుటకై “చావడా, ఔఠనా, చుడాసమా, ఝాలా, యాదవ, రాజపూత్" వంశములు వచ్చి కొన్ని గ్రామములను వశపరచుకొని, సంస్థానాధీశులవలె నిలిచిపోయిరి. “చుడాసమా” వంశజులు 'నూనాగఢ్'ను రాజధానిగా జేసికొని ఆ ప్రాంతమును పాలించిరి. సౌరాష్ట్రమున ఈ విధముగ చిన్నచిన్న రాజ్యములు ఏర్పడుటచే ఆ ప్రాంతము అంతఃకలహముల కాలవాలమయ్యెను. క్రొత్తగా వచ్చిన వంశజులు తమ ప్రతిభను చూపించుటకై కలహించు చుండెడివారు. ఈ కాలముననే ఈ ప్రదేశము ఆంగ్లేయుల హస్తగతమయ్యెను. ఆంగ్ల ప్రభుత్వము ఈ ప్రాంతమున ఏర్పడినప్పటికిని వారి సంస్కృతి ఎక్కువగా విస్తరించలేదు. బౌద్ధ, జైన, ఆర్యసమాజ్ మొదలగు మతములు ప్రబలములై యుండుటచే, ప్రజలు హిందూధర్మమునకు దూరముకాలేదు.

మహాగుజరాతునందు కలిసిన 'కఛ్' ప్రదేశమును గూర్చి కొంత విచారింతము. 'కఛ్' భారతదేశమునకు పశ్చిమమున నున్నది. ఈ ప్రాంతపు చరిత్ర అతి ప్రాచీనమైనది. ఈజిప్టు దేశ చరిత్ర ఎంతటి ప్రాచీనమైనదో, ఇది కూడ అంతటి ప్రాచీనమైనదే. ప్రాచీనకాలమున “సమో " వంశమను రాజవంశ ముండెను. 'మహేంద్ర' అను రాజుయొక్క పౌత్రుడు 'సమాపత్' అనునాతడు, ఈ పేరునుండియే 'సమో' యను పదము వచ్చినది. ఈ వంశమునకు జెందిన 'లాభాదురారా' అను రాజునకు మానాయి, మోడ్ అను నిరువురు పుత్రులు గలరు. ఈ ప్రాంతమును సంపూర్ణముగా వీరు వశపరచుకొనిరి. 9 వ శతాబ్దము వరకు వీరి వంశజులు, ఈ ప్రాంతమును పరిపాలించిరి. క్రీ. శ. 1007 నుండి 1143 వరకు చావడా వంశమునకు జెందిన పదునెనిమిదిమంది రాజులు ఇచ్చట పరిపాలించిరి. తరువాత విక్రమశకము 16 వ శతాబ్ది మధ్య భాగము వరకు ఈ ప్రాంతమున అశాంతి ప్రబలెను.

క్రీ. శ. 1510 లో 'భెంగార్ ' అనునతడు అశాంతిని రూపుమాపి దానిని శాంతియుత రాజ్యముగా మార్చెను. తరువాత అంజారు, భూజా, మాండవీ వంశజులు పాలించిరి. వీరి వంశముల పేర్లతో 1546 సం. లో అంజారు, 1549 సం. లో భూజా, 1580 సం. లో మాండవీ అను పేర్లు గల పట్టణములను నెలకొల్పిరి. ఈ ప్రాంతమును 400 సంవత్సరములలో 15 రాజవంశములు పాలించెను.

ఈ ప్రాంతము 150 సం. లకు పూర్వము భూకంపము వలన చాల నష్టపడెను. ఈ ప్రాంతము సముద్రతీరమున నుండుటచే లభ్‌పత్, కోటేశ్వర, జాభే, మాండవీ, ముంద్రాతుణా, కండలా, భారీరోహర్ అను పేర్లు గల చిన్న రేవుపట్టణములు పెక్కులు వెలసెను. ఈ ప్రాంతము ఎనిమిది తాలూకాలుగా నున్నది. ప్రాంత మధ్యమున భూజా ; దక్షిణమున మాండవీ, ముంద్రా, అంజారు ; తూర్పున రాఫర్, భచావు; పశ్చిమమున లభ్‌పత్, అవడాసా అను తాలూకాలు గలవు. ఇచటి జనసంఖ్య 5,00,000. భూజా, మాండవీ ముంద్రా, అంజారుల యందు కోటలు గలవు. అంజార్ నందలి కోట భూకంపము వలన నేలపాలై పోయినది. మిగిలినవి నేటికిని శిథిలావస్థలో నున్నవి. ఈ ప్రాంతము చిన్నదైనను ఇందు నదులు, అడవులు, పర్వతములు, ఇసుక మైదానములు, గడ్డిబీళ్ళును చాల కలవు. ఇది చూచుట కెంతో ఆకర్షవంతముగా నుండును. ఇచ్చటివారి నాగరికత అతిప్రాచీనమైనది. నాటినుండి నేటివరకు వారి నాగరికత యందు ఎక్కువ మార్పులు రాలేదని చరిత్రకారులు చెప్పుదురు. భారత స్వాతంత్ర్యమునకు పూర్వము ఇచ్చటి రాజులను 'మహారాజులు' అనుచుండెడివారు. ఇవి మొగలు లొసంగిన బిరుదులట ; 'రాజ, మహారాజ, మీర్‌ఝా' అనునవి కూడ రాజబిరుదములు. ప్రజలు ఆ బిరుదులచే ఆ రాజులను పిలుచుచుండిరి. జహంగీరు కాలమున నీ ప్రాంతమును 'రాజశ్రీ భారమల్లు' అనునతడు పాలించుచుండెను. ఇతడు మహావీరుడు ; మంచి ప్రతిభ గలవాడు. జహంగీరు ఈతనికి స్వంత నాణ్యములు చెలామణి చేసికొనుటకు అనుమతి నొసగెను. రాజశ్రీ భారమల్లు మహాదేవనాకుమీ అనుచోట టంకశాలను స్థాపించి బంగారు, వెండి నాణెములను తయారు చేయించెను. 'కోరీ, పాంచియో, అరధియో' యను పేర్లుగల నాణెములు తయారు చేయించి చెలామణి చేసెను.

ఈ ప్రాంతమున విద్యావ్యాప్తి గావించినవాడు మహా రాజశ్రీ దేశల్‌జీ (క్రీ. శ, 1851) 'ప్రామగల్లు' రాజు పాలనములో విద్య సవ్యమైన బోధనాపద్ధతులతో నడచెను. ప్రస్తుతదశలో 'భూజ్' యనుచోట నొక కళాశాల కలదు. ఇచటి ముఖ్య సాహిత్యకారులు నారాయణ్ విసన్‌జీ, ఠక్కుర్, దులేరాయ్, కారాణీ, డుంగరశీ, ధరమశీ, సంపత్, మొదలగు వారలు. ముఖ్య పండితులు కర్మవీర్, వ్యాపారీ అనువారలు. కఛ్ భాషకు మొదట లిపి లేదనియు, దానికి సింధీ భాషతో సంబంధము గలదనియు భాషా శాస్త్రవేత్తల అభిప్రాయము. ఈ ప్రాంతమునకు రాజధాని 'భూజ్'.

ఇచటి స్త్రీల వస్త్రాభరణములు మార్వాడీ స్త్రీల వస్త్రాభరణములను పోలియుండును. విద్యతక్కువగుటచే వీరి యందు అజ్ఞానము మెండు. పురుషులకు కూడ స్త్రీ విద్య యందు ఎక్కువగా శ్రద్ధలేకపోవుటయే వారిలో అజ్ఞానము పెంపొందుటకు కారణము. కాని వారి హృదయము నవనీత తుల్యమైనది; భగవద్భక్తి మెండు. ఇచట ఆడపిల్లలను విక్రయించుట, భార్య యుండగా మరియొక భార్యను చేసికొనుట, మున్నగు దురాచారములు నేటికిని అచ్చటచ్చట గన్పడును. ఇచట ధర్మమే ప్రధానసూత్రముగాగల హిందూ, మహమ్మదీయులు గలరు. వీరికి పౌరాణికాచారముల పైననే యెక్కువ నమ్మకము. కావుననే ఆధునికయుగ ప్రభావము వారిపై ఎక్కువగ పడలేదు.

ఈ ప్రదేశమున చూడదగు స్థలము లెన్నియో గలవు. భూజ్‌నందు నారాయణాలయము శారదాబాగ్, అను నవియు, మాండవీలో 'దేవాదాండీ' అను కోటయు అంజా యందు బేసల్ తోరల్ యొక్క సమాధియు, ముంద్రాలో షాహమురాదు, పీర్ దర్గా మొదలగు నవియు చూడదగినవి. ఇవియును గాక, జైనతీర్థ స్థలములు గలవు. ఇవి పంచతీర్థములని ప్రసిద్ధి. వీటి పేర్లు మాతానోమడ్, జభౌ, తేరా, నాలయాసుధీర్ అనునవి. ఈ ప్రాంతము ఖనిజ సంపత్తిని గూడ గలిగి యున్నది. ఇందు బొగ్గు, ఇనుము, పెట్రోలియం గనులు గలవు. కావుననే యిచట జనసంఖ్య ఎక్కువైనది.

గుజరాతు, సౌరాష్ట్రము, కఛ్ అను మూడు ప్రదేశములు కలిసియే మహా గుజరాతుగా నేర్పడినది. దీనినే గుజరాతు అని కూడ యందురు. ఇప్పుడు ఈ ప్రాంతము ఇతర ప్రాంతములతో సరిసమానమగు సంపత్తును కలుగ జేసికొనుచున్నది. ఇచ్చటి నాగరికత యందు కూడ నూతనత్వ మంకురించినది. ఇచ్చటి ప్రజలు మూఢనమ్మకములను మాని, యితర ప్రాంతములతో సమాన ప్రతిపత్తిని సంస్కృతిని సంపాదించుకొని, సమగ్ర భారతదేశములో తన బాధ్యతలను నిర్వహింపగలదని ఆశింపవచ్చును.

ర. వి.