సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మూడవ సంపుటము/గుంటుపల్లి
గుంటుపల్లి :
ఆంధ్రప్రదేశములో నున్న అతి పురాతనమైన బౌద్ధ క్షేత్రములలో గుంటుపల్లి ఒకటి. ఇది క్రీ. పూ. రెండవ, మూడవ శతాబ్దులలో ఆంధ్రదేశమును పరిపాలించిన శాతవాహన రాజుల కాలములో వర్ధిల్లిన గొప్ప బౌద్ధ సంఘారామము. గుంటుపల్లి పశ్చిమ గోదావరిజిల్లా ఏలూరు తాలూకాలోనున్న కామవరపుకోటకు ఆరుమైళ్ల దూరములో గల ఒక పల్లెగ్రామము. దీనికి ఉత్తరదిశగా ఒక మైలు దూరములో తూర్పుపడమరలుగా వ్యాపించిన ఒక కొండ కలదు. ఆ కొండ మధ్యభాగమున దక్షిణ ముఖముగా, గుఱ్ఱపులాడమువలెనుండు భాగ మొకటి కలదు. అది యొక గుహ. దానిలోతు అరమైలుండును. ఆ గుహా ముఖద్వారము వెడల్పు 500 గజములు. దానికి పడమటి శాఖలో ఒక విలక్షణమైన చైత్య గృహమును, దానికి ప్రాగుత్తరమునందు ఒక విహారమును తొలువ బడినవి. వీటియన్నిటి దరీముఖములు పైకి నిరాడంబరములుగా గనుపించును. కాని లోనికిపోయి చూచినచో పైకప్పుభాగము శిల్పవైభవముతో నలరారుచు మిక్కిలి చిత్రముగా నుండును.
పూడికొనిపోయిన ఈ గుహాలయప్రాంతమును క్రీ. శ. 1889 వ సంవత్సరములో అలెగ్జాండరు రే అను మహాశయుడు త్రవ్వించి, ప్రపంచమునకు ఈ ప్రాచీన గుహాలయములను బయల్పరచి, బౌద్ధమత చరిత్రకును, బౌద్ధ శిల్పచరిత్రకును మహోపకారము గావించెను. ఈ ప్రదేశములో దొరకిన రాతిపెట్టెలు, శిలావిగ్రహములు, పూసలు, బంగారపు భిక్షాపాత్ర మొదలైన వస్తుజాలము మద్రాసు మ్యూజియమునందు భద్రపరుపబడినవి.
ఇచ్చటి గుహలు అంత అందముగా లేనిమాట నిజమే కాని, ఆ రూపమే వాటి ఘనతను, ప్రాచీనతను జాటుచున్నవి. ఇవన్నియు నిరాడంబరముగాను, నిరలంకృతము గాను ఉండి బౌద్ధమత సంప్రదాయ పరిస్థితులను వ్యక్తము చేయుచున్నవి.
ఈ గుహాలయముల నిర్మాణపద్ధతి, బుద్ధగయవద్ద గల "బారాబరు" కొండలలో మలచబడిన అశోకునికాలము నాటి 'లోమక ఋషి' గుహాలయ నిర్మాణపద్ధతిని పోలి యుండుటచేతను, క్రీ. పూ. రెండవ శతాబ్దినాటి లిపిలో నున్న ఒక పురాతనకాలపు శాసనము లభించుటచేతను, ఇవి పురాతనకాలమునాటివని రూఢియగుచున్నది. ఇవి సాతవాహన రాజులకాలమునాటివి.
ఈ గుంటుపల్లి సంఘారామములో 'సుయజ్ఞ నాథు' డను శ్రమణకుడు నివసించుచు బౌద్ధమతమును గూర్చి ప్రచారము చేయుచుండెడివాడనియు, ఆతడు గొప్ప పండితుడనియు, మహా విజ్ఞానవేత్తయనియు అక్కడ దొరకిన శాసనములనుబట్టి తెలియుచున్నది. అక్కడ బౌద్ధభిక్షువులు సుఖముగా జీవించుచు, తమ నిత్య నైమిత్తిక కార్యక్రమములను నిర్విఘ్నముగ కొనసాగించు కొనుటకును, శాంతజీవనమును నెరపుకొనుటకును అనువుగానుండు విధముగా నిర్మింపబడిన ఆరామములు, విహారములు పెక్కులున్నవి. ఇవన్నియు ఆనాడు బౌద్ధ భిక్షువులతోను, ఇతర విజ్ఞానవేత్తలతోను నిండియుండెడివి.
ఈ పురాతన బౌద్ధ సంఘారామములలో పూజా పురస్కారములు జరిగినట్లు సరియైన నిదర్శనములు కనపడక పోవుటచే, ఇవన్నియు హీనయాన బౌద్ధమత సంప్రదాయమునకు చెందినవని నిశ్చయింపవచ్చును. అప్పటికింకను మహాయాన మత సంప్రదాయము తలయెత్తి యుండలేదనుట స్పష్టము. ఆంధ్రదేశములో మహాయానమత సంప్రదాయము ప్రబలి బౌద్ధమతము మహోన్నతదశ నొంది బహుళవ్యాప్తి కలిగియున్న సమయమున గుంటుపల్లి బౌద్ధారామము ఒక విశిష్టస్థానమును వహించియుండెనని చరిత్రకారులు భావించుచున్నారు.
గుంటుపల్లిలోనున్న బౌద్ధవిహారములలో కొన్ని పర్వతగుహలలో మలచబడినవియు, మరికొన్ని ప్రత్యేక ముగా ఇటికలతోను, రాళ్ళతోను నిర్మింపబడినవియు కలవు. ఇవన్నియు ఒకేకాలములో గాక వేరువేరు కాలములలో నిర్మింపబడినవని నేటి పురాతత్త్వ శాస్త్రజ్ఞు లూహించు చున్నారు. వాటి వివరములు ఈ క్రిందివిధముగా నున్నవి.
I గుహావిహారములు : ఈ గుహావిహారములు సాతవాహన రాజుల కాలమునందు నిర్మింపబడినవి. ఇవి అతి పురాతనమైనవి.
(1) చైత్యగృహము : ఈ చైత్యగృహము భారత దేశములో, ఇతరస్థలములలో కనిపించు చైత్యగృహముల వలె చతురస్రముగాకాక, వలయాకారముగా నుండి, సాతవాహనయుగపు శిల్పుల ప్రత్యేక వైలక్షణ్యమును, వారి అనన్య సామాన్యమైన శిల్పరచనాప్రతిభను వేనోళ్ళ చాటుచున్నది. దీని వ్యాసము 18 అడుగులు; ఎత్తు 14 అడుగుల 9 అంగుళములు : దీని మధ్యభాగములో నొక శిలాచైత్యమున్నది. దీనిచుట్టును ప్రదక్షిణపథము గలదు. చైత్యవేదికయొక్క వ్యాసము 11 అడుగుల 8 అంగుళములు. దీనిఎత్తు 3 అడుగుల 9 అంగుళములు. దీనిపైన 9 అడుగుల 2 అంగుళముల వ్యాసమును, 4 అడుగుల 9 అంగుళములు ఎత్తునుగల 'అండ' మొకటి కలదు. అండముపైన హర్మికలో ఛత్రపుకాడను దించుటకు అనుకూలముగా నుండునట్టి ఒక గుంట యున్నది. ఈ గుహాలయము పైకప్పు చేజెర్ల కపోతేశ్వరాలయపు పైకప్పును పోలి యున్నది. గుహాముఖము ఒక పెద్ద గుఱ్ఱపులాడపు ఆకారముతో నున్నది. అంతేగాక గయవద్ద గల 'బారాబరు' కొండలలోని 'లోమక ' ఋషి గుహాముఖము వలెనే దీని ముఖముగూడ నున్నది. దానియందలి లోపలి కొలతలతో దీనియందలి లోపలి కొలతలు సమానముగ నున్నవి. అందుచేత ఈ రెండు గుహలును క్రీ. పూ. రెండు వందల సంవత్సరముల ప్రాంతమున నిర్మింపబడినవని పురాతత్త్వ శాస్త్రజ్ఞులు పరిశోధనలు సల్పి నిర్ణయించియున్నారు.
(2) విహారము : పైన తెల్పిన చైత్యగృహమునుండి ఈ విహారము చేరుటకు ఒక దారియున్నది. ఈ విహారము చైత్యగృహమునకు పైభాగమున ప్రాగుత్తరముగా
చిత్రము - 102
గుంటుపల్లి గుహాలయములు
నుండును. ఇది అడ్డదిడ్డముగా చెక్కబడిన గదులతోను, కంతలతోను నిండియుండును. అంతేగాక ఈ విహారము కార్లి, నాసిక, భేడ్సా మొదలైన మహారాష్ట్ర దేశమందలి విహారములవలె, అంత అందముగాలేదు. గుహకు మధ్యభాగమున ఒక కిటికియు, రెండువైపుల రెండు కిటికీలును, వాటిపైన ద్వారముల పైభాగములయందు చైత్యవాతాయనములును గలవు. ఇతర అలంకారములు లేవు. ఈ విహారమునందు కొన్నిగదులు అసంపూర్ణముగా నిర్మితమైనట్లు కనిపింపగలవు.
(3) వేరొక విహారము : ఈ పెద్ద విహారమునకు సమీపమున పై భాగమందు అయిదు గదులుకల వేరొక విహార మున్నది. కాని ఈ విహారము మిక్కిలి శిథిలావస్థలో నున్నది. ఇది అంత ఆకర్షణీయమయినది కాదు.
II. ఇటుక, రాతి కట్టడములు: పై నుదహరించిన ప్రాచీన గుహావిహార శిథిలములకు సమీపముననే కొన్ని ఇటిక కట్టడములును, రాతి కట్టడములును ఉన్నవి. ఈ కట్టడము లన్నియు ఈ బౌద్ధతీర్థమునకు సంబంధించినవే యైయున్నవి. కాని, కట్టడములన్నియు శిథిలావస్థలో నున్నవి. వీటి నిర్మాణము గుహావిహారములకు తర్వాతి కాలములో జరిగినట్లు చరిత్రకారులు భావించుచున్నారు.
(1) ఇటుక స్తూపములు : చైత్య గుహ నుండి విహారగుహకు పోవు దారిలో కొండచాలుపైన అనేక స్తూపముల యొక్క పునాదులు వరుసగా గానిపించుచున్నవి. వీటి పైభాగములన్నియు శిథిలములైపోయినవి. ఈ ఇటిక స్తూపములు మిక్కిలి చిన్నవి. ఇవిఆరాధ్యస్తూపములని చరిత్రకారులు ఊహించుచున్నారు.
(2) చైత్య గృహము : ఈ చైత్య గృహము, పై స్తూపములకు సమీపమున పడమరవైపుగా నున్నది. ఇది గుఱ్ఱపులాడపు ఆకారముతో నిర్మింపబడియున్నది. దీని పొడవు 54 అడుగుల 5 అంగుళములు ; వెడల్పు 14 అడు గుల 6 అంగుళములు, గోడలమందము సుమారు 4 అడుగులుండును. దీని పునాదులు మిక్కిలి బలిష్ఠములుగా నున్నవి. దీనిపైన కోళ్ళగూడువంటి కప్పుగూడ నున్నది. దీనిలోపలను, మధ్యభాగమునను ఎత్తైన ఒక ఇటుక దిమ్మయు, దానిపైన బుద్ధ విగ్రహము నున్నవి. ఈ విగ్రహము అమరావతి మహాచైత్యములోని మూడవ దశకు చెందిన బుద్ధవిగ్రహమును పోలియుండుటచే ఈ చైత్యాలయము క్రీ. శ. ఒకటవ శతాబ్దపు మధ్యభాగములో నిర్మింపబడి యుండునని ఊహింపబడుచున్నది.
(3) మంటపము : ఇది చైత్యగృహమునకు తూర్పువైపున నున్నది. దీని పొడవు 56 అడుగులు; వెడల్పు 34 అడుగులు. ఇది ఒక సమావేశ స్థలమని పెద్దలూహించుచున్నారు. దీనిలో పెక్కుమంది కూర్చుండుటకు తగునట్లుగా వసతియున్నది. ఈ మంటపములో బౌద్ధ భిక్షువులు కూర్చుండి బౌద్ధ ధర్మములను గూర్చి చర్చించుచుండెడి వారట.
(4) ఇతర స్తూపములు : ఈ మంటపమునకు సమీపముననే ఇతర స్తూపములు అనేకములు కలవు. ఇవి అనేక పరిమాణములలోనుండి, అనేక విధములుగా నిర్మింపబడి యున్నవి. ఈస్తూపముల నిర్మాణ విధానమందు ఎంతయో వైవిధ్యము గోచరించును. ఈ స్తూపములలో ఒకదాని యందు ఒక అవశేష (Relic) పాత్ర లభించినది. అందుచే ఇవన్నియు భిక్షువుల సమాధు లని పెద్దలు తలంచు చున్నారు. ఈ ప్రదేశములో ఇట్టి చిన్న స్తూపములు 35 కన్పడుచున్నవి. ఈ స్తూపము లన్నింటిలోను పెద్దదగు స్తూపముయొక్క వేదికకుగల మెట్ల పైభాగమునందు, సుయజ్ఞనాథుని శిష్యురాలైన 'సానాదా' యను నామె ఆ మెట్లను కట్టించినట్లు తెలుపు శాసనములు గానిపించు చున్నవి. అందుచే ఈ స్తూపములు క్రీ. శ. రెండవ శతాబ్దమునకు సంబంధించినవని పురాతత్త్వ శాస్త్రజ్ఞులు నిర్ణయించుచున్నారు.
(5) శిలా చైత్యము : ఇది ఒక రాతి అరుగుమీద నిర్మింపబడినది. దీని వెలుపలి భాగమంతయు చిన్న చిన్న రాళ్ళతో నిండియుండి చిందరవందరగా నున్నది. ఈశిలా చైత్యమునందు ఒక అవశేషపాత్ర లభించినది. దీనిలో ఒక రాతిబరణి, ఒక స్ఫటికపుపూస, ఒక బంగారపు భిక్షా పాత్ర లభించినవి. ఈ శిలాచైత్యము క్రీ. పూ. రెండవ శతాబ్దమునాటి 'భీల్సా' చైత్యములతో అన్ని విధములను పోలియుండి ఒక ప్రత్యేక విలక్షణతతో నొప్పారుచున్నది.
విశ్వ విఖ్యాతిగాంచిన ఈ పురాతన బౌద్ధ సంఘారామములను సందర్శింపనెంచిన ప్రజలు ఏలూరునుండి కామవరపుకోట వరకు బస్సులపై ప్రయాణముచేసి, అక్కడినుండి గుంటుపల్లికి నడచికాని, బండ్లపై నెక్కిగాని వెళ్ళుదురు. ప్రతిసంవత్సరము దేశపు నలుమూలలనుండి యాత్రికులు అనేకులువచ్చి ఈ పవిత్ర బౌద్ధ క్షేత్రమును సందర్శించి పోవుచుందురు.
పు. వేం.