Jump to content

షోడశకుమారచరిత్రము/షష్ఠాశ్వాసము

వికీసోర్స్ నుండి

శ్రీరస్తు

షోడశకుమారచరిత్రము

షష్ఠాశ్వాసము

క.

శ్రీహర్షముఖ్యసుకవిస
మాహితకావ్యప్రపంచమాధుర్యసుధా
గాహనలీలారసిక
వ్యాహారవిహార మంత్రియన్నయసూరా.

1


సీ.

దేదీప్యమనమై తేజరిల్లుచునున్న
        మణిహేమమయసుధామండపమున
వివిధదేశాగతభువనాధినాథులు
        బలసి యిర్దిక్కులఁ గొలిచియుండ
జలజయతాక్షులు చారుచామీకర
        చమరవాలముల నందముగ నిడగ
నిందిందిరములకు విందులు గావించు
        మాలతీకుసుమము ల్మౌళి దనర
నాసుధర్మలో దేవత లర్థిఁ గొలువ
నమరకాంతలు వింజామరముల నిడఁగఁ
బారిజాతభూజాతపుష్పములు ముడిచి
యున్న యింద్రునిగతిఁ గొలువుండె విభుఁడు.

2


వ.

అయ్యవసరంబున.

3

సీ.

చిత్తజాజ్ఞాలక్ష్మి చేతి పూసెలకట్టె
        కరణి బెత్తము గేలఁ గరము మెఱయ
గనకకుంభములపైఁ గాయువెన్నెలవోలెఁ
        జన్నులఁ జందనచర్చ దనరఁ
జపలాలతాసంగి శారదాభ్రమువోలెఁ
        గట్టిన వెలిపట్టుపుట్ట మమర
వదనేందునకుఁ బొంచి యొదిఁగినరాహునాఁ
        గక్షభాగమున ఖడ్గంబు వ్రేల
రమణి యై యున్నశృంగారరసమువోలె
నుర్విపైఁ గరజానువు లొంద మ్రొక్కి
యల్లనల్లన యాప్రతీహారకాంత
వినయ మెసఁగంగ నిట్లని విన్నవించె.

4


చ.

పలికెడుఁ బెక్కుదేశములభాషలు నచ్చుపడంగ సర్వవి
ద్యల విలసత్కవిత్వమునఁ దద్దయు మీఱెడు నెల్లవారు నిం
పుల విలసిల్లఁ బాడెడు నపూర్వముగా నొకచిల్క యొక్కకో
మలి గొనితేర వచ్చె గరిమంబున దేవరఁ గాంచు వేడుకన్.

5


గీ.

మాట లమృతరసముతేట లై పరఁగ వా
తెఱల కెంపు నింపు నెఱయఁ జేయఁ
జిలుకకంటె నొప్పు జలజాతలోచన
జలజనయనకంటెఁ జిలుక యొప్పు.

6


వ.

అనిన విని యమ్మహీపతి యత్యంతకుతూహలంబున మంత్రులం గనుంగొని.

7

క.

చిలుక యటె పెక్కుభాషలఁ
బలికెడునఁట సరసమధురఫణితిఁ గవిత్వం
బులు చెప్పెడునఁట మతియ
గ్గలమఁట యీచిత్ర మెందుఁ గలదే జగతిన్.

8


వ.

అనిన నత్తెఱం గతిచిత్రంబు రావించి యవధరింపు మనుటయు నవ్విభునాజ్ఞం జేసి యాప్రతీహారి యాకాంతం దోడ్కొని తెచ్చి సమ్ముఖంబు సేయుటయు.

9


చ.

చిలుకకు దాది యైన సరసీరుహలోచన రాజసూతి కిం
పెలయఁగ మ్రొక్కఁ బయ్యెద యొకించుక జాఱఁగ బాహుమూలదీ
ప్తులు లలిఁ ద్రుళ్లియాడ సరిఁ దోరపుఁజన్ను లొకింత నిక్కఁగా
సులలితముద్రికారుచులు చూచుకరోచులమీఁదఁ జెందఁగన్.

10


వ.

ఇట్లు మ్రొక్కి తదనంతరంబ పరిచారికకరంబున నున్నరత్నపంజరం బల్లన యందికొని.

11


క.

రాజితమణిపంజరయుత
రాజశుకముఁ బుచ్చి మనము రంజిల్లఁగ నా
రాజవరుమ్రోల నిడి యా
రాజానన యిట్టు లనియెఁ బ్రమదం బెసఁగన్.

12


సీ.

అష్టభాషల మధురాశువిస్తరచిత్ర
        కవితలు చెప్పు సత్కవులు మెచ్చ
నామ్నాయములు నాల్గు నంగంబు లాఱును
        నఖిలశాస్త్రంబులు నవగతములు
నూతనరీతుల ధాతువిభ్రమముల
        రసములు మెఱయు వర్ణకము వాడు

నేపురాణంబుల నేకథ యడిగినం
        దడఁబాటు లేక యేర్పడఁగఁ చెప్పు
నోలి నవధానములు వేనవేలు సూపు
శబ్దవిజ్ఞాని నెనను సరకుగొనదు
గౌతముని నైనఁ దొడరి తర్కమున గెలుచు
నవధరింపు మీకీరంబు నవనినాథ.

13


వ.

అని పలికినయనంతరంబ యారాజకీరంబు రాజు నవలోకించి.

14


ఉ.

తామరచూలినెమ్మొగము దామరల న్మనునంచలేమ నె
త్తామరపూవుకోడ లెలదామరయిండులబొమ్మకొమ్మ వె
ల్దామరపన్నియ న్మెఱయుతల్లి యొకప్పుడు నీతలంపుఁ గ్రొ
త్తామరలోన నెమ్మొగముదామర విప్పుగ నుండుఁగావుతన్.

15


వ.

అని యాశీర్వాదం బొనరించి ఋగ్యజుస్సామాధర్వణంబులయందును శిక్షాకల్పజ్యోతిర్నిరుక్తవ్యాకరణచ్ఛందంబులందును మీమాంసాదు లగుతత్త్వాపబోధనంబులయందును బ్రాహ్మంబు శైవంబు పాద్మంబు వైష్ణవంబు భాగవతంబు భవిష్యత్తు నారదీయంబు మార్కండేయంబు నాగ్నేయంబు బ్రహ్మవైవర్తంబు లైంగంబు వారాహంబు స్కాందంబు వామనంబు గౌతమంబు గారుడంబు మాత్స్యంబు వాయవ్యంబు నను మహాపురాణములయందును, నారసింహంబు, నారదంబు, శివధర్మంబు, మాహేశ్వరంబు, గాలవంబు, మానవంబు, బ్రహ్మాండంబు, వారుణకాళికంబులు, సాంబంబు, సౌరంబు, మారీచంబు, కూర్మంబు, బ్రాహ్మభార్గవసౌరవైష్ణవంబులు నను నుపపురాణంబులయందును, సరసకవినిర్ణయంబు లగుకావ్యనాటకంబులయందును, సకలప్రసంగంబు

లయందునుం దనకు నత్యంతపరిచయంబు గలుగుట తేటపడ నతిహృద్యవిద్యాగోష్ఠి యొనరించిన సకలజనంబులు నద్భుతానందకందళితమానసు లయి కనుంగొన రాజుపుంగవుండు రాజకీరంబు నవలోకించి.

16


క.

ఏవీటనుండి వచ్చితి
వేవిధమున నీవు సేరి తీలేమకు నీ
విద్యామాహాత్మ్యం
బేవిధమునఁ గలిగె నాకు నేర్పడఁ జెపుమా.

17


వ.

అనుటయు.

18


సీ.

శ్రుతులు పుట్టినయిల్లు మతిజనంబులపంట
        యాగమగోష్ఠీవిహారదేశ
మష్టమహాసిద్ధు లందెడుకందువ
        పరమయోగీంద్రుల పట్టుగొమ్మ
సిద్ధసారస్వతసిద్ధి కావాలంబు
        శబ్దశాస్త్రమునకు జన్మభూమి
నిశ్రేయసంబుల నిచ్చెన మహనీయ
        మహిమలగని శ్రీల మనికిపట్టు
గరుడగంధర్వకిన్నరఖచరసిద్ధ
పన్నగామరకోటుల బ్రదుకుఁజోటు
సర్వసర్వంసహావిభూషణ మనంగఁ
దనరె శారదాపీఠంబు మనుజనాథ.

19


క.

అందుందు భారతి శతా
నందసదానందకారణవికాసముతో

బృందారక బృందార్పిత
మందారలతాంతసురభిమందిర యగుచున్.

20


గీ.

అమ్మహాదేవి లీలావనాంతరమున
బాల్యమున నేను విహరింపఁ బరమయోగి
యొక్కరుఁడు వచ్చి కదలక యుం
.................................

21


(ఇక్కడ గ్రంథపాతము)

ఉ.

...........................................
..............................................
........................... లనొల్లక నన్నెకోరెడుం
గావలయుం దదాప్తకృతిగాఁ దగునార్యఁ దలంచి చూడఁగన్.

22


వ.

అని నిశ్చయించి ధీరోదాత్తుం డగుట సభాజనులసన్నిధి నడుగక యేకాంతంబున నడుగం దలంచి నానావిధభూషణచీనాంజరంబులు నలిమధురరసవత్ఫలంబులు నొసంగి శుకంబుతోడం గళావతిని వీడుపట్టున కనిచి సత్వరంబుగా మజ్జనభోజనంబు లొనరించి యేకతంబున నుండి కళావతిని రావించి యారాజశుకంబుతో నిట్లనియె.

23


క.

శుకవర నీచదివినయా
ర్యకు రెండర్థములు గలిగినట్లున్నవి చె
ప్పక మాకుఁ దెలియకున్నది
ప్రకటంబుగఁ జెప్పు దీని భావము దెలియన్.

24


వ.

అనవుడు శుకం బిట్లనియె.

25


క.

త్రిదశాధిపుపురిపోలిక
విదిశాపురి యొప్పు మాళవీవిలసనసం

పద నైలింపవధూజన
సదమలవిలసనముతోడ సరియై యునికిన్.

26


క.

ఆవీడు మేఘమాల
క్ష్మావల్లభుఁ డేలు నతని గాదిలిసుత హం
సావళి గతినిర్జితహం
సావళి యన నొప్పు మిగుల నవనీనాథా.

27


సీ.

కమలాక్షు చేపట్టు గలిగియు శంఖంబు
        పూఁబోఁడికంఠంబుఁ బోలదయ్యె
నజునకుఁ బుట్టిని ల్లయ్యునుం దామర
        బాలికకనుదోయిఁ బోలదయ్యె
భవు నాశ్రయించియుం బాలేయకరరేఖ
        లోలాక్షినిటలంబుఁ బోలదయ్యె
మదనుని గుణ మయ్యు మధుకరమాలిక
        పొలఁతికుంతలములఁ బోలదయ్యె
ననిస సర్వాంగపరవిలాసాభిరామ
యైన హంసావళికి నెనయైనసతులు
గలరె మనుజేంద్ర మూఁడులోకములయందు
నాలతాతన్వి తనుఁదాన పోలుఁగాని.

28


గీ.

చన్నుదోయి చాల నున్నతిఁ జెలువొందెఁ
బెరుఁగుఁ గటియు దాన పిన్న ననుచుఁ
బడఁతినడుము సిగ్గుపడి డాఁగెనోనాఁగ
నారుమాటునంద యడఁగియుండు.

29


సీ.

నెలచందురునికాంతి నెమ్మోము సృజియించి
        యకలంకవిలసనం బలవరించి

కలువరేకుల మించు కన్నులు గావించి
        నిత్యవికాసంబు నెలవుకొలిపి
చక్రవాకవిభాతిఁ జన్నులు గల్పించి
        పాయనియొప్పులు పరఁగఁజేసి
కరికుంభవిస్ఫూర్తి గటిచక్రమొనరించి
        కొమరారునునుజిగి గుదురుకొలిపి
వనజభవుసృష్టి నిచ్చఁ గైకొనక తాన
మీనకేతుండు వేడ్క నిర్మించెఁగాక
మూడుజగములఁ గలుగు పూఁబోఁడులందు
మాళవేశ్వరకన్యకఁ బోలఁగలరె.

30


గీ.

కాంత మెఱుఁగుఁజన్నుఁగవయును బొదలింపఁ
గుందెఁ గంటె కుంభికుంభయుగము
లేమి పొదుపు సేయ నేమగునో యని
నడుము సన్నముగ నొనర్చె నజుఁడు.

31


సీ.

కరతలంబులయొప్పు సరసిజంబులఁ బోల
        నెఱచందురుని బోలె నెమ్మొగంబు
తనువుటూర్పులయింపు గనుగాలి మించిన
        నవరోమరేఖ పన్నగము మించె
నలకలు తేఁటుల చెలువంబు గెలువ నా
        సికయొప్పు హేమపుష్పకము గెలిచె
ఘనకుచంబులు శైలగరిమంబు మీఱిన
        రదనదీప్తులు వజ్రరశ్మి మీఱెఁ
గారణమ్ములేక కడుఁబరస్పరవైర
మయ్యె నొక్కొ మేనియందె యిప్పు

డవయవముల కనుచు నతిచింత డస్సె నా
నడుము సన్న మయ్యె నలినముఖికి.

32


వ.

అని మఱియు బహుప్రకారంబుల నయ్యంబుజవదనవిలసనం బభినందించి యయ్యిందువదన న న్నెఱింగినతెఱం గవధరింపు మని యిట్లనియె.

33


క.

సిద్ధులచే నను బడసి స
మిద్ధగరిమఁ బొందెఁ గాన యీయింతి గడున్
శుద్ధమతి నెల్లనాఁడును
సిద్ధారాధనముఁ దగఁ బ్రసిద్ధిగఁ జేయున్.

34


క.

అది కారణంబుగా మా
సదనమునకు సిద్ధులెల్ల జనుదెంచుట నొ
క్కదినంబున సిద్ధుఁ డొకఁడు
సదమలతేజుండు వచ్చి సంభావితుఁడై.

35


క.

అనుపమవనితారూపం
బును మోహనపురుషరూపమును బాగుగవ్రా
సినపట మాతనిహస్తం
బున నుండఁగఁ గాంచి వినయమున నిట్లంటిన్.

36


క.

ఈవిధముల యొప్పిదములు
భూవలయములోనఁ గలుగఁబోలవు దేవా
యేవారి రూపులొకొ యివి
నావుడు నిట్లనియె నాననము వికసిల్లన్.

37


క.

ఆకాశగతి యదృశ్యత
యాకర్షణవిద్య మాకు నలవడియుండున్

లోకవిశేషంబు లదృ
శ్యాకారతతోడఁ జూచి యఖిలమునందున్.

38


క.

సకలజనమోహనాకృతి
నొకపురుషుని నొక్కచోట నుజ్జ్వలరూపా
ధిక నొకరమణీరత్నము
నొకచోటం జూచి యభినవోల్లాసమునన్.

39


క.

విను సిద్ధులచేఁ బలుమఱు
వినియునికిని నీకుఁ జూపు వేడుకమై వ్రా
సినవాఁడఁ జూడు మని ప్రియ
మెనయంగా నాకుఁ జూపి యిట్లని పలికెన్.

40


క.

ఈరూపువాఁడు సోమకు
లారూఢుఁడు రాజమకుటహారిమణీవి
స్ఫారపదాంభోజమహో
దారుఁడు కమలాక్షరాభిధానుఁడు జగతిన్.

41


క.

ఈరూపుచెలువ మాళవ
భూరమణుని కన్య సకలభూభువనలస
న్నారీతిలక మనఁగఁ బెం
పాఱిన హంసావళీసమాహ్వయ చిలుకా.

42


క.

నిత్యముగా వారికి దాం
పత్యము సమకూరెనేని భావజరతిదాం
పత్యము విష్ణురమాదాం
పత్యమునుం బోలె నెందుఁ బ్రస్తుతి కెక్కున్.

43


క.

నలుని దమయంతిఁ గూర్చిన
కలహంసమువోలె నీవు గాంచెదు కీర్తుల్

చిలుకా పలుకులనేర్పులు
తొలఁకాడఁగఁ గూర్పు మివ్వధూవరులఁ దగన్.

44


వ.

అని చెప్పి యప్పురుషవరుండు నిజేచ్ఛ నరిగిన.

45


క.

మిమ్మిరువురఁ దగఁ గూర్పఁగ
నెమ్మనమున వేడ్క నాకు నెగడుటయును నీ
కొమ్మ నను దోడుకొనిచన
నమ్మాళవరాజుపురికి నరిగితి మధిపా.

46


సీ.

హేలాసమాగతమాళవీలోచన
        ద్విగుణీకృతోత్సలవిలసనంబు
నీరజమకరందనిష్యందవర్ధిత
        వాఃపూరపూర్ణప్రవాహమహిమ
సలిలసంగ్రహణార్థసంగికాదంబినీ
        కాదంబకదంబమేదురంబు
పానీయపానగతానేకఘోటక
        ప్రతిభటోత్తుంగతరంగరాజి
యగుచు లోచనానందసమగ్రగరిమఁ
        బరఁగు వేత్రవతీనది పరిఘ గాఁగ
ధారుణి సమస్తపురవరోత్తంస మగుచుఁ
దనరు నవ్విదిశాపురి ధరణినాథ!

47


వ.

ఏ మప్పురంబు సొచ్చి యందుల యొప్పిదంబులు గన్నులపండువులు సేయుచుండ రాజమందిరంబున కరిగి.

48


సీ.

దౌవారికాలోకధవళమరీచులు
        నవ్యమౌక్తికతోరణములు గాఁగ

ద్వారదారుస్థితగారుత్మతద్యుతి
        లలితరంభాస్తంభకలన గాఁగ
దేహళీకలితసందీప్తవజ్రంబులు
        రంగవల్లీజాలరచన గాఁగ
నుపరిభాగసాపితోజ్జ్వలరత్నమం
        డలములు నవదర్పణములు గాఁగ
సహజశోభ నలంకారమహిమ మెఱయ
నంద మొందు తద్వారంబు నందు నిలిచి
ధారుణీశులు గొలువ నొప్పారుమాళ
వునకు మారాక యెఱిఁగించి పుచ్చుటయును.

49


వ.

నూతనకౌతుకంబున మమ్ముం గానుపించుకొని బహుమానం బొనరించి.

50


క.

దిన మెల్లను మాగోష్ఠిన
యనురాగరసాబ్ధి నోలలాడుచు మాకుం
గనకాంబరమణిభూషణ.
ఘనరసవత్ఫలము లిచ్చి గౌరవ మెసఁగన్.

51


వ.

సకలసంవిధానంబులు సేయించి మాకు నొక్కమణిహర్మ్యంబు విడిదల నిచ్చిన నుండి మఱునాఁడు.

52


సీ.

హాటకరచితకవాటనాసాశిలా
        శోభితప్రతిహారసుందరంబు
మణికిలితవిటంకమానితస్తంభాగ్ర
        గోపానసీసుప్రదీపితంబు
నచకీరతురగాదినవ్యమనోహర
        బహురూపచిత్రవిభ్రాజితంబు

రత్నరాజితచిత్రరంగవల్లీజాల
        రంగత్ప్రభాభాసిరంగతలము
నఖిలదిక్పాలచిత్రరూపాంచితంబు
సర్వలక్షణశోభితసన్నుతంబు
నైనహంసావళీకన్యయాటయింటి
కరిగితిమి తద్విశేషంబు లపరిమితము.

53


క.

అమలమణికుట్టిమంబులఁ
దమనీడలు చూచి బోటితండం బనుచున్
రమణమెయిఁ జేరుముగ్ధ
ప్రమదల నవ్వుదురు ప్రౌఢభామాజనముల్.

54


గీ.

చిత్రసరసులలో వ్రాసి చెలువు మిగులు
హంసబృందంబుఁ గనుఁగొని యర్థితోడఁ
బోటి రాయంచపదువులు వోవుఁ జేర
నిక్కువపుహంసలా యని నృపకుమార.

55


వ.

ఇట్లతిరమ్యం బయిన నాట్యభవనం బంతయుం గలయం గనుంగొని యం దొక్కరుచిరకుడ్యభాగంబున భవదీయమనోహరాకారం బచ్చుపడ వ్రాసి యచ్చోటు వాసి చని విడిదల నున్నంత హంసావళి యచ్చటికిం జని యచ్చిత్రరూపంబుం గనుంగొని యత్యంతమనోహరంబు లగుతద్విలాసంబులం దగిలి చూచి పచ్చవిలుతుబారిం బాఱి యే నారూపంబు లిఖయించుట యచ్చటిజనంబులవలన విని పరిచారికలచేతం దనపాలికి నన్నుం బిలిపించికొని సముచితసంభావనంబు లొనరించి భవద్రూవచిత్రరూపంబుఁ జూపి యిట్లనియె.

56

క.

చిలుకా యిట్టివిలాసము
గలపురుషుఁడు జగమునందుఁ గలఁడో యీయు
జ్జ్వలరూపము నీకరకౌ
శలము మెఱయ వ్రాసితో నిజంబుగఁ జెపుమా.

57


వ.

అనిన నానేర్పువిధంబును దేవరయన్వయనామధేయవిలాసరాజ్యవైభవంబులు వినిపించి మనోభవాధీనమానసం గావించిన నతిప్రయత్నంబున నీచీనాంబరంబునందుం దాన యీయార్య లిఖియించి యిచ్చి నాకు వివిధవిశేషసంభావనంబు లొసరించి పుత్తేర నిచ్చటికి వచ్చితి నని యాయార్యాక్షరపంక్తి మనోహరం బైనకళావతీకరస్థం బగునంబరం బవ్విభునిముందటం బెట్టి యవధరింపు మనిన వేడ్కలు సందడింపం గరంబు చాచి యందుకొని.

58


క.

పద్యము రెండర్థములను
హృద్యం బగుటకును వ్రాల యేర్పాటునకుం
జోద్యముఁ బొంది కరంగుచు
నుద్యత్పులకాంగుఁ డగుచు నున్నంత వెసన్.

59


క.

కీరత దొఱంగి యది గుణ
నీరధి యగుతమవివేకనిధి యై తనకున్
బోరునఁ బ్రణమిల్లుటయును
భూరమణుం డద్భుతంబుఁ బొందిన మదిలోన్.

60


వ.

దిగ్గన సింహాసనంబు డిగ్గి యిచ్చ యలరం గవుంగిలించుకొని తా నెప్పటియట్ల యాసీనుండై యతని సముచితాసనంబున నునిచికొని యాక్షణంబ భీమభటాదు లగుమంత్రుల రావించిన వార లతనిం గని ప్రమోదమానసు లై పరిరంభ

ణంబు లాచరించి రయ్యందఱ నుచితాసనంబుల నుండ నియమించి సకలవిద్యాధారం బగుకీరంబు వివేకనిధి యగుట జెప్పి యతని నవలోకించి నీ వింతతడవు శుకంబ వై యుండి సహజాకారంబు దాల్చుటకుం గారణం బేమి యని యడిగిన ముకుళితకరకమలుండై యతం డిట్లనియె.

61


గీ.

ఉరగకోపంబుచేత నాతురతఁ బొంది
మిగుల దవ్వుగ నేగి కాశ్మీరభూమి
శారదపురంబునకుం గొంత చేరు వైన
కానలోఁ దప మొనరించుమౌనిఁ గాంచి.

62


ఉ.

అతఁడు మౌనసన్నియతుఁ డౌట యెఱుంగఁగనీనియట్టి కా
ర్యాతురవృత్తి నానతుఁడ నై నను నేలినరాజు నాసఖి
వ్రాతము నెట్లు గాంతు మునివల్లభ యానతి యీఁగదే కృపా
న్వీతత నంచు నెల్లడర వేమఱు మానక వేఁడఁజొచ్చినన్.

63


వ.

సమాధివైకల్యంబునకుఁ గోపంబు దీపించిన.

64


క.

బాలిశవృత్తిం బలుమఱుఁ
బ్రేలి నియమవీఘ్న మాచరించితి నాకున్
బాలశుకంబవు గమ్మని
చాలం గృపమాలి మౌని శాప మొసఁగినన్.

65


చ.

అమితభయంబు సందుచుఁ దదంఘ్రులకుం బ్రణమిల్లి కార్యదా
హమున భవన్మహానియమ మాత్మ నెఱుంగక వేఁడికొంటిఁ గా
ని మదము నొంది కా దిదియ నిశ్చయ మిత్తెఱఁ గీవు దివ్యబో
ధమునఁ దలంచి చూచి కృప దప్పక నన్ను ననుగ్రహింపవే.

66

చ.

అనవుడు దివ్యదృష్టి ననఘాత్మునిఁగా ననుఁ జూచి యత్తపో
ధనుఁడు కుమార! నాపలుకు దప్పదు బాలశుకంబ వైన నీ
కనవరతంబు సత్ఫలము లాదటఁ బెట్టుచుఁ బెంప దిక్కు గ
ల్గు నఖిలవిద్యలందు నధికుండవు నౌదు ద్విమాసమాత్రలోన్.

67


సీ.

రాజకీరంబ వై యాజన్మవిధ మెఱుం
        గకయున్న నాయనుగ్రహమువలన
నెమ్మి మై నొకనాతి నినుఁ గొనిపోవంగ
        ఘనరాజ్యమహిమలఁ దనరుచున్న
మీరాజుకడ కేగి యారాజు గోరెడు
        మగువయొప్పులును ప్రేమంబుఁ జెప్పి
యాక్షణంబునన శుకాకృతిఁ బెడఁ బాసి
        యారూపు ధరియించి యధిపుతోడ
నర్థి నీ చెలులఁ గని యత్యంతమహిమ
బరఁగు దని సుప్రసన్నతఁ బలికె నాతఁ
డంతనుండి యి ట్లైతి లో నతని నెఱుఁగ
నధిప మిముఁ గాంచి ధన్యుఁడ నైతి ననిన.

68


వ.

ఇచ్చ నచ్చెరు వందుచు నత్తఱి నత్తెఱంగునకుం జింతాక్రాంత యై యున్న కళావతిం గనుంగొని నీవు నెమ్మనంబున నుమ్మలికంబు నొందకుము సర్వజ్ఞత్వంబున నీచిలుక యగునట్టిచిలుకం గలిగించి నీ కిచ్చెద మని యూఱడించి చిత్రకరు నవలోకించిన నమ్మహాచతురుఁడు.

69


క.

వెలసిన సర్వజ్ఞతచేఁ
జెలువశుకముఁ బోలునట్టిచిలుకవు గమ్మం

చిల నొక్కశుకాకారముఁ
జెలువారఁగ నాత్మయష్టిచే వ్రాయుటయున్.

70


క.

అచ్చిలుక తాన క్రమ్మఱ
నచ్చటఁ బొడసూపినట్టు లఖిలజ్ఞతయున్
మెచ్చులమాటలుఁ దొల్లిటి
యచ్చుగ నొక రాజకీర మచ్చటఁ బొడమన్.

71


క.

ఆరాజశుకము వేడుక
నారాజాననకు నిచ్చి యద్భుతమోద
శ్రీరంజిల్లుట కలరుచు
నారాజవరేణ్యుఁ డభిమతార్థము లిచ్చెన్.

72


వ.

ఇచ్చి సముచితప్రకారంబుల వీడుకొలిపి హంసావళివలని కోరికలు గుఱి[1] కొలుపఁ దద్దిగ్విజయంబు నెపంబున నప్పురంబునకుం జన నిశ్చయించి సకలదండనాథుల దండయాత్రకు నియమించి ప్రయాణభేరి వేయించిన.

73


సీ.

ఉలికివాహములు లంకెలు వైచుకొనుటయు
        నినుఁడు సారథికిఁ దో డెత్తఁగడఁగె
వననిధి పిండలివండుగాఁ గలఁగినఁ
        బెనురొంపి నౌర్వాగ్ని పొనుఁగుపడియె
మూర్ఛిల్లి ఫణికూర్మములు మీఁద వ్రాలిన
        మొదలిశక్తికి మెడ గుదియఁబడియె
మేదిని వడఁకిన మేదినీధరగండ
        శైలంబు లందంద రాలఁదొడఁగె

దిక్కు లల్లాడె ధర మ్రొగ్గె దిగ్గజములు
అఖిలమును నిండి బ్రహ్మాండ మవియఁజేయఁ
గనకకోణసంతాడితఘనతరప్ర
యాణభేరీమహారావ మడరుటయును.

74


వ.

ఇట్లు ప్రస్థానభేరీరవంబు చెలంగ సైన్యంబు నలుగడ నడవం దొడంగిన.

75


సీ.

ఘనరేణువులు గప్పి ఖచరవిమానముల్
        మంటిముద్దలు వోలె మింటఁ దనర
దట్టంపురజములఁ దారకంబులు బ్రుంగి
        యవని బాఁతినముత్తియములఁ బోల
మెలఁగ మిడుకరాక మేఘవర్గంబులు
        దట్టంపుధూళిచేఁ దల్లడిల్లఁ
బాంసువు వొదివినం బర్వతప్రకరంబు
        దూబలలాగునఁ దోఁచుచుండ
దరువులెల్లను రూపేది చొరువు లయ్యె
నడవులన్నియు బడితల గెడవు లయ్యె
మెట్టలన్నియుఁ జెడి కాలుమెట్టు లయ్యె
నరవరేణ్యునిసైన్యంబు నడచుటయును.

76


ప్రభాకరుని కథ

వ.

ఇ ట్లతిభయంతరం బగుసైన్యంబు నడచి నడచి యొక్కయతిరమ్యస్థలంబున విడిదల గావించి మంత్రుల రావించి కొలువిచ్చి సముచితసల్లాపం బొనరించు సమయంబున గగనంబున నరిగి యరిగి యత్యుజ్జ్వలప్రభావిరాజమానం బగు విమానం బొక్కటి యాకొలువుచక్కటిం గొంతతడవు నిలిచి

తదనంతరంబ తత్ప్రాంతంబున నవతరించినం గనుంగొని డెందంబున నద్భుతంబు నొంది.

77


గీ.

ఈవిమానంబు గలుగువాఁ డెవ్వఁ డగునొ
యేమికతమున వచ్చెనో యిప్పు డనుచు
నందఱును నవ్వలన చూచునంతలోన
నవ్విమానంబు డిగి తేజ మతిశయిల్ల.

78


క.

తమచెలియైన ప్రభాకరుఁ
డమితానందంబుతోడ నరుదెంచిన భూ
రమణుఁడును మంత్రులు డెం
దమునఁ బ్రమోదంబు నద్భుతముఁ దనరారన్.

79


వ.

సముద్ధితు లగునంత సంతసంబునఁ బఱతెంచి భూపాలునకుం బ్రణామం బాచరించి యతని కౌఁగిలి వడసి క్రమంబున భీమభటాదులం బరిరంభణం బాచరించి యనంతరంబ సింహాసనంబున నాసీనుండై కమలాకరుండు ప్రత్యేకంబు నందఱి నిజాసనాసీనులం గావించి ప్రభాకరునకు సముచితాసనంబు పెట్టించి యతనివదనంబునం జూడ్కి నిలిపి నీకు విమానయానం బెట్లు గలిగె నని యడిగినం గరంబులు మొగిడిచి.

90


క.

భూనాథ మిమ్ముఁ గానక
దీనతఁ గాననములోనఁ దిరుగుచు నొకచో
మౌనీంద్రు నొకనిఁ గనఁగొని
యానతి యొనరింప నాతఁ డాదర మెసఁగన్.

81


క.

తనదివ్యబోధమున నా
మనమువిధం బెల్ల నెఱిఁగి మది వగవకు మీ

జనపతిఁ గలసెదు నలువురు
వనితల వరియించి మహితవైభవనిధి వై.

82


క.

ధర వర్ధమానపురమునఁ
బరోపకారి యనుధరణిపాలుఁడు గలఁ డా
నరపతి తనసుత యెవ్వని
వరియింపక యున్న నాత్మ వగ గదురంగన్.

83


సీ.

నరులకు దూరమై పరువంపునెత్తావి
        గొమరు మీఱెడుపువ్వుగుత్తి వోలెఁ
బుడమి నెవ్వరికిఁ జేపడక యుజ్జ్వలభాతిఁ
        బంబినపెన్నిధానంబు వోలెఁ
గనకసంగతి లేక ఘనశాంతి నొప్పునం
        దనరారుమహితరత్నంబు వోలె
జనులదృష్టికి నగోచర మయి కడవలో
        వెలుఁగొందుఘనదీపకళిక వోలె
వరునిపొందు లే కున్నది వారిజాక్షి
యడవిఁ గాసినవెన్నెల యగునొ యింకఁ
దరుణిజవ్వన మనుచుఁ జింతాసముద్ర
మగ్నుఁడై యున్నవాఁడు కుమారచంద్ర.

84


క.

ఆనెలఁతఁ గోరి తిరుగుము
నానాయాసములుఁ బొంది నలుగురువిలస
న్మానినులకుఁ బతి వై మీ
భూనాథునిఁ జెలులఁ గాంతు పొ మ్మని పనుపన్.

85


వ.

ఆమునీంద్రునకు వినతుండ నై చని వర్ధమానపురంబుం జొచ్చుసమయంబున.

86

క.

కనకపురిఁ గనినవారికి
దనపుత్రిక గగనలేఖఁ దగుధనములతో
మనుజేంద్రుం డొసఁగుదు నని
జను లెఱుఁగఁగ నగరవీథి జాటఁ బనిచినన్.

87


శా.

ఏచందంబున నబ్బునో యబల యం చే నాత్మ నూహింపఁగా
నా చా టప్పుడు నాదుకర్ణముల కత్యానంద మొందించిన
న్వాచాలత్వ మెలర్ప హేమపురము న్వర్ణించి యేఁ గంటి నం
చాచంద్రాస్య వరించువాడ నిది కార్యంబంచు ధైర్యంబునన్.

88


వ.

సముచితాలంకారశోభితుండ నై రాజమందిరద్వారంబున కరిగి ప్రతీహారపాలు నాలోకించి.

89


క.

కనకపురం బేఁ జూచితి
ననుటయు వాఁ డపుడు నన్ను నధిపతికడకుం
గొనిపోవ నాతఁ డుబ్బుచుఁ
దనపుత్రిక మ్రోల నిలిపెఁ దద్దయు వేడ్కన్.

90


సీ.

కామినీనీలాలకములఁ జిక్కినవేడ్క
        బలిమి నేకరణిని బాపరాక
సతియిర్కుఁజన్నులసందుఁ దూఱినచూడ్కి
        ధీరతఁ గదలించి తెలియరాక
పడఁతుక కౌఁదీవఁ దొడివడ్డభావంబు
        నెట్టును నిలువంగఁబట్టరాక
భామినిగురునితంబంబు నెక్కినమది
        నేచందమున దిగియింపరాక

కోరిక లెలర్ప భావజుబారిఁ బాఱి
ప్రేమ దనరార భువనాభిరామ యైన
యవ్విలాసినిచెలువంబునందుఁ దగిలి
నన్ను మఱచియుండితి నరనాథచంద్ర.

91


వ.

ఆసమయంబున.

92


క.

అప్పొలఁతి కనకనగరం
బెప్పగిదిం బొలుచు ననిన నే యుక్తిమెయిం
జెప్పితిఁ గొన్నివిశేషము
లప్పురిచెలువంబు లనుచు నంగనతోడన్.

93


క.

నామాటలు విని నవ్వుచుఁ
గామిని గడుధూర్తు వీఁడు గారులు పలికెన్
హేమనగరంబున విధం
బేమియు నెఱుఁగఁ డని పలికి యెంతయునలుకన్.

94


క.

నను వెడలఁగఁ ద్రోపించిన
మనమునఁ జింతిలక మౌనిమాట యమోఘం
బని తలఁచి యతనిచేతనె
కనకపురముజాడ యెఱుఁగఁగాఁ గోరి వడిన్.

95


క.

ఏనును మునివరుఁ గాంచిన
యానెలవున కేగి యచట నామహితాత్ముం
గానక పూనిక మానక
కానఁ గలయ నంత దిరుగఁగా నొక్కయెడన్.

96


క.

మునివరుఁడుం......దప
మొనరింపఁగఁ గాంచి వినతి యొనరించి జగం

బున నే దేశములోనిది
కనకపురము చెప్పవయ్య కరుణ ననుటయున్.

97


సీ.

కనకపురంబుఁ గల్గొనినవారును విన్న
        వారును గలుగ రివ్వసుధలోని
వనధిలో నుత్కటం బనుదీవియందు స
        త్యక్రముం డనియెడు దాశరాజు
గలఁ డతఁ డీధాత్రిఁ గలపట్టణంబుల
        నన్నియు నెఱుఁగు వాఁ డున్నయెడకు
నరిగి యాపురము నీ వడుగంగఁ జెప్పెడు
        బొ మ్మన వినతితో నమ్మునీంద్రు
వీడుకొని బహుపర్వతవిపినరాష్ట్ర
పంక్తిఁ దఱియించి యొకకరపట్టణమున
కరిగి యాద్వీపమునకుఁ దా నరుగువారి
నెమ్మిఁ దడవంగ దైవయోగమ్మునందు.

98


క.

అనఘుఁడు సముద్రదత్తుం
డనువైశ్యం డందుఁ జనఁగ నాయితపడునా
తనిఁ గూడి యతఁడు నేనును
ననుఁగుల మై యోడ యెక్కి యరిగెడు వేళన్.

99


క.

 శ్రీలలనాధీశ్వరు నఱ
కాలఁ దనరుతిలక మనఁగఁ గడు మెఱసి లస
న్నీలాభ్రఖండ మొక్కటి
యాలోసం బ్రబలె దుర్జనాపద వోలెన్.

100


క.

అంభోదపటలదర్శన
సంభవపవనోద్గవిపులజలపూరముచే

నంభోధరమార్గం బపు
డంభోనిధిభంగి నుండె నతిభయదంబై.

101


సీ.

వితతవర్ణవితీర్ణవిద్రుమవల్లులు
        పరఁగెడుఘనజటాపంక్తి దొరయ
నంబుపానసమాగతాంబుదపటలంబు
        దనరారుకుంజరాజినము గాఁగఁ
బ్రబలవాతోద్ధూతభంగసంఘంబులు
        విస్తరిలెడుహస్తవితతిఁ బోల
ఘోరతరస్ఫురద్ఘుమఘుమాఘోషణం
        బారభటీభాతి నతిశయిల్లఁ
బ్రళయకాలతాండవలీలఁ బ్రజ్వరిల్లు
ఫాలలోచను నుగ్రరూపంబు వోలె
నంబరంబును దిక్కులు నాక్రమించి
యతిభయంకర మయ్యె నాయంబుదంబు.

102


వ.

ఆలో నమ్మహావాయువు తలక్రిందుగా వేసిన.

103


క. కలజను లందఱు నెంతయుఁ
గలకలమున నార్తిఁ బొందఁ గల మవియంగాఁ
గలఁగక సముద్రదత్తుఁడు
పలక యొకటి వట్టి యీఁదెఁ బటు ధైర్యమునన్.

104


క.

నను నప్పు డొక్కమీనము
గని మ్రింగుట నల్ల దాని ఘనతరకుక్షిం
దనువైకల్యము నొందక
యనపాయత నుండితిం జిరాయువు కలిమిన్.

105

శా.

నాపుణ్యంబున నొక్కజాలరి వలం దన్మత్స్యముం బట్టి గ
ర్భాపాయం బొనరించి నన్నుఁ గని యత్యాశ్చర్యముం బొంది య
త్యాపన్నత్వముతోను ద న్నడుగఁ దా నద్దీవిపే రుత్కట
ద్వీపం బన్న విధి న్నుతించి కడుఁ బ్రీతిం బొందు డెందంబుతోన్.

106


క.

యతిపతి చెప్పిన సత్య
వ్రతుఁ డనువృద్ధుకడ కేగి వానికి నేఁ జె
ప్పితి నాదగు వృత్తాంతం
బతఁ డెంతయుఁ జోద్యపడఁగ నాద్యంతంబున్.

107


క.

నామాటలు విని దాశ
గ్రామణి కనకాభ్యపురము గల దిల ననఁగా
నేము వినము వినకున్నను
నే మగు విను మప్పురంబు నెఱుఁగుతెఱంగున్.

108


ఉ.

దీవులవార లెల్లఁ జనుదెంతుగు బారసి గాఁగ నెల్లి ల
క్ష్మీవిభుఁ గొల్వ నచ్చటికిఁ జేరుపఁ బుష్కరనామసంజ్ఞ మ
న్దీవికి హేమపట్టణము నిశ్చయ మద్ది యెఱుంగవచ్చు
నీవును నేను నచ్చటికి నేగుద మంచుఁ బరోపకారతన్.

109


క.

నను నాదీవికిఁ దోడ్కొని
వవనిధినడుమ నరుగ నొకవటముసమీపం
బున నోడ దైవవశమున
ఘనమగుసుడిఁ బడిన నేను గంపింపంగన్.

110


గీ.

చలన మొందక యవ్వటశాఖఁ బట్టి
వేగ మెక్కు కలము సుడి వెడలఁదెచ్చి

నిన్ను నెక్కించుకొనియెద నన్న నట్ల
యతిరయంబున నెక్కితి నక్కుజంబు.

111


క.

సుడివెంపర వడి ముంపఁగ
వెడలింపఁగరాక దాశవిభుఁడు వివశుఁడై
జడనిధిఁ గలంబుతోడన
పొడవడఁగెను నాదుమనము పురపురఁబొక్కన్.

112


వ.

ఆలోన లో నార్తిం బొంది యిట్లంటిని.

113


మ.

చెలులం గానక కానలో దిరుగఁగాఁ జేమాయల న్మానినుల్
వలలం బెట్టిన నిక్కువంబు లనుచు న్వాంఛారతి న్వచ్చి యా
పలుపాటు ల్వడి వీనిఁ జేరి యితఁడుం బాపంబు దైవంబుచేఁ
బొలియంగా నిటు దిక్కుమాలుదునె యంభోరాశిమధ్యంబునన్.

114


క.

తరుణుల వరించి కనియెద
ధరణీశ్వరు ననినయాస దైవము చెఱచెన్
మరణము శరణని యంతః
కరణంబున నిశ్చయింపఁగా నట్టియెడన్.

115


వ.

ఆక్రోశంబు దనర నాకాశవాణి యిట్లనియె యక్షుం డొక్కరుం డొక్కమహామునిశాపంబున నిచ్చట నీవృక్షం బై నిలిచె నీవు దొఱంగిపోయిన శాపమోక్షంబు నొందెడు నీవు మరణోద్యోగంబు మాని నేఁ డీతరువుస వసియింపు మెల్లి గనకపురంబుఁ గనియెద వనిన సద్భుతం బంది యదియుం జూచెదఁగాక యని యున్నంతను.

116


క.

భూపాల నాఁటిరాత్రి మ
హాపక్షులు గొన్ని వచ్చి యందలిఘనశా

ఖాపంక్తి నంది యాశ్చ
ర్యాపాదసమున్నతోజ్జ్వలాకారమునన్.

117


వ.

అట్లుండి యమ్మహావిహంగంబు లెల్ల రేపకడఁ గదలి కనకపురంబునకుం బోద మని తమలో మనుష్యభాషల సంభాషించిన సంతోషించి.

118


క.

అం దొక్కపక్షిఱెక్కల
సం దల్లనఁ దూఱి నెమ్మి శయనించితి నేఁ
జెంది వసించుట యించుక
యుం దెలియకయుండె దాని కురుతనువగుటన్.

119


క.

వేవినఁ గద లెఱుఁగుచు నే
నీవికొని వసింపఁ బక్షు లెల్లను జనఁగా
నావిహగము చని కనకపు
రీవృక్షమునందు నిలువఁ బ్రియ మెసలారన్.

120


క.

ఆపులుఁగుఱేనిఱెక్కల
లోపల మెలపార వెడలి లోచనపర్వం
బై పూర్ణగరిమఁ దనరెడు
నాపురముం జొచ్చి వీథి నరిగెడువేళన్.

121


క.

మేడపయినుండి కనుఁగొని
వేడుక యెసలార నొక్క వెలఁది వనుపఁగాఁ
బ్రోడచెలి వచ్చి నన్నుం
దోడుకొనుచు నరిగె నవ్వధూమణికడకున్.

122


వ.

అప్పుడు.

123


సీ.

జిగిదొలఁకాడెడు చిగురాకుఁగెమ్మోవి
        పగడంపుఁదీఁగెల బాగుఁ దెగడ

నిడువాలుఁగన్నుల నెఱయు క్రొమ్మించులు
        దొలుకారు మెఱుఁగుల చెలువు గెలువఁ
జెన్ను దొలంకెడు చిఱునవ్వు నెమ్మోము
        నిండుఁజందురునకు నెఱసు చూప
నునుమించు పచరించు ఘనకుచయుగళంబు
        కనకకుంభంబుల గారవింపఁ
బలుకనేర్చిన కనకంపుఁ బ్రతిమవోలె
రామయై యొప్పు శృంగారరసమనంగ
నఖిలమోహనమూర్తియై యతిశయిల్లు
నన్నలినగంధిఁ బొడగంటిఁ గన్ను లలర.

124


క.

ననుఁ గనుఁగొని యయ్యంగన
యనురాగముఁ గౌతుకంబు నలవడ సంభా
వనము లొనరించి మదిలో
ననురాగము బెరయ నిట్టు లనియె న్నాతోన్.

125


సీ.

వీరచూడుఁ డనెడువిద్యాధరుఁడు గాంచె
        వనితల నలువుర వారిలోన
నగ్రజఁ జంధ్రప్రభాఖ్యమైఁ దనరుదు
        నాతోడఁ బుట్టిననలినముఖులు
పద్మరేఖయు శశిప్రభయును సుప్రభ
        యును ననువారల ముని శపింప
భూమిపై జనియించి పుట్టెఱింగినవారు
        వారలఁ బాసినవగపుచేత
వనమునకు నేగెఁ దపసి యై జనకుఁ డిప్పు
డేను జెలియండ్రరాకకు నెదురుచూచు

చున్నదాన మనంబున నొండుతలఁపు
మాసి బోఁటులతోడఁ గుమారచంద్ర.

126


క.

నరుఁ డొకరుం డాతురుఁ డై
నిరుపమవిలసనుఁడు వచ్చి నిన్నును నీసో
దరులను వరించు నని శాం
కరి యాసతి యిచ్చె నాకుఁ గరుణదలిర్పన్.

127


ఉ.

అంబిక యాన తిచ్చిన సమగ్రవిలాసివి నీవ కాఁగ డెం
దంబున నిశ్చయించి ప్రమదంబు వహించితి ని న్వరింతు నె
య్యంబునఁ గన్యకున్ జనకు నాజ్ఞన నాథువరించు డెందు న
ర్హం బటుగాన తండ్రికిఁ బ్రియం బెసలారఁగఁ జెప్పివచ్చెదన్.

128


క.

ఏ మరిగి వచ్చుదాఁకను
నేమంబున నిచట నుండు నిశ్చలమతి వై
యీమేడమీఁది నెలవుల[2]
కై మఱచియుఁ బోకు మనుచు నరిగెఁ జెలులతోన్.

129


వ.

ఇంతి యరిగినయనంతరంబ.

130


క.

ఈమీఁది నెలవు చూడకు
మీ మఱచియు సనుచుఁ జెప్పి మెలఁతుక చనె నం
దే మేమి యుండునో యని
యామీఁదటి నెలవు కేగి యాసీమమునన్.

131


క.

వరరత్నమయమునుం గడుఁ
గర మొప్పెడునఱలు మూఁడు గని యం దొకమం
దిరము కవాటంబు దెఱచి
పరికింపఁగ లోన నొక్కపర్యంకమునన్.

132

వ.

ముసుం గిడినరూపంబుఁ గనుంగొని తదావరణంబు దొలఁగించిన.

133


సీ.

గవిసన వుచ్చిన నవకాంతి నొప్పారు
        వలరాజుకోదండవల్లి యనఁగఁ
బేటిక దెఱచిన బెడఁగు మీఱుచు నున్న
        పూవిల్తురత్నంపుబొమ్మ యనఁగ
నొఱ వాప నందంద మెఱుఁగులు చల్లెడు
        పుష్పబాణునిఖడ్గపుత్రి యనఁగ
నలువ నిడ్డముసుంగు దొలఁగఁబుచ్చిన నొప్పు
        భావజుపట్టపుదేవి[3] యనఁగ
మెఱసి వెడలంగ వెలుఁ గొందుమెఱుపు వోలె
ముసుఁగు వుచ్చినఁ దనుదీప్తి ముసుఁగువడఁగఁ
జూడఁ గన్నులపండు వై సొబగు మిగులు
కామినీమణిరూపంబు గాన నయ్యె.

134


క.

ఆరూపు చూచి మదనవి
కారము మదిఁ దనర నిద్రగదిరినయది యి
న్నారీమణి నిద్ర దెలిపి
యారయఁగ సుఖాబ్ధి నోలలాడెద ననుచున్.

135


గీ.

తెలిపి తెలిపి యెట్లుఁ దెలియకయుండిన
నిద్ర గాదు దీర్ఘనిద్ర యనుచు
నట్టు నిట్టు నిట్టియసమానవిలసనం
బేల గలుగు ననుచుఁ జాల బ్రమసి.

136

వ.

కొంతతడవునకు డెందంబునం దెలివి నొంది యూర్పు లరసి సజీవం బని నిశ్చయించి యాశ్చర్యంబు నొంది.

137


క.

చైతన్యము లే కుండియు
నీతరముం జెన్ను గలిగె నింతితనువునం
జైతన్యము గలిగిన నీ
నాతిచెలువు వొగడ వశమె నలువకు నైనన్.

138


వ.

అని యెప్పటియట్ల చేల గప్పి తొలఁగి వచ్చి యాసంగడి సున్నమందిరంబుఁ బ్రవేశించి ముందటిచందంబు రూపు గనుంగొని ముసుంగు వుచ్చిన.

139


క.

చంచత్ప్రభఁ గనుపట్టెను
దంచితకాంతిని సముజ్జ్వలాకృతితోడన్
సంచారభేదమున ని
ద్రించినశారదశశాంకరేఖయుఁ బోలెన్.

140


క.

తొంగలిఱెప్పలమెఱుఁగులు
తొంగలిగొనుమేను వదనతోయరుహంబున్
శృంగారనిద్రఁ గూరె ల
తాంగి యనుచుఁ దలంచి చాల ననురక్తి మెయిన్.

141


వ.

తెలిపి యెట్లునుం దెలియకున్న మున్నింటియింతిచందం బగుట యెఱింగి నివ్వెఱఁ గందుచు.

142


క.

అత్తరుణి రూపురేఖయుఁ
జిత్తమునకుఁ జాల వేడ్క సేయఁగఁదొడఁగెం
జిత్తరువుచందముననుం
బుత్తడిరూపుగతి రత్నపుత్రికపోల్కిన్.

143


వ.

అని యచ్చెలువచెలు వుగ్గడించి.

144

క.

ఆవనితకు ముసుఁ గిడి చని
యావలిమందిరముఁ జొచ్చి యందును నొకవ
స్త్రావృతరూపము పొడగని
యావరణము వుచ్చి చూడ నాశ్చర్యముగన్.

145


వ.

పరోపకారిభూపాలనందనరూపం బగుటయు నాపోవక కనుంగొని విస్మయంబుఁ బొంది యరసి మున్ను పొడగన్న యన్నాతులయట్ల యగుటం దెలిసి యుల్లంబు జల్లన మూర్ఛిల్లి యెంతయుం దడవునకుం గొంతతెలివిం బొంది.

146


శా.

ఈవామాక్షి సముద్రముం గడచి యెట్లేతెంచెనో వచ్చెఁబో
చావంగాఁ గత మేమి ఖేచరజనస్థానంబునన్ దీనికై
చావు న్నోవును నొందుపాటువడి బల్చందంబులం జేరితిన్
దైవంబా యిటు లేల చేసితివి తంత్రంబో మరుంజంత్రమో[4].

147


వ.

అని దైవంబు దూఱి యవ్వామనయన నుద్దేశించి.

148


సీ.

తరుణి నీకుచపర్వతము లెక్కఁగాఁ గోరి
        దారుణోన్నతపర్వతంబు లెక్కి
మగువ నీముఖచంద్రమండలాగృతిఁ జూడఁ
        దమకించి బహుమండలములు చూచి
యంగన నిన్ను రాగాబ్ధి ముంపఁ దలంచి
        యతి దుష్కరం బైనయబ్ధి మునిగి
జలజాక్షి నినుఁ జూపువలఁ దగుల్పఁగఁ బూని
        పలుపాటు లను విధివలలఁ దగిలి
కనకపురము గాంచి కడుఁ బ్రమోదము నొంది
నిన్నుఁ జూతు ననుచు నున్నచోట

నేల వచ్చి తిచట కేల యీదశ నొంది
తేల నన్ను నొంచె దిందువదన.

149


వ.

అని విలాపించుచు మదనతాపంబునం గాలుకొనలేక సౌధోపరిభాగంబునం జరియించుచున్నంత.

150


క.

క్షితినాథ మాయతురగం
బతిరయమున మేడమీఁది కరుదెంచి సము
న్నతఖురమునఁ జమ్మిన న
ద్భుతముగ నావర్ధమానపురమునఁ బడితిన్.

151


క.

పడి మూర్ఛ నొంది యెంతయుఁ
దడవునకుం దెలివి నొంది తత్పుర మగుటే
ర్పడ నెఱిఁగి నాదుపాటులు
గడుప మ్మగుటకును వగవఁగా నవ్వేళన్.

152


క.

కనకపురి గనినవారికిఁ
దనపుత్త్రికఁ గనకరేఖఁ దగుధనములతో
మనుజేంద్రుఁ డొసంగెడు నని
జను లెఱుఁగఁగ నగరవీధిఁ జాటం గంటిన్.

153


క.

ఆచాటు విని కనకపురి
చూచినరూపంబు రాజసుతగా దనుచు
న్నాచిత్తము కలఁక యుడుగ
వేచని తొంటిగతిఁ బతికి వినిపించుటయున్.

154


క.

ఆనరపతిపుత్రికయునుఁ
దానును నొక్కెడన యుండి తగఁ బిలిపింపం
గా నరిగినననుఁ గనుఁగొని
యూనెలఁతుక తొంటిధూర్త యని పలుకుటయున్.

155

సీ.

నాఁ డెఱుంగం గాని నేఁ డెఱింగితిఁ శైలి
        యత్యగమ్యం బైనయప్పురమున
కరిగి చంద్రప్రభ యనుకాంతఁ బొడగంటి
        నది తనసోదరు లైనసతులు
మునిశాపమున మర్త్యమును బొంది రని చెప్పి
        నను వరించెద నని జనకుకడకు
నరిగిన నేను సౌధాగ్రంబునకు నేగి
        మూఁడుతల్పంబుల మూఁడుయువతి
రూపములఁ గంటి నం దొక్కరూపు నీదు
రూప మై యున్న వెఱఁగంద నేపు మిగిలి
తురగ మొక్కటి నినుఁ జేర గొరిజఁ జిమ్మఁ
బడితి నిప్పురిలోపలఁ బద్మనయన.

156


వ.

అనినమాటలు విని యాక్షణంబ యమ్మానిని విగతజీవ యైన నాశ్చర్యంబు నొంది యంతన తెలి వొంది యాకనకపురిసౌధాగ్రంబునం గనినమానినీరూపంబులు మూఁడును దత్సోదరుల నైజరూపంబులు గానోపు నందు మూఁడవరూపం బీయింతిది, దీని జీవం బచ్చటి కరిగినది నాకు నిచ్చటం దడయం బని లే దన్నలువుర వరియింపక కమలాకరమహీవరదర్శనంబును సమకూరదు గాన మున్ను చనినమార్గంబునం జనియెదం దత్తరుణీవరణంబు దైవనిర్మితం బగుట నాకు నవశ్యంబును హేమపురదర్శనంబు సిద్ధించు ననుచు నిశ్చయించి వెడలి మున్ను చవినసముద్రతీరంబున కరిగి యచ్చట.

157


క.

జలనిధిలోపల నాఁ డట
కల మవిసిన బ్రదికి వచ్చి కడఁ జేరిన యా

చెలికాని వైశ్యునిం గని
యలరుచు నాక్రమముఁ జెప్ప నాతఁడు ప్రీతిన్.

158


ఉ.

న న్నొకయోడఁ బెట్టి జతనంబుగ వారిధిలోనఁ బంచినన్
మున్నిటి దాశనాథునితనూభవు లున్నడ కేగి యేను మున్
జన్నవిధంబుఁ దజ్జనకుచన్న తెఱంగును జెప్ప నయ్య నీ
వన్న వధించి వచ్చి తని పల్కుచు నెంతయుఁ బాపబుద్ధు లై.

159


క.

చండికి బలిసేయుద మని
చండతఁ బాదములఁ పెద్దసంకెల యిడినన్
బెండువడి వారి గృహమున
నుండఁగ నవ్వేళ దైవయోగము కతనన్.

160


ఉ.

అన్నువకౌను మించుదొలఁకాడెడుమేనును వల్దచన్నులుం
జెన్నుమొగంబునుం గురులుఁ జిత్తజుతూపులఁ బోలుచూపులున్
న న్నలరింప నిందుమతినాఁ జను దాశనరేంద్రుపుత్రి నా
యున్ననికేతనంబుసకు నొక్కతెయుం జనుదెంచి వేడుకన్.

161


చ.

జలజదళంబులం జఱచి చంద్రమరీచుల గేలిసేయుచుం
గలువలయొప్పులం దెగడి కారుమెఱుంగుల మించి కామున
మ్ములచెలువంబు గీడ్వఱిచి ముత్తెపుజల్లులఁ బోలఁ జాలుచూ
పుల ననుఁ గప్పి నామది నపూర్వకుతూహల మావహిల్లఁగన్.

162


గీ.

దాశరాజపుత్రి తద్దయు వేడ్కతో
జెలువ మడరుచూపువలలు విచ్చి
యవ్వి(గ)బ్బులగుట నపుడ నాకన్నులం
గలుగఁ జేసెఁ దనదుకులవిధంబు.

163

వ.

అట్లు నన్నుం దగులించి తనమనంబున మిగులన్ దిగు లొంది.

164


క.

పర్వినకూరిమిఁ జనవున
గర్వంబున నపుడ నానిగళ మూడ్చి గృహాం
తర్వర్తు లెఱుంగఁగ గాం
ధర్వవివాహమున నన్నుఁ దగవరియించెన్.

165


శా.

ఆలీలావతితోడిలీలలఁ బ్రియం బారంగ నం దుండఁగా
బాలేఁదుం గలయంధకారముగతిం బ్రద్యోతీదంష్ట్రాకన
త్కోలం బొక్కటి వచ్చి తత్పురమునం గోలాహలోదగ్రతం
గ్రాలంగాఁ గని విల్లు గైకొని భుజగర్వం బఖర్వంబుగన్.

166


చ.

చని కూడముట్టి యుజ్జ్వల
ఘనశరమున నెఱను నొవ్వఁగా నేయుటయుం
దను కొంది పంది యతలం
బున గొందికి సరిగే నొక్క భూవివరమునన్.

167


క.

వెంటనె యతలమునకుఁ జని
యంటఁ దఱిమి జమునిపాలి గనిచి యచట నే
గంటిఁ గొలనిదరి వాలుం
గంటి నొకతె నొంటి మెలఁగఁగా నచ్చోటన్.

168


ఉ.

అన్నగుమోమునుం జిగియు నా తెలిగన్నులక్రొమ్మెఱుంగు లా
పెన్నెఱివేణినీలరుచిపెంపును నాబిగిచన్నుదోయియ
త్యున్నతిసొంపు నామృదుతనూజ్జ్వలకాంతియుఁ గాంతలందు ము
న్నెన్నఁడుఁ జూడ నేను జరియించిన భూములలోన భూవరా.

169


వ.

అమ్మోహనాకారం జేరం జనుటయు నది యి ట్లనియె.

170

క.

ధరణీశ్వరనందన నే
సురరిపుచేఁ బడితి వాఁడు సూకర మై నీ
శరమున నిహతిం బొందెను
వరియింపుము నన్ను ననిన వారని వేడ్కన్.

171


క.

అనుపమ మగునా తొయ్యలి
మనసిజభోగములఁ దేల్చి మచ్చికతో నిం
పెనయఁగ సొవృత్తాంతము
వినిపించుటయుం బ్రమోదవికసితముఖియై.

172


సీ.

కనకరేఖయు దాశకన్యయు నేను జం
        ద్రప్రభారమణి సోదరుల మేము
మునిశాపవశమున మువ్వురమును మర్త్య
        జనిఁ బొందినారము గనకపురముఁ
జూచినమనుజునిం జూచినం గనకరే
        ఖకు దొంటి శాపమోక్షంబు గలుగు
వానిఁబొందఁగ దాశవరతనూజకు నాకు
        మనుజజన్మము మానుననియుఁ గలదు
కనకరేఖయుఁ దనమూర్తి గలసె నిన్నుఁ
బొందెఁ గావున నటు చను నిందుమతియు[5]
నేను నరిగెద మాతొంటిమేని కేము
పొందగల మింక నిను హేమపురము నందు.

173


క.

ఏ నీమేను దొఱఁగిచనఁ
గా నీవును వీఁక వెడలు గహ్వర మాలో

నానిజదేహము నొంది వి
మానముఁ బుత్తేర రమ్ము మాపురమునకున్.

174


వ.

అని పలికి యాక్షణంబ మే ననలజ్వాలలం దొఱంగి యరుగుటయును నావచ్చిన మార్గంబున వెలువడి విమానంబున కెదురుచూచుచున్నంత.

175


క.

రాజితమణిఘృణు లెసఁగ
న్రాజమరాళములు పూనిన విమానంబుం
దేజోనిధి యొకఁడు ఖచర
రాజాజ్ఞం దెచ్చుటయును బ్రమదం బెసఁగన్.

176


క.

ఆవరయానము నెక్కి న
భోవీథిని వీఁకఁ గనకపురమున కరుగం
గా వీరచూడుఁడు బహుసం
భావనము లొనర్చి యపుడు భావం బలరన్.

177


క.

శ్రీ నెఱయఁగఁ దనకన్యల
నానలువుర నోలిఁ బరిణయము చేసి లస
చ్చీనాంబరమణిభూషణ
నానావిధపంక్తు లిచ్చినం బ్రమదమునన్.

178


వ.

ఆలీలావతులతోడి యభీష్టలీలల విహరించి మిమ్ముఁ గాంచుతెఱం గూహించి.

179


ఉ.

మానినుల న్వరించి మఱి మానవనాథునిఁ గాంచె దంచు నా
కానతియిచ్చె మౌని తడయం బని లేదు విమాన మెక్కి యం
భోనిధి మీదుగా నరిగి భూస్థలి చూడఁగ నెవ్విధంబునం
గానఁగ నయ్యె నం చరసి గ్రక్కున నే గెద నన్ దలంపునన్.

180

వ.

వచ్చి వచ్చి యిచ్చట దేవరం గాంచి కృతార్థుండ నైతి ననిన నందఱు బ్రమోదభరితు లైరి తదనంతరంబ.

181


ఉ.

భట్టియుగంధరాదినరపాలకమంత్రిమహాప్రవాహసం
ఘట్టనధీధురంధర వికారవిదూరవిలాసబంధురా
పట్టపటావళీకనకభద్రమదావళభూరిభూషణా
రట్టజవాజిరత్ననికరక్రమపూజితకాలకంధరా.

182


క.

శారదనీరదనారద
పారదబిసశారదాబ్దభాస్వరితయశః
పూరఘనసారపూరిత
సారసగర్భాండభాండ సదవనశౌండా.

183


మందారదామము.

సంగీతసాహిత్యసారస్యలోలా
శృంగారలక్ష్మీవశీకారలీలా
అంగాధిపౌదార్యహారిప్రదానా
అంగీకృతశ్రీమదాదిప్రధానా.

184


గద్యము.

ఇది శ్రీమద్వెన్నెలకంటి సూరనామాత్యపుత్ర హరితసగోత్రపవిత్ర సుకవిజనమైత్రీవిధేయ అన్నయనామధేయప్రణీతం బైన పోడశకుమారచరిత్రంబునందు షష్ణాశ్వాసము.

  1. గొరికొలుప-మూ. బురికొలుప?
  2. నిలుపుల అని కలదు.
  3. పట్టనదేవి- మూ.
  4. చేశితిది నితంత్రంబ్బొమరుంజ్జంత్రమో- మూ.
  5. ఇందుమతి బిందుమతి యను రెండురూపములుం గలవు.