Jump to content

సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మూడవ సంపుటము/కోయలు

వికీసోర్స్ నుండి

కోయలు:

'కోయ' అను పదమునకు 'కొండమనుష్యులు' లేక 'కొండలలో నివసించువారు' అని అర్థము. కోయలు ఆంధ్రప్రదేశములో తూర్పు గోదావరి జిల్లా మన్య ప్రదేశములోను, తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలలో మైదానము లందును, విశాఖపట్టము, గుంటూరు జిల్లాలలోను నివసించుచు గోదావరికి దక్షిణమునగల ఖమ్మం మెట్టు వరకును, ఈ నదికి ఎడమ భాగమున నాగపూరును దాటియున్న బస్తరులోనికిని, ఒరిస్సాలోని మలకనగిరి తాలూకాలోనికిని వ్యాపించియున్నారు.

కోయలు ఈ క్రింద పేర్కొనబడిన తెగలుగా భాగింపబడి యున్నారు. 1. గుట్ల (కుట్ల) కోయలు లేక రాచ కోయలు. 2. గొమ్ముకోయ (లేక దొరల చట్టము). 3.. కమ్మరకోయ, 4. మూసరకోయ, 5. గంపకోయ, 6. ఒడ్డికోయ, 7. పథిడికోయ. ఈ విభాగము చాలమట్టుకు వారివారి వృత్తులపై నాధారపడియున్నది. వారు మరల 1. బేరంబోయి లేక ఏడుగుట్ట గోత్రము, 2. బండారి లేక ఐదుగుట్ట గోత్రము, 3. సన్‌పాగరి లేక నాల్గుగుట్ట గోత్రము, 4. మూడుగుట్ట గోత్రము, 5. పరడిగుట్ట గోత్రము అని ఐదు తరగతులుగా విభజింపబడి యున్నారు. కోయలయొక్క సాంఘికవ్యవస్థ విశదముగా నిర్వచింపబడి యుండలేదు. వారు సాధారణముగా సవర్ణహిందువులు గానే పరిగణింప బడుచున్నారు.

వ్యవసాయము, అడవిలోని యితర పనులు-వారియొక్క ముఖ్య వృత్తులు. ఒక ప్రదేశమునుండి మరియొక ప్రదేశమునకు మార్చబడు 'పోడు' అను వ్యవసాయ పద్ధతి కొన్ని పల్లెలలో ఇప్పటికిని ఆచరణమందున్నది. హైద్రాబాదు రాష్ట్రములోని ఆదిమ నివాసులైన జాతులలో చెప్పుకొనదగినంతగా పరిశ్రమలలో నియుక్తులైన వారి గుంపు ఈ కోయగుంపు మాత్రమే. వారు కొత్తగూడెము, సింగరేణి ప్రదేశములలో పనిచేయుచున్నారు. వారు ముఠాకట్టి సమష్టిగా పనిచేయుటలో కడు సమర్థులనియు, సమష్టి కృషితో

చిత్రము - 20

కోయలు అడవిదున్నలకొమ్ములతో కూడిన శిరోలంకారములను ధరించి, పెండ్లి పండుగలందు దున్నలయుద్ధమును అనుకరించు నాట్యప్రదర్శనము.

చిత్రము - 21

సింగారించుకొన్న కోయ యువతులు

యాంత్రికమైన కార్యకలాపములు నిర్వహించుటయందు కూడ మిక్కిలి నేర్పరులనియు అందురు. అడవివస్తువులను గూడ వీరు పోగు చేయుదురు. కొందరు వెదురుతో తట్టలల్లుట, తుంగతో చాపలల్లుట మొదలగు పనులు చేయుదురు. వీరుమిక్కిలి పేదవారు, త్రాగు బోతులు.

కోయలు వివాహ విషయములో మత ప్రాముఖ్యమును, పురాణగాథల ప్రాముఖ్యమును కల్పించుచుందురు. కాని ప్రతియొక కర్మకువారికి కారణము తెలియదు. లేచిపోవుట (elopement) మొదలగు అన్ని విధములైన వివాహ విధానములును జరుగుచున్నవి. అన్ని తరగతులకును చెందిన 'ఏలుపుదేవుడు' అను దేవత వారి కత్యంత ముఖ్యదైవము. కోయలలోని ప్రతి గోత్రము వారికిని ఆ గోత్రమునకు చెందిన ప్రత్యేక 'ఏలుపు' ఉండును. (ఏలుపు అనగా భగవంతునికిని, అతని శ క్తికిని చిహ్నముగా లోహముతో చేయబడిన ఒక గుర్తు) ఇది ఒక విధముగా పూర్వీకులను పూజించుటయనవచ్చును. ఈ పూజ ప్రతి మూడు నాలుగు సంవత్సరములకొకసారి జరుగుచుండును. వర్షాకాలము తరువాత వారుచేయు 'భూమి పండుగ' అనునది మరియొక ముఖ్యమగు ఉత్సవము. ఎద్దులను చంపి వాటిరక్తము భూమిపై చల్లెదరు. ఈ విధముగా చేసినయెడల భూమియొక్క సారము, పంట అభివృద్ధి యగునని వారినమ్మకము. ' నాలు గై దు దినములవరకు సంబరములు, త్రాగుడు, నృత్యము, విందు బ్రహ్మాండముగా జరుగును. ఏలుపుదేవునేగాక వీరు షుమిదేవి, ముత్తాలమ్మ (కలరా జాడ్యదేవత), మైసమ్మ (మశూచికపు దేవత) అను దేవతలనుకూడ కొలిచెదరు.

కోయ సంఘమునకు చెందిన వివాదములను తీర్చుటకు 'కులపంచాయితి' అనునొక వ్యవస్థయుండును. 'పిన్న పెద్ద', 'కులపెద్ద' అనువారు దీనిలో ముఖ్యులు. 'కులపెద్దకు' ఎక్కువ అధికారముండును. ఈ యిరువురు ఉద్యోగులును వంశక్రమముగా వత్తురు. కాని ఒక 'పిన్న పెద్ద' చనిపోయినపుడు మరియొకనిని ఆ స్థానములో ఎన్నుకొనుట ఆచారము. పల్లెలోని వివాదముల నన్నిటిని 'కులపెద్ద ' తీర్చును. సాధారణముగా ఇతని తీర్పే అంత్య నిర్ణయముగా నుండును. నేరస్థులు పెద్ద జరిమానాలతో శిక్షింపబడుదురు. ఈ జరిమానాలు ఈయని వారిని వెలివేసియు, రెండుచేతులతో చెట్లకు వ్రేలాడదీసి క్రింద ముళ్లుపోసియు కఠినముగా శిక్షింతురు. వారి నిజాయితీని పరీక్షించుటకు మరుగుచున్న నూనెలోగాని, నీటిలోగాని వారిచేతులను ముంచుట అనునది మరియొక పరీక్షా విధానము.

రా. ప్ర.