Jump to content

సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మూడవ సంపుటము/గుంటూరు నగరము

వికీసోర్స్ నుండి

గుంటూరు నగరము :

గుంటూరు నగరము గుంటూరు జిల్లాకు ప్రధాన స్థానము. ఈ పట్టణము వేయి సంవత్సరములకు పూర్వమే ప్రసిద్ధిగాంచిన పట్టణమని నిరూపించుటకు కొన్ని శాసనాధారములు కనిపించుచున్నవి. శాలివాహనశకము 1069 కు సరియైన క్రీ. శ. 1147 వ సంవత్సర శాసనమొకటి విజయవాడ నగరములోని మల్లేశ్వరస్వామి దేవాలయ మంటపమున నున్నది. ఈ శాసనము, దత్తనామాత్య సోముడను ఒకమంత్రి గుంటూరు పురమున దేవాలయములు కట్టించి, చెరువులు త్రవ్వించినట్లు తెలుపుచున్నది. అచటనే కల మరి రెండు శాసనములలో మొదటిదానిని బట్టి ఉదయ రాజను నాతడు గుంటూరు ప్రభువై యుండగా. అతని యొద్దనున్న కూచన యను మంత్రి ఆశాసనమును చెక్కించినట్లు తెలియుచున్నది ఈ శాసనము తిక్కన జననకాలము నాటిదై యున్నది. (క్రీ. శ. 1280) రెండవ శాసనము 1255 వ సంవత్సరమునాటిదై యున్నది. ఈ శాసనము గుంటూరు ప్రభువువద్ద సేనానిగానున్న రాయన మంత్రి చెక్కించినది.

ప్రాత గుంటూరు నందలి అగస్త్యేశ్వరాలయమున పాండురాజ శాసన మొకటి కలదు. ఇది శాలివాహన శకము 1079 వ సంవత్సరమునకు సరియైన క్రీ శ 1157 వ సంవత్సరమునాటిది. ఇందు ఆ సంవత్సరమున అగస్త్యేశ్వరస్వామి గుడియు, మంటపము, పరివారపు గుళ్ళు, ప్రాకారము కట్టించబడినట్లు వ్రాయబడియున్నది. ఇందు “గడ్డి పూండివలయు చుట్టు పొలము చతుశ్శ్రమము" ఆచంద్రార్కముగ దేవాలయమున కియ్యబడినట్లు వ్రాయ బడియున్నది. 'గడ్డిపూండి' అను గ్రామము ఇపు డిచట లేదు. కాని గుంటూరునుండి మంగళగిరికి పోయెడి మార్గమున గడ్డిపూడి వంతెన యనుపేర నొక వంతెన యుండెడిదని తెలియవచ్చుచున్నది. ఆ ప్రదేశమున నివసించెడు కొందరు మాలలను గడ్డిపూడి మాలలని ఇప్పటికిని పిలుచుచున్నారు. ఈ ఆధారములనుబట్టి ఒకప్పుడిచట గడ్డిపూండి యను గ్రామమున్నట్లు మన మూహింపవచ్చును.

తిక్కనకవి, తన తాతయగు మంత్రి భాస్కరుడును, తన తండ్రి కొమ్మనయు గుంటూరు విభులని వ్రాసి యున్నాడు. వీరందరు పండ్రెండవ శతాబ్దినాటివారు.

గుంటూరునందు ఇప్పుడు ఎఱ్ఱచెరువుగల స్థలమున ఒక పెద్ద రాతిగుండు ఉండెడిదనియు, పూర్వము మోహనరాజు, గోపాలరాజు అను నిద్దరు రాజపుత్రులు కుష్ఠవ్యాధిచే పీడితులై తీర్థయాత్రా సందర్భమున ఇచ్చటికి వచ్చి ఎఱ్ఱచెరువులో స్నానముచేసి యొడలు తుడుచుకొనగా వారి వ్యాధి కొంతవరకు తగ్గెననియు, అందుచే వారు ఈ గ్రామముననే ఆరునెలలుండి ప్రతిదినము స్నానముచేసి పరిశుద్ధదేహులై ఆరోగ్యవంతులైరనియు, అచటి రాతిగుండును వారు పగులగొట్టించి దానితావున పెద్ద తటాకమును గావించిరనియు, ఇచట అగస్త్యుని పేర అగస్త్యేశ్వర దేవాలయమును కట్టించి ప్రతిష్ఠ గావించిరనియి, తూర్పుభాగమున మెట్లు కట్టించి వినాయకుని ప్రతిష్ఠించి, ఆ భాగమునకు వినాయక ఘట్టమని పేరుపెట్టిరనియు ఒక ప్రతీతి కలదు. పగులగొట్టబడిన గుండువలన ఈ గ్రామమునకు 'గుండూరు', 'గుంటూరు' అను పేర్లు వచ్చెనందురు. పై విషయములలోని సత్యాసత్యములు తెలియవు. ఒకప్పుడు ఈ గ్రామమునకు 'గుండూరు' అను పేరును సాధించుచు సి. పి. బ్రౌనుపండితుడు వ్రాసియున్న లేఖ ఒకటి ఒకానొక ప్రాచ్య పుస్తకాలయమున నున్నట్లు తెలియుచున్నది. గుంటూరునగరము, పూర్వము నిజాము కాలములో 'ముర్తుజానగర్ ' అని పిలువబడుచుండెడిది. 1788 వ సంవత్సరములో నిజాము ఈ నగరమును బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీవారికి ఇచ్చివేసినట్లు ఆధారములు కలవు.

ప్రాత గుంటూరని ఇపుడు వ్యవహరింపబడుచున్న భాగమే పురాతనమైన గుంటూరుపట్టణమై యుండెను. ఫ్రెంచివారు కోటప్పకొండను తమ స్వాధీనమున నుంచుకొని, అచటనే తమ సైన్యమునుంచిరి. పిదప గుంటూరు నందు గల రెండు చెరువుల యందును నీరు సమృద్ధిగ నున్నందున తమ సైన్యమును గుంటూరు నగరమునకు తరల్చుకొనివచ్చి, ప్రాత గుంటూరునందు 1752 వ సంవత్సరమున వీరు ఒక కోటను కట్టించియుండిరి.

ఇప్పుడు రామచంద్రపుర అగ్రహారము అనబడు ప్రాంతము 1718 వ ప్రాంతమున రామచంద్ర పాలెము అని వ్యవహరింపబడుచుండెడిది. అనంతరము ఈగ్రామము యొక్క పొలిమేరలోని భూమి కొందరు సద్బ్రాహ్మణులకు దానము చేయబడినందున ఈ ప్రాంతమునకు రామచంద్రపుర అగ్రహార మను నూతన నామధేయము కలిగెను. ఈ అగ్రహార మిప్పుడు గుంటూరు నగరములోని అంతర్భాగమై యున్నది.

ఆ కాలముననే చాకలివాండ్రు తమకు అనుకూలముగ నుండునట్లు వారిలో పెద్దయగు సంగడు అనువానిపేర ఒక పేట కట్టి అచటనే గుంట నొకదాని నేర్పరచుకొనిరి. గుంటూరులో నొక భాగమైన ఈ పేట ఇప్పుడు సంగడి గుంట యనబడు చున్నది.

చింతపల్లి జమీందారులైన వాసిరెడ్డివారు తమ రాజధానిని చింతపల్లి నుండి అమరావతికి మార్చిన పిమ్మట, తాము గుంటూరు నగరమునకు వచ్చి నివసించుటకై నల్ల చెరువునకు ఉత్తరదిశ యందు కొన్ని గృహములు నిర్మాణము కావించుకొని, చుట్టుప్రక్కల నుండు స్థలమును ప్రజల నివాసార్థమై ఉచితముగ నిచ్చిరి. అట్లీయ బడినవి రెండగ్రహారములు. అవి శ్యామలదాసు అగ్రహారము, కృష్ణారావు అగ్రహారము అనునవి. శ్యామలదాసు 1760 వ సంవత్సరములో హైదరాబాదు నుండి గుంటూరు వచ్చిన గుజరాతి వర్తకుడు. ఇతడు వాసిరెడ్డి వెంకటాద్రిగారి తండ్రియగు జగ్గన్నరాజాగారి అనుమతిపై ఇరువదినాలు గిండ్లు కట్టించి, వాటిని ఇరువదినల్గురు బీద బ్రాహ్మణులకు ఉచితముగ నొసగెను. ఈ అగ్రహారమునే శ్యామలదాసు అగ్రహార మనిరి. 'జిన్నాటవరు' నుండి పాతగుంటూరు పోయెడి రోడ్డునకు ఉత్తర భాగమునను, క్రొత్తపేట రోడ్డునకు పడమటిదిశ యందును ఈ అగ్రహార మున్నది. వాసిరెడ్డి రాజుల వద్ద మంత్రిగ నుండిన పొత్తూరి కృష్ణారావుగారి పేర పాతగుంటూరు రోడ్డునకు ఉత్తరమునను, క్రొత్తపేట రోడ్డునకు తూర్పునను అగ్రహార మొకటి ఏర్పాటు చేయబడెను. ఇదియే కృష్ణారావు అగ్రహారము. దీనినానుకొని ఉత్తరదిశయందు వాసిరెడ్డివారు తమ కార్యాలయము నిమిత్తమై పెద్ద బంగళా నొక దానిని నిర్మించుకొనిరి. ఇదియే ఇప్పటి పెద్ద పోస్టాఫీసు బంగళా అయి ఉన్నది. కొంతకాలము జరిగిన పిమ్మట 'పట్మన్' అను నొక పాశ్చాత్య కంట్రాక్టరుచే ఈ బంగళా విక్రయించుకో బడెను. ఇప్పటికిని ఈ బంగళా యందు పోస్టాఫీసు ఉన్నది గాని, దీనిచుట్టు నున్న స్థలమంతయు కంట్రాక్టరు యొక్క వారసులచే విక్రయింపబడినది. ఈ బంగళాను ఆనుకొని ఉత్తరదిశనున్న స్థలమంతయు 'మన్నె సుల్తాన్ పేట' యని పిలువబడెడిది. పైని పేర్కొనబడిన శ్యామలదాసు, కృష్ణారావు అనువారి అగ్రహారములును, బావాజీ మఠస్థలమును మన్నె సుల్తాన్ పేటయును కలిసి క్రొత్తపేట అనుపేర బరుగు చున్నవి.

ఆ సమయముననే బావాజి, శ్యామలదాసు అగ్రహారమునకు ఉత్తరభాగమున దరఖాస్తుపై కొంతస్థలమును సంపాదించి ఆ చోట ఒక మఠమును, ఒక దేవాలయమును కట్టించెను. వానితోపాటు ఆచోటనే చెరువునుగూడ నొక దానిని త్రవ్వించెనని తెలియుచున్నది. ఇప్పటికిని ఆ దేవాలయము మాత్ర మచ్చటనేయున్నది. కాని మఠముకాని, చెరువుకాని నామమాత్రమునకైనను కనబడుటలేదు. పూర్వ మిచటనున్న చెరువు నేడు పూడిపోయినది. ఇపుడా చెరువుస్థలము క్రైస్తవ కళాశాలాధికారులచే క్రయమునకు దీసికొనబడి, విద్యార్థుల ఆటస్థలముగ ఉపయోగపడు చున్నది. బావాజీ వంశ్యు లిప్పటికిని ధర్మకర్తలుగనే ఉన్నారు. కాని దేవాలయ పరిపాలనము మాత్రము ప్రభుత్వము వారిచే నియమింపబడిన ఎక్జిక్యూటివ్ ఆఫీసరు స్వాధీనమునం దున్నది.

1766 వ సంవత్సరములో ఇంగ్లీషువారికి కొండపల్లి పరగణాతో సహా ఉత్తర సర్కారు లీయబడెను. అప్పటికి గుంటూరు మాత్రము బసాలతుజంగు క్రిందనే యుండెను. ఫ్రెంచివారు తమ సైన్యమును కొండవీడు నుండి గుంటూరునకు తరలించి, 1752 లో ప్రాత గుంటూరునందు కోట కట్టించిరి. ప్రస్తుతము హిందూ కళాశాల యున్న స్థలమును తమ సైన్యమునకు విడిదిగా నుంచుకొనిరి. 1779 వ సంవత్సరాంతమున ఈ సైన్యములు హైదరాబాదునకు తరలించబడెను. తరువాత ఏడెనిమిది సంవత్సరముల వరకు గుంటూరు నగరము సైఫుజంగ్ అను ఫౌజుదారుయొక్క ఆధీనమున నుండెను. చివరకు 1788 వ సంవత్సరమున ఇది ఇంగ్లీషువారికి స్వాధీనము చేయబడెను. తదాదిగ గుంటూరు నందు ఇంగ్లీషువారి పరిపాలన ప్రారంభమైనది.

ఇంగ్లీషువారి పరిపాలన ప్రారంభమైన కొలదికాలమునకే ఇచట ముఖ్యములైన కచేరీలకు వసతు లేర్పాటు చేయబడినవి. కలెక్టరు కచేరియు, బంగళాయు, జిల్లా కోర్టును, జడ్జి బంగళాయు, తహశ్శీలుదారు కచేరియు, పోలీసు స్టేషను, కొత్వాలు చావడియు, చెరసాలయు ఏర్పరుపబడెను.

దైవభక్తుడును, పవిత్ర వర్తనుడును, మహమ్మదీయ పురోహితుడును అయిన మొహిద్దీను పాదుషా అను నాతడు 1810 వ సంవత్సరమున కాలధర్మము నొందెను. నరసారావుపేట జమీందారగు మల్రాజు వేంకటగుండారావు ఈ మహమ్మదీయ పురోహితునిపేర, గుంటూరు నుండి చిలకలూరుపేటకుపోవు ట్రంకురోడ్డు ప్రక్కన ఒక 'దరగా'ను కట్టించెను. అచట పూజలకొరకు సంవత్సరమునకు ఆకాలమున రెండువందల రూపాయల ఆదాయముగల నూట ఎనుబది యెకరముల భూమిని ధర్మముగ ఆతడిచ్చెను. ఇప్పుడా భూములవలన మూడు వేలరూపాయల ఆదాయము వచ్చుచున్నది. ఈదరగావద్ద ప్రతి సంవత్సరము పెద్ద ఉత్సవము జరుపబడు చున్నది. ఈ ఉత్సవముయొక్క ప్రాముఖ్యమును గమనించి స్థానిక ప్రభుత్వమువారు ఒకరోజు సెలవును మంజూరు చేసి యున్నారు. రైల్వేశాఖవారు ఉత్సవదినమున ప్రత్యేకముగా రైళ్ళను నడిపించుచున్నారు. ఉత్సవమునకు జిల్లాలోని అన్ని భాగములనుండియు ప్రజలు తండోపతండములుగావచ్చి దరగావద్ద ముడుపులు చెల్లించి, కానుకల నర్పించి ప్రసాదమును గ్రహించి పోవుచున్నారు. ఈ దరగావద్ద జరుగు ఉత్సవమునకు అన్ని మతములవారును వచ్చి పూజలను గావించుచున్నారు.

1832 వ సంవత్సరమున గుంటూరునందు పెద్ద కరవు సంభవించెను. ఇట్టికరవు ఎన్నడును ఈ దేశమున ఘటిల్లి యుండలేదు. దీనినే నందనకరువనియు, డొక్కల కరవనియు చెప్పెడివారు. అప్పుడు ప్రజలు ఆకలిబాధకోర్వ జాలక సజీవముగనున్న జంతువులనుకూడ చంపి, పచ్చి మాంసమునే భుజించి రని చెప్పుదురు.

1844 వ సంవత్సరమున 'ఫాదర్ హేయర్' అను క్రైస్తవ మత ప్రచారకుడు ఇచటికివచ్చి క్రైస్తవమిషన్ అను నొక సంస్థను ఏర్పాటుచేసెను. ఇతనితర్వాత 'గన్' అనునతడు వచ్చి సర్కారువారికి దరఖాస్తుచేసి కొంత స్థలమును సంపాదించెను. ఇచట నొకబంగళానుకట్టించెను. ఈ బంగళా పాతగుంటూరునకు పోయెడి మార్గమున కృష్ణారావు అగ్రహారమునకు తూర్పుదిశయందు కలదు. ఇచటనే ఒక చర్చికూడ కట్టించబడెను. ఈ బంగాళాకు ఇప్పటికిని 'గన్ బంగళా' అనియు 'వుల్ఫ్ బంగళా ' అనియు పేర్లు కలవు. ఈ వుల్ఫ్ అనునాతడు క్రైస్తవ కళాశాలకు అధ్యక్షుడుగా నుండెను.

గుంటూరు పట్టణమున 1866 వ సంవత్సరమున ప్రప్రథమముగా పురపాలక సంఘము ఏర్పాటు చేయబడెను. అప్పుడు అధ్యక్షుడును, సభ్యులును ప్రభుత్వమువారిచే నియోగింపబడు చుండెడివారు. పురపాలక సంఘము స్థాపింపబడిన పిదప గుంటూరు నగరము అన్ని విధముల అభివృద్ధి గాంచినది. గుంటూరు పురమున బహుకాలికముగ నుండిన నీటికరవును నివారించుటకై సంగంజాగర్లమూడివద్ద బకింగ్ హామ్ కాలువనీటితో కృష్ణోదక జలాశయము నిర్మింపబడినది. ఈ జలాశయమునుండి గుంటూరు పట్టణమునకు ఇప్పుడు పుష్కలముగ మంచినీరు లభించు చున్నది.

గుంటూరు నగరము ప్రధానముగ పొగాకు, మిరపకాయలు, ధనియాలు, వేరుసెనగ, ప్రత్తి మొదలగు మెట్ట పంటలకు ముఖ్యమైన వ్యాపార కేంద్రముగా నున్నది.

ఈ పట్టణమున ప్రప్రథమముగా 1888 వ సంవత్సరములో రైలుమార్గము ఏర్పాటు చేయబడినది. అప్పు డీ పట్టణమునకు ఉత్తరభాగమున రైలుస్టేషను కట్టబడినది. స్టేషను నిర్మింపబడిన అనంతరము క్రొత్తపేటకును, రైలు స్టేషనుకును మధ్యనున్న అరణ్యప్రాంతము వాసయోగ్యముగా మార్చబడెను. దానికి రైలుపేట యని నామకరణము చేయబడెను. రైలుస్టేషనుకు ఉత్తరముగా నున్న ప్రాంతముకూడ ఒకప్పుడు అరణ్యముగా నుండెను. కాని క్రమముగా ఈ ప్రాంతమువరకు ఇండ్లు వ్యాపించెను. ఒకప్పు డీ జిల్లాకు క లెక్టరులుగా నుండిన అరండేల్, బ్రాడీ అను పాశ్చాత్యుల పేర్లనుబట్టి ఈ ప్రాంతమున అరండేల్ పేట (1890), బ్రాడీపేట (1905) అను రెండు పేటలు రూపొందినవి. ప్రభుత్వ కచేరీలు, పాఠశాలలు, కళాశాలలు, పరిశ్రమలు, వ్యాపారసంస్థలు మొదలగునవి నానాటికి అభివృద్ధిగాంచుటవలన నేటి గుంటూరునగరము అనేకములైన పేటలతో అత్యంతము విస్తృతమైయున్నది.

జాతీయ కాంగ్రెసు అగ్రనాయకులలో ఒకరైన శ్రీ 'దేశభక్త' కొండ వెంకటప్పయ్య పంతులు ఈ నగరముననే బాల్యమునుండి తన జీవితమును గడపి ఇక్కడనే పరమపదించిరి.

ఈ పురమున ప్రథమములో, 1837 వ సంవత్సరమున పాశ్చాత్యులచే ఒక పాఠశాల స్థాపింపబడెను. కాని ఆ పాఠశాల కొలదికాలమునకే అంతరించెను. పిదప 1842 వ సంవత్సరమున క్రైస్తవ మిషనరీవారిచే ఆంగ్లో-వర్నాక్యులర్ పాఠశాల ఒకటి స్థాపింపబడెను. ఈ పాఠశాలయే 1885 వ సంవత్సరమున అమెరికన్ ఇవాంజెలికల్ లూథరన్ మిషన్ కళాశాలగా మారి ఇపుడు ఆంధ్రక్రైస్తవ కళాశాల యైనది. 1864 వ సంవత్సరమున పురజను లెల్లరు కలిసి హిందూ పాఠశాల నొక దానిని స్థాపించిరి. అది 1870 లో ప్రభుత్వ పాఠశాల గను, తరువాత పురపాలకసంఘ పాఠశాలగను, అనంతరము కమిటీ పాఠశాలగను మారి, ఇపుడు హిందూ కళాశాలగ ఆరు అనుబంధ పాఠశాలలతో మిక్కిలి అభివృద్ధి యందున్నది.

1951 లో ప్రభుత్వము ప్రచురించిన జనాభా లెక్కలను బట్టి. ఇతర వివరములను బట్టి గుంటూరు నగరమునకు సంబంధించిన ఈ క్రింది కొన్ని అంశములు లభ్యమగు చున్నవి:

నగర వైశాల్యము చ. మై. 5.25
పేటల సంఖ్య 28
జన సంఖ్య 1,25,255
పురుషులు 63,028
స్త్రీలు 62,227
కళాశాలలు 2
బాలుర ఉన్నత పాఠశాలలు 4
బాలికల ఉన్నత పాఠశాలలు 2
బాలుర ట్రెయినింగు పాఠశాల 1
బాలికల ట్రెయినింగు పాఠశాలలు 3
పారిశ్రామిక సంస్థలు 604
హిందువుల సంఖ్య 85,724
పురుషులు 43,600
స్త్రీలు 42,124
ముస్లిముల సంఖ్య 26,190
క్రైస్తవుల సంఖ్య 13,123
జైనులు 213
సిక్కులు 2
జొరాస్ట్రియనులు 3
తెలుగు మాతృభాషగా గలవారు 100,725
ఉర్దు మాతృభాషగా గలవారు 22,130
తక్కిన 18 భాషలవారు వివిధ ప్రాంతీయ ప్రజలు 2,400

1951 వ సంవత్సరము నుండియు గుంటూరుపట్టణము సర్వతోముఖముగా అభివృద్ధిచెందుచున్నది. విస్తీర్ణము అధికముగా పెరిగినది. జనసంఖ్య గూడ బహుళముగా ఎక్కువైనది. అనేక ఉన్నత పాఠశాలలు, మాధ్యమిక పాఠశాలలు, ప్రాథమిక పాఠశాలలు, ట్రెయినింగు కళాశాలలు, వైద్యకళాశాలలు, ఇంజనీరింగుకళాశాలలు మున్నగునవి స్థాపింపబడినవి. ఇచ్చట నూతనముగా పెద్ద ప్రభుత్వ గ్రంథాలయము, కేంద్ర గ్రంథాలయము నెలకొల్పబడినవి. ఇచ్చట బ్రహ్మాండమైన ప్రభుత్వ వైద్యశాల నిర్మాణము ఇటీవలనే పూర్తియైనది. రెండవ ప్రపంచ యుద్ధకాలమున వాల్తేరులో నున్న ఆంధ్ర విశ్వవిద్యాలయము తాత్కాలికముగా ఈ నగరమునకు తరలించుటయు, 1953 లో ఆంధ్ర రాష్ట్రము ఏర్పడినప్పుడు హైకోర్టు ఇచ్చట స్థాపింపబడుటయు ఈ నగర ప్రాధాన్యమునకు, విశిష్టతకును ప్రబల దృష్టాంతములు.

వి. సూ.