Jump to content

సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మూడవ సంపుటము/గండికోట

వికీసోర్స్ నుండి

గండికోట :

గండికోట కడపజిల్లాలో జమ్ములమడుగునకు పడమటగా ఐదుమైళ్ళ దూరమున నున్నది. తూర్పున 300 అడుగుల ఎత్తుగల యొక కొండకును ఉత్తర భాగమున నున్న అదేఎత్తుగల మరియొక కొండకును మధ్యభాగమున గండితొలుచుకొని నాలుగుమైళ్ళ దూరము పినాకినీనది ప్రవహించుచుండుట చేతను, ఒకప్రక్క నొకకొండపై అభేద్యమైన గొప్పకోట యొకటి నిర్మింపబడియుండుట చేతను దీనికి గండికోట యను పేరు సార్థక మగుచున్నది.

ఈ పినాకినీ నదికి రెండుమైళ్ళు తూర్పుభాగమున ఎఱ్ఱకొండకు సమీపమున గల బొపమ్మేల్లి (బొమ్మనపల్లి)లో శాలివాహన శకము 1213 లో (క్రీ. శ. 1291) కాకమహారా

చిత్రము - 66

పటము - 1

గండికోట యందు కొండక్రింది భాగము

అక్కడక్కడ శిథిల దృశ్యములు, పలవృక్షములు, కేదారములు కలవు

చిత్రము - 67

పటము - 2

కోటలోనికి వచ్చు ద్వారము (పినాకినిలో నుండి యెక్కి వచ్చు భాగము)

పడమటి దర్వాజా రెండవ కక్ష్యద్వారము శత్రువులను గమనించుట కేర్పరుపబడినది.

ఎడమభాగమున ఆశ్వశాలలు, భటుల గృహములు కలవు.

జొకడు నివసించుచుండెను. అతడు కాకతీయు డని తెలియుచున్నది. ఆతడు తన పరిపాలనాకాలమున ప్రక్క నున్న కొండలలో వేటకొరకు ఉత్సాహముతో నేగి, ఆ ప్రదేశముల సంచరించుచు, పినాకినీనదీ పరిసరమున ఒక తావును కాంచెను. అచటి కొండలు, లోయలు, చట్టులు మున్నగువాటిని గాంచి అది శత్రు దుర్భేద్య మగు తావని అతడు గుర్తించెను. దైవజ్ఞులు శాస్త్రములను పరిశీలించి ఆ తావున కోటను గట్టించినచో అమోఘముగ నుండునని ఆతనికి తెలిపిరి. వారి ఆనతి చొప్పున కాకరాజు సంతృప్తుడై అచట నొక బలిష్ఠమగు కోటను గట్టించెను. తగిన అంగముల నేర్పరచి ఆ కోటకు గండికోట యని నామకరణ మొనర్చెను. ఆతడు ఆ కోటయందే నివసించి, ఆ సీమను నిర్భయముగ పరిపాలించెను.

శాలివాహన శక . 1297 (క్రీ. శ. 1375) లో పుణ్యాత్ము లగు హరిహర, బుక్క రాయలు మహావీరులై విజయనగరమును గట్టించి, యందుండి పరిపాలనము గావించుచు కాశీయాత్ర కేగి, గంగానదీ జలమును బిందెతో తీసికొని 'స్వ' రాజ్యమునకు వచ్చుచు, మార్గమధ్యమున గోదావరి నదియందు స్నాతులు కాదలచి, అందలి సైకతములందు విడిదిచేసిరి. వారికి కలలో దేవుడు బ్రాహ్మణ రూపమున కనిపించి అచ్చట భూమిలో త్రవ్వి వెదకినచో విగ్రహములు దొరకగలవనియు, వాటిని తీసికొనివెళ్లి ఆలయమును గట్టించి, అందు వాటిని ప్రతిష్ఠింప వలయుననియు ఆనతిచ్చి, అంతర్థానము నొందెను. వారు మేల్కొని అచ్చట త్రవ్వించి చూచిరి. కలలో నుడివిన రీతిగా నాలుగు విగ్రహములు కనబడెను. వారు వాటిని తీసికొని వెంటనే తమ సీమ కరిగిరి. ఆ యాదేశానుసారము శేషగ్రంధిపుర మను పేరు గల 'పామిడి ' యందు పద్మనాభస్వామిని, గుత్తియందు మాధవస్వామిని, ఒంటిమిట్టలో కోదండ రామస్వామిని, గండికోటలో మాధవస్వామిని ప్రతిష్ఠించి, అంగరంగ వైభవములు సక్రమముగా ఆ మూర్తులకు జరుగునట్లు అనేక దానములను, అగ్రహారములను, భూదానములను కావించిరి. ఈ దేవాలయముల ముందట గోపురములను గూడ నిర్మించిరి.

ఇటీవలనేదొరికిన శాసనములను బట్టి వరంగల్లురాజు లగు కాకతీయులు వల్లూరు మొదలు కడప జిల్లా వరకు పాలించినట్లు తెలియు చున్నది. ప్రతాపరుద్రుని కొడుకు అంబదేవుడు వల్లూరు పాలకుడుగా నుండెను క్రీ.శ. 1309 లో మహమ్మదీయుల దండయాత్రయు, విజయనగర రాజ్యస్థాపనయు ఘటిల్లెను. హరిహరరాయలును, బుక్క రాయలును ఓరుగల్లునుండి బయలుదేరి వచ్చిన సోదరులు. వీరే విజయనగర రాజ్యస్థాపకులు. ఒకటవ బుక్కరాయలు శా. శ. 1297 (క్రీ. శ. 1375–1376) లో పాలకుడై యున్నట్లు కలదు. విజయనగరకాలమున గండికోటసీమ ప్రకృతపు

చిత్రము - 68

పటము - 3

గండికోట తూర్పు దర్వాజా. ఈ మార్గము జమ్ములమడుగునకు వెళ్లును. ఈ దర్వాజా

ముందుభాగమున, లోపలిభాగమున - రెండుప్రదేశములయందు వెయ్యిమంది సైనికులు

నిలుచు ప్రదేశముగలదు. ఈ దర్వాజా తలుపులు అర్గళములు; సన్నివేశము విచిత్రముగ నున్నది.

చిత్రము - 69

పటము - 4

నవాబు గోవధ చేసిన మాధవరాయస్వామి దేవాలయ ముఖమండపము.

రెండు ప్రక్కల ఏనుగులు గలవు.

పులివెందుల, ప్రొద్దుటూరు, కమలాపురము, కడప తాలూకాలు చేరిన భాగము. కర్నూలుజిల్లా యందలి

కొంతభాగము దీనికి జేరినట్లు తెలియుచున్నది. ఇది యంతయు ఉదయగిరి రాజ్యమునకు లోబడిన రాష్ట్రమై తత్పాలకుల దగ్గరి బంధువులకు చెందినదిగా నున్నది.

శ్రీకృష్ణదేవరాయలు శా. శ. 1421 ( క్రీ. శ. 1490) లో వచ్చినట్లు స్థలపురాణ మొకటి తెలుపుచున్నది. శా. శ. 1481 ( క్రీ. శ. 1509) వత్సరమున కృష్ణరాయలు పాలించినట్లు చరిత్రవలన విదితమగుచున్నది. శ్రీ సదాశివరాయలు కూడ ఈ గండి కోటను పరిపాలించినట్లు తెలియుచున్నది. తాళికోట యుద్ధానంతరము గండికోట తిమ్మానాయకుని స్వాధీనమం దున్నట్లును, తాళికోటయుద్ధానంతరము గోలకొండ నవాబులు ఈ ప్రాంతమును ఆక్రమించు పర్యంతము గండికోట హిందువుల పాలనమునందే యున్నట్లును, ఆతడు విజయనగరరాజుల ప్రతినిధి యైనట్లును తెలియుచున్నది. పదునారవ శతాబ్దియందు జరిగిన సంగ్రామములలో రాజ్యపాలనము తారుమా రయ్యెను. మహమ్మదీయులు దేశము నాక్రమించుకొన్న తరువాత గండికోట ముఖ్య పట్టణమయ్యెను. 'మీర్ జుమ్లా' మొదటి నవాబు. అతడు హిందూ దేవాలయములను పడగొట్టించి, శిల్పముతో గూడిన ఆ దేవాలయముల రాళ్ళతో జుమ్మా మశీదును కట్టించెనట ! మాధవస్వామి ఆలయములో గోవధ కావించెనట ! ఈ అత్యాచారములు గోలకొండ నవాబునకు తెలిసి అతనిని శిక్షించుటయేగాక మాధవస్వామి ఆలయమున చెడగొట్టబడిన భాగములను మరల అతడు బాగు చేయించెనట!

మీర్ జుమ్లా రాచగాదెను (ధాన్యపుకొట్టును) నిర్మించెను. అది చాల గొప్పది. అది ఇపుడు బాటసారులకు వసతిగృహముగా ఉపయోగపడుచున్నది. మీర్ జుమ్లా అనంతరము గండికోటను ఆర్గురు పాలించిరి.

చిత్రము - 70

పటము - 5

కోటలోపలి గండికోట పట్టణము. ఎత్తు కట్టడము శత్రువులను గమనించుట కేర్పరుపబడినది.

దూరమున అభేద్యమగు కోటగోడగలదు.


19వ శతాబ్ది ప్రారంభమున కడప నవాబగు అబ్దుల్ నబీఖాను దీనిని పాలించి, రాజ్యమును విస్తరింపజేసెను. క్రీ. శ. 1740 లో మహారాష్ట్రులు అబ్దుల్ నబీని ఓడించిరి. అబ్దుల్ నబీ తన కుటుంబమును సురక్షితముగ గండికోటకు చేర్చుకొనెను. 1780 లో అబ్దుల్ నబీఖాను పరాజితుడు కాగా, ఈ గండికోట టిప్పుసుల్తాన్ స్వాధీనమయ్యెను. ఈస్టిండియా కంపెనీవారి కాలమున మారణ సామగ్రి యగు మందుగుండు ఫిరంగులు ఇందు రక్షింపబడు చుండెను. ప్రకృతము కొన్ని ఫిరంగిగుండ్లు జంబుల (జమ్ముల) మడుగు తాలూకా ఆఫీసునందు భద్రపరుపబడి యున్నట్లు తెలియుచున్నది. ఈ కోటకట్టకడపట కొందరు పాళెగార్ల క్రిందనుండి క్రమముగ ఆంగ్లేయుల స్వాధీన మయ్యెను.

గండికోట కోటగోడలు బలిష్ఠములు. దీని మహాద్వారమువరకు దాదాపు మూడువందల సోపానముల పంక్తి కలదు. లోపల మరియొక ద్వారము కలదు. ఈ రెండుద్వారముల మధ్యభాగమున కోటగోడవెంబడి సైనికులు నివసించు ప్రదేశములు, శత్రువుల రాకను నిరీక్షించు సోరణగండ్లు కలవు. ఈ ఆవరణములోనే శిథిలావస్థయం దున్న గజశాలలు, అశ్వశాలలు పూర్వపు టౌన్నత్యమును చాటుచున్నవి. అచటి ఒక దేవాలయమున శిథిలములు కనిపించును. పడిపోయిన ఒక ద్వారశాఖ పైభాగమున బుద్ధుడు యోగసమాధియందుండి నట్లు కనిపించును. ఎడమవైపున నొక చతురస్రాకృతి గల మసీదు కలదు. దాని దక్షిణపుగోడ వెలుపలిభాగమున 15 కమానులు, తూర్పుభాగమున 20 కమానులు, ఎత్తైన అరుగుమీద నున్నవి. కమానుల లోపల గదులు కలవు. ఇందలి గచ్చుతో దీర్చిన శిల్పము కడు రమ్యముగానున్నది.

ఈ కోటను ప్రదక్షిణముగా చుట్టివచ్చినచో కనిపించు దృశ్యములు పెక్కులు కలవు. వాటిలో ఒక కట్టడము కలదు. అందు పూర్వపు రాజులు ధాన్యమును నిలువ చేయుచుండిరట.

ఈ కట్టడపు నాలుగు గోడలును ఒక్కొక్కటి మూడేసి మూరల మందము కలిగియున్నవి; సుమారు ఇరువదియైదు అడుగులకంటె నెక్కువ ఎత్తుకలిగియున్నవి. లోపల పండ్రెండు స్తంభములు రాతితో గట్టినవికలవు. ఈ స్తంభములు రెండున్నర మూరలు చౌకముకలిగినవిగా నున్నవి. ఇవి యెత్తుగానుండి నాలుగు స్తంభముల పై భాగమున చిత్రమగు కమానుల పొందిక కలిగి ఒక్కొక్క సంధియందును ఇనుపయుంగరములు బిగింపబడియున్నవి. ఈ కట్టడమునకు ఉత్తరభాగమునందు పైప్రదేశమునకు ఎక్కు సోపానముల వరుస కలదు. పై కెక్కిన యెడల కనులు తిరుగును. పై భాగమున పడిన వర్షపు తాకిడి వలన క్రింది గృహములో నుండు ధాన్యమునకు ఎట్టి నష్టము కలుగకుండునట్లు పై కప్పు చక్కని రాతికంకరచే

చిత్రము - 71

పటము - 6

మాధవరాయ దేవాలయ శిథిల గోపురము.

చిత్రము - 72

పటము - 7

రెండు కొండలమధ్య పినాకినీ నది.

బిగింపబడియున్నది. ఈ కట్టడమిపుడు బాటసారుల వసతి గృహముగా ఏర్పాటు చేయబడియున్నది. ఇందు కొన్ని శిలావిగ్రహములు కలవు.

ఉత్తర దిశగల గుట్టపై రంగనాథుని దేవాలయ మొకటి కలదు. దీనికి ప్రాగ్దక్షిణోత్తర దిశలలో ద్వారములు కలవు. లోపలనున్న కల్యాణమండపము, పాకశాల, యాగశాల, ఉత్సవశాల, అలంకారశాల, ముఖ మండపము మున్నగునవి ఆకర్షకములై యున్నవి. ఈ ఆలయమున కెదుట ఒక యెత్తయిన స్తూపమువంటి భాగముకలదు. అది శత్రునిరీక్షకస్థానము. తూర్పున కరిగినచో కోటబురుజులు, సేనానివేశములు గోచరించును. చీకటి పాతరలు, మూడంతస్తులుకల చార్‌మీనారు కలవు. దక్షిణభాగమున నొక కోనేరు కలదు. అందలి నీరు ఎఱ్ఱని రంగుతో నుండును. ఆ జలము దోసిటితో దీసికొనిన రంగు కనబడదు. ఇంకను దక్షిణమున కోటద్వారమొకటి కలదు. అటనొక ఎత్తయిన మిద్దె యున్నది. దానిలో మందుగుండు సామానులు, మారణాయుధములు దాచుచుండిరి. కొండయొక్క కొనభాగమున పోవబోవ ఈశాన్య భాగపుజివర ఊయల లూగుటకయి నిర్మితమయిన సౌధమొకటి కలదు. అందు గండికోట నవాబు తనప్రియురాండ్రతో నుయ్యెల ఊగుచుండెడివాడట. ఆ నివేశనిర్మాణమే ఒక అద్భుత విధానము. అచ్చట ఊగుట ఒక సాహస కార్యమే అట !

తూర్పునగల దర్వాజానుండి ముందునకు తూర్పుగా వెడలినచో మరియొక దర్వాజా కనిపించును. దీనికి ముందు భాగమున నొక పెద్ద మైదానముకలదు. అందు 500 మంది సైనికులు బారుగ నిలుచుండుటకు తగిన వసతి కలదు. కోటగోడకు తూర్పున గోడలోనికి చొచ్చుకొనియున్న ఆంజనేయుని ఆలయమొకటి కాననగును. ఆతనిని కోటకు కాపుగానుండు వీరహనుమంతు డందురు. అటనుండి తూర్పునకు దిరిగినచో కోటప్రధాన, ద్వారము కానబడును. అందలి చిత్రశిల్పము కొనియాడదగినది. ద్వారపు తలుపులు సుమారు పది మూరలకంటె ఎత్తుగ నున్నవి. ఒక్కొక్క వాకిలి వెడల్పు మూడు మూరలుండును. అందు ఎడమప్రక్క వాకిలికి చిన్న పాణి ద్వారమొకటి కలదు. అది మూసిన ఒక వ్యక్తియు బయటికి వచ్చుట గాని లోపలి కేగుటగాని సంభవింపదు. కోటవాకిలి మూయుటకు ఒక గడియ మ్రాను వెనుకభాగమున అమర్పబడియున్నది. వాకిండ్లు వేయుటకును గడియ లాగుటకును ఏనుగుల నుపయోగించెడివారట. దర్వాజామీద నొక అంతస్తును, ద్వారము ముందుభాగమున శత్రువులపై వేడినూనె పోయుటకు కొన్ని రంధ్రములును కలవు. ఆపై భాగమున అన్నిదిక్కులకు తుపాకులు కాల్చుటకు అనువగు రంధ్రములు అమర్పబడి యున్నవి. తలుపులు కొయ్యతో చేయబడిన వైనను అన్ని ప్రక్కలను ఇనుప రేకులు వేయబడియున్నవి. ముందు భాగమున శత్రువుల కభేద్యమగునటుల ఇనుప గుబ్బలు వాడిగ నాటబడియున్నవి. ఏనుగులు ఢీకొన్నను వాటి తలలు పగులవలసినదే కాని తలుపు లూడునట్టివిగా కనిపింపవు. ఈ నిర్మాణము దురూహ్యము, దుర్భేద్యము.

చిత్రము - 73

పటము - 8

తూర్పు దర్వాజాదగ్గఱ చార్మినార్.

కోటచుట్టు నొక అగడ్త మిగులలోతైనది కలదు. కోట వెలుపలి భాగమున దక్షిణపుకొనయం దొక సెలయేరు కలదు. అది కోటలోనికి ప్రవేశించి రాయల చెరువును నింపును. రాయల చెరువులోని నీరు పనుపుపచ్చగ నుండును. ఈ చెరువు పొడవు ఎక్కువ, వెడల్పు తక్కువ. లోతు ఎంతయున్నదో తెలిసికొన్నవారు లేరు ఈ చెరువు ఫలవృక్షములకును పైరులకును జీవనాధారముగ నున్నది. పశ్చిమోత్తర దిశలలో పినాకినీనదియే సహజముగ కోట

రక్షణ కై ఉపయోగపడుచున్నది. రాయల చెరువుయొక్క ఊటనీరును, బావులనీరును నిమ్మ, అరటితోటలకు ఉపయోగపడును. రాతి ప్రదేశమయినను పసుపు, నిమ్మలు అరటిచెట్లు బాగుగా ఫలించును.

కొండాపురము రైల్వేస్టేషనునకు ఈ గండికోట 5 మైళ్ళలో నున్నది. ఈ మార్గమున అగస్త్యేశ్వరుని కోన చూడతగినది. గండికోట, కోటగోడలు, తత్పరిసరపర్వత పంక్తులు, అగస్త్యకోనలోనున్న దేవాలయ గోపురము. పినాకిని, జమ్ములమడుగులోని మసీదులు మున్నగు దృశ్యములు చాల దూరమువరకు అతి రమ్యముగా కనిపించును. తూర్పు ద్వారముకడకువచ్చి లోనప్రవేశించినచో, ఎడమప్రక్కన వీరభట నివాస స్థలములు పెక్కులు శిథిలములై కనిపించును.

ఉత్తరమునకు మరలినయెడల మాధవరాయ దేవాలయము, దానిగోపురము, లోపల ఆగ్నేయభాగమున గల పాకశాల, దక్షిణమున అలంకారశాల, వాహనశాల, నైరుతిభాగమున ఎత్తయిన శిలా స్తంభములతో, ఉన్నతమైన వేదికలతో, అలరారు కల్యాణమండపము, పడమట శ్రీదేవిగుడి, ఈశాన్యమూల పన్నిద్దరాళ్వారుల ఆలయము, ముఖమండప సమీపమున ఆరు ఏనుగుల ప్రతిమలు, అందు ఎత్తయిన అరుగు, దాని మధ్యభాగమున తొట్టె వంటి సభాస్థలము, ఆ తొట్టెలో నాట్యానుగుణమగు విషయములను దెల్పునట్టి రాతివిగ్రహములు, తంబుర, మద్దెల, తాళము మున్నగు పరికరములను ధరించి నాట్యమును దెలుపునట్లున్నవి. రాతి విగ్రహములు పయి భాగమును మోయుచున్నట్లు కనబడును. ప్రతి స్తంభమునకును సింహములు, రౌతులతో గూడిన గుఱ్ఱములు గలవు. ముఖమండప స్తంభముల పై భాగమున కప్పుక్రింద నాలుగుప్రక్కలందును, దశావతారములను, శ్రీ మహావిష్ణువు యొక్క లీలావతారములను వర్ణించు విగ్రహములు మనోహరమైనవిగ కనిపించును. లోపలికి పోయినచో, వాకిటి ముందరను, గడపప్రక్కను, ఖండితమైన శిలాశాసన మొకటి కలదు. అందు "కొండ్రాజు. . . మాధవరాయలకు తోమాల సేవకు సమర్పించిన" అని యున్నది. శాసనము మొదటిభాగ మెందున్నదో తెలియదు. మధ్యభాగమున అక్షరములు స్పష్టముగనున్నవి

గండిపేట అను పేర ఒక గ్రామము కూడా కలదు. ప్రస్తుతమందు 300 ఇండ్లుకలవు. రైతులు, బలిజలు, తురుష్కులు అధిక సంఖ్యాకులుగ నున్నారు. వైశ్యుల అంగళ్ళయందు వస్తువులు లభించును. పెరుగు, పాలు సమృద్ధిగ దొరకును. ఇందు శిథిలావస్థలోనున్న మంత్రుల మందిరములు, సేనాపతుల గృహములు, తత్సమీపమున కొంతవరకు పగిలియున్న ఫిరంగి యొకటి, ప్రాక్పశ్చిమ దిక్కులలో బలమును పరీక్షించుటకై ఎత్తెడు కొన్ని గుండ్లు కనిపించును.

జ. వేం. సు. శ.