Jump to content

సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మూడవ సంపుటము/గడియారములు

వికీసోర్స్ నుండి

గడియారములు :

ఆధునిక యుగములో మానవునకు గడియారము అత్యవసరమైన యంత్రసాధనముగ పరిగణింపబడుచున్నది. సామాన్యుడైన సేవకుని నుండి అత్యున్నత స్థానమలంకరించు అధికారివరకు దైనందిన కార్యకలాపములను నిర్వహించుకొనుటకు గడియారము అత్యావశ్యకమైన సాధనముగా ఉపయోగపడు చున్నది. ఒక్కమాటలో చెప్పవలెనన్న, కాలమునకు అమూల్యమగు విలువ గలిగిన ఈ యాంత్రిక నాగరిక యుగములో గడియారము లేకున్నచో, అయోమయావస్థలో నున్నట్లు ఆందోళన చెందెడువారు పెక్కురు గలరు.

మన మీనాడు చూచుచున్న గడియారము పదునెనిమిదవ శతాబ్దానంతరమే ఈ రూపములో పరిణామము చెంది, యంత్రసహాయముచే కోటానకోటులుగా తయారు చేయబడి విపణివీథు లందు విక్రయింప బడుచున్నవి. అయితే కాలమును దెలుపు పరికరము యాంత్రిక యుగావతరణమునకు పూర్వమే పెక్కు దేశములందు విచిత్రరూపములలో అవతరించినది. కాలము గడచిన కొలదియు, మానవుని సృజనాత్మక శక్తివలన, పరిశోధనా పాటవము వలన, అవిరామకృషి వలన ఈ యుపకరణము నేటి రూపమున పరిణతి చెందినది.

వేర్వేరు దేశములందు, వేర్వేరు కాలములలో, వేర్వేరు రూపములలో గడియారము ఎట్లు కనుగొనబడి, క్రమముగ ఎట్లు మార్పులు చెందెనో వివరింతము. భారతదేశ మందేకాక, ఇతర ప్రాక్పశ్చిమ దేశములందును జనులు పగటివేళల సూర్యబింబము యొక్క సహాయముతోడను, రాత్రివేళల నక్షత్రములయొక్క చలనసహాయముతోడను కాలగమనమును గుణించి నిర్ణయించెడివారు. సూర్యబింబము ప్రకాశించునపుడు, ఎనిమిది పలకలు కలిగి, అంకెలు, ఇతర సాంకేతిక చిహ్నములచే గురుతు వేయబడిన ఒక కఱ్ఱయొక్క నీడను కొలిచి, కాలనిర్ణయమును చేసెడి విధానము గూడ ఆ కాలమందుండెడిది. ఇప్పటికిని కొందరు గ్రామీణులు ఈ ప్రాత పద్ధతినే పాటించు చున్నారు.

ఈ సాధనముకంటె ఎక్కువ హంగులతో, ముఖాకృతి (dial) కలిగిన మేలురకపు మరియొక సాధనము బాబిలోనియాలో తరువాత కనుగొనబడి గ్రీసుదేశమునకు కొనిపోబడినట్లు తెలియుచున్నది. గ్రీకు ప్రజలు బాబిలోనియానుండి ఎన్ని యో విజ్ఞానశాస్త్ర రహస్యములను నేర్చిరి. కాలమును గంటలలోనికి విభజించు విధానమును ప్రప్రథముగ బాబిలోనియా శాస్త్రవేత్తలు గ్రీకులకు నేర్పిరి. తరువాత గ్రీకులనుండి ఇతర యూరపియను దేశీయు లభ్యసించిరి.

చిత్రము - 77

పటము - 1

సూర్యకాంతివల్ల టైం తెలుసుకొనే 'సన్‌డయల్‌' గడియారము

పైన జెప్పబడిన గడియారమునకు ముళ్లుండెడివి కావు. దానిని 'సన్‌డయల్ గడియారము' అని పిలిచెడివారు. దీని డయల్‌కు వెనుక ప్రక్క ముక్కోణాకారముగల ఇనుపపళ్ళె మొకటి అమర్పబడి, దాని అంచుల పొడవునా గంటలను సూచించు రోమన్ అంకెలు వ్రాయబడియుండెడివి. నూర్యబింబము ఆకాశమందు పైపైకి పయనించినకొలదియు ఇనుప పళ్లెముయొక్క నీడ ముళ్ల వలె కదలి కాలమును జూపెడిది. సూర్య బింబముయొక్క గమనమును, నక్షత్రములయొక్క చలనమునుబట్టి కాలమును గుణించుట కంటె, ఈ సన్‌డయల్ గడియారమువలన మరింత తేలికగా, కచ్చితముగా కాలనిర్ణయము చేయగలిగెడివారు. ఇట్టి గడియారముయొక్క చిత్రములు చెక్కిన మైలురాళ్ళు రష్యాదేశములో పలుతావులందు కనిపించు చున్నవి.

2500 సంవత్సరముల క్రిందట బాబిలోనియాలో నీటి గడియారముల సాయముచే కాలమానము లెక్క కట్టబడినట్లు చరిత్ర వలన తెలియుచున్నది. ఇది మిక్కిలి శ్రమతో కూడుకొన్న విధానము. ఈ గడియారము సూర్యుడు ప్రకాశింపని పగటి వేళలయందును, రాత్రుల యందును మాత్రమే ఉపయోగించెడిది. ఇటీవలి కాలమువరకు ఇట్టి గడియారములు చైనా యందు గూడ అచ్చటచ్చట కనిపించుచుండెడివి. నాలుగు రాగి పాత్రలు ఒకదానికి దిగువగా మరొకటి మెట్లమీద అమర్పబడి, ఒక దానినుండి వేరొక దానిలోనికి నీరు ప్రవహింప చేయబడెడిది. ప్రతి రెండుగంటల కొక సారి అన్నిటికంటె ఎగువననున్న పాత్రను నీటితో నింపవలసియుండెను. ఇతర పాత్రలు వాటంత టవియే నిండెడివి. ఈ పాత్ర లన్నిటినుండి నీరు బయటికి వెడలు కాలపరిమితి ఒక 'యూనిట్' గా భావింపబడెను. దానిననుసరించియే కాలమానము గుణింపబడెడిది.

చిత్రము - 78

పటము - 2

చైనా నీటిగడియారము

కాలక్రమమున నీటి గడియారమును నిర్మించు విధానములో పెక్కు మార్పులు ప్రవేశపెట్టబడినవి. గంటలను తెలుపుటకై గరాటా (శంకువు) వంటి పాత్రను 24 భాగములుగ విభజించి, దానిపై 24 గీతలు గీచెడివారు. నీటిమట్టమునుబట్టి ఎన్నవ గీతవరకు నీరు నిలిచినదో పరిశీలించి, కాలమును లెక్కించెడివారు. అంతకు పూర్వమువలె గాక, క్రొత్తరకమైన 'గరాటా నీటి గడియారము'లపై సమాన దూరములలో గీతలు గీయ బడుటచే, వీటివలన కాలమును గంటలలోనికి సరిసమానముగా విభజించుట సులభమయ్యెను. గ్రీకు ప్రజలు గరాటాలోని నీరు ఒకసారి ఖాళీయగుటను 'క్లెప్సి డ్రా' యని పిలిచెడివారు. ఒకగంట పరిమితిలో ఒక పనిని పూర్తిచేసిరని చెప్పుటకు నాలుగు 'క్లెప్సిడ్రాలు' పూర్తి అయినవని చెప్పెడివారు.

రెండువేల సంవత్సరములకు పూర్వము అలెగ్జాండ్రియాలో 'క్లెసీబియస్' అనునతడు క్రొత్త విధమైన నీటి గడియారమును తయారు చేసెను. నీటియావిరి, విద్యుచ్ఛక్తియన నేమియో తెలియని ఆదినములలో ప్రకృతి సిద్ధములైన నీరు, గాలిమాత్రమే ఇట్టివారికి ఉపకరించెను. నీటియంత్రములు జలపాతములవలన నడచెడివి. క్లెసిబియస్ తయారుచేసిన గడియారముయొక్క నిర్మాణము నేడు మన ముపయోగించు గడియారముల దానికంటె క్లిష్టమైనది. ఇది అన్ని ఋతువులలోను సరైన కాలనిర్ణయముచేసెడిది. ఇది గుండ్రముగగాక, నిలువుగనుండెడిది. దానిపై గుర్తింపబడిన రోమన్‌అంకెలు రాత్రికాలమును, అరేబియన్ అంకెలు (ఇప్పటి ఇంగ్లీషుఅంకెలు) పగటి కాలమును తెలిపెడివి. ఒక చిన్న గొట్టముపై యొక బాలునిబొమ్మ నిలబెట్టబడెడిది. ఈ బొమ్మ చేతిలోనుండెడి కర్రపుడక ఈ గడియారమునకు ముల్లుగా వ్యవహరించును. ఈ గొట్టము స్వయముగా తిరుగుచు, గడియారములో నుండి పైకివచ్చి, బొమ్మను గడియారముయొక్క పై భాగమువరకు లేవనెత్తును. బొమ్మతోపాటు, దాని చేతిలోని కర్రపుడక గూడ పైకిపోవుచు కాలమును సూచించును. బొమ్మ క్రిందినుండి చివరవరకు పోవుటకు 24 గంటలు పట్టెడిది. ఆ బొమ్మ మరల క్రిందపడి, పూర్వమువలె తిరిగి మెల్లగా పైకి పోవుచుండును. గంటల అంకెలు వేర్వేరు ఋతువులలో వేర్వేరు దూరములలో నుండును. అందుచే గడియారమునకు ఒక చక్రముగాక పండ్రెండు చక్రములుండెడివి. ఇవి 12 నెలలకు ఉపయోగపడెడివి. ఈ గడియారము ఒక అక్షముపై తిరుగుచు, అంకెల సమూహములను ఒక దాని తరువాత మరియొకదానిని కర్రపుడక వద్దకు తెచ్చు చుండును. ఈ నీటిగడియారము అక్షము పై తిరుగుటకును, దాని గొట్టము కదలుటకును విచిత్రమైన ఏర్పాటు చేయబడుచుండెను. పెట్టెలోనున్న నీరు, నీటిసాయమువలన త్రిప్పబడు చక్రముపైకి ప్రవహించుచుండెను. నీటివలన త్రిప్పబడు చక్రము అక్షమున కమర్పబడిన చిన్న పళ్ళ చక్రమును త్రిప్పుచుండెను. ఈ చక్రము మరొక చిన్న చక్రముయొక్క పళ్ళమధ్య పడునట్లుగా అమర్పబడి యుండుటచే ఆ చిన్న చక్రముగూడ తిరుగును. ఆచక్రము మరొక చిన్న పళ్లచక్రమును త్రిప్పగలిగెడిది. ఈ విధముగ నాలుగు చక్రములు తిరిగి, చివరకు గడియారము నిలిచి యున్న అక్షమును త్రిప్పుచుండెను. ప్రతి 24 గంటలకు 'Λ' ఆకారములో వంగిన పంపుద్వారా నీరు బయటికి వచ్చి అచటనున్న నీటిచక్రమును త్రిప్పుచుండెడిది. ఈ నాలుగు చక్రములు చివరకు అక్షమును త్రిప్పుటతో గడియారము తిరిగెడిది. సంవత్సరమునకు ఒకసారి మాత్రమే గడియారము ఒకచుట్టు తిరిగెడిది. క్లెసీబియస్ తరువాతివారు ఇంతకంటె క్లిష్టమైన గడియారములను కనిపెట్టినట్లు తెలియుచున్నది.

చిత్రము - 79

పటము - 3

యిసుక గడియారము

ఇక భారతదేశములో కాలప్రమాణమును గుణించు పెక్కు సాధనములు వేలకొలది సంవత్సరముల నుండి వాడుక యందున్నట్లు చారిత్రక పరిశోధకులు పేర్కొని యున్నారు. ఉదాహరణమునకు, కాకతీయ ప్రతాపరుద్ర చక్రవర్తి కాలములో (క్రీ. శ. 1295–1326) ఓరుగల్లు నగరము నందు కాలపరిమాణమును తెలుపు గడియార ముండెనని తెలియుచున్నది. ఈ గడియారము ఇప్పటి మన గడియారముల వలె గంటలను తెలుపునది గాక ఘడియలను తెలుపునదిగా నుండెడిది. అట్టివానిని 'ఘటికా యంత్రము' లనుచుండిరి. క్రీడాభిరామములో:


"ఉ. ఉడువీథిన్ శిఖరావలంబి యగు
            నంధ్రోర్వీశు మోసాలపై
      గడియారంబున మ్రోసె రెండెనిమిదుల్
            ఘంటా ఘణాత్కారమున్
      సడలెన్ భానుడు పశ్చిమంబునకు
            వైశ్యాపూట కూటింటికిన్
      గుడువంబోదమె లెక్క యిచ్చి కడు
            నాకొన్నార మిప్పట్టునన్."

అని మంచన గోవిందశర్మ యను బ్రాహ్మణుడు తన చెలికాడగు కోమటి టిట్టిభ సెట్టితో పలికినట్లు వ్రాయబడి యున్నది. దీనిని బట్టి ఆ కాలమునందు గూడ కాలపరిమాణమును దెలిపెడు గడియారములను బట్టి గడియలను దెలుపుచు గంటలు కొట్టుచుండిరి. అట్లగుటచేతనే 'యాంధ్రోర్వీశు మోసాల రెండెనిమిదులు (16) మ్రోసెనని' చెప్పబడెను. అనగా అప్పటికి సూర్యోదయాది పదునారు గడియలయి యుండెనని గ్రహింపవలయును. ప్రాచీనుల లెక్కప్రకారము అహఃప్రమాణము 30 గడియలగుటచే 16 గడియలగు నప్పటికి మన గడియారముల ప్రకారము పగలు 12 గం. 24 నిమిషము లగును. అది భోజన వేళ యే గదా!

ఘటికా యంత్రముల నిర్మాణ మెట్టిదో సరిగా తెలియదుగాని, ఒక తొట్టిలో నీరుపోసి యుంచెదరనియు, ఆనీటిలో అడుగున చిన్న రంధ్రముగల చిన్నగిన్నెను ఉంచెదరనియు, ఆ రంధ్రముగుండ గిన్నెలోనికి నీరెక్కి పూర్తిగ నిండునప్పుడు ఆ గిన్నె నీటిలో మునిగిపోవు ననియు, అదియే గడియకాలమని గుణించుచుండిరనియు తెలియు చున్నది.

కాలమాన విషయమునుగూర్చి ఆంధ్ర భాగవతములో తృతీయ స్కంధమునందు ఇట్లు వ్రాయబడియున్నది :

“దివస పరిమాణ విజ్ఞేయంబగు నాడికోన్మానాలక్షణంబు ఎరింగింతు వినుము :

"షట్పలతామ్రంబునం బాత్రంబు రచియించి చతుర్మాష సువర్ణంబునం జతురంగుళాయామ శలాకంబు గల్పించి, దానందత్పాత్రమూలంబున ఛిద్రంబు గల్పించి, తచ్ఛిద్రమునం బ్రస్థమాత్ర తోయంబు పరిపూర్ణంబు నొందునంత కాలం బొక్కనాడికయగు”

గమనిక : 2 నాడికలు = ఒక ముహూర్తము = 2 గడియలు. అనగా, నాడిక = ఒక గడియ = 24 నిమిషములు.

21/2 గడియలు = ఒక గంట.

24 గం X 21/2 గ. = 60 గడియలు = 1 దినము.

పాలగడియారము : పూర్వము ఈజిప్టునందలి నైలు ద్వీపములో 'ఒసిరిస్' అను దేవాలయ ముండెను. దాని గర్భ భాగమందు, అడుగున రంధ్రముగల 360 పాత్రలుండెడివి. ప్రతిదినము ఒక పూజారి ఈ పాత్రలను పాలతో నింపెడివాడు. ఈ పాత్రలు 24 గంటలలో ఖాళీ యగున ట్లేర్పాటు చేయబడెను. ఈ విధముగా సంవత్సరాంతము వరకు వంతుల ప్రకారము ఈ పాత్రలు నింపబడుచు, ఈ ప్రక్రియవలన కాలమానము గణింప బడుచుండెడిదని తెలియుచున్నది.

ఇదిగాక 'ఇసుక గడియారమ' నెడి మరొకసాధనము స్వల్పమైన కాలపరిమితినిమాత్రమే నిర్ణయించుటకు ఉపకరించునదిగా నుండెను. ఇట్టి గడియారమును నిర్మించుటకు సశాస్త్రీయముగా తయారుచేయబడిన ఒకరకపు ప్రత్యేకమైన ఇసుకను సేకరించెడి వారు.

చిత్రము - 80

పటము - 4

గరాటా నీటిగడియారము

స్వయంచోదిములైన (automatic) గడియారములు : 'స్వయంచోదితమైన గడియారము ' అనునది మరియొక విధము. గడియారముతో మానవుని అవసరము అంత కంతకు అధికమగుటచే, దానిని సులభముగను, చౌకగను, నిపుణముగను, అధికసంఖ్యలో తయారు చేయుటకు పరిశోధనలు ప్రారంభమయ్యెను. 2000 సంవత్సరముల క్రిందనే ప్రథమముగా ఈజిప్టునందలి అలెగ్జాండ్రియా నగరములో స్వయంచోదిత గడియారములు తయారైనవి. ఈ గడియారముల పరిశ్రమ ప్రపంచములో ప్రప్రథమమున ఇచ్చటనే వెలసినట్లు చారిత్రకులు పేర్కొనినారు. మొదట ఈ పరిశ్రమ కొలదిమంది గుత్తవ్యాపారుల (monopolists) ఆధీనమందుండెడిది. కాని క్రమముగ అది సామాన్యులయిన పారిశ్రామికుల అధీనమయ్యెను. ఈ పారిశ్రామికులు "ఆటోమాటరిస్ క్లెపిడ్రన్” (ఆటోమాటిక్ నీటి గడియారములను తయారు చేసెడివారు) అని పిలువబడిరి.

పైన ఉదాహరింపబడిన గడియారములేకాక క్రీ. శ. 760 సం. ప్రాంతములో ఈజిప్టు, ఇటలీ, గ్రీసుదేశములలో విజ్ఞానశాస్త్రపరిశోధకులు 'వేయిన్నొక్క రాత్రుల గడియారములు', 'అలారంకొట్టు నిప్పుగడియారములు' అను విచిత్రనామములతో నొప్పు మరికొన్ని గడియారములను తయారు చేసినట్లును, విలాసవంతులగు మహారాజులు, మహారాణులు, ఐశ్వర్యవంతులు వీటిని అధికమూల్యమును చెల్లించి కొని వీటితో తమభవనములను అలంకరించుకొని నట్లును పెక్కు గాథలు కలవు. ఆనాడు లాంతరులోను, దీపపుప్రమిద మొదలైన వాటిలోను కాలెడి తైలమును బట్టియు, మైనపు వత్తులను బట్టియుగూడ కాలమానము నిర్ణయింపబడెడిది.

చైనాలో అలారము కొట్టెడి నిప్పుగడియారము పూర్వము విరివిగా వాడుకయందుండెను రంపపుపొడితో చేయబడిన ఒక పుడక ఒక చిన్న తొట్టెలో ఉంచబడెడిది. ఆ పుడకమీద అడ్డముగ ఒక దారమునకు రెండు చివరల యందు రెండు చిన్న రాగిగంటలు కట్టబడియుండును. పుడకయొక్క ఒక చివర నిప్పునకు అంటింపబడినచో అది మండుచుపోయి దారమును కాల్చెడిది. దారము తెగిపోగా, రెండుగంటలును శబ్దము చేయుచు తొ ట్టెక్రింద ఉంచబడిన పళ్ళెములో పడేవి. ప్రజ లీ గంటల శబ్దమును విని కాలమును తెలిసికొనెడివారు. అప్పటివరకు కాలమును విభజించుటలో శాస్త్రవేత్తలు వేర్వేరు విధానముల నవలంబించెడివారు. లోలకము (పెండ్యులమ్) తో నున్న గడియారములు కనిపెట్టబడిన తరువాతనే కాలమును గంటలు, నిమిషములు, క్షణములలోనికి విభజించుట సాధ్యమయ్యెను.

చిత్రము 81

పటము - 5

1300 లో బ్రిటీష్ పార్లమెంటు భవనంపై నిర్మించిన టవర్ గడియారము

క్రీ. శ. 1300 సంవత్సరముప్రాంతమందు యూరపులో ప్రప్రథమముగ టవర్ గడియారము వెలసినది. బ్రిటిష్ పార్లమెంటు భవనముపైన, వెస్ట్ మిన్స్‌టర్ శిఖరముపైన ఒకటవ ఎడ్వర్డు ప్రభువు ఇట్టి గడియారమును అలంకారముగ పెట్టించెను. ఇతర దేశముల యందలి సాంకేతిక నిపుణులు కనిపెట్టిన పెక్కు రకముల గడియారములను బ్రిటిష్ శాస్త్రజ్ఞులు పరిశోధించి విశేషమైన నైపుణ్యముతో ఈ టవర్ గడియారమును తయారు గావించిరి. దీనికి ఆంగ్లేయులు 'బిగ్ టామ్' అని పేరిడిరి. ఇది 'లైట్ హౌస్' వలె బహుదూరమున నున్న ప్రజలకు కూడ జ్యోతివలె కనిపించి దిక్ దర్శక మగుటయే గాక, అలారము కొట్టి గంటలను గూడ తెలుపుచుండెను. తరువాత కొంతకాలమునకు 'బిగ్ టామ్' స్థానమును 'బిగ్ బెన్' అను వేరొక నమూనా టవర్ గడియార మాక్రమించెను. 'బిగ్ టామ్ ' అవతరించిన తరువాత ఇతర ఐరోపా పట్టణములలో గూడ టవరు గడియారములు కనిపింపదొడగెను.

గడియారమును కనిపెట్టిన సాంకేతిక శాస్త్రజ్ఞులు నీటినితోడు బావి గిలకను దృష్టియం దిడుకొని, దానిని పోలు చక్రములను గడియారమం దమర్చిరి. నీటినితోడు కడవకు బదులుగా గడియారమం దొకబరువు వ్రేలాడు చుండును. చక్రముయొక్క స్థానములో గడియారమందు ముళ్ళు తిరుగును. అయితే త్రాటినివదలినప్పుడు గిలక వేగముగా తిరుగునట్లు గడియారములోని ముళ్ళు వేగముగా పరుగెత్తకూడదు. చక్రములు, ముళ్ళు ఎల్లప్పుడు సమాన వేగముతో తిరుగవలసి యుండును. వేగమును అరికట్టి, సమానస్థాయిలోనడచు ఏర్పాటు ప్రతిగడియార మందును కలదు. దానిని రెగ్యులేటర్ అనియెదరు. స్ప్రింగులతో నడచు గడియారములకు రెగ్యులేటర్ అవసరము. బిగువుగా చుట్టుకొనిన స్ప్రింగును ఒక్కసారిగా వదలినచో అది అతివేగముగా విప్పుకొని అనతి కాలములో గడియారము ఆగిపోవును. అందుచే స్ప్రింగు కూడ మెల్లగా, సమాన వేగముతో విప్పుకొనునట్లు చేయవలెను.

రెగ్యులేటరుకు రెండు 'ఫ్లాన్ జెస్' అమర్చబడి ఉండును. ఇందులో పై భాగముననున్న ఫ్లాన్ జ్ పళ్ళచక్రమునకుగల రెండు పళ్ళనడుమ కరచుకొనునట్లు అమర్చబడియుండును. ఆ ప్లాన్ జ్ పళ్ళను ముందునకు కదలనియ్యక ఆపును. అట్టియెడ, ఆపళ్ళు ఫ్లాన్ జ్ ను ముందునకు త్రోయును. అది అక్షమును త్రిప్పి సగము చుట్టువరకు పోవునట్లు చేయును. అప్పుడు క్రిందివైపున నున్న మరియొక ఫ్లాన్జ్ ఆపళ్ళ చక్రములోని రెండుపళ్ల నడుమ పడును. ఆవిధముగా అది తిరుగును. కాని పళ్ళ చక్రము రెగ్యులేటరును సులభముగా త్రిప్పకుండుటకు అక్షము (ఆక్సిల్) పైన అడ్డముగా ఒక కడ్డీయుండును. ఈకడ్డీకి ఇరువైపుల చిన్నబరువులు వ్రేలాడ కట్టబడి యుండును. రెగ్యులేటరు లేకున్నచో బరువు త్వరగా పడిపోవును. కాని బరువులు వ్రేలాడ గట్టబడిన కడ్డీని తిరుగునట్లు చేసినయెడల, అది మిక్కిలి కష్టముతో మెల్లగా తిరుగును. ఆపళ్ళ చక్రమును 'ఎస్కేవ్ వీల్' అనియు, 'టర్న్‌స్టెల్' అనియు లేక 'బాలెన్స్' అనియు అందురు. ముళ్ళను, రెగ్యులేటర్ మొదలగు వాటి నన్నిటిని గిలక త్రిప్పును. ఆ కదలికను అన్నిటికిని అంద జేయుటకు రెండుపళ్ళ చక్రము లుండును. ఎడమ వైపుననున్న 'పినియన్' అను పళ్ళచక్రము ఆ కదలికను గడియారపుపళ్ళకు అందియ్యగా, కుడివైపుననున్న పళ్ళచక్రము మొదట తిరుగు చక్రపుఇరుసును త్రిప్పును. మొట్టమొదట తయారైన గడియారములు కాలమును సరిగా తెల్పెడివికావు. అవి కొలదిగ మోటుగా నుండెడివి. వాటికి గంటలముళ్లుండెడివికావు. అవి దినమునకు పెక్కుసార్లు చుట్టుకొను అవసరము కలిగెడిది. ఈగడియారములో 24 అంకెలుండెడివి. ఇవి సూర్యాస్తమయ సమయమున ఒక గంటయు, మరుసటిరోజు సూర్యాస్తమయ కాలమున 24 గంటలును కొట్టెడివి అనగా, ఆ రోజులలో ఒక నాటి సూర్యాస్తమయమునుండి మరుసటి దినము సూర్యాస్తమయమువరకు గల కాలమును ఒక రోజుగా పరిగణించెడివారు. తరువాత గడియారపు 'డయల్' లో మార్పులు వచ్చెను. 1 నుండి 12 వరకు రెండు వరుసలలో అంకెలు వ్రాయబడినవి. ఒక వరుస పగటికాలమును, రెండవవరుస రాత్రికాలమును తెలుపుటకు నిర్దేశింపబడినవి. నేడు 12 అంకెలుగల గడియారములే వివిధ దేశములందు వివిధ రూపములలో తయారగుచున్నవి.

ప్రారంభదశలో కొన్నివందల పౌనులు బరువుగల టవర్ గడియారములు తయారయ్యెడివి. ఇప్పుడున్న టేబిల్ గడియారములు, గోడగడియారములు, చేతి గడియారములు మొదలైనవాటి ఆకారములను రూపొం దించుటకు దీర్ఘకాలము పట్టెను. క్రీ. శ. 1500 వ సంవత్సరములో 'పీటర్ హెన్‌లిన్' తయారుచేసిన జేబు గడియారములో, పైకి కనబడకుండునట్లు 'డ్రమ్' అను చిన్న ఇత్తడిపెట్టె అమర్పబడియుండెను. దీనిలో గడియారమును నడపు యంత్రముండును. 'కీ' ఇచ్చినప్పుడు డ్రమ్ తిరుగును. దీనిలో ఇందమర్చబడియున్న యంత్రములోని భాగములన్నియు ఒకే సమయమున తిరుగుచు కాలమును తెలిపెడివి. చిక్కిరి బిక్కిరిగా నున్న ఈ జేబు గడియారములోని యంత్రభాగములు అయోమయముగా నుండెడివి. ఈ జేబు గడియారమునకు గంటముల్లొక్కటి మాత్రమే ' యుండెను.

ప్రారంభములో జేబుగడియారములు కోడిగ్రుడ్డు ఆకారములోను, కాలక్రమమున పెక్కు విచిత్రరూపములలోను తయారు కాబడినవి. కొన్నిటియందు విలువైనరాళ్లుగూడ పొదగబడి ఐశ్వర్యవంతులకు అలంకార ప్రాయమగుచుండెను. క్లిష్టమైన ఇట్టి గడియారములను తయారు చేయుటకు ఆనాడు సున్నితమైన యంత్రసాధనములు లేకుండుటచే, పనితన మంతయు చేతులమీదుగనే జరుగవలసి యుండెను.

పూర్వము హాలెండుదేశము 30 లేక 40 గంటలు కొట్టగలుగు గడియారములకు ప్రసిద్ధమై యుండెను. ఇప్పు డిట్టి వాద్యగడియారములలో జాతీయ గీతములు కూడ కొన్ని పాశ్చాత్యదేశములలో మనోహరముగ ఆలపింపబడుచున్నవి.

లోలకమును ( పెండ్యులమ్) గడియారములో ప్రవేశపెట్టి, గడియారపు గమనము క్రమబద్ధముగ సాగునట్లు ప్రప్రథమముగ పరిశోధనము నెరపినవాడు గెలిలియో. కాని లోలకగడియారమును తయారుచేయుటలో అతడు కృతకృత్యుడు కాజాలక పోయెను. ఈ విజయము క్రిస్టియన్ హ్యూగెన్స్ అను మరియొక శాస్త్రవేత్తకు దక్కెను. గెలిలియో, హ్యూగెన్స్'లకు పూర్వమున గల గడియారములలో వలెనే ఈనాటి గడియారములలోను యంత్రభాగము లన్నియు అమర్పబడియున్నవి. అయితే లోలక గడియారమునకును తక్కిన వాటికిని గల భేద మొక్కటి మాత్రమే. లోలకగడియారములో 'విండ్ లాస్' గాని, 'బాలెన్స్' గాని ఉండదు. వాటి స్థానములో 'ఎస్కేవ్‌వీల్' ను పట్టుకొని బరువును త్వరగా క్రిందికి పోకుండునట్లు చేయు ఏర్పాటు ప్రవేశపెట్టబడినది. 'ఎస్కేవ్‌వీల్' నకు పైన 'యాంకర్' (anchor) అను పేరుతో వంగియున్న ఒక ప్లేటు ఉండును. తక్కిన చక్రము లన్నిటి క్రిందనుండి తిరిగెడి లోలకముతో సహా, ఈ యాంకర్ గూడ తిరుగును.

చిత్రము - 82

పటము - 6

పెండ్యులమ్ గడియారము పనిచేయువిధము

'యాంకర్ ' కు ఏర్పడి యున్న వంకీ (hook) ఎస్కేవ్ వీల్ యొక్క పళ్ళమధ్యపడినపుడు చక్రముకొలది కాలమాగును. కాని ఆ బరువు తన పనిని తాను నెరవేర్చి. వంకీని అవలకు నెట్టునట్లు చక్రమును ముందునకు త్రోయును. ఈ త్రోపిడివలన వంకీ పైకి వచ్చి, చక్రమందలి ఒక పన్ను పైకి పోవును. ఈ త్రోపిడివలన పెండ్యులము వెనుకకు ఊగును. యాంకర్‌కు గల కుడివంకీ మరల ఎస్కేవ్ వీలును ఆపును. ఈ యంత్రముల చలనము ఈ విధముగ ఎడతెగక జరుగుచునే యుండును. కుడివైపునుండి ఎడమ వైపునకు ఊగు పెండ్యులమ్ ప్రతి ఊపునకు చక్రమును ఒక పంటికంటె ఎక్కువగా తిరుగనియ్యదు. అందుచే వెండ్యులమ్ యొక్క ప్రతి ఊపు సమానకాలములో సాగిపోవును. దీనివలన మొత్తముగా యంత్రమంతయు నియమబద్ధముగా పనిచేయునట్లు పెండ్యులం సహాయపడగలదని స్పష్టమగును.

పూర్వము గడియారములు తయారు చేయుటకు వలయు సాంకేతికశాస్త్ర పరిజ్ఞాన మంతయు వంశపారంపర్యముగ సంక్రమించుచుండెను. తా మార్జించిన ఇట్టి పరిజ్ఞాన మంతటిని నిపుణులు కర్మాగారములలో గడియారములను వేరు వేరు ఫణతులలో తయారు చేయుట ద్వారా నూతన పరిశోధనలు జరిపి, మిక్కిలి నవీనములగు గడియారములను రూపొందింప గలిగెడివారు, ఆర్క్ రైట్, హ్యూగెన్స్, జెన్నీ, ఫుల్టన్ మొదలైన మేధావు లందరు ఇట్టివారే.

గోడగడియారములకు మాత్రమే పెండ్యులమ్ ఉండుననియు, పూర్వము పెద్ద గడియారములలో నున్న దోషములు పెండ్యులమ్ వలన తొలగిన వనియు, అందుచే గోడగడియారములు క్రమబద్ధముగ పనిచేయ నారంభించె ననియు విదిత మయినది. అయుతే, హ్యూగెన్స్, చేతి గడియారములలోను, జేబు గడియారములలోను గూడ పెండ్యులమును ఉపయోగించు పద్ధతిని కనిపెట్టెను. ఈ పెండ్యులమ్ ' ప్లైవీలు' వంటిది; ఒక్క వైపున ఉక్కుతో చేయబడిన స్ప్రింగ్ ఉండును. దానికి హెయిర్ స్ప్రింగు అమర్పబడి యుండును. హెయిర్ స్ప్రింగు యొక్క రెండవకొన కదలక స్థిరముగా నుండెడి ప్లేటుకు తాపటము చేయబడి యుండును.

చిత్రము - 83

పటము - 7

జేబు గడియారము పనిచేయువిధము

ప్లైవీలును కుడివైపునకుగాని, ఎడమవైపునకు గాని త్రిప్పి, తరువాత వదలినచో అది లోలకమువలె అటునిటు ఊగును. ఇదివరలో చెప్పియున్నట్లు, స్ప్రింగుకుగల లక్షణమే దీనికిని కలదు. పెద్ద గడియారములలోని పెండ్యులము, చిన్న గడియారములలోని "బాలెన్సువీలు" ఒకే పనిని నిర్వర్తించును. స్పైరల్ యొక్క ఊపులు, పెండ్యులం యొక్క ఊపుల వలెనే సరియైన కాలపరిమితిని కలిగియుండును. స్పైరల్ యొక్క ఈ విచిత్ర లక్షణమే గడియారములో పెండ్యులమునకు బదులుగా స్పైరల్ ను ఉపయోగింపవచ్చునను భావము హ్యూగెన్స్ మహాశయునకు స్ఫురించుటకు కారణ మయ్యెను.

గడియారమను ఈ చిన్నయంత్రము యొక్క స్వస్థతను ఎప్పటికప్పుడు ఒక కంట కనిపెట్టు చుండవలెను. సాధారణముగ దానిలో ఘటిల్లు స్వల్పక్రమ భంగములను మెకానిక్ సహాయము లేక యే మనము దిద్దుకొనవచ్చును. ఎంతటి విలువగల గడియారమైనను ఒక నిమిష మటో, ఒక నిమిష మిటో నడచుచుండునని అనుభవము వలన తెలియుచున్నది. కాని, ఈ గడియారముల కంటెను, ఓడలలో నావికు లుపయోగించు క్రోనో మీటరులకంటెను సూర్యుడు, నక్షత్రములే సరియైన కాలమును తెలుపు అంతరిక్ష గడియారములు. పూర్వమువలెనే ఇప్పుడును ప్రశాంతముగ పయనించు నక్షత్రములను బట్టియే, నక్షత్ర పరిశోధనాలయ శాస్త్రజ్ఞులు సరియయిన కాలనిర్ణయము చేయగలుగు చున్నారు.

ప్ర. రా. సు.