Jump to content

సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మూడవ సంపుటము/గణపతిదేవుడు, కాకతి

వికీసోర్స్ నుండి

గణపతిదేవుడు - కాకతి (క్రీ. శ. 1198 1261) :

శాతవాహనుల తరువాత త్రిలింగదేశమును 'ఏకచ్ఛత్రము క్రిందికి తెచ్చి పాలింపగల్గిన రాజచంద్రుడు గణపతిదేవుడు. ఇతడు కాకతీయ చక్రవర్తులలో ఏడవ వాడు ; కడు సమర్థుడు; విపులసామ్రాజ్య నిర్మాత.

కాకతి ప్రోలరాజు (1110-1158) యొక్క పుత్త్రులలో నొక్కడును, కాకతి రుద్రదేవుని తమ్ముడును ఐన మహాదేవరాజున కును, బయ్యమాంబకును జన్మించినవాడు గణపతి దేవుడు. వీరిది సూర్యవంశమనియు, వీరు క్షత్రియులుగా పరిగణింపబడిరనియు, గణపతిదేవుని పాకాల, మోటుపల్లి కాంచీవర శాసనములవలన తెలియుచున్నది. విద్యానాథుడు ప్రతాపరుద్రీయమున కాకతీయ ప్రభువులను 'అత్య ర్కేందుకుల ప్రసూతు'లని కీర్తించియున్నాడు. అంతియకాక వీరు దుర్జయాన్వయులనియు, చతుర్థకులజు లనియు శాసన ప్రమాణములవలన (గారవపాడు శాసనము మొదలగునవి) తెలియుచున్నది.

మొదటి ప్రతాపరుద్రుడని బిరుదముదాల్చిన కాకతి రుద్రదేవుడు పరిపాలన చేయుచున్న కాలమున, మహా దేవరాజాతని రాజ్యమును హరించుటకు మాయోపాయములను పన్నుచు, రాజు నగరమున లేనిసమయము చూచి, సింహాసనమును అక్రమించుకొనెను. కాని రుద్రదేవు డాతనిని వధించి, అతని కుమారుడైన గణపతి దేవుని చెరపట్టెను శాణదేశాధీశుడును, యాదవరాజును అగు జైత్రపాలుడు (జైతుగి) ఈ సమయమున రుద్రదేవునిపై నురికి, వానిని చంపి, పిన్న వయస్కుడగు గణపతిదేవుని చెరనుండి విడిపించి క్రీ శ. 1198 లో ఆతనిని సింహాసన మెక్కించెను. త్రిపురాంతక శాసనమునందు శా. శ. 1182 వ సం. ఈతని 62 వ రాజ్య సంవత్సరమని చెప్పబడి యుండుటచే ఈతడు శా. శ. 1120 సం. నకు సరియగు క్రీ. శ. 1198 లో నే ఏలిక అయినట్లు ధ్రువపడు చున్నది.

రుద్రదేవ, మహాదేవుల పరస్పర వైరుధ్యమువలనను, జైత్రపాలుని దండయాత్రల వలనను దేశమునందు భద్రత సడలిపోయిన కాలమున గణపతిదేవుడు రాజ్యమునకు వచ్చెను. గొంటూరి (ఇప్పటి గుంటూరు) నాగదేవుడు మొదలుగా గల సామంతులు కొందరు ఆ యదను గాంచి స్వతంత్రింప నుంకించి, కాకతీయ రాజ్యమును కూలద్రోయ యత్నించిరి. కాని రాజనీతికోవిదు డగు గణపతిదేవుడు రేచర్ల రుద్రదేవుడు, బొప్పదేవుడు మొదలగు సమర్థులైన సేనానుల సహాయమున సామంతుల అలజడులను అణచివైచెను. అంతటితో ఆగక కృష్ణానదీ ముఖము మొదలు కాంచీపురము పర్యంతము వ్యాపించి, నామమాత్రముగా చోడ సామంతులమని చెప్పుకొనుచు పరిపాలించుచున్న కమ్మనాటి, పాకనాటి రెడ్లను జయించి తన ఏలుబడిక్రిందికి తెచ్చెను.

గణపతిదేవుడు క్రీ. శ. 1212 వ సంవత్సరమున పూర్వ దేశ విజయయాత్రకు బయలుదేరెను. కొలనుపురము (ఏలూరు) రాజధానిగా, తెలుగునాయకులు కృష్ణాగోదావరీ మధ్య ప్రదేశము నేలుచుండిరి. వీరు నామమాత్రముగా వెలనాటి ప్రభువులకు సామంతులుగా వ్యవహరించుచున్నను, స్వతంత్ర ప్రతిపత్తిని వహించి యుండిరి. అట్టివారిలో శ్రేష్ఠులైన మహామండలేశ్వర, కేశవదేవరాజ, సామినాయకులను వారితో గణపతిదేవుడు యుద్ధములు సలిపి, క్రీ. శ. 1228 వ సం. నాటికి పూర్తిగా వారి నోడించి, వారి రాజ్యముల నాక్రమించెను.

గణపతిదేవుడు సేవణ, కర్ణాట, లాట, కళింగ, చోళ రాజన్యులను జయించి వెలనాటిపై దండెత్తెను. 'అయ్య' వంశమునకు చెందిన కమ్మనాటి పాలకుడగు నారపనాయకునిచే నిర్మింపబడిన 'చోడసముద్ర' ప్రాంతమును పట్టి రత్నాశ్వ గజ, ధన, కనక వస్తు వాహనాదులను ఓరుగంటికి తరలించెను. ఆతడు జైత్రయాత్రలో శత్రు విజయముతో నాగక వారితో నేవో సంబంధ బాంధవ్యముల నేర్పరచుకొని శాంతియుతముగా దేశమును రక్షింప దలచెను. చోడినాయక సేనానియు, 'అయ్య' వంశజుడును అయిన పిన్నచోడుని ఓడించి, ఆతని కొమరితలైన నారాంబ, పేరాంబలను పెండ్లియాడెను. జాయప నాయకు డనుశూరుడు ఆ రాణులకు రెండవ తమ్ముడు. గణపతిదేవు డాతని సూక్ష్మబుద్ధిని, ధైర్యసాహస గుణాదులను గమనించి తన గజసైన్యాధ్యక్షునిగా (గజసాహిణి) నొనర్చికొనెను. జాయపనాయకుడును రాజునకు శాత్రవ విజయమునందు అధికముగా తోడ్పడి 'వై రిగోధూమఘరట్ట' యను బిరుదమును పొందెను.

కాకతిరుద్రదేవుని మంత్రియగు ఇందులూరి పెదమల్లన పుత్త్రులైన సోమరాజు, పెదగణ్ణగరాజు, అనువారు గణపతిదేవునికి అండగా నిలిచి, ఓరుగంటికి తూర్పుననున్న రాజ్యములను గెలిచి, రాజున కప్పగించిరని 'శివయోగ సారము' వలన తెలియుచున్నది. వీరిలో సోమరాజు మండలేశ్వరులైన తెలుగు నాయకులనుండి కొలనువీడు (ఏలూరు) దుర్గమును క్రీ. శ. 1228 లో సాధించి కాకతీయ రాజ్యమున కలిపెను.

రాజసేవా పరాయణులైన సేనానులు అకళంక భక్తిప్రపత్తు లాధారముగా, సహజముగా తనకున్న రాజకీయతంత్ర ప్రయోగ నైపుణ్యముతో రాజకీయ సాగరమును కడముట్ట ఈదుచున్నను, కళింగ గంగవంశపు రాజుల వలనను, తత్తీర సామంతుల వలనను కొంత అశాంతి గణపతిదేవునకు తప్పలేదు. మూడవ అనంగ భీమదేవుడును, అతని కుమారుడు మొదటి నరసింహదేవుడును కళింగమునుండి విజృంభించి, ఉత్తరమున బఖ్తియార్ ఖిల్జీ దండయాత్రలను నిగ్రహించి, దక్షిణమున కాకతీయ సామంత రాజుల కొందరిని గెలిచికొనిరి. క్రీ. శ. 1152, 1155 సంవత్సరములకు చెందిన రెండు శాసనములు అనంగ భీమునిపేర దాక్షారామమున కానబడుట బట్టి అతడు వేంగిని కాకతీయులనుండి జయించినట్లు చెప్పవచ్చును. ఈ ఉపద్రవమును దాటుటకై గణపతిదేవుడు తన ప్రధానియైన హేమాద్రి రెడ్డిని, గజసాహిణియైన జాయప నాయకుని, కళింగమును జయింప దండు నిచ్చి పంపెను. వారా ప్రాంతమును మరల జయించి శాంతి నెలకొల్పిరి. అందులకు శా. శ. 1159 నాటి హేమాద్రి శాసనము, శా. శ. 1175 నాటి జాయప నాయకుని శాసనమును దాక్షారామమున నుండుట ప్రబల నిదర్శనము. గణపతిదేవుని మోటుపల్లి, ఉప్పరపల్లి, ఏకామ్రనాథ, పాకాల శాసనాదులు గణపతిదేవుని కళింగ విజయమును పేర్కొనుచున్నవి.

వెలనాటి చోడులకును, నెల్లూరి చోడులకును ఈతని కాలమున స్పర్థలు హెచ్చెను. నెల్లూరును ఏలు చోడతిక్క రాజు సుమారు శా. శ. 1175 లో చనిపోగా, మనుమసిద్ధి రాజ్యమునకు వచ్చెను. కాని ఆతని దాయాదులగు అక్కన, బయ్యన్నలు వెలనాటిని పరిపాలించుచున్న ద్రావిడ మూడవ కుళోత్తుంగ చోళుని సహాయమున మనుమసిద్ధిని పదభ్రష్టునిచేసి రాజ్యమాక్రమించిరి. అప్పుడు మనుమసిద్ధి మంత్రి తిక్కన గణపతిదేవునివద్ద కేగి తన పాండిత్య ప్రకర్షను ప్రకటించి తన ఆంధ్రభారతమును వినిపించి ఆతని మెప్పించి, ఆతనిని సహాయునిగా తోడ్కొని నెల్లూరునకు విచ్చేసెను. గణపతిదేవుడును సమయమును పురస్కరించుకొని దిగ్విజయముచేసి పరమండలములు సాధించి, నెల్లూరులో దక్షిణభాగమును గాల్చి తద్విరోధులైన పడిహారి బయ్యన, అక్కనలను చంపి, మనుమసిద్ధిని గద్దియపై నిల్పి ఆతనిచేత ఏనుగులను కాన్కగా బడసెను. దీనితోపాటు వెలనాటిని, కొట్యదొనను (కొణి దెన) ఏలు మల్లచోడాదులను, అద్దంకిని ఏలు మాధవరావును, ములికినాడును, పొత్తపినాడును, రేనాడును, పెనదాడిని, పెడకల్లును, సకిలనాటిని, ఏరువనాటిని, గండికోటను జయించి కాంచీపురమువరకు తన రాజ్యమును విస్తీర్ణ పరచెను.

క్రీ. శ. 1249 వ సంవత్సరమున కాంచీపురము రాజధానిగా నేలుచున్న జటవర్మ సుందర పాండ్యమహారాజు విక్రమసింహ పురమునకు (నెల్లూరు) దిగువ దేశమును కల్లోలపెట్టు చుండగా గణపతి దేవుడు సామంతభోజుడను తన మంత్రిని దండుతో కంచిపైకి పంపి సుందరపాండ్యుని తరిమించెనని ఏకామ్రనాథ దేవాలయమునందలి శాసనము తెల్పుచున్నది. ఆ తరువాత సామంత భోజునే సైన్యపాలునిగా, కాంచీపురపాలకునిగా నచ్చట నియమించెను. 1250 లో మరల సుందరపాండ్యుడు తెలుగు చోడరాజులలో కొందరి సహాయముగొని విక్రమసింహ పురమును ఆక్రమించెను గాని, గణపతిదేవుని సేనానుల సాయముతో విజయగండ గోపాలదేవుడు మొదలగు తెలుగు చోడరాజు లాతని నెల్లూరునుండి తరిమివైచిరి. ఈ విధముగా ఇటు దక్షిణమున బళ్ళారి, రాయచూరు మండలములనుండి అటు బస్తరువరకు, అట్లే ఆదిలాబాదు నుండి కంచివరకు సుమారు ఒక లక్ష చదరపుమైళ్ళ విస్తీర్ణముగల సువిశాల సామ్రాజ్యమును గణపతిదేవుడు నిర్మింపగల్గెను.

గణపతిదేవుని కెందరు భార్యలున్నను, పుత్త్రసంతతి కలుగలేదు. అతని పట్టమహిషి సోమాంబాదేవి; అతనికి రుద్రాంబ, గణపాంబ అను ఇద్దరు కుమార్తెలు మాత్రము కలరు. రుద్రాంబను నిరవద్యప్రోలు (నిడుదవోలు) పాలకుడగు చాళుక్య వీరభద్రునకును, గణపాంబను కోటవంశీయుడగు కోట బేతరాజునకును ఇచ్చి పెండిలి చేసెను. గణపతిదేవునికి మేలాంబిక యను సోదరి కలదు. ఆమెను నతవాటి సీమ నేలు బుద్ధ రాజు కుమారుడగు రుద్రున కిచ్చెను. ఇట్లు సామ్రాజ్యములోని బలవంతులగు సామంతులతో సంబంధము నెరపి, అంతఃకల్లోలములు లేకుండునట్లు కావించెను.

గణపతిదేవుడు రుద్రాంబనే తన తరువాత రాజ్ఞిగా జేయుటకై రాజకీయ శాస్త్రాదులందు ఆమెకు శిక్షణ నిచ్చి, చివరకు ‘రుద్రదేవుడ'ను పురుష నామముతో గద్దె నెక్కించెను. గణపతిదేవుడు తాను పరిపాలించుచున్న కాలముననే రుద్రాంబ రాజ్య పరిపాలన వ్యవహారము లందు పాల్గొనునట్లు చేసెను. క్రీ. శ. 1261 లో ఆమె పట్టాభిషిక్తురాలయ్యెను. ఆమె సింహాసనమెక్కినక్రొత్తలో స్త్రీ పాలనము అంగీకరింపని కొందరు సామంతులు ముఖ్యముగా జన్నిగదేవ, త్రిపురాంతకదేవులు, అంబయదేవుడు, జటవర్మపాండ్యుడు, గొంటూరి నాగదేవుడు, దేవగిరి సేవణ వంశీయులు - తిరుగబడి స్వాతంత్ర్యము వహింప యత్నించిరి. కాని గణపతిదేవుడు వృద్ధుడైనను, రాజభక్తిపరులైన సేనానుల గట్టికొని వారి అలజడి నణచివైచెను. ఆవణ్యవనోద్భవులును, కాకతీయ సామంతులు నైన మహారాజసింహాదుల వలన వేంగీ విషయము కళింగగాంగుల హస్తగతము కాకుండ రక్షించుకొనెను. పడికము బొప్పదేవుని ప్రయోగించి నాగదేవాదులను జయించెను. అట్టి దుర్ఘట సమయమున తోడ్పడిన సేనానులకు సత్కారములను, బిరుదములను ప్రసాదించి గౌరవించెను. ఉదాహరణమునకు బొప్పదేవునకు “గోదావరీతీర సమర గాండీవి”, “గొంటూరి నాగదేవ తలగుండు గండ" మొదలగు బిరుదము లిచ్చుట. ఈ విధముగా సామంతరాజుల తిరుగుబాటనెడి పెనుగాలికి పునాదులు కదలబూనిన విపుల సామ్రాజ్య సౌధమును సురక్షితమొనర్చి క్రీ.శ. 1267 వ సంవత్సరమున గణపతిదేవుడు దేహమును చాలించెను.

రాజధాని : గణపతిదేవుడు రాజ్యవిస్తీర్ణమును పెంచి, సమర్థులైన సేనానుల సాయముతో దానిని రక్షించుటతో పాటు దేశమునకు ఆయువుపట్టైన రాజధానీనగరమును గూడ పటిష్ఠ మొనర్చెను. అనుమకొండను కొన్నాళ్ళు ముఖ్యనగరముగా నుంచుకొని, తరువాత రాజధానిని ఓరుగంటికి మార్చెను. అందు బలిష్ఠమైన దుర్గమును (భూమికోట), తన్మధ్యమున సమున్నత రాజభవనమును, దాని చుట్టును ఎత్తైన శిలాప్రాకారమును, దానిని ఆనుకొని లోతైన అగడ్తను నిర్మించెను. రాజభవనములను గోపురములతోడను, బంగారు కలశములతోడను, అలంకరించి కోటయొక్క ప్రాకారములోనే రాజవీథులను, రధగజతురగపదాతి వర్గములకు అనువైన నెలవులను ఏర్పరచెను. అహోరాత్రములును వీరభటులచే కోటను కాపలా కాయించెను. నాటి ఓరుగంటి శోభకు ఢిల్లీ సుల్తానులకు సైతము కన్ను కుట్టినది.

గణపతిదేవుని ఒద్దనున్న ఉద్యోగులు : విశ్వేశ్వర శివదేశికులు (శివదేవయ్య) సచివాగ్రణి, గోవిందనాయకుడు, బయ్యపనాయకుడు, హేమాద్రిరెడ్డి, గంగయ సాహిణి, భోజమంత్రి, చెన్నాప్రగడ గణపామాత్యుడు, ఇందులూరి సోమరాజు, పెద్ద గణ్ణనరాజు మహాప్రధానులు. మేచయ నాయకుడు ఏకశిలానగర పాలకుడు. ప్రోలరౌతు తంత్ర పాలుడు. సివిరి అన్నయ చక్రవర్తికి సర్వాధికారి. దామనామాత్యుడు కార్యభరణుడు. ఇంకను తిక్కచమూపతి, పోతన, భాస్కరుడు, నూవుల మంచిరాజు, దేవరాజు మొదలగువారు మంత్రులుగా నుండిరి.

మతము : గణపతిదేవుడు అద్వైత వాదియని గణపాంబ వేయించిన యెనమదల శాసనమువలన తెలియుచున్నను, ఆతడు శైవమునం దధికమైన గౌరవమును ప్రకటించెను. మతసహనము లేనివాడయి జైన బౌద్ధములను అవమానించెనట ! ముప్పదియారు జైనుల గ్రామములను నాశనము చేయుటయేగాక, పెక్కు జైన బౌద్ధ దేవాలయముల పడత్రోయించెనట ! బ్రాహ్మణులకు ప్రతికూలముగా నుండిన జైనులైన కంసాలుల నుండియు, సెట్టి పెద్దలయిన తెలగాల నుండియు గ్రామకరణోద్యోగములను తొలగించి వారి ఉద్యోగములను నియోగి బ్రాహ్మణుల కిప్పించెను. అనులోమ విలోమ వివాహముల నంగీకరించి రాజకుటుంబమునే దానికి ఉదాహరణ మొనర్చెను.

గణపతిదేవుడు విశ్వేశ్వర శివాచార్యుని (శివదేవయ్య) ఒద్ద శివదీక్ష గైకొనెను. అతఁడు "మందర" మను గ్రామమును, రుద్రమదేవి వెలగపూడి గ్రామమును, ఆచార్యునకు దానము చేసిరి. (శా. శ. 1183) విశ్వేశ్వర శివుడా రెండు గ్రామములను గలిపి "విశ్వేశ్వర గోళకి" యను పేరిట ఒక అగ్రహారమును బ్రతిష్ఠించి యచట విశ్వేశ్వర దేవాలయమును, ఉచిత భోజన విద్యాసౌకర్యాదులతో సత్రమును, ప్రసూత్యారోగ్యశాలలను సమస్త సౌకర్య సంభరితముగ ఏర్పరచెను. ఈ గోళకీ మఠములు తమ శాఖలను క్రమముగా పుష్పగిరి, త్రిపురాంతకము, తిరుప్పురన్ కున్రం, దేవికాపురము లందు వ్యాప్తినొనర్చి విజ్ఞానప్రచార కేంద్రములై వరలెను. ఈ సంస్థలకు దొరికిన రాజాదరణము అమితము. వీని నన్నింటిని పర్యవేక్షించుటకై స్థానాచార్యు డనువాడు నియమితుడై యుండెను. ఈ విధముగా గోళకీ మఠములు స్వయం సమృద్ధములై, విద్యాసంస్థలుగనే గాక, ఆదర్శప్రాయమైన ఆర్థిక సంస్థలుగా గూడ పెంపొందినవి. వీనిని పోషించిన కీ ర్తి గణపతిదేవునకు దక్కు చున్నది. ఈ సంస్థల కెల్ల విశ్వేశ్వర శివాచార్యులవారు సర్వాధికారిగా నుండెను.

పరిపాలనము : గణపతిదేవుని పరిపాలనము నందు ముఖ్యరాజ్యతంత్రజ్ఞుడు ప్రధానమంత్రియైన శివదేవయ్య.

"ఈతడు ఈశ్వరుడు గాని మనుజమాత్రుండుగాడు" అని తిక్కనసోమయాజి యంతటివాడు శివదేవయ్యను కీర్తించినాడు. ఈతడు రచించిన 'పురుషార్థసార' మను గ్రంథమున రాజనీతిని——


“ప్రజఁ జెఱిచి కూడబెట్టిన
 నిజధనమది వలయు వ్యయము నిచ్చలుఁ జేయన్
 బ్రజయును ధనమును బొలిపిన
 భుజబలమున నిలువఁగలమె భూపతి కెందున్"

అని ప్రతిపాదించినాడు. ఈతని చెప్పుచేతలలో నడచి గణపతిదేవుడు ప్రజారంజకుడై నాడు.

గణపతిదేవుని రాజ్యమున డెబ్బది రెండు వినియోగంబుల వారుండిరి. ఈ డెబ్బది రెండు వినియోగంబుల వారిపై అధికారి యగుటచే గంగయ సాహిణి 'బాహ త్తరినియో గాధిపతి' అను బిరుదాంకితు డయ్యెను.

వ్యాపారము, ఆర్థిక వ్యవస్థ : దేశ ఆర్థికసంపద స్వదేశ విదేశ వ్యాపారముపైనను, పన్నులపైనను ఆధారపడి యున్నదని గ్రహించి గణపతిదేవుడు చక్కని నియమములతో కూడిన ప్రణాళికలను శాసించెను. నేటి గుంటూరు మండలమునందుగల బాపట్ల తాలూకాలోనున్న తీర గ్రామము మోటుపల్లి (వేలానగరము) నాడు సుప్రసిద్ధ రేవుపట్టణము. కాని దానికి సరియైన రక్షణము, పోషణములేక ప్రాంతీయ పాలకులచేత తీరస్థమైన నావలు కొల్లగొట్టబడుచు, అరాజక ప్రాయమైయుండెను దానిని గణపతి ఉద్ధరించి ఓడదొంగల బారినుండి నావలు రక్షింప బడునట్లేర్పాట్లు గావించి వర్తకుల రాకపోకలను నిరాటంక పరచెను. వర్తక సౌకర్యార్థమై ఒక్క కూపశుల్కము తప్ప తక్కిన సుంకములన్నిటిని ఎత్తివైచెను అచ్చట చెక్క బడియున్న శిలాశాసనమున నిబంధింపబడిన శుల్క వివరణమిది : "శ్రీగంధము 1 కి గ 1; పచ్చకర్పూరమునకు, చీని కర్పూరమునకు, ముత్యాలకు వెల గ 1 కి అ o ౻ ౾, పన్నీరు, దంతము, జవ్వాది, కర్పూర తైలము, రాగి, తగరము, సీసము, పట్టునూలు, పగడము, సుగంధ ద్రవ్యములకు వెల గ 1 కి 6 1 - మిర్యాలు వెల గ 1 కి 6 ౻ - , పట్టు స్వరూపము 1 - కి గ 1 కి G) ౻ o,” మొత్తమునకు ఎగుమతి దిగుమతియగు సరకులపై ముప్పదింట నొక్కపాలు సుంకముగ నిర్ణయింపబడినది. దీనినిబట్టి ఊహించినచో నాటి సముద్ర వ్యాపారమెంత అధికముగా సాగుచుండెడిదో ఎరుకపడును. దానికి గణపతిదేవుడు చేయూతనిచ్చి అభివృద్ధి గావించినాడు.

ఇంతియగాక స్థానిక మైన స్థల సుంకములు కొన్ని దేశవ్యా ప్తముగా వసూలు చేయబడుచుండెను. వానిని శాసన రూపమున బెక్కించి, వేయించుట నాటి అలవాటు. ఉదాహరణమునకు ఓరుగల్లులో ఖాన్‌సాహెబ్ తోటవద్ద రాతిపైనున్న శాసనము గైకొనవచ్చును. అందీ క్రింది విధముగా నున్నది :

“నీలి - మాడకు రెండువీసాలు

పోకలు - లక్షకు పాతిక

కూరగాయలు, మామిడి, కొబ్బరి మొదలగునవి - బండికి పాదిక.

నూవులు, గోధుమలు, పెసలు, వడ్లు, జొన్నలు, బండికి మానెడు .

ఉప్పు బండికి - పది పెరుకల మానెడు.

అవాలు మొ. - కాలకాండాలు - మాడ బాదిక.-

తగరము, సీసము, రాగి - తులమునకు 1 ఫలము.

కర్పూరము – వీసె 1 కి - 2 చిన్నాలు. - అవాలు మొ. కాండాలు మాడ బాదిక.

పట్టునూలు - తులము 1 కి - 1 చిన్నం.” మొదలగునవి. ఇంతేగాక మాగామ పన్ను, ఉప్పుపన్ను గూడ ప్రత్యేకముగా వసూలు చేయబడుచుండెడివి.

ప్రజోపకారములు : గణపతిదేవు డెన్ని యో ప్రజోప కారకములగు కార్యము లొనర్చెను. ఇప్పటి వరంగల్లు మండలములోని మొలుగు తాలూకాలోని గణపురమును నిర్మించి, అక్కడ ఒక పెద్ద తటాకమును త్రవ్వించెను. ఎల్గూరు గ్రామమును నిర్మించి, అదే పేరున పెద్ద తటాకమును, ప్రసిద్ధమైన పాకాల చెరువును త్రవ్వించెను. ఇట్లే లెక్కకు పెక్కగు గ్రామములను, శివాలయములను రాజ్యమంతటను వెలయించెను. దుర్గమారణ్యము లందు చక్కని బాటలు, సత్రములు, చలి పందిళ్లు వేయించి చోరాది బాధలనుండి ప్రజలను కాపాడెను.

కళలు : గణపతిదేవుడు కళా పిపాసి. తనకు మతముపై నున్న మక్కువను - శిల్పములోను, వాస్తువు నందును ప్రకటించి, భగవంతునికి నీరాజనమెత్తెను. తాను స్వయముగనేగాక, తన సామంత, సేనానులచేత గూడ బహుముఖములుగా కళాసేవను చేయించెను. ఆతనికాలమునందే ఏకశిలానగరము, రామప్ప, పిల్లల మఱ్ఱి, కొండిపర్తి మొదలగు స్థలములలో సుందరమైన దేవాలయములు తలలెత్తినవి. జాయపసేనాని రచించిన 'నృత్తరత్నాకరము' రామప్పలో శిల్పరూపమున లాస్య మొనరించుట కాంచవచ్చును. ఏకశిలానగరమునందలి మనోహరములగు ద్వారముల నిర్మాణమునకు సైతము ఆతడే కారకుడని కొందరందురు. 'కవిబ్రహ్మ'ను స్వయముగా గౌరవించిన భాగ్య మీ రాజేంద్రున కబ్బినది. విశ్వేశ్వరులవంటి మహామహితాత్ముల సేవానురక్తుడై ఐహి కాముష్మిక లాభముల నందినట్టివా డాతడు.

ఆతడొక నిర్మాణ కార్యకర్త; సువిశాలాంధ్ర సామ్రాజ్యమును ఏక చ్ఛత్రముగ 'ఆంధ్ర నగరము' (ఓరుగల్లు) రాజధానిగా అరువది రెండు సంవత్సరములు అప్రతి హతముగా నేలి దిగంత యశమును సముపార్జించిన సమ్రాట్టు.

జి. వి. సు.