శ్రీ సుందరకాండ (రాయప్రోలు సుబ్బారావు)/సర్గ 58

వికీసోర్స్ నుండి

శ్రీ

సుందరకాండ

సర్గ 58


                    1-2
ఆ మహేంద్రమున హనుమత్ప్రముఖులు
ప్రీతి భరితులయి వేడుక నుండగ,
అడిగె జాంబవంతుడు హనుమంతుని,
వినుపింపుము జరిగిన వృత్తాంతము.
                    3
దేవి నే పగిది తిలకించితి వీ,
వెట్టులున్న దయ్యెడ రఘునందిని,
క్రూరుడు ఖలకర్ముడు దశకంఠుడు
ఎట్లు జనకసుతపట్ల మెలంగును ?
                   4
వెతకితి వేయే వెలిపొలముల? గు
ర్తించితివెట్లు విదేహ రాజసుత?
నేమియేమి నీతో మాట్లాడెను?
వినిపింపుము జరిగినది మాకిపుడు.
                   5
గతమునువిని, కాగలది నిశ్చయిం
తుము; రఘురామునితో, మన మచ్చట
ఏమి చెప్పతగు, ఏమి చెప్పరా
దెఱిగింపుము మా కిపుడు మహాకపి !


                    6
జాంబవంతు డటు శాసింపగ, ఆ
లించి మేను పులకింప హనుమ, తల
వంచి, దేవి కభివాదములు సలిపి,
చెప్పదొడగె నిటు సీతాన్వేషణ.
                    7
నాడు మీరలందఱును చూచు చుం
డగ మహేంద్రమును దిగవిడిచి యెగసి,
వారిధి దక్షిణతీరము చేరగా
దీక్షించి మహా తీవ్రవేగమున.
                    8-9
పోవుచుండ పారావారము నడు
మను ఎదురాయెను కనకశిఖరముల
నొప్పారుచు నగమొక్కటి ; మార్గము
కట్టిన, అది విఘ్నముగా తోచెను.
                    10-11
ఆ కనకాచల మల్లనల్ల నను
దగ్గరుచుండగ, దానిని భేదిం
పగ తగునని నా వాలము నీడిచి
కొట్టితి ముక్కలగుచు పగిలె నదియు.
                    12
దెబ్బతిని గిరి మదీయ యత్నమును
పోల్చినట్లు నను పుత్రాయంచును
పిలిచెను తీయని యెలుగున నపుడు,
మనసు మెత్తగిలె మరులు కొన్నటుల-
                    13
అనుజుడ నీ జనకున కని యెఱుగుము,
వాయుదేవునకు ప్రాణసఖుండను,
నా నామము మై నాకుడు; నివసిం
తును గుప్తముగా తోయధి లోపల.


                    14
కొడుకా ! పూర్వము కొండల కెల్లను
ఱెక్కలుండె, అవి ఉక్కు మిగిలి భూ
తలి కంతయు బాధకముగ నిచ్చలు
ఇచ్చవచ్చిన ట్లెగురుచు నుండెను.
                    15
తిరిగెడి కొండల చరితంబును విని,
పాకశాసనుడు వాని ఱెక్కలను
ఖండించెను ముక్కలుగా తన
వజ్రాయుధమున భయ మెడల భువిని.
                    16
అప్పుడు నన్ను మహాత్ముడు, పవమా
నుడు, నీ పితృదేవుడు సముద్రమున
పడనెట్టెను, అప్పటినుండియు నీ
సాగరంబులో దాగియుందు సుత !
                    17
ఏను రామునకు హితవరినై సా
యము చేయు టవశ్యము విధాయకము,
ఆతడు ధర్మపరాయణుడు, మహేం
ద్ర సమాన పరాక్రముడు కుమారా !
                    18
మహితాత్ముండగు మై నాకుం డటు
బంధుభావమున భాషింప, అతని
నాశ్వాసించి, ప్రయాణ కారణము
తెలిపి, కార్యవిధేయమతి నయితి.
                    19
మై నాకుండును మామక గమనము
అనుమతించి పోయె నదృశ్యుండయి,
నగరూపము మానవ దేహంబును
మునిగె కనబడక మున్నీటంబడి.


                    20-21
అంత నేను వియదంతరాళమున
మిగిలిన త్రోవ గమించు వేగమున
ఏగుచు చూచితి నాగమాతను, సు
రసను మహావారాశి మధ్యమున.
                   22
ఆమె యిట్టులనె, హరివృషభమ ! ని
న్నంపిరి దేవత లశనార్ధంబుగ,
చిరకాలమునకు దొరికితి విప్పుడు
భక్షింతును నా కుక్షి నిండగా.
                   23
సురస యట్లు నిష్ఠురముగ పలికిన
విన్నబోయి, దేవికి వినయమున న
మస్కరించి, తగు మాటలాడితిని
చేతులు రెండును శిరసున చేరిచి.
                   24
దశరథ పుత్రుడు ధర్మచరిత్రుడు,
రాముడు భార్యాభ్రాతలు తోడయి,
వెంబడింపగ ప్రవేశించె మహో
ద్దండ కాననము దండకావనము.
                   25
రాముని స్వకళత్రంబును సీతను
అపహరించెను దురాత్ముడు రావణు;
డామె దగ్గరకు అరిగెద దూతగ,
రాముని పనుపున రాష్ట్ర వాసినీ !
                   26-27
చేయగ నోపిన సాయము చేయుము,
కాదయేని, జనకజను కనుంగొని,
రఘురాముని దర్శనము చేసి, వ
చ్చెద నమ్ముము చొచ్చెద నీ వక్త్రము.


                  28
నామాటలు విని నాగమాత, బె
ట్టిదముగ బదులాడెను బింకముగా
నను తప్పించుక చనరా దెవరును,
బ్రహ్మ యిచ్చిన వరము నా కిది కపి !
                  29
సురస యట్టుల పదరులాడగ, పది
యామడ పొడ వయిదామడ వెడలుపు
నామెయి పెంచితి, నాగమాతయును
అంత కధికముగ ఆస్యము విచ్చెను.
                  30
నాకంటెను అదనముగ పెరిగి క్రూ
రముగా నోరు తెఱచిన పిశాచిని,
కాంచి, కణములో పెంచిన దేహము
కుంచితి నొక అంగుష్ఠమాత్రముగ,
                  31-32
తడయక వెంటనె దాని నోటిలో
చొచ్చి, తత్క్షణమె, వచ్చితి బయటికి,
నిజరూపముతో నిలిచి సురస యనె,
కార్యంబగును, సుఖముగ పొమ్ము హరీ!
                  33
శ్రీ రామునితో చేర్చుము వై దే
హిని, శీఘ్రము, శోభనమగు, సంతో
షించితి నేను, సుఖించు మార్తజన
భయ నివారకుడవయి మహాకపీ !
                   34
అప్పుడు భూతములన్నియు మిన్నుల
బాగుబాగనుచు పాటలు పాడెను,
అంత, గభీరమగు అంతరిక్షమున
కెగసితి మఱల, ఖగేంద్రునికైవడి.


                    35
కొంత దవ్వరిగినంత, నా గతి గ
మక వేగంబులు మందగించె, నా
నీడను పట్టిన జాడతోప, నలు
గడ పరికించితి, కనబడ దేమియు,
                   36-37
ఛాయా గ్రాహి నిశాచరి యిదె కా
బోలు నటంచును బుద్ధితోచ, ఱె
ప్పలు వాల్చక చూపులు నిల్పి, వరీ
క్షించితి నప్పుడు క్రింది భాగమున
                   38
అచట భయంకరమగు రూపముతో
నీళ్ళలోన శయనించి లేచు రా
క్షసి కనబడె, అది కటికి నవ్వుతో
అరచుచు అశుభము లాడసాగె నిటు
                   39
ఓ యతికాయుడ ! పోయెద వెచటికి ?
బహుకాలం బిట ప్రాశనంబు లే
కున్న నాకు నే డోదనమై నీ
తను మాంసంబుల తనుపుము వేగమె.
                   40
అట్లు బొబ్బలిడు అసురి జంకెనల
కూకొట్టుచు తలయూచితి, తోడ్తో
మేను పెంచితిని మితిమిక్కిలి, సిం
హిక గ్రసింపజాలక క్షోభిలుగతి.
                  41
నన్ను మ్రింగ ఆకొన్న రాక్షసియు
తెఱచుచుండె తీవరముగ నోటిని
చూడదాయె నాజాడ ఆత్రమున ,
ఎఱుగదాయె నేపఱచిన తంత్రము.

                   42
తడయక , అపుడప్పుడె. పెంచిన నా
యొడలు కుంచి, చొరబడి, లోలోపల
నాళ్ళు నరంబులు గోళ్ళతో పెరికి,
పళ్ళతో కొఱకి, బయలెక్కితి వడి.
                  43
గుండె గండిపడ , కోల్పడి ఉసురులు
కాళ్ళు చేతులును కీళ్ళును సళ్ళగ,
ఉప్పు టేటిలో బరిగి త్రెళ్ళెను పి
శాచి కొండవలె జలములలోపడి.
                 44
వినువీధులలో విహరించెడి సుర
సిద్ధ చారణులు చెప్పుకొనిరి, హిం
సికను సింహికను సంహరించె హను
మంతు డంచు; ఆ మాటలు వింటిని.
                 45-46
దాని చంపి, కర్తవ్య శేషమును
స్మరియింపుచు అంబర వీథింబడి,
పోయిపోయి, మునుముందు కంటి, ద
క్షిణ తీరంబున గిరిపై లంకను,
                 47
సూర్యు డస్తమించుచునుండగ, కా
వలి కాచెడి దైత్యులకు కనబడక ,
వారిధి దక్షిణతీరమున వెలయు
లంక చొచ్చువేళను; లేచి యొకతె.
                 48
ప్రళయకాల ధారాధరము పగిది,
జ్వాలలవలె సిగజడలు వ్రేలబడ
సాగి మీదబడి చంపవచ్చి. నను
కట్టెదుట నిలిచె; అప్పుడు దానిని


                   49-55
పిడికిట పొడిచితి సడలగుండె, లం
తట, రక్కసి కాతరయై యిట్లనె,
"నేను లంకను, జయించితివి, నను, జ
యింతు విక అసురసంతతి నంతయు.”
                   ?
అంత నేను రేయంతయు లంకను
తిరిగి తిరిగి, మైథిలిని గానక, ద
శాస్యుని సౌధము నందును వెతకి, క
నబడక, శోకమున మునిగి సుడిసితి.
                  ?
చింతతో తపించెడి నాకపు డగ
పడె, బంగారపు ప్రాకారంబులు
చుట్టును కట్టిన సుందర కుసుమో
ద్యాన వనము నందనమును పోలుచు.
                  ?
ఆ ప్రాకారము నట్టె దాటి చూ
"చితి, నానా తరులతలు వర్ధిలు అ
శోక వనంబును, సుభగ శింశుపను,
పసిడి యనంటుల పచ్చని మళ్ళను.
                  56
శింశుప వృక్షము చేరుగడను చూ
చితిని మొదట, సితశతపత్రాడక్షిని,
వర్ణ వర్ణిని, ఉపవాస కృశాస్యను
నడివయసు నెలంతను సుమంగలిని.
                  57
ఒంటిచీర మెయినంట చుట్టుకొనె,
ధూసరంబులయి మాసె కేశములు,
శోకతాపమున సోలి కనబడెను
దేవతవలెను పతివ్రత మైథిలి.


                    58
చుట్టును రాకాసులు, ఱాగలు, వికృ
త స్వరూపిణులు, తర్జింపగ  ; మద
మాంస రక్తములు మరగిన పెద్దపు
లులలో చిక్కిన యెలలేడివలెన్,
                   59
ఏకవేణిగా ఎగయచుట్టి తల
కురులను, శోకకుకూలము రగులగ,
దీనదినముగ మ్లాన వదనయై
భర్తృచింతతో పరితపించు సతి.
                   60
వట్టి నేలపయి పవళింపగ తను
కాంతి తఱిగె హేమంత నలినివలె,
రాక్షస బంధవిమోక్షము గానక
నిశ్చయించె మరణింవ మనస్విని.
                  61
కన్నెలేడి వాల్గన్నులతో, అటు
నిటును చూచుచున్నటు లగపడె సతి
నేనును రఘుపత్నిని చూచుచు, శిం
శుపశాఖల కూర్చుంటిని కదలక.
                  62
ఆ తరుణంబున హలహల మంచును
కాసెల యందెల గాజుల చప్పుడు
రావణు నంతిపురంబుల నుండి వి
నంబడె గంభీరంబుగ ఎడనెడ .
                 63
అలజడితో నే నప్పుడు నాదు స్వ
రూపము మార్చి, తరుప్రకాండ శా
ఖలలో నొదిగితి; గగనము లోపల
పక్షిచందమున నిక్షేపంబుగ.

                   64
రావణేశ్వరుడు రాణివాసములు
సహచరింప, ప్రాసాదము వెలువడి,
చేరగ వచ్చెను సీత ప్రవాసం
బున్న అశోక వనోపాంతమునకు.
                  65
రావణాసురుని రాకడ గని, త
త్తరము తోడ సీతామతల్లికయు,
కలవరపడి, మోకాళ్ళతో తొడలు ,
కరములతో వక్షమును మూసికొని.
                  66
గాఢ భయంబున గడగడ లాడుచు,
కంపింపగ, అంగంబు లనదవలె
రక్షణంబు కనరాక, పొగలి వెడ
వెడ చూచు తపస్విని రఘునందిని.
                  67
చూచి రావణాసురుడు, దూరమున
నిల్చి శిరంబును వాల్చి, పలికె నిటు,
భామినిరో! నను బహుమానింపుము,
ప్రేయసివై యెడబాయని ప్రీతిని.
                  68
ఇంతదాక సహియించితి, నన్నభి
మానింపని ఉన్మాద దర్పమును,
నీకు గడువు రెణ్ణెల లిచ్చితి, అది
దాటిన నీ రక్తము రుచిచూతును.
                  69
ఆ దురాత్ము ధూర్తాలాపంబులు
వీనుల శూలములై నొప్పింపగ,
కోపము రేగి విఘూర్ణ మాన మా
నసయై, కసరి జనకజ యిట్లనెను.



                    70-71
రాక్షసాధమ ! పరంతపు డగు శ్రీ
రాముని భార్యను, రఘుకుల వీరుల
యింటి కోడలి, ననిష్టము లాడితి,
చీలిపడదు నీ నాలుక యేలని !
                    72
ఇదియొక బీరమె ? హీనుడ ! నా వ
ల్లభుడు లేనివేళ కనిపెట్టి, వం
చించి, అపహరించి, నను తెచ్చితివి
అతని కంట బడవయి తపు డచ్చట.
                   73
ఎటు సరివచ్చెదవీవు రామున క
జేయుడు, సత్యపరాయణుడు, రణ
శ్లాఘనీయు, డకలంకుం, డాతని
దాస్యంబునకును తగవు, తథ్యమిది.
                   74
పరుషముగానటు, వైదేహి ఉదా
సీనములాడ, దశాననుం, డలిగి
మండుచులేచె ప్రచండకోపమున,
కాటిలోని యింగాలము భంగిని.
                  75
కనకన మండెడి కనులు రెండు గిర
గిర త్రిప్పుచు, పిడికిలి బిగించి, చే
యెత్తెను వై దేహిని హింసింపగ,
అయ్యోయంచును కుయ్యిడి రబలలు.
                  76
దశకంఠుని నిజదార దయావతి,
మందోదరి, అపు డందఱిలోపల
నుండి వచ్చి, దైత్యుని వారించెను,
చేయి పట్టుకొని చేయరా దనుచు.



                    77
మదనాతురయగు మండోదరి, తీ
యని యెలుగుల నాతని లాలించెను,
ఇంద్ర సమానుడ, వెందుకు నీ కీ
మానవ సతి సురమానిను లుండగ.
                    78
సురకన్యలు, యక్షులకన్యలు, గం
ధర్వ కన్యలును తగిలి మిగుల కా
మింతురు నీ చెలిమిని, క్రీడింపుము;
ఎందుకు నీ కీ యెబ్బెరాసి ప్రభు !
                    79
అనుచు దానవాంగన లందఱు, బల
వంతముగా రావణుని పట్టుకొని
ఇచ్చకము లభినయించుచు, తోడ్తో
కొనిపోయిరి రాజనివాసమునకు.
                   80
రావణేశ్వరుడు రాణివాసమును
వెడలిపోవ, అతివికృత ముఖులు రా
వణుని దూతికలు వచ్చి జానకిని
బాధించిరి దుర్భాషల దురుసుగ.
                  81
వారి భాషలను వైదేహి తృణ
ప్రాయంబులుగా పాటింపమిచే
రాకాసుల తర్జన భర్జనములు
అడవి రోదనంబయి కడముట్టెను.
                  82
బెదరించియు, వెఱపించియు, భూ
షించియు దూషించియు, హతాశలై
విసిగిపోయి, రాక్షన రక్షికలును
చెప్పిరి ప్రభువుకు సీత నిశ్చితము.


                    83
యత్నము లన్నియు వ్యర్థము కాగా
మానివేసి, ప్రాల్మాలి, మైథిలిని
విడిచిపెట్టి, ఎక్కడివారక్కడ,
పడి నిదురించిరి బడలి యందఱును,
                   84
సీతయు భర్తను చింతించుచు; గా
సిల్లి వేసటల, చెప్పరాని శో
కముతో ఎడతెగని కడగండ్లకు
విల విల లాడుచు వలవల యేడ్చెను.
                   85
అపుడు త్రిజటయను ఆసురి యొకతె లే
చి పలికె నిట్టుల 'సీతను తినకుడు,
నను తిను డాయమ నశియింప దిపుడు,
జనకు కూతురు, దశరథుని కోడలు.
                   86
నే డొక కలగంటిని దారుణముగ,
నిక్క పొడిచె మెయినిండ రోమములు,
నాశమాయె దానవకులంబు, జయ
మాయె జానకీ నాయకున కిచట.
                   87
రాముచే పడక బ్రదుకుటకు మనము
సీత నిపుడు యా చించుటవశ్యం
బనితోచును నా, కామె రాక్షస
స్త్రీ కులమును రక్షింపగ జాలును.
                   88
దుఃఖసముద్రమున దొప్పదోగు ఏ
సాధ్వి విషయముగ స్వప్నంబాయెనొ,
ఆయమ కష్టము లంతము నొందెను.
అతిశయముగ సౌఖ్యము సిద్ధించును."



                   89-90
భర్త దిగ్జయ శుభశ్రుతి విని హ్రీ
మతియై బాల సమాశ్వసించె రా
క్షసకాంతలనిటు, శరణమిత్తు మీ, కీ
కల నిజమగునేని తథ్యముగ.
                   91
అతిదారుణ దురతిని కృశించి త
పించుచున్న దేవినికని, అప్పుడె
విక్రమింప తలపెట్టితి కనుకని,
కాని, మది సమాధానమీకొనదు.
                  92
మైథిలితో నే మాటలాడుటకు,
ఉచితమైన వెర వూహించి, తుదకు
నిశ్చయించుకొంటిని, ఇక్ష్వాకుల
ప్రస్తావనతో ప్రారంభింపగ.
                  93
రాజఋషులకును పూజనీయమగు
ఇనకుల కీర్తనమును మనసారగ
వినుచు పల్కరించెను నను జానకి,
కన్నీళ్ళు కటాక్షములను కప్పగ.
                  94
వానరో త్తమ ! ఎవండవు ? నీ వె
వ్వరు పంపించగ వచ్చితి విచటికి ?
రామునిపై నీ ప్రేమకు కారణ
మెట్టిదొ, నాకదియెల్ల వచింపుము.
                  95
అట్టు లార్య నన్నడిగినంత చె
ప్పితి నిట్టుల దేవీ ! నీ విభుడగు
రాఘవునకు మిత్రము కలం డొకడు,
భీమపరాక్రమ విశ్రుతు డాతడు.


                   96
సుగ్రీవుండను శుభనామాంకుడు,
బహుబలశాలి, ప్లవంగ పాలకుడు,
ఆతని భృత్యుడ హనుమంతుడ, నే
నొక్కడ వచ్చితి నిక్కడి కిప్పుడు.
                   97
సదమల కర్మ యశస్వి, శూరు, డభ
యవ్రతి, నీపతి, అంపె నన్నిటకు,
ఆనవాలుగ నిజాంగుళీయకము
ఇచ్చినాడు నీకిమ్మని దేవీ !
                   98
ఏమిచేయవలె నికమీదట, నా
కానతిమ్ము, తడయక తపస్వినీ!
పుణ్యమువలె కొనిపోయి నిన్ను శ్రీ
రామలక్మణుల ప్రక్కన దించెద.
                  99
నా చెప్పినదంతయు విని, విషయము
ఆకళించి యిట్లనెను మనస్విని,
'రావణ సంహారంబు చేసి రఘు
కుల వీరుడు నను కొని పోవలయును.'
                  100
సీత వచనములు స్వీకరించి, తల
వంచి, వందనార్పణముసలిపి, ఏ
దయిన రాఘవున కాహ్లాదకమగు
ఇష్టలాంఛనము ఇమ్మనికోరితి.
                  101
అన విని భగవతి ఆదరం బొలయ,
ఇచ్చెద నీ కొక యిష్టరత్నమును,
దానిని గని బహుమానించును నిను
ప్రాణవల్లభుడు పరమమోదమున.




                    102
అనుచు, జనకనందన, అద్భుతమగు
చూడామణి నచ్చుగ నా కిచ్చుచు,
ఉపదేశించెను యుక్తమయిన సం
దేశము పరమోద్విగ్న చిత్తయై.
                    103
వెంటనె నేనును వేడుక మీఱగ,
రాజపుత్రికి పరమపవిత్రకు, ప్ర
దక్షిణాభివాదములు నెఱపి, ప్ర
యాణత్వర తారాడుచు నుండగ.
                   104
ఇంచుకంత యోచించి, స్తిమితపడి,
మఱల, నిట్లనియె మైథిలి నాతో,
చెప్పవయ్య కపిశేఖర ! రమువీ
రునితో నా యాతనలు సమస్తము.
                  105
నీ చెప్పినది వినిన వెంటనె సు
గ్రీవునితో, కిష్కింధా బల వా
రముతో లంకకు రామలక్ష్మణులు
లగ్గపట్టు జాడను వర్తింపుము.
                  106
ఇది శీఘ్రము ఘటియింపనిచో, రా
ముడు ననుకనజాలడు, మరణింతును,
నే ననాథవలె, నెలలు రెండె మిగి
లెను రాక్షసుడిచ్చిన గడువున నిక.
                  107
జాలి వెల్లిగొను జానకి మాటలు
వినినంతనె భగ్గనెనా క్రోధము;
తలపోసితి నావల కావలసిన
కార్య శేషమును గట్టి మనసుతో.


                   108
పెరిగెను కాయము పెద్ద పర్వతం
బట్టుల ఉన్నతమగుచు, రణా పే
క్షా వేశము మిట్టాడ, అశోకో
ద్యాన ధ్వంసము నారంభించితి.
                   109
తోటలో తరులు తునిగి విఱిగిపడ,
పక్షు లెగిరిపోవగ, మృగములు చె
ల్లాచెదరై తరలన్ , కలవరమున
అసురులు మేల్కొని రాకస్మికముగ.
                   110
వనములోన పలువాడలనుండి ని
శాచరాంగనలు చాళ్ళుచాళ్ళుగా
వచ్చి నన్నుగని, వడివడి పరుగిడి
రెఱిగింపగ అసురేంద్రున కందఱు.
                   111
రజనీచరకుల రాజేశ్వర ! నీ
బలపరాక్రమంబులు తెలియని వా
నరు డొక్కడు, కండబలమున అశో
కవనమును కలచి కా డొనరించెను.
                  112
సుందరమయిన అశోకవనంబును
చెఱచి పాడుచేసిన దుర్బుద్ధిని
చంపివేయ నాజ్ఞాపింపుము, హత
మైపోవును, నీ కప్రియుడాతడు.
                  113
ఆ మాటలువిని అసురపాలకుడు
దుర్జయులగు యోధులు కింకరులను
నచ్చిన వారిని చెచ్చెర పంపెను,
బలములతో నను పట్టి కట్టుటకు.



                    114
బల్లెము, లీటెలు, బరిసెలు, గుదియలు
బిరబిర తిప్పుచు దురుసుగ వచ్చిన
ఎనుబదివేలను ఇనుపదూలమున
చితుకకొట్టి విచ్ఛిన్నము చేసితి.
                   115
వారిలోన చావక బ్రదికిన కొం
దఱు వడి పరుగుడి దానవేంద్రునకు
చాలవఱకు మనసైన్యము హతమై
పోయెనంచు పురపుర ఎఱిగించిరి.
                   116
అపుడు నాకు మనసయిన ఒక్క సౌ
ధము తలమీదికి దుమికితి, నచ్చట
ఉన్న నూరుగురు యోధుల పైబడి,
స్తంభమును పెరికి చావగొట్టితిని.
                  117
లంకానగరి కలంకారమయిన
ప్రాసాదంబును పడద్రోయ, కినిసి
దుర్జయులగు యోధులతో పం పెను,
జంబుమాలి, నతి సాహసశాలిని.
                  118-119
రణకోవిదుడగు రాక్షసవీరుడు
ఉద్దండమయిన పెద్దదండుతో
కూలి నేలబడకొట్టితి, దూలము
త్రిప్పిత్రిప్పి బాదితి నలినలిగా.
                   120
అది విని రావణు డాగ్రహోగ్రుడయి,
మంత్రిసుతుల దుర్మద బలధుర్యుల,
నంపెను, వారల నందఱిని ఇనుప
దూలము తోడనె తునకలు చేసితి.



                    121-123
మంత్రి కుమారుల మారణం బెఱిగి
అగ్రసైన్య నాయకుల నై దుగుర
పంపెను, వారిని చంపితి, పిమ్మట
అక్షకుమారుని అంపె రావణుడు.
                    124
మందోదరి ప్రియనందను, డక్షకు
మారుడు, సమరవిశారదు, డాకా
శమున కెగసిరాన్ సంరంభంబున,
అతని రెండుకా ళ్ళంటపట్టితిని.
                    125
అట్టె కూలిపడె అక్షకుమారుడు,
విఱుగపొడిచి పొడిపిండి చేసితిని;
పిదప పిలిచి పంపించె, రెండవ కు
మారు, నింద్రజితు శూలాగ్రేసరు.
                    126-127
యుద్ధసమర్థుడు, యోధు డింద్రజితు,
నాతని సైన్యము నడచి సడించితి,
మొగములు త్రిప్పిన పగఱ దండుగని
పరమహర్షమున పొరలె నా మనసు.
                    128
మహితశస్త్ర ధూర్వహు, డరిందముడు,
ఇంద్రజి త్తనుచు ఎడదనమ్మి పం
పించె తండ్రి, ఆభీల పరాక్రమ
దుస్సహులగు యోధుల యూధముతో,
                   129
శస్త్రాస్త్ర రహస్య విశారదుడును
సై పలేక నా చావు దెబ్బలకు,
దురముల యెత్తుల నెఱిగిన ఆతడు
బ్రహ్మాస్త్రంబున బంధించెను తమి.


                    130-131
అంతట రాక్షసు లంటగట్టి నను
ఈడుచుకొనిపోయిరి రావణు కడ,
కడిగి రచట లంకాగమనమునకు,
రణకర్మకు కారణము లేమనుచు.
                    132
అది యంతయు సీతార్థం బంటిని,
నీ సౌధములోనికి చొరబడితిని
సీతనువెతకగ; నే తెచ్చిన సం
దేశంబును విన్పించుట కంతయు.
                     133
మారుతదేవున కౌరసపుత్రుడ,
వానరుడను, హనుమాను డంద్రు నను,
రాముని దూతను, రాక్షసేంద్ర! యెఱు
గుము సుగ్రీవు సఖుడనుగా ప్రభూ!
                     134
రామదౌత్యము నెఱపగ వచ్చితిని;
అడిగెను సుగ్రీవుడు నీక్షేమము,
నీకయి పంపెను నిత్యధర్మకా
మార్థ సమాహిత మగు సందేశము.
                    135
బహుపాదపముల పచ్చలారు నా
ఋశ్యమూక గిరి నేనుండగ, రణ
విక్రాంతుడు రఘువీరుడు కలిసెను,
అది మొదలుగ స్నేహము వర్ధిల్లెను.
                    136
కానలోన రాక్షసు డెవ్వడొ తన
భార్యను పట్టి అపహరించె ననుచు
చెప్పి, నన్ను యాచించెను సాయము,
సీతను అన్వేషించు కార్యమున.


                    137
అడిగితి నే నప్పుడు, వాలిని వధి
యించి నా ప్రభువు నిష్టపత్నితో
కలుపుమనుచు రాఘవుని, అందులకు
ధీరు డతడు ప్రతిజ్ఞ చేసె నట.
                    138
వాలివృత్తమును వారికిచెప్పి వ
ధించు విషయము ప్రతిజ్ఞ చేయుమని
అడిగితి నేనప్పుడు; తులతూగగ
ఉపకార ప్రత్యుపకారంబులు.
                    139
రాజ్యము పోయిన ప్రభువు వానరుడు,
భార్య కోల్పడిన ఆర్యుడు నృపసుతు,
డగ్ని సాక్షిగా అన్యోన్య స్నే
హ ప్రమాణముల నాడి రాగిలిరి.
                   140
అంతరాఘవుడు, అరుదుగ వాలిని
ఒక్క బాణమున చక్కడంచి, సు
గ్రీవుని అభిషేకించె, సర్వ వా
నరకుల చక్రమున మహారాజుగ.
                  141
అట్టి మహా ధర్మాత్ముడు రామున
కన్ని విధముల సహాయము చేయగ,
ఒట్టు తింటిమి ప్రభూ ! నన్నంపె, న
తండు దూతగా ధర్మ పద్ధతిని.
                  142
సుగ్రీవాజ్ఞల శూరులు వీరులు
దండు విడిసి నీదానవ సేనల
చెండకమును పే, సీతాదేవిని
రామునకు సమర్పణ కావింపుము.


                   143
వానరుల ప్రతాప ప్రభావములు
ఎవరికి తెలియవు ! ఇంద్రలోకమున
కామతింపగా అరుగుచుందు, రది
నీతో చెప్పు మనెను సుగ్రీవుడు.
                  144
రాక్షసుడును రౌద్రముగ క్రుద్ధుడై
కనుచూపుల నను కాల్చుచు, వీనిని
చంపు డనుచు ఆజ్ఞాపించెను క్రూ
రముగ నా ప్రభావము లవ మెఱుగక.
                  145
అపుడు. విభీషణు డను మహామహుడు,
రాజసోదరుడు, రాక్షసేశ్వరుని
వైపు తిరిగి నిర్భయముగ పలికెను,
న్యాయబుద్ధి నట నా పక్షంబున.
                  146
తగదీ పూనికి త్యజియింపుము రా
క్షస శార్దూలమ ! కాని కృత్య మిది,
రాజనీతి శాస్త్రమ్ము లొప్పని అ
నిష్టమార్గ మీ వేల త్రొక్కె దిటు ?
                  147
దూతల వధ మెందును కనంబడదు
రాజనీతిశాస్త్రములలోన; దూ
తలవలనన్ విహిత మగు యధార్థము
తెలియవలయు సందిగ్ధ తరుణముల.
                  148
అతుల విక్రముడ వవధరింపు, మే
యపరాధములు సలిపినను దూతల
చంపకూడదను శాస్త్రములు, విరూ
పులను చేసి పంపుటె విధ్యుక్తము.

               149-150
అట్లు విభీషణు డఖిల రాజకుల
సంప్రదాయములు చాటిన, రావణు
డియ్యకొన్నటుల 'ఈతని వాలము
దహియింపుండ'ని తడయక పలికెను.
                  151
ఆ మాటలు విని అసురులు చుట్టిరి
నారలు చీరెలు నా వాలమునకు,
బలముకొలది దుడ్డుల ధట్టించిరి,
పట్టి ఇంగలము పెట్టిరి చివరకు.
                  152
పిడిబందంబుల బిగియగట్టినను,
ముళ్ళుపెట్టి త్రిప్పుళ్ళు పెనచినను,
నొప్పిపుట్ట లే; దెప్పటివలె, లం
కను పట్టపగలు కనుగొనుచుంటిని.
                   153
కాళ్ళును చేతులు కదియగట్టి, వా
లమ్మున కీలలు చిమ్మిరేగ, న
న్నూ రేగించుచు చేరిరి నగర
ద్వారము చెంతకు పౌరులుచూడగ.
                 154-155
అక్కడ అంగము లక్కళించితిని,
బందములూడెను, ద్వారపు దూలము
దూసి, రక్కసుల తూలగొట్టితి, చి
వాలున భవనాట్టాలక మెక్కితి.
               156
మంటలు చిమ్మెడి మామకవాలము
చాచి, త్రిప్పి, పురశాలాట్టాలక
గోపురములను తగుల పెట్టితిని, యు
గాంతానలము ప్రజాళి నేర్చుగతి.

               157-159
లంక నపుడు నలువంకలు చూచితి,
కాలని తావులు కనబడ వాయెను,
సీతయు కాలి నశించి యుండునని
శోకము సై పగ లేక తపించితి.
               160
అప్పుడు వింటిని అమృతాక్షరములు
చారణులాడెడి సంభాషణములు;
కాలిపోయె లంకాపురి సాంతము
కాలలేదు జనకజ విచిత్రమని.
                 161
సిద్ధ చారణులు చెప్పుకొనెడి శుభ
సూక్తులు విని, మునుచూచిన శకు
నములు తలచి, జానకి నష్టము కా
లేదని యూరడిలితి మానసమున.
                162
మండుచు నున్నది మామకవాలము,
కాక సుంత తాకదు నా మేనికి,
కమ్మని వాసన చిమ్మె తెమ్మెరలు,
తహతహలాడక తనివోయెను హృది.
                 163
ఇష్టార్థములుగ ఎడనెడ తోచిన
దృష్టాంతములు స్మరించుచు, ఫలకా
రణములైన ఋషిగణముల వాక్కులు
సంభావింపుచు సంతోషించితి.
               164
క్రమ్మఱ సీతను కన్ను లార గని,
ఆమె యనుజ్ఞను ఆశీస్సులు గొని,
మిమ్ముల చూచు తమిన్ ప్రయాణమై
ఎగసి, అరిష్ట గిరీంద్రము నెక్కితి.

                 165
సూర్యచంద్రులు, ఋషులు, సిద్ధులు, గం
ధర్వులు, మరుతులు, తారాడెడి తా
రాపథమున ధారాళముగా వ
చ్చితి మీవద్దకు కృతకృత్యుడనై .
               166
రాముని గంభీర ప్రభావమున,
మీ స్నేహము బలిమిని, సుగ్రీవుని
పుణ్యంబున, నే పోయిన కార్యము
నిర్వహించితిని నిర్విఘ్నంబుగ.
               167
అచట నేను చేయవలసినది, చే
సిన దంతయు చెప్పితి, నిపు, డే
చేయక మిగిలిన చెయిదము నంతయు
సాంతము చేయ సమర్థులు మీరలు.