Jump to content

సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మూడవ సంపుటము/క్షేత్రయ్య-II

వికీసోర్స్ నుండి

క్షేత్రయ్య II (సాహిత్యము) :

ఆంధ్ర వాఙ్మయ ప్రపంచమున క్షేత్రయ్య జీవితము సాహిత్య త్రివేణీ సంగమము. క్షేత్రయ్య రససిద్ధుడగు ఆంధ్ర వాగ్గేయ కారుడు. పదకవితా పట్టభద్రుడు. ఆంధ్ర జయదేవుడు. మధుర భక్తి కలకండములు పండజేసినట్టి ధన్యజీవి క్షేత్రయ్య.

అన్నమయ్య, త్యాగయ్య. క్షేత్రయ్య అను నీ త్రిమూర్తులును సుప్రసిద్ధ వాగ్గేయకారులై వరలిరి అన్నమయ్య ఆంధ్ర సంర్తన కవితా పితామహు డని పేర్వడసెను. త్యాగయ్య భక్తిపరవశుడై కృతులు పాడెను. క్షేత్రయ్య రసపరవశుడై పదములు వ్రాసెను. త్యాగయ్య అనంతరాగ కలశములందు, లోకులాస్వాదించుటకై. రామ ముఖారవింద మకరందమును తేరిచి పోసినవాడు. క్షేత్రయ్య తన పదములందు శ్రీ కృష్ణుని కోమల పాదములందు గుల్కిన మువ్వల మ్రోతను జాను తెనుగులచే పొదిగినవాడు. త్యాగయ్య నాదబ్రహ్మోపాసకుడు; క్షేత్రయ్య రమ్యకళోపాసకుడు.

పదమనగా అభినయమునకు పనికివచ్చు శృంగార గేయము. జావళీలలో లేని సర్వకళా సౌష్ఠవము, తాళ విలంబనము పదములలో కాననగును. భానుదత్తుని రసమంజరి యందలి లక్షణములకు అభినయరూపమైన లక్ష్య సామగ్ర్యము నొసగినవారు కూచిపూడివారు. పదరూపమైన మనోహర లక్ష్యసమగ్రత నొసగినవాడు క్షేత్రయ్య. ఇతని పదములలో లక్షణానుసరణము, రసభావ ప్రకటనము, సమప్రాధాన్యము వహించి, అహమహమికతో పరుగిడు చుండును. క్షేత్రయ్య రాగము, తాళము, అభినయము అను నీ మూడు మార్గములలో తన పరమభక్తి ప్రవాహమును నడిపించిన ఘనుడు.

నాయికా నాయక భావమున రసరాజగు శ్రీకృష్ణపరమాత్మయందు రసరాజమగు శృంగారభక్తిని ప్రవర్తింప జేసి అది స్వపరతారక మగున ట్లొనర్చిన నిరవధిక కృష్ణభక్తి పరినిష్ఠితుడు క్షేత్రయ్య.

క్షేత్రయ్య నాయికలకు గల విరహము, సంయోగము అను రెండు విధములైన శృంగారములయందు గూడ జనించు గ్లాని, శంక, అసూయ, దైన్యము, ఆవేగము, అవహిత్థ, హర్షము మున్నగు భావావస్థలలో వాటి వాటికి తగిన రాగతాళములను ఏర్చి, కూర్చి తన సంగీత శాస్త్రాది రహస్యాభిజ్ఞతను, వైదుష్యమును వెల్లడించినాడు

క్షేత్రయ్య పదములందు విస్తరింపబడిన సంయోగ విప్రయోగము లను రెండువిభాగములలో రెండవదానివే రసికులు మధురమైన దానినిగా స్వీకరించిరి. క్షేత్రయ్య నాయికకు నాయకునితోడి వియోగమువలన ఏర్పడు పలు రకముల దుఃఖములను ఉదహరించుచు, వాటికి తగిన ముఖారి, ఘంట, నాదనామక్రియ, పున్నాగవరాళి మొదలగు రాగములను అభినయించుట కనువగు త్రిపుట, చాపు, అట మున్నగు తాళములను సమకూర్చినాడు.

జయదేవాదులు వడియగట్టిన సంస్కృత భాషా మాధుర్యమును మించిన తీపి తెనుగునందు కలదని తన పదరచనాద్వారమున ప్రకటించిన మహావిద్వాంసుడు క్షేత్రయ్య. ఇతని పదములలో కొన్ని నాయికా వాక్యములు, కొన్ని నాయక వాక్యములు, కొన్ని దూతికా వాక్యములు, మరికొన్ని నాయికా నాయకుల సంభాషణ రూపముననున్న వాక్యములును కలవు. ఇతని పదములలో విరహోత్కంఠ యగు నాయిక విరహబాధను సహింప జాలక తన గోడును చెలికత్తెతో వెల్లడించు ఘట్టములు పెక్కులు గలవు. ఇట్టి విరహవర్ణనాత్మక పదబాహుళ్యముచే పదములందు సాత్త్వికాభినయమునకు చేకూరిన అవలంబనము అనంతమైనది. నాయకుడు అన్యాసక్తుడై యుండుట నెరిగి, నాయిక అతనిని ఉపాలంభించు ఘట్టములు, వాసవసజ్జిక, ఖండిత మున్నగు నాయికలు తమ భావాభివ్యంజన మొనర్చు ఘట్టములు అచ్చటచ్చట కనిపించుచున్నవి. క్షేత్రయ్య అన్యాపదేశముగా ఆత్మీయాం శములను చెప్పు తావులునున్నవి ఆత్మభావోద్రేకత, శక్తి, రసభావపూర్ణత గలవి క్షేత్రయ్య పదములు. క్షేత్రయ్య పదములందలి రసము ప్రధానముగ శృంగార మగుట చేతను, దాని నాతడు చిత్రించినరీతి మిక్కిలి రమ్య మగుట చేతను, అతని పదములు సర్వజనాహ్లాదకరములైనవి.

శృంగార వర్ణనమున సభ్యత పరాకాష్ట నొందిన తావులు పెక్కులున్నవి.


“పచ్చియొడలి దానరా...
"ఇన్నాళ్లవలె గాదమ్మా. . .
“వెదకి తేరా, పోయి, వేరు వెల్లంకి ... ఇత్యాదులు

ప్రకృతమునకు ఉదాహరణములు.

శృంగారరసము అసభ్యముగ పరిణమించిన తావులునుగలవు. ఎడనెడ విప్రలంభము భక్తి రసముచే ఉప బృంహితమైనది కూడ — ఇట్టి రసముల మేలికలయికలో అశ్లీలమునకు గాని, సిగ్గునకు గాని తావే లేదనవచ్చును. మొత్తముమీద క్షేత్రయ్య పదములలో మోక్ష కామోపేతమైన ఉజ్జ్వల శృంగారముయొక్క ఛాయలు తక్కువ. స్త్రీపుంసయోగ హేతువగు లౌకిక శృంగారమే అతి నిపుణముగను, హృద్యముగను అభివర్ణితమైనది;

క్షేత్రయ్య పదములందు భాషకును, భావమునకును సామరస్యము స్ఫుటముగ గోచరించుచున్నది. అనగా భాషయు, భావములును తుల్యమైన సౌకుమార్యము కలవై శోభించుచున్నవి. ఉదా :


"అయ్యయ్యో! వెగటాయెనే...
“తరుణిరో! న న్నాడుదాని జేసిన విధి...
"ఎవతె తాళునమ్మా యీ నడతల ...
"వాడిచ్చిన సొమ్ము లేల వద్దంటివి...
"తెలియవచ్చెనురా, వగలెల్ల ...
“ఎందులకు వచ్చెనో కోపము ...
“నోరెత్త నైతినమ్మా...
"నీకే దయరావలె కాక దిక్కెవ్వరు...
“నిదురవచ్చున కంటికి స్వామి...

ఇత్యాది పదములందు పరిపుష్టమైన భావ సౌకుమార్యము అనితరతుల్యము. క్షేత్రయ్య పదములందు ఆయా నాయికలకు ఆయా దశలందు ఏర్పడు ఆయా భావములను ప్రతిపాదించు వాటిలో కొన్నింటికి ఉదాహరణములు :

నాయిక - స్వీయ - తృప్త :


                              మోహన - జంపె
మగువ తన కేళికా-మందిరము వెడలెన్
వగకాడా మాకంచి_వరద! తెల్లవారె ననుచు. ॥మ॥
విడజారు గొజ్జంగి–విరిదండజడతోను
కడు చిక్కు పడి పెనగు-కంటసరితోను
నిడుదకన్నులదేరు- నిదుర మబ్బుతోను
తొడరి పదయుగమున దడబడెడు నడతోను. ॥మ॥
సొగసి సొగయని వలపు-సొలపు జూపులతోను
వగవగల ఘనసార - వాసనలతోను
జిగిమించు కెమ్మోవి చిగురు కెంపులతోను
సగము కుచముల విదియ చందురులతోను. ॥మ॥
తరితీపు సేయు సమ - సురతి బడలిక తోను
జిరుతపావడ బెరగు-జార్పైటతోను
ఇరుగడలకై దండ - లిచ్చు తరుణులతోను
పరమాత్మ ! మువ్వగోపాల ! తెల్లవారె ననుచు. ॥మ॥

ఈ నాయిక స్వీయ. రతితృప్త, రతిశ్రమాలన, నిదుర బద్ధకముతోను, రేయి ప్రవర్తిల్లిన క్రీడా చిహ్నములతోను, కూటమి యందలి వివిధ విభాగములు. వాటి యందలి రసము చిప్పిలుచుండు భావములతోను, ఆమె కేళీమందిరమును వీడి వచ్చు సొగసు, శృంగార విభావముగా ఇట ప్రస్తావింపబడినది. ఈ నాయిక పరకీయ కాదు. పరకీయకు ఉపపతితోడి కేళీమందిరము, ఇరుగడల కైదండ లిచ్చు సఖులు నుండుట సహజోచితము కాదు. ఈమె తెనుగు ఆడది. కనుకనే సగము కుచముల విదియ చందురులతో వెలయు చున్నది. 'అరచాటగు నాంధ్ర వధూటి చొక్కవుం జనుగవ' అగుటవలననే విదియ చందురులవంటి గోరువంకలు అటనుండుట గన్పడినది. ఇది రతిస్థాయి యగుట సరియే కాని నిర్వేదము, గ్లాని, విషాదము, పశ్చాత్తాపము, చింత, పరులు చూడకుండ తన కూటమిని సవరించుకొని తన ఇంటికి వచ్చుట అను సంచారు లిట లేవు. కావున ఈమె స్వీయయే. రతితృప్తయై తన కేళికామందిరమునుండి తెలవారగా వెడలు చున్నది. అనుభోగావస్థలోనిది ఈ శృంగారము. నాయకుడు అనుకూలుడు.

నాయిక - స్వీయ - అతృప్త:


                 రేగుప్తి రాగము - ఆది తాళము
ఒక్కసారికే యీలాగైతే - ఓహోహో! యిదేటి రతిరా !
దైన్యము, శ్రమ, హేళన, వితర్కము.
మక్కువ దీర్చర - మా మువ్వగోపాల !
        ఔత్సుక్యము, ప్రార్థన.
సొక్కియున్న నీ - సొగసది యేమిర ! ॥ఒక్క॥
   గ్లాని, హేళన, దైన్యము, శంక
నెమ్మొగమున నీ బడలిక లేమిర.
     శ్రమ, శంక,
       నీటుకాడ ! రొమ్మదిరే దేమిర.
       సొగసు, శ్రమ, వితర్కము.
కమ్మని వాతెర కందిన దేమిర!
హర్షము, వితర్కము, శ్రమ,
       కాళ్లును చేతులు తడబడుటేమిర ! ॥ఒక్క॥
       దైన్యము, శంక, వితర్కము.
కన్నుల నిద్దుర గమ్మే దేమిర!-
  అలసట, శంక -
    గళమున చెమ్మట కారే దేమిర!
    గ్లాని, అసూయ, వితర్కము.
తిన్నని పలుకులు - పలుకవ దేమిర !
    శ్రమ, గద్గదిక
   తెలిసి తెలియకున్నా వదేమిర! ॥ఒక్క॥
   జడత, గ్లాని, వితర్కము.
ఇనపురి ముద్దుల- మువ్వగోపాలా !
   ధృతి, హర్షము, ఔత్సుక్యము,

ఏపు మీర నను కలిసితివౌరా !
సంగ్రహ ఆంధ్ర
దైన్యము, ధృతి, హర్షము, రతిరీతులు, మోహము.
మనమున నిను నెర-నమ్మిన దానర !
   హర్షము, మోహము, ధృతి.
      మారు బలుకకున్నా వదేమిర ! ॥ఒక్క॥
   విషాదము, గ్లాని, అసూయ, వితర్కము.

ఈ నాయిక తన అతృప్తిని వెల్లడించుటలో నాయకు నందు కన్పడుచున్న అన్యాసంభోగ చిహ్నములను నిదర్శించు చున్నది. ఈమె పరకీయకాదు. "ఒక్కసారికే యీలాగై తే" అనుట ఈమెకు సహజముకాదు. అన్యాసంబంధపు బడలికతో పరకీయ యొద్దకు నాయకుడు పోవుటయు అస్వాభావికము; అసంభవముకూడా. కాగా నాయిక స్వీయయే. నాయకుడు పతి, దక్షిణుడు. నాయిక సురతాసక్తితో నెనసినది. తమిదీరలేదు – భావ ప్రాప్తి సిద్ధించలేదు. మొగమున బడలిక, రొమ్ము అదరుట, కమ్మని వాతెర కందుట మున్నగు ఈతని శరీర లక్షణములను జూచి ఈర్ష్యకలదైనది - ఖండిత యైనది. కాని ఈమె ధీర కాదు; అధీర, మధ్య. కావుననే నిష్ఠురము లాడుచు, అతని పొరపాటు అతనికి కనబరచుచున్నది. పై లక్షణము లన్నింటికి కారణమేమని గ్రుచ్చిగ్రుచ్చి అడుగుచున్నది.

నాయిక - స్వకీయ - స్వాధీన పతిక :

ఈమె సంభోగశృంగారమును అనుభవించిన ఆనందమును నిలుపలేక, ఇప్పటి తనప్రియుని ఇతరులు అపహరించు కొని పోకుండ దాచుకొనుటకై సకరుణముగా తహతహ పడుచున్నది. ఇందలి శృంగారము గమనింప దగినది.


             కళ్యాణిరాగము - రూపకతాళము
పల్లవి : ఎందుదాచుకొందు నిన్ను - ఏమి సేతునేను.
            భీతి, ఆవేగము, చపలత, భీతి.
అను ప : అందమైన నీ మోము - అయ్యారె !
            హర్షము, తృప్తి, విస్మయము,
              ముద్దులు గులుకుచున్నది.
            ఔత్సుక్యము, అభిలాష.
1. అందిందు తిరుగకురా ! - అతివలు నీతోడి.
  అమర్షము, దైన్యము - అమర్షము, హర్షము.


పొందుగోరి ఆవేళ - పొగరుచు నున్నారు.
        ఈర్ష్య, ఉగ్రత, మత్సరము.
ఎందరెందనికాతు - ఎంతనినే విన్నవింతు.
దైన్యము, అమర్షము, దై న్యము, విసుగు.
పందె మాడుకొన్నారట.
ఉగ్రత, భీతి, విస్మయము,
                పట్టుకపొయ్యెద మనుచు ॥ఎం॥
                      ఉగ్రత, భీతి.
పలుమారు నాసామి! బయలుకు వెళ్లకు మ్రొక్కేను.
 దైన్యము, హర్షము విషాదము, భీతి, అనునయము.
నిలుపరాని మోహమున - నిన్నుజూచి చెలులు
 ఆవేగము, మోహము - హర్షౌత్సుక్యములు, అసూయ.
అలరు నీ మోవి తేనె - యాని చప్పరించవలసి
హర్షౌత్సుక్యములు - తృప్తి, చపలత.
కులుకు గుబ్బలరొమ్ము - గ్రుమ్మిపొయ్యెద మనుచు ॥ఎం॥
    హేళన, అసూయ - ఉగ్రత, విషాదము.
ముదముతో నాముద్దు - మువ్వగోపాలసామి !
    హర్షము, ప్రీతి - తృప్తి, వేణువాదనాదికము.
గుదిగొన్నతమకమున - గూడి యిద్దరము .
హర్షము, ఔత్సుక్యము - ముదము, తృప్తి.
నిదురపరవశమున – వదలునో కౌగిళ్లు
   సుప్తి, ఆధిక్యము - శ్లథత, భీతి, ఆవేగము.
పదిలముగ నా జడను - బట్టికట్టుకొందునా ॥ఎందు॥
ధృతి, సర్పాకారము - తృప్తి, వితర్కము.

ఈ నాయిక నాయకుని దాచుకొనుటనుగూర్చి చాపల్యముతో, ఆవేగముతో, ఔత్సుక్యముతోనున్నది. ఇట్టిచోట నిలుకడ కుదరదు. కనుకనే అట తాళముకంటే త్వరితముగా రూపకతాళముతో ఈ పదము ఉపక్రమింపబడినది. దీనిచే భావానురూపముగా నాయికల దశలనుబట్టి కవిచే తాళములు గూర్పబడిన వని తేటపడుచున్నది.

నాయిక ప్రసన్న :


             భైరవిరాగము - అటతాళము
పల్ల: అపురూప దర్శనం - బాయె గద నేడు
            హాస్యము - అవహిత్థ, హర్షము.
అనుప: కృపగలద మామువ్వ గోపాలసామి !
           దైన్యము, శంక, కృష్ణలీలలు.
ఎన్నాళ్ళ కెన్నాళ్ళ - కీ వీథిలో నిన్ను
           హర్షము - వితర్కము.
కన్నుల పండుగగాను - కనుగొంటి నేడు
ఔత్సుక్యము, హర్షము - దై న్యావేగములు.
ఉన్నదా నామీద ఉల్లమున దయ నీకు
శంక, వితర్కము - అమర్షము, దైన్యము.
ఉన్నాను నీదయ - పన్నగశయన !
ఔత్సుక్యము, దైన్యము - ప్రార్థన, రూపకల్పన.
త్రోవతప్పి వచ్చితివో - తోయజాక్షికి నీకు
ఆవేగము, శంక, వితర్కము - అసూయ, హర్షము .
ఈవేళ కలహంబు - ఏమైన గలదా ?
వితర్కము, శంక, హర్షము - శంక, వితర్కము.
నీవేల జంకెదవు - నెనరుగల్గిన చోట
వితర్కము, నవ్వు - దైన్యము, హర్షము.
వేవేల నేరములు - రావా నాస్వామి ! ॥అపు॥
ఔత్సుక్యము - హర్షము, దైన్యము
సందేహమేల యిక - శయనించి సమరతులు
శంక, వితర్కము - ఔత్సుక్యము, హర్షము.-
చెంది నను ఉపరతులు - సేయు మనక
         సంభోగరతులు - దైన్యము.
ఎందైన నీకు - ఆనందమయ్యేచోట
        అవహిత్థ - హర్షము, శంక.
కందర్ప జనక ! - చక్కని మువ్వగోపాల !
ఔత్సుక్యము, హర్షము - దైన్యము, తృప్తి.

ఈమె, తన ప్రియుడు పరకాంతతో తన యెదుట సరాగము లాడుచున్నను, ఆమెతోడి వినోదముల దేలుచున్నను గూడ ఈర్ష్యపడదు. ఖండితవలె 'చల్లనాయెనా మనసు' అని సోత్ప్రాసముగా మాట్లాడదు. అతడు తనకు కనబడుటయే మహాభాగ్యముగా భావించి అదియే తన కృతార్థత అనుకొనును. ఈమె నాయకున కెట ఆనందమో అచటనే మసలుకొను మనుచున్నది.

నాయిక - కలహాంతరిత:


          సురటరాగము - త్రిశ్ర త్రిపుటతాళము
పల్ల : ఎవరివల్ల దుడుకు మా - యిద్దరిలోన సఖియా ?
         వితర్కము, శంక - దైన్యము, ఔత్సుక్యము.
అనుప : వివరింపుమమ్మా! మా - విధము తెలిసె నిపుడు
          దైన్యము, - హర్షము.


రమణిరో ! బంగారుమం - చముపై నిద్దరము చాలా
          దైన్యము - ఔత్సుక్యము, హర్షము.
మమతతో సరసంపు - మాటలాడే వేళ
         హర్షము - ఔత్సుక్యము, దైన్యము.
కమలాక్షి పేరనన్ను - ఘనుడు పిల్వగ కోప
  అసూయ, రోసము - అసూయ, రోసము.
శమనము లేక నాదు - జడకొద్ది కొట్టితి నమ్మా
  అమర్షము, చింత - ఉగ్రత, విషాదము, దైన్యము.

వచ్చిన ప్రియునితో ఈమె కలహము పెట్టుకొని, మొదట ప్రియుని జడతో గొట్టి, నిరాకరించి, పిదప గొప్పగా పశ్చాత్తాపము నొందినది.

నాయిక-కన్య-ప్రవత్స్యత్పతిక : ప్రియుడు దేశాంతరమునకు వెడలిపోగా, ఈ కన్నె తన ప్రియుని విరహమున మిక్కిలి ఉత్కంఠతో తహతహ పడుచున్న విధము గమనింపదగును.


             నవరోజ్ రాగము - ఆదితాళము
పల్ల : ఏమి సేతు ? కన్నె ప్రాయము - నెడజేసె దైవము
అనుప : ఆముకొన్నరతిసుఖము - అనుభవించే దెన్నటికో !
నెనరుగల నగుమోము - తనియజూచెదనంటె
తనమేన సిగ్గుచేత – తలనెత్తనీయదు
మనసులో వానిమీది - మమతై తె యింతింతన రాదు
విననిది వా కారు మేర కాదు ॥ఏమి॥
సొగసుచేసుకపోయి - సుద్దులాడెద మంటే
పగదాయ తలిదండ్రులు - బయలు వెళ్లనీయరు
ఇరుగుబోణు లెవరైన - ఈ వగలు వింటేను
నగుదురో యని గుండె - దిగులు మనీని ॥ఏమి॥
ఎదురు వాకిలి గనుక - ఎదురెదురు చూచుచు
అదెలోక మై నేను - నిదురపోవకను
సదయ మువ్వ గోపాల ! - సామి నన్నలుముకొని
ఎదనుంచి నట్లాయె - మదన పరవళ మాయె ॥ఏమి॥
    ఇది అయోగ పూర్వకమగు కన్యావిరహము.

భావసంధి నాయిక :


            ఆనందభైరవిరాగము, ఆదితాళము
పల్ల : రేపువత్తువుగాని, పోరనేటికితాళి, రేపువత్తువుగాని
           అనునయము, దైన్యము, ధృతి
అనుప : రాపుచేయుటమేలా, రేపు వత్తువుగాని
          శ్రమ, దైన్యము, శంక, దైన్యము,
                        గోపాల నా సామి. ॥రేపు॥
                       హర్షా వేగములు.
రాతిరి పగలొక్కతీరు నన్ను - రమ్మంటే మా యింటివారు
    మోహము, గ్లాని, హర్షము, ధృతి, అసూయ, ఉగ్రత.
మూతులు ద్రిప్పేరు - మొన్న వచ్చితి వని
    ఈర్ష్య, కోపము - స్మృతి, దైన్యము
వాదేల తడవాయె - వద్దు నేటికి తాళి
   నిర్వేదము, శంక, చింత.
రాపు సేయకు నాతో పోరానన్నే -
 ఆలస్యము, ఈర్ష్య, హర్ష గర్వములు,
                     రతి నేలిన మువ్వగోపాలా !
                     అనునయము, తృప్తి, అనునయము.
కోపగించి పోయేవు -
రోషము, వితర్కము, దైన్యము, విషాదము,
                          కొన్ని నాళ్ళాయె నీవు
                          హర్షము, విరహస్మృతి.
తాప మణచ వేరా - దయతో,
ఆవేగము, ఔత్సుక్యము - మోహహర్షములు,
                                 కలిసి, పోరా ॥రేపు॥
                   తృప్తి, దైన్యము, అనునయము.

ఈ నాయికకు మొదట తనవారు ఉపపతి విషయమును గమనింతురేమోయని భీతికల్గినది. అపుడు నేటికి తాళుమని అతనిని పొందునుండి వారించినది. తనమనసులోని హర్షౌత్సుక్యములను గూడ భీతితో నడచినది. కాని, చిట్టచివరకు ప్రియుని అనురోధము, తన మనుసులోని మోహావేగము, ఔత్సుక్యము "కొన్ని నాళ్ళాయెనని” విరహస్మృతి - ఇవిత్వర పెట్టగా అతనితోడి పొందునకు ఉత్సుకయై అతనినే ప్రార్థించుచున్నది. తనను పొందుమని 'తాప మణచవేరా?' అని వేడుచున్నది. ఇది విరుద్ధ భావములసంధి.


క్షేత్రయ్య నాయికలు నెరజాణ. ప్రియుల చిత్తమెరిగి ప్రవర్తింపగల చతురులు. ఈ నాయికలలో కొందరు "పట్టుపటాని పూలపావడలతో, ఎడవాలు పైటలతో, మేలిపైఠాని కొంగులతో, జాళువాకంచుకములతో, పసుపు దుప్పటివల్లెవాటులతో, చలువదుప్పటి మేలిముసుగులతో, నొసళ్ల మిసమిసలాడు తిలకములతో, గుత్తపువన్నెల కీల్జడలతో, ముత్యాల కమ్మలతో, కెంపుల బొగడలతో, కాటుక కన్నులతో, పచ్చల కడియాలతో" మనకు గోచరించుచుందురు. గృహములు, సౌధములు శృంగారవనములు - వీరి వాసస్థానములు. వీరు తూగుటుయ్యెలలపై నూగుదురు. చలువ చప్పరముల శయనింతురు. శుకశారికాపంజరములు, నిలువుటద్దములు, మహార్హమైన శయ్యలు, కస్తూరి, జవ్వాజి, పన్నీరు. గంథములు వీరికి ప్రీతిపాత్రములు. క్షేత్రయ్య నాయికలలో వై విధ్యము కనిపించును. స్వీయలు, పరకీయలు, సామాన్యలు, కన్యలు, మధ్యలు, ప్రౌఢలు, ధీరలు, అధీరలు, ధీరాధీరలు, తృప్తలు, అతృప్తలు, తృప్తాతృప్తలు గోచరించుచున్నారు. ఈ నాయికల చెలిక త్తెలు సయితము సంస్కారవతులును, సంభాషణ చతురలును, హితోపదేశకరణ నిపుణలునై కన్పట్టుచున్నారు.

సాహిత్యదృష్ట్యా క్షేత్రయ్య తన పదములను లలితమును, మధురమునగు భాషతో పొదిగియున్నాడు. అర్థ గాంభీర్యము, అన్వయ సౌలభ్యము, భావసౌకుమార్యము మున్నగు గుణములకు ఇతని పదము లాటపట్టులు. ఇందు తెనుగు పలుకుబడుల తియ్యదనము నిండారియున్నది. ఉదా. “అసురసురన్నది; నాలిముచ్చు గయ్యాళి, దబ్బున, ఆదుకొనుట, వాలాయము, సరిప్రొద్దు, ఆగడము, మీసము దువ్వుట, ఆముకొన్న ప్రేమ, మోము చిన్న జేసుకొనుట ఇత్యాదులు, ఇవి నూటికినూరుపాళ్లు తెలుగుదనముకలవి.

క్షేత్రయ్య వాడిన కొన్ని శబ్దములు క్రొత్తపోకడలు కలిగియున్నవి. అటపచరించు, అన్నెకాడై, ముప్పొంగి, సడ్డ, మంతురాలు. నెంజలి అనునవి ప్రకృతోదాహరణములు.

కొన్ని శబ్దములు శబ్దరత్నాకర కారునిచే గృహీతములై, నిఘంటువున కెక్కి ప్రామాణ్యో పేతములైనవి. క్రియాదులందు ఒక్కొక్కచో వ్యావహారిక పదప్రయోగ పద్ధతియు కనిపించును. ఉదా : మనసుగట్టి చేసుకొంటివి; సిగ్గయ్యీని; గుండె దిగులుమనీని క్షేత్రయ్య వాడిన సామెతల చక్కదనము కొనియాడదగినది. ఉదా :


“బావిలో నీరు వెల్లువ బోవునట వే”
“కానివారి కివి వేడుకలాయె”
అరటాకు సామెత ”
"నొసటివ్రాత తప్పదాయె"
"కన్నీరు కావేరికాలువ"
“కలిబోసిన ఉట్టివంక జూచినట్లు"
“ఉట్టిపడ్డట్లు వచ్చె.

పద్యములందువలె యతిప్రాస నియమములతో పెక్కు పదములను క్షేత్రయ్య రచించినాడు. ఉదా :


మొగమాట మేలనే - మువ్వగోపాలుడుగాన
అగడైతి నిన్నుగూడి - అందరిలోన
....... ........ .......... ......... ........ ......... .........
మగువ! వాక్కుననొకటి - మదియొకటి యెంచుకొని
తెగనాడితివి మున్ను - తెలియలేనైతి నీతోడ

క్షేత్రయ్య తనపదములందు ధ్వనింపజేసిన వేదాంత మిది. విజయరాఘవుడే పరమాత్మ. జీవులు స్త్రీ ప్రాయులు. రాఘవుడు ప్రియతముడు. భక్తులు మొదట ఆతని గుణగణానుభవమును పొంది, ఆ గుణములను చక్కని వృత్తబంధములుగా, నవరసభరితములైన పాటలుగా, ప్రత్యక్షముగా ఆతనితో సంభాషించు నట్లుగా రచించి, అభినయ మూలమున, ఆతని కిష్టమగు సమయమున, ఏ యే భావవ్యంజకమగు పదము ఆతనికి అభిమతమో, దానినే పాడి, ఆతనిని రంజింపజేయుచు, తంబురాశ్రుతితో గానమొనర్చి, ఆతని పూర్ణానుగ్రహము పొంది, తన్నిరంతర ధ్యానమునందే, కీర్తనమునందే తమ జీవితమును ధన్యమొనర్చుకొన వలయును. ఇట్లు శ్రీ కృష్ణపరమాత్మతోడి మేళనమే సర్వజీవులకును ప్రాప్యమగు పరమపురుషార్థము.

ఇట్లు క్షేత్రయ్య పదములలో సంపూర్ణమైన సంగీత స్వరూపము గోచరించుచున్నది. ఇట్టి పదములు సంగీత సాహిత్యాభినయములందు కృతహస్తులైన సర్వకళా సరస్వతీ మూర్తులుతప్ప ఇతరులు రచింపజాలరు. ఆంధ్ర కవులలో అట్టివాడు క్షేత్రయ్య ఒక్కడే అనుట అతిశయోక్తి కాజాలదు. సంగీత సాహిత్యాభినయములు ఏకత్రప్రదర్శితము లైనపుడే క్షేత్రయ్య పదకళా సరస్వతి సాక్షాత్కరింపగలదు.

వే. తి.