Jump to content

సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మూడవ సంపుటము/క్రికెట్

వికీసోర్స్ నుండి

క్రి

క్రికెట్ :

ప్రప్రథమమున క్రికెట్ ఆట ఇంగ్లండులో గిల్ట్‌ఫర్డ్ నగరమందలి ఫ్రీస్కూల్ విద్యాసంస్థలోని బాలురచే 1550 వ సంవత్సరమున ప్రారంభింప బడినట్లు తెలియుచున్నది. 1666 వ సంవత్సర ప్రాంతమందే సెయింట్ ఆల్బన్స్‌వద్ద నొక క్రికెట్ క్లబ్ గూడ వెలసినట్లు చెప్పబడు చున్నది. మొట్టమొదటిసారిగా ఇంగ్లండ్ లో సస్సెక్స్ నగరమున 1697 లో క్రికెట్ పందెము జరిగినట్లును, ఒక్కొక్క పక్షమున పదునొకండుగురు ఆటగాండ్రు పాల్గొనినట్లును లిఖితపూర్వకమయిన ఆధారము కలదు. లండన్ నగరము ఈ యాటకు పుట్టినిల్లుగ ప్రసిద్ధి చెందినది. ఇక్కడి ఆటగాండ్రు ఈ ఆటయందు విశేషమయిన ప్రతిభా నైపుణ్యములు ప్రదర్శించినట్లు తెలియుచున్నది. ప్రారంభదశయందు లండన్‌ సమీపముననున్న గ్రామ సీమలలో బాలురు క్రమబద్ధముకాని క్రికెట్ ఆటను చెట్లకొమ్మలను క్రీడా పరికరములుగా నొనర్చుకొని అప్పుడప్పుడు ఆడుచువచ్చిరి. క్రమముగా ఈ యాట అభివృద్ధియై సుశిక్షితమైనదిగా రూపొందినది.

17 వ శతాబ్దిలో క్రికెట్ ఆటను కొన్ని వర్గములవారు చిన్న చూపుతో చూచిరి. ఆదివారములందును, చర్చి ఆవరణములందును ఈయాట ఆడిన వారిపై జరిమానాలు విధింపబడెను. 1656 సం. లో క్రాంవెల్‌యొక్క అధికారులు క్రికెటును నిషేధించిరి. కాని అనతి కాలములో ధనిక వర్గమునకును, కులీన వర్గమునకును చెందిన యువకులు ఈ యాటయందు ఆసక్తి కలిగించుకొనిరి. అధికధనమును పణముగపెట్టి వీరు క్రికెట్ పందెములాడు చుండిరి. ఈ పందెములు వేలకొలది ప్రేక్షకులను ఆకర్షించెడివి.

ఇంగ్లండు యువకులు తాము మెట్టిన నూతన ప్రదేశములకెల్ల క్రికెట్ ఆటను కొంపోయి దానిని అధికముగ ప్రచారములోనికి తెచ్చిరి. 1747 వ సంవత్సరములో జరిగిన క్రికెట్ పందెమున స్త్రీలజట్లు పాల్గొనినట్లు లిఖిత పూర్వకమయిన ఆధారము కలదు. 19 వ శతాబ్ధియం దంతటను ముఖ్యముగ ఉత్సాహముగల స్థానిక యువకులు ఈ ఆటలలో పాల్గొనుచుండిరి. 1890 లో ఒక్కొక్క జట్టునందు 11 మందిగల స్త్రీలు క్రీడా ప్రదర్శన పందెములలో పాల్గొనుచుండిరి. ఈ యాటయందు ప్రావీణ్యము గడించినవారు యువతులను తర్ఫీదు చేసెడివారు. ఈ శతాబ్ది మధ్యభాగమునాటికి ఆధునికమయిన క్రీడాకారిణులగు క్రీడా స్త్రీ సంఘ మొకటి ఏర్పడినటుల తెలియుచున్నది. ఈ సంఘమునకు క్రమముగా 200 అనుబంధ సంఘము లేర్పడెను.

కనీసము 18 వ శతాబ్ది ప్రారంభము నుండియైనను నిర్ణీతములయిన నియమములకు లోబడి క్రికెట్ ఆడబడు చుండెను. క్రికెట్ ఆట ప్రారంభమయిన తొలిదినములలో సాంప్రదాయికమయిన అలవాట్ల ననుసరించి మాత్రమే నియమములు, నిబంధనలు నిస్సందేహముగ అమలునం దుండెను. కాని 1744 వ సంవత్సరములో లిఖితపూర్వక మైన నిబంధనావళి రూపొందెను. 1788 వ సంవతర్సము నుండి లండన్ నగరమందలి 'మెల్ బోర్న్ క్రికెట్ క్లబ్' సాధికారమయిన క్రికెట్ నిబంధనావళీ కేంద్రముగ ప్రపంచమంతట పరిగణింపబడెను. 20 వ శతాబ్ది మధ్య భాగమున జరిగిన క్రికెట్ ఆటలన్నియు 1947 వ సంవత్సరపుక్రికెట్ నియమావళి ననుసరించియే నిర్వహింపబడెను. పైనుదాహరించిన మెల్ బోర్న్ క్రికెట్ క్లబ్బు ఈనియమావళిని ప్రకటించెను. ఈ నియమావళి పెక్కు వివరణములతో నిర్వచింపబడెను.

మొట్టమొదటిసారిగా భారతదేశమున క్రికెట్ ఆట ఏనగరమున ఎప్పుడు జరిగినదియు ఇదమిత్థముగా చెప్పుట కష్టసాధ్యము. అస లీ ఆట భారతదేశమునకు అపరిచిత మైనదియా, కాదా అని చెప్పుటకూడ కష్టమే. శతాబ్దములకు పూర్వము మొరటయిన క్రికెట్ ఆటను పోలిన దేశవాళీ ఆటయొకటి మనదేశమున ఆచరణములో నుండినట్లు బలమయిన కొన్ని ఆధారములు చాటుచున్నవి. ఈ ఆటయొక్క పుట్టు పూర్వోత్తరములను గూర్చి చరిత్ర కారులు ఊహాగానము చేయుచునే యున్నారు. టర్కిస్తాన్ లో మారుమూలనున్న 'హుంజా' అను ప్రదేశమున, ప్రప్రథమమున పర్షియాలో ఉద్భవించిన 'పోలో' అను ప్రాచీనమైన ఒకఆట ఇప్పటికిని వాడుకయందున్నది. గ్రీసుదేశములో లభ్యమయిన పురాతత్త్వ శిథిలముల ఆధారమున, ప్రాచీనకాలమందు హాకీ - క్రికెట్ మిశ్రితమగు ఒక విచిత్రమైన ఆట ఆడబడుచుండెడిదని తెలియు చున్నది. ఆనాడు ప్రపంచము ఇంత అభివృద్ధికిరాక, ప్రాథమికదశయందే యుండెను. కర్రకు (Bat) బంతికి (Ball) సంబంధించిన ఇట్టి ఆటలను గ్రీసుదేశమునుండి అలెగ్జాండర్ తనవెంట భారతదేశమునకు కొని వచ్చి నటుల మన మూహింపవచ్చును. ఇందుల కాధారములు గూడ కొన్నిగలవు.

బ్రిటిష్‌వారు భారతభూమి మీద అడుగిడిన వెంటనే, క్రికెట్‌కూడ వారితో ఇచట ప్రవేశమొనర్చిరి. బ్రిటిష్ యువసైనికులు తాము ప్రవేశించిన ప్రతి దేశమునకు తమ క్రీడా పరికరములను తమవెంట తీసుకొని వెళ్ళుట వారికి పరిపాటియయ్యెను. ఏ దెట్లయినను క్రికెట్ ఆట మొట్టమొదటిసారిగా భారత దేశమున 1751 వ సం॥ననే ప్రారంభమయినది. గ్రేట్‌బ్రిటన్ వెలుపలనున్న దేశము లన్నిటిలో కలకత్తాలో స్థాపింపబడిన క్రికెట్‌క్లబ్ అత్యంత ప్రాచీనమైనదని తెలియుచున్నది. ఈ క్లబ్బు 1792 లో నెలకొల్పబడినది. కలకత్తాక్రికెట్ క్లబ్బు, బారక్ పూర్ క్లబ్బుల మధ్య నొక ఆటయు, కలకత్తాక్రికెట్ క్లబ్, డండం క్లబ్బుల మధ్య మరియొక ఆటయు జరిగినది. కలకత్తా క్రికెట్ క్లబ్బును టి. సి. లాంగ్ ఫీల్డ్ అను నాతడు అభివృద్ధిపరచెను. ఈస్ట్ ఇండియా కంపెనీయందు పనిచేసిన ఉద్యోగులే ఈ క్లబ్బులయందును పాల్గొనెడివారు.

అయినను క్రికెట్ ఆటకు బొంబాయి నగరము పుట్టి నిల్లని విశిష్టమయిన ప్రఖ్యాతికలదు. ఇందుకు కారణములు రెండు : ఈ ఆట బొంబాయినగరములో అత్యంతమైన ప్రజాదరణ గడించుట; మరి ఏ ఇతర నగరము నందునులేని ఉద్దండులయిన క్రికెట్ ఆటగాండ్రు ఈ నగరమందే వన్నె కెక్కియుండుట. క్రికెట్ ఆటను చేపట్టి, దానిని అభివృద్ధిపరచి ప్రథమస్థాన మాక్రమించుటలో ఇతర జాతులవారికంటె పార్శీజాతివారు అత్యంత గౌరవస్థాన మలంకరించియున్నారు. వారు 'ఓరియంటల్ క్రికెట్ క్లబ్బు'ను 1848 లో మొట్టమొదటిసారిగా స్థాపించిరి. ఆ దినములలో క్రికెట్ 'ను 'బాట్‌బాల్' (Bat ball) ఆట యని సామాన్యులు పిలిచెడివారు. అటుపిమ్మట 1850లో 'జొరాష్ట్రియన్ క్రికెట్ క్లబ్బు' ఏర్పడెను.

1867 సం॥ ప్రాంతములో 'రౌండ్ ఆరమ్ బౌలింగ్' (Round arm bowling) అను సాంకేతిక విధానము క్రికెట్ ఆటలో అమలునందుండెను. ఇంగ్లండులోని 'సర్రే' (Surrey) నగరము నుండి రాబర్ట్ హెండర్సన్ అను నతడు బొంబాయికివచ్చి, పార్శీ క్రికెట్ ఆటగాండ్రకు శిక్షణ నిచ్చెను. క్రికెట్ అటగాండ్రు ఇప్పటికిని అతని నామమును స్మరించుచు, అతనియెడల కృతజ్ఞతాభిమానములు వెలిబుచ్చుచుందురు. ఈ సంఘటనమువలననే ప్రథమముగా పార్శీ ఆటగాండ్ర జట్టు 1886లో ఇంగ్లండునకు ప్రయాణమై వెళ్ళుట సంభవించెను. ఇంగ్లండులో వీరు కొన్ని క్రికెట్ పందెములలో గెల్చుటయు, కొన్నిటియందోడుటయు, మరికొన్నిటియందు ప్రత్యర్థులతో సమ ఉజ్జీలగుటయు సంభవించినది. విక్టోరియా రాణి ఆహ్వానముపై 'కంబర్ లాండ్ లాడ్జి' వద్ద 'క్రిస్టియన్ విక్టర్స్' అను పదునొకండు మందిగల ఆటజట్టుతో పందెమాడు భాగ్యము వీరి కబ్బినది. రెండేండ్ల అనంతరము, ఈ పార్శీ జట్టువారు రెండవసారి ఇంగ్లండునందు సంచారముచేసి కొన్ని పందెములలో ఘనమైన విజయములు సాధించిరి. ఈ క్రికెట్ ఆటలయాత్రలను ఏర్పాటు చేయుటయందును, వీటిని నిర్వహించుటయందును ఎ. బి. పటేల్, బారియా, ప్రేమ్‌జి పటేల్ ప్రభృతులు ప్రధానమయిన పాత్రము వహించిరి.

హిందూయువకులుగూడ ఈ యాటయందు అభిరుచిని, అభినివేశమును సంపాదించి 1878 వ సం॥లో హిందూ క్రికెట్ క్లబ్బును స్థాపించుకొనిరి. అట్లే మహమ్మదీయులుగూడ తమ క్లబ్బును 1883 సం॥లో ఏర్పరచుకొనిరి. తరువాత కొలది సంవత్సరములలో వేర్వేరు 'జింఖానాలు' (క్రీడాసంస్థలు) వెలసినవి. 20వ శతాబ్ది ప్రారంభమున క్రికెట్ ఆట చెన్నరాష్ట్రములో గణనీయమైన ప్రజాదరము పొందెను. ఐరోపియనులు, పార్శీలు, హిందువులు అను త్రివర్గములమధ్య(Triangular Tournaments) జరిగిన ఆట పందెములవలనను, అటుపిమ్మట వీరిని మహమ్మదీయుల జట్టు కలియగా అప్పుడు చతుర్వర్గములమధ్య జరిగిన ఆటల (Quadrangular Tournament)వలనను, క్రికెట్ ఆటకు ఇతోధికమయిన ప్రోత్సాహ మేర్పడెను. 'రెస్ట్' అను అయిదవజట్టు (Pentangular) 1938 వ సంవత్సరమునుండి పై ఉదాహరించిన నాలుగు జట్టులతోకలసి ఆటలలో పాల్గొనెను. కాని ఈ టూర్నమెంటు సంస్థవారు 1944 వ సంవత్సరములో తమ కార్య కలాపములకు స్వస్తిచెప్పిరి. అయినను వీరు సాధింప దలచిన ప్రయోజనములను అప్పటికే సాధించిరి.

క్రికెట్ ఆట ఇంగ్లీషువారి వెనువెంటనే మన దేశమున ప్రవేశించుటచే, దక్షిణభారతమునకు తరలివచ్చిన ఇంగ్లీషు యువకులు 1848 సం. లో మద్రాసు క్రికెట్ క్లబ్బును స్థాపించిరి. మద్రాసునందలి 'ఐలెండ్ గ్రౌండ్స్'లో ప్రప్రథమముగ క్రికెట్ 'బాట్', 'బంతి'యు ప్రత్యక్షమయ్యెను. 1865 వ సం. లో ఈ క్లబ్బు చేపాక్ ప్రాంతమునకు మార్చబడెను. 1864 వ సంవత్సరములో మద్రాసు క్రికెట్ క్లబ్బువారు మొట్టమొదటిసారిగా కలకత్తాజట్టుతో పందెమున పాల్గొనిరి. స్థానికముగనున్న కొందరు భారత యువకులు ఈ ఆటచే ఆకర్షింపబడి అనతికాలములో దీని యందు ప్రావీణ్యము సాధించిరి. యూరపియన్ - భారత జట్టుల నడుమ ఏటేటా క్రికెట్ పందెములు జరుగునట్లుగ ఒడంబడిక జరిగి, 1908 సం. లో ప్రారంభోత్సవము గావింపబడెను. అర్ధశతాబ్ది కాలములో పటిష్ఠమైన కృషి జరిగినఫలితముగ, క్రికెట్ ఆటకు దక్షిణభారతదేశములో సుస్థిరత్వ మేర్పడెను.

క్రికెట్ ఆటయొక్క అభివృద్ధి కేవలము కలకత్తా, బొంబాయి, మద్రాసువంటి నగరములవరకే పరిమితమై యుండక, మహారాజులయొక్కయు, నవాబులయొక్కయు పోషణము మూలమున స్వదేశీయ సంస్థానములయందు గూడ వ్యాపించెను. ఇట్టి షోషకులలో పాటియాలా మహారాజు ప్రథములు. భారతీయ క్రికెట్ ఆటగాండ్రను తర్ఫీదు చేయించుటకై, ఇతడు ప్రఖ్యాతినందిన ఇంగ్లీషు ఆటగాండ్రను మనదేశమునకు తోడితెచ్చెను. ఇట్లెందరో ఉత్సాహవంతులు ఈ ఆటను భారతదేశమున అభివృద్ధికి తెచ్చిరి. అయినను 'రంజి' అని పిలువబడెడి నవనగర్ 'జామ్‌సాహెబ్' ఇంగ్లండునందలి క్రికెట్ క్రీడారంగములో ప్రదర్శించిన అపూర్వ నైపుణ్యమువలన ఈ యాటకు అఖండమయిన విశిష్టత, ప్రోత్సాహము చేకూరెను. కాకున్నచో, క్రికెట్ ఆట భారత దేశమున ఇంత గాఢముగ వ్రేళ్లూనియుండెడిదికాదు.

1911 సం. లో పాటియాలా మహారాజు యొక్క నాయకత్వమున అఖిలభారత క్రికెటుజట్టు ఇంగ్లండుదేశమంతట సంచారము గావించెను. ఈ జట్టులో పార్శీలు, హిందువులు, సిక్కులు, మహమ్మదీయులు పాల్గొనిరి. మొత్తముమీద భారతజట్టు జరిపిన సంచారము ఆశాభంగకరముగా పరిణమించినను, బాలూ, మిస్ట్రీ, కంగా, మెహరోంజీ అను ఆటగాండ్రు వ్యక్తిగతముగ ఇంగ్లీషు వారి మన్ననలనందుకొని క్రికెట్ ఆటలో మేటిమగలని పేర్గాంచిరి.

1889వ సం॥లో ఇంగ్లండునందలి జి. యఫ్. వర్నర్ జట్టు, పిమ్మట 1893 లో లార్డ్ హాక్స్ జట్టు, అనంతరము 1902 లో ఆక్స్‌ఫర్డ్ అథెంటిక్స్ జట్టు భారతదేశమును దర్శించిన ఫలితముగ, మన దేశములో క్రికెట్ ఆట చిరస్థాయిగా పాదుకొనెను. అయినను, 1926 సం. లో శ క్తిమంతమయిన 'జిల్లిగన్' నాయకత్వమున భారతదేశమునకు వచ్చిన యం. సి. సి. జట్టు వలననే ఇచ్చట నిర్మాణాత్మకమైన క్రికెట్‌ఆట అభివృద్ధికివచ్చెను. జిల్లి గన్ సూచనపై భారతదేశములో “క్రికెట్ కంట్రోలు బోర్డు" 1927 లో ఏర్పడెను.

1932 జూన్ 25వ తేదీ భారతదేశము యొక్క క్రికెట్ చరిత్రలో మహత్తరమయిన పర్వదినముగా పరిగణింప బడుచున్నది. ఆ దినమున ప్రప్రథమముగ భారతజట్టు ' టెస్ట్ పందెము'లో ఇంగ్లండును ఎదుర్కొనెను. మన జట్టుకు శ్రీ సి. కె. నాయడు నాయకత్వము వహించెను. ఇంగ్లండు జట్టును జార్డిన్ నడిపించెను. ఈ పందెములో మనజట్టు ఓటమి చెందినను, ఇట్టి పందెములలో పాల్గొనుటకు మన ఆటగాండ్రు అన్ని విధముల అర్హులని ఇంగ్లీషువారిచే ప్రశంసలనందుకొనిరి. ఈ టెస్ట్‌పందెములో నిస్సార్, అమరసింగ్ లు జరిపిన 'బౌలింగ్' (Bowling), సి. కె. నాయడు ప్రదర్శించిన 'బాటింగ్' (Batting) ప్రతిభా విలసితములని పేరుకాంచెను.

ఆనాటినుండి భారతదేశము అంతర్జాతీయ క్రికెట్ రంగములో ఘనవిజయములు సాధింప నారంభించెను. మొట్టమొదటిసారిగా 1950-51 లో జరిగిన టెస్ట్‌పందె ములలో భారతదేశము ఇంగ్లండును ఓడించెను. ఇదిచాలా గొప్ప విజయముగా వర్ణింపబడి యున్నది.

చిత్రము - 29

విజయనగరం మహారాజ కుమార్

పిమ్మట 1952 లో భారతజట్టు పాకిస్తాన్ మీదను, అనంతరము న్యూజిలెండుమీదను విజయములు గాంచెను. అటుపిమ్మట ‘వెస్టు ఇండీస్ ' జట్టుతో భారతదేశమందును, వారి సుందరమయిన మాతృదేశమందును (కార్రిబియన్ దీవులు) మన జట్టు తలపడి క్రికెట్ పందెములాడెను. ఇట్లే 1947 లో గూడమనజట్టు ఆస్ట్రేలియాకు ప్రయాణమై పోవుట సంభవించెను.

ఇట్లు భారత దేశపు జట్టులో ఆదినుండి పెక్కురు క్రికెట్ ఆటగాండ్రు తమ పాత్రను ప్రశంసనీయముగ నిర్వహించిరి. వీరి కృషి లేనిదే, భారతదేశములో క్రికెట్ ఆటకు ఇంతటి ఘనత చేకూరెడిది కాదు. వీరిలో పూర్వతరమునకు చెందిన 'మిస్ట్రీ' ఈ తరమునకు చెందిన 'మంకాడ్ ' అను క్రికెట్ యోధులును, వీరి సహచరులును, అనుచరులును గూడ అఖండ కీర్తి నార్జించిరి. మిస్ట్రీ ఎడమచేతితో అతి నైపుణ్యముతో 'బౌలింగ్ ' చేయగలిగినఆటగాడు. ఇతడు 1910 - 1920 సం. నడుమ తక్కిన యాటగాండ్రలో అందరికంటె అధికమైన కీర్తి ప్రతిష్ఠలనార్జించెను. మిస్ట్రీ సమకాలికుడైన 'బాలూ' కూడ ప్రేక్షకులను ఆశ్చర్యచకితులనుగా చేయు తన ఎడమచేతి 'బౌలింగ్' వలన తన సహచరులైన ఆట గాండ్రమీద మిస్ట్రీవలె సమానమయిన ప్రభావము కలుగజేసెను. ఇదే కాలమున డా. కంగా, జయరామ్ మెహరోంజీ ప్రభృతులు ప్రదర్శించిన నైపుణ్యము, మిస్ట్రీ, బాలూలు ప్రదర్శించిన నైపుణ్యమునకు తీసిపోవునది కాదు.

తరువాతి తరమునకు చెందిన క్రికెట్ ఆటగాండ్రలో

చిత్రము - 30

మేజర్ సి. కె. నాయుడు

చిత్రము - 31

సి. యస్. నాయుడు

చిత్రము - 32

వెంకటగిరి కుమారరాజా
సి. కె. నాయడు ప్రముఖుడు. ఇతడు ప్రతిభావంతుడైన క్రికెట్ కెప్టెన్. బాట్‌ను చాకచక్యముగ ప్రయోగించి, బంతిని విసరికొట్టుటలో ఇతడు కడు గడుసరి. భారత క్రికెట్ ఆటగాండ్రలో ఇతడు అద్వితీయుడైన యోధుడు. దేవధర్, జయ్, రామ్‌జీ, వజీరాలీ, నజీరాలి, నెవెలీ అను ఆటగాండ్రు క్రికెట్ యందలి అన్ని అంశములలోను ఆరి తేరిన దిట్టలు. వీరిలో నెవెలీ అను నతడు ఇంగ్లీషు ఆటగాండ్రను సహితము 'వికెట్ కీపింగ్' (Wicket-keeping) లో భయచకితులను చేసెను. ఇదేతరుణములో ఇంగ్లీషు క్రికెట్ చరిత్రలో దిలీప్ సింగ్, పట్వాడీ నవాబుల నామములు సువర్ణాక్షరములలో లిఖింపబడెను.

1930 నుండి 1946 సం. నడుమ విజయ్ మర్చంట్ అను ఆటగాడు బాటును ప్రయోగించుటలో ఇతరులకంటె మిన్న యని పేరుగాంచెను. ఇతడి బాటింగ్ ప్రదర్శనమును వర్ణించుటకు ఒక గ్రంథము సరిపోవును. హజారే యను నతడు మర్చంటునకు కొలదిగ మాత్రమే తక్కువస్థాయిలో నుండెడివాడు. అమరనాథ్ అను మరియొక ఆటగాడు క్రికెట్ ఆటయందలి కళాకౌశలమును ప్రదర్శించుట యందును, ముస్తాఖ్ అలీ అను నతడు బాటును లాఘవముగ ప్రయోగించుటయందును ఆరితేరినవారు. బౌలింగ్ చేయుటలో నిస్సార్, అమరనాథ్, అమరసింగ్ వ్యక్తిగతముగను, సమష్టిగను సమకాలిక ప్రపంచములో ఏ ఇతర బౌలర్లకును తీసిపోవువారు కారు.

'మంకాడ్ ' అను మరియొక ప్రసిద్ధికెక్కిన క్రికెట్ క్రీడాయోధుడు భారతదేశమునకు అఖండమైన కీర్తి నార్జించిపెట్టెను. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, వెస్ట్‌ఇండీస్, పాకిస్థాన్, న్యూజిలెండ్ దేశముల జట్టులతో ఆడిన అటలలో ఇతడు సర్వతోముఖమైన ప్రతిభను ప్రదర్శించి ప్రేక్షకులను ఆశ్చర్యచకితులనుగా చేసి వైచెను. 'రోడ్స్' (Rhodes) దేశపుజట్టును మినహాయించినచో, ఇతర జట్టులతో ఆడిన క్రికెట్ టెస్ట్ పందెములలో 2000 పై గా పరుగులు, 100 వికెట్లు సాధించిన మొనగాడు ఇతడొక్కడే.

భారతదేశములో క్రికెట్ అభివృద్ధి చెందుటకు 1934 వ సంవత్సరములో 'రంజీట్రోఫీ ఛాంపియన్ షిప్ 'ను స్థాపించుట మరియొక కారణమైయున్నది. ఈ టూర్నమెంట్‌లో ఉమ్రిగర్, గుప్త, రాయ్, కృపాల్ సింగ్, కాంట్రాక్టర్, వంటివారు సుప్రసిద్దులయిన మేటి క్రికెట్ ఆటగాండ్రుగా సర్వత్ర గణుతికెక్కిరి. క్రికెట్ ఆట ఆర్జించుకొన్న సుసంప్రదాయములకు ఈ భారతీయ ఆటగాండ్రు అర్హతగల వారసులుగా ప్రశంసల నందుకొనిరి.

'గుంటూరు రిక్రియేషన్ క్లబ్' వారి దోహదముతో గుంటూరు నగరమునందు 1953 లో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఏర్పడెను. ప్రసిద్ధికెక్కిన 'రంజీ ట్రోఫీ టోర్నమెంటు'లో పాల్గొనుటకై ఈ అసోసియేషన్ సమర్థులైన క్రికెట్ ఆటగాండ్రను ఏటేటా ఎన్నుకొని పంపుచుండును. క్రికెట్ క్రీడారంగమున అద్వితీయమైన ప్రతిభనార్జించి ప్రపంచ విఖ్యాతి గడించిన మేజర్ సి. కె. నాయుడును, చాలకాలము అఖిలభారత క్రికెట్ కంట్రోలు బోర్డుకు అధ్యక్షులుగా నుండిన విజయనగరం మహారాజ కుమారుడును, వెంకటగిరి కుమార రాజాయును, మరియొక తెలుగు క్రికెట్ యోధుడైన సి. యస్. నాయు డును ఆంధ్ర క్రికెట్ అసోసియేషనుకు సర్వవిధముల సహాయపడి, దాని అభ్యున్నతికి ప్రధాన కారకులైరి.

క్రికెట్ నియమావళి :

1. క్రికెట్ పందెమున ఒక్కొక్క పక్షమందు పదునొకండుగురు ఆటగాండ్రు పాల్గొందురు. ప్రతి పక్షమువారు తమ కెప్టెన్ నాయకత్వముక్రింద ఆడుదురు.

2. ఆట (Innings) ప్రారంభించుటకు పూర్వము, బాటింగ్ లేక ఫీల్డింగ్ ను ఎవరు ముందుగా ప్రారంభింప వలయునో కోరుకొనుటకు ఒక నాణెమును ఎగురవేసి (Toss) నిర్ణయింతురు. దీనికి ముందుగా, ఆటను పర్యవేక్షించి న్యాయము నిర్ణయించు ఇద్దరు అధికారులు (Umpires)నియమింపబడుదురు. నియమము ననుసరించి ఈ అధికారులు రెండు వికెట్లవద్ద స్థానముల నేర్పరచుకొని న్యాయము పాలింతురు.

3. చేసిన పరుగులను లెక్కించు లేఖకులు (Scorers) ఈ కార్యక్రమమునకై ప్రత్యేకముగ నియమింపబడుదురు. బంతిని కొట్టువాడు (Batsman) బంతిని కొట్టిన పిదపగాని లేక ఆటయందు అవకాశము చిక్కినప్పుడుగాని, (స్వపక్షీయులు) తనకెదురుగా తనను దాటుచు ఒక వికెట్‌నుండి మరియొక వికెటునకు పరుగిడి దానిని చేరినచో అట్టిదానిని ఒక పరుగు (Run) గా నిర్ణయింతురు.

4 బంతికాని బంతి కొట్టువాని బాట్ కాని లేదా అతడేగాని 'స్టంపుల' మీదనుండు రెండు అడ్డుపుల్లలను (Bails) తొలగునట్లు చేసినను, లేదా స్టంపును భూమిపై పడునట్లుకొట్టినను, వికెట్ పడిపోయినట్లే నిర్ణయింపు బడును.

5. బంతిని కొట్టువాడు తన చేతియందలి బాట్, లేదా తన శరీరమందలి ఏ భాగముకాని 'పాపింగ్ క్రీజ్‌' (Poping Crease-నిర్ణీతపు హద్దు) లోపల లేకున్నచో, అతడు తన స్థానమును తప్పినట్లుగా (Out of the ground) నిర్ణయింపబడును.

6. బాట్స్‌మన్ యొక్క చేతిలోని బాట్‌ను గాని, లేదా అతనినేగాని తాకకుండ, బంతి వికెట్‌కు తగిలి, దానిని పడగొట్టినచో ఆ బాట్స్‌మన్ 'బౌల్డ్ అవుట్ ' (Bowled out) అయినట్లుగా నిర్ణయింతురు.

7. బాట్స్‌మన్ బంతిని కొట్టినపిదప (ఆ బంతి వాని బాట్‌కు తగిలివచ్చినదైనను, లేదా, మణిబంధము లేక ముంజేతికి తగిలి వచ్చినదై నను) ఆ బంతి భూమికి తాకక పూర్వము, ప్రత్యర్థిచే పట్టుకొనబడినచో, ఆ కొట్టినయతడు 'పట్టుబడి అవుట్' (Caught out) అయినట్లు నిర్ణయింతురు.

8. ఆటలో బాట్స్‌మన్ బంతిని కొట్టబోయి తన బాట్ తోగాని, లేదా తన శరీరమందలి ఏ అవయవముతో గాని, తన వికెట్‌నే కొట్టుకొనినచో అతడు 'అవుట్' (Out) అయినట్లుగా నిర్ణయింపబడును.

9. బంతిని కొట్టువాడు, ప్రత్యర్థి బంతిని పట్టబోవు సమయమున వానికి ఉద్దేశపూర్వకముగా అడ్డుతగిలినచో, ఆ బంతిని కొట్టినయతడు 'అవుట్ 'అయినట్లునిర్ణయంతురు.

10. నిర్ణయాధికారి దృష్టిలో, బంతి కొట్టువాడు వికెట్ ను తనకాళ్లతో కప్పియుంచగా, బంతి వానికాలికి తగిలినచో అతడు 'లెగ్ బిఫోర్ ది వికెట్' (Leg before the Wicket) అయి, 'అవుటు' అయినట్లుగా నిర్ణయించబడును.

11. బంతి : క్రికెట్ బంతి 51/2 నుండి 53/4 ఔన్సులవరకు బరువు కలిగియుండును. ఆట సమయమున బంతి పోయినను, లేదా అది ఆడుటకు పనికిరాకపోయిన దయినను, నిర్ణయాధికారి క్రొత్తబంతిని ఉపయోగించుటకు అనుమతించును.

12. బాట్ : క్రికెట్ బాట్ 41/4 అంగుళములకు మించని వెడల్పును, 38 అంగుళములకు మించని పొడవును కలిగి యుండును.

13. క్రికెట్ రంగస్థలము (Pitch) : ఇది 5 అడుగుల వెడల్పున రెండు వికెట్లనడుమ ఏర్పరుపబడి యుండును.

14. వికెట్లు : ఇవి ఒకదాని కొకటి ఎదురెదురుగా 22 గజముల దూరమున పాతి యుంచబడును. ప్రతివికెట్టు మూడు నిలువుపుల్లలు (Stumps) కలిగి, తొమ్మిదిఅంగుళముల వెడల్పున నుండును. ఆ నిలువుపుల్లలపై రెండు అడ్డు పుల్లలు (Bails) ఉండును. నిలువుపుల్లలు వాటినడునుండి బంతి దూరిపోకుండునంతటి దగ్గరగా పుష్టితో నుండును.

15. ఓవర్ (Over); బంతిని విసరు వాడు (Bowler) వరుసగా ఆరుపర్యాయములు బంతిని విసరినచో, అది 'ఓవర్ ' అనబడును. అట్లు రెండువికెట్ల నుండియు ఒకదాని పిదప మరియొకటి (Alternatively) చొప్పునవిసరుదురు. అట్లు ఆరుబంతులు విసరబడిన పిమ్మట, నిర్ణయాధి కారి 'ఓవర్' అని తన నిర్ణయము నిచ్చును.

16. తుది నిర్ణయము : ఉభయపక్షములలో, ఒకరిని మించి ఎక్కువ పరుగులు చేసిన రెండవపక్షమువారు గెలుపొందినట్లు తుది నిర్ణయము చేయబడును.

ప్ర, సీ.