సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మూడవ సంపుటము/గుంటూరు జిల్లా
గుంటూరు జిల్లా:
ఉనికి : ఆంధ్రదేశములో సముద్రతీరమందున్న జిల్లాలలో గుంటూరుజిల్లా యొకటి. ఈ జిల్లా 15° 18'-16° 50' ఉత్తర అక్షాంశముల మధ్యను, 79°10′- 80°55′ తూర్పు తులాంశముల మధ్యను ఉన్నది. ఈ జిల్లా రూపము చూచుటకు ఒక గొడుగు ఆకారములో నుండును. దాని పిడికఱ్ఱ దక్షిణమును చూపుచుండును. దీనికి ఉత్తరమున కృష్ణానదియు, దాని వెంబడి తెలంగాణములోని నల్లగొండ జిల్లాయు, తూర్పున కృష్ణాజిల్లాయు, బంగాళాఖాతమును, దక్షిణమున నెల్లూరుజిల్లాయు, పశ్చిమమున నెల్లూరు, కర్నూలు, మహబూబునగరు జిల్లాలును సరిహద్దులుగా నున్నవి.
ఈ జిల్లా విస్తీర్ణము 5,771 చ. మై. ఇందలి గ్రామముల సంఖ్య 727. పురములు 25. జనాభా 1951 లెక్కల ప్రకారము 25,49,996. ఇందు పురుషుల సంఖ్య 12,91,745, స్త్రీల సంఖ్య 12.58, 251. జనసాంద్రత 442. పట్టణవాసులు 5,01,921. గ్రామీణులు 20,48,075, గృహముల సంఖ్య 4,91,670. 1961 జనాభా లెక్కల ప్రకారము జనాభా 30,09,997.
ఈ జిల్లాలో 9 తాలూకాలు కలవు.
1. నర్సారావు పేట తాలూకా :
విస్తీర్ణము చ. మై. | 716 |
గ్రామములు | 106 |
పురములు (నర్సారావుపేట, చిలకలూరి పేట) | 2 |
జనాభా (1951) | 2,66,400 |
పురుషులు | 1,35,120 |
స్త్రీలు | 1,31,280 |
జనసాంద్రత | 372 |
1961 లెక్కలప్రకారము జనాభా | 3,21,909 |
2. వినుకొండ తాలూకా :
విస్తీర్ణము చ. మై. | 644 |
గ్రామములు | 73 |
పురము (వినుకొండ) | 1 |
జనాభా (1951) | 1,16,365 |
పురుషులు | 59,021 |
స్త్రీలు | 57,344 |
జనసాంద్రత | 181 |
1961 లెక్కలప్రకారము జనాభా | 1,24,825 |
3. పల్నాడు తాలూకా :
విస్తీర్ణము చ. మై. | 1,041 |
గ్రామములు | 86 |
పురములు (గురజాల, మాచర్ల, రెంటచింతల) | 3 |
జనాభా (1951) | 1,92,776 |
పురుషులు | 96,522 |
స్త్రీలు | 96,254 |
జనసాంద్రత | 185 |
1961 లెక్కలప్రకారము జనాభా | 2,28,002 |
4. గుంటూరు తాలూకా :
విస్తీర్ణము చ. మై. | 541 |
గ్రామములు | 118 |
పురములు (గుంటూరు, మంగళగిరి, తాడేపల్లి) | 3 |
జనాభా (1951) | 4,42,073 |
పురుషులు | 2,25,722 |
స్త్రీలు | 2,16,351 |
జనసాంద్రత | 817 |
1961 లెక్కలప్రకారము జనాభా | 5,78,913 |
5. సత్తెనపల్లి తాలూకా :
విస్తీర్ణము చ. మై. | 718 |
గ్రామములు | 130 |
పురములు (సత్తెనపల్లి, ఫిరంగిపురము) | 2 |
జనాభా (1951) | 2,46,029 |
పురుషులు | 1,25,468 |
స్త్రీలు | 1,20,561 |
జనసాంద్రత | 341 |
1961 లెక్కలప్రకారము జనాభా | 2,44,680 |
6. తెనాలి తాలూకా :
విస్తీర్ణము | 324 చ. మై. |
గ్రామములు | 96 |
పురములు (తెనాలి, చేబ్రోలు, కొల్లిపర, కొల్లూరు, దుగ్గిరాల) | 5 |
జనాభా (1951) | 3,57,839 |
పురుషులు | 1,79,692 |
స్త్రీలు | 1,78,147 |
జనసాంద్రత | 1,104 |
1961 లెక్కలప్రకారము జనాభా | 4,00,538 |
7. రేపల్లె తాలూకా :
విస్తీర్ణము | 297 చ. మై |
గ్రామములు | 57 |
పురములు (భట్టిప్రోలు, రేపల్లె) | 2 |
జనాభా (1951) | 1,91,010 |
పురుషులు | 96,961 |
స్త్రీలు | 94,049 |
జనసాంద్రత | 643 |
1961 లెక్కలప్రకారము జనాభా | 2,35,105 |
8. ఒంగోలు తాలూకా :
విస్తీర్ణము | 820 చ. మై. |
గ్రామములు | 159 |
పురములు (ఒంగోలు, అద్దంకి, అల్లూరు, కొత్తపట్టణము) | 4 |
జనాభా (1951) | 3,33,995 |
పురుషులు | 1,69.681 |
స్త్రీలు | 1,64,314 |
జనసాంద్రత | 407 |
1961 లెక్కలప్రకారము జనాభా | 3,88,832 |
విస్తీర్ణము | 670 చ. మై. |
గ్రామములు | 102 |
పురములు (చీరాల, బాపట్ల, పొన్నూరు, వేటపాలెం) | 4 |
జనాభా (1951) | 4,03,509 |
పురుషులు | 2,03,558 |
స్త్రీలు | 1,99,951 |
జన సాంద్రత | 602 |
1961 లెక్కల ప్రకారము జనాభా | 4,87,213 |
నైసర్గికస్థితి : ఒంగోలు తాలూకా జిల్లా కంతకు దక్షిణమున సముద్రతీరమున నున్నది. రేపల్లె, బాపట్ల, ఒంగోలు తాలూకాలు బంగాళాఖాతముయొక్క తీరమును కలిగి యున్నవి. పల్నాడు తాలూకా వాయవ్య దిశలో నున్నది. దీనికి దక్షిణముగా వినుకొండ తాలూకా కలదు. వీటికి తూర్పుగా గుంటూరు, సత్తెనపల్లి, తెనాలి తాలూకా లున్నవి.
చిత్రము - 103
జిల్లాలో తెనాలి, రేపల్లె, బాపట్ల తాలూకాలు కృష్ణానదియొక్క డెల్టా భాగమందున్నవి. వీటికి కృష్ణ కాలువల నీరు లభించుటచే ఇచట పల్లపు సేద్యము జరుగును. పల్నాడు, సత్తెనపల్లి, గుంటూరు, నర్సారావుపేట తాలూకాలు తూర్పు కనుమలతో కూడిన మెట్ట తాలూకాలు. పల్నాడు, సత్తెనపల్లి తాలూకాలయందు తూర్పు కనుమలు, నర్సారావుపేట తాలూకాలో కొండవీటి గుట్టలు, ఒంగోలు తాలూకాలో చీమకుర్తి కొండలు ఈ జిల్లాలో ముఖ్యమగు గుట్టలు. మిగిలిన భాగము నల్ల రేగడి నేలను కలిగియుండును.
నదులు : జిల్లాకు ఉత్తర సరిహద్దుగా నున్న కృష్ణానది ముఖ్యమగు నది. ఇది కొంత భాగమునకు తూర్పు సరిహద్దుగా కూడ నున్నది. ఈ నదియే గుంటూరు జిల్లాను నల్లగొండ, కృష్ణా జిల్లాలనుండి వేరుచేయు సరిహద్దుగా నున్నది. ఈ నదికి విజయవాడ వద్ద నొక ఆనకట్ట నిర్మింపబడి అటనుండి ఇరువైపుల పెద్ద పెద్ద కాలువలద్వారా పొలములకు నీరు అందించబడుచున్నది. మాచర్ల సమీపములోనున్న నందికొండ వద్ద కూడ నొక గొప్ప జలాశయము నిర్మింపబడుచున్నది. గుండ్లకమ్మ అను మరియొక నది, కర్నూలుజిల్లాలోని కంబం చెరువు నుండి బయలుదేరి వినుకొండ, ఒంగోలు తాలూకాల గుండా ప్రవహించుచున్నది. ఇది వర్షకాల మందే ప్రవహించు చుండును. నాగులేరు వినుకొండ తాలూకాలోని కొండలలో పుట్టి ఉత్తరముగా ప్రవహించి కృష్ణలో కలియుచున్నది. అట్లేచంద్రవంక యను మరియొక చిన్ననది కూడపల్నాడుతాలూకాగుండా ప్రవహించి కృష్ణలో కలియును. అడవులు : ఈ జిల్లాయందు మొత్తము 781 చ. మైళ్ల విస్తీర్ణముగల అడవు లున్నవి. అవి అంత ముఖ్యమైనవి కావు. వీటిలో తీరప్రాంతమందున్న వాటిలో సర్వి, మడకఱ్ఱ పెరుగును. ఈ కఱ్ఱ వంటచెరకుగా నుపయోగ పడుచున్నది. మిగిలిన ప్రాంతమందలి అడవులలో చెప్పతగిన కలప పెరుగదు. పశుగ్రాసము పుష్కలముగా నుండును.
శీతోష్ణస్థితి, వర్షపాతము : మొ త్తముమీద జిల్లాఅంతయు ఉష్ణప్రాంత మనవచ్చును. తీరప్రాంతములందు సముద్ర ప్రభావముచే కొంత తక్కువ ఉష్ణోగ్రత యుండును. ఏప్రిల్, మే, జూన్ నెలలు వేసవికాలముగను, జులై, ఆగస్టు, సెప్టెంబరు నెలలు నైరృతి ఋతుపవనముల మూలమున వర్షములు కురియు కాలముగను, అక్టోబరు, నవంబరు నెలలు ఈశాన్య ఋతుపవనముల మూలమున వర్ష ము కురియు కాలముగను, డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలలు శీతకాలముగను ఉండును. ఈ జిల్లాలోని తీరపు తాలూకాలకు పై రెండు ఋతుపవనముల మూలమునను వర్షములు కురియును. అందుచే ఈ ప్రాంతమందు వర్ష పాత మధికముగా నుండును. కాని మెట్ట తాలూకాలలో నైరృతి ఋతుపవనముల వలన కొలదిగా వర్షించును. తెనాలి, రేపల్లె తాలూకాలలో సంవత్సరములో 38" ల వరకు అధిక వర్షపాత ముండును. మెట్ట తాలూకాలలో 26" లు అధిక వర్షపాత ముండును. రెంటచింతల, గుంటూరులలో అత్యధిక ఉష్ణోగ్రత 118°F (48°C) ఉండును.
నేలలు : జిల్లా మొ త్తము విస్తీర్ణములో 85% నల్లనేల. ఇది మిక్కిలి సారవంతమైనది. గుంటూరు - గుంతకల్లు రైలుమార్గము వెంట ఎఱ్ఱచెక్కు నేల కలదు. సముద్రప్రాంతములందు ఇసుక నేల కలదు. కృష్ణానది వెంబడి కొంత వండ్రు మట్టితో కూడిన నేల యున్నది.
నీటి పారుదల : జిల్లాకు ఈశాన్య మందు సరిహద్దుగా నున్న కృష్ణానదికి విజయవాడ వద్ద 1850 లో ఆనకట్ట నిర్మింపబడెను. అచటి నుండి కుడివైపుగా బకింగ్ హాం కాలువ మద్రాసువరకు పోవును. దానినుండి ఒకశాఖ తెనాలితాలూకా గుండా రేపల్లెవరకును, మరియొకశాఖ బాపట్ల తాలూకాలోని నిజాంపట్టణము వరకును పోవును. ఈ రెండు శాఖలు తెనాలి, రేపల్లె తాలూకాలలోని భూములకు పూర్తిగాను, బాపట్ల తాలూకాలోని భూములలో అధిక భాగమునకును సేద్యమునకు ఉపయోగపడు చున్నవి గుంటూరు, ఒంగోలు తాలూకాలలో కూడ కొలదిభూములు ఈ కృష్ణ కాలువల మూలమున సేవ్యమగు చున్నవి. పల్నాడు, వినుకొండ, నర్సారావుపేట, సత్తెనపల్లి తాలూకాలు కేవలము దేవమాతృకములై తరచు క్షామములచే పీడింపబడుచుండును. ఒంగోలు తాలూకాలోను, గుంటూరు తాలూకాలోను వర్షాధారముగల చెరువులక్రింద కొంత సాగు జరుగుచుండుటచే కరువుల బాధ అంతగా ఉండదు. భారతదేశపు ద్వితీయ పంచవర్ష ప్రణాళికక్రింద పల్నాడు తాలూకాలోని నందికొండవద్ద కృష్ణానదిమీద నాగార్జునసాగరమను బ్రహ్మాండమగు జలాశయము నిర్మింపబడుచున్నది. ఈ నిర్మాణముయొక్క పథకము ననుసరించి ఈ జిల్లాయందలి మెట్టతాలూకాలే గాక నెల్లూరుజిల్లాలోని కొంతభాగము కూడ సేవ్యము కాగలదు. జిల్లాయందు చిన్న నీటివనరులు 277 కలవు. చిన్న, పెద్ద వనరులక్రింద మొత్తము 4,37,258 ఎకరముల భూమి సాగుచేయబడుచున్నది.
పంటలు : గుంటూరుజిల్లాలో వరియే ప్రధానమగు పంట. చోళ్లు, రాగులు, కొఱ్ఱలు, మొక్కజొన్న, జొన్న మెట్ట తాలూకాలలో పండించబడుచున్నవి. మిర్చి, పొగాకు, వేరుసెనగ, ప్రత్తి ముఖ్యమైన వ్యాపారపు పంటలు. చీరాల ప్రాంతమందు జీడిమామిడితోటలు పెంచబడును. తెనాలి తాలూకాలో దుగ్గిరాలవద్ద పసుపు విస్తారముగా పండించబడుచున్నది. ఇది యితర రాష్ట్రములకు ఎగుమతి చేయబడును.
రహదారులు : గుంటూరు పట్టణమునుండి విజయవాడకు, నెల్లూరు జిల్లాలోని భాగములకు రోడ్లుకలవు. జిల్లాయందు మొత్తము 1,659 మైళ్ళు నిడివిగల రోడ్లు కలవు తెనాలి, గుంటూరు, ఒంగోలు, నర్సారావుపేట అను పట్టణములు రోడ్ల కూడలి స్థానములు.
ఈ జిల్లాయందు మొత్తము 2951/4 మైళ్ళ పొడవుగల ఇనుపదారులు కలవు. తెనాలి, బాపట్ల, ఒంగోలు తాలూకాలగుండా కలకత్తా-మద్రాసులను కలుపు దక్షిణరైల్వే ప్రధాన మార్గమొకటి పోవుచున్నది. గుంటూరు, రేపల్లె లను కలుపుచు మరియొక శాఖామార్గము తెనాలిగుండా పోవును. ఈరెండును బ్రాడ్‌గేజ్‌కి చెందినవి. వీటినిడివి 1331/4 మైళ్ళు. విజయవాడనుండి గుంటూరు మీదుగా గుంతకల్లునకొకటి, మాచెర్లకొకటి పోవునట్టి రెండు మీటరుగేజిలైన్లు కలవు. వీటినిడివి 162 మైళ్ళు (ఈ జిల్లాలో). ఈ మార్గములు గుంటూరు, సత్తెనపల్లి, నర్సారావుపేట, వినుకొండలను కలుపును. మొత్తముమీద అన్ని తాలూకాల ముఖ్యస్థానములు రైలు మార్గములచే కలుపబడి యున్నవి.
ఈజిల్లాలో జలమార్గములుకూడ రవాణా సౌకర్యములలో చేరియున్నవి. కృష్ణానది, బకింగుహాముకాలువ, రేపల్లెకాలువ, నిజాంపట్టణపు కాలువ, సరకులరవాణాకును, ప్రయాణములకును ఎంతయో ఉపయోగపడు చున్నవి.
వైద్యము : గుంటూరు జిల్లాలో 100 వైద్యశాలలు కలవు ఇందు 13 ప్రభుత్వమువి. గుంటూరులోని ప్రభుత్వ వైద్యశాలలో 'X' రే విభాగముకూడ కలదు. మొత్తము ప్రభుత్వ వైద్యశాలలలో 405 పడకల వసతులు కలవు. ఇవి గాక స్థానిక ప్రభుత్వముల (డిస్ట్రిక్టు బోర్డుల, లోకల్ బోర్డుల) యాజమాన్యమున నిర్వహింపబడునవి 87 వైద్యశాలలు చిన్నవి, పెద్దవి కలవు. వీటియందు 28 పడకల వసతులు కలవు. గుంటూరు, చీరాల, ఒంగోలు, రెంటచింతల పట్టణములలో క్రైస్తవ మిషనరీలచే నిర్వహింపబడు వైద్యశాలలు కలవు. బాపట్లలో 200 పడకల వసతులుగల క్రైస్తవ మిషనరీవారి కుష్ఠురోగ వైద్యశాల కలదు.
తంతి - తపాలాలు : జిల్లాలో మొత్తము 35 పెద్ద తపాలా కార్యాలయములు, 24 తంతి - తపాలాకార్యాలయములు, 532 శాఖా కార్యాలయములు కలవు.
విద్య: (1951) ఈజిల్లాలో 7 కళాశాలలుకలవు. ఇందు కళలకు, సైన్సుకు సంబంధించినవి 4, వ్యవసాయకళాశాల 1, సంస్కృత కళాశాలలు 2, వీటిలో 3,453 మంది బాలురు, 183 మంది బాలికలు చదువుచున్నారు.
ఉన్నతపాఠశాలలు 82 కలవు. వీటిలో 33,565 మంది బాలురు, 4,887 మంది బాలికలు కలరు.
సంస్కృత పాఠశాలయొకటి కలదు. ఇందు 31 మందిబాలురు, 11 మంది బాలికలు కలరు.
ట్రైనింగుస్కూళ్ళు 13 కలవు. వీటిలో 1.070 మంది బాలురు, 696 మంది బాలికలు కలరు.
మాధ్యమిక పాఠశాలలు 29 కలవు. ఇందు 3,381 మంది బాలురు, 650 మంది బాలికలు కలరు.
ప్రాథమికపాఠశాలలు 2,569 కలవు. ఇందు 1,33,465 మంది బాలురు, 90,682 మంది బాలికలు కలరు.
బేసిక్ స్కూళ్ళు 20 కలవు. ఇందు 1,427 మంది బాలురు, 1,177 మంది బాలికలు కలరు.
వయోజన విద్యాశాలలు 68 కలవు. వాటిలో 1,735 మంది పురుషులు, 51 మంది స్త్రీలు కలరు.
జిల్లా మొత్తమున అన్ని విధములయిన విద్యాసంస్థల సంఖ్య 2,789 కలవు. వీటిలో 1,78,127 మంది విద్యార్థులు. 98,337 మంది విద్యార్థినులు, మొత్తము 2,76,464 మంది చదువుకొనుచున్నారు.
ఈజిల్లాలో మొత్తము చదువు వచ్చినవారు 4,41,224 మంది.
పరిశ్రమలు : గుంటూరు, బాపట్ల, ఒంగోలు, సత్తెనపల్లి తాలూకాలలో పొగాకు పరిశ్రమ కలదు. ఈ తాలూకాలలో నున్న 117 పొగాకు పరిశ్రమాగారములలో 20,710 మంది కూలీలు పనిచేయుచున్నారు. గుంటూరులో ఒక గోనెసంచుల ఫ్యాక్టరీ కలదు. దుగ్గిరాలలో పసుపు ఫ్యాక్టరీలు, గుంటూరు, తెనాలి, స త్తెనపల్లి, నర్సారావుపేట తాలూకాలలో నూనెఫ్యాక్టరీలు కలవు. మంగళగిరియొద్ద రెండు సిమెంటుఫ్యాక్టరీలు, ఒక గుడ్డలమిల్లు కలవు. బాపట్ల తాలూకాలో జీడిపప్పు పరిశ్రమాగారము కలదు. ఈ జిల్లాలో మొత్తము 236 పెద్ద పరిశ్రమాగారములు కలవు. వాటియందు 27540 మంది కూలీలు పనిచేయుచున్నారు. (1951)
ఇవిగాక కంబళ్ళునేయుట, తాళ్ళునేయుట, చాపలు అల్లుట, బట్టల అద్దకము, బీడీలుచుట్టుట, కంచరి, వడ్రంగి పనులు, తోళ్ళపరిశ్రమ, మున్నగు కుటీరపరిశ్రమలు కూడ జిల్లాయంతటను కలవు. చీరాల, గుంటూరు, మంగళగిరి, పేటేరు గ్రామములలో చేనేత పరిశ్రమ ప్రసిద్ధిచెందియున్నది.
వృత్తులు : వ్యవసాయమే ఈ జిల్లాయందలి ప్రధాన వృత్తి. పెదవడ్లపూడి, చిలువూరు ప్రాంతములందు నారింజ, బత్తాయి, నిమ్మతోటల పెంపకము విరివిగా సాగుచున్నది. మెట్ట తాలూకాలలో పశువుల పెంపకము, గొఱ్ఱెల పెంపకము ఉపవృత్తులై యున్నవి.
యాత్రాస్థలములు : గుంటూరుకు ఉత్తరముగా 20 మైళ్ళ దూరమున కృష్ణానదీతీరమున ఉన్న అమరావతి గొప్ప శైవక్షేత్రము. ఇది పంచారామములని ప్రసిద్ధిచెందిన అయిదు శైవక్షేత్రములలో అమరేశ్వరక్షేత్రమై యున్నది. ఇంద్రప్రతిష్ఠితమని ప్రసిద్ధిగాంచిన ఇచటి శివలింగము సుమారు 10 గజములయెత్తు ఉండును. ఇంతే గాక ఈ అమరావతి జగద్విఖ్యాతమైన బౌద్ధ క్షేత్రము. ఇచట నొక గొప్ప బౌద్ధస్తూపము కలదు. ఇచట త్రవ్వకముల వలన అనేక బౌద్ధ శిథిలములు బయల్పడినవి. దీనికి సమీపములోనున్న ధరణికోట ఒకప్పుడు ఆంధ్ర సామ్రాజ్యమునకు ప్రధానపట్టణమై వెలసినది. దీనినే ధాన్యకటకమని చెప్పుదురు.
మంగళగిరిలో ఫాల్గున పౌర్ణమికి గొప్ప రథోత్సవము జరుగును. ఇది నృసింహ క్షేత్రము. ఇచట కొండమీద నున్న పానకాలస్వామిని గూర్చి అనేక విచిత్రగాథలు కలవు. నర్సారావుపేట తాలూకాలోని కోటప్పకొండలో శివరాత్రి మహోత్సవము, చిలుకలూరిపేటలో రథోత్సవము ఎన్నతగినవి. తెనాలిలో శ్రీరామనవమికి గొప్ప ఉత్సవము జరుగును. తెనాలి తాలూకాలోని సంగం జాగర్లమూడి, చుండూరు, వేజెండ్ల అను గ్రామములు కూడ యాత్రాస్థలములు. ఇవిగాక వెల్లటూరు, కామరాజుగడ్డ, అరవపల్లి, బాపట్ల, చిన్నగంజాం. భట్టిప్రోలు, చెరుకుపల్లి, పొన్నూరు, కారెంపూడి (పల్నాటి వీరులకు చెందినది), చిలువూరు మున్నగునవి కూడ స్థానికముగా యాత్రాస్థలములై యున్నవి. గుత్తికొండబిలము, చేజెర్లలోని కపోతేశ్వరాలయములు కూడ హైందవ క్షేత్రములు. పల్నాడు తాలూకాలో 'ఎత్తిపోతలు' అను పేరితో ఒక జలపాతము కలదు.
భాషలు: ఈజిల్లాలో తెలుగు ప్రధానభాష. మొత్తము 27 మాతృభాషలు మాటాడువారు కలరు. (1951)
తెలుగు మాతృభాషగా కలవారు | 2,359,100 |
ఉర్దు | 1,64,474 |
లంబాడి | 7,510 |
తమిళము | 6,145 |
హిందీ | 3,804 |
ఎరుకల | 2,829 |
హిందూస్థానీ | 1,852 |
మళయాళము | 1,664 |
ఇతర భాషలు (19) | 2,618 |
మొత్తము జనాభా | 25,49.996 |
ఆంధ్రేతర భాషలు మాతృభాషలుగా కలవారిలో 1,26,361 మంది తెలుగు వచ్చినవారుగా నున్నారు.
మతములు - వారి సంఖ్యలు :
హిందువులు | 19,84,375 |
మహమ్మదీయులు | 2,09,276 |
క్రైస్తవులు | 3,56,039 |
జైనులు | 273 |
ఇతరులు | 33 |
మొత్తము | 25,49,996 |
ముఖ్యపట్టణములు :
1. గుంటూరు: ఇది జిల్లా కేంద్ర పట్టణము. ఇది 1,25, 255 మంది జనాభా గల మునిసిపలు పట్టణము. దీనికి పూర్వము గర్తపురి యను నామాంతరము కలదందురు. ఇది యొక రైల్వే కూడలి. తెనాలి నుండి ఒక బ్రాడ్‌గేజి లైను, విజయవాడ, మాచెర్ల, గుంతకల్లుల నుండి మీటరుగేజి లైన్లు వచ్చి యిచట కలియును. ఇచట పొగాకు వ్యాపారము విరివిగా సాగును. మిర్చి, వేరుసెనగ, చేనేత వస్త్రములు కూడ ఇచ్చటి నుండి ఎగుమతి యగు చుండును.
2. తెనాలి : ఇది 58,116 జనాభా కల మునిసిపాలిటీ. ఇది మద్రాసు - కలకత్తా రైలుమార్గముమీద నున్నది. రేపల్లె - గుంటూరు రైలు మార్గముకూడ ఈ పట్టణము గుండా పోవును. కృష్ణకాలువలు కొన్ని ఈ నగరము గుండా పోవును. ఇచట ఒక కళాశాల కలదు.
3. చీరాల : ఇది 37,729 మంది జనాభాకుల మునిసిపాలిటీ. ఇది బాపట్ల తాలూకాలో సముద్ర తీరమందున్నది. ఇచట చేనేతపరిశ్రమ విరివిగా జరుగును. రెండవది పొగాకు పరిశ్రమ. ఈ నగరము బ్రాడ్‌గేజి రైలు మార్గముమీద నున్నది. ఒంగోలు (27,810 జనాభా); బాపట్ల (22,748 జనాభా); నర్సారావుపేట (22,243 జనాభా) అనునవి యితర ప్రసిద్ధ పట్టణములు.
ఇతరపురములు 19 కలవు: పొన్నూరు, నిడుబ్రోలు, మంగళగిరి, సత్తెనపల్లి, వేటపాలెము, భట్టిప్రోలు, చేబ్రోలు, రేపల్లె, అద్దంకి, చిలకలూరుపేట, వినుకొండ, అల్లూరు, కొత్తపట్టణము, కొల్లిపర, కొల్లూరు, గురజాల, తాడేపల్లి, ఫిరంగిపురము, దుగ్గిరాల, మాచెర్ల, రెంటచింతల. ఇవి పంచాయతీ సభలుగల పురములు.
చరిత్ర : క్రీస్తు శకారంభ ప్రాంతీయ శతాబ్దములలో బౌద్ధమత బ్రాబల్య మిచట హెచ్చుగా నుండెను ఈ జిల్లాలోని నాగార్జునకొండ, అమరావతి, భట్టిప్రోలు, ఉండవల్లి, చందవోలు అనుచోట్ల లభ్యములగుచున్న శిథిలములనుబట్టి ఈ నగరములు ఆనాడు బౌద్ధమత ప్రచారమునకై ఏర్పరుపబడిన ప్రధాన కేంద్రము లని చెప్పవచ్చును. అందును నాగార్జునకొండ, అమరావతి మిక్కిలి ప్రసిద్ధములు. ప్రప్రథమముగా ఆంధ్రరాజ్యమును స్థాపించిన శాతవాహనులు నాలుగున్నర శతాబ్దములు ధాన్యకటకము (ధరణికోట) నుండి పరిపాలించిరి. ధాన్యకటక మందలి బౌద్ధ విహారములు, బౌద్ధ విశ్వవిద్యాలయము లోక ప్రసిద్ధిని పొందియుండెను. ఇప్పుడు శిథిలావశేషములు మాత్రమే కనబడును.
తరువాత ఈ జిల్లా 3 వ శతాబ్ద ప్రాంతమునుండి 7 వ శతాబ్దము వరకు పల్లవుల యధీనమం దుండెను. వారి తరువాత విష్ణుకుండినులు, చాళుక్యులు, చోళులు, వరుసగా ఈ జిల్లాను పాలించినట్లు నిదర్శనములు కలవు. విష్ణుకుండినుల జన్మస్థానమునకే వినుకొండ యను పేరు కలదు. వేంగీచాళుక్యుల రాజ్యము 12 వ శతాబ్దములో అంతమొందగనే వెలనాటిచోడులు తెనాలితాలూకాలోని చందవోలును రాజధానిగా చేసికొని ఒక శతాబ్దమువరకు పాలించిరి. 12 వ శతాబ్దములో ఈ జిల్లా కాకతీయుల వశమయ్యెను. పల్నాటియుద్ధము 12 వ శతాబ్దములోనే కారెంపూడి వద్ద జరిగెను. హైహయ వంశములోని ఒక రాజకుటుంబములో జరిగిన యుద్ధ మిది. 1324 లో ప్రోలయ వేమారెడ్డి ఒంగోలు తాలూకాలోని అద్దంకి రాజధానిగా కొండవీటి రెడ్డిరాజ్యమును స్థాపించెను. ఇది 1424 వరకు కొనసాగెను. భారతములోని అరణ్య పర్వ శేషమును తెనిగించిన ఎఱ్ఱాప్రెగడ ప్రోలయ వేమారెడ్డి యొక్క ఆస్థానకవియై యుండెను. ప్రోలయ కొడుకైన అనపోతారెడ్డి రాజధానిని అద్దంకినుండి కొండవీటికి మార్చెను. శ్రీనాథ మహాకవి వీరి యాస్థానములో విద్యాధికారిగా నుండెను. 1424 తరువాత కొండవీటి రాజ్యము (గుంటూరుజిల్లా) విజయనగరాధీశుల వశమయ్యెను. తరువాత 1565 లో తళ్ళికోట యుద్ధానంతరము కోస్తాజిల్లా లన్నిటితోబాటు గుంటూరుజిల్లాకూడ గోల్కొండ నవాబులకు అధీనమయ్యెను. నైజాముచే 1765 లో సర్కారుజిల్లాలు ఇంగ్లీషువారికి ఇయ్యబడెను. ఇంచుమించుగా అప్పటినుండి గుంటూరుజిల్లా ఆంగ్లేయుల వశమం దుండిపోయెను. 1794 లో గుంటూరుజిల్లా ప్రత్యేక జిల్లాగా నేర్పడియుండి, 1859లో కృష్ణాజిల్లాతో కలిపివేయబడెను. 1904 లో తిరిగి గుంటూరుజిల్లా ప్రత్యేకించబడెను. 1953 లో కర్నూలు రాజధానిగా ఆంధ్రరాష్ట్ర మేర్పడినపుడు ఇచట హైకోర్టు నెలకొల్పబడెను. తరువాత 1956 లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడగనే అది హైదరాబాదునకు తరలింపబడెను.
పు. ప్ర. శా.