Jump to content

సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మూడవ సంపుటము/గజశాస్త్రము

వికీసోర్స్ నుండి

గజశాస్త్రము :


         'అశ్వపూర్వాం రథమధ్యాం
         హస్తినాద ప్రబోధినీం
         శ్రియందేవీ ముపహ్వయే.’

అని హస్తినాదములచే ప్రబోధింపబడుచున్నదిగా జగన్మాత శ్రీదేవి స్తుతింపబడినది. గోవు, అశ్వము, గజము వంటి కొన్ని జంతువులను భారతీయులు మంగళ ప్రదములనుగా భావించినారు. సేనాంగములుగా గజాశ్వముల యుపయోగ మానాడు విశేషముగా నుండెడిది. సంఘమునకు అనేక విధములుగా అవసరములైన యీ గజాశ్వాదులను గురించి ప్రత్యేకముగా కృషిసలిపి ప్రాచీనులు గ్రంథములను రచించియున్నారు.

గజోత్పత్తి గాథ : కశ్యపబ్రహ్మ భార్యలలో పదుమూడవది క్రోధ యనునామె. అమెకు పండ్రెండుగురు పుత్రికలు. వారిలో భద్రముద్రకు ఐరావతమను దిగ్గజ శ్రేష్ఠమును, శతయను నామెకు తక్కిన దిగ్గజములును ఉద్భవించినవట ! మాతంగియను నామెకు పుట్టిన గజములే మాతంగములు. ఏనుగులు, సామజము లనబడుట కొక హేతువు చెప్పబడినది. మతంగ మహర్షి పరమేశ్వర సంతుష్టికై సామగానము గావించుచుండెనట ! అట్టి సామలవలన పొడమినవగుటచేతనే గజములు సామజ వ్యవహారమును పొందినవి. తొలుత గజములు ఖేచరములై యుండినవి స్వర్గమున సుఖావాసము గావించు చుండిన అయ్యవి యేకారణముననో యొకముని కోపించి శపింపగా భూలోకమున పుట్టినవే భూచరములైనవట !

తొల్లి కృతయుగమున రాక్షసులు, దేవతలను బాధింప జొచ్చిరి. దానిచే ఈశ్వరునకు కోపము వచ్చెను. అందు వలన ముక్కంటి మోమున స్వేద ముద్భవించెను. ఆ స్వేదమునుండి యొక మహాగజ ముత్పన్నమయ్యెను. అదియే గణాధిపతి. వినోదకరమైన దానినిజూచి చతుర్దంతములు గల ఐరావతమును పరమేశ్వరుడు సృష్టించెను. దానిని జూచి జోడుగా శర్వాణి వినోదముచే భద్రయను ఒక హస్తినిని సృష్టించెను. ఆ గజదంపతులకు భద్రజాతి గజము లెన్నియో పుట్టినవి. అమరులు వాని సాయమున రాక్షసులను జయించిరి. త్రేతాయుగమున హతశేషులై యున్న రక్కసులు బ్రహ్మదేవుని సాయమును ప్రార్థించిరి. రక్కసులకు సాయము చేయవలసి వచ్చెనే యను మందమనస్సుతో ఆ చతుర్ముఖుడు మందజాతి గజములను సృష్టించి వారి కిచ్చెను.

గజవనములు : భారత దేశము గజములకు ప్రసిద్ధమైనది. గజములకు ఉత్పత్తిస్థానములైనవిగా ఎనిమిది వనములు పేర్కొనబడినవి.

1. ప్రాచ్యవనము : ఇది గంగానదినుండి హిమాద్రి వరకును, తూర్పున బ్రహ్మపుత్రమునకును, ఇటు ప్రయాగ వరకును వ్యాపించిన ప్రాంతము.

2. చేదికరూషకవనము (వేదిక రూపకము) : బ్రహ్మపుత్రానది, త్రిపురిప్రాంతము.

3. ఆంగరేయ వనము : గౌడ వంగ దేశస్థము.

4. కాళింగక వనము : వింధ్యాద్రి త్రికూటము, కళింగములను వ్యాపించి సముద్ర పర్యంతముగలది.

5. దాశార్ణక వనము : శ్రీశైల, దేవశైల సమయాద్రులను కలుపుకొని వ్యాపించినది.

6. అపరాంతక వనము : సహ్యపర్వతమునుండి భృగు కచ్ఛమువరకు నున్నది.

7. సౌరాష్ట్ర వనము : ద్వారవత్యవంతీ నగరముల మధ్యనున్న యడవి.

8. పంచనద వనము : హిమాలయావధిగా సింధునది ననుసరించి పశ్చిమ సముద్రమువరకును గలది.

వీనిలో కాళింగ, కారూషదశార్ణవనములు ఉత్తమములు. ప్రాచ్యాదులు మధ్యమములు. అపరాంత పంచానల (పంచనద) సౌరాష్ట్రములు అధమములు. కాళింగ వనము సర్వోత్తమ గజ స్థానముగ నిర్ణయింపబడినది.

కళింగ గజ లక్షణము : సూక్ష్మములయిన రోమములతో కూడిన, మెత్తని చర్మము, పిచ్చుకలవంటి కన్నులు గలవి. నిరంతరము మదస్రావముతో ఒప్పారునవి. దీనికి శౌర్యము, చురుకుదనము ఎక్కువ. మహాకాయము కలిగిన వీనితలయు, మెడయుకురుచగాను, బలసినదిగాను, ఉండును. తొండము నిడు పెక్కువ. తోక పొడవైనది. వెన్ను తిన్ననైనది. తేనెవన్నెదంతములతో, బిందుజాలకములతో ఈ కళింగ గజములు చూడముచ్చట గొలుపును. ఇవి పుట్టువుతో నేబలిష్ఠములగుటచే క్లేశసహనదక్షములై యుండును.

సౌరాష్ట్రగజ లక్షణము : విల్లువంగినట్లు వంగిన వీపును, పొట్టిదియగు మెడయు, ఎత్తైన తలయు, వక్షమును, రూక్షములైన చర్మము, కాళ్లు, గోళ్లు, చెవులును గలిగి నల్లనై యుండునవి సౌరాష్ట్ర వనోద్భూతములైన యేనుగులు. గోరోచనపు వన్నె కన్నులుగల యివి హీనసత్త్వములు. వీని మదస్రావము కూడ అత్యల్పము. ఉత్తమ గజములకు కళింగవనజాతము మచ్చుకాగా, అధమజాతికి సౌరాష్ట్ర వనోత్పన్నము ఉదాహరణ మగును. తక్కిన వనములలో బుట్టినవి మధ్యస్థితికి చెందునవి యని తేలును.

గజమానము : ఏడుమూరల యెత్తు, తొమ్మిదిమూరల నిడుపు, పదిమూరల వెడల్పు గల హస్తి సమప్రమాణ మైనది. అన్నింటను దీనికన్న ఒక మూరెడు ఎక్కువ ప్రమాణముగల గజమును అరాళ మందురు. అంతకన్న అధిక ప్రమాణము గలది అత్యరాళము. ఇది నింద్యమైన గజము. సమప్రమాణ గజముకంటె రెండు మూరలు తక్కువ ప్రమాణముగల దానిని కనిష్ఠగజమని వ్యవహరింతురు. కనిష్ఠహస్తికన్న తక్కువైనదానికి వామన మని పేరు. ఇదియు నింద్యగజమే.


గజ పరిమాణ వివరణ శ్లోకము.
'ముఖాదా పేచకం ధైర్ఘ్యం;
         పృష్ఠ పార్శ్వోద రాంత రాత్


ఆనాహ ఉచ్చ్రయః పాదా
         ద్విజ్ఞేయో యావదాసనమ్.'
            (శివతత్త్వ రత్నాకరము VII. 11.32)

ఏనుగు ముఖమునుండి తోక మొదటివరకును నిడుపు. పృష్ఠ పార్శ్వమునుండి ఉదరాంతరము వరకును వెడల్పు. పాదతలమునుండి మూపు వరకును ఎత్తు అని తెలిసికొనవలెను.

భద్రాది - గజభేదములు : భద్రగజములు, సమములు ఘనములునైన కక్షాండకోశములు, కూర్మములవంటి మడమలు, దళసరి గోళ్ళు, గోళ్ళనడుమ రోమములతో కూడిన మాంసగ్రంధులు, బలిష్ఠములైన పాదములు గలిగి, సమ విభక్తములైన యంగములతోను, తేనెవన్నె కన్నులతోను, దంతములతోను వెలయునవి. ఇవి అతికృశములును అతిపీనములునుగాక సమ ప్రమాణయుతములై, పద్మకశోభితములై, పర్వత సంచారశీలములై యొప్పుచుండును. భద్రగజారోహణ మిట్లు ప్రశంసింపబడినది.


'ఆరోహణం భద్రనామ్నో మాతంగస్య యశస్కరః
ఆయుష్కరం పాపహరం బల తేజో వివర్ధనమ్'.
                                               (శి. త. ర . VIII)

భద్రగజము నారోహించుట కీర్తిదాయకము; బలము తేజస్సు వృద్ధినొంది దీర్ఘాయువు గలుగును. పాపము తొలగునని భావము.

మందగజములు : తొండము, తల, చెవులు పెద్దవిగా నుండి, బానపొట్టగలిగి మిక్కిలి యెత్తైనవి మందగజములు. వీని కాయము పూర్వభాగమున వంగియుండును. లావైన దంతములతో కండలు తేలిన యవయవములతో, పసుపుపచ్చని కన్నులతో ఈ మందగజము లొప్పారును. ఇవి విశేషముగా నదీతీరములందుసంచరించునవి. ఘాతుకములు.

మృగ గజములు : ఈ జాతివి నిడుపైన గాత్రము, దంతములును, ప్రసన్నములైన చూపులును, నిద్దపు వన్నెయు, పెనువళులును కలిగియుండునవి. వీనికి ముఖమున దట్టములైన సిబ్బెము లుండును. పాదములును, మెడయు, తొండమును, సన్ననివిగాను, నోరు, పెదవులు, రోమములు, స్థూలములై కురుచలుగా నుండును. వీని వెన్ను చిన్నది. మోము చిన్నది, దంతములు సన్ననివి. అతి వక్రములైన యీ మృగగజములు వనములలో నివసించును.

సంకీర్ణజాతి గజములలో అష్టాదశభేదములు గలవని కాశ్యపులు వచించిరి. అన్యజంతువుల గతి, చేష్ట, స్వరము, బలములను అనుకరించుట యను గజచేష్టితమును అనూక మందురు. ఈ యనూకము శుభానూకము, నిందితా నూకము అని రెండు విధములు. శుభజంతువులయొక్క చేష్టాద్యనుకరణము శుభానూకము. నింద్య జంతువుల ననుకరించుట నిందితానూకము.

గజములు - దేవతాంశములు :

1. బ్రహ్మాంశకము : మల్లెపూలవలె తెల్లనై, చక్కనై యున్న సువ్యక్త బిందువులతో, ఎఱ్ఱనైన నేత్రాంశములతో, సుదృఢములైన దంతములతో విలసిల్లు దంతావళము బ్రహ్మాంశము గలది. దీనికి కక్ష, కంఠభాగములు సమములై యుండును. తల పెద్దది. ముఖమున ఎఱ్ఱ కలువ చాయయు, మృదురోమములును గలిగియుండు ఈ గజము ఉరుము సవ్వడికి హర్షించును. ఇది చిరకాలము మదస్రావియై యొప్పునది. పూజార్హమైన యీ బ్రహ్మాంశ గజమున్న వానికి విజయారోగ్య వంశాభివృద్ధ్యాదులగు అభ్యుదయములు గల్గును.

2. ఇంద్రాంశకము : ముఖమున బిందుజాలకము, వక్షమున వళులు కలిగి స్వస్తిక వర్ధమాన నంద్యావర్తాది రాజదేవభవనములకు సాటియై, ఎఱ్ఱకలువలవంటి కన్ను గవగలది ఇంద్రాంశజాతము. ఈ గజరాజము యుద్ధమున విజయ మిచ్చి యైశ్వర్యమును పెంపొందించును.

3. ధనదాంశకము : ఎఱ్ఱని పెదవులు, ఉసిరిక వన్నె నాలుక, కుసుమరంగు కనులు, అట్టివియే యగు దంతములును గలిగినది కుబేరుని యంశము గలది. ఇది రాజభవనము మందుండదగినది. ధనరత్న సమృద్ధి గల్గించునట్టిది.

4. వరుణాంతకము : నల్లని వన్నెమేను, పేరిన నేతి కాంతిగల కొమ్ములు, చక్కని మూపు, చక్కని తలయు వెలయ గంభీరాకృతి గల హస్తి వరుణాంశకము. ఇది మేఘము గర్జించునట్లు ఘీంకరించును. ప్రచురముగా మదము వర్షించును. పగతురును చెండాడి యజమానికి జయము గూర్చును. 5. చంద్రాంశకము : మెడలో త్రివళులును, తేనెవన్నె కన్నులును, మొగలిపూరంగు దంతములును, పెద్దదియు, ఎఱ్ఱనిదియు నగు తొండముయొక్క చివరిభాగమును, (పుష్కవము)సిబ్బెమును, తెల్లని మేనును గల కరీంద్రము చంద్రాంశసంజాతము. విజయప్రదము.

6. అగ్న్యంశకము : అగ్నిజ్వాలలవలె, తీష్ణములైన రోమములతోను, గోరోచనపు వర్ణముగల నేత్ర పుచ్ఛశుండాగ్రముల తోను దైవారునట్టిది అగ్న్యంశకమున ఉద్భవించిన యేనుగు. ఈ జాతి గజము యుద్ధమున సాక్షాత్తుగా అగ్నివంటిదియై విజృంభించి, శత్రుసేనలను భస్మము చేయును.

7. అగ్నిమరుదంశకము : ఉక్కువన్నె దేహము, ఎఱ్ఱని చెవులు, దీపశిఖలవంటి నఖములు, కండలుపట్టిన అవయవములుగల గజము అగ్నిమారుతాంశకము. ఉభయ దేవతాంశోద్భూత మైన యీ హస్తి అతి కోపము గలది. ఇది అంకుశమునకు లొంగదు.

8. విష్ణ్వంశకము: దంత మధ్యమునుండి క్రమముగా సన్నగిల్లు తొండము, సుగంధ శీకరములుగల నిశ్వాస వాయువులు, మేఘగర్జితమువంటి ఘీంకారము, కాటుకవలె నల్లనికాయము, మృదువులైన రోమములు, గుండ్రనివియు - ధృఢములైనవియు - పచ్చని మొగలి పూరేకుల వన్నెతో మెరయునవియు అగు దంతములు, పొడవై రోమవంతములైన పెదవులు, సమములైన గండ స్థలములు, చూడముచ్చటైన మోము, తేనెవన్నె కనులు, మృదువులై - దళములై - విస్తృతములై - భేదరహితములై, నరములు లేనివై యొప్పి తాళదుందుభిధ్వనులు వెలయించు కర్ణములు, సమున్నతములు-వ ర్తులములు - సమప్రమాణము గలవియు నగు కుంభములు, తిన్నని కురుచ మెడయు, ధృఢములు - క్రమముగా క్రిందికి పోనుపోను కృశములైన పాదములు, కూర్మాకారము గలిగి తెల్లనైన నఖములు (ఇరువదికాని పదునెనిమిదికాని) విశాలమైన వక్షము, ఎక్కిడిన వింటివంటి వెన్ను, పొడవైనదియు, సన్ననిదియు నగు తోక, శంఖచక్ర గదాకారములైన బిందువులు - వళులు - అనువిధముగా నున్న అవయవాది విశేషములతో ఎసలారు గజము విష్ణ్వంశ సంజాతము. ఈ మహాద్విపము పట్టాభిషేకాదులైన మహోత్సవములలో నుపయోగింపదగినది. సర్వశుభకార్యముల యందును పూజనీయము - సర్వాభ్యుదయ హేతువు.

సత్వభేదమున గజభేదములు : 1. సూక్ష్మాహారముననే తృప్తిపడునది. వళిరేఖలు లేనిది, ఊహగలది, చలింపనిది, శౌర్యముగలది, దేవసత్వ గజము.

2. తెలివి, క్రియాదక్షత, కాముకత్వము, మార్దవము, స్తబ్ధత, నృత్యాదులం దాసక్తి - అను గుణములు గలది గంధర్వ సత్వగజము.

3. నిచ్చలు నీటిలో మునుగ గోరునదియు, ఎల్లప్పుడును చిఱ్ఱుబుఱ్ఱు లాడునదియు, పిరికిదియు, తిండిపోతును అయినది బ్రాహ్మణ సత్వజాతము.

4. ఉదారము, శూరము, నిత్యోత్సాహి ద్వంద్వయుద్ధపటువు, భయరహితమునయిన గజము క్షత్రియ సత్వము.

5. నోటిలోను, దంతసంధియందును, ఆహారము దాచుకొను నదియు, ప్రజ్ఞగలదియు, దీర్ఘరోషియు వైశ్య సత్వద్విపము.

6. మలినాశయము, మూర్ఖస్వభావము గలిగి శిక్ష చేతనే వశపడునట్టిది శూద్రసత్వగజము. ఇది యుద్ధమున మిక్కిలి పరాక్రమించును.

7. విశ్వాసము లేనిదియు, క్రూరమైనదియు, కుటిలగతిగలదియు పొగరుబోతును అయినది సర్వసత్వకము.

8. వివేకహీనమై, ఉన్మార్గగామియై, పిచ్చిచేతలు చేయునది పిశాచసత్వ సంభవము.

9. రాత్రులయందు స్వైరవిహారము సల్పుచు, మానవుల చంపనుద్యమించుచు విశేష జవసత్వముగలది రాక్షస సత్వోత్పన్నము.

గజప్రకృతులు : వీనిలో దేవ, గంధర్వ, బ్రాహ్మణ, క్షత్రియ' సత్వజాతములు నాలుగును సత్వగుణ సంపన్నములుగా పరిగణింపబడినవి. ఇవి కఫప్రకృతులును, స్నిగ్ధములైయుండును. వైశ్య, శూద్ర సర్పసత్వజములయిన మూడును రాజసగుణ ప్రధానములు. ఇవి పిత్తప్రకృతులు. వీని శరీరము లెల్లప్పుడును వేడిగానుండును.

పిశాచ, రాక్షస సత్వోత్పన్నములు తామసభూయిష్ఠములు, వాతప్రకృతులు. కూటస్థగజములు – తదన్వయములు: 1. ఐరావతము, 2. పుండరీకము, 3. వామనము, 4. కుముదము, 5. అంజనము, 6. పుష్పదంతము, 7. సార్వభౌమము, 8. సుప్రతీకము.

ఈ యెనిమిది దిగ్గజములును కూటస్థగజములు. ఏ తద్వంశీయములైన గజముల స్వరూప స్వభావము లివి:

1. కేశలోమములును, వాలమును, పొత్తికడుపును, నేత్రములును తెల్లగానున్న కుంభి ఐరావతజాతిది.

2. విశేషముగా తామరకొలకులలో విహరింప నభిలషించునదియు, యుద్ధకౌశలము గలదియు, స్థూల శీర్షయుతము నైనదియు పుండరీకవంశజము.

3. అగ్నివర్ణము, బంగారువన్నె కన్నులు గలది, వేగవంతమై జలాసక్తి మిక్కుటముగా గలది వామనవంశ సముద్భూతము. ఇది ఆయతము, విస్తృతము, వామనము అయిన కాయముతో ఒప్పియుండును.

4. స్థూలమై తెల్లకలువ వన్నెగల తనువు, ఎఱ్ఱనివియు తీక్ష్ణములైనవియు నగు కనులు, నల్లనిదియు - వెడల్పై నదియు నగు శుండాగ్రము గలది కుముదజాతి గజము.

5. చిక్కని రోమములు గల పుచ్ఛము, స్నిగ్ధగండములు, తెల్లని పొట్ట, తెల్లని తొండము, ఉన్నతములైనవియు - స్థూలము లైనవియు అగు పిరుదులు గలది అంజనాన్వయసంభవము.

6. స్థూలములైన బిందుజాలకమువెలయు అంసభాగములతో, కృష్ణ కేశములతో, కృశోదరముతో, సుందర దేహముతో ఎసగునది పుష్పదంత వంశీయము.

7. చెవులు - వృష్ఠభాగము తెల్లనై, చెవులు పొట్టివై, తొండము కుఱుచయై కాయము స్థూలమై యున్నది సార్వభౌమము. ఇది తఱచుగా కరిణీయూధమునకు నాయకత్వము వహించి క్రుమ్మరుచుండును.

8. నల్లకలువ వన్నెగల దేహము, పావురపు రంగు కన్నులు, చిన్న రోమములుగలిగి ప్రజ్ఞాశాలియు, పరాక్రవంతమునై నది సుప్రతీక వంశోత్పన్నము.

అన్వర్థ వేద్యాదులు - గజ భేదములు : స్వభావమును బట్టి గజములలో వర్గచతుష్టయ మేర్పడినది. అన్వర్థ వేది, గంభీరవేది, ఉత్తానవేది, ప్రత్యర్థవేది యని ఇవి వర్గీకరింప బడినవి. వీనిలో :

1. అన్వర్థవేది : శౌర్యము, ధైర్యము, పాటవము, వినయముగలిగి. భయస్థానములను గుర్తించి మెలగు గజరాజము అన్వర్థ వేది.

2. గంభీరవేది : చెడు స్వభావము, సోమరితనము, నిద్రాళుత, మూఢత యను యవగుణములకు తావలమగు దంతావళము -గంభీర వేది

సుప్రసిద్ధ వ్యాఖ్యాత మల్లినాథసూరి రఘువంశ వ్యాఖ్యానములో (IV. 39) రాజపుత్రీయ, గజచర్మీయ గ్రంథములలోని వనుచు గంభీరవేది గజస్వరూప నిరూపకములగు ఈ క్రింది శ్లోకముల నుదాహరించెను :


'త్వగ్భేదా, చ్ఛ్రోణితస్రావా, న్మాంసస్య కథనాదపి
ఆత్మానం యోనజానాతి సస్యాద్గంభీర వేదితా'.
                                          (రాజపుత్రీయే).
'చిరకాలేనయో వేత్తి శిక్షాం పరిచితామపి
గంభీరవేదీ విజ్ఞేయః సగజో గజవేదిభిః'.
                                          (మృగచర్మయే).

చర్మము తెగినను, నెత్తురు కారినను, మాంసము కోసినను, ఏది తనను గుర్తింపదో యది గంభీరవేది—తనకు చిరాభ్యస్తమైన శిక్షనుకూడ ఏది వెంటనే గ్రహింపలేదో యది గంభీరవేది అని భావము.

3. ఉత్తానవేది : చండత్వము, చాపల్యము, తొందరపాటు, కాముకత్వము, శౌర్యముగలది ఉత్తానవేది.

4. ప్రత్యర్థవేది : వారించిన కొలదియు వడిగా పరుగెత్తునదియు, తనకు ప్రియమైన హస్తి వెంటబడిపోవునదియు నగు నది ప్రత్యర్థవేది. ఇది మిశ్రగజము.

5. గంధ గజము : గజజాతులలో సర్వశ్రేష్ఠమైనది గంధగజము. ఆరోగ్యము, పూర్ణయౌవనముగల కరిణియందు అట్టిదియే యగు గజమునకు వసంత కాలమున ఉద్భవించినది గంధగజమగును. ఈ గజరాజు యొక్క మూత్ర స్వేదపురీషములు తేనెవాసన గలిగియుండును. దేని మదమూత్రాదులను మూచూచి అన్యగజములు మత్తిల్లునో యది గంధగజమని తెలియదగును. ఇట్టి గంధగజముయొక్క మదమూత్రాదులను వాసన చూచి ఏ యేనుగు కోపదీప్తమగునో అదియు గంధగజ జాతిదియే యగును. దూరముననున్న కరుల మదవాసననుబట్టి మఱియొక దిక్కుగా పోవుచున్న తాను మరలి ఆ మద వాసనలు వచ్చువైపునకు పరుగెత్తు హస్తి గంధగజ మని యెరుంగునది. ఈ జాతి ద్విపములు సర్వఋతువుల యందును మత్తిల్లి యుండును. ఇట్టి గంధగజము లెంతయు శుభకరములు.

గజదేహలక్షణములు : ముంగాళ్ళు, శిరస్సు, వ్యక్తములై యుండుట, వక్షస్సు సమున్నతమై యుండుట, దంతములు బంగారు వన్నెకలిగి యుండుట, నేత్రములు తేనెవన్నెగా గాని, గోరోచనపు వన్నెగాగాని యుండుట, ఆరోహస్థలము విడిగా తేలియుండుట, కుక్షి, పార్శ్వములు నిండుగా నుండుట, వృష్ఠభాగము విపులముగానుండుట, సంధులు సమముగా నుండుట, ఛాయ స్నిగ్ధముగా నుండుట, నిడుపుదనము, వైశాల్యము, చక్కదనము అనునవి గజదేహమున కుండవలసిన గుణములు.

అష్టాంగములు : తొండము, ముఖము, దంతములు, నేత్రములు, శిరస్సు, చెవులు, మెడ, వెనుక భాగము ఇవి గజముల అష్టాంగములు .

ఉపాంగములు : పెదవులు, నడుము, పొట్ట, బొడ్డు, అండములు, తోక మొదలు, అఱకాళ్ళు, గోళ్ళు, - ఇవి గజముల ఉపాంగములు.

ప్రత్యంగము : వ్రేళ్ళు, తొండము తుదిభాగము, కుంభస్థలము, మస్తకము, కేసరము (1) మణి(?) పాదాసనము ఇవి ప్రత్యంగములు.

అంగాధిష్ఠానదేవతలు : 1. తల - బ్రహ్మ; 2. నుదురు - కుమారస్వామి; 3. మస్తకము - వీరభద్రుడు; 4. నేత్రములు - సూర్యచంద్రులు; 5. నాసిక - విఘ్నేశ్వరుడు; 6. శ్వాసము - రుద్రులు; 7. ముఖము భాగ్యలక్ష్మి; 8. దంతద్వయము - వీరలక్ష్మి ; 9. దంతాగ్రములు - యముడు: 10. కపోలము - నృసింహస్వామి; 11. పాదములు - వేదములు ; 12 తొండము - శ్రీమహావిష్ణువు; 13. నఖాగ్రము-అష్టమిచంద్రుడు; 14. వేగము - మారుతము; 15. నాభి - అగ్ని; 16. కుక్షి - బ్రహ్మ; 17. మేడ్రము - ప్రజాపతి; 18. అన్యావయవములు - దిక్పాలకులు,

గజాయుఃప్రమాణము : గజముల సంపూర్ణాయుఃప్రమాణము నూటయిరువది సంవత్సరములని శాస్త్రజ్ఞులు నిశ్చయము. సర్వలక్షణ సంపన్నములైన భద్రజాతి సంపన్నములకే యీ సంపూర్ణాయుషు జీవనభాగ్యము గలుగును. మందజాతిహస్తి యెనుబదియేండ్లును, మృగజాతి కుంభి నలువదియేండ్లును, ఆయుఃప్రమాణము గలవియై యుండును. హస్తి జీవితప్రమాణము వాని దేహముల యందున్న క్షేత్రము లనబడు లక్షణములనుబట్టి యేర్పడును. ఇట్టి గజదేహక్షేత్ర పరిజ్ఞానము వాని యాయుః ప్రమాణమును తెలిసికొనుటకే గాక, తత్పోషణ చికిత్సాదులకును, మిక్కిలి యవసరమని హరిహర చతురంగ గ్రంథమున నిట్లు చెప్పబడినది :


'ప్రదేశాన్ గజదేశస్థాన్ యోనజానాతి తత్త్వతః
లక్షణం న సజానాతి నాపివేత్తి చికిత్సితమ్'.
                           (గజపరిచ్చేదము 159 శ్లో:)

ఈ క్షేత్రములు పండ్రెండు. 1. తొండము, 2. ముఖము, 3. దంతయుగ్మము, 4. శిరస్సు, 5. నేత్రద్వయము, 6. కర్ణ యుగళము, 7. మెడ, 8. ముందటి కాళ్ళభాగము, 9. వక్షము, 10. వెనుకటి కాళ్లభాగము, 11. మేడ్రము, 12. తక్కినకాయము. ప్రథమ క్షేత్రమయిన తొండము, లక్షణానుగుణముగా లేదేని ఆయుఃప్రమాణములో పది సంవత్సరములు తగ్గినట్లు తెలిసికొనవచ్చును. అనగా ఇట్టి భద్రజాతి గజము నూటపది సంవత్సరములు మాత్రమే జీవించునని భావము. ఏవైనను రెండు క్షేత్రములలో లోపముండెనేని యట్టిది నూఱేండ్లు జీవించును. ఇట్లు హీనమైన లక్షణము ఒక్కొక్క దానికిని పదేండ్ల చొప్పున తగ్గించి గజాయుఃప్రమాణమును నిర్ణయించుకొనవలెను. మందమృగజాతి హయముల విషయములో ఆయుఃప్రమాణమును పండ్రెండుభాగములు చేసి, హీనక్షేత్ర మొక్కొక్క దానికి ఆ పండ్రెండవ భాగమునకు వచ్చిన సంవత్సరములను ఆయుఃప్రమాణములను తగ్గించి శేషించిన మొత్తమునే ఆయుఃప్రమాణముగా నిర్ణయించి చెప్పవలెనని గోదావర మిశ్రుఁడు నుడివెను. (హ. చతు. గజప 11-12). ఈ ఆయుఃప్రమాణ లక్షణములు, బాహ్యములనియు, అభ్యంతరములనియు రెండువిధములుగా నుండవట! అభ్యంతర లక్షణజ్ఞానమున యోగులుమాత్రమే సమర్థులు. తక్కినవారు పూర్వోక్తబాహ్య లక్షణములను బట్టియే ఆయుఃప్రమాణము నిర్ణయింతురనియు గోదావరమిశ్రుడు వ్రాసెను. గజవయోభేదములు : పది సంవత్సరములనుండి పదునాల్గు సంవత్సరముల ప్రాయమువరకు గజమునకు ఉత్తమ వయస్సు. అటనుండి డెబ్బదవ యేడు వరకు అధమ వయస్సు. డెబ్బదికి పైబడిన కరులు వాహనాది క్రియల వేనికిని పనికిరావు. శిక్షణాదిక్రియల కన్నింటికి ప్రథమవయస్సే యోగ్యమైనది.

మదము : గజమునకు, సహజము, శోభావహము అయిన భూషణము మదమే. కావున నే


'సద్రత్నైశ్చామరై శ్చాపినతథా జాయతేరుచిః
మదపట్ట కృతాశోభాయథాభవతి దంతినః
                                 (హ. చతు 55 పుట)

అన్నారు. మద, రేఖవలన గలిగిన శోభ రత్నహారములచే గాని చామరములచేగాని కలుగదు.


'మదహీనా నధావంతి నయుధ్యంతే మతంగజా'
                                               (మా II 4 – 6)

అని సోమేశ్వరుడు చెప్పెను. మదోత్పత్తి ఇట్లు వర్ణింపబడినది.


కఫమేదః పిత్త రక్త మాంపై రన్యోన్యమూర్ఛితై 8
ఈశ్వరేణ పరామృష్టో, జాయతే దంతినాం మదః
                                    (హ. చతు. 55 పుట)

కఫము, కొవ్వు, పిత్తము, రక్తము, మాంసములు అన్యోన్య ఘట్టితములై మదముగా ఏర్పడును. గండస్థలములు, మేఢ్రము, ముఖము, కన్నులు అనునవి మదస్రావస్థానములు. మదవాహకములైన నాడులు మొత్తము ఏబది; వీనిలో పది నేత్రగతములు, పది గండస్థల గతములు. మేఢ్రగతములు పదునైదు. ముఖగతములు పదునైదు. ఏడాకుల యరటి, మామిడి - మొగలి, నల్లకలువ, తామర అను నీ పువ్వులయు, చందనము, ఏలకి, అగురు అనువాని పరిమళముతో ఒప్పు మదము శ్రేష్ఠమును, శుభకరమును అగును. పురీషము, మూత్రము, రక్తము, వెల్లుల్లి, చెమ్మట, శుక్రము మొదలైనవాని వాసన కనిష్ఠము. అశుభకరము.

మదావస్థలు : ఇవి సప్తవిధములు. మృగజాతి గజములకు మూడు, మందజాతి వానికి అయిదు, భద్రజాతికి ఏడును మదావస్థలు కలుగును. 1. రోమాంచము గల గండములతో అరమోడ్చిన కనులతో నుండి నిచ్చలు తొండముతో గండములను తాకుచు, మూచుచు నుండు గజము ప్రథమ మదావస్థలో నున్నదని గ్రహింపనగును. 2. శీకరములు వర్షించు కరముతో, గండములందు మాత్రము స్రవించు మదధారలతో వెలయుచు చిఱ్ఱుబుఱ్ఱులాడు చుండునది ద్వితీయావస్థాగతము. 3. గండములు, మేఢ్రము అను నవయవములనుండి మదము స్రవింప పలుమారు ఆవలించుచుండుట తృతీయావస్థకు గుర్తు. 4. సత్వశక్తు లధికములై అన్యకుంజరములను చూచుటచేతనే కోపోద్రిక్తమై మదపరిమళముచే దిక్కులను వాసిల్ల జేయునట్టిది చతుర్థావస్థకు వచ్చినది. 5. మదధార లతిశయింప, రోషము హెచ్చ, గతివేగ మినుమడింప, పదదంతక రాఘాతములు చేయుచు, అంకుశమునకుగూడ లొంగని స్థితిలో నున్నది పంచమావస్థాగతము 6. ధనుష్టంకారనాదము, అన్యగజఘంటాధ్వని, అశ్వఖురఘట్టన శబ్దము వినబడగానే, కోపంపు పెల్లున పరువులు పెట్టునదియు, కరపాదాఘాతములతో నేలను మట్టునదియు, ప్రాకార భంజనము గావించుకొని పోవునదియు, షష్ఠావస్థకు చేరిన గజము. 7. కటాది మదస్థానము లన్నింటి నుండియు గురియు మదధారలచే నేలను తడుపునదియు, శరాది నిశితాయుధాఘాతములను గూడ లెక్క సేయక తిరుగునదియు, ఏ జంతువునకు భయపడనిదియు, ఏ శబ్దమును వినిపించుకొననిదియు, మన్నుమిన్ను కాననిదియు, అతివేగమున దిక్కులకు పారునదియు అయిన గజము సప్తమావస్థ కెక్కినదని గుర్తింపదగును. ఈ మహామదేభము యొక్క మదపరిమళమును దవ్వులనుండి ఆఘ్రాణించి అన్యగజములు భయకంపితములై ఓసరిల్లును.

మదస్రావస్థానము లెనిమిది 'అన్నా రే' భీష్మ పర్వములో వ్యాసభగవానుడు 'కుంజరేణ ప్రభిన్నేన సప్త ధాస్ర వతా మదమ్' అని మదస్థానములను సప్తసంఖ్యాకములనుగా చెప్పెనుగదా! మరి యది యెట్లు? అని సందేహింపనక్కర లేదు. గండద్వయము, నయనద్వయము, మేఢ్రము, ముఖము, తుండమును నాసారంధ్రద్వయమునుబట్టి ద్విస్థానికముగా గ్రహించిన సమన్వయమగును.

మదక్షీణత : అన్యమదేభములు క్రుమ్ముటవలనను, సారహీనమైన ఆహారమువలనను, అతిదూరము నడచుట వలనను, ఉల్కాపాతదావాగ్నితాపముల వలనను, సింహా దులవలని భీతివలనను, గజములకు మదక్షీణత సంభవించును. మదము క్షీణించిన మాతంగ మిట్లుండును. కనుల చాయ గోల్పోవును. తొండము నేలవాల్చును, ఏవి తనకు వెరచుచుండెనో, ఆ జంతువులవలననే తాను వెరచును. మేను కొంత రేగియుండును. తల యాడింపదు. కరిణిని డాయదు. స్తంభములతో ఆడదు, గండములను ఆఘ్రాణింపదు. కర్ణకటాదులను ఒరయదు. అన్యగజముల మూత్రపురీషాదులను మూచూడదు. అనాయాసముగా మావటివానికి లొంగిపోవును. చురుకుదనములేక నిద్రమత్తు గలదిగా కనబడును.

గజచికిత్స: మదము క్షీణించిన నాగములకు తిరిగి మదముకలుగుటకు మానసోల్లాసములో పెక్కు విధములైన బృంహణౌషధములు చెప్పబడినవి. (చూ. మానసోల్లాసము. 192-194 పుటలు) గజములకు వచ్చు వివిధ రోగములకు చికిత్సాక్రమము, ఔషధప్రయోగ వివరణ పూర్వకముగా అగ్నిపురాణమున (287 అధ్యా.) నిరూపితమైనది. ఇందు చటకాపురీషాది నేత్రాంజనములు, ధూపములుకూడ చెప్పబడినవి. అగ్నిపురాణములోనే (291 అధ్యా.) ప్రత్యేకముగా గజ శాంతివిధానము లిఖింపబడినది. ఈ శాంతి విధానమును శాలిహోత్రుడు చెప్పినట్లున్నది. 'గజశాంతిం ప్రవక్ష్యామి గజరోగ విమర్దనీమ్' అనుటచే గజ చికిత్సలో పూర్వులు ద్రవ్యౌషధములనే గాక మంత్రాగదములనుగూడ వినియోగించుచుండిరని తెలియుచున్నది.

సప్తశోభలు : బలవర్ధకములును, మదహేతుకములును అను ఔషధములను సేవింపజేయుటచే, బృంహితము లైన గజములకు ఏడువిధములగు శోభలు పొడమును. (1) సంజాతరుధిర (2) ప్రతిచ్ఛన్న (3) పక్షలేపని (4) వరిష్ఠ (5) సమకల్ప (6) వ్యతికేర్ణిక (7) ద్రోణిక. ఇవి సప్తశోభలు. ఆయాశోభలను గురించి గజస్వరూప చేష్టాదులలో గలుగు మార్పులును గ్రంథ కారులచే వర్ణితములైనవి.

గజగమనరీతులు : మానవునకు గాని, గజమునకుగాని తేలికగా పాదముల నుంచుచు దూరదూరముగా అడుగులు వేయుచు, గాత్రవిక్షేప మెక్కువ కలుగని సమ వేగముతోడి గమనము యుక్తమైనది. ఆబోతు, సింహము నడకవంటి నడక శుభమైనది. ఆయాసపూర్వకముగా గాత్రమును కదలించుచు ఎత్తుపల్లముల యందు అల్ప క్రమముగలిగి, మందవేగముతోగూడి, నక్కయొక్కయు, గాడిద యొక్కయు నడకను బోలియుండు గజగమనము అధమమయినది. పది యడుగుల దూరమునుండి తాను లేచినపుడే లేచి మానవవేగముతో పరుగిడు గజమును ఏ గజము పరుగిడకుండ, ఏబదియడుగులు వేసి పట్టుకొన గలదో ఆ గజ వేగము ఉత్తమ మైనది. ఏడడుగుల దూరము నుండి కడువేగముతో పరుగిడు మానవుని నూరడుగులు వేసి పట్టుకోగలిగినచో, ఆ గజ వేగము మధ్యమము. అయిదడుగుల దూరమున నుండి అతి జవమున పరుగిడు మనుష్యుని నూటయేబది యడుగులు వైచి తాకగల్గినట్టి కరివేగము అధమము. ఇట్లే యింత సమయములో ఇంతదూరము నడచునది యిట్టిది అని శాస్త్రకారులు గజవేగమును నిర్ధారణము చేసియున్నారు.

గజబలసత్వములు – పరీక్ష : ఎంత మంచిలక్షణములు గలది యైనను, బలహీనమైనచో అట్టి కరివలన ప్రయోజన మేమి? కావుననే 'గుణే భ్యోపి బలం శ్రేష్ఠం తత్పరక్షేత పండితః' అన్నారు గజశాస్త్ర కోవిదులు.

బలము పరీక్ష : ఏది 95 మణుగుల (స్వర్ణతామ్రరజతములలో ఒకదానిని) బరువును వేసికొని యెనుబదిమైళ్ళ దూరమును అనాయాసముగా నడచిపోవునో అది యుత్తమబలసమన్వితమగు కుంభి యనవలెను. ఏది డెబ్బది మూడు మణుగుల బరువు మోయుచు, ఏబదియారుమైళ్లు శ్రమలేక నడచిపోవునో యది మధ్యమబలయుతము. ఏబదిరెండు మణుగుల బరువుకట్టుకొని, నలుబదిమైళ్ళు అక్లేశముగా ఏది నడచిపోవునో యది నీచబలయుత గజమని గుర్తింపదగును. గజబలపరీక్షలో నితర విధానములును అవలంబింపబడును. 24 మూరల పొడవు - నాలుగు మూరల చుట్టుకొలతగల చండ్ర, యేగి, మద్ది వంటి దారుస్తంభమును అనాయాసముగా విరిచి వేయగల యేనుగుయొక్క బలము ఉత్తమమైనదిగా నిర్ణయింప బడును. మధ్య మాధమ బలములను ఇట్లే పరీక్షింపనగును.

సత్వపరీక్ష : దేహగురుత్వాదు లన్నింటిలో సత్వమే ప్రధానమైనది.


'గురుత్వం రూపతః శ్రేష్ఠంగురుత్వాదధికం బలమ్
బలాదప్యధికం సత్వం 'తస్మాత్సత్వం నిరూపయేత్'

(హ. చతు. 52 పు.)

అని శాస్త్రజ్ఞుల వాక్యము.

అయిన ఈ సత్వస్వరూపమేమి? యని ప్రశ్నించుకొని దానిని నిర్వచించినారు.


'శుద్ధస్ఫటిక సంకాశం, సత్యం హృది శరీరిణామ్
దుర్లక్షం విద్యతే సమ్యగుపాయైస్తత్తు లక్ష యేత్'

(హ. చతు. 52 పు.)

శరీరధారుల హృదయములో వెలికి కనుపింపక శుద్ధ స్ఫటికమువలె సత్వముండును. దానిని ఉపాయములచే గుర్తింపవలెను.

1. గజశ్రేణికవచముగా గల్గి భీషణాయుధోద్ధతమైన పదాత్యశ్వసమూహమును నిర్భయముగా తాకి చెల్లా చెదరు కావించు గజరాజు ఉత్తమ సత్వసంపన్నమనబడును. శార్దూలాది ఘాతుకములను ధైర్యముతో ముట్టి, కొమ్ములతో క్రుమ్మి చంపునట్టిది సత్వవంతము. నాలుకలు చాచి, కార్చిచ్చు చుట్టుకొని వచ్చుచున్నను చెదరక బెదరక అడవిలో క్రుమ్మరు ఏనుగు మేలిసత్తువకలది.

2. ఆరోహకు డధిరోహించి, బలాత్కరించి నడుపగా ఘీంకరించుచు, సంకోచించుచు ఇష్టములేనిదైనను తప్ప దురా దైవమా యన్నట్లు జాలిగొలుప మెల్ల మెల్లగా అడుగు లిడుచు పోవునది మధ్యమ సత్వము గల హస్తి.

3. మావటీడు ప్రేరేపింపగా ఏది దిక్కు అన్నట్లు ప్రక్కలుచూచుచు, సీత్కారములు చేయుచు, వెరపు దోపు చూపులతో ఎదిరి యేనుగును కాంచుచు, పరబలము నెల్ల ఒక పెద్ద మంటగా తలచి, తలకునట్టిది అధమసత్వము

దంతాఘాతములు : మహావీరులకు ధనుర్వేదాదిపరిజ్ఞాన మెంత యవసరమో, యోద్ధృగజములకు దంతాఘాత శిక్షణమంత యవసరము. దంతాఘాత శిక్షితము కాని హస్తిరూపబలసత్వములలో ఎంత యుత్తమమైనదైనను యుద్ధసమయమున కొరగాని కొయ్యగా తేలును.


'బలసత్వ గురుత్వాది గుణయుక్తోపి వారణః
దంతాఘాతాన్న జానాతి యో రణేనిష్ఫలోహిసః

(హ. చతు. 54 పు.)

అని ప్రమాణము. దంతాఘాతము లివి :

1. సంపాతము (సంఘాతము) 2. ఉల్లేఖము (లేఖః) 3. పరిఖేలము (పరిలేఖము) 4. కర్తరీఘాతము 5. తలఘాతము 6. పార్శ్వఘాతము 7. ఆరాఘాతము 8. సూచీఘాతము 9. తాడితఘాతము 10. సంధితా ఘాతము. అజాఘాత నిర్ఘాతాదులు మరి నాలుగు కలిపి మొత్తము పదునాల్గు దంతాఘాతములను సోమేశ్వర మహీపాలుడు చెప్పెను. (మానసో 209-10) వీనిలో కొన్నింటిని గ్రంథకర్త లిట్లు వివరించిరి. ప్రతి దంతిదంతముల క్రిందిభాగమున గాని, ముఖముమీద గాని చేయు దంతఘాతమును తలాఘాతమందురు. తలనడ్డము త్రిప్పి కొట్టు కొముదెబ్బ పరిఖేలము. కొమ్ములను నిటారుగా ఎత్తి దండముతో కొట్టినట్లు కొట్టుట ఉల్లేఖము. శత్రు గజముఖమును తన దంతయుగ్మము నడుమ ఇరికించుకొని యిటునటు త్రిప్పిత్రిప్పి పీడించుటయే కర్తరీఘాతము. తన దంతములతో ఎదిరి యేనుగుదంతములు ముక్కలు ముక్కలై పడునట్లు కొట్టుట తాడితాఘాతము. ముందరి కాళ్ళు పైకెత్తి శత్రుగజముపై, సింహము హస్తిపై దూకినట్లు దూకి, రేగిన యలుకతో చచ్చునట్లు దెబ్బపై దెబ్బగా వేయు వ్రేటులే సంధితాఘాతము. కట్టెదుట నిలిచి ప్రతి గజముఖమునే లక్ష్యముచేసి పొడుచుట ఆరాఘాతము. ఒక దంతముతోనే కొట్టుట ప్రతిఘాతము . ఒక కొమ్ముతో తొండము నడుమ గ్రుచ్చుకొనునట్లు పొడుచుట సూచీఘాతము. తిర్యగ్దంతప్రహారముచేయు దానిని పరిణతగజ మందురట! 'ఆషాఢస్య ప్రథమదివ సే మేఘమాశ్లిష్టసానుం వప్రక్రీడాపరిణత గజప్రేక్షణేయందదర్శ' (మే. సం. 1 2 శ్లో.) రామగిరి సానువులనున్న మేఘము వప్రక్రీడలాడు పరిణతగజమువలె ప్రేక్షణీయముగా నున్న దన్న భావమిచ్చు కాళిదాస మహాకవి వాక్యముననున్న పరిణతగజ శబ్దమును వివరించుచు, మల్లి నాధసూరి'పరిణతః తిర్యగ్దంత ప్రహారీ' అని చెప్పి తన వివరణమునకు ఉపష్టంభకముగా 'తిర్యగ్దంత ప్రహారీతు గజఃపరిణతో మతః' (తిర్యగ్దంత ప్రహారముచేయు గజము పరిణత మనబడును ) అను హలాయుధ నిఘంటు వాక్యమును ప్రదర్శించెను.

గజములకు సాధారణముగా ప్రహరణ సాధనములైన దంతములు రెండే యుండును గాని అట్టివి నాలుగు దంతములు గల గజజాతులు కూడ ఉన్నట్లు పూర్వగాథలలో

గజశాస్త్రమునందు వర్ణితములు, చిత్రితములు అయిన నాలుగుదంతములు, ఆరుదంతములుగల దిగ్గజములు

ఈ పక్షయుక్త గజములు పురాణకల్పితములని కొందరు అభిప్రాయపడవచ్చును. అయితే స్థూలకాయముగల జంతువులకు జీవశాస్త్ర రీత్యా మొదట మొదట రెక్కలుండుచుండెననియు, పరిణామదశలో రెక్కలు రాలిపోసాగెననియు ప్రకృతిశాస్త్రజ్ఞులు నిరూపించియున్నారు. ఇక రెండు, మూడు జతల దంతములుగల గజములున్న వనుటకును, ఇటీవల (బెల్జియం) కాంగోలో రెండు జతల దంతములుగల గజము కనబడుటయు, దానిని జంపియుండుటయు దృష్టాంతముగా నుండగలదు. ఇవి ఊహాజనితములు కావనుట నిక్కము. విందుము. కొంతకాలము క్రిందట కాంగోలో వేటలో పట్టుబడిన యొక గజమునకు నాలుగు ప్రహరణ దంతము లున్నవని పత్రికలలో వార్త వచ్చెను. అట్టి చతుర్దంత దంతులను గురించి గజశాస్త్రకారు లేమియు వ్రాయలేదు.

గజసాముద్రికము : 1. గజావయవముల శుభాశుభ లక్షణములు :

తొండము : విశాలమైనదియు, గుండ్రముగా నున్నదియు, చక్కని బిందుజాలము గలదియు, చిగురుటాకువలె మృదువైనదియు, బంగారు వన్నెగలిగి సన్ననై యున్న రోమములు గలదియు, పరిమళించు నిశ్వాస వాయువు గలదియు స్రోతోయుతమైన పుష్కరము గలదియు, పొడవైన తదగ్రాంగుళిగలదియు నగు తొండము శుభకరమైనది.

దంతములు : బంగారము, తేనె, మొగలిపూవు, నేయి, చంద్రుడు. జాజి అనువాని వన్నెగలిగి, గీట్లు లేనివై, పృథులములు, సమములు, దృఢములు, స్థూలములు, ఉన్నతములును అయి, దక్షిణదిక్కున ఎత్తై, ఛేదింపగా చక్రవజ్రబాణశూలదండాది ముద్రలతోగూడి డొల్లలు గానట్టి దంతములు ప్రశస్తములు.

కనులు : నీలములు, దీర్ఘములు, మృదువులు నగు రోమములు గల రెప్పలతో, రక్త, కృష్ణ, శుక్లవర్ణములు గల మండలములతో గూడి విశాలములై చూడచక్కనైన నేత్రములు శుభదములు.

చెవులు : మృదువులై, వర్తులములై, బిందుసందోహ యుతములై, విస్తృతములై, లంబమానములై, రేఖలు లేనివై, ఛిద్రములులేని యంచులుగలవై ప్రకాశించు చూళికలవై (కర్ణమూలములు) దుందుభిధ్వనులతో వెలయునట్టి కర్ణములు మంగళాకరములు.

శిరస్సు : ఉన్నతము, రోమసహితము, ఉత్తమ కుంభస్థలయుతము, సుందర నేత్రయుగ్మశోభితము అగు గజ మస్తకము భవ్యము.

మెడ : సన్ననిదియు, పొడవైనదియు, వ్రేలాడు గళ చర్మము గలదియు అగు మెడ శుభమైనదికాదు. దీనికి భిన్నమైనది శుభకరము.

వెన్ను : అరటియాకు వెన్ను కాడవలె శోభిల్లుచు, ధనుర్దండాకారమున వెలయుచు, మాంసలమై యుండు వంశాదండము క్షేమకారి.

మూపు : విశాలమై, తిన్ననై పుష్టమైయుండు స్కంధము కల్యాణప్రదము.

రోమములు : చిక్కువడకుండుట, స్పష్టముగా కనిపించుట, శరీరమున వాలియుండకుండుట, జంటలుగా మొలవకుండుట, సన్నగా నుండుట అనునవి ఉత్తమ రోమగుణములు. ముఖమున, వీపున, చెవులయందు, కుక్షిని, అండములపైన, వాలమూలమున రక్తవర్ణ రోమము లున్న గజములు అశుభములు.

నఖములు : తెల్లనివియు, స్నిగ్ధములైనవియు, అర్థచంద్రాకారములు గలిగినవియు అగు గోళ్ళు ప్రశస్తములు. అన్యములు అప్రశస్తములు. నఖసంఖ్య యిరువదిగాగాని, పదునెనిమిదిగాగాని యుండిన శుభము. ఇంతకన్న అధికసంఖ్యగలవైనను, అల్పసంఖ్యగలవైనను గజనఖములు అనర్థ హేతువులే యగును. 'అనుత్పన్ననఖం నాగం సమర్థమపి సంత్యజేత్' అన్నారు. కావున సర్వలక్షణశోభితమైన దయ్యు నఖములు లేకున్నదైనచో, అట్టి గజము అమంగళకరము గావున విడిచి వేయదగినది.

2. బిందుజాలకము : తెల్లనివి, పచ్చనివి, లేతయెరుపు వన్నెవి, బంగారు రంగువి యైన బిందువులు శోభదాయకములు. నెమలి, డేగ, కాకి, గ్రద్ద, గాడిద, కోతివంటి వన్నెలుగల బొట్లు అశుభములు.

3. ఆవర్తములు : గజములకు సుళ్ళు సాధారణముగా ఆరుచోట్ల పుట్టును. చర్మములు, రోమములు, నెలవులు, కేశములు, వాలము, బిందువులు అనునవి ఆవర్తము లుద్భవించు స్థానములు. రోమజ, కేశజ, దంతభంగజములైన ఆవర్తములు శోభహేతువులు. చర్మరోమవాలజములైన సుళ్లు కీళ్ళ కెల్ల గుళ్ళు. దక్షిణావర్తము శుభకరము. వామావర్తము అశుభమూలము. శుభావర్తములైనను అస క్షేత్రసంభవములైనచో శుభముల నీయవు. నొసలు, మెడ, కనులు, కుంభస్థలము, చెవులు, రొమ్ము ఈ యవయవములం దున్న ఆవర్తములు శుభదాయకములు. స్తనాంతరము, శిరోమధ్యమున, కుంభముల నడుమ, కర్ణమూలములయందు, వక్షస్థలమున ఆవర్తము లున్న గజమును పంచమంగళగజ మందురు. వర్ణనీయగజములు : అవలక్షణములు గల కొన్ని గజములు వర్ణనీయము లని శాస్త్రకారులు వక్కాణించి యున్నారు. లక్షణోపేతమైన హస్తి మంగళహేతువైనట్లే, దుర్లక్షణదూషితమైన కుంభి యనేకానర్థములకు మూలమగునను విశ్వాసము అతి ప్రాచీనమైనదిగా కన్పట్టుచున్నది. రత్నహయాదుల విషయమునను భారతీయు లిట్టి దృక్పథమునే కలిగియున్నారు. కొన్ని వర్ణనీయ కరు లివి :

1. మొక్కలీయము : దంతములు లేని గజమును మొక్కలీయ మందురు. సర్వలక్షణ సంపన్న మైనను కొమ్ములులేని యట్టి మొక్కలీయమును గ్రక్కున విడువ వలెను.

2. షండము : నడచునప్పుడు కాలు కాలు రాచుకొను నట్టి గజము షండము. అది తక్కిన లక్షణము లెన్ని గలిగినదైనను దూరమున విడువవలసినది.

3. పిష్టకము : అధికమైన జఘనము, విస్తృతమైన స్తనాంతరము గలిగి, గమనదోషదుష్టయైన గజమునకు, పిష్టకమని పేరు. ఇదియు నింద్యము, వర్ణనీయము.

4. కుబ్జము : పొత్తికడుపు, మొలయు, చిన్నవిగాను, వెన్ను వెనుక భాగము . ఎత్తైనదిగాను ఉండి బలహీనమైన దంతి కుబ్జ మనబడును. ఇది విసర్జింప దగినది.

5. పూతన : దంతములు, చెవులు, కన్నులు, పాదములు, పార్శ్వములు అనువానిలో ఏదియైనను ఒక్కొక్కటి లేకపోయి, నల్లమబ్బువంటి మేనివన్నె గలిగి, ఎరుపుమించిన పసుపురంగు గల గోళ్ళతో, రోమములతో ఒప్పు గజమును పూతన యందురు. ఇది మిక్కిలి యమంగళకరము. ఈ దుష్టదంతిని దూరముగా విడిచి వచ్చి శాంతి చేసికొనవలెను.

6. మాతృకము : ఎడమవైపు కర్మము, దంతములేని సామజము మాతృకము. ఇది నిలిచినచోటు పెద్దమ్మకోట. దీనిని మెలకువతో శత్రురాజ్యములోనికి తోలింపవలెను.

7. మత్కుణము : మేలిబిందుకములేమి, రూపసంపద యేమి, పెనుసత్తువయేమి ఇట్టి వన్నెచిన్నె లెన్నియున్న నదేల దండికొమ్ముజంట యుండదేని, మత్కుణాఖ్యమది యమంగళకరమగు, వడిగ దవుల దాని విడువదగును.

8. మాయుకము : చిన్నవియగు చెవులు, చిన్నదియగు తోక, చిన్నదియగు మగగుర్తు -కడు నిడుపైన తొండము, సన్నని మెడ, చెడు కంపు, నల్లని యెడలు, నల్లనినాలుకయు గలది మాయుక గజము. సర్వనాశకము కావున త్యాజ్యము.

హస్తినీలక్షణము : గుండ్రని తలయు, సువిభక్తములైన స్తనములు, చక్కని కేశములు, పిచ్చుక వన్నె కనులు, తెల్లని నున్నని ముఖము, ఎఱ్ఱని శ్రోణిభాగము, సుందరమైన గమనము, ఎఱ్ఱకలువలవంటి దంతములు గలిగి చూడముచ్చటైన ఆకారసంపదతో వెలయునట్టి కరిణి శుభకారిణి. ఇది యూథనాయకత్వము వహింప సమర్థములైన కలభములను ప్రసవించును. మంగళ దేవతలవంటి యట్టివశలు ఏ రాజున కుండునో, యాతడు సర్వసంపన్నిలయు డగును. పర్వసమయములలో హస్తినీ పూజ విహితమైనది.


'గంధమాల్యానులేపైశ్చ చారుభిర్వివిధాత్మకై 8
ధూపైశ్చ మధుపర్కైశ్చ వశాం పర్వసు పూజయేత్'

తక్కిన విషయములలో హస్తి లక్షణములే హస్తినికిని సమన్వయించును.

సాంగ్రామిక గజము : ఇది యుద్ధములలో ఆరితేరిన మహాగజము. 'సాంగ్రామికో భవేద్రాజ్ఞ స్త్వభిషేకో చితో గజః' అనుటచే యీ సాంగ్రామిక గజమే రాజుల పట్టాభిషేకోత్సవములలో అధిరోహించుట కర్హమైనదని తెలియుచున్నది. ఈ జాతి కరీంద్రము ఏకాదశ గుణశోభిత మగును. మధుసన్నిభ దంతములు, శ్యామవర్ణము, తేనెవన్నె కనులు, ఉదరభాగమున శ్వేతవర్ణము, ముఖమున కమలశోభ, తుమ్మెదలవంటి నల్లని వాలములు, చంద్రునివంటి స్వచ్ఛ నఖములు, మామిడిచిగురు వన్నె మేఢ్రము, తక్కిన యవయవములు పచ్చనివై ఎఱ్ఱని బిందువులచే చిత్రితమైన మోము గలది సాంగ్రామిక గజము . అట్టి గజరాజు గల భూమీశ్వరుడు సాగరాంతమైన మహీతలమును సుఖముగా ఏలును.


సాంగ్రామిక గజ మిట్లు నిర్వర్ణింపబడినది :
'మహాశిరాః మహాకాయో,
       మహామేఢ్రో మహాకరః
మహాదంతోదర శ్చైవ
       మహాగాత్రాపరాసనః


మణి నేత్రో మహోష్ఠచ్చ
      మహాకర్ణో మహాముఖః
మహాకంఠో, మహాపాదో
      భవేత్సాంగ్రామికో గజః. '

గజోపయోగములు : గజబృందము అమూల్యమైన వనసంపదగా పేర్కొనబడినది. వాని దంతములు మిక్కిలి విలువగలవి. అవి ఆభరణములుగాను, విలాస వస్తువులుగాను, పీఠములు గాను, పాత్రములు గాను, కస్తూరి మున్నగునవి దాచియుంచు బరిణలుగాను అనేక విధములుగా రూపొందింపబడుచున్నవి. గజమృగయ ప్రధానముగా దంతములకే యనుట ప్రసిద్ధి. ఏయే మృగముల నెందుకు వేటాడుదురో ఈ శ్లోకము వివరించుచున్నది:


'చర్మణి ద్వీపినం హంతి దంతయోర్హంతి కుంజరమ్
వాలేషు చమరీం హంతి సీమ్ని పుష్కలకో హతః.'

వ్యాఘ్రము చర్మనిమిత్తముగను, కుంజరము దంతనిమిత్తముగను, చమరీమృగము వాల నిమిత్తముగను, కస్తూరి మృగము కస్తూరి కోశ నిమిత్తముగను చంపబడునని తాత్పర్యము. వాహనములుగా ఉపయోగపడుట, శుభదాయకములగుటవంటి ఆనుషంగిక ప్రయోజనములు మరి యెన్ని యున్నను గజముల ప్రధాన ప్రయోజనము మాత్రము దేశరక్షణమే యై యుండెను. తొల్లింటి రాజులకు, తన్మూలమున ప్రజలకు గజబలము శ్రీరామరక్ష.


'ప్రాకారతః పురద్వార కవాటోద్ఘట్టనాదిషు
భంజనే మర్ద నేచై వ, నాగాః వజ్రోపమాః స్మృతాః.'

ప్రాకారమును, పురద్వార కవాటములను భేదించుటలో గజములు వజ్రసన్నిభములు. అశ్వ పదాతు లల్పసత్వములు: గజము మహాసత్వము.


'ఏకశక్తి ప్రహారేణ మ్రియతే౽శ్వో నరో౽పివా
సహేన్మహాప్రహారాణాం శతం యుద్ధేషు వారణః.’

యుద్ధములో ఒక్క చిల్లకోలపెట్టుతోనే అశ్వము, భటుడు పడి చత్తురు. ఏనుగో, నూరు దెబ్బలనైన ఓర్చి పోరాడును. యుద్ధమున గజవాహన వైశిష్ట్య మిట్లుగడింప బడినది.


'రథయోగ్యా క్షి తిర్నైవ వాజియోగ్యాపి యత్రవా
మహావర్షాస్వపి గజాః తత్ర యాంతి సుఖం రిపూన్.'

వర్షాకాలములో రథాలు పోలేని, గుఱ్ఱాలు చేరలేని కర్దమదుర్గమ ప్రదేశాలకు కూడ గజములు అనాయాసముగా పోయి శత్రువులను తాకగలవు. కావుననే,


'జలే స్థలే చ దుర్గే చ శాఖిభిః సంకటే తథా
సమే చ విషమే చైవ జయో నాగవతాం ధ్రువమ్.'

అన్నారు. జలమనియు, స్థలమనియు లేదు. చెట్లు అడ్డమని లేదు. సమ విషమ స్థలము లన్నింటిలో గజసేన గల వారికి జయము నిక్కము. మత్తమాతంగ మొక్కటి విజృంభించి తలపడేనా, ఆరువేల గుఱ్ఱములను మట్టు పెట్ట గలదు. రథాశ్వశిబికాదులు వాహనములు మాత్రమే. గజమో! వాహనమగుచునే శత్రుసంహారక యోద్ధయునగుట విశేషము. గజశాస్త్రకోవిదుల వాక్యములలో గజప్రశంస యిట్లున్నది :


అగ్నిపురాణము :
    కుంజరాః పరమా శోభా శిబిరస్య బలస్యచ
    అద్రుతః కుంజరైశ్చైవ విజయః పృథివీక్షితా'

సేనావేశమునకు, సేనకు, ఏనుగులే పరమశోభాకరములు. రాజు గజములతోనే విజయము సాధించును.


శివతత్త్వసారము :
     రక్షంతి పక్షం ముదితాః స్వకీయం
     మృదంతి సైన్యం కుపితాః పరేషామ్
     ప్రాణైర పీచ్ఛంతి హితం ప్రభూణాం
     గజై స్సమానం క్వ బలం మహీయః.

స్వపక్షరక్షణమును, పరపక్ష శిక్షణమును గావించుచు గజములు అవసరమైనచో ప్రాణములైన నర్పించి ప్రభు శ్రేయమును కోరును. గజబలము సాటి యేది?


హరిహర చతురంగము :
      'సహి రాజా యస్య చమూః
      సా చమూర్యత్ర హస్తినః' (I-20)
సేనగలవాడే రేడు - గజము లున్నదే సేన.
     'నచ రుద్రాత్పరో దేవః నచ వేదాత్పరం శ్రుతమ్
      యానాంతరం పరం నాస్తి గజాదన్య న్మహీపతేః'

శివునికంటె వేరు దైవము, వేదములకంటె వేరు జ్ఞానము, గజయానముకంటె వేరు యానము లేదు.


రాత్రిర్యథా శశాం కేన యౌవనేన యథా స్త్రియః
తథా సేనా గజేంద్రేణ తయా రాజాచ శోభతే.'

చంద్రునిచే రాత్రియు, జవ్వనముచే యువతియు శోభిల్లు నట్లు కరీంద్రముచే సేన భాసిల్లును. అట్టి సేనచే రాజు శోభిల్లును. అట్టి సర్వలక్షణసంపన్నుడగు ప్రభువువలన ప్రజలు సుఖింతురు.

చె. రం.