Jump to content

సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మూడవ సంపుటము/క్యూనీఫారమ్ లిపి

వికీసోర్స్ నుండి

క్యూ

క్యూనీఫారమ్ లిపి :

క్యూనీఫారమ్, మిస్ మారి, బాణలిపి, కీలలిపి, కోణలిపి, అని వేరు వేరు పేర్లతో ప్రసిద్ధి చెందిన ఈ లిపిని బహుశః సుమేరియా ప్రజలు ప్రథమమున కనిపెట్టి ఉప యోగించి రని తోచుచున్నది. ఈ లిపియందు వ్రాయ బడిన ప్రాచీనతమ శాసనములు మెసొపొటేమియా లేక ఇరాక్ లోనున్న యూఫ్రెటిస్, టైగ్రిస్ నదుల దిగువ లోయ యందు గాన్పించుచున్నవి. ఉరుక్ (Uruk) లేక వర్క (Warka) అను ప్రదేశమున ఈ లిపిలో గాన్పించిన శాసనములు క్రీ. పూ. సుమారు 3500 సంవత్సరముల నాటివి కావచ్చును. ఇందలి అక్షరములు చాలవరకు చిత్రములవలె కాన్పించుచున్నవి. మేకులవలె గాన్పించు ఆకారము క్రీ. పూ. 3000 సంవత్సరముల వరకును ఈ అక్షరములకు ఏర్పడలేదేమో ? నాటినుండి ఈ కీల లిపి క్రీస్తు శకారంభము వరకును ప్రచురణములో నుండినట్లు శాసనములనుండి తెలియుచున్నది.

క్యూనీఫారమ్ అను పదము లాటిన్ భాషలోని క్యూసెక్స్ అను పదమునుండి ఏర్పడినది. ఈ లాటిన్ పదమునకు అర్థము గూటము. ఘంటముతో పచ్చి ఇటుక రాళ్ళమీద వ్రాయబడిన ఈ అక్షరముల యందలి గీతలు ఆకారమునందు గూటములవలె ఒక వై పున వెడల్పుగను, రెండవ వైపున సన్నముగను ఉండును. కాబట్టి ఈ లిపికి గూటము లిపి అను పేరు వచ్చినది. అరబ్బీవారు ఈ లిపి మేకులవలె నున్నదని తలంచి 'మిస్ మారి' - మేకు లిపి లేక కీల లిపి - అని పేరిడిరి.

ఈ లిపిని వ్రాసిన ఫలక ములు చాలవరకు మట్టిపలకలే. మట్టిని నీటితో కలిపి బాగుగా పిసికి చతురస్రాకారముగ చిన్న చిన్న ఫలకములుగనో, పెంకులుగనో తయారుచేసి, వాటిమీద తడి ఆరిపోక ఇంకను పచ్చిగ నున్నప్పుడే (మనము తాటియాకులపైన వ్రాయుట కుపయోగించు) ఘంటమువంటి దానితోనో లేక గట్టి కఱ్ఱముక్కతోనో ఈ అక్షరములను వ్రాసెడివారు. ఘంటమును పచ్చి గ్రుచ్చినప్పుడు గూటము తలవలె నేర్పడి, అచటి నుండి గీచిన చక్కనిగీత గూటమువలె నుండి, మరల ఘంటమును పలక మీదినుండి ఎ త్తివేసినపుడు మొనదేరి, మొత్తము గూటమువలెగాని, మేకువలెగాని గాన్సిం చును. అక్షరములందలి కొనలు కుడివైపునకుగాని, క్రింది వైపునకుగాని, ఏటవాలుగా కుడివైపునకుగాని ఉండును -గాని, మీదికిగాని, ఎడమ వైపునకుగాని ఉండవు. రెండు గూటములు కలిసినపుడు మాత్రము రెండు మొనలును ఏటవాలుగా నుండును.

ఈ లిపిలోనున్న వ్రాతను చదివి అర్థము చేసికొనుట చాలకష్టము. ఏలయన, ఒక్కొక్క అక్షరము ఒక్కొక సందర్భమున సంపూర్ణపదమై సంపూర్ణార్థము నిచ్చును; మరియొక సందర్భమున ఒక పదములోని ఒక భాగముగ మాత్రమే యుండును. ఒక్కొక్క అక్షరమునకు ఒకే అర్థము కాక చాల అర్థములు కలవు. కాబట్టి ఈ అక్షర ములు ఏ సందర్భమున ఉపయోగింపబడినవో, ఏ ఇతర అక్షరములతో చేర్పబడినవో జాగ్రత్తగా పరిశీలింపబడిన గాని సరియైన అర్థము తేలదు.

సుమేరియా వారి కాలమున ప్రచారములో నుండిన క్యూనిఫారమ్ లిపి చాల క్లిష్టనిర్మాణమున నుండెను. సుమేరియన్ లిపియందు సుమారు 600 సంజ్ఞ లున్నవి. వీటితో పోల్చిచూచినయెడల వీరి కాలమునకు పిదప 'హిట్టెటులు' అనువారును, 'ఈల మైటులు' అనువారును, తమ లిపియం దుపయోగించిన 350 సంజ్ఞలును, 200 సంజ్ఞ లును స్వల్పసంఖ్యయనియే చెప్పవచ్చును. తరువాత తరు వాత ఇరాన్ వారు ఉపయోగించిన సంజ్ఞలు కేవలము 39 మాత్రమే. సిరియా దేశమునందు జరిగిన ఖనన పరిశోధన మునందు కని పెట్టబడిన శాసనములనుండి కేవలము 30 సంజ్ఞలను మాత్రమే అక్షరములవలె నుపయోగించిన కీలలిపి యొకటి యుండెనని తెలియుచున్నది.

క్రీ. శ. 1800 ప్రాంతమునకు పూర్వమే లిపి శాస్త్ర జ్ఞులు ఈ లిపిని చదువుటకు ఆరంభించిరి. పశ్చిమ ఇరాన్ ప్రాంతమునగల బేహి స్తన్ (Behistun) రాతికొండ పైకి నేలనుండి చూచినచో, సుమారు 300 అడుగుల ఎత్తున ఏదో వ్రాత కాన్పించుచున్నదని పాశ్చాత్య ప్రయాణీకులు కని పెట్టిరి. క్రీ. శ. 1802 లో గ్రోటెఫెండ్ అను జర్మను శాస్త్రజ్ఞుడు ఈ శాసన ప్రతులను సంపాదించి, వాటిని చదివి అర్థము చేసికొనుటకు ప్రయత్నించెను. ఈ శాసనము మూడు భాషలయందును, మూడు లిపులు యందును ఉన్నది. కాబట్టి దీనిని చదువుటకును, అర్థము చేసికొనుటకును వీలు కలిగెను. కొంతకాలమునకు పిదప ఇతర శాస్త్రజ్ఞులును, ముఖ్యముగ రాలిన్సన్ అనునొక ఇంగ్లీషు శాస్త్రజ్ఞుడును కృషిచేసి, ఈ శాసనమునే కాక, ఇట్టి ఇతర శాసనములను గూడ సమగ్రముగ చదివి అర్థము చేసికొనగల్గిరి.

నాటినుండి నేటివరకును ఈ క్యూనిఫారమ్ లిపిలో వ్రాయబడిన శాసనములు లక్షలకొలదిగా దొరకినవి. వీటి నన్నిటిని చదివి అర్థము చేసికొనినందున ప్రాచీన చరిత్రకు సంబంధించిన విషయము లెన్నియో మనకు తెలిసినవి.

ఈ లిపి స్వరూపము కొంత బోధపడుటకు పారసీక రాజగు దరయస్ జరజస్ నామము ఎట్లు వ్రాయబడునో ఈ క్రింద చూడనగును. దరయస్ అను పదమును ప్రాచీన ఇరాన్ భాషలో వ్రాసినపుడు "ద్ అర్ ఇవ్ ఉష్" అని వ్రాయవలెను. కాబట్టి క్యూనిఫారమ్ లిపిలో నున్న శాసనములలో ఈ పదము ఈ క్రింది విధముగా వ్రాయబడి యున్నది:

చిత్రము - 26

ఈ రీతిగనే వ్రాయబడిన మరియొక పదముకూడ చూడవచ్చును —

చిత్రము - 27

పు. శ్రీ.