సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మూడవ సంపుటము/కోరంగి
కోరంగి :
ఇరువది శతాబ్దములకు పైబడిన చరిత్రయందును, భూగోళ శాస్త్రమునందును పేర్కొనబడిన చరిత్రాత్మక ప్రదేశము కోరంగి.
“కోరంగి” నేటి తూర్పుగోదావరిజిల్లా యందు నిడుచతురాకారముగ బంగాళావియుక్తాగ్ర గుడతీరమున గల కాకినాడ తాలూకాకు ఆగ్నేయదిశయం దున్నది. నేటి కాకినాడ పట్టణమునుండి 'చొల్లంగి' దాటి దక్షిణముగ 'ఏనాము'నకు పోవుదారిలో సుమారు పదియవమైలు నందుగల కుగ్రామముల సమాహారమే కోరంగి. అనగా (1) ప్రాతకోరంగి (2) క్రొత్తకోరంగి (3) సీతారామపురము (4) చినబొడ్డువెంకటాయపాలెము (5) పెదబొడ్డు వెంకటాయపాలెము (6) బొడ్డువానిలంక అను ఈ శివారు లన్నిటిని కలిపి 'కోరంగి' యని నేటి ప్రభుత్వము వ్యవహరించుచున్నది. కొన్ని వందల ఏండ్లకు పూర్వము 'కోరంగి'కి 'కురంగి' యని పేరున్నట్లును, పాశ్చాత్యులరాకతో ఆ పేరు 'కోరింగ' (Koringa) అనియు, ఇటీవల 'కోరంగి' (Korangi) అనియు మారినట్లును అచ్చటిపెద్దలు చెప్పుదురు.
పై జెప్పిన 'కాకినాడ - ఏనాము' బాటకు పదియవ మైలున పడమరగా గల 'ఆత్రేయ' గోదావరిని దాటిన వెంటనే ప్రాత కోరంగియు, తూర్పుగా క్రొత్త కోరంగియు, కడమ శివారులును ఉండుటచేత మొత్తముమీద కోరంగిని చతురస్రమన్నను తప్పులేదు.
కోరంగికి తూర్పున బంగాళాఖాతమునకు చేర్చు రిజర్వు ఫారెస్టును, దక్షిణమున ఒక మైలులో తాళ్ళరేవును, పడమర సుమారు అరమైలులో కోరంగికాల్వయు, ఉత్తరమున ఆరుమైళ్ళలో చొల్లంగియు కలవు.
సుమా రొకమైలు పొడవును, అరమైలు వెడల్పును గలిగి చతురస్రాకారముగా నుండి చదరపు టరమైలు విస్తీర్ణము కలదని చెప్పదగు ఆరుపల్లెల మొత్తము కోరంగి.
కోరంగికి పడమట ఆత్రేయ గోదావరియు, పడమటను ఉత్తరమునను కోరంగికాల్వయు కలవు. రాజమండ్రి, రామచంద్రపురము, కాకినాడ అను మూడు తాలూకాలలో ఈ కోరంగికాలువ ప్రవహించుచున్నది. వర్షములు తక్కువైనను ఇది పంటలకు నష్టము రానీయదు. దీని పొడవు నలుబది మైళ్లు. 37,601 ఎకరములు దీనిక్రింద సాగుచేయబడుచున్నదని క్రీ. శ. 1931 సంవత్సరము నాటి అంచనా. ఇచటి 'ఆత్రేయ' కోరంగియొద్ద సముద్రములో కలియు చున్నది. ఇందలి నీరు ఏడాదిలో ఆరునెలలు ఉప్పగ నుండును. మిగత ఆరునెలలు చౌకలుగ నుండును. కావున నేటికిని ఏడాది పొడుగున కాల్వనీరు, లేదా నూతినీరే ప్రజల కాధారము.
సముద్ర సామీప్యముచే చేపలవేటయు, పడవల నిర్మాణమును కోరంగి ప్రజలయొక్క ప్రధానమైన వృత్తులు. భూమి అంత సారవంతము గామిచే వ్యవసాయము అప్రధానమైన వృత్తి.
నలుబదిఏండ్లకు పూర్వము కోరంగి జనసంఖ్య 10,000. అది క్రమముగ క్షీణించి క్రీ.శ. 1951 వ సంవత్సరపు లెక్కలనుబట్టి 5,322 అయ్యెను. నేడు సగటున సివారునకు వేయిమంది చొప్పున కోరంగి గ్రామసంపుటియందలి జనసంఖ్య 6,000.
పూర్వచరిత్ర : ప్రాచీనమైన బుద్ధుని దంతగాథ లన్నిటికిని సంబంధించిన మహానగరము 'దంతపురము'. ఆ దంతపురము నేటి రాజమహేంద్రవరము కావచ్చునని జనరల్ కన్నింగుహాము వ్రాసియుండెను. ఫెర్గూసన్ (Fergusson) పండితుడు దంతపురము కోరంగి కావచ్చుననెను. దీనికి తగు నాధారములు లేవు. క్రీస్తుశకారంభము నుండియు 'కోరంగి', గోదావరీ ముఖద్వారమున గల పురాతన ప్రసిద్ధ నౌకాశ్రయ మని దృఢపడుచున్నది.
'టాలెమీ' (Ptolemy) అను భూగోళశాస్త్రజ్ఞుడు (క్రీ.శ. 130) చోళమండలతీరమునందున్నట్టియు, పినాకిని మహానదీ ముఖద్వారములయం దున్నట్టియు నౌకాశ్రయములను పేర్కొనెను. కాని, గోదావరీ ముఖద్వారమున గల నౌకాశ్రయమును పేర్కొనజాలడయ్యెను.
టాలెమీకి పూర్వుడును, పెరిప్లస్ (Periplus) అను గ్రంథమునకు కర్తయు నగు 'హిప్పాలస్' (Hippalus) అనునతడు కూడ గోదావరి ముఖద్వారమున ఒక రేవుపట్టణము ఉండినట్లు చెప్పెనేకాని దానిపేరు చెప్పజాలక పోయెను.
ఇక పై నిర్వురికంటె పూర్వుడైన 'ప్లైనీ' (Pliny) (క్రీ. శ. 77) అను చరిత్రకారుడు దంతపురమును 'దండాగుల' అని నిర్ధారించి, అది గంగానదీ ముఖద్వారమునకు (ఆకాలపు కొలత ననుసరించి 625 రోమను మైళ్ళ దూరమున) 574 మైళ్ళ దూరమున దక్షిణముగ ఒకానొక మహానదీ ముఖద్వారమునందున్న 'కోరి' అగ్రమున (Cape Cori) కలదని చెప్పినాడు.
నేటి కోరంగికి ఇటీవలి వరకును, కురంగి అనియు, కోరింగ (Coringa) అనియు గలపేళ్ళు, ప్లైనీ పేర్కొనిన ఈ 'కోరి' అనుపేరు 'కోరింగ', 'కోరంగి' అను పదములతో సాదృశ్యమును కలిగియున్నమాట నిజము. కాని ఇచ్చట ఎప్పుడును ఒక మహానగరము వర్థిల్లిన చిహ్నములు లేవు. కీ. శే. భావరాజు వేంకట కృష్ణారావుగారు చెప్పినట్లు 'దంతపురము' 'దొంతికుఱ్ఱు' కావచ్చును. మహానగర మగునో కాదో కాని, క్రీస్తు శకారంభము నుండియు, ఇంకను తత్పూర్వము నుండియు 'కోరంగి' గొప్ప రేవు పట్టణము మాత్ర మగును.
రెండు వందల ఏండ్ల వెనుక (అనగా క్రీ. శ. 1759 లో) నేటి క్రొత్త కోరంగి అను గ్రామమును 'వెస్టుకాట్ ' (West Cott) అను ఆంగ్లేయ వర్తకుడు నిర్మింపించినాడని తెలియుచున్నది. ప్రాత కోరంగి తత్పూర్వము నుండియు కలదట.
క్రీ. శ. 1789 లో (అవిభ క్త) మదరాసు ప్రభుత్వము యొక్క భూగోళ శాస్త్రజ్ఞుడుగా నుండిన 'టాపింగ్' (Toping) అను పాశ్చాత్య పండితుడు స్వయముగ కోరంగి వెళ్ళి చూచి అచటి రేవునకు ఫ్రెంచి, డచ్చి, పోర్చుగీస్, ఇంగ్లీషు నావలు వచ్చెడి వనియు, అచ్చట దొంగలబాధ విపరీతముగ నుండెననియు వ్రాసినాడు.
నేటి క్రొత్త కోరంగికి దక్షిణముగ మైలు దూరమున 'తాళ్ళరేవు' అను గ్రామమొకటి కలదు. అందు క్రీ. శ. 1802 లో నావల రేవుగా దానికి అప్పుడున్న ప్రాధాన్యమునుబట్టి, లక్షల ధనమును వెచ్చించి 'ఎబెనీ జా రోబెక్ ' అను ఆంగ్లేయ వర్తకుడు ఒక పెద్ద బోదె (డ్రైడాక్) ను నిర్మించెను. కోరంగి ఉచ్ఛదశలో నుండగా 'తాళ్ళ రేవు'లోని ఈ బోదెకు హెచ్. ఎం. ఎస్. అల్బట్రస్ అను ఆంగ్లేయుల ప్రసిద్ధమైన యుద్ధనౌక ఒకటి కోరంగి మీదుగనే బాగు సేతకు పోయినది. తనతోపాటు ఎప్పుడును ఐదువందల ఓడలకు తక్కువగాక ఉండెడి “తాళ్ళరేవు" నౌకా కేంద్రము యొక్క దశ మారిపోయినపిమ్మటకూడ, కోరంగిరేవు, ఏ కొంచెమో నిన్న మొన్నటివరకు ఓడల 'మరమ్మతు' వ్యాపారమును సాగించుచునే వచ్చెను.
క్రీ. శ. 1839లో పెద్ద తుపానువచ్చి కోరంగి గ్రామము కొట్టుకొనిపోయినది. సముద్ర తీరమున ఉండుటచేత ప్రాచీన కాలము నుండియు ఎన్ని ప్రాత కోరంగులు బంగాళా ఖాతము పాలయ్యెనో, ఎన్ని క్రొత్త కోరంగులు తలయెత్తుచు వచ్చెనో ఎవరును నిరూపింప జాలరు.
క్రీ. శ. 1877 – 78 సంవత్సరములలో రు. 8,22,000 ల నౌకా వ్యాపారము కోరంగియందు జరిగినదనియు, క్రీ. శ. 1884 - 85 సంవత్సరములలో ఈ వ్యాపారము 33 వేల రూపాయలకు పడిపోయిన దనియు తెలియుచున్నది.
ప్రప్రథమమున భారతదేశములో విదేశములతోడి సముద్రవ్యాపారమును ఆరంభించినవారు ఆంధ్రులు. ఈ విషయమున వీరికి తోడ్పడిన ప్రధానమైన నదులలో కృష్ణ ఒకటి. రెండవది గోదావరి. పదునైదవ శతాబ్ద్యంతము వరకు ఈ గోదావరి తీరమున 'కోరంగి' కళింగ తీరమున చిలుక సరస్సువలె, ఓడల బాగుసేతకు కూడ ఉపయోగపడిన ఒక గొప్పరేవు. తరువాత క్రీ. శ. 1611 వ సంవత్సరమునందు బ్రిటిషువారును, క్రీ. శ. 1614 వ సంవత్సరమునందు మచిలీపట్టణములో ఫ్రెంచివారును, క్రీ. శ. 1628 వ సంవత్సరమునందు భీముని పట్టణములో డచ్చివారును స్థావరము లేర్పరచుకొనిరి. అదిమొదలుగా ఆయా పాశ్చాత్యుల అవసరములనుబట్టి ఆంధ్ర నౌకావ్యాపార వాణిజ్యములు ప్రధానముగ ముందు మదరాసునకు తరలింపబడినవి. కలకత్తాకును, దక్షిణమున 'ట్రింకోమలి' కిని నడుమ పెద్ద పెద్ద ఓడలు పట్టుటకు వీలుగనుండెడి కోరంగికి, 19 వ శతాబ్ద్యంతమున క్షీణదశ ప్రారంభించెను. కాలక్రమమున 'కోరంగి' రేవు మేట వేసికొని పోయినది. దీనితో మిగిలిన వాణిజ్యలక్ష్మి కూడ బెండమూరులంక, నీలపల్లి, ఇంజరము, కాకినాడ మొదలగు రేవులకు తరలి, క్రమక్రమముగ అంతర్ధానమైనది. క్రీ. శ. 1946 ఆగస్టు 15వ తేది నుండి బర్మా స్వతంత్రరాజ్య మయ్యెను. తన్మూలమున రంగము (రంగూన్), మోల్మేను పట్టణములతో, కోరంగికి ఇటీవలివరకు గల వ్యాపారము కూడ నశించినది.
నేటి కోరంగి: చారిత్రక చిహ్నములు: నేటికిని ప్రాత కోరంగియందు కురం గేశ్వరాలయము కలదు. మద్రాసులోని ప్రాచ్యలిఖిత పుస్తక భాండారమునందు ఈ కురంగేశ్వరాలయమునకు సంబంధించిన యొకానొక తామ్రశాసన మున్నదట. దానిలో ఈ క్షేత్ర మహత్త్వమును, గర్భాలయ వర్ణనమును లిఖింపబడియున్నవట. గర్భాలయ భూభాగమును, త్రిపీఠములును, శివలింగమును కలిసి ఏకశిలగానున్నవి. ఇందలి శివలింగము అష్టబంధములు లేకయున్నది. ఈ రెండంశములును పై జెప్పిన తామ్రశాసనమున గలవనియు, లింగమునకు అష్ట బంధాదులు లేకపోవుట మానవప్రతిష్ఠ కాకుండుటచేననియు కొందరి వాదము. ముందు ప్రసిద్ధశాసనాదుల లేమియే, ఈ లింగము దైవప్రతిష్ఠిత మనుటకు సాధక మను వాద మింకొకటి. మొత్తముమీద ఈ దేవాలయమును గూర్చి ఇంకను చాల పరిశోధనము జరుగవలెను.
'ఆత్రేయీ సంగమం నామ తీథన్౦ త్రైలోక్య విశ్రుతం
యత్ర సన్నిహితో దేవః కురంగేశః స్సదా శివః
అని సప్తసాగర మాహాత్మ్యమున గలదు. ఈ తీర్థమును గూర్చి ఒక క్షేత్ర మాహాత్మ్యము గలదు. ఆ గ్రంథము పేరు కురంగక్షేత్ర మాహాత్మ్యము. అది మద్రాసు ప్రాచ్య లిఖిత పుస్తక భాండారములో కలదు. డాక్టర్ వింటర్ నిట్జు (Dr. Winternitz) ప్రభృతి పాశ్చాత్య సంస్కృత పండితుల మతమునుబట్టి చూచినను ప్రాయికముగ ఇట్టి పురాణములు క్రీ. శ. నాల్గైదు శతాబ్దులలో వ్రాయబడి యుండవచ్చును. అట్లన్నను కురంగి, కోరింగ యను పేళ్లు కోరంగికి ఆకాలమునుండియు కలవన్న మాట. నేటికిని అచ్చటివారు చెప్పుకొను స్థలపురాణమును బట్టి రావణప్రేరితుడును, మాయాకురంగ రూపధారియునగుమారీచుని శ్రీరామచంద్రుడు ఇచట సంహరించెననియు, తత్సంహారజనిత పాతక నివారణార్థము అతడీశ్వరలింగ ప్రతిష్ఠ చేయుటచే అది కురంగేశ్వరాలయమైనదనియు, ఆ గుడిగల గ్రామము కురంగి, కోరింగ, కోరంగి యైనదనియు తెలియుచున్నది. సప్తసాగర సంగమముల యందును శ్రీరామచంద్ర ప్రతిష్ఠితములైన శివాలయము లుండుటయు, రావణ వధానంతరము శివప్రీత్యర్థము రామేశ్వరమునగూడ శ్రీరాముడు శివలింగమును ప్రతిష్ఠించుటయు, మున్నగునవి పై ఊహకు ప్రోద్బలకములుగ నున్నవి. ఇచటివారు నేటికిని సంకల్పమున దండకారణ్య మధ్యేయని చెప్పుకొందురు. అట్టి పురాణములను, ఇట్టి జనశ్రుతిని ఎంతవరకు చరిత్ర అంగీకరింపవలె నన్నది విచార్యము.
అడవి (Reserve Forest) : ఇది క్రొత్త కోరంగి నానుకొని కాకినాడ తాలూకాయందు సముద్రతీరము పొడవునను కలదు. ఈ అడవి వైశాల్యము 86 చతురపు మైళ్లు. ప్రజలకు వంటచెరకుగా ఉపయోగపడు మడకఱ్ఱ నిచ్చు మడచెట్లకిది ప్రసిద్ధము.
పడవల నిర్మాణము (Boat Building) : క్రీ.శ. 19, 20 శతాబ్దులలో బర్మా, మలయా, సింహళములతో కొబ్బరికాయలు, బియ్యము మొదలగు వస్తువుల వ్యాపారము జరిగిన కాలమున 15 నుండి 70 వేల రూపాయల వరకు విలువగల ఏడు కొయ్యల పెద్ద తెలుగు ఓడలు నిర్మింపబడినట్లు, నేడిచ్చట కట్టబడుట లేదు. క్రీ. శ. 1950 వరకు పెద్ద ఓడలు కలకత్తా వరకు సరకులు లేకయే ఊరకపోయి, అచటినుండి రంగము, మోల్మేను పట్టణములతో వర్తకము సాగించెడివి. తిరిగి వచ్చునప్పుడు బసంగి ధాన్యము, కలప తెచ్చుచు తిరువాన్‌కూరు వరకు వ్యాపారార్థము పోయెడివి. ఆ దినములలో కేవు చాల తక్కువ. నేటికికూడ ఇచ్చటి ప్రజల చేతిపనులలో పడవల నిర్మాణము ప్రధానమైనది, మూడునుండి ఆరు, ఏడువేల రూపాయలవరకు వెలగల పడవలనే నేడు చేపలవేట మున్నగు వానికై ధనికులు కట్టింప గలుగుచున్నారు. ఇచటి ప్రజలలో అధిక సంఖ్యాకులు అగ్నికుల క్షత్రియులు.
మడతవంతెన (Folding Bridge): ఇది క్రొత్త కోరంగి గ్రామమునకు ఉత్తరదిశయందు కలదు. ఏడుపెద్ద తెరచాపల తెలుగుఓడలు సముద్రమునుండి కోరంగి, తాళ్ళరేవులకు బాగుసేతకై పోయి, తిరిగి వచ్చుటకు వీలుగా ఎత్తబడుచు, చాపబడుచు ఉండు పెద్ద ఇనుపరేకు (నేలగా) గల ఈ (కోరంగి కాల్వ) వంతెనను డబ్లియు. సీ. బ్రౌను (W. C. Brown) మహాశయుడు క్రీ. శ. 1885 లో నిర్మించెను. కాని 1953 లో వచ్చిన గోదావరి వరదల సందర్భమున ఈ వంతెన చాచుటకు వీలు లేనట్లు మూసి వేయబడినది.
డాలరు బుట్టలు (Dollar Bushels) : 'సువర్ణభూమి' యగు బర్మాతోడి వ్యాపారమువలన సంపాదించిన బంగారు డాలర్లు, నీలములు, రత్నములు, మున్నగు వాటిని ఓడలనుండి క్రిందికి దింపుకొనుటకై ఉపయోగించిన కుంచపు బుట్టలు నేటికిని ప్రాత కోరంగియందు కొందరి గృహములలో నున్నవి. ఇవి సన్నని తాటి యాకులతో అల్లబడినవి. ఇవి బోర్లించినచో, దొరల టోపీలవలె నుండును. అంచులు చట్రముతో అమర్పబడినవి. నేటికిని ఇవి గట్టిగను, అందముగను ఉన్నవి. ఇక పెద్దపెద్దవి, నల్లనివి, తేలికయైనవియు నగు లక్కపళ్ళెములు, చిన్నచిన్న లక్కబరణులు, మూతలపై రకరకముల అందమగు నగిషీ చిత్రములు గల బరణులు, డాలర్లతో చేసిన కట్టుకాసుల పేరులు మున్నగు నగలను దాచుకొనుటకు వాడుక చేయబడినట్టివి పెక్కులు కలవు.
ఆయుర్వేద ఔషధవ్యాపారము : అగ్నికులక్షత్రియులై న కీ. శే. పొన్నమండ వేంకటరెడ్డిగారు కోరంగియందు క్రీ. శ. సుమారు 1820 - 1880 వరకు ఆయుర్వేద వైద్యులుగ నుండిరి. వారి కుమారుడు లక్ష్మణస్వామిగారు క్రీ. శ. సుమారు 1880 నుండి 1946 వరకు బర్మా, సింహళము, ఆఫ్రికా దేశములతో వ్యాపారముచేసి తమ తండ్రిగారి ఔషధ విధానమునకు కీర్తివ్యాప్తులు సంపాదించిపెట్టి లక్షలాది ద్రవ్యమును గూర్చిరి. వీరి కుమారునిపేరు మరల (తాతగారి పేరిట) వేంకటరెడ్డిగారే. నేటికిగూడ క్రొత్త కోరంగిలో వీరి ఔషధనిలయము పెద్ద దొకటి కలదు. క్రీ. శ. 15-8-1946 నుండి బర్మా, బ్రిటిషు సమాఖ్య (Federation) లో అధినివేశ ప్రతిపత్తి నొందుటచే దానితో మన భారతదేశ వాణిజ్య వ్యాపారములు కుంటువడినవి. ఆదాయమును తగ్గినది.
శిథిల భవనములు : ఇవి క్రొత్త కోరంగినుండి ఆత్రేయకు పోవుదారిలో ఇరుకైన బాటయందు ఎడమవైపున గల కోరడిమధ్య నున్నవి. ప్రజలు వీటిని పాడైన బంగళా లందురు. కేవలము మొండిగోడలను బట్టియు, పునాదులను బట్టియు ఇవి రమారమి 200 ఏండ్లకు పూర్వము నందలి వని చెప్పవచ్చును. కడమ వివరములు సులభముగ దెలియునట్లు లేవు.
కోరింగ దీపగృహము (Coringa Light House) : నేడు క్రొత్తకోరంగినుండి రిజర్వుఫారెస్టు మీదుగా దారిగాని దారిన బోయినచో సముద్రము మూడునాల్గు మైళ్ళుండును. కాని ఆత్రేయపై పడవమీద పోయినచో, సుమారు పదిమైళ్లుండును. ఈ కోరంగికి మైలుదూరములో రాచబాటయం దున్న తాళ్ళరేవునకు సముద్రము మరల సుమారు 4, 5 మైళ్ళుమాత్రమే. కొన్నివందల ఏండ్లకు పూర్వము కోరంగికి సముద్రము నాల్గుఫర్లాంగుల దూరమున నుండెడిదని, తన తాతగారు తనకు చెప్పినట్లు, నేడొక శతవృద్ధునిపలుకు - అందువలననే చేపలవేటకై అగ్నికుల క్షత్రియులు కోరంగికి సివారగు బొడ్డు వెంకటాయపాలెమును సముద్రమునకు దగ్గరగా కట్టుకొనిరనియు తన తాతగారు ఆయనకు చిన్ననాడు చెప్పెనట. ఈ నదీముఖద్వారమున ఇసుకదిబ్బలు పెరుగుటచే సముద్రమునకును దీనికిని దూరమేర్పడెను.
ఇపుడు కోరంగికి నాల్గుమైళ్ళలోనున్న సముద్రమునకు నాల్గుఫర్లాంగు లెడముగా, మేటవేసిన ఇసుకతిప్పపై 'కోరింగ దీపగృహము' కలదు. ఇది చాల ప్రాతదై, శైథిల్యము నొందినది. ఇప్పుడు బైటపడియున్న ఈ దీపగృహము పూర్వము సముద్రములో నున్నట్లు చెప్పెదరు.
కోరంగిసంత : నదీముఖద్వార ప్రాంతమునందును, సముద్రమునందును వేటాడితెచ్చిన చేపలను చేపల వర్తకులు సంతలో ఇచట అమ్ముచుందురు. "దాక్షారామము' గొల్లల మామిడాడ, కాకినాడ, చామర్లకోట మున్నగు తావులందలి సంతలతో సమానమైనది కోరంగిసంత.
నాటి కోరంగి ఇంతటి ప్రసిద్ధి నార్జించుకున్న చారిత్రక పురాతనత్వముగల నగరము.
క్రీ. శ. పందొమ్మిది - ఇరువది శతాబ్దులలో నౌకావ్యాపారము మూలమున శ్రీమంతులైనవారు ఐదారుగురు మాత్రమే ! కాని, తుపానుల తాకిడికి దారియు తెన్నును కానలేక, మునిగిన నావలు పెక్కులనియు, మరణించిన జనులు పెక్కురనియు ఇచ్చటివారు చెప్పుదురు. నాటి కోరంగి మహాపట్టణము. నేటి కోరంగి గొప్ప కుగ్రామము.
బొ. వెం. కు. శ.