సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మూడవ సంపుటము/గంధకము
గంధకము (Sulphur) :
మానవుడు చరిత్ర నెరిగినప్పటి నుండి గంధకము వాడుకలో నున్నది. దీపావళి టపాకాయలు, మందుగుండు సామాను మున్నగునవి కాల్చినపుడు వచ్చు గంధకపువాసనను తెలియనివారుండరు. నాటువైద్యులు గంధకమును మందులు తయారుచేయుటకు వాడుట గూడ మన మెరుగుదుము. ఘాటు వాసనగల ఉల్లి, వెల్లుల్లి, ముల్లంగి, ఆవ మొదలగు వాటియందు గంధకము సంయోగ రూపమున గలదు. గంధకము సూర్య గోళములో కూడ కలదని శాస్త్రజ్ఞులు కనుగొనిరి. మానవశరీరమున గూడ గంధకము కొంతకలదు. ఈ గంధకమును గురించి, బైబిల్ లోను, ప్రాచీన భారతీయ గ్రంథములలోను వ్రాయబడినది. ఆంగ్లములో గంధకమును “సల్ఫర్ ” (Sulphur) అందురు.[1]
గంధకముకన్న, దానినుండి తయారైన పదార్థము లెక్కువ వాడుకలో నున్నవి. వీటిలో గంధకికామ్లము చాల ముఖ్యమైనది. దీనిని ఎరువుల పరిశ్రమలోను, పెట్రోలియం పరిశుద్దము చేయుటకును కొన్ని ఆమ్లములు తయారు చేయుటకును, పంచదార తయారుచేయుటయందును, తదితర రాసాయనిక పరిశ్రమలలోను ఎక్కువగ వాడుదురు. వివిధ దేశములలో ఉత్పతియగు గంధకికామ్లములో సగభాగము ఎరువులను తయారు చేయుటకే వాడబడుచున్నది. అందుచేత ఒక దేశముయొక్క సంపద అచ్చట వాడబడు గంధకికామ్ల పరిమాణమును బట్టి ఉండు ననునది అతిశయోక్తి కాదు.
గంధకము దొరకు విధానము: గంధకము ప్రకృతిలో మూలకరూపములోను, సంయోగరూపములోను దొరకు చున్నది. విడిగా దొరకు గంధకము ముఖ్యముగా అగ్నిపర్వత ప్రదేశములగు సిసిలీ (ఇటలీ) యందును, జపానులోను, అమెరికాలోను లభించుచున్నది. ప్రపంచములో లభించు గంధకములో నూటికి 80 పాళ్లు అమెరికాలో సంగ్రహింపబడుచున్నది. గంధకము ఇతర ధాతువులతో మిళితమై సంయోగరూపమున (Compound) విరివిగా లభించును. అనగా ధాతువుల ఖనిజములగు ధాతు గంధకిదములు (Metallic Sulphides) గ లభించును. ధాతువుల ఖనిజములలో ముఖ్యమైనవి, సీసపు గంధకిదము (Galena), యశదగంధకిదము (Zinc Sulphide -Zinc blender), పాదరస గంధకిదము (Cinnabar). ఇనుప గంధకిదము (Iron Pyrites), తామ్ర గంధకిదము (Copper Pyrites). సల్ఫేటులరూపమున ఇది కాల్షియం సల్ఫేటు (Gypsum), బేరియం సల్ఫేటు (Barytes)లుగ లభించును.
గంధకము దొరకుచోట్లు : దక్షిణ హిందూదేశములో, ఆంధ్రప్రదేశ్ లో కృష్ణాజిల్లాలోని మచిలీపట్టణమునకు ఏడుమైళ్ల దూరమున కోనప్రాంతమున గంధకపు ఉనికి కనుగొనబడినది; ఇది సముద్రతీరమందలి పల్లపు ప్రదేశము. కాన్‌బీరార్ (25°29'>:66°3') వద్దనున్న ఉప్పునీటి బుగ్గలలో గంధకము కలదు. బొంబాయిరాష్ట్రములో గిజ్రీబందర్ (24°48′:67°8′), లాకి (26°16′:67°57′) ల వద్ద శిలలో గంధకము కనుగొనబడినది. కాశ్మీరములో కూడ వేడినీటిబుగ్గలలో గంధకము కలదని శాస్త్రజ్ణులు కనుగొనిరి. దీనినుండి 20 - 25 టన్నుల గంధకము గ్రహించబడినది హిమాలయములలో కూడ అచ్చటచ్చట గంధకపుబుగ్గలు కలవని కనుగొనబడినది.
మన దేశములో ధాతుగంధకిదములు (Metallic Sulphides) దొరకు ప్రదేశము లచ్చటచ్చట గలవు. ఈ ధాతుగంధకిదములలో ఇనుపగంధకిదము పేర్కొనదగినది. ఆంధ్ర, మదరాసురాష్ట్రములలో దీనిని కనుగొనిరి. సల్ఫేటులలో ముఖ్యమైనవి, విరివిగా దొరకునవి జిప్సమ్, బేరియం సల్ఫేటులు. జిప్సమ్‌ను గంధక సంగ్రహణములో వాడవచ్చును. ఈమధ్యనే బీహారులోని షహబాద్ జిల్లాలో 'సన్ లోయలో 'ఇనుపగంధకిదము (Iron Pyrites) యొక్క నిధులు (Deposits) భారత భూగర్భశాస్త్రశాఖ వారిచే కనుగొనబడినవి. ఈ ప్రాంతములో బంజరీ, కొరియారి, రాహటాన్ కోటలలో ఈ నిధులు కనుగొనబడినవి. ఇనుపగంధకిదనిధులు కై యూరు ఇసుకరాళ్లక్రింద బిజైగర్ షేలులతో (Shales) కలసి విస్తరించియున్నవని శాస్త్రజ్ఞుల అభిప్రాయము. 1951-52 లో భారత భూగర్భశాస్త్ర శాఖవారు బంజరీ ప్రాంతములో పరిశోధనలు జరపినారు. ఇక్కడి పై రైటు 43% గంధకము కలిగియున్నది. ఈ నిధులనుండి గంధకమును ఉత్పత్తిచేసి గంధకికామ్లముల పరిశ్రమ ఈ ప్రాంతములో స్థాపించవచ్చునని ఈ పరిశోధనలు చేసిన శాస్త్రజ్ఞులు సూచించియున్నారు. మనదేశమునకు కావలసిన గంధకికామ్లమును మనమే తయారుచేసికొనుట, దేశమున కెంతో సౌభాగ్యదాయకము. దానికి తగిన గంధకము దేశములోనే ఉత్పత్తిచేయవలెను. దేశములో జిప్సమ్ పెక్కుచోట్లగలదు. జర్మనీ, ఇంగ్లాండు వంటి పాశ్చాత్య దేశములవలె భారతదేశముకూడ జిప్సమ్ నుండి గంధకమును సంగ్రహించి (Extract) ఆ గంధకమును గంధకికామ్ల పరిశ్రమకు వాడవచ్చును. ఏది ఏమైనను జిప్సమ్ మీద పరిశీలనలు ఇంకను మనవారు చేయవలసిన అవసరము కలదు. ఈ పరిశీలన లన్నియు పూర్తి అయిన పిమ్మట జిప్సమ్‌ను సక్రమముగ వినియోగించి, గంధకోత్పత్తి కొనసాగించిన, గంధకికామ్ల పరిశ్రమ వృద్ధిచెంద గలదు. ప్రస్తుతము మనదేశమున గంధకికామ్ల పరిశ్రమలు అచ్చటచ్చట కలవు. ఇవి దేశపరిశ్రమాభివృద్ధికై మొదటి సోపానము లనవచ్చును. ప్రపంచ గంధకోత్పత్తి సుమారు 20 సంవత్సరముల క్రిందట సాలుకు 15 లక్షల టన్నులుండెను. ప్రస్తుతమిది రెండు, మూడు రెట్లు పెరిగినది. రానురాను గంధకము యొక్క అవసర మెంతయు పెరుగుచున్నది. ఒక్క అమెరికా దేశములో నే ఇప్పుడు నూటికి 80 పాళ్లు గంధకోత్పత్తి చేయబడుచున్నది.
జపానులో లభించు గంధకము చాలా భాగము హొకాయిడో (Hokkaido) లో త్రవ్వబడుచున్నది. ఇటలీ గంధకోత్పత్తిలో ద్వితీయస్థాన మాక్రమించుచున్నది. ఆ దేశము సాలీనా సుమారు 4 లక్షల టన్నుల గంధకమును ఉత్పత్తి చేయుచున్నది.
ఇక గంధకముయొక్క నిజస్వరూపము, దాని వివిధ లక్షణములు పరిశీలింపదగినవి. ఇండియాలో కొన్నిచోట్ల సముద్ర తీరప్రాంతమునందు, గంధకపు సూక్ష్మజీవులు (Bacteria) సముద్రపు నీటిలోని జిప్సమ్ (Calcium Sulphate) తో ప్రతిక్రియ (React) చెందుటవలన గంధకము ఏర్పడి ఉండవచ్చునని కొందరు శాస్త్రజ్ఞులు అభిప్రాయపడిరి.
జపానులోని గంధకము అగ్నిపర్వత 'లావాల' నుండి ఏర్పడినది. ఇటలీలోని గంధకము భూగర్భ శిలలందు జిప్సమ్, సున్నపురాయి (Limestone) తో కలిసి యుండును. అమెరికాలో గంధకము భూగర్భమున 300 అ. నుండి 1200 అ. ల లోతువరకు పొరలు పొరలుగా ఏర్పడి యున్నది. దీనితో కూడా జిప్సమ్, సున్నపురాయి మిళితమైయున్నది.
గంధక సంగ్రహణము (extraction): సిసిలిలో లభించు ముడిగంధకమునందు నూటికి 15 నుండి 20 పాళ్ల వరకు గంధక ముండును. అడుగుభాగము ఏటవాలుగా నుండు ఇటుక బట్టీలలో ముడిగంధకము పేర్చి నిప్పంటించెదరు. గంధకము వేడికి కరిగి కొయ్య అచ్చులలోనికి ప్రవహించి ఘనీభవించును.
అమెరికాలో లభించు గంధకము భూమి ఉపరితలమునకు 800 అడుగులు లోతున పొరలు పొరలుగా నుండుటచేత భూమట్టమునుండి క్రిందికి రంధ్రములు త్రవ్వి గొట్టములద్వారా బాగుగా వేడిచేసిన నీటిని పంపుదురు. గంధక మా వేడికి కరిగి ద్రవరూపమున పైకి వచ్చును.
జపానులో భూగర్భమునుండి గంధకమును త్రవ్వి బయటికి తీయుదురు. గంధకమును పరిశుభ్రపరచుటకు, దీనిని ఇనుపపాత్రలలో కరిగించి, రిటార్టులలో (Retorts) మరగించెదరు. మరగిన గంధకము ఆవిరిరూపమున పెద్ద ఇటుకల గదిలో ప్రవేశించును. ఈ ఆవిరి చల్లని గోడలపై ఘనీభవించును. ఘనీభవించిన గంధకము లేత పసుపు స్ఫటికా కారమున నుండును. దీనిని గంధకపుధూళి (Flowers of Sulphur) అందురు. పిమ్మట గోడలు కూడ వేడెక్కి గంధకపు ధూళిని కరగించును. ఈ గంధక ద్రవము క్రిందికిజారి స్తూపాకారపు (Cylindrical) అచ్చులలోనికి ప్రవహించి ఘనీభవించును.
గంధకపు బహురూపసంపద (Allotropy of Sulphur) : గంధకము ఒక ఆకృతిలో కాక, వివిధ రూపములలో ఈ మూలకము (Element) కన్పట్టుచున్నది. అనగా గంధకమునకు బహురూప సంపద (Allotropy) కలదు. ఇది ముఖ్యముగా 3 రూపములలో గోచరించు చున్నది. అవి : 1. వజ్రాకృతి గంధకము (Rhombic Sulphur) 2. పట్టక గంధకము (Monoclinic Sulphur) 3. సాగుడు గంధకము (Plastic Sulphur) మొదటివి రెండును స్ఫటిక (Crystal) రూపములు. వీటి కన్నిటికి రూపభేదమే కాని లక్షణభేదము లేదు. పటములో వజ్రాకృతి పట్టక గంధకపు రూపములు (ఎ. బి.) సాగుడుగంధక రూపములు (సి) చూడవచ్చును.
వజ్రాకృతి గంధకము : సాధారణ గంధకమును, కర్బన ద్విగంధకిదము (Carbondisulphide) లో కరగించి, ఆ ద్రావణమును నెమ్మదిగా ఇగురబెట్టినయెడల (Evaporate) తేజోవంతమైన పసుపువర్ణపు వజ్రాకృతి గంధక మేర్పడును.
వజ్రాకృతి గంధకము అన్నిటికంటె స్థిరరూపము గలది. కర్బన ద్విగంధకిదము, బెంజీన్, కర్పూరతైలములయందు త్వరగా కరగును; సారాయము, వై హాయసము (Ether)లలో కొద్దిగా కరగును. నీటిలో కరగదు. ఇది వేడిమిని, విద్యుత్తును ప్రసరింపచేయదు .
పట్టక గంధకము : ఇది 1823వ సంవత్సరమున కనుగొనబడినది. ఇది వేడిచేసిన గంధకమును స్ఫటికీకరణము
(Crystallise) చేసినపుడు తయారగును, ఒక పింగాణీ చిత్రము - 74
ఎ
పటము - 1
వజ్రాకృతిగంధకము పట్టక గంధకము
చిత్రము - 75
బి
పటము- 2
పట్టకగంధకము
చిత్రము - 76
సి
పటము - 3
సాగుడుగంధకము
మూస (Crucible) యందు గంధకమును నెమ్మదిగా కరగించి, గంధకపు పై భాగము గట్టిపడువరకు చల్లార్చి, గట్టిపడిన పై భాగమును గాజుకడ్డీతో రంధ్రము చేసి, అడుగుభాగముననున్న ద్రవమును మరియొకపాత్రలో పోసినయెడల, మూసలో సూదులవలె తేజోవంతములైన స్ఫటికములు కనపడును. ఇదియే పట్టక గంధకము పట్టకపు గంధకము మైనపురంగు గలిగి పెళుసుగా నుండును. దీని ద్రవీభవనస్థానము 120°C. కర్బనద్విగంధకిద మునందు ఇది బాగుగా కరగును; నీటియందు కరగదు.
సాగుడు గంధకము: గంధకమును వేడి చేయగా నేర్పడు పదార్థమును ఇంకను వేడిచేసి చన్నీటిలో పోసినచో జిగురువంటి సాగెడు పదార్థ మేర్పడును. ఇదియే సాగుడు గంధకము (Plastic Sulphur). ఇది గోధుమ రంగుగల ఘన పదార్థము. ఇది నీటియందును ద్వికర్బన గంధకిదమునందును కరగును.
గంధకపు పాలు: ఇది ఘనపదార్థముకాదు. నీటిలో గంధకము తెల్లని పాలవలెనుండును. ఈ ద్రావణమును వడబోసినయెడల అది వడపోత కాగితములో (Filter) నిలువక, దానిలోనుండి క్రిందికి ప్రవహించును. దీనినే ప్రతిస్పాటిక ద్రావణము (Colloidal Solution) అని అందురు.
గంధక లక్షణములు: గంధకము చక్కని లేతపసుపురంగు స్పటికాకృతిగలిగి చూడముచ్చటగా ఉండును. దీనికి ఒకవిధమైన వాసనగలదు. గంధకమును వేడిచేసినపుడు కలుగు మార్పులు గమనింపదగినవి. మొదట 114°C (సెంటిగ్రేడు) వద్ద గంధకము కరగి పసుపు వర్ణము గల పలుచని ద్రవమగును. వేడి హెచ్చినకొలది వర్ణము ముదిరి చిక్కని ద్రవరూపము దాల్చును. 250°C వద్ద బాగుగా గట్టిపడును. ఇంకను వేడి హెచ్చించిన కొలది; తిరుగ పలుచబడ నారంభించును. 440°C వద్ద మరగి నారింజపండు రంగుగల ఆవిరిగా మారును.
గంధకము గాలిలో మండినపుడు ఘాటైన గంథకద్వి ఆమ్లజనిద (Sulphur-dioxide) వాయువుగా మారును. రాగి, వెండి, ఇనుము మొదలగు ధాతువులు, ఈ గంధక ద్విఆమ్లజనిదముతో ప్రతిక్రియ చెంది సల్ఫైటులుగ నేర్పడును. గంధకము ఉదజనివంటి ఉపధాతువులతో (Non-metals) కూడ సంయోగము చెందును. ఉదజనితో ఉదజగంధకిదము (Hydrogen Sulphide), కర్బనముతో కర్బన ద్విగంధకిదము (Carbondisulphide) ఏర్పడును.
గంధకముయొక్క ఉపయోగము లెన్ని యో కలవు. వీనిలో మొట్టమొదటిది మరియు ముఖ్యమైనది, ఇది గంధకికామ్ల పరిశ్రమలో వాడబడుటయే. గంధకము నుండి తయారైన గంధకికామ్లము స్వచ్ఛముగానుండును. తుపాకిమందు, టపాకాయలు. అగ్గిపుల్లలు తయారుచేయుటకు గంధకము ముఖ్యమైనది. తుపాకి మందులో నూటికి 10వ భాగము గంధకము కలదు. రబ్బరు పరిశ్రమలోను, కర్బనద్విగంధకిదము తయారుచేయుటలోను, ఎఱువుల పరిశ్రమలలోను గంధకము ఉపయోగపడుచున్నది. మందులలో గంధకపుమలాము (Sulphur Ointment) చర్మవ్యాధులకు వాడుదురు. అచ్చులు పోయుటకును, దిమ్మెలు చేయుటకును, కాగితపు పరిశ్రమలలో కూడ గంధకము పనికివచ్చును. గంధకపు (Compounds) సంయోగపదార్థము లెన్నియో ప్రయోగశాలలలో వాడబడుచున్నవి.
గంధకముయొక్క సంయోగ పదార్దములు: ఆమ్లజని సంయోగకములు (Oxygen Compounds), గంధ కము ఆమ్లజని (Oxygen ) తో కలసి గంధక ద్విగంధకత్రి ఆమ్లజనిద వాయువులుగా నేర్పడుచున్నది. మొదట 1774 సం.న ప్రీస్‌ట్లీ (Priestly) అను రసాయన శాస్త్రజ్ఞుడు గంధకద్వి ఆమ్లజనిద వాయువును తయారుచేసెను. గంధకము గాలిలో మండుటవలన ఈ వాయువు ఏర్పడుచున్నది. గంధకమును వేడిచేసినపుడు గాని, రాగి, ఇనుము, పాదరసము కార్బను మొదలగువాటిమీద ఉష్ణ గాఢ గంధకికామ్లము (Hot Concentrated Sulphuric acid) పడి ప్రతిక్రియ జరుగుటవలన గాని, గంధకద్విఆమ్లజనిదము తయారగును. ఈ వాయువు రంగులేని ఘాటైన పదార్థము. ఇది నీటిలో కరిగినపుడు ఏర్పడు ఆమ్లమును గంధక సామ్లము (Sulphurous acid) అందురు. గంధకద్విఆమ్లజనిదము ముఖ్యముగా గంధకికామ్లము తయారుచేయుటయందు ఉపయోగపడుచున్నది. ఈ వాయువును రంగులు పోగొట్టుటకు కూడ వాడుదురు దీనిని ఎక్కువగ పీల్చిన హాని కలుగును.
గంధకత్రిఆమ్ల జనిదము (Sulphur Trioxide) : ఇది గంధక రసాయన శాస్త్రములో (Chemistry of Sulphur) ముఖ్యమైనది. ప్లాటినము (Platinum) మీదుగా వేడి గంధకద్వి ఆమ్లజనిదము, ఆమ్లజని మిశ్రమమును పంపినపుడు గంధకత్రి ఆమ్లజని వాయువు ఏర్పడును. ఇది రంగులేని వాయువు. ఇది చల్లారినపుడు ఘనీభవించును. ఈవాయువు నీటిలో కరగినపుడు ఏర్పడు ఆమ్లమే గంధకికామ్లము . గంధకికామ్లము తయారుచేయు పద్ధతులలో నిదియొకటి.
గంధకికామ్లము (Sulphuric Acid): ఇది గంధక, సంయోగ పదార్థములలో చాలముఖ్యమైనది. గంధకికామ్లమును రెండువిధములుగ తయారుచేయుదురు. మొదటిది స్వాభావికముగ దొరకు సల్ఫేటులనుగాని, లేక తయారుచేసిన సల్ఫేటులనుగాని బాగుగా వేడిచేసి గంధకత్రి ఆమ్లజనిదముగ మార్చి పిమ్మట దానిని నీటిలో కలిపి గంధకికామ్లముగ తయారుచేయుట. ఇక రెండవది గంధకము మండించుటవలనగాని, గంధకిదములనుండి గాని గంధకద్వి ఆమ్లజనిదమును తయారుచేసి, ఆ వాయువును ఆమ్లజనితో ప్రతిక్రియ సలిపి గంధకత్రి అమ్లజనిదమును తయారుచేయుట. మొదటిపద్ధతి ఎక్కువ వాడుకలో లేదు. రెండవ పద్ధతివలన తయారగు గంధకికామ్లము ఎక్కువ పరిశుభ్రముగా నుండుటే దీని వాడుకకు కారణము.
రెండవపద్ధతిలో గంధకద్వి ఆమ్లజనిదము తయారు చేయుటలో రెండువిధములు కలవు. మొదటిదానిని 'ఛేంబర్' (Chamber) పద్ధతి అనియు, రెండవదానిని 'కాంటాక్టు' పద్ధతి అనియు అందురు.
'ఛేంబర్' పద్ధతిలో తయారగు ఆమ్లములో నూటికి 80 పాళ్లు ఎరువుల పరిశ్రమలో వాడబడుచున్నది. ఇందు గంధకద్వి ఆమ్లజనిదము, ఆమ్లజని, నీరు ప్రతిక్రియ జరుపబడును. ఈ ప్రతిక్రియ పూర్తిగా కొనసాగుటకు కేటలిస్టు అవసరము. నత్రక ఆమ్లజనిదము (Nitric Oxide) ఇందుకై ఉపయోగింపబడుచున్నది. ఈ నత్రక ఆమ్లజనిదము, ఆమ్లజని వాహకముగా (Oxygen Carrier) పనిచేయును. నత్రజని, ఆమ్లజనిదము పైప్రతిక్రియలో ఆమ్లజనిని సరఫరా (Supply) చేయును. ప్రతిక్రియ అనంతరము నత్రజని తిరిగి ఆమ్లజనిని గ్రహించి, ఈ నత్రజని ఆమ్లజనిదముగానే ఉండును. ప్రతిక్రియారంభము నందును అంతమునందును ఈ కేటలిస్టు నత్రజని ఆమ్లజనిదముగానే ఉండును; మార్పేమియు ఉండదు. ప్రతిక్రియను చురుకుగాను, త్వరగాను జరుపుటయే దీనిపని. ఇదియే కేటలిస్టుపని. గంధకత్రి ఆమ్లజనిదమును, గదుల (chambers) లోపలికి ప్రవహింపచేసి, అందు నీటిజల్లుతో (Water spray) కలుపుదురు. అప్పుడు గంధకికామ్లము తయారగును. ఈ విధముగా నేర్పడు ఆమ్లము తగినంత గాఢముగానే యుండును. ఈ పద్ధతి 1746 వ సంవత్సరము నుండి వాడుకలోనికి వచ్చినది. కాంటాక్టు పద్ధతిలో తయారగు ఆమ్లము స్వచ్ఛమైన ఆమ్లము. ఈ పద్ధతిని ఫిలిప్స్ అను శాస్త్రజ్ఞుడు 1831 లో కనిపెట్టెను. ఇందు మొదట గంధకమును మండించి గంధకద్విఆమ్లజనిదమును తయారుచేయుదురు. ప్లాటినము (Platinum) మీదుగా, వేడి గంధకద్వి ఆమ్లజనిదమును, ఆమ్లజనిద మిశ్రమమును పంపినపుడు గంధకత్రి ఆమ్లజనిద మేర్పడును. ఇందులో ప్లాటినపు ఆక్సైడు కేటలిస్టుగా పనిచేయుచున్నది. గంధకత్రి ఆమ్లజనిదము నీటి బిందువులతో నెమ్మదిగా మిశ్రమ మొంది గంధకికామ్లము ఏర్పడును. స్వచ్ఛమైన గంధకికామ్లము రంగులేని నూనెవంటి చిక్కని ద్రవము. దీని తారతమ్య సాంద్రత 1.8 ఈ ఆమ్లము నీటిలో కలిసి నపుడు విపరీతమైన ఉష్ణము పుట్టును కఱ్ఱ ముక్కలను, చర్మమును ఈ ఆమ్లము నల్లని బొగ్గుగా చేయును. దీనికి నీటిని ఆకర్షించు శక్తి కలదు. బాగుగా వేడిచేసినపుడు ఇది గంధకద్విఆమ్లజనిదము, నీరు, ఆమ్లజనిల క్రింద వియోగము చెందును (Decompose).
గంధకికామ్లము యొక్క ఉపయోగము, విలువ ఒక్క మాటలో చెప్పవీలులేదు ప్రయోగశాలలలోను, రసాయనిక పరిశ్రమలలోను, ఈ ఆమ్లము నిత్యావసరమై యున్నది. చాలాభాగము గంధకికామ్లము, ఎరువుల పరిశ్రమలోనే వాడబడుచున్నది. ముఖ్యముగా అమోనియం సల్ఫేటు, సూపర్ సల్ఫేటు తయారుచేయుట కిది వాడబడుచున్నది. నూనెలు, క్రొవ్వు, పెట్రోలు పరిశుభ్రము చేయుటకును, ఉదజహరికామ్లము (Hydrochloric Acid) నత్రికామ్లము (Nitric Acid) మొదలగు ఆమ్లములను తయారు చేయుటకును ఈ ఆమ్లము ఉపయోగపడుచున్నది. ఫ్యూమింగ్ (Fuming) గంధకికామ్లములో స్వచ్ఛమైన నూటికి నూరుపాళ్లు గాఢగంధకికామ్ల ముండుటయే కాక, గంధకత్రి ఆమ్లజనిదము కూడ విడిగానుండును. ఇది అతిబలమైన ఆమ్లము . దీనిని పెక్కురసాయనిక ఔషధములు తయారుచేయుటకు వాడుదురు. తేమను గ్రహించి వేయుటకు కూడ గంధకికామ్లమును ప్రయోగశాలలో వాడుదురు. 1940 వ సంవత్సరమున అమెరికాదేశములో 70 లక్షల టన్నుల గంధకికామ్లము తయారైనది. ఇప్పు డిప్పుడు మనదేశములో గంధకికామ్ల పరిశ్రమ తలఎత్తుటకు ప్రయత్నించుచున్నది. సుమారు 50 లక్షల టన్నుల ఆమ్లము భారతదేశములో తయారుచేయబడినది. మదరాసులోని ప్యారి అండ్ కో (Parry & Co), బెంగాల్‌లోని బెంగాల్ ఫార్మస్యూటికల్స్ (Bengal Pharmaceuticals) మరికొన్ని చిన్న చిన్న పరిశ్రమాగారములు ఈ ఆమ్లమును తయారుచేయుచున్నవి. దీనికి కావలసిన గంధకమునంతయు మనము ప్రస్తుతము దిగుమతి చేసికొనుచున్నాము.
గంధకికామ్లమువలన రెండు విధములైన గంధకిదములు, (Sulphates) బై సల్ఫేటులు అను లవణములు ఏర్పడుచున్నవి. వివిధ ధాతువుల సల్ఫేటులు, బైసల్ఫేటులు ప్రయోగశాలలలోను, వివిధ పరిశ్రమలలోను, ఎంతో ఉపకరించుచున్నది.
సోడియం థియోసల్ఫేటు : గంధకపు సంయోగ పదార్థములలో ముఖ్యమైనది మరియొక టున్నది. ఫొటొగ్రఫి ఫిల్ములను కడుగుటకు హైపో (Hypo) అను పదార్థమును వాడుదురు. ఇది సోడియం థియోసల్ఫేటు (Sodium thiosulphate) అను గంధకపు ఆమ్లజనిదామ్లము (Oxyacid of Sulphur) యొక్క లవణము.
ఉదజ గంధకిదము : (Hydrogen Sulphide) ఇది గంధకము ఉపధాతువుల (Non-metals) తో సంయోగము చెందుననుటకు తార్కాణము. ఇందు ఉదజని (Hydrogen), గంధకము సంయోగస్థితిలో నున్నవి. కొన్ని గంధకపుబుగ్గల నీటియందును, అగ్ని పర్వత వాయువుల యందును ఈ వాయువుకలదు. ఈ వాయువు జంతు, వృక్ష పదార్థములు క్రుళ్లుటచేకూడ నేర్పడుచున్నది. సాధారణముగ సజలామ్లములు (Dilute Acids) గంధకిదముల (Sulphides) తో ప్రతిక్రియ చెందినపుడు ఈ వాయువు తయారగును. ఇది రంగులేని వాయువు. కుళ్లిన గ్రుడ్లకుండు దుర్వాసన దీనికి కలదు. ఇది చాలా విషపూరితమైన వాయువు. ఈ వాయువును కొద్దిగా పీల్చిన తలనొప్పి, నీరసము, బలహీనత కలుగును. ఉదజ గంధకిదము గాలికంటె బరువైనది. బాగుగా వేడిచేసినపుడు ఇది ఉదజనిగాను, గంధకముగాను వియోగము చెందును. ఈ వాయువు నీటిలో కరిగినపుడు ఉదజగంధకికామ్లము (Hydro Sulphuric) అను ఆమ్లము (Acid) ఏర్పడును. గాలిలో మండించినపుడీ వాయువు నీలిరంగుతో మండును. మండగా ఏర్పడిన పదార్థములు గంధకద్వి ఆమ్లజనిదము, నీరు అనబడుచున్నవి.
ఉదజగంధకిదము వలన కూడ పెక్కు ప్రయోజనములు కలవు. వాటిలో ముఖ్యమైనది, ప్రయోగశాలలో రసాయనిక పృధక్కరణము (Chemical Analysis)లో ఇది వాడబడుటే. పైన చెప్పబడిన గంధకము యొక్క సంయోగపదార్థము లే కాక మరికొన్ని ఈ క్రింద వివరింపబడినవి. అమోనియాగంధకిదము (Ammonium Sulphate) : పైన చెప్పిన విధముగ ఇది చాల ఉపయోగకరమైనదియు, ప్రసిద్ధమైనదియు నగు ఎరువు. ఇది గంధకికామ్లము మూలమున ఏర్పడిన అమోనియా లవణము. అమోనియా వాయువును (Ammonia gas) గంధకికామ్లముతో ప్రతిక్రియ జరిపినయెడల ఈ లవణ మేర్పడును. అమోనియం కార్బనేటు జిప్సమ్‌తో ప్రతిక్రియ చెందినపుడు కూడ ఈ లవణ మేర్పడును. ఇది తెల్లనై, నిగనిగలాడు ఘనపదార్థము. ప్రపంచములో ఉత్పత్తియగు అమోనియం సల్ఫేటు అంతయు ఎరువుగా ఉపయోగింపబడుచున్నది.
మగ్నగంధకిదము (Magnesium Sulphate): ఈ లవణము వైద్యములో విరేచనకారిగా అందరిచే గుర్తింపబడు చున్నది. వైద్యులదగ్గర ఉండవలసిన ముఖ్యపదార్థములలో ఇది యొకటి. దీనిని రంగుల పరిశ్రమలలోను, నూలు పరిశ్రమలలో కూడ వాడుదురు.
ఇది మాగ్నసైటు (Magnesite) అను ఖనిజమునుండి తయారగుచున్నది. మాగ్నసైటు అనునది మెగ్నీషియా కార్బనేటు. మాగ్నసైటును, గంధకికామ్లముతో ప్రతిక్రియ జరపి ఈ లవణమును తయారుచేయుదురు. దీనిని ఎప్సమ్ లవణము (Epsum Salt) అని కూడ అందురు.
గంధకముయొక్క సంయోగపదార్థములు ఇంకను ఎన్నియో కలవు. అవి ఒకవిధముగ, ప్రయోగశాలలలోను, పరిశ్రమలలోను, నిత్యజీవితావసరములలోను ఉపయోగపడుచున్నవి.
ఈ క్రింది పట్టికలో భారతదేశ మందలి గంధకముయొక్క, దాని సంయోగ పదార్థములయొక్క ఉత్పత్తి వివరములు కనపరచబడినవి.
పట్టిక
సంవత్సరములు | గంధకము (టన్నులలో) | గంధకికామ్లము (హండ్రెడు వెయిటులలలో) | అమోనియం సల్ఫేటు (టన్నులలో) | జిప్సమ్ (టన్నులలో) | బెరైటీస్ (టన్నులలో) |
1943 | 30,141 | 31.151 | 19,460 | 82,287 | 8,860 |
1953 | - | 327,753 | 317,721 | 585,839 | 9,400 |
1954 | - | 388,333 | 340,772 | 612,320 | 18,171 |
1955 | - | 488,569 | 392,808 | 689,905 | 7,623 |
1956 | - | - | 388,432 | 845,583 | 6,315 |
1957 | - | - | 379,734 | 922,000 | 12,913 |
1958 | - | - | - | 790,000 | 13,822 |
కె. యన్. కొ.
- ↑ ఈ పేరునకు సంస్కృతపదము 'సవ్వేరి' మూలాధారములు.