శ్రీ సుందరకాండ (రాయప్రోలు సుబ్బారావు)/సర్గ 57
శ్రీ
సుందరకాండ
సర్గ 57
1
తెల్ల కలువ భాతిని శశి, సూర్యుడు
కన్నె లేడివలె, కలహంసలవలె
పుష్య శ్రవణంబులును, పచ్చినా
చువలెన్ మబ్బులు శోభిలు చుండగ.
2
తార పునర్వసు భూరి మీనమయి,
అంగారకుడు మహాగ్రహంబుగాన్ ,
ఐరావతము ప్రియద్వీపంబయి,
స్వాతి హంసవలె సంచరింపగా.
3
గాలియలలు కల్లోల కులముగా,
చంద్ర కిరణములు చల్లని నీళ్ళుగ,
నాగ యక గంధర్వులు పూచిన
కలువలు కమలంబులుగా విలసిల.
4
అంతు కనబడని ఆకాశంబను
పారావారము పాటున దాటెను,
ఓడవోలె వాయుతనూజు, డనా
యాసముగా, అలయక సొలయ కపుడు.
5
మింటిని ముద్దగ మ్రింగుచున్నటుల
చుక్కలరాయని మెక్కుచున్నటుల,
ఆకసమును తారార్క సహితముగ
ఆహరింపుచున్నటు లద్భుతముగ
6
కాలమేఘముల తూలగొట్టుచున్
పోవుచుండెను నభోమార్గంబున,
కపికులోత్తముడు, గంధవహుని త
నూజుడు, హనుమంతుండు సరాసరి.
7
తెలుపులు, కెంపులు, నలుపులు, పసుపులు
వన్నెలు మెరయుచు వారిధరములు ప్ర
కాశించెను ఆకాశమం దపుడు,
గాలిలో మహాకపి ధావింపగ.
8
మాటికి మబ్బులచాటుకు పోవును,
మాటికి తెరలనుదాటి బయల్పడు,
ఒక తఱి మెరయక, ఒక పఱి మెరయుచు
చిందులాడె హరి చందమామవలె.
9
మెలచిన తెల్లని తలపాగాతో
ముంచి తేల్చు మబ్బుల లోపల , హరి,
కనబడి కనబడక , భ్రమించెను వా
నాకాలపు చంద్రముని చందమున.
10
ఆకాశంబున ప్రాకు మేఘముల
చిందర వందర చేసి చీల్చుకొని
బయటికి దుమికెడి పక్షి రాజువలె,
భ్రమలు కొలిపె చూపఱకు మహాకపి.
11-12
కాల్చి లంక , రక్కసుల యుక్కడచి,
ఘోర బలములను కూల్చి, ప్రశంసల
కెక్కి, మైథిలికి మ్రొక్కి ,సముద్రము
దాటుచు సింహధ్వానము చేసెను.
13
మైనాకుని అభిమర్శించి, తరలి
శరవేగంబున చనిచని ముంగల
మేఘ రూపమున మించు మహేంద్రా
చలమును పొడగని సంతోషించెను.
14
మఱికొంచెము ముందరిగి, కుఱంగట
కన్నులారగనె కపి జీమూతము
పోలిన పర్వతమును మహేంద్రమును,
గర్జించె మహోత్కట మోదంబున .
15
కపికులవర్ధను డపు డుత్కంఠను
గర్జింపగ మేఘమువలె, ఆ ధ్వని
దెసలు నిండి వెక్కసమై మిక్కిలి
మాఱుమ్రోగె విడ్డూరపు టెలుగుల.
16
అంతకు పూర్వమె అచ్చట మూగిన
సుహృదుల నాప్తుల చూచి, వేడ్కను కి
లారించెను వాలము నాడించుచు,
వానరకేసరి వాయునందనుడు.
17
గగనమార్గమున గండుమీఱి, హను
మంతుండు గరుత్మంతుని భాతిని
వచ్చుచున్న ఆర్భటమునకు పగిలె
నభము సూర్యమండలముతో నగలి.
18
హనుమను చూచుట కంతకుముందే
వానర వీరులు వచ్చి సముద్రము
ఉత్తర తీరము నోరల గుంపులు
కూడిరి ముచ్చటలాడుచు కేరుచు.
19
అంతన వినబడె అల్ల నల్ల కపి
బలిమి తొడల ఱాపుల చప్పుళ్ళును,
ఉప్పెనరేగిన హోరు గాలిలో
కసరి మేఘములు ఘర్షించిన గతి.
20
హనుమకోస మనుదినము ఎదురు చూ
చుచు తరితీపుల స్రుక్కిన వానరు
లెల్ల మహాకపి యెలు గాలించిరి,
పర్జన్యుని నిజగర్జనంబువలె.
21
ఆ కంఠ స్వరమాలకించి, నలు
వైపుల నుండియు వచ్చిరి వానరు
లందఱు, మిత్రుని హనుమను చూడగ,
సంబరమున ముచ్చటలు పిచ్చటిలె.
22
వానర సత్తముడైన జాంబవం
తు డపుడు సంప్రీతుడయి, అనుచరుల
నందఱిని పిలిచి అంతికంబునకు
అనునయింపుచు ప్రియంబుగ నిట్లనె.
23
సర్వవిధంబుల సాఫల్యము కా
వించె కార్యము కపిప్రవరుడు; కా
కున్న హనుమ యిటు లుత్సాహ జయ
ధ్వానంబులు సలుపడు తథ్యంబిది.
24
ఆతని మాటల నవధరించి, కపి
వీరు తొడలరాపిళ్ళ మ్రోతవిని,
ఎల్ల వానరులు ఉల్లాసముతో
అంతలనంతల గంతులు వేసిరి.
25
ఏఱు దాటిపోయి తిరిగి వచ్చు హ
నుమను ముందుగ కనుంగొను వేడ్కను,
ఎగిరి దుమికి రెల్లెడల వానరులు
కొండల కొమ్మలనుండి యథేచ్ఛగ.
26
పట్టరాని సంబర ముప్పొంగగ,
చెట్ల చెంతలకుచేరి అందఱును
పూల కొమ్మల నుయాలలు ఊచిరి;
చేల చెఱుగులూచెడి చందంబున.
27
కొండ గుహలలో గుబ్బటిలుచు కుం
భించిన వాయువు వెలికెక్కిన గతి;
ఉబ్బి యార్చె కపి యోధాగ్రణి బ్ర
హ్మాండము నిండగ మాఱుమ్రోతలను.
28
గగనము నుండి దిగబడుచున్న ధా
రాధరంబువలె వ్రాలు హనుమ పయి,
చూపు లన్నియును మోపి, తిరంబుగ
ప్రాంజలులై నిలబడిరి వానరులు.
29
బహుళ వేగ సంభ్రమ బలియగు సా
మీరి యపుడు, గిరి మీదను వేఱొక
గిరి వ్రాలిన భంగిని దిగె నిలువున
పచ్చని పాదప పంక్తుల ప్రక్కను.
౩0
హర్ష పూర్ణుడయి హరివీరుడపుడు
తేటలారు సెలయేటినీట ది
గ్గన దుమికెను, ఱెక్కలుతెగ, మిన్నుల
నుండి దొరలిపడు కొండచందమున.
31-32
తోడులేక బహుదూరపు భూములు
వెతుకపోయిన కపిప్రవరుడు క్ర
మ్మఱి కుశలముగా అరుదెంచె ననుచు
ముదిత సుముఖులయి మూగిరి హరికడ.
33
మహనీయుండగు మారుతసూతి, కు
పాయనములుగా పచ్చిదుంపలును,
తీయని పండ్లును తెచ్చి సమర్పిం
చిరి, పూజించిరి, సేవించి రెలమి.
34
అపుడు మహాకపి, అనిలసుతుడు కుల
గురువుల పెద్దలకొలిచి, జాంబవం
తుని దగ్గరి వందనముచేసి, అం
గద కుమారునకు గౌరవము నెఱపె.
35
పూజ్యుడు హనుమను పూజించిరి పె
ద్దలు, భజియించి రితరవానరులును,
అపు డందఱువిన అతిసంగ్రహముగ
పలికె హనుమ 'చూచితి సీత' ననుచు.
36
అంతట హనుమ ప్రియంబున, వాలి కు
మారు నంగదకుమారుని కయి కయి
చేరిచి, చని చని కూరుచుండి రి
ద్దరు నొక్క మనోహర వనతలమున.
37
అచ్చట కూడిన అనుచరు లందఱు
ఆకర్ణింపగ అమితాతురులయి,
వినయముగా పలికెను హనుమంతుడు,
“చూచితి సీత' నశోక వనిక నని.
38-39
ఉపవాసంబుల ఒడలు సన్నగిలె,
ఏక వేణిగా ఇమిడిచె కురులను,
మేనుమాసె, రామధ్యానంబున
కనబడె సతి రక్కసుల కాపుగడ.
40
కనబడ్డది జనకజ యను మాటలు
అమృతమువలె ప్రాణములను తేర్పగ,
అచట కూడిన వనచరు లందఱును
సంతోషించిరి స్వాంతము లందున.
41
సింహనాదములు చేసిరి కొందఱు,
కిలకిలార్భటుల కేరిరి కొందఱు,
అఱచిరి గర్జించిరి మఱికొందఱు,
మాఱు కూయుచును మసలిరి కొందఱు.
42
కొందఱు వానరకుంజరు లుత్సా
హముతో తోకల నాడించిరి, మఱి
కొందఱు తమ లాంగూలములను జా
డించి నేల తాడించుచు తనిసిరి,
43
మఱికొందఱు వానరులు శైలముల
నుండి గభీలున ఊగిదూకి, బుల
పాటము తీరక భద్రగజమువలె
ఉన్న హనుమ మెయి తిన్నగ ముట్టిరి.
44
సీతను దర్శించితినని మారుతి
విశదముగా చెప్పినపిమ్మట, అం
గదుడు పలికెను సగౌరవముగ హరి
వీరులందఱును వినగా ఇట్టుల.
45
అతి విస్తారంబయిన సముద్రము
దాటి, క్రమ్మఱి యథా విధి వచ్చిన
నీకు సాటి కన్పించరు సాహస
బల కౌశలముల వానరాగ్రణీ !
46
జీవిత దాతవు నీవు మాకు, సి
ద్ధార్థుల మైతిమి హరికుల నాయక !
నీ ప్రసాదమున నేడిక రాముని
చూడ గల్గుదుము సుమి ! మో మోడక .
47-48
ఏ మందుము నీ స్వామి భక్తి, నీ
ధృతి వీర్యంబు; లదృష్టము పండగ
రామ పత్ని నారసితివి, ఇక ఇ
క్ష్వాకుని శోకము చల్లారును హరి !
49
అంతట వానరు, లంగద జాంబవ
దాదు లందఱును, హనుమ సముద్రము
దాటిన కథనంతయు విను వేడ్కను,
కూర్చుండిరి గిరకూట శిలలపయి.
50
లంకను చొచ్చుట, లంకలోన రా
వణు నీక్షించుట, వైదేహిని ద
ర్శించుట వినవలచిన కపులును, దో
సిళ్ళుపట్టి నిలిచిరి హనుమ యెదుట.
51
కీర్తనీయుడు, సుకృతి, యశస్వి, హను
మయును అంగదకుమారుండును బా
హువులు కలుపుకొనియుండ, మహేంద్రము
రాణించె నపూర్వ ప్రాభవమున.