శ్రీ సుందరకాండ (రాయప్రోలు సుబ్బారావు)/సర్గ 55

వికీసోర్స్ నుండి

శ్రీ

సుందరకాండ

సర్గ 55


                    1
లంక నాల్గు మూలలు దహించి, చ
ల్లార్చి సముద్ర జలంబుల తోకను;
కాలగ సర్వము, కాతరులై దా
నవులున్న మహా నగర రాజమును.
                    2-3
చూచెను, తోడనె క్షోభలెత్త, అను
తాప తప్తుడయి తన్ను తాను నిం
దించు కొనుచు భీతిల్లె మహా కపి,
ఏల చేసితిని ఇది అకార్యమని.
                    4
రెప రెపలాడుచు రేగిన నిప్పును
చల్లని నీటను చల్లార్చు పగిది,
పొడిచిన కోపము బుద్ధి కోశమున
అణచి పెట్టెడి మహాత్ములు ధన్యులు.
                    5
కోపి చేయడే క్రూర కర్మమును?
గురువు నైన వెనుకొనక వధించును,
తూలనాడు క్రుద్ధుడు దుర్భాషల
సాధు జనములను సైతము తడయక .


                    6
ఇది అన వచ్చును ఇది అనరా దని
అంజాయింపడు ఆగ్రహ వివశుడు;
అదుపు మీఱి చేయని అకార్యమును,
పలుక కూడని అవాచ్యము నుండదు.
                   7
ఎడద సుడింబడ మిడిసిన క్రోధము,
ముదిసిన కుబుసంబును సర్పమువలె;
సహనముతోడ విసర్జించు నెవడు
ఆతడె పురుషుం డని చెప్పందగు.
                   8
సీతయున్నదని చింతింపక లం
కను సాంతముగా కాల్చితి నిస్సీ !
స్వామి ద్రోహము సలిపితి, పాపిని,
దుర్బుద్ధిని, ఎందుకు నా బ్రతు కిక !
                   9
ఎపుడు లంకను దహించితి సర్వము
అపుడె జానకి లయంబయి యుండును,
స్వామి కార్యమును భగ్నము చేసితి
దూర మరయ, కవిచార బుద్ధినయి.
                  10
ఎందుకోసమయి ఈ ప్రయాస కొడి
గట్టితి,అది విఘ్నంబయి పోయెను;
కాల్చినాడ లంకను పూర్తిగ సీ
తా రక్షణమును తలచక పోతిని.
                  11
సాధించిన పని స్వల్పం బయినది
అందుకు సందేహము లే దింతయు,
రావణు మీది దురంత రోషమున,
చేసితి మూలచ్ఛేదము తడయక .


                  12
జానకి దగ్ధంబై నశియించెను,
నిజమది ; కాలక నిలిచిన ప్రాంతమె
కానరాదు లంకాపురమున, భ
స్మమయి పోయినది సర్వ దేశమును.
                  13
నా విపరీత మనః ప్రమాదమున
సీతాదేవి నశించియున్న, నా
ప్రాణత్యాగమె పరిహారం బా
పాతకమున కని భావింతును మది.
                  14
బడబానలమున పడుదునొ, వార్ధిని
దుమికి మునిగి పోదునొ నేనిప్పుడె,
సాగర జలచర జంతు సంతతుల
కన్నముగా దేహము నర్పింతునొ ?
                  15
బ్రతికి యుండి, ఏభ్రష్టముఖముతో
వానరేశ్వరుని వదనము చూతును ?
పులులుబోని నృప పుత్రుల నెటు దా
శరథుల చూతును సర్వఘాతుకుడ.
                  16
రోష దోషమున రోయక అనవ
స్థిత చిత్తుడనయి చేసితి నీ పని,
ముల్లోకములకు వెల్లడించితిని,
చాపల్యము కపి జాతి నై జమని.
                  17
రాజసభావ, మరాజక, మవశము,
ఇస్సీ ! ఇది గర్హితమౌగావుత !
చాలియుండియును జనకర్షి సుతను
సీత నరసి రక్షింపలే నయితి.

సుందరకాండ


                    18
జనకజ గతియించినదని విన్నన్
ప్రాణము విడుతురు రామలక్ష్మణులు,
వారిరువురు చన బంధుసహితముగ
సుగ్రీవుండు అసువులు త్యజించును.
                   19-20
భ్రాతృవత్సలుడు భరతుం డది విని,
శత్రుఘ్నునితో సమయును తోడనె,
ధర్మమార్గ తత్పరు లిక్ష్వాకులు
అస్తమింప ప్రజ లలమటింత్రు వెత.
                   21
ధర్మార్థములు యథాయథలై చెడు,
అటుమీదట నే హతభాగ్యుడనయి,
రోషమున జగద్ద్రోహము చేసిన
దోషపరీతాత్ముడనై నిలుతును.
                   22
అనుచు హనుమ బహుళానుతాపమున
దురపిలుచుండగ, తోచెను క్రమ్మఱ,
పూర్వ నిదర్శనములు, శుభ శకునము
లగపడె ఎడనెడ ఆస లిగుర్పక .
                  23
అదియుగాక, సర్వాంగ సుందరికి
జనక సుతకు రక్షకముగ కల దా
సాధ్వితపస్తేజము; కళ్యాణి న
శింపదు, వహ్ని గ్రసించునె వహ్నిని ?
                 24
ధర్మాత్ము, డనుత్తమతేజోనిధి
యగు రాముని జాయామణి, అనవ
ద్య చరిత, తపస్యావ్రతకవచను,
సీతాదేవిని స్పృశియించునె శిఖి ?


                    25
దహన కర్మమె స్వధర్మ మయిన వ
హ్నియు, నాతోక దహింపక విడిచెను,
అందుకు రాము మహా ప్రభావమును
జనకజ సుకృతంబును కారణములు.
                    26
భరతుం డాదిగ భ్రాతృత్రయమున
కధిదేవత, ఏకైకపత్ని శ్రీ
రామునకు, జనకరాజ ఋషితనయ,
ఆమె నశించునె అగ్నిహుతంబయి ?
                    27
సర్వదహన సంస్కారంబులకును
అవ్యయుడగు ప్రభు వగ్ని హోత్రు; డత
డార్యను,జానకి నంటు నెట్లు ? నా
తోకనె కాల్చడు తాకి మండుచును.
                    28
అనుచు ఇట్టు లూహలను తేలు హను
మంతున కప్పుడు స్మరణకు వచ్చెను,
జలధినడుమ దర్శనమిచ్చిన మై
నాకు,హిరణ్మయనాభుని విషయము.
                    29
తపసుచేత, సత్యంబుచేత, ఏ
కైక భర్తృ చరణార్పిత మతిచే,
పూత చరితయగు సీతయె వహ్నిని
కాల్చు, నాయమను కాల్చలేడు శిఖి.
                    30
ఇట్లు, పావని అనేక విధంబుల
దేవి మహత్వము భావింపుచు నుం
డగ, విన వచ్చెను, గగన మార్గమున
చారణు లాడెడి సంభాషణములు.




           31
అద్భుతం బహో ! హనుమ యిపుడు కా
వించిన దుష్కర భీషణ కృత్యము,
ఆర్పరాని దావాగ్నిని రాక్షస
గృహ మాలికల తగిల్చె ఘోరముగ.
          32
ఆ భీకర దృశ్యమున కదరిపడి
రక్కసు లేడ్చుచు దిక్కులు పట్టిరి
స్త్రీలును శిశువులు; కోలాహలములు
కొండ గుహల మూల్గుల వలె వినబడు.
         33
కాలిపోయె లంక సమస్తము ప్రా
కారాట్టాలక తోరణములతో;
కాలలేదు, రాఘవ సతి జానకి;
ఆశ్చర్యం బిది అద్భుతాద్భుతము.