Jump to content

సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మూడవ సంపుటము/కోటప్పకొండ

వికీసోర్స్ నుండి

కోటప్పకొండ :

ఆంధ్రదేశమున గల ప్రసిద్ధ పురాతన శైవ క్షేత్రము లలో కోటప్పకొండ ఒకటి. ఇది గుంటూరుజిల్లాలోని నరసరావు పేట తాలూకాలో, నరసరావుపేట పట్టణము నకు దక్షిణపు దిక్కున 7 మైళ్ళ దూరములో ఎల్లమంద, కొండకావూరు అను గ్రామములకు మధ్యనగల ఒక పర్వ తముపై నున్న పుణ్యక్షేత్రము ఇది యీ జిల్లాకు నడి బొడ్డులో నున్నది. ఈ పర్వత మెటు చూచినను మూడు కూటములు (బోళ్ళు) గా కన్పడుటచే, దీనిని త్రికూట పర్వత మనియు, ఇందు వెలసిన స్వామిని త్రికూ టేశ్వరు డనియు పిలుచుచున్నారు. ఈ స్వామినే ఎల్లమంద కోటి శ్వరు డనియు, కావూరి త్రికోటీశ్వరు డనియు భక్తులు పిలుచుచుందురు.

ఈ పర్వతము చుట్టుకొలత అడుగు తక్కువ ఆమడ. దీని వైశాల్యము రమారమి 15 లేక 16 క రములుండును. దీని ఎత్తుగూడ సుమారు 1600 అడు గులు. ప్రస్తుతము ప్రజలందరును పూజించుచుండు కొత్త కోటీశ్వరస్వామి దేవాలయము ఆరువందల అడుగుల ఎత్తున నున్నది. దీనికి అనతిదూరములో పాతకోటీశ్వర స్వామి దేవాలయమున్నది. ఈ పర్వతము పైన పెద్ద అడవి యున్నది. అనేక గుహ లున్నవి. వీనిలో పూర్వకాలము నుండియు అనేక మంది ఋషులును, జంగములును తపస్సు చేసికొని ము క్తి ని బొందినట్లు ప్రతీతిగలదు. ఈ పర్వతము పైన ప్రకృతిసిద్ధ మైన అనేక నీటిదొన లున్నవి. అవన్నియు నిర్మల జలపూరితములు .

మ్రొక్కుబడులు గల భక్తులు ఈ పర్వతము చుట్టును ప్రదక్షిణము చేసి, దక్షిణభాగ మందున్న 'ఓంకార' లేక ఓగేరు అను నదియందు స్నానమాడి, తీర్థ శ్రాద్ధములు చేసికొని కొండపైకి పోయి మ్రొక్కుబడులు చెల్లించి స్వామిని సేవించి తరింతురు.

కొండపైకి పోవుటకు మార్గములు : ఈస్వామి సన్నిధికి పోవుటకు మూడు మార్గములు కలవు. (1) ఎల్ల మంద సోపానమార్గము (2) మధ్యేమార్గము. దీనినే నూరు సంవత్సరముల క్రింద నరసరావుపేట రాజావారగు శ్రీరాజా మల్రాజునరసింహరాజుగారు కట్టించిరి. యాత్రికు లందరును ప్రస్తుతము స్వామి సన్నిధికి ఈ మార్గముననే పోవుచుందురు. (8) రాధాకృష్ణ సోపానమార్గము. స్థల పురాణము : ఈ పవిత్ర స్థలము యుగాంతరముల నుండి గొప్పమహిమగలదై యున్నట్లు పెద్దలుఅ నేక కథలు చెప్పుదురు. ఈ కోటప్పకొండపైన రుద్రశిఖరము, విష్ణుశిఖ రము, బ్రహ్మశిఖరము అను మూడు బోళ్ళున్నవి. వానికి సంబంధించిన స్థలపురాణము లీ క్రింది విధముగానున్నవి. రుద్రశిఖరము పూర్వము సతీదేవి తన తండ్రి చేయు యజ్ఞమునకు అనాహూయయైపోయి తన తండ్రిచే అవ మానింపబడి యజ్ఞ గుండమున దూకి ప్రాణములను విడి చినది. తరువాత శివుడు దివ్యదృష్టిచే సంగతినంతయు గ్రహించి కోపముతో తనజడ పెరికి శిలపై గొట్టగా వీరభద్రుడు అందు జన్మించి, తండ్రి యాజ్ఞ ప్రకారము ప్రళయరౌద్ర రూపము దాల్చి యాగస్థలమునకు బోయి దానిని ద్వంసముచేసి దముని శిరమును త్రుంచెను. అంతట దముని భార్య పతిభిక్ష వేడగా వీరభద్రుడు కరుణించి దక్షుని బ్రతికించి శివునియొద్దకు రాగా స్వామి శాంతించి, దక్షిణామూర్తి రూపమున కైలాస శిఖరమున సమాధి నిష్ఠుడై యుండగా, బ్రహ్మ, విష్ణువు, సమస్త దేవతలు ఋషులును పోయి తమకు బ్రహ్మోపదేశము చేయవలసిన దాని వేడిరి. స్వామివారు వారికోరికలను మన్నించి ఆ త్రికూటాచలమునకు వచ్చి రుద్రశిఖరముపయిన అనగా పాత కోటీశ్వరస్వామి దేవాలయమున్న స్థలమున బ్రహ్మాసనాసీనుడై యుండి, యోగనిష్ఠతో మౌనముద్ర చే వారందరికిని బ్రహ్మోపదేశము చేసెను. ఈ దక్షిణా మూర్తి యే గురుమూర్తియను పేరుతో ఇచ్చట వెలసి యున్నాడు. దక్షిణామూర్తి బ్రహ్మాదులకు బ్రహ్మోప దేశముచేసిన గురువుగదా! J

విష్ణుశిఖరము : ఇది రుద్రశిఖరమునకు ప్రక్కననున్నది. దీనిని పాపవినాశనస్థల శిఖరమనియు పిలుతురు. విష్ణుమూర్తి యీ శిఖరమున శివుని గూర్చి తపస్సు చేయగా, అతనికి పరమశివుడు ప్రత్యక్షమా యెను. ఇంద్రాదిదేవులు వచ్చి దక్షయజ్ఞమున తాము స్వీకరిం

చిన హవిర్భాగమువలన వచ్చిన పాపమును పోగొట్టి తమకెల్లప్పుడును లింగరూపమున దర్శన మీయవలసిన దని వేడగా, వారల కోరిక ప్రకారము, స్వామి తన త్రిశూలముతో ఒక రాతిని పొడిచెను. అందుకు వచ్చెను. స్వామి వారినందరిని అందు స్నానమాడ వలసి నదిగా తెలిపి తాను లింగరూపమును దాల్చెను. వారంద రును అందు స్నానమాడి తమ పాపములను పోగొట్టు కొనిరి. ఆనాటినుండి ఈ లింగము పాపవినాశన లింగ మనియు, ఈ క్షేత్రమునకు పాపవినాశన క్షేత్రమనియు వ్యవహారమునకు వచ్చినది. యాత్రికులు మొట్టమొదట ఇచ్చట స్నానమాడి తరువాత కోటీశ్వరుని దర్శింతురు. విష్ణుమూర్తి యీ శిఖరముపైన తపస్సు చేయుట చే ఈ శిఖరమునకు విష్ణుశిఖర మని పేరువచ్చినది. - బ్రహ్మశిఖరము : రుద్రశిఖరమునకు నైఋతి భాగ మున దిగువగా నీ బ్రహ్మశిఖరమున్నది. దీని పైననే నూతన కోటీశ్వరస్వామి దేవాలయమున్నది. ఈ లింగ మును సాలంకయ్య అనుభ క్తుడు ప్రతిష్ఠించినట్లు అతని చరిత్రవలన తెలియుచున్నది. రుద్ర, విష్ణుశిఖరముల పై జ్యోతిర్లింగము లుండినను ఈ శిఖరముపై లేనందున ఈ బ్రహ్మ శివునిగూర్చి తపస్సు చేయగా, అతడు ప్రత్యక్ష మగుటయు, బ్రహ్మకోరిక ననుసరించి లింగరూపమును దాల్చుటయు జరిగెను. బ్రహ్మ యిచ్చట తపస్సు చేయు టచే నీ శిఖరమునకు బ్రహ్మశిఖర మని పేరువచ్చెను. ఎల్లమందక్షేత్ర మని పిలుచుటకు గల కారణము ; ప్రదేశమున బ్రహ్మాది దేవఋషులు గుంపుగా గూడి యుండుటచే ఈ క్షేత్రమునకు 'ఎల్లమంద' క్షేత్రమనియు, మునిమంద అనియు, ఈ కొండకు నుత్తరభాగముననున్న గ్రామమునకు ‘ఎల్లమంద' అనియు పేర్లు వచ్చినవి. ఇట్లు రుద్ర, విష్ణు, బ్రహ్మ మొదలగు మూడు శిఖర ములపైనను దేవపూజితములగు జ్యోతిర్మయలింగము లుండి అవి నరులకు అగోచరము అగుటచే మనుజులు శిలాలింగముల నేర్పరచి పూజించుచున్నారు, నూతన కోటీశ్వరస్వామి ప్రతిష్ఠకు సంబంధించిన కథలు : సాలంకయ్య కథ : కోరె సాలంకయ్య యను లింగ బలిజ భ క్తుడు పూర్వము ఎల్లమంద గ్రామమునందు తన నలుగురు తమ్ములతో నివసించుచు ప్రతినిత్యము కొండకు బోయి కట్టెలు తెచ్చి అమ్ముకొనుచు, తనకు లభించిన ధనముతో నిత్యము జంగమారాధనచేయుచు భక్తి మార్గ మున జీవించుచుండెడివాడు. ఒకనాడు ఆతనికి ఒక ధనపు బిందె దొరికెను. దానితో విరివిగా దానధర్మములు చేయుచు, పుణ్యక థాశ్రవణములతో కాలము గడుపు చుండెను. ఒక నాడు రుద్రశిఖరమునకు బోయి శివుని పూజించుచుండగా ఆతని కొక జంగమమూర్తి ప్రత్యక్షు మయ్యెను. సాలంకయ్య ఆతనిని తన యింటికి రావలసిన దని ఆహ్వానించెను. దాని కాత డంగీకరించి సాలంకయ్య యింటికి వెడలి, క్షీరమును మాత్రము స్వీకరించువాడు. అపుడాజంగమదేవరను సాలంకయ్య భక్తితో పూజించు చుండువాడు. ఒక నాడు జంగమయ్య హఠాత్తుగా ఇంటినుండి అదృశ్యుడై పోయెను. సాలంకయ్య అతని · కొరకు వెతకివెతకి వేసారి చివరకు దిగులుతో నిద్రాహార ములు మాని కాలము వెళ్ళబుచ్చుచుండెను.

గొల్లభామకథ : కొండకు దక్షిణ భాగమునగల ‘కొండ కావూరు' గ్రామమునందు 'సునందుడను' గొల్లవానికి 'కుందరి' యను భార్యయందు 'ఆనందవల్లి' అను కూతురు జన్మించినది. ఆ బాలిక బాల్యమునుండియు శివభక్తు రాలై, ఎల్ల వేళలయందు ఆ పరమశివుని ధ్యానించుచు విభూతి, రుద్రాక్షమాలికలను ధరించుచు, రుద్ర శిఖ రమునకుబోయి త్రికోటీశ్వరుని ధ్యానించుచు పై రాగ్య శీలయై యుండగా, తల్లిదండ్రులు మిక్కిలి చింతించి తమ కుమారితను వైరాగ్య మార్గమునుండి మరల్చు టకు వేయి విధములుగా ప్రయత్నించిరి. కాని ఆ పరమ సాధ్వి వారి మాటల నాలకించక యథాప్రకారము తన పూజాదికములను నిర్వర్తించుచు యోగినియై సంచ రించు చుండెను. ఆమె ఒక శివరాత్రినాడు ఓగేటియందు స్నానమాడి రుద్రశిఖరమున కేగి నిమీలిత నేత్రయై తపో నిష్ఠతో స్వామిని పూజించెను. అప్పుడు ఆమెకు స్వామి జంగమ రూపమున ప్రత్యక్షమాయెను. ఆమె మిక్కిలి సంతోషించి ప్రతి నిత్యము పాపనాశన తీర్థముతో అభి షేకము చేయుచు, శ్రీరములను నైవేద్యమిడుచుండెను. ఈ సంగతి తెలిసిన సాలంకయ్య ఆమె యొద్దకుబో తన సంగతిని ఆ జంగమయ్యకు తెలుపవలసినదిగా ఆమెను

వేడెను. ఆమె దాని కంగీకరించినది. కాని జంగమయ్య మౌనముద్రతో నుండుటచే ఈ సంగతి చెప్పుటకు ఆమెకు వీలు కలుగలేదు. మాయచే ప్రతినిత్యము శ్రద్ధగా గొల్లభామ సేవలు చేయు చుండగా జంగమయ్య ఆమెతో "నీవిచ్చటికి ప్రతినిత్యము వచ్చి నన్ను పూజించుటవలన పొందు లాభమేమియులే” దని తెలి పెను. అయినను, ఆమె ఆమాటలను సరకు గొనక పూర్వముకంటే అధికముగా స్వామిని సేవింప సాగెను. స్వామి ఆమె శ్రమను మాన్పుటకై తన యోగ బ్రహ్మచారిణి యగు నా కన్యకకు మాయా గర్భమును కల్పించెను. అయినను ఆమె లెక్క చేయక స్వామిని పూర్వము వలెనే సేవించుచుండెను. క్రమ ముగా ఆమెకు నవమాసములునిండి, కొండ యెక్కుట కష్టముకాగా స్వామి కరుణించి ఆమెతో “నీవు ఇంత దూరము శ్రమపడి రానేల? నేనే నీయింటికి వచ్చెదను గనుక నీవు వెనుదిరిగి చూడకుండ కొండ దిగిపోవలసినది. ఎచ్చట నీవు వెనుదిరిగి చూచెదవో నేనచ్చటనే ఆగి పోయెదను సుమా" అని తెలిపెను. అందుకు ఆమె అంగీకరించి క్రిందికి దిగసాగినది. స్వామి ఆమె వెనుక ప్రళ యధ్వనులు చేయుచు వచ్చుచుండెను. కొంత దూరము నడచిన తరువాత చిత్తచాపల్యముచేత ఆ మె వెనుదిరిగి చూచేను. స్వామి అచ్చటనే నిలిచిపోయెను. అంతలో గొల్ల భామ ప్రసవించెను. మగపిల్లవాడు పుట్టెను. తవవెంట స్వామి రాకుండుటయు, తనకు పిల్లవాడు కలుగుటయు చూచిన గొల్ల భామ మిక్కిలి విచారముతో కనులు మూసికొని కొద్దిసేపటి తరువాత కనులు తెరిచి చూడగా పిల్లవాడు లేకుండుటయు, తాను వెనుకటి వలె కన్యాత్వమును వహించియుండుటయు కనుగొని ఆమె అచట సమాధిబూని శివైక్యమందినది. సాలంకయ్య దేవాలయములను ప్రతిష్ఠించుట : గొల్ల భామ రాక కై ప్రతినిత్యమువలె క్రింద వేచియుండిన సాలంకయ్య ఆమె యెంత సేపటికిని తిరిగి రాకుండుట వలన ఆమెను వెదకుచు కొండపైకి పోయెను, అచ్చట, తనకు పూర్వము గనుపించిన యతీంద్రుడు కనుపించగా నమస్కరించెను. ఆ యతీంద్రుడు సాలంకయ్యతో “తాను శివుడ ననియు, నీ యింటినుండి అదృశ్యుడనై వచ్చిన 98 తరువాత రుద్రశిఖరమున నివసించుచు, గొల్ల భామకు మోక్షమిచ్చితి ననియు, ప్రస్తుతము తానున్నచోట నే నివసింప నెంచితిననియు అచ్చట తనకొక దేవాలయము గట్టింపవలసినదనియు, అట్లే గొల్లభామ సిద్ధిపొందినచోట గూడ ఒక దేవాలయము గట్టింపవలసినదనియు, శివరాత్రి నాడుభ క్తులందరును ఉపవాస, జాగరణాదులు చేసి ముందు తన భ క్తురాలైన గొల్లభామను పూజించి ఆ తరువాత తనను పూజింపవలసినదనియు తెలిపి అదృశ్యుడాయెను. సాలంకయ్య స్వామి ఆజ్ఞ ననుసరించి గొల్ల భామ కును, స్వామికిని దేవాలయములు కట్టించి మోక్షమును పొందెను. ఇదియే నూతన కోటీశ్వర దేవాలయము. ఇది తూర్పు ముఖముగా నుండును. ఇది బ్రహ్మచారి యగు దక్షిణామూర్తి క్షేత్రము. ఇచ్చట స్వామికి కల్యాణోత్సవములు జరుగవు. ధ్వజ స్తంభము లేదు. కొండపైనున్న దేవాలయములు :
పాతకోటప్పగుడి : రుద్రశిఖరము పైన నీ పాతకోటప్ప గుడి యున్నది. అందులో ఒక లింగము, దాని కెదురుగా ఒక శిథిలావస్థలోనున్న స్తంభమును ఉన్నవి. దీని నిర్మాణ కాలము తెలియదు.
కొత్త కోటప్పగుడి ! ఇది బ్రహ్మశిఖరముపై నున్నది. దీనినే నూతన కోటీశ్వరస్వామి దేవాలయమని పిలుతురు. ఈ దేవాలయమునే సాలంకయ్య నిర్మించినట్లు అతని కథ వలన మనకు తెలియుచున్నది. ఈతనికాలము మనకు తెలియదు కాని యిచ్చటనున్న శాసనములనుబట్టి యిది దాదాపు తొమ్మిదివందల సంవత్సరములక్రిందగూడ వర్ధిల్లి యున్నట్లు ఆధారములు లభించుచున్నని. దక్షిణ ఇండియా నున్న శాసనములలోను, వెలనాటి గొంకరాజు మొదలైన వారి దీపదాన శాసనముల (మెకంజి మాన్యూస్క్రిప్టు) వాల్యుం XVIII పుట 256 వలనను మనకు తెలియు చున్నది. అంతేగాక ఈ దేవాలయమును పల్లవరాజుల తరువాతవచ్చిన చాళుక్యరాజులు నిర్మించినట్లు గుంటూరు జిల్లా భూగోళము తెలుపుచున్నది. ఈ భూగోళము 1929 సంవత్సరమున ప్రకటితమయినది.
శాసనములు పాపవినాశనస్వామి దేవాలయము: ఈ దేవాలయము విష్ణుశిఖరము పైన నున్నది. దేవాలయమునకు దగ్గరలో ఒక నీటిదొన యున్నది. యాత్రికు లా దొనయందు స్నాన మాడుదురు. ఇచ్చట కా ర్తీక మాఘమాసములలో స్నాన మాడిన గొప్ప పుణ్యము వచ్చునని భక్తులు తలంతురు. గణనాథుని దేవాలయము: ఇది నూతన కోటీశ్వర దేవాలయమునకు దక్షిణమున నున్నది. సాలంకేశ్వర దేవాలయము ఇది నూతన కోటీశ్వర దేవాలయమునకు పశ్చిమభాగమున నున్నది.
సంతాన కోటీశ్వర దేవాలయము: ఇది నూతనకోటీశ్వర దేవాలయమునకు ఉత్తరభాగమున నున్నది. నార్థు లీ లింగమును పూజింతురు. వారు కొండ నెక్కుచు; “చేదుకో కోటయ్య చేదుకోవయ్యా- ఈ యేటి కిద్దరం నీసేవ కొచ్చాము - ముందునాటికి మేము ముగ్గురము కావాలి...” అని భక్త్యావేశములతో పాడుచుందురు. బొచ్చుకోటీశ్వరస్వామి దేవాలయము : ఈదేవాలయము మధ్యసోపానమార్గమునకు ప్రక్కన నున్నది. మ్రొక్కు బడులున్న భక్తులు ఈ స్వామి సన్నిధిని తిరుపతికొండలో వలె తల నీలాలు సమర్పించేదరు.
గొల్లభామగుడి : నూతన కోటీశ్వరస్వామి దేవాలయ మునకు పోవు మార్గమున దక్షిణదిళ యందు ఈ గుడి గలదు. కోటప్పకొండ క్షేత్రమునకు బోవు భక్తులంద రును, ముందు గొల్ల భామను పూజించి, తరువాత కోటీ శ్వరుని పూజించెదరు.
కొండ దిగువలోనున్న దేవాలయములు : కొండపై మాత్రమే గాక కొండక్రింద గూడ ఇటీవల కొందరు భ క్తులు కొన్ని దేవాలయములను గట్టించినారు.
ప్రసన్న కోటీశ్వర దేవాలయము: ఈ దేవాలయమును గుడిపల్ల అయ్యంభొట్లుగా రను భక్తుడు కట్టించి ప్రసన్న కోటీశ్వరస్వామిని, భువనేశ్వరీ అమ్మవారిని 1924 సంవత్స రము ఫిబ్రవరి 29 వ తేదీన ప్రతిష్ఠించెను.
నీలకంఠేశ్వరస్వామి దేవాలయము ; ఈ దేవాలయ మును ప్రసన్న కోటీశ్వరస్వామి ఆలయమునకు సమీప మున బెజవాడ వాస్తవ్యులు, అప్పన రామమ్మగారు, వారి కుమారుడు సూర్యనారాయణమూర్తి గార్లు 1929వ సంవత్సరము మార్చి 7వ తేదీన నిర్మించి నీలకం ఠేశ్వర స్వామిని ప్రతిష్ఠ చేయించిరి.
జనాకర్షణ యంత్రము - అష్టదిగ్బంధనములు : ఈ కోటప్పకొండదేవాలయము తదితర దేవాలయములవలె మిక్కిలి ప్రశస్తముగా నుండకపోవుటచే శాలివాహన శకము 1681 ప్రమాదినామ సంవత్సర మాఘ శు ౧౫ వ తేదీనాడు శ్రీ రాజా మల్రాజుగుండరాయనింగారి అనుజ్ఞచే బ్రహ్మశ్రీ పినపాటి యేలేశ్వరం అయ్యంగారనువారు ఈ జనాకర్షణయంత్రమును స్థాపనచేసి యీ స్థలరక్షణార్థమై అష్టదిగ్బంధనములను చేసినట్లు తెలుపు శాసనములు మనకు గాన్పించుచున్నవి. అప్పటినుండియీ క్షేత్రమును వేలకు వేలు జనులు దర్శించుచున్నారు.

ధర్మసత్రములు : కొండపైనను, క్రిందను బ్రాహ్మణులు, విశ్వబ్రాహ్మణులు, పద్మశాలీలు, ఆర్యవైశ్యులు మొదలైన కులములవారికి వేరు వేరుగా ధర్మసత్రములున్నవి. వీనిలో యాత్రికులకు ఉత్సవసమయములో ఫలహారములు, భోజనములు పెట్టుచుందురు.

బసవమందిరములు, మఠములు : యాత్రికుల సౌకర్యార్థమై నిర్మింపబడిన బసవమందిరములు, మఠములు ఇక్కడ నున్నవి. చెఱువులు - కుంటలు - బావులు మొదలైన నీటివసతులను యాత్రికుల సౌకర్యార్థమై చాలమంది భక్తులు నిర్మించినారు.

దానధర్మములు : స్వామికి అనేకమంది భక్తులు నిత్యధూపదీప నైవేద్యములకొరకు అనేకభూములను దానము చేసియున్నారు. వీటివలన ప్రతిసంవత్సరము స్వామికి చాలా ఆదాయము వచ్చుచున్నది. దానితో స్వామికి నిత్య సేవలు, ఉత్సవములు, నిరంతరము అఖండదీపము, అభిషేక పూజాదులు జరుగుచుండును.

దేవాలయ పరిపాలన: ఈ దేవాలయ పరిసాలనము 1935 సంవత్సరము వరకు నరసరావుపేట జమీందారుల పాలనక్రింద నుండెను. కాని ఆ తరువాత దీనిని ప్రభుత్వపు ఎండోమెంటుబోర్డువారు తమస్వాధీనములోనికి తీసికొని ఒక మేనేజరును ఏర్పాటుచేసినారు. తద్వారా దేవాలయ నిర్వహణము సాగుచున్నది.

తిరునాళ్ళ : ఆంధ్ర దేశమున జరుగు ముఖ్యమైన పెద్ద తిరునాళ్ళలో కోటప్పకొండ తిరునాళ్ళ యొకటి. ప్రతి సంవత్సరము శివరాత్రికి ఇచ్చట బ్రహ్మాండమైన జాతర జరుగును. దాదాపు రెండుమూడు లక్షలమంది యాత్రికులు వత్తురు. పల్లెగ్రామములనుండి యీ ఉత్సవములను తిలకించుటకును, మ్రొక్కుబడులు తీర్చుకొనుటకును, పెద్ద పెద్ద ప్రభలను గట్టుకొని వత్తురు. ఆ ప్రభలు ఆకాశమునంటుచున్నవో యన్నట్లుండును. అవి చిత్రవిచిత్రపు అలంకారములతో, రంగులతో చూచుటకు కనుల పండువుగా నుండును. వీరంగములు, కోలాటములు, హరి కథలు, పురాణములు మొదలైన కాలక్షేపములు జరుగును. తిరుణాళ్ళసమయమున దాదాపు రెండు మూడు మైళ్ళవరకు జనులు కొండక్రింది భాగమునంతయు ఆక్రమింతురు.

తిరునాళ్ళసమయమున ఇచ్చట బ్రహ్మాండమైన కలప వ్యాపారము, పశువుల సంత జరుగును. భక్తులు స్వామిని సేవించి గృహనిర్మాణమునకును, వ్యవసాయమునకును, పనికివచ్చు సామానులను, పశువులను, క్రయముచేసి తీసికొని పోవుచుందురు.

ఉత్సవ సమయములలో కలపసామానులు మిఠాయి దుకాణములు, బట్టల దుకాణములు, పండ్లదుకాణములు, బొమ్మల అంగళ్ళు, వినోదశాలలు, కాఫీక్లబ్బులు మొదలైన వానితో ఈ ప్రదేశమంతయు ఎంతో కోలాహలముగా నుండును. ఆ సమయమున ఈ ప్రాంతమున మత్తు పదార్థముల విక్రయము నిషేధింపబడును. మంచి పోలీసు బందోబస్తు ఉండును. “కోటప్పకొండ” ప్రసిద్ధ పుణ్యస్థలములలో నొక్కటి.

పు. వెం.