శ్రీ సుందరకాండ (రాయప్రోలు సుబ్బారావు)/సర్గ 59
శ్రీ
సుందరకాండ
సర్గ : 59
1
అట్లు, హనుమ తన యాతా యాత
ప్రస్తావన పూర్ణము చేసి, మఱల
చెప్ప నుత్సహించెను తన చి త్తము
లోన మెదలు ఆలోచన లిట్టుల.
2
రాముని ఇష్టార్థము సిద్ధించును,
శమియించు కపి స్వామి సంభ్రమము,
సీతను కని, ఆ మాత శీల శు
ద్ధోన్నతి కేను ప్రపన్నుడ నైతిని.
3
కావగలడు లోకములు తపస్సున,
కాల్చి వేయగా గలడు క్రోధమున,
సర్వోన్నతుడు దశముఖు, డందుచే
జానకి నంటియు చావక బ్రతికెను.
4
మండుచున్న హోమశిఖా జ్వాలను
అంటవచ్చు నొక్కపుడు; కాని క్రో
ధమున నున్న సీతను చేతులతో
ముట్టి బ్రదుకుట, అభూత మనూహ్యము.
5-6
ఆర్యులు, జాంబవదాదుల కిది విని
పించి, అనుమతిని వీరుల గొనిపో
వచ్చితి, సీతను తెచ్చి, రాఘవుని
దర్శించుట యుక్తము, న్యాయము నదె.
7
రాకాసుల బలుమూకలతో, లం
కాసహితము దశకంఠుని హతమా
ర్పగ చాలుదును దురమున నే నొకడ,
ఇదివఱకే దహియించితి నగరము.
8
ఏమి కావలయు నిక, మీరందఱు
అస్త్రశస్త్రవిదు, లసహాయ సమర
శూరకులవతంసులు, జయకాములు,
నాకు తోడుగా నడచిన లంకకు.
9
నే నొకడనె, రజనీచరనాథుని,
రావణుని, సపుత్ర సహోదర సఖ
సాంగబలంబుగ చావగొట్టగల,
నాహవముఖ దోహల సాహసమున.
10
బ్రాహ్మమొ, ఐంద్రమొ, రౌద్రమొ, వారుణ
వాయవ్యాస్త్రములో, యుద్ధంబున,
ప్రతిరోధింపగ రాని యే మహా
దివ్యాస్త్రములొ, యెదిర్చి యేర్చినను.
11
వాని నన్నిటిని వమ్ముచేసి, రా
త్రించరబలము మధించి వధింతును,
అనుమతింపు, డసహాయ సాహసము
తోడ విక్రమింతును రావణువధ.
12
రణమున నేను తెఱపిలేని పిడుగు
రాళ్ళ వాన విసరన్ నలుగడలను ,
అమృతాంధసులే హతమైపోదురు ,
ఈ పిశితాశను లేమి చెప్ప నిక .
13
చెలియలికట్టను చెఱపవచ్చు సా
గరము, మందరము కదలవచ్చు పా
దులను, జాంబవంతుని పాదము కద
పగ చాలవు, రిపువాహిని వఱదలు.
14
వీరుడు వాలి కుమారు డంగదుడు
ఒక్కడు చాలును రక్కసి మూకను,
వారి తాతలను వరుసపెట్టి తెగ
టార్ప, నిర్భయ నిరంకుశముగ నట.
15
పవనుడు, నీలుడు, భండనంబునకు
తోడిబడి దూకిన తొడల రాపిడికి,
మందరాచలము మడగి బ్రద్దలగు
ఏమి చెప్ప నిక ఈ లంక గతిని.
16
ద్వివిద మైందవులు తీండ్రించిన , దే
వాసురు, లురగులు యక్షులు దక్షులు
గంధర్వులును వికావిక లగుదురు,
ఎదిరి నిలువగల రెవ్వరు వీరిని.
17
ఈ మహాభాగు, లిరువు రశ్వినీ
దేవతల సుతులు, దీటువచ్చువా
రెవ్వరు వీరికి; చివ్వల లోపల
మోకరింపగల పోటరులు కలరె?
18
బ్రహ్మయిచ్చిన వరంబుల మహిమను,
అమృతము త్రాగిన అక్షయ శక్తిని,
వెలుగు చుందురీ వీరు లిద్దరును,
హరి వంశంబున అగ్రగణ్యులయి.
19
అశ్విని దేవత లం దాదరమున,
ఇచ్చె మునుపె పరమేష్ఠి వరములను,
వీరి నిద్దరిని పోరుల నెవరును,
ఏ శరములును వధింప నోపవని.
20
బ్రహ్మదేవుని వరప్రభావమున,
మత్తిల్లిన ఈ మగ లిద్దరు, మును
దేవ గణము నతిక్రమించి, మన
సారగ త్రాగిరి వారి అమృతమును.
21
ఉండ నిండు కపియోధుల, వీరి
ద్దరును చాలు మాతంగ తురంగ ర
థాంగంబులతో అసురుల లంకను
సర్వనాశనము సలిపి జయముగొన.
22
ఇదివఱ కే దనుజేశుని లంకను
ధ్వంసముచేసి, భవనములు కాల్చితి,
రాజమార్గముల రచ్చల నెల్లెడ
వినిపించితి నా పేరుమ్రోయగా.
23-24
అనఘాత్ములకు, మహాబలిష్ఠులకు
జయము, రామలక్ష్మణ సుగ్రీవుల;
కనిలదేవునకు ఔరసపుత్రుడ,
హనుమాఖ్యాతుడ నంచు చాటితిని.
25
దుష్టుడు, దురితాత్ముడు రావణుని అ
శోకవనంబున శోకముతో క్షో
భిలుచున్నది మైథిలి, నిశాచరులు
చెఱలుపెట్టగా శింశుపనీడను.
26
క్రూరరాక్షసుల గుట్టల నడుమను
శోకతాపముల సొగసి పొగలుచు
న్నది జానకి; వానమొగులు కప్పిన
శుభ్ర చంద్రకళ చొప్పున చెన్నఱి.
27
బలదర్పితు రావణుని మాటయిన
తలపెట్టదు సీతాసువాసిని, ప
రమ పతివ్రతారత్నము, రామ
ధ్యాన పరాయణ తన్మయమతియై.
28
మంగళముఖియగు మై థిలి, రాముని
యం దనన్యబద్ధానురాగయై,
భావించును సర్వావస్థ లలో,
దేవేంద్రు శచీదేవి చందమున.
29
ఏకవస్త్రము మెయిన్ బిగచుట్టి, దు
రంత తపన మాయగ లావణ్యము,
కసుగందిన అంగములతోడ, వై
దేహి పతినె చింతించు రేల్బవలు.
30
వికృతరూపలగు పిశితాశినులు, ది
వారాత్రంబులు భయపెట్టుచు బా
ధింప, దురపిలుచు దీనయైన సీ
తను చూచితి ప్రమదావనమందున.
31
గంపెడు కురు లెగగట్టి యొంటిజడ,
నేలమీద శయనించుచు, పతిపయి
ప్రాణములుంచి, వివర్ణ యై వనరు,
వడగం డ్లడచిన పద్మిని పగిదిని.
32
రావణాసురుని ఱాతిగుండె ద్రవి
యింప దనుచు మరణింప నిశ్చయిం
చిన మృగశాబాక్షికి, నేనెటులో
విశ్వాసము కల్పింప తలచితిని.
33
మాటల వరుసన మైథిలితో యా
వద్వృత్తాంతము వల్లె చెప్పితిని,
సంతోషించెను జానకి, రాఘవ
సుగ్రీవుల ప్రస్తుతమైత్రిని విని.
34
సముదాచారము, సాధ్వీవృత్తము.,
విభుని యందె నిలిపి తపస్విని; రా
వణు బలిగొన దాయెను రఘురాముని
వల్లనె రావణు వధ కావలెనని.
35
సహజసిద్ధముగ సన్నది జానకి,
దుఃఖవేదనల తూలి మఱింత కృ
శించి, కమలి, కనిపించెను; పాడ్యమి
నాటి చదువు చందమున మందగిలి.
36
శోకసముద్రమున సుడిగుండంబుల
చిక్కి క్షోభిలెడి సీత కష్టకథ
చెప్పితి సర్వము, చేయతగిన, దిక
చింతించి వివేచింపుడు మీరలు.
27-8-1987