Jump to content

సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మూడవ సంపుటము/క్షేత్రస్వరూప రచన-కంచెలు

వికీసోర్స్ నుండి

క్షేత్రస్వరూప రచన - కంచెలు :

(Farm Layout and fences)

వ్యవసాయోత్పత్తిని శక్తిమంతముగ సాధించుటకు పెక్కు అంశములను పర్యాలోచింపవలసి యున్నది. వీటిలో 'క్షేత్ర స్వరూపరచన-కంచె నిర్మాణము' ఒకటియై యున్నది. భారతదేశములో చెదురువాటుగ నున్న స్వల్ప పరిమాణపు భూఖండములపై వర్తమానకాలమున వ్యవసాయ కలాపములు కొనసాగుచున్నవి. ఈ చిన్న భూఖండములకు సవ్యమైన క్షేత్ర స్వరూపరచనము (farm layout) లేకుండుటచే, యంత్రపరికరములను వ్యవసాయ మందుపయోగించుట కష్ట మగుచున్నది. తత్కారణముచే వ్యవసాయోత్పత్తియందు శక్తి సామర్థ్యములు సన్నగిలుచున్నవి.

క్షేత్రస్వరూప రచన మనగానేమి ? అదెందులకు? : సరియగు పరిమాణమును, ఆకారమును, సంఖ్యా విభాగములును క్షేత్రమునకు కల్పించుటయు, ఉత్పాదన శక్తిని పెంచుటకై రహదారులను, వ్యవసాయ గృహ నిర్మాణములను రూపొందించుటయు క్షేత్రస్వరూప రచన మనబడును. సవ్యమైనట్టియు, సరసమైనట్టియు ఇట్టి క్షేత్ర స్వరూపరచనమును గావించుటకై కొన్ని సూత్రములను సామాన్యముగ అనుసరింపవలసియున్నది.

1. క్షేత్రమందు వ్యవసాయదారుని సామర్థ్యమునకు, ఆనుకూల్యమునకు అనువగురీతిగా కట్టడములను నిర్మించుటకై పథకము తయారుచేయుట.

2. పొదుపరితనమును దృష్టియం దుంచుకొని కట్టడములకు నిర్మాణ పథకము రచించుట.

3. వంతు (rotation) ప్రకారము పంటలు పండించు విధానమునకు అనువగు విధమున పొలముల సంఖ్యను, స్వరూప పరిమాణములను ఏర్పాటొనరించుట.

4. క్షేత్రస్వరూప రచనము ననుసరించి మంచినీటి పారుదలకు, మురుగునీటి పారుదలకు వసతు లేర్పరచుట.

5. వేర్వేరు క్షేత్రములను చేరుకొనుటకై వేర్వేరు మార్గములు నిర్మించుటకు పథకము తయా రొనరించుట.

సవ్యమైన క్షేత్రస్వరూప రచనమువలనను, క్షేత్రమందలి కట్టడములవలనను, ఈ క్రింది పెక్కు ప్రయోజనములు సిద్ధించును.

(అ) తరుణము ననుసరించి పంటలు పండించు పథకమును సక్రమముగ రూపొందించి, ఇతోధికముగ దానిని పర్యవేక్షించుటకు వీలగును.

(ఆ) కాలహరణములేకుండ, వ్యవసాయపరికరములను, కార్మికులను, వ్యవసాయోత్పత్తిని చేరవేయుట సుకర మగును.

(ఇ) నీటిని అధికముగ వృథాచేయక, పంటభూములకు ఎక్కువ సులభముగను, సమతూకముగను నీరు పారుదల యగునట్లు సౌకర్య మేర్పరచుట సాధ్యమగును.

(ఈ) పంటపొలము కోతకోసికొని పోకుండ కొంతమేరకు అదుపులో నుండగలదు.

క్షేత్రస్వరూపరచనమందు గమనింపదగిన అంశములు: వ్యావసాయిక విధానముపైనను, క్షేత్రముయొక్క భౌతిక పరిస్థితులపైనను, ఆధారపడి పొలములయొక్క సంఖ్యావివరణము, ఆకారము, పరిమాణము మున్నగు అంశములు క్షేత్రస్వరూపరచనమందు విచారింపబడవలసి యున్నది. విభజింపబడవలసిన పొలములయొక్క కనీస సంఖ్య పంటలసంఖ్యకును, సంపూర్ణముగ ఒకవంతు తిరిగి వచ్చుటకై పట్టు సంవత్సరముల సంఖ్యకును అనుగుణ్యముగ నుండవలయును. ఉదాహరణమునకు, మొదటి మూడు సంవత్సరముల వంతులో వరుసగా చెరకు - గోధుమ - ప్రత్తి; రెండవ మూడు సంవత్సరముల వంతులో వరుసగా వేరుసెనగ - ప్రత్తి - గోధుమ పంటలను పండించుటకు కనీసము సరియైన పరిమాణములు గల మూడు క్షేత్రములుగా భూమిని విభజించుట అవసరమగును.

భూమిని సమచతురస్రములకంటె దీర్ఘచతురస్రములుగ విభజించుటయే ఉచితము. కారణ మేమన. ఇట్లు విభజించుటవలన, పొలము దున్నుట సుకరమగును. దీర్ఘ చతురస్రఖండములందు తక్కువసంఖ్యలో తిరుగుళ్ళు (turns) అవసరమగును. దీనివలన కాలము, శ్రమయు వృథా యగుట తగ్గును. ఒక ఖండముయొక్క వెడల్పునకు దాని పొడవు రెండు రెట్లున్నచో, అట్టి పొలమందు వ్యవసాయము చేయుట వీలగునని భావింపబడు చున్నది.

క్షేత్రములకు సవ్యముగను, సుప్రమాణముగను రూప రచన గావింపబడినచో, వ్యావసాయక కలాపముయొక్క శక్తి సామర్థ్యములు అధికమగును. ఇంతియేకాక, వ్యవసాయ పరికరములు, యంత్రములు, పొలముయొక్క సాధారణ నేలమట్టము, నీటిపారుదల వనరులు మున్నగు విషయములపై ఆధారపడి, పొలములయొక్క పరిమాణము నిర్ణయింపబడవలసి యున్నది.

వ్యవసాయమునకు ఉపయోగపడు పరికరములనుబట్టి, యంత్రములనుబట్టిగూడ పొలముయొక్క పరిమాణము మారవచ్చును. ఉదాహరణమునకు (ఎ) 1/40 ఎకరము విస్తీర్ణముగల తోటలలో గడ్డపలుగువంటి పరికరము (బి) యెకరము విస్తీర్ణముగల పొలములలో దేశవాళీ నాగలి; (సి) 10 మొదలు 15 యెకరముల విస్తీర్ణముగల భూములలో ట్రాక్టరు ఉపయోగపడును.

మెట్ట వ్యవసాయమందు పెద్ద పరిమాణముగల భూ ఖండములు లాభదాయకము కాగా, పల్లపు వ్యవసాయమందు అంతకంటె తక్కువ విస్తీర్ణముగల ఖండములు ప్రయోజనకరములగుచున్నవి.

వ్యాపారపు పంటలు పండు భూములు పెద్ద ఖండములుగా విభజింపబడును. కాని పరిశోధనముల కుపయోగ పడు భూములు అంతకంటె తక్కువ పరిమాణముగల ఖండములుగా విభజింపబడు చున్నవి.

భూమిని చక్కగా, సమతలముగ మట్టముగావించినచో, దానిని అధిక ప్రమాణముగల ఖండములుగ విడదీయవచ్చును. కాని సమతలముగ లేని ప్రదేశమందు భూమి కోతకోయబడకుండ తప్పించుటకై స్వల్ప పరిమాణముగల ఖండములుగ విభజించుటయే మంచిది. భూమియొక్క ఏటవాలుడు (slope), నిట్రముగ (steep) నున్నచో, కట్టలు నిర్మించి సమతలములైన ఖండములను తయారుచేయ వచ్చును.

లోతులేని నీటి వనరులపై ఆధారపడు భూములను 1/5 యెకరము విస్తీర్ణముగల ఖండములుగను, బావినీరుపై ఆధారపడు భూములను 1/2 నుండి 1 యకరము విస్తీర్ణముగల ఖండములుగను గొట్టపు బావులపై ఆధారపడు, భూములను 1 నుండి 2 యకరముల విస్తీర్ణముగల ఖండములుగను, కాలువనీటి సాయముపై ఆధారపడు భూములను నీటిపారుదల స్థితినిబట్టి ఎక్కువ తక్కువ విస్తీర్ణములుగల ఖండములుగను విభజింపనగును.

రోడ్లు, మంచినీరు పారుదల మార్గములు : పొలములపై పంటపండి సిద్ధముగా నున్నప్పుడుగాని, లేక వర్షాకాల మందుగాని, కార్మికులు పొలములందు ప్రవేశించి పని చేయుటకు రోడ్లు ఉపయోగపడును. ఈ రోడ్లు పొలములకు సరిహద్దులుగను, గట్లుగగూడ నుపయోగపడును. ఇట్టి రోడ్లు సాధ్యమైనంత ఎత్తుగానుండి, వర్ష జలము వాటిపై పొర్లిపోకుండ నుండవలయును. ఇవి బండ్లు పోవుటకుగూడ నుపయోగపడవలెనన్నచో ఇవి 10 అడుగుల వెడల్పున నున్న సరిపోవును. కాని అంతకంటె ఎక్కువ వెడల్పయిన సాధనములకు రోడ్డును 15 అడుగుల వరకు విస్తృత పరచవచ్చును.

భూమి సమతలముగ నున్నయెడల భూమట్టమునకు క్రిందుగా ఒక అడుగులోతున కాలువలు తవ్వినచో, పొలమునందలి రోడ్లు మురుగునీరు ప్రవహించుట కుపయోగించును. ఇందువలన భూమి వృధాకాక, పొదుపగును. పొలముల మట్టముకంటె నీటి పారుదల మార్గములను లోతుగ త్రవ్వినచో, అవి మురుగునీటి కాలువలుగా నుపయోగ పడగలవు.

కంచె నిర్మాణమందలి ఉద్దేశము: పెంపుడు జంతువులు గాని, ఇతర జంతువులు గాని ఒక ప్రదేశమందు స్వేచ్ఛగా సంచరింపకుండ నిరోధించుటయే కంచెవేయుట యందలి ఉద్దేశమైయున్నది. కంచె నిర్మాణము మూడు కార్యములకై ఉపయోగ పడుచున్నది మొదటిది, ఒక నిర్ణీత ప్రదేశమందు జంతువులను నిర్బంధమందుంచుట: రెండవది, సరిహద్దును ఏర్పరచుకొనుట; మూడవది, విచ్చలవిడిగా తిరుగు జంతువులనుండి పంటలను రక్షించుట.

కంచె యందలి రీతులు : వర్తమాన కాలములో కంచె నిర్మించుటయందు వేర్వేరు రీతులు ఆచరణయందున్నవి. ప్రధానమైన విధానములు వీటిలో మూడు: (1) సచేతనములైన మొక్కలతో కంచె నిర్మించుట. (2) అచేతనములైన ఇటుక, కొయ్య, రాయి, ఇనుప ఊచలు, తీగెలు మొదలగువాటితో కంచె నిర్మించుట. (3) ఎలెక్ట్రిక్ తీగెతో కంచెవేయుట.

సచేతనమైన కంచె : సీమచింత, గోరింట, కిత్తనార, నాగదాళిచెట్లు, సరుగుడు, వెదురు, చిల్లకంప, బ్రహ్మజెముడు మున్నగునవి కంచె నిర్మించుట కుపయోగపడు చున్నవి. వీటిని వర్షములలో నాటి చక్కగ పోషింపవలయును. వీటి అగ్రములు సమముగ కత్తిరింపనిచో, అవి ఎగుడు దిగుడుగా పెరుగును. లోపములు : ఇట్టి కంచెను నాటుటయందు ప్రారంభదశలో ధనవ్యయము స్వల్పమైనము, దానిపోషణ కాలములో మిగుల శ్రద్ధ వహింపవలసి యున్నది. ఇట్టి కంచె పెరిగి, పెద్దదై ఉపయోగపడుటకు చాలకాలము పట్టును.

అచేతనమైన కంచె : పంటభూములకు ఇటుకలతో నిర్మింపబడిన ఆవరణము ఉపయోగపడక పోవుటేకాక, అది వ్యయశీలమైనదిగా నుండును. సామాన్యముగ చిన్నతోటలకును, బంగళాలు మొదలగు వాటికిని మాత్రమే ఇటుక గోడలు ఆవరణముగ నిర్మింపబడును. స్వేచ్ఛా సంచారముచేయు పశువులనుండి తోటలయందు పెరుగు వృక్షములను, చిన్న మొక్కలను రక్షించుటకు ఇటుక గోడ లుపయోగపడును.

కలప చౌకగాను, పుష్కలముగాను లభించు ప్రదేశములందు వేర్వేరు విధములుగ అట్టి కలపతో కంచె నిర్మింపబడును. పొలమునుండి పంట తరలింపబడిన అనంతరమును, లేదా దానిని విస్తృతపరచినపుడును, ఇట్టి కంచెను ఒకచోటునుండి మరొకచోటుకు కదలింపవలసివచ్చుటచే, ఇది తాత్కాలిక మైన కంచెగా ఉపయోగించును.

రాయి సులభముగ లభ్యమగు ప్రదేశములలో పొలము చుట్టును రాళ్ళను ఒకదానిపై నొకటి పేర్చి కంచెగా ఉపయోగింతురు. ఆయా ప్రదేశములందు దొరకు రాళ్లయొక్క పరిమాణమునుబట్టి కంచెలయొక్క నిర్మాణ విధానము మారుచుండును. రాళ్లు తరచుగ క్రిందకు దొర్లి పడిపోవుటచే, ఎప్పటికప్పుడు వీటినిగూర్చి జాగ్రత వహింపవలెను. అంతియేగాక, జంతువులు పొలములో ప్రవేశింపకుండుటకై రాళ్లతో నిర్మించిన కంచె అంతగా ప్రయోజనకారి కాజాలదు.

ముళ్లతీగ (barbed wire), అల్లకపు తీగె (woven wire) అను రెండు విధానములచేగూడ కంచె నిర్మింపబడును. ముళ్లతీగె రెండుతీగెలచే పెనవేయబడి, 4-10 అంగుళముల దూరమున వాడియగు ఒక్కొక్కముల్లు దానికి అమర్చబడి యుండును. అల్లకపుతీగెకు సహాయకారిగా నుండుటకును, కంచెను ఎత్తుగా నిర్మించుటకును, ముళ్లతీగెను దానికి పైవరుసలో బంధించెదరు. సాధారణముగ ఈ కంచె ఎత్తు 5 అడుగులుండును. 10 నుండి 12 అడుగుల దూరమున భూమిలో పాతబడిన స్తంభములకు వరుసగా ఒకదానిపై నొకటి అయిదువరుసలలో తీగెలు నిర్మింపబడును. అట్టడుగున నుండు తీగె భూమికి 9 అంగుళములు ఎత్తులో అమర్పబడును. భూమిలో పాతబడు స్తంభముల యొక్క అగ్రములు అన్నిటికంటె పై వరుసలో అమర్పబడిన తీగెకు పైగా, మూడంగుళముల ఎత్తున నుండును. ఈ ముళ్లతీగె - అల్లకపు తీగెయొక్క మిశ్రమము వలన ఏర్పడిన కంచె పశువుల బెడద నుండి పొలములకు సమర్థవంతముగ రక్షణ నీయగలదు. కోళ్లు మొదలైన విలువగల స్వల్పజంతువుల రక్షణకై ఎన్నడును ముళ్లతీగె నుపయోగింపరాదు. ఇట్టి జంతువుల రక్షణమునకు అల్లకపుతీగె సత్ఫలితము లొసగును.

అల్లకపుతీగె సాధారణముగ రెండు విధములుగ తయారగును మొదటిది సన్నని తేలికయగు తీగెచే షట్కోణాకారముగ అల్లబడును. ఇట్టి తీగెతో తయారైన కంచెల మధ్యమందు, పెద్ద జంతువులనుగాక, కోళ్లు మున్నగు బలహీనములైన అల్పజంతువులను మాత్రమే ఉంచెదరు. రెండవది వలవంటిది. ఇది దీర్ఘ చతురస్రముగ నుండును. బరువగునట్టియు, బలాఢ్యమగునట్టియు జంతువులను బంధించి యుంచుటకై మందమగు బరువు తీగెచే ఇది అల్లబడును. అడ్డముగనుండు తీగెలు బరువుగను, ఎడతెగకను ఉండును. అదుపులోనుండు జంతువుల పరిమాణమునుబట్టి తీగెలమధ్యనుండు దూరము నిర్ణయింపబడును. కాని సామాన్యముగ అల్పజంతువులను అదుపు నందుంచుటకై అడుగుభాగమున ఖాళీయుంచక మూసివేయబడును. నిలువుతీగెలు అడ్డతీగెలచే మెలివేయబడి గాని, లేక ప్రత్యేకమైన తీగెముక్కలచే బంధింపబడిగాని ఉండును

కంచెపాతుడు గుంజలు : పాతుడుగుంజలపై కంచెయొక్క బలమాధారపడి యుండును. ఈ గుంజలు మిగుల దృఢముగనుండి, భూమిలో కదలకుండునట్లు బలముగ పాతబడవలయును. పాతుడుగుంజలు సాధారణముగ కొయ్య, రాయి (లేక కాంక్రీటు), మరియు లోహ సంబంధమగు ద్రవ్యముచే తయారు చేయబడును.

ప్రారంభములో కొయ్య గుంజలు చౌకగా తయారు కాబడి, భూమియందు సులభముగ పాతుటకు వీలయినను, అవి చెదపురుగులకు గురియగుటచే, వాటి జీవితము అల్పముగ నుండును. దీర్ఘకాలము మన్నుటకును, చెదపురుగులబారి పడకుండుటకును, భూమిలోనికి పోవు గుంజలయొక్క అడుగు భాగమును కరిగిన 'కోల్టారు'తో గాని, ‘క్రియెసొట్' ద్రావణముతో గాని పూత పూయుదురు. సాధారణముగ ఈ గుంజలమందము 5 నుండి 7 అంగుళములును, మొత్తము పొడవు 7 నుండి 8 అడుగులు నుండును.

కాంక్రీటు స్తంభములకంటెను, ఉక్కు స్తంభములకంటెను, రాతి స్తంభములు చౌకగా లభింపగలవు. అయితే అవి సులభముగ అందుబాటులో నుండగలవా అనునదే ప్రశ్న. కాని రాతి స్తంభములకు ఏపాటి గట్టి దెబ్బ తగిలినను, అవి పగులును. ఇట్టి స్తంభములకు కంచెతీగెను ముడివేయుట సులభముకాదు. స్తంభములకు చిల్లులు తొలచిగాని, లేక ఇనుప కొక్కెములు అమర్చిగాని, తీగెను వాటిలో చొప్పింపవలయును.

రాతి స్తంభములుగాని, కాంక్రీటు స్తంభములుగాని సామాన్యముగా 6 అడుగుల పొడవుండును. 11/2 అడుగుల వరకు భూమిలోనికి పాతి, తీగెను కట్టుటకై భూమిపైన 41/2 అడుగుల మేరకు ఉంచవచ్చును. రాతి స్తంభములు దీర్ఘ చతురస్రముగనుండి 9×7 అంగుళముల మందముండును. 'కాంక్రీటు స్తంభములు కొన్ని వర్తులాకారముగను, కొన్ని చతురస్రముగనుండును. కాంక్రీటు స్తంభములుగూడ కూచియాకారము (tapering shape)లో లభ్యమగును. ఇవి అడుగుభాగమున 6 అంగుళములు, చివర భాగమున 4 అంగుళములు మందము కలిగి యుండును.

లోహ స్తంభములు ఉక్కుతోడను, పోత ఇనుముతోడను చేయబడును. ఇవి కొయ్య, కాంక్రీటు, రాతిస్తంభముల కంటెను మిగుల బలిష్ఠములై ఉరుములు, మెరుపులు, పిడుగు దెబ్బలకు తాళగలిగియుండును. త్రుప్పు పట్టకుండ వీటిపై రంగు పూయవచ్చును. కోణాకారముగ నుండు ఈ యినుప స్తంభముల కనిష్ట, గరిష్ట మందములు వరుసగ 11/2"X11/2"X1/4" నుండి 2"X2"X1/4" వరకు ఉండును. గరిష్ట మందముగల స్తంభములను మూలల యందును, కనిష్టమందముగల స్తంభములను వాటి నడుమను పాతవలయును. మూలలయందుగల స్తంభములు అధికమగు ఒత్తిడికి తట్టుకొనవలసి యుండుటచే, వాటి మందములు అధికముగ నుండవలయును. దీర్ఘకాలము మన్నుటకై ఈ స్తంభములు సున్నము, కంకరతో నింపిన గోతులయందు పాతబడును.

ఎలెక్ట్రిక్ కంచె : పై నుదహరించిన కంచెలతో పాటుగ ఎలెక్ట్రిక్ తీగెలతోగూడ కొన్ని ప్రదేశములందు-ముఖ్యముగ డెయిరీ వ్యవసాయ క్షేత్రములందు—కంచెను నిర్మింతురు. క్షేత్రావరణమునుండి బాహ్య ప్రదేశములలోనికి పశువులు పోకుండ నిరోధించుటకై ఎలెక్ట్రిక్ కంచె నిర్మింపబడును. సుమారు 600 వోల్టులు శక్తిగల విద్యుచ్ఛక్తిని తీగెలందు ప్రవేశ పెట్టినచో, అట్టి తీగెను తాకిన యెడల చురుకైన ఆఘాతము తగులును. అట్లుగాక, విద్యుచ్ఛక్తి పాటవమును 11 మిల్లి ఆంపియర్ల (.011 amperes) వరకు మాత్రమే పరిమిత మొనర్చినచో, దాని వలన ప్రమాదముండదు. ఈ కాలమున పెక్కు కంపెనీలు ఎలెక్ట్రిక్ కంచెను నిర్మించుటకై అవసరమైన పరికరములను సమకూర్చుచున్నవి. 75 అడుగుల దూరమున పాతబడిన స్తంభములపై ఇన్స్యులేటర్లు అమర్చబడును. నున్నని తీగె నొకదానిని స్తంభములమీదుగా ఇన్స్యులేటర్లలో చొప్పించెదరు. అనువైన యంత్రముద్వారా ఈ తీగెలో విద్యుత్తును ప్రవేశ పెట్టుదురు. ఇట్టి విద్యుత్ తీగెను తాకిన జంతువునకు నిశితమైన ఆఘాతము తగులును. కొన్ని తరుణములందు నేల మిక్కిలి పొడిగా నున్న యెడల, ఎలెక్ట్రిక్ తీగెకు కొన్ని అంగుళములు ఎడముగా మరొక తీగె అమర్చబడును. రెండుతీగెలు తాకిననేగాని, జంతువునకు చురుకుముట్టదు. పెద్దజంతువులను అదుపునం దుంచుటకై నేలమట్టమునుండి 36 నుండి 40 అంగుళముల పైగా ఎలెక్ట్రిక్ తీగె అమర్పబడును. ఇట్టి ఎలెక్ట్రిక్ తీగెలు వీధులయందలి 'లైన్ కరెంట్' వలనగాని లేక బ్యాటరీల వలనగాని పనిచేయగలవు.

సమాప్తి : సశాస్త్రీయముగ వ్యవసాయము చేయుటకై పంటపొలములకు సలక్షణముగ కంచె నిర్మించుట యొక ముఖ్యలక్షణమై యున్నది. కంచెవేయుటవలన చోరులనుండియు, పశువులు మొదలైన వాటినుండియు పంటను రక్షించుకొనుటయేగాక, కొన్ని వ్యవసాయ కలాపములలో కాలమును, శ్రమను పొదుపుచేసికొనుట సాధ్యమగుచున్నది. అందుచేత ఈ ప్రక్రియలు వ్యవసాయోత్పత్తిని పెంపొందించుకొనుటకు పరోక్షముగ సహాయకారు లగుచున్నవి.

పోడిమి గలిగినట్టియు, సమర్థవంతమగు నట్టియు కంచె విధానమును ఎన్నుకొనుటయందు సామాన్యుడైన వ్యవసాయదారుడు జాగరూకత వహింపవలయును.

బి. ఆర్. బి.