శ్రీ సుందరకాండ (రాయప్రోలు సుబ్బారావు)/సర్గ 56
శ్రీ
సుందరకాండ
సర్గ 56
1
జొంపమయిన శింశుప క్రిందనె కూ
ర్చున్న మైథిలికి చుట్టును తిరిగి, న
మస్కరించి కపి 'మాతరొ ! కసుకం
దక నిలిచితి విది నాసుకృతంబగు.'
2
తిరుగు ప్రయాణపు త్వరలోనున్న, హ
రీంద్రుని పొరిపొరి వీక్షింపుచు వై
దేహిపలికె భర్తృస్నేహము తొల
కాడుచున్న హృదయముతో తిన్నగ.
3
పరవీరాంతక ! ప్రారంభించిన
కార్య, మవిఘ్నముగా తీర్చిన శూ
రుండవు నీవొక్కండవె, మారుతి!
నీ బలము పురాణించు యశముతో,
4
శరఘాతలతో సంకులముగ రిపు
రాక్షస బలమర్దనము సలిపి, నను
కొనిపోవుట కాకుత్థ్సున కొప్పును,
అది రాముని శౌర్యమునకున్ తగును.
5
ఆహవ శూరుం డయిన మహాత్ముని
రఘురాముని విక్రమ విఖ్యాతికి
తగిన కార్యసాధక విధానమును
ఉపదేశింపుము కపి కంఠీరవ !
6
సీత యట్టుల సహేతుకంబుగా
పలికిన సార్థక వచనము లన్నియు,
అవధానముతో ఆకళించి బదు
లాడెను వానరచూడామణి యిటు.
7
దేవి ! యేమిటికి దిగులున పొగిలెదు,
వానర భల్లుక సేనలతో శీ
ఘ్రమె వచ్చును రాఘవుడు, రాక్షసుల
చెండాడును నీ చెఱలను తీర్చును.
8
ఇట్టుల వైదేహి మనో వేదన
లుపశమింపగా ఊరటలాడి, మ
హా కపి తిరుగు ప్రయాణ బుద్ధితో,
ప్రణతుడై ప్రదక్షిణ మొనరించెను.
9
స్వామి దర్సనోత్సాహదోహదము
వేగిరింప కపివీరాగ్రేసరి,
ఒక్క ఊపున మహోన్నతమైన అ
రిష్ట పర్వతము శృంగము నెక్కెను.
10
తుంగ పద్మక ద్రుమ వనరాజీ
రంజితమై పర్వతము కనంబడె,
శిఖరంబుల అంచెల మేఘంబులు
వల్లె వాటువలె వాలుచునుండగ.
11
సూర్యుని శుభకర చుంబన సుఖమున
కనబడె గిరి మేల్కొనుచున్నట్టుల,
పగులువాఱిన మెఱుగురాళ్ళును ఱె
ప్పలు తెఱచెడి కన్నులవలె శోభిల.
12
ఏటవాలయిన యేటినీళ్ళ చ
ప్పుడు వేదము చదివెడి శ్రుతి నెనయగ,
కొండసొనలు గునగున ప్రవహించెను
బాలగీతములు పాడుచున్నటుల.
13
దివి కెగబ్రాకిన దేవ దారువులు,
ఊర్ధ్వ బాహు ముఖ యోగము నెఱుపగ,
ఘూర్ణిలిపడు వాగుల రొద వినబడె,
దేవనగము వాపోవు చున్నటుల,
14
బీళ్ళను నల్లని ఱెల్లు పొద లులికి
ఊగులాడె, వాతోద్ధూతాగ్రము
లయిన వెదురు పొదలన్నివైపులను,
కుసులుచున్నగతి కుయికుయిలాడెను.
15
అలిగి కలగి పుట్టలు వెడలిన పా
ముల బుసబుస లూర్పులవలె నెగసెను,
మంచు పేరి కుంభించిన గుహలును
ధ్యాన స్తిమితము లయి నట్లుండెను.
16
కాళ్ళు దిగిన మేఘముల బోని గు
ట్టల తోడ గిరి నడచిపోవు గతి
అగపడు చుండగ, నగశిఖరంబులు
వినువీధిని జృంభించున ట్లెసగె..
17
అంతరంతరము లందొప్పెను కం
దరము లనేకము గిరిసానువులను;
సాలసాలములు తాళతరులు, ప
చ్చని వేణు నికుంజములు పుంజుకొన,
18
పూచిన తీగెల పొదల నందమయి,
పలుజాతుల మృగముల మందల సుం
దరమయి, నానా ధాతు రాగములు
చిందు శిలలతో కందళించె గిరి.
19
త్రుళ్ళి పాఱు సెలయేళ్ళ చాళ్ళతో,
తళుకుఱాళ్ళ పడకలతో సొంపయి,
యక్షకిన్నర మహర్షి నాగ గం
ధర్వ గణములు సదాసేవింపగ.
20
కందమూలఫల కామవృక్షములు,
క్రిక్కిరిసిన తీగెల పొదరిండ్లును,
మృగరాజులు విహరించు వాటములు,
చాఱల మెకములు తారు చదరములు.
21
బహుశోభలతో భాసిలుచున్న అ
రిష్ట పర్వతవరేణ్యము నెక్కెను,
రాఘవ దర్శన రాగ లాలసుడు,
పవనసుతుండు, ప్లవంగవతంసుడు.
22
రమ్యములగు పర్వతము లోయలను,
పగిలి తున్కలయి పాషాణంబులు
అగలి, పెకలి, నలినలిగా, నలిగి,
చూర్ణము లాయెను సున్ని పిండివలె.
23
ఉత్తరతీరము నుజ్జగించి, ద
క్షిణపారంబును చేరుటకయి, పెం
చెను దేహమునంతన హనుమంతుడు,
లవణార్ణవమును లంఘించెడు త్వర.
24
ఆ పర్వత శిఖరాగ్రమున నిలిచి,
అవలోకించె మహాకపి క్రమ్మఱ,
పాములతో చేపలతో త్రుళ్ళుచు
అతిభయంకరంబయిన సాగరము.
25-26
అంతన ఎగసెను హనుమ దక్షిణపు
దిక్కువిడిచి, ఉదీచిని దిగుటకు,
కాళ్ళత్రొక్కిడికి కెళ్ళగిల్లె గిరి,
భీతిలి మూల్గెను భూతగణంబులు.
27
హనుమ తొడల యూపునకు తల్ల డిలి
రాలిన పువ్వుల సాలంబులతో,
కంపించిన శృంగంబులతో, వ
జ్రాయుధ హతమైనట్లు వడకె గిరి,
28
కందరములలో కంఠీరవములు
కలగి కినిసి దిగ్భ్రమ గర్జింపగ,
విన వచ్చె త దాభీలధ్వని, ఆ
కాశము బ్రద్దలుగా పగిలిన గతి.
29
చీరలు జాఱగ, హార భూషణము
లల్లాడగ, విద్యాధరాంగనలు,
భీతి చెంది పృథ్వీతలము విడిచి
గగన వీధులకు ఎగసిరి బిరబిర.
30
బలసిన పాములు బిలముల లోపల
మెడలు తలలు త్రొక్కుడులకు నలిగిన
కసరి విసపు నాల్కలు క్రోయుచు వెస
చుట్టలు విప్పుచు చురచుర వెడలెను.
31
హనుమ పాదపీడన కరిష్ట గిరి
కంపించి కదల, గంధర్వులు, వి
ద్యాధర పన్నగ యక్షకిన్నరులు,
నేలవిడిచి వడి నింగికి తరలిరి.
32
చూడ సొంపుగా శోభిలుచున్న అ
రిష్టశైలము హరిబలిష్ఠ చరణ
ఘాతకు పాదులు కదల, చెట్లతో
సడలి క్రుంగెను రసాతలంబునకు.
33
పొడవున పదియామడ, లెత్తున ము
ప్పదియామడ లొప్పగ, విఖ్యాతం
బయిన అరిష్ట మహామహీధరము,
నేలమట్టమై నిలువున దిగబడె,
34
పోటుపాటులకు పొంగుచు క్రుంగుచు,
కల్లోలంబులు గట్లుతన్న, ఘూ
ర్ణిల్లు వార్ధిని తరించు పూన్కి, కు
ప్పించి యెగసె వినువీధికంత కపి.