శ్రీ సుందరకాండ (రాయప్రోలు సుబ్బారావు)/సర్గ 54

వికీసోర్స్ నుండి

శ్రీ

సుందరకాండ

సర్గ : 54

                  1
లంకనట్లు మఱలన్ పరికించుచు,
చేసిన పనికిన్ చిత్తముల్లసిల,
ఉత్సాహముతో ఊహించె మహా
కపి వీరు డపుడు కార్య శేషమును.
                 2
ఉక్కఱి, బెగ్గిలి , పిక్క బలము చూ
పిన యీ రక్కసి పిండము, లింకను
ఉలికి యుడికి గాసిలి తపించుటకు
ఏమి చేయదగు ఇక నాకిచ్చట.
                3
పచ్చని తోటలు పాడు చేసితిని,
మేటి రక్కసుల గీటడగించితి,
సేనలో సగము చెదరగొట్టితిని,
కొదవ యున్న దిక కోటను కూల్చుటె.
                 4
కాలుపెట్ట శక్యంబుకాని ఈ
దుర్గంబును పడద్రోయుట కష్టము,
ఇంచుకంత యత్నించి చూతు నా
శ్రమ సర్వంబును సఫలంబగుటకు.


                    5
నన్ను దహింపక నా లాంగూలము
చివరనె మండెడి చిత్రభానునకు,
ఆహుతి యిచ్చుట న్యాయము నా కిపు
డత్యుత్తమమగు దైత్యుని దుర్గము.
                    6
అని యోచించి మహాకపి తడయక,
మెఱుపుల పాయల మేఘపాళివలె,
జ్వాలామాలల క్రాలు వాలమును
కలయత్రిప్పె లంకా గృహములపయి.
                    7
వాస గృహంబులు, ప్రాసాదంబులు,
ఉద్యానవనము లొక్క టొక్కటిగ
పరికించుచు నిబ్బరముగ తిరిగెను,
లంకలోన మేడల వెన్నులపయి.
                    8
అతివేగమున ప్రహస్తుని సౌధము
కొప్పుపై కెగిరి నిప్పంటించెను,
అగ్నిహోత్రునకు ఆహుతిగా, కా
లాంతక సన్నిభు డనిలనందనుడు.
                    9-15
పార్శ్వమున మహాపార్శ్వుని మేడను,
వజ్రదంష్ట్రుని నివాసము, శుకుని ని
శాంతము, సారణు సౌధ, మింద్రజితు
ఆయతనంబును, అంటించెను శిఖి
                    ?
రశ్మికేతునిలు, హ్రస్వకర్ణ దం
ష్ట్రుల మందిరములు, రోమశ విద్యు
జ్జిహ్వ, మత్త, హస్తిముఖ, దశగ్రీ
వుల, భవనములను తలకొలిపె దహను.


                    15
కుంభనికుంభుల, కుంభకర్ణ మక
రాక్షుల యిండ్లు, కరాళ, శోణితా
క్షుల ప్రాసాదంబులు నంటించెను,
బ్రహ్మశత్రు హర్మ్య సమేతంబుగ,
                    16
వైరియోధుల నివాస భవనములు
క్రమము తప్ప కటు కాలపెట్టుచున్ ,
లంకా నగరి కలంకారముగా
విడిచి పెట్టెను విభీషణు సదనము.
                    17-18
సర్వ సమృద్ధ సుసంపన్నములగు,
రాజమార్గ హర్మ్యములను వరుసగ,
కాల్చుచు, అన్నిటి గడచి దరిసె ర
మ్య మయిన రావణు మణిమయ సౌధము.
                    19
నానా మణిరత్న విభూషితమయి
సుందరమ్మగుచు, మందరమేరు స
మ సమున్నతమయి, మంగళ శోభా
స్పదమగు నా ప్రాసాద తల్లజము.
                    20
ఆ మహారాజ ధామ శిఖరమున
జ్వాల లెగయు తన వాలమును విసరి
నిప్పుపెట్టి, గాండ్రించి అఱచె హరి,
ప్రళయకాల ధారాధరంబువలె.
                    21-22
హనుమ ప్రతిష్ఠించిన హుతాశనుడు,
గంధవహుడు సహకారము నెఱపగ,
రగిలి, మండి, యెఱ్ఱనినాల్క లెగయ
కమియసాగె సాంతముగ సౌధమును.


                    23
కనకంబున చెక్కిన కిటికీలును,
పాలవన్నె ముత్యాల కుచ్చులను,
ఒప్పెడి మేడలు కప్పులు కాలగ
కుప్ప తిప్పలుగ కూలెను నేలను.
                   24
ఎక్కడి వక్కడ ముక్క చెక్కలయి
కేళీ గృహములు కాలి కూలి పడె,
పుణ్యము క్షయమైపోయిన సిద్ధుల
స్వర్గ వాసములు సడలిపడ్డ గతి.
                  25
కాపురపిండ్లను కాపాడుట కు
త్సాహము లేక, వితావిత పరుగిడు
లంకావాసుల సంకుల రవములు
మిక్కటమై దెసలెక్కి పిక్కటిలె.
                  26
కపిరూపముతో కాలాగ్నియె, యిటు
వచ్చె నయోయని వాపోవుచు క్రిం
దపడిరి బాలెంతలు పసిబిడ్డల
ప్రాణంబులు కడపట్ట బిమ్మిటిని.
                   27
మేడల మంటలు మెండుకొన, మఱిగి,
కొప్పులువిడ, గగ్గోలుగ దుమికెడి,
అసురలేమ లపు డగపడిరి, మొగులు
తెగి, రాలిపడు మెఱుగు తీగెలవలె.
                   28
కాలుచున్న గృహజాలమునందలి
కనకరజత ముక్తావిద్రుమవై
దూర్యముల్ కరగి తొరగి, రంగుల ప్ర
వాహములై చూపట్టెను హనుమకు.

                    29
తృణకాష్ఠంబుల తృప్తిని చెందని
అగ్ని చందమున హనుమంతుండును,
తనివోడాయెను దహనుని బలిగా
వ్రేల్చిన రాక్షసవీరుల సమిధల.
                   30
అగ్నిహోత్రమున ఆహుతియైపో
యిన అసురులతోనేని, మహాకపి
కసిమసగిన రాక్షసులతో నేని
ఆపోదాయెను అచలవసుంధర.
                  31
ఎగయుచున్న వహ్నిజ్వాల లగపడె
మోదుగు చిగురుల మాదిరి కొన్నియు ,
శాల్మలీ కుసుమ సరణిని కొన్నియు,
కుంకుమ పువ్వుల వంకను కొన్నియు.
                  32
వేగశాలి కపి వీరుండు , తపో
మహితుడు మారుతి, దహియించెను లం
కాపురమును సాంగముగా; రుద్రుడు
త్రిపురములను పూర్తిగా కాల్చినటుల .
                  33
హనుమ యట్లు చాలన చేసిన వై
శ్వానరుండు లంకానగరీనగ
శిఖరంబులపై చిందులు త్రొక్కుచు
మండ సాగెను ప్రచండ దీప్తులను.
                  34
లయ కాలానల రయమున ఎగయుచు,
గాలి తోడుపడ కీలలు నింగికి,
కూలిన దైత్యుల క్రొవ్వు కరగి, పొగ
లేని మంటలయి లేచె తీండ్రముగ.

                   35
కోటిసూర్యు లొడగూడిన కై వడి,
మండు హుతాశను మంటలు మ్రోగెను
పెళపెళ నార్చుచు, పిడుగులుపడ బ్ర
హ్మాండభాండములు అగలిన చాడ్పున.
                   36
ఆకసమంటెడి అగ్నిజ్వాలలు
మోదుగు పువ్వుల మాదిరి విలసిల,
నల్లకలువ కొండలుపోలె పొగలు,
కాలమేఘముల మాలికలాయెను.
                  37
అపుడందఱు భయమందిరి; కపి కా
డీతడు, యముడో, ఇంద్రుడొ, వరుణుడొ,
రుద్రుండో, అర్కుడొ, కుబేరుడో,
సాక్షాత్కాలుడొ, సర్వనాశకుడొ !
                 38
తాతపాదు డీ జాతజగత్తుకు,
ప్రాణిలోక నిర్మాణవిధాత ఆ
బ్రహ్మ; అతనికోపమె రాక్షస సం
హారమునకు కపి ఆకారముగొనె.
                 39
అవ్యయ, మేక , మనంత, మచింత్యము,
అయిన వైష్ణవ మహా తేజము, రా
క్షస కుల లయమునకై యిటు స్వయముగ
మాయా వానరమై యిటు వచ్చెను.
                 40
ప్రాణి సంఘములు వాస గృహంబులు,
వృక్ష వాటికలు విధ్వంసములై
కాలిన లంకను కనుగొను, చసురులు
వాపోయిరీ వెత లోపలే కెదల.


                   41
రథమాతంగ తురంగంబులతో,
వివిధ పక్షి మృగ వృక్షంబులతో,
కాలాగ్నింబడి కాలిన లంకా
పురి దీనముగా మూల్గుచు ఏడ్చెను.
                  42
అకటా ! తండ్రీ, అయ్యో కొడుకా !
హా కళత్రమా ! హా సుమిత్రమా !
పుణ్యార్జితమగు భోగ జీవితమ !
అని యేడ్చుచు, అల్లాడిరి అసురులు.
                  43
హనుమంతుని కోపాహతి హతమై,
అగ్నిజ్వాలల కాహుతిగా, చా
వగవీరులు వాలగ యోధులు, శా
పము కొట్టినగతి పాడఱె లంకయు.
                  44
దుర్విషాద భయధూతులయిన రా
క్షసులతో హుతాశనుడు దహింపగ,
ఉన్న లంక వాయుసుతు డీక్షించెను;
బ్రహ్మ కోపమున పడిన ధాత్రివలె.
                  45
పచ్చనితోటను పాడుచేసి, రా
క్షసయోధుల నని చక్కడించి, లం
కను కాల్చి, తనివికొనిన చందమున,
ఊరకుండె వాయుతనూజు డపుడు,
                 46
మూడుశిఖరములు మురిపించు త్రికూ
టాద్రిమీద సింహమువలె నున్న మ
హాకపి కనబడె అంశుమాలివలె,
జ్వాల లెగయు తనవాలము కదుపుచు.


                   47
అసురనాయకుల హతముచేసి, వా
రిగృహాంగణములు తగులపెట్టి, పూ
దోటలబడి చెడత్రొక్కి, చేరె శ్రీ
రఘుపతిని మనోరథ యానంబున.
                  48
అంత, దేవగణ మంతయు మిక్కిలి
తుష్టిచెంది ప్రస్తుతు లొనరించెను,
వానర వీర ప్రవరుని,వాయు సు
తుని, మహాబలిష్ఠుని, హనుమంతుని.
                  49
చక్కని తోటను చదును చేసి, ర
క్కసులను రణమున ఉక్కడించి, సుం
దరమగు లంకను దగ్ధము చేసి ప్ర
కాశించె మహాకపి గజరాజము.
                  50
అప్పుడు సిద్ధులు, అమరులు, గంధ
ర్వులు మహర్షు, లటు బూడిదయై పో
యిన లంకానగరిని వీక్షిచుచు,
విస్మయ మందిరి విధిచోద్యంబని.
                  51
ఆ మహానగర హోమము సలిపిన
వానరసత్తము వాయుసుతో త్తము
కాంచి భూతములు కాలానలుడని
విభ్రాంతింబడి విస్మయమందెను.
                  52
సురలును, విద్యాధరులును, ముని పుం
గవులు, కిన్నరులు, గంధర్వు, లఖిల
భూతకోటియు, అపూర్వధీరమగు
హనుమ రూపు కను చానందించిరి.