Jump to content

సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మూడవ సంపుటము/క్రైస్తవమతము

వికీసోర్స్ నుండి

క్రైస్తవ మతము :

ఈ మతము యేసుక్రీస్తుచే స్థాపింపబడి, ఆయనయే మూలపురుషుడుగా కలిగియున్నది. దీని ముఖ్యమత గ్రంథము “పవిత్ర బైబిలు" అనునది. ఇది ప్రాచీననిబంధనము (Old Testament), నవీన నిబంధనము (New Testament) అని రెండుభాగములుగా నున్నది. ప్రాచీన నిబంధనములోనున్న భవిష్యత్పూచన నవీన నిబంధనములో పరిణతి పొందినదని క్రైస్తవులందురు. జాన్ ది బాప్టిస్టు, క్రీస్తునకు పూర్వమే జనించి, తనకంటె మహాత్ము డొకడు వచ్చి మానవుని ఉద్దరించునని భవిష్యత్సూచనను తెల్పెను. ఆ మహాత్ముడే యేసుక్రీస్తు అని క్రైస్తవుల నమ్మకము. ఈ రెండు నిబంధనములలోను పరమేశ్వరుడు ప్రపంచ మున కిచ్చిన సందేశ మంతయు ఇమిడియున్నట్లు వారిభావన. క్రీస్తు అనగా “అభిషిక్తుడు" అని అర్థము. సిలువ ఈ మతమునకు గురుతు.

సిద్ధాంతములు: దేవుడు సర్వపిత యనియు, మానవు లందరు సోదరులనియు క్రీస్తు మతముయొక్క మూల సిద్ధాంతమని కొందరందురు. కాని అది చాలదనియు, ఇంకను నిర్ణీతములయిన సిద్ధాంతము లుండవలెననియు బహుమంది క్రైస్తవుల యొక్క, అందును రోమను క్యాథలిక్కు లందరియొక్క అభిమతము. దాదాపు క్రైస్తవులందరిలో ఒకేరక్షకుడు త్రిమూర్తులుగా నున్నాడను నమ్మకము కలదు. (1) పరమపిత యైన భగవంతుడు, (2) ఆయన కుమారుడును - ప్రతిరూపుడు నైన ఏసుక్రీస్తు, (3) భగవద్రూపమైన పరిశుద్ధాత్మ అనువారు ఈ త్రిమూర్తులు. కాని, 'యూనిటేరియన్లు ' అను నొక క్రైస్తవుల తెగ దీనిని నమ్మదు. ఇతర క్రైస్తవు లీతెగను క్రైస్తవ తెగగా నంగీకరింపరు. పై త్రిమూర్తులలో రెండవవాడగు ఏసుక్రీస్తు మానవ రూపములోనున్న భగవంతుడనియు, మేరీకన్య గర్భమం దవతరించినాడనియు, ఈ యవతారము మానవ చరిత్రలో ఉత్తమసంఘటన అనియు, ఆయన సిలువపై మరణమునొంది స్వర్గమునకు పోవునప్పుడు, తనకుగాను పరిశుద్ధాత్మను ప్రతినిధిగా నిలిపినాడనియు, ఆ పరిశుద్ధాత్మయే భగవద్వాణి యనియు, క్రీస్తునామము నుచ్చరించువారు చేరినప్పుడు అది యచ్చట ప్రత్యక్షమై యుండుననియు, విశ్వసించుట ఒక ముఖ్య సిద్ధాంతము. క్యాథలిక్కులును, కొందరు ప్రొటెస్టెంట్లును భగవంతుని మానవోద్ధరణ ప్రణాళికలో క్రైస్తవమత సంస్థ (చర్చి) ముఖ్యభాగమనినొక్కి చెప్పుదురు మానవుడు పతనమొందె ననియు, మరల క్రీస్తు ద్వారా మోక్షము నొందగలడనియు అనునది క్రైస్తవులందరు నమ్ము మూలసిద్ధాంతములలో నొకటి. అయినను, ఇటీవల ప్రబలముగా వృద్ధియైన మానవ వంశశాస్త్ర (Anthropology), పురాతత్త్వ శాస్త్రము (Archaeology) ల యొక్క ప్రోద్బలముచే “మానవపతన సిద్ధాంతము" నకు కొంతదెబ్బ తగిలినది. అందువలన ఆధునికులలో అనేకులు క్రైస్తవమతము నందలి నైతికాశయములకు మాత్రమే ప్రాముఖ్యమిచ్చుచున్నారు. ఏసుక్రీస్తు తన శిష్యులతో "మీరు మానవజాతి మోక్షమునకు బీజభూతులు. నా యుపదేశములను ప్రపంచమంతటను వెదజల్లవలయును" అని ఆజ్ఞాపించినందున, అప్పటినుండియు మతవ్యాపనము ముఖ్యోద్దేశముగా, ఈమతము నడచుచున్నది. క్రైస్తవమతములో చేరుటకు 'బాప్టిజము' ముఖ్యకర్మ. దీనికర్థము మజ్జనము. అనగా క్రైస్తవమత ప్రవిష్టుడగు వానిపై మతగురువు జీవోదకము జల్లును. ఇట్లు ఉదకమును చల్లిన చాలునా (మార్జనము), లేక నీటిలో ముంచవలెనా, లేక స్నానము చేయించవలెనా అను మతభేదములు కలవు. క్రీస్తు మరల వత్తునని చెప్పిపోయెను. ఆరాకడ అయినదని కొందరును, అతడు భవిష్యత్తులో వచ్చునని కొందరును నమ్ముదురు. బైబిలు గ్రంథము భగవద్వాణియని పూర్వాచారులును, భగవంతుడు మానవునకిచ్చు సందేశరూపమని కొందరును తలచుచున్నారు.

ప్రారంభములో ఈ మతముయొక్క సిద్ధాంతము ముందుగానిర్ణయింపబడెను. ఏసుదూతలగు మాథ్యూ, జాన్ మొదలగువారి వాక్యములు ప్రథమసిద్ధాంతము. కాన్‌స్టాంటైన్ చక్రవర్తి ఆధ్వర్యవమున క్రీ. శ. 325 సం. మున నీస్ (Nice) అనుపట్టణమున జరిగిన పరిషత్తులో నిర్ణయించినది రెండవసిద్ధాంతము. ఇందు భగవంతుడును, యేసుక్రీస్తును ఒకేరూపమనియు,మూర్తియనియు, సిద్ధాంతీకరింపబడెను. ఇది దాదాపు అన్ని విభాగముల క్రైస్తవులును నమ్ముచున్నారు. ఇంతకు పూర్వము క్రీ. శ. 256 సం ర ప్రాంతమున పిరియస్ అనునతడు, యేసు భగవదవతారమైనను, భగవంతునివలె ఆది మధ్యాంతరహితుడు కాడనియు. ఆయన పుట్టినందున ఆదికల వాడనియు, కాని భగవంతుడు త్రికాలస్థిరుడనియు నొక సిద్ధాంతమును లేవదీసెను. దీనిని విమర్శించి క్రీ. శ. 325 లో జరిగిన పరిషత్తు అభేదమును సిద్ధాంతీకరించెను. మరల క్రీ. శ. 381 సంవత్సరమున, కాన్‌స్టాంటినోపిలులో ఒక పరిషత్తు జరిగెను. అది క్రీ. శ. 325 లో ఆమోదింపబడిన సిద్ధాంతమునే పునరుద్ఘాటించెను. ఇప్పటికిని ఈ సిద్ధాంత భేదముల ననుసరించు మతానుయాయులు కలరు. మిల్టను మహాకవి పిరియస్ సిద్ధాంతానుయాయి యని కొందరందురు. యేసుద్వారా తప్ప మోక్షము లేదని అన్ని విభాగములవారును నొక్కి చెప్పుదురు. చరిత్ర : క్రీ. శ. ప్రథమశతాబ్దాంతమునకు క్రైస్తవమతము రోమను సామ్రాజ్యమునందలి దాదాపు అన్ని దేశములందును వ్యాపించెను. రోమనులు బ్రిటనును జయించుటతో ఈ మతము బ్రిటనులో ప్రవేశించెను. మతముయొక్క ముఖ్యస్థానము జెరూసలెమునుండి రోమునగరమునకు మారెను. మొదటి క్రైస్తవమిషనరీలు పెక్కుమంది రోమునుండి వెడలినవారే. క్రీ. శ 70 వ సంవత్సరమున జెరూసలెము రోమనులచే దగ్ధముచేయ బడిన తరువాత రోమకనగరమే క్రైస్తవమతమునకు స్థిరనివాసమయ్యెను. అప్పటినుండి క్రైస్తవ మతవ్యాపనము జరుగుచునే యుండెను. కాన్‌స్టాంటైను చక్రవర్తి విజయానంతరము ఆయన చనిపోయిన (క్రీ. శ. 337) నాటికే క్రైస్తవమతమునకు ఆతని రాజ్యమున ముఖ్యస్థానము లభించెను. ప్రతికూల యత్నములను జూలియడ్ మొదలయినవా రెన్ని చేసినను మతవ్యాపన మాగలేదు. మత పరివర్తనములో మతమును తీసికొని వారు తమ ఆచారముల ననుసరింపవచ్చునను అంగీకారము ఫలితముగా కాఠిన్యము సడలింపబడెను. చిల్లర సిద్ధాంతములపై కొన్ని అభిప్రాయభేదములు వచ్చినను, వ్యాపనము కొనసాగుచునే యుండెను. క్రీ. శ. 800 లో షార్లమేన్ (Charlemagne) అను నాతడు చక్రవర్తి యైన తరువాత రాజ్యమునకును, మతమునకును అత్యంత సన్నిహిత సంబంధము ఏర్పడెను. పోపునకు అధికారము హెచ్చెను. రానురాను యూరపునందలి పశ్చిమదేశము లీ అధికారమును ప్రతిఘటించినవి. పశ్చిమ మతసంస్థ (Church) కును, తూర్పు మతసంస్థకును క్రీ. శ. 1054 నాటికిని విభేదములు పెరిగెను. అవి ఇప్పటికిని నిలచి యున్నవనియే చెప్పవలెను. మరియు ఆశ్రమవాస పద్ధతి, తపస్సు, సన్యాసము మొదలగునవి ప్రబలి మతమును బలపరచెను.

ఇంతలో ముద్రణ యంత్రమువచ్చి బైబిలు అచ్చుపడుట తటస్థించెను. అప్పటినుండి విమర్శకుల దృష్టి దాని పైబడి చర్చలు ప్రబలెను. రానురాను 16 వ శతాబ్దమున మార్టిన్‌లూథర్ అను జర్మన్ మతవేత్త బైబిలుయొక్క నిజార్థమిది యని తన వ్యాఖ్యానమును లేవనెత్తెను. దానితో పూర్వాచారపరాయణులు క్యాథలిక్కులుగను, నూతన తెగవారు ప్రొటెస్టెంట్లుగను గట్టిపడిపోయిరి. అప్పటిలో క్రమముగా క్యాథలిక్కు సిద్ధాంత మంతరించునని అనుకొనిరి. కాని జెసుయిట్లు (Jesuits) అను తెగవచ్చి లయోలా అను వాని నాయకత్వమున క్యాథలిక్కుశాఖకు బలమిచ్చెను. కాని రెండుతెగలు స్థిరమైపోయెను. (Catholics and protestants). అప్పటినుండి ప్రొటెస్టెంటుల లోనే అనేక విభాగములు పెరిగెను. ఈ విభాగము మతమునకు కొంతదెబ్బ యైనను, ఈ తెగలన్నిటికిని మతప్రచారము ముఖ్యాశయమగుటచే, వారు తమ మిషనరీలను ప్రపంచమున కంతటికిని పంపి మతమును వ్యాపింపచేసిరి. తెల్లజాతులవారు ప్రపంచమున వ్యాపించి తాముపోయిన స్థలములకునెల్ల మిషనరీలను తీసికొనిపోయి రాజ్యమును, మతమును, వ్యాప్తములనుగా చేసిరి. పశ్చిమార్థగోళములోను, పూర్వార్ధగోళములోని ఇండియా, చీనా మొదలగు అనేక దేశములలోను ఈ మతము అపారముగా వ్యాపించెను. ఈ 20వ శతాబ్దమున మున్నెన్నడును లేనంత క్రైస్తవ మతానుయాయుల సంఖ్య యున్నదని లెక్కలవలన తెలియుచున్నది. ప్రొటెస్టెంట్లలోని తెగలన్నియు కలిసిపోవలెనని క్రీ. శ. 1948 సం.ర మున స్థాపింపబడిన ప్రపంచ మతసంస్థ (World Council of Churches) యత్నించెను. కమ్యూనిజము, నాజీజము వచ్చినవెనుక మతమునకు కొంత దెబ్బ తగిలినను, మిషనరీలు నూతనస్థలములలో మత వ్యావనము చేయుచుండుటచే, మొత్తముమీద అనుయాయులసంఖ్యకు దెబ్బ తగులలేదు.

ముఖ్యములైన తెగలు: క్యాథలిక్కులు తమ సిద్ధాంతములే మోక్షమార్గములని నొక్కి వక్కాణించుచుందురు. వీరిలో మరల రోమన్ క్యాథలిక్కులనియు, ఇంగ్లీషు క్యాథలిక్కులనియు విభేదము కలదు. ప్రొటస్టెంట్లలోని తెగ లింతకంటె నెక్కుడుసంఖ్య కలవి. వానిలో ముఖ్యము లీక్రింద ఈయబడినవి ;

1. ప్రెస్‌బిటేరియన్లు (Presbyterians), 2. బాప్టిస్టులు (Baptists), 3. లూథరన్‌లు (Lutherns), 4. మెథడిస్టులు, 5 క్వేకర్లు (Quakers). 6 క్రిస్టియన్ సైంటిస్టులు (Christian Scientists), 7. ప్రాచ్య ఆర్థడాక్సు చర్చి సభ్యులు (Members of East Orthodox Church), 8. రక్షణసైన్యము (Salvation Army). ఈ వివిధ తెగలలో రోమన్ క్యాథలిక్కులు చేయు కార్యకలాప బాహుళ్యమునుండి నిరాడంబరమైన క్వేకరు ప్రార్థనలవరకు నమ్మువారు కలరు. బైబిలు 'తు, చ' తప్పకుండా అనుసరింపవలెనను వారినుండి, అది సూచకము మాత్రమేనని నమ్మువారివరకును కలరు. బైబిలు గ్రంథముకంటె మతసంస్థ ప్రాచీనమగుటచే, మత సంస్థయే యెక్కువ ఆధికారికమని నమ్మువారును కలరు. అందుచే క్రైస్తవమత మనగా నొకే సిద్ధాంతము గలదిగా కాక, సిద్ధాంత వై విధ్యముగల అనేక తెగల కూటమి యనవచ్చును.

ప్రపంచములో క్రైస్తవుల సంఖ్య 74,19,85,482. ఇందులో రోమన్ క్యాథలిక్కులు 42,13,40,901 మందియు, ప్రొటెస్టెంటులు 19,30,14,595 మందియు, ఇతర క్రైస్తవ శాఖీయులు 12,76,29,986 మందియు ఉన్నారు.

కు. సీ. భ.

క్లా