శ్రీ సుందరకాండ (రాయప్రోలు సుబ్బారావు)/సర్గ 53

వికీసోర్స్ నుండి

శ్రీ

సుందరకాండ

సర్గ 53

                  1
అతని వచనముల నవధరించి విని
దశకంఠుండును తమ్ముని చూచుచు
అడిగె దేశకాలావహితంబుగ,
సంశయ విస్పష్టములగు మాటలు.
                2
రాజులు చంపగరాదు దూతనని
పలికితి వౌనది; పాతకు డీతడు
చావుకాని యొకశాస్తి కావలెను,
దుష్టదండనము శిష్టమతము కద.
                 3
కోతుల కెల్లను ప్రీతిభూషణము
లాంగూలము, తదలంకారంబును
కాల్చివేయు డీక్షణమె, వానరుడు
మొండితోకతో పోవును పొనుపడి.
                4
ఈ శాస్తి వలన ఈతం డంగ వి
రూపవేదనకు క్రుస్సి, బిడియపడ ,
నాలుగువీథుల నగరిని త్రిప్పుడు,
చూతురు దాయలు చుట్టపక్కములు-

                 5-6
ఆ శాసనమును ఆలకించి, రా
క్షసులు క్రోధలాలసులై , చిరిగిన
బట్టలతో పెనబెట్టి చుట్టి క
ట్టిరి గట్టిగ వానరుని వాలమును.
                 7
తోకను పాతలతో చుట్టగ హరి
అంతకంత కాయతముగ పెరిగెను;
అడవి నెండి బెండ్లయిన కట్టెలను
తగిలి రగిలి పొడ వగు అగ్నింబలె.
               8
తడిపి నూనెతో తరువాతను జ్వా
లను తగిలించిరి లాంగూలమునకు;
వెలుగువాలమును విసరె, నసురు లెడ
బడ, బాలార్కముఖుడయి మహాకపి.
                 9
అంతట, హనుమ మహావాలంబున
జ్వాల లెగయగా సంతోషముతో,
చూచు చేగిరి నిశాచరు లిండ్లకు,
స్త్రీలును శిశువులు వృద్ధులు విసవిస.
                 10
పోయిన దైత్యులు పురికొని క్రమ్మరి
తిరిగివచ్చి బంధించిరి వానరు,
తత్కాలానుగతంబుగ హనుమయు
తలపో సెను చిత్తమున నీ పగిది.
                  11
బద్ధుడనై నను బలపాటవములు
కల వీ పాఠంబులను త్రెంచి, పై
కెగసి, రాకుసుల నింతలంతలుగ
చించి, చెండి, చెచ్చెఱ వేటాడగ.

                 12
స్వామిహితార్థము వచ్చితినే, నిట
పట్టిరి నను తమ స్వామి యానతని
వీరును; దీనిని వైరిదౌష్ట్యమని
తలపోయుట యుక్తముకా దనిపించును.
                13
సమరము వచ్చిన చాలుదు దైత్యుల
చక్కాడగ నేనొక్కడనే యిట,
అయినను రాముని ప్రియము కోరి నే
సహియించెద ఈషత్ క్లేశంబును.
                14-15
కోటలోపల దిగునపుడు, నడినిసి
చూడ లేనయితి వీడు సర్వమును,
పరికించెద నీ పగటివేళలను;
తిరుగక తప్పదు మఱల నాకు పురి.
               16-19
నా కిట్టుల బందములు వేసి నా
తోకను తైలముతోడ తడిపి, ని
ప్పంటించినను రవంతేని మనః
క్లేశము తోచుటలేదు నా కిపుడు.
                 ?
చిన్న కోతివలె ఉన్న నన్న చట,
బలవద్వానరు పట్టికట్టితి మ
టంచు కేరి చాటింపుచు త్రిప్పిరి,
లంకాపురి నలువంకల నసురులు.
                20
మిగుల విచిత్రములగు విమానములు,
చాటు మాటయిన సందులు మలుపులు,
వీధులు కలసిన వెడద చదరములు,
పరికింపుచుతో నరిగెను హనుమయు.

                   21
గృహపం క్తులు కిక్కిరిసిన బాటలు,
రథములు తిరిగెడి రాజ మార్గములు,
పెడదారులు, తిరుగుడు త్రోవలబడి,
ఊరేగించిరి చారుడు వీడని.
                22
మేఘము లంటెడు మేడల మిద్దెల,
రాజపథంబుల, రచ్చల హనుమను
చారుడు వీడని చాటింపుచు ఊ
రేగించిరి రాత్రించరు లెసకొని.
                23
భగ భగ మండెడి బారు తోకతో
ఊరేగెడి కపియోధుని చూడగ,
వేడుకపడి త్రోపిళ్ళాడుచు వడి
వచ్చిరి స్త్రీలును బాల రు వృద్ధులు.
                24
వారలలోపల వంకర కన్నుల
అసురులు కొందఱు కసమస పరుగిడి,
సీతాదేవికి చెప్పిరి వేగమె,
హనుమద్వాల దహన దుర్వార్తను.
                25
సీతా ! నాడిట నీతో ముచ్చట
సాగించిన ఆరాగిమూతి కో
తిని పట్టిరి, తోకను నిప్పంటిం
చిరి, త్రిప్పెద రదె పుర వీథులలో,
                26
అతిఘోరములగు ఆ పలుకులు విని
అయిదు ప్రాణములు అవిసిపోయి న
ట్లయి, భగవంతుని హవ్యవాహనుని,
ఆశ్రయించె శోకార్తిని జానకి.

                 27
అతి విపద్భయద మగు నా వేళను
హనుమకు క్షేమము నావహింప, ని
శ్చల మతియై మంగళముఖి జానకి,
ప్రార్థించె మహోజ్వలుని పావకుని.
                28
పతి పరిచర్యల పడసిన పుణ్యము,
చిర తపముల ఆర్జించిన సుకృతము,
ఏకపత్నీత్వ మిచ్చిన సత్వము,
అర్పించెద చల్లారుము పావక !
               29
ధీమతియగు శ్రీరాముని కరుణయు
వర బలమును నా పట్లనున్న, సౌ
భాగ్య శేష మేపాటి మిగిలినను,
ధారపోతు చల్లారుము పావక !
                30
పరమ శీల సంపన్ను రాల నని,
భర్తృ సమాగమ బద్ధ వ్రత నని,
నను ధర్మాత్ముడు నాథుడు నమ్మిన
ప్రార్థింతును చల్లారుము పావక !
                 31
సూనృత వ్రతుడు సుగ్రీవుడు నను
కష్ట సముద్రము గట్టెక్కింపగ
సమకట్టిన యత్నము కొనసాగగ
చల్ల పడుము వైశ్వానర! హరి యెడ.
                 32
జానకి అటు ప్రాంజలి పట్టగ, కపి
వాలజ్వాలలు వాల్చెను శిఖలు, ప్ర
దక్షిణించి సీతకు హనుమత్కుశ
లార్థము చెప్పగ అరుగుచున్నటుల,

                33
హనుమ తండ్రియును తనయుని వాలము
ఎడలిపోవు వహ్నికి అనుగలముగ
విసరె, దేవి మానసము స్తిమిత పడ,
మంచున తడిసిన మాద్రి చల్లగా.
                 34
అపుడు మహాకపి అచ్చెరువందెను,
వాలంబున పావకుడు జ్వలించును,
కాని, తపన తాకదు నన్నెందును,
ఘటము కాల కాగవె ఉదకంబులు !
                35
వెలుగు తీవ్రముగ వీతిహోత్రు, డా
వంతబాధ నా కగుపించదు మెయి,
హాయిగ నున్నది ఆయత వాలము,
చల్లని జలములు చల్లిన చాయను.
              36
పారములేని గభీర సాగరము
దాటుచున్నపుడు దర్శన మిచ్చెను
మైనాకుడు; రామ ప్రభావమది,
సాగరమందున శైలము లేచుట.
             37
అట్లు, సముద్రుడు, నచలేంద్రుండును
రాముని కార్యార్థము తత్పరులై
సంభ్రమించి, రిక స్వాహావల్లభు
డేమి చేయడీ యిష్టకార్యమున.
             38
సీతాసుకృత విశేషబలంబును,
రాముని నిజ తేజోమహిమయు, నా
జనకుని స్నేహంబును యోగింపగ ,
నను దహింపపూనడు హుతాశనుడు.

               39-40
అని భావించి మహాకపి, ఆర్చుచు
వడినెగసె పురద్వారము మీదికి
ముసముస మసలెడి అసురులతో, బహు
గృహములతో కిక్కిరిసి యున్న యెడ.
                  41
అచట నిలిచి కొండంతయి, వెంటనె
చిన్న పిట్టవలె సన్నగిల్ల , రా
క్షసులు బిగించినకట్లు తమంతట
సళ్ళి జాఱిపడ సాగెను హనుమను.
                   42
బందంబులు విడివడి దిగజాఱిన
వెంటనె మారుతి పెద్దకొండవలె
పైకిపెరిగి, ఆ ద్వారబంధ మం
దడ్డ దూలమును అటునిటు చూచెను.
                    43
ఇనుము పోతపోసిన ఆ నల్లని
పెద్ద దూలమును పెల్ల గించి, నగ
రద్వార మహోరాత్రంబులు కా
వలి కాచెడి దైత్యుల పడమొ త్తెను.
                   44
రణచండ పరాక్రమశాలి హనుమ,
అసురుల నటు హతమార్చి, మండువా
లముతో కనబడె లంకను చూచుచు,
కిరణ హారియగు తరణి కరణి యట.

6-7-1967