Jump to content

సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మూడవ సంపుటము/క్యూరీసతి (1867-1934)

వికీసోర్స్ నుండి

క్యూరీసతి (1867-1934) :

రేడియం, పొలోనియం అను మూలద్రవ్యములను విడదీసి, రేడియో ఏక్టివిటీపై పెక్కు పరిశోధనలు జరిపి, రెండుసార్లు 'నోబెల్ ' బహుమానము బడసిన ఈమె అసలు పేరు మేరీస్కొడ్స్కో. ఈమె పోలెండు దేశములో 1867 సం॥ నవంబరు 7వ తేదీన జన్మించినది. ఈమె తల్లి దండ్రులు వార్సాలో ఉపాధ్యాయులుగా పనిచేయుచు పాఠశాలయందు గణితశాస్త్ర, భౌతికశాస్త్ర, ప్రకృతి శాస్త్రములు బోధించుటలో హెచ్చుగా శ్రద్ధచూపించిరి. ఆ కాలములో పోలెండు దేశము రష్యను చక్రవర్తుల క్రింద బానిసత్వము అనుభవించుచుండెను. స్త్రీలకు ఉన్నత విద్య నభ్యసించుటకు వీలు లేకుండెను. అందుచే స్కూలు వీడిన తరువాత మేరీ కొన్నాళ్ళు పైవేటు టీచరు (గవ ర్నెస్) గా పనిచేసి, వలసిన డబ్బుగడించి, 1891 లో సొర్భోను విశ్వవిద్యాలయములో చదువుటకు పారిస్ నగర మున ప్రవేశించెను. అక్కడ పెక్కు కష్టములను ఓర్చి బీదరిక మనుభవించి, అన్ని పరీక్షలలో కడుసమర్థతతో నెగెను. ఈమె 1894 వ సంవత్సరమున, వివిధ రకములైన ఉక్కు పదార్థముల యాంత్రిక ధర్మములపై పరిశోధనలు జరుపుటకు పరిశోధన సౌకర్యము కావలసి వచ్చెను. ఈ సందర్భములో పియరీక్యూరీని కలిసికొని, అతని పరి శోధనశాలలో మేరీ పని ప్రారంభించెను. పియర్ క్యూరీకి అప్పుడు 35 సంవత్సరముల వయస్సు. అతడు గొప్ప భౌతిక శాస్త్రజ్ఞుడు; మేధావి. పీజో అనునతడు ఎలక్ట్రిసిటీ (Piezo Electricity) స్ఫటికముల ధర్మముల పై జరిపిన పరిశోధనములవలన అతనికి అప్పుడే విదేశ శాస్త్రజ్ఞులలో మంచి పేరు లభించెను. అయినను పారిసులోని ఒక శాస్త్ర పాఠశాలలో అతడొక సాధారణ భౌతిక శాస్త్రోపాధ్యాయుడుగా నుండెను. విజ్ఞానశాస్త్రపరిశోధన మే ముఖ్యలక్షణ ముగా గలది మేరీ. పియర్ మేరీలు పర స్పరము ఆకర్షితు లయిరి. మేరీ 1895 లో పియరీ క్యూరీని వివాహమాడి ఫ్రాన్సులోనే ఉండిపోవుటకు నిశ్చ యించుకొనెను.

చిత్రము - 28

క్యూరీసతి

ఉక్కు పై పరిశోధనములు పూర్తి చేసినతరువాత కూడా మేరీ, తన డాక్ట రేటు బిరుదముకొరకు విషయమును (Subject) వెదకుచుండెను. ఆ సమ యమున బెక రెల్ అనునతడు యురే నియం లవణములలో ఒక విచిత్రమైన గుణమును కనిపెట్టెను. అది యురే నియం లవణములనుండి ఎల్లప్పుడును కంటికి కనిపించక వెలువడు కిరణ జాలము. ఈ కిరణముల ఉనికిని ఫొటో గ్రాఫిక్ ప్లేటు పై పడు వాటి ప్రభావమువలన తెలిసికొనకలిగెను. నల్లని కాగితముతో చుట్టబడిన ఫొటో గ్రాఫిక్ ఫొటోగ్రాఫిక్ ప్లేటు పై కొంచెము సేపు యురేనియం లవణమును ఉంచి, అటు పిమ్మట ఆ ప్లేటును డెవలప్ (Develop) చేయగా లవణ ముంచినచోట నల్ల నిమచ్చ కనిపించెను. ఈ కిరణములను గురించి తెలిసికొన్న ఇతర గుణములును కలవు. జింక్ సల్ఫైడ్, బేరియం సల్ఫైడ్ వంటి పదార్థములపై ఈ కిరణములు పడి, వాటిని కాంతిమంతములుగా (Lumi- nous) చేయును. ఈ కిరణములు గాలిలోని అణువులను అయాన్లుగా మార్చి గాలిని విద్యుద్వాహకముగా (Con- ductor of Electricity) మార్చును. గాలిలో నెలకొల్ప బడిన ఈ విద్యుప్రవాహమును ఎలక్ట్రోస్కోపుతో కాని ఎలక్ట్రోమీటరుతో గాని కొలవవచ్చును.

మేరీ తన డాక్ట రేటుకొరకు, యురేనియం లవణముల నుంచి వచ్చు ఈ కిరణముల అయనీకరణ (Ionisation) శ క్తి ని కొలుచుటకు ప్రారంభించెను. ఆమె ఈ కిరణ ప్రసార శక్తికి రేడియో ఏక్టివిటీ అను పేరు పెట్టెను. ఈ శక్తి కేవలము యురేనియం ధాతువునకు సంబంధించిన దని ఏదైనను యురేనియం లవణము యొక్క రేడియో ఏక్టివిటీ దానిలో నున్న యురేనియంపై ఆధారపడి యుండుననియు ఆమె నిరూపించెను. యురేనియములో కనిపించిన ఈ గుణము వేరుద్రవ్యములలో కనిపించు అని పరిశోధించి, థోరియం ధాతువుకూడా రేడియో ఏక్టివిటీని ప్రదర్శించు నని ఆమె తెలిసికొనగలి గెను. యురేనియంగల వివిధ ఖనిజ ముల యొక్క రేడియో పక్టివిటీని పరిశీలించగా కొన్నిటిలో యురేనియం నుండి వచ్చు కిరణ ప్రసారముకన్న హెచ్చు ప్రసారమును ఆమె గుర్తిం చెను. పిచ్ బ్లెండ్ (pitch blende) అను ఖనిజములో ఈ గుణము చాలా ఎక్కువగా ఉండుటచే, ఈ ఖనిజములో యు రేనియం గాక ఏక్టివిటీ ప్రదర్శించు మరియొక క్రొత్త మూలద్రవ్య ముండవచ్చునని నిశ్చయమునకు వచ్చి, మేరీ క్యూరీ తన ఫలితములను ప్రచురించెను.

పిచ్ బ్లెండు నుంచి ఈ ద్రవ్యమును వేరుచేయుటకు మేరీ నిశ్చయించెను. ఈమె ఉత్సాహమును చూచి, అంత వరకు స్ఫటికములపై జరుపుచున్న తన పరిశోధనలను పియరీక్యూరీ ఆపి, తన భార్యచేయు పరిశోధన కార్యము నందు ఆమెకు తోడ్పడుటకు సిద్ధపడెను. యు రేనియం తీసివేయగా మిగిలిన ఒక టన్ను పిచ్ బ్లెండు, ఆస్ట్రియా ప్రభుత్వముద్వారా వీరికి ఉచితముగా లభించెను. కాని పరిశోధనశాలలో సౌకర్యము లేదయ్యెను. అందుచే పియరీ పనిచేయు స్కూలులో నున్న ఒక పాత షెడ్డును పరిశోధనశాలక్రింద మార్చి, పిచ్ బ్లెండు రసాయన విశ్లేషణ మును ఉభయులు ప్రారంభించిరి. పిచ్ బ్లెండులోని వివిధ ధాతువులను అవక్షిప్తముగావించి (Precipitated) ఆ అవక్షేపములను రేడియో ఏక్టివిటీ కొరకు పరీక్షింపగా, బేరియం సల్ఫేటులోను, బిస్మత్ సల్ఫేటులోను ఈ గుణము కనిపించెను. అనగా పిచ్ బ్లెండులో రెండు రేడియో ఏక్టివ్ ద్రవ్యములు గలవు. మొదటిది బిస్మత్ ను పోలియుండును. దీనికి 'పొలోనియం' (మదాం క్యూరీ స్వదేశమగు పో లెండు చిహ్నముగా) అని పేరు పెట్టిరి. రెండవది బేరియమును పోలియుఁడును. దీని రేడియో ఏక్టివిటీ చాలా హెచ్చుగా నుండుటవలన, దీనిని రేడియం అనిరి. రేడియం, బేరియం, సల్ఫైటుల మిశ్రమమును, క్లోరైడ్లక్రింద మార్చి అంశ స్ఫటికీకరణ (Fractional Crystallisation) విధాన ముతో, రేడియం క్లోరైడును వేరు చేసిరి. ఒక టన్ను పిచ్ బ్లెండును విశ్లేషించినచో ఒక గ్రాము రేడియం క్లోరైడు కూడ రాదు. దీనినిబట్టి ఈపని కష్టతరమైనదనియు, దీనికి మిక్కిలి ఓర్పు అవసరమనియు గ్రహింపవచ్చును. మదాం క్యూరీ తన పరిశోధనశాల యందలి పనితోబాటు ఇంటి పనులను,కూతురి సంరక్షణమును నిర్వహింపవలసి వచ్చెను. ఈ విధముగా ఈ మె నాలు గేండ్లు నిరంతర కృషి చేసి చివరకు విజయమును సాధించెను.

పరిశుద్ధమైన రేడియం క్లోరైడు, రేడియో ఏక్టివిటీ యురేనియంకన్న మూడు వేల రెట్లు అధికముగా నుండెను. రేడియం క్లోరైడునుంచి రేడియం పరమాణుభారము 225 గా నిర్ణయించిరి. వర్ణమాలలో క్రొత్త మూల ద్రవ్యము సూచించు రేఖలు (lines) కనిపించెను. వీటిని బట్టి రేడియం నిస్సందేహముగా బేరియమును పోలు నొక క్రొత్త మూలద్రవ్యమనియు, దాని పరిమాణ సంఖ్య 88 అనియు స్పష్టమ య్యెను.

ఈ సమయములో ఈ దంపతులు రేడియో ఏక్టివిటీ యొక్క ఇతర ధర్మములపై కూడా పరిశోధనలు జరుపు చునే ఉండిరి. ముఖ్యముగా, ఈ కిరణముల ప్రభావము వలన శరీరములోని జీవకణములు ధ్వంసమగునని తెలిసి కొనగలిగిరి. రోగియొక్క కణములను రేడియం కిరణములచే నాశనము చేసినచో వాటిస్థానే ఆరోగ్యవంత మైన కణములు తిరిగి పుట్టగలవు. ఈవిధముగా కాన్సర్ మొద లగు గడ్డురోగములు రేడియం సహాయముతో ఉపశమింప వచ్చునని నిరూపించిరి. ఈ విధానమును నేడు రేడియం థెరపీ (Radium Therapy) అందురు.

ఇన్ని ముఖ్యమైన పరిశోధనలు జరిపియున్నను, వీరు ఇంకను పరిశోధనశాల వసతికొరకు ఇబ్బంది పడుచునే ఉండిరి. ఒక మంచి పరిశోధనశాలతోబాటు పరిశోధనలు జరుపుకొనుటకు తీరికనిచ్చు తగిన ఉద్యోగము ప్రియరీకు సొర్బోన్ విశ్వవిద్యాలయములో లభింపలేదు. అతనికి ఉపాధ్యాయ వృత్తివలన వచ్చు జీతము సరిపోకుండుటచే క్యూరీకూడా పాఠములు చెప్పుట ప్రారంభిం చెను.

కాని ఇతర దేశములలోని శాస్త్రజ్ఞులు వీరి పరిశోధ నల ప్రాముఖ్యమును వెంటనే గుర్తించిరి. 1903 లో బ్రిటిష్ రాయల్ సొసైటివారు వీరిని లండన్కు ఆహ్వా నించి వీరికి 'డేవి' పతకమును బహూకరించి గౌర వించిరి. అదే సంవత్సరములో రేడియో ఏక్టివిటీ కనిపెట్టి నందులకు బెకేరెల్ కును, రేడియం కనిపెట్టి నందులకు క్యూరీ దంపతులకును నోబెల్ బహుమానము చెరిసగ ముగా పంచి ఇయ్యబడినది. యావత్ప్రపంచము వీరి గొప్పతనమును గుర్తించిన తరువాత పియరీ క్యూరీకి సొర్బోన్ విశ్వవిద్యాలయములో ప్రొఫెసర్ పదవి ఇయ్య బడెను. విశ్వవిద్యాలయాధికారులు పరిశోధనాలయము కొరకు రెండు గదులు నిర్మించి, మేరీక్యూరీని పరిశోధనా లయమునందు ముఖ్య సహకారిణినిగా నియమించిరి. ఈ విధముగా వీరు రెండు సంవత్సరములు మాత్రమే కలిసి పనిచేయగలిగిరి.

1904 సంవత్సరం ఏప్రిల్ 19 తేదీన పియరీ క్యూరీ పారీస్ లో నొక వీధి దాటుచు బండి క్రింద పడి అకస్మా త్తుగా మరణించెను. ఇది మేరీ క్యూరీ జీవితములో గొప్ప విషాద సంఘటనగా పరిణమించెను. కాని ఆమె తన ఇద్దరు కూతుళ్ళను పెంచుట, తన భర్తయు తానును కలిసి మొదలు పెట్టిన పరిశోధనలు పూర్తిచేయుట, తన ముఖ్య కర్తవ్యములుగా భావించి పారిస్ లోనే ఉండిపోయెను.

పిదప పియరీ యొక్క పొఫెసర్ పదవి మేరీకి లభిం చెను. ఆమె మరల రేడియో ఏక్టివిటీపై పరిశోధనలు సాగించెను. పరిశుద్ధమైన రేడియం క్లోరైడ్ ద్వారా రేడియము పరమాణు భారమును తిరిగి కనుగొని, దానిని 226.2 గాది దెను. 1910 లో ఆమె తన సహకారియగు దబీయర్న్ తో కలిసి రేడియం ధాతువును, రేడియం క్లోరైడ్ విద్యుత్ విశ్లేషణమునుండి వేరుచేసి, ధాతువు గుణములు కనుగొ నెను. ఆ సంవత్సరముననే ఆమె సల హా పై ఒక గ్రాము రేడియమునుండి వచ్చు రేడియో ఏక్టివిటీకి ఒక 'క్యూరి' అను సాంకేతనామము పియరీ క్యూరీ గౌరవార్థమై ఉంచబడినది. 1911 లో రసాయన శాస్త్రములో ఈమె జరిపిన పరిశోధనలకు ప్రత్యేకముగా మరియొక సారి ఈమెకు నోబెల్ బహుమానము ఈయ బడెను. ఈమెకుతప్ప రెండుసార్లు నోబెల్ బహుమానము ఎవ్వరికిని లభించలేదు. సొర్బోను విశ్వవిద్యాలయము వారు, ప్రత్యేకముగా రేడియో ఏక్టివిటీపై పరిశోధన ములు జరుపుటకు ఒక క్రొత్త భవనములో రేడియం ఇన్ స్టిట్యూటును స్థాపించి, మేరీ క్యూరీని దీనికి డై రెక్ట రుగా నియమించిరి. ఈమె ఇచట పరిశోధనలు జరుపుటే గాక ఎంతోమంది గావించు పరిశోధనములపై పర్యవేక్ష ణము కూడ చేయుచుండెను.

మొదటి ప్రపంచయుద్ధమున ఈమె పరిశోధన కార్య ములకు అంతరాయము కలిగెను. కాని ఈమె ఉత్సాహ శక్తిమాత్రము తగ్గలేదు. యుద్ధములో గాయపడిన సైనికుల ఉపయోగార్థమై ఈమె ఎక్సరే సర్వీసు నొక దానిని స్థాపించి, కారులో అవసరమున్న చోటునకు వెళ్ళి సహాయపడుచుం డెను. ఎందరో నర్సులకు' ఎక్సు రేలతో ఫొటోలు తీయుటయందును, 'రేడియం థిరపీ' యందును శిక్షణ నొసగి, ఈమె యుద్ధరంగములో అనేక కేంద్ర ములు స్థాపించెను. మేరీక్యూరీ 1921 లో అమెరికా మహిళా సమాజముల కోరికపై ఆదేశము సందర్శించి, అనేక చోట్ల ఉపన్యసించెను. అమెరికా మహిళల విరాళ మును వెచ్చించి ఒక 'గ్రాం' రేడియముకొని, అమెరికా అధ్యక్షుడు దానిని ఈమెకు బహూకరించెను. దానిని

ఈమె రేడియం ఇన్స్టిట్యూటుకు ఇచ్చివేసెను. 1928 లో తిరిగి ఇంకొక 'గ్రాం' లభించెను. పోలెండు దేశములో తన సలహాపై కట్టబడిన రేడియం ఇన్స్టిట్యూటుకు దాని నీమె బహూకరించెను.

మేరీక్యూరీయొక్క ఆరోగ్యము చాల కాలమునుంచి బాగుగా లేకుండెను. దీనికి ముఖ్యకారణము రేడియం కిరణములే అని చెప్పవలెను. చివరకు రక్తహీనతకులో వై 1934 సం॥ జూలై 6 వ తేదీన యీ మె ఒక శానిటోరి యంలో తన జీవితమును చాలించెను.

మదాం మేరీక్యూరి నిరాడంబరజీవి; ఆమె మితభాషిణి. ఎల్లప్పుడును ఆమె సాధారణమయిన దుస్తులనే ధరించు చుండెను. కీర్తినిగాని, ధనమునుగాని, ఈమె ఎన్నడును కాంక్షించలేదు. పిచ్ బ్లెండునుండి రేడియమును వేరుచేయు విధానమును పేటెంట్ (patent) చేసినచో, లక్షలార్జింప గలిగి యుండెడిది. కాని యీమె కావలసిన వారికి ఆ విధా నమును ఉచితముగా పూర్తి వివరములతో తెలియజేసెను. తాను మొదట విడదీసిన రేడియమును తనకు బహూక రింపబడిన ధాతువును (అప్పటి 'గ్రాము' ధర సుమారు నాలుగు లక్షల రూపాయలు) పరిశోధనాలయములకు ఇచ్చివై చెను. 'కీర్తి ఈ మెను చెడగొట్టలేదు' అని 'అయిన్ స్టెయిన్' ఈమెను గురించి పలికిన ప్రశంసా వాక్యము సర్వవిధముల ఈమెయందు అన్వర్థమగుచున్నది.

క్యూరీ దంపతులకు ఇద్దరు కుమార్తెలు - మొదటి కుమార్తెయగు ఇరేన్ అనునామె తలిదండ్రులతో సరి తూగగల కీర్తిని సంపాదించెను. ఈమె తన భ ర్తయగు 'ఫ్రెడెరిక్ జోలియో' (Frederick Joliot) తో కలిసి పరిశోధించి కృత్రిమ రేడియో ఏక్టివిటీని కనుగొ వెను. మదాం క్యూరీ ఊహించినటులనే వీరికికూడా నోబెల్ బహుమాన మొసగబడెను. రెండవ కుమార్తె ఈవ్ అను నామె. ఈమె తనతల్లియొక్క జీవిత చరిత్రను వ్రాసెను. అది అందరును చదువతగ్గది.

జ. జో.