Jump to content

సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మూడవ సంపుటము/కోడి రామమూర్తి నాయడు (1885-1938)

వికీసోర్స్ నుండి

కోడి రామమూర్తి నాయడు (1885-1938):

విశాఖపట్టణము (ఇప్పుడు శ్రీకాకుళం) జిల్లాలో వీరఘట్టము అను గ్రామములో శ్రీ కోడి రామమూర్తి నాయడు 1885 లో జన్మించెను. పోలీసు ఆఫీసరుగా పని చేయుచున్న తన పెదతండ్రియగు కోడి నారాయణస్వామి నాయడు దగ్గర ఈయన పెరిగెను. ఇతడు చెన్నపట్టణములో వ్యాయామాధ్యాపకుడుగా క్రమమగు శిక్షణము పొందెను. శరీర వ్యాయామము ద్వారమున బలసంపన్నుడగుటయందు ఈతనికి చిన్నతనమునుండి అభిలాష మెండుగ నుండెను, ప్రతి దినము ఇతడును, ఇతని కొందరు మిత్రులును కలిసి గ్రామమునకు బయటనున్న తటాకము నొద్ద వ్యాయామముచేసి తరువాత ఆ తటాకములో ఈదులాడెడువారు. పారెలల్ బార్సు మీదను, హారిజాంటల్ బార్సు మీదను ఇతడు పలువిధములగు కసరత్తులు స్వయముగా చేయుటయేగాక ఆధ్యాపకుడుగనుండి వాటిని విద్యార్థులకు నేర్పెడివాడు.

ఒక రోజున తటాకమున కావలియొడ్డున ఒక పాక యందు నివసించుచున్న 200 సంవత్సరముల వయస్సు గల సీతారాంబాబా అను అవధూతస్వామి దృష్టిపథమం దీ రామమూర్తి పడెను. అదృష్టవశమున ఆ స్వామి రామమూర్తిని దగ్గరకు రావించుకొని ఇతనికి ప్రాణాయామ విధానమును హనుమదుపాసనాపద్ధతిని నేర్పెను. నేర్పి "నీవు దీనిని నేనుచెప్పిన చొప్పున చక్కగ నభ్యసించిన యెడల త్వరలో సిద్ధికలిగి జగద్విఖ్యాతి గాంచెదవు" అని ఆశీర్వదించెను.

ఉత్సాహ పూరితుడును, పట్టుదల కలవాడును అగు రామమూర్తి త్వరలో తన వ్యాయామాధ్యాపక, పదవికి స్వస్తిచెప్పి తుని రాజాగారి ధనసహాయముతో 1903 వ సంవత్సరములో చిన్నసర్కసు ప్రదర్శనమును ఆరంబించెను. ఊరూర ప్రదర్శనములు కావించుచు శరీరసౌష్ఠవము, ఆరోగ్యము, బలము చేకూరుటకై వ్యాయామముచేయుట ప్రధానకర్తవ్యమని యువతీ యువకులకు ఇతడు ఉద్బోధింప సాగెను. ప్రథమమున రామమూర్తియే సర్కసులో అన్నివిధములైన కసరతులు చేసెడివాడు. ఇతడే మన దేశములో మొదటి సర్కసు ప్రదర్శనమును ఆరంభించినవాడు. క్రమముగా దేశమం దంతటను సంచారము కావించుచు ఇతడు ప్రసిద్ధి నొందెను. పలురకములగు కసరతులలో ప్రవీణులగువారు ఇతని సంస్థచే నాకర్షింపబడిరి. ఖండఖండాతరములలో నిపుణులయిన యువతీ యువకులు ఇతని సర్కసులో పాల్గొని వాసికెక్కిరి. ఇతని సర్కసును ఒక సంచార వ్యాయామ విద్యాసంస్థ యని వర్ణంచుట సమంజసముగా నుండును.

చిత్రము - 19

కోడి రామమూర్తి నాయడు

పునహాపట్టణములో రామమూర్తి పెక్కు ప్రదర్శనములు కావించెను. క్రీ. శే. లోకమాన్య బాలగంగాధర తిలకు రామమూర్తి ప్రదర్శనములచే ఆకర్షింపబడి ప్రోత్సాహకరముగా బహిరంగసభయందు ఇతనికి "మల్ల మార్తాండ" అను బిరుద మొసగి బహూకరించెను. వంగ దేశములో ఇతనికి "మల్ల రాజతిలక" అను బిరుదము లభించెను. ఆంధ్రు లీతనిని "ఆంధ్ర వీరకంఠీరవ" "కలియుగ భీమ" అను బిరుదములతో గౌరవించిరి. హైదరాబాదులోని శ్రీకృష్ణదేవరా యాంధ్ర భాషానిలయాధికారులు రామమూర్తికి "జగదేకవీర" అను బిరుదమొసగి 1923 వ సం.లో సన్మానించిరి. ఈతని బిరుదములన్నియు సార్థకములే.

మల్లయుద్ధములో రామమూర్తికి తుల్యు డెవ్వడును లేకుండెను. ఎంత పేరొందిన జెట్టినయినను 1, 2, నిమిషములలో రామమూర్తి చిత్తు చేసెడివాడు. ఇతడు కుస్తీ పట్టురీతి చాల విచిత్రముగ నుండెడిది. ప్రేక్షకులకుగాని జయింపబడిన వానికిగాని ఇతడు పట్టు పట్టురీతిగాని, ఓడించు విధముకాని గోచరింప కుండెడిది. ఇతడు పారిస్‌నగరమం దున్నపుడు పాశ్చాత్య మల్లులు పలువురు ఇతనితో చేతులు కలిపి ఓడిపోయిరి. తదాదిగా ఇతడు వ్యాయామ కళ యందు అప్రతిమాన వీరుడుగా ప్రసిద్దిగాంచెను.

భారతదేశమున పేరొందిన జట్టీలలో గామా, కల్లూ కీకర్‌సింగ్, అర్జున్‌సింగ్'; గులాంమహమ్మద్, కమరుద్దీన్ అహమ్మద్ మొదలయినవారు శ్రీ రామమూర్తి నాయనికి జోహారు లర్పించెడివారు. ఇతడు సర్కసు ప్రదర్శనములు కావించుచు దేశమునెల్ల ముమ్మారు సంచార మొనర్చెను.

రామమూర్తి నాయ డొనర్చిన ముఖ్యమైన ప్రదర్శనాంశములు : (1) ఇనుప గొలుసులను త్రెంచుట. (2) 800 పౌనుల బరువుగల రాతిని తన ఛాతిమీద పెట్టించుకొని సమ్మెటచే దానిపై కొట్టించుకొనుట. (3) రెండెద్దుల బండ్లలో రెండింటియందు నిండుగా మనుష్యులను కూర్చుండబెట్టుకొని ఒక దాని కుడిచక్రమును తన ఛాతిమీదుగను, మరియొకదాని ఎడమచక్రమును తన తొడలమీదుగను ఏకకాలమున లాగించుకొనుట. (4) ఒక్కొక్కదానియందు 36 అశ్వముల శక్తిగల రెండు మోటారుబండ్లను త్రాళ్లతో తన రెండు జబ్బలకును కట్టించుకొని ఆ బండ్లను సాగనిచ్చి, వాటి వేగమును స్తంభింపజేయుటయే గాక వాటి ఎనిమిది చక్రములు పైకి లేచి గిరగిర తిరుగునట్లు చేయుట. (5) లోనికి వాయువును పూరించి, కుంభించి యున్న ఇతని బాహుదండలకు పదిమంది మనుజు లొక లావైనమోకును బిగించికట్టుట, దాని నతడు తన రేచకక్రియచే విడిపోవు నట్లొనర్చుట. ఇతడు రేచించినపుడు ఆతని ఛాతి 48 అంగుళముల పరిమాణమును, కుంచించినపుడు 58 అంగుళముల పరిమాణమును కలిగియుండెడిది. (6) 3 టన్నుల బరువు గల ఏనుగును, కేవల కుంభక క్రియచే తనఛాతిమీద నెక్కించుకొ నెడివాడు. ఇట్టి విలక్షణ ప్రదర్శనముల నింతవర కెవ్వరును చేసియుండలేదు.

భారతదేశములోని సంస్థానాధీశులును, రాజ ప్రతినిధులును, గవర్నరులును ప్రముఖ దేశభక్తులగు అరవింద ఘోషు, లాలా లజపత్‌రాయ, బిపిన్ చంద్రపాల్, సురేంద్రనాథ్ బెనర్జీ, శిశిరకుమారఘోషు, మదనమోహన మాలవ్యా, మోతీలాల్ నెహ్రూ, విశ్వదాత కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు, డాక్టరు భోగరాజు పట్టాభిసీతారామయ్య పంతులు, మహాత్మాగాంధి మున్నగు పలువురు మహాశయులచే ఇతడు పొగడ్తలను గాంచెను. బ్రిటిషుసామ్రాజ్య చక్రవర్తి యగు పంచమ జార్జి శ్రీ రామమూర్తి ప్రదర్శనమున కచ్చెరువంది ఇతని కొక బంగారు పతకము నిచ్చి గౌరవించెను. ఇట్లు బహుమతులుగా లభించిన అనేక పతకములను ఇతడు తన నల్లనికోటుపై ధరించెడివాడు.

రామమూర్తినాయుడు హిందూస్తానీ యందును, ఆంగ్లమునందును, తన మాతృభాష యగు ఆంధ్రము నందును అనర్గళముగను, గంభీరముగను ఉపన్యసించెడి వాడు. స్వరాజ్యసిద్ధి యయినపిమ్మట దేశరక్షణార్థమై వలసిన దేహబలమును సంపాదించుకొనవలెనని యువతీ యువకులకు ఉపన్యాసముల ద్వారమున ప్రబోధించెడి వాడు. ఇతడు ఎల్లప్పుడును అత్యుత్సాహముతోను, నగుమోముతోను ఉండెడివాడు. భారతదేశములోని ప్రతి గ్రామమందును ఒక వ్యాయామశాలను స్థాపించి నియమిత కాలములో యువతీయువకులకు వ్యాయామశిక్షణ మొసగుట ఆవశ్యక మని ఇతడు ప్రచారము చేసెడి వాడు.

ఒకప్పుడు ప్రేక్షకులలో నొకడు " నీ కిష్టమైన ఆహార మెద్ది?" యని ఇతనిని ప్రశ్నింపగా, తనకు కందిపప్పు, నెయ్యి, పెరుగు చాల అభిమానపాత్రములయిన వస్తువులని చెప్పెను. వేదపారగు లగు బ్రాహ్మణులు తనను చూడ వచ్చినపుడు వారిని సత్కరించి వారి ఆశీర్వచనములను వినయవిధేయతలతో స్వీకరించెడివాడు. గ్రంథా లయములపట్ల ఇతనికి అత్యంత శ్రద్ధాసక్తు లుండెడివి. సర్కసు ప్రదర్శనములవలన అనేక లక్షల పరిమితి గల ధనమును ఆర్జించి అనేక ధర్మకార్యములు చేసెడివాడు. బీద విద్యార్థులకు పుస్తకములకొరకు, దుస్తులకొరకు ధన మిచ్చెడివాడు.

1928 వ సంవత్సరమున ఇతడు సర్కసు ఉద్యమము నుండి విరమించుకొని కొలదికాలము విశ్రాంతి గైకొనెను. పిదప కాశీవిశ్వవిద్యాలయ ఉపాధ్యక్షులైన పండిత శ్రీ మదనమోహన మాలవ్యాగారు ఇతనిని ఆహ్వానించి అచట వ్యాయామ శిక్షణ దర్శకునిగా నియమించిరి. ఇతడు 1938 లో కీర్తి శేషు డయ్యెను. ఇట్టి జగద్విఖ్యాత బలశాలి యగు శ్రీ కోడి రామమూర్తి నాయడు ఆంధ్రులకే గాక భారతీయుల కెల్లరకును చిరసంస్మరణీయుడు.

య. సిం.