Jump to content

సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మూడవ సంపుటము/క్షేత్రయ్య-I

వికీసోర్స్ నుండి

క్షేత్రయ్య I :

క్షేత్రయ్య. కృష్ణాజిల్లాలో కూచిపూడి సమీపమున నున్న మువ్వ గ్రామస్థుడు. ఇతడు మువ్వలోని గోపాల స్వామికి అంకితముగా సుమారు 4,000 పదములను వ్రాసినట్లు "వేడుకతో నడచుకొన్న విటరాయుడే" అను దేవగాంధారి పదములో చెప్పినాడు. కాని మనకు నేడు లభించినవి సుమారు 350 పదములు మాత్రమే. అందులో సుమారు నూరు పదములే స్వరయుక్తములై యున్నవి.

ఈతని అసలు పేరు “వరదయ్య" అని తెలియుచున్నది. అయితే ఇతడు అనేక దివ్యక్షేత్రములను సందర్శించి, క్షేత్రయ్య అని పేరొందెను. ఆయా దేవుళ్లపై పదము లను మువ్వగోపాల ముద్రతో చేర్చి వ్రాసినవాడు క్షేత్రయ్య. దక్షిణ దేశ తీర్థయాత్రను సలిపి క్షేత్రజ్ఞు డని పించుకొన్న భ క్తశిఖామణి క్షేత్రయ్య. ఈ భ క్తశిఖామణి పదునేడవ శతాబ్దికి చెందిన ప్రసిద్ధ వాగ్గేయకారుడు. ఇతడు క్రీ. శ. 1680 ప్రాంతములో, తంజావూరి నేలు చున్న రఘునాథ నాయకుని దర్శించెను. అతని కుమారు డగు విజయరాఘవ భూపాలుని కొలువుకూటములో పద కవిత్వ విశారదత్వమును, నటనా కౌశల్యమును ప్రక టించి ప్రభువుయొక్క మన్ననలను క్షేత్రయ్య చూర గొనెను. మరియు మధుర తిరుమలేంద్రుని యొక్క యు, గోలకొండ నవాబుయొక్కయు దర్బారులలో కూడ పదములను చెప్పి మెప్పుపొం దెను. కళావ్యాప్తికై ఇట్లు కొంతకాలము గడపినను క్షేత్రయ్య అంతఃకరణమున విరాగియు, జ్ఞానియునై యుండెను. చరమదశలో కూడ ఇంటిముఖముపట్టక అజ్ఞాతముగా ఏకాంత భక్తి యుక్తుడై ఎచ్చటనో దేవతా సన్నిధానమందు బ్రహ్మైక్యమును పొందియుండెను. క్షేత్రయ్య కవిగా, గాయకుడుగా, నటుడుగా, భ క్తుడుగా పదకర్తలలో అగ్రగణ్యు డయ్యెను.

కవిత్వము : క్షేత్రయ్య పదములు పాడుటకును, చదివి ఆనందించుటకును, అనుకూలమైన రసకావ్యఖండములు. పద రచనయందు ప్రాస, యతి గణ నియమములను క్షేత్రయ్య బాగుగ పాటించెను. యమక ములతో ను. అంత్యప్రాసలతోను ఈతని పదములు మనోహరములుగ నుండును. శృంగార రసాధిదేవతలగు వివిధ నాయిక ల మనో భావములయొక్క లోతులకు అడుగంటదిగి వాటిని విజ్ఞానకోశము - 3 వెలిబుచ్చు సమర్థత క్షేత్రయ్యకే గలదనిన అతిశ యోక్తి కాజాలదు. ఇతడు భాషామర్మములను బాగుగ నెరిగిన వాడు. దేశీయపదములను తన పదక వితయందు మూ ర్తీ భ వింప జేసినాడు. ఇతని వర్ణనలు, కల్పనలు, చిత్రములై, నూతనములై అలరినవి. ఇతని కవిత్వమందలి జాను తెనుగు మాటల కూర్పు మిక్కిలి మనోహరము . "ఎంత వెన్నదిన్న ఎంత మీగడ దిన్న తృప్తిపడని ముద్దు కృష్ణమూర్తి తృప్తుడయ్యె నీదు తెలుగు పల్కుల వెన్న నారగించి క్షేత్రయాఖ్య సుకవి. " అని ఒక కవి యనెను. ఇది ముమ్మాటికి నిజము. పద రచన సంగీతము : సంగీతమునకు రాగము జీవము. కర్ణా టక సంగీతమందుగల ముఖ్యమగు సుమారు నలుబది రక్తి రాగములలో క్షేత్రయ్య పదములను రచించినాడు. ఆరాగములకు నిర్దుష్టమైన స్వరూపమును తీర్చి దిద్దినాడు. రాగముయొక్క గొప్పదనము, అందము యందు, ఎంత మహత్తరమైన రసస్ఫూర్తిని కలిగింప గలవో క్షేత్రయ్య వెల్లడించినాడు. ఇతడు ఒక రాగము ననే రసభావముల ననుసరించి అనేక పదములను రచిం చెను. సైంధవి, ఘంటా, ఆహిరి, ముఖారి. బేగడ, సౌరాష్ట్ర మున్నగు రాగములకు నేటికిని క్షేత్రయ్య పదములే రాగ వ్యక్తిత్వమునకు మాతృకలు. ములైన గమక విన్యాసములు స్పష్టముగ గోచరించునట్లు క్షేత్రయ్య పదములను విలంబకాలములో రచించెను. మరియు తాళముకొరకు సాహిత్యమును అడ్డదిడ్డముగా విరువ నవసరము లేకుండ పదములను కూర్చినాడు. ఆధారభూత నాట్యము : నృత్యమునకు క్షేత్రయ్య పదములు మిక్కిలి యనుకూలములు. గీత, వాద్య, నృత్యముల చేరిక కే సంగీత మనునది పరిభాషాపదముగ నేర్పడినందున గీత వాద్యములకు నృత్యము తోడై ననేగాని సంగీతము పూర్ణ స్వరూపము నొందినట్లు కాజాలదు. కైశికీ వృత్తి ప్రధా నముగా కోమల కరణాంగ విశేషపములచేత మృదుమధుర మైన లాస్యరీతితో అంగసౌష్ఠవము గల యువతులు క్షేత్రయ్య పదములను దక్షతతో పాడి ఆడినచో పద ములలోని రసము అనుభవమునకు వచ్చును. క్షేత్రయ్య విజయరాఘవ నాయకుని కొలువులో భావావేశముతో క్షేత్రయ్య I పదములను పాడి, యాడి సభాసదులను ముగ్ధులనుగ జేసినాడు. క్షేత్రయ్య నాట్యకళా చరిత్రలో నూతన యుగమును కల్పించినాడు. ఇతడు శృంగారరస రాజ్య పట్టభద్రుడు అభినయ సర్వస్వమును కొల్లగొన్న మేటి. త్రయ్య అలంకారశాస్త్రవేత్త. ఇతని నాయికలు నెరజాణలు. ఇతని విద్యావినోద నైపుణ్యములు, ఇతని శృంగారసీమలలోని విశేషములు; ఇతని పదములయందు అభివ్యక్తములు. అదొక రసప్రపంచము. నాయికా మధురభక్తి : శృంగారము లౌకికమని, అ లౌకిక మని రెండు విధములు. లోకమందు సాధారణముగ గోచ రించు ప్రేమ లౌకికము. అది కామప్రేరితము, అలౌకిక మైన ప్రేమ నిగూఢమైనది. లౌకిక శృంగారమందు నాయకులు స్త్రీ పురుషులుగా, 'ప్రత్యేక వ్యక్తులుగా ఉందురు. అలౌకిక శృంగారమందు భ క్తుడో, భక్తురాలో నాయిక గాను, వారి ఇష్టదైవము నాయ కుడుగాను ఉందురు. వీరి శృంగారము భక్తి శృంగార మని, మధుర భావ మని, ప్రేమభక్తి యని వ్యవహరింప బడును. ఇది ఒక మహత్తర మగు సాధనముగా, భ క్తి మార్గముగా ఋషి పుంగవులచే వర్ణింపబడినది. ఆర్ష సంప్ర దాయములోనే గాక క్రైస్తవ మత సంప్రదాయములో కూడ ఇట్టి భ క్తి మార్గము కలదు. దీనిని "The Doctrine of Divine Spouse" అందురు. ఇట్టి భక్తి సాధనచే గల్గు మహానందము కారణముగా పుట్టునట్టి భావములను సంగీత సాహిత్యమార్గమున ఎందరో మహనీయులు వ్యక్త పరచినారు. మీరాబాయి, ఆండాళ్, జయ దేవుడు, లీలాశుకుడు ఈ మార్గమునకు చెందిన వారు. క్షేత్రయ్య నిండుమనసుతో, విశుద్ధ ప్రేమతో, తన దైవ మగు మువ్వగోపాలుని అనేక రీతుల భావించి దివ్యము లగు శృంగార పద చిత్రములను వెలయించెను. మువ్వ గోపాలుని నాయకునిగా, పరమపురుషునిగా, క్షేత్రయ్య భావింపగలిగినాడు. తాను రాధగా మారిపోయినాడు. తన ప్రేమ భావములను పదరూపమున బాడి ఆనందించి నాడు. "శ్రీపతి సుతు బారికి నే నోపలేక నిను వేడితే కోపాలా ? మువ్వగోపాలా!" అనునది క్షేత్రయ్య విప్ర లంభ శృంగారము యొక్క మొదటి గేయ స్వరూపము. పొంగిపొరలు భావములను వివిధ రీతులతో అనేక పద

157 ములుగా క్షేత్రయ్య చిత్రించెను. ఇతడు ప్రతిపదము నందును నాయికా రూపమున నిలచినాడు. గోపాలుని అనుగ్రహముచే పరిపూర్ణుడై క్షేత్రజ్ఞుడనిపించుకొన్నాడు. మధుర భావ సాధనలో ఉత్తమస్థాయి నందుకొన్నాడు క్షేత్రయ్య. ఇతని గొప్పతనమును గుర్తించుట సులభ సాధ్యము కాదు. ఇతడు పోయిన శృంగారరసపు పోకడలు ఏ మహాకవి కవిత్వములోను కనబడవు.

“ఈమేను జీవునకు ఎంత ప్రియమాయెనే"
“ఎంత లేదని ఎంచకురా"
“ఎటువంటి మోహమోగాని"
"ఎన్ని తలచుకొందునమ్మా"
“ఏమని తెలుపుదు, ఏలాగు తాళుదు"
"ఏమి సేయుదు మోహమెటువలె దీరును"

మొదలైనవి ప్రకృతమునకు ఉదాహరణములు. వీటిని జాగ్రత్తతో పరిశీలించినచో క్షేత్రయ్య భావనాశక్తి ఎంత ఉన్నతమైనదో తెలియగలదు. ఇది అనుభవైక వేద్యము. ఇదే క్షేత్రయ్యయొక్క ప్రతిభా విశేషము. ఇదే ఇతని ప్రత్యేకత.

వి. అ.