శ్రీ సుందరకాండ (రాయప్రోలు సుబ్బారావు)/సర్గ 44

వికీసోర్స్ నుండి

శ్రీ

సుందరకాండ

సర్గ 44


1
అచ్చట రావణు డా దేశింపగ,
జంబుమాలి, బలశాలి, ప్రహస్తుని
తనయుడు తన కోదండముగొని, వెడ
లెను, నిడుకోరలు కనకనలాడగ.
2
రణముల గెలువగరాని ప్రచండుడు,
రక్తవస్త్రములు రక్తమాల్యములు
తాల్చి, కర్ణముల ధగధగలాడగ
కుండలములు, తిరుగుళ్ళుపడ కనులు.
3
అందముగా మెఱయగ ఆయుధములు,
ఇంద్రుధనువువలె ఇంపగు తనవి
ల్లెత్తి, నారి బిగియించి, టంకరిం
చెను పిడుగులు కురిసినగతి మ్రోయగ,
4
ఆ కోదండ జ్యాఘోషమునకు
దిక్కులన్నియును దిమ్మరపోయెను,
ఆకాశంబున కేక లెలుగు లిడె,
చలియించె చరాచర చక్రంబును ,


5
పోతు గాడిదెలు పూన్చిన రథమును
ఎక్కి ప్రహస్తసుతు డేగుదెంచ, హ
ర్షించెను, గర్జించెను వియఝ్ఝరీ
వేగశాలి కపివీరు డుత్సుకత.
6
ద్వారము ముందట తోరణంబు పై
కూరుచున్న కపి కుంజరు నంతట,
జంబుమాలి తీక్షణములైన తన
క్రూరశరంబుల కొట్టెను గట్టిగ,
7
కొడవలి వంపుల కోలల శిరసును,
చెవి మడతలు మలచిన నా రసముల
ముఖమును, పదియమ్ములతో బుజములు
క్రువ్వ నేసె మారుతిని రాక్షసుడు.
8
వాడిబాణముల గాడి గంట్లుపడి
నెత్తురు చిమ్ము వనేచరు వదనము,
భాసించె శరద్వాసర పద్మము
అరుణుని కిరణము లొరయుచున్నటుల.
9
సహజారుణమగు సామీరి ముఖము
రక్తసిక్త దుర్లలిత మాయె నా
కసమున; ఎఱ్ఱని గంధబిందువులు
పై పడిన మహాపద్మము భాతిని.
10
రాక్షసు శరములు ఱక్కిన మారుతి
కోపావేశము గుబ్బటిల్లగా,
కలయచూచి చెంగట లక్షించెను,
నల్లని పాషాణపు బండ నొకటి.


11
ఆ పాషాణము లేపియె త్తి, రా
క్షసునిమీద పడవిసరె మహాకపి,
దానవు డాగ్రహమూని దాని ఖం
డించె ననేక కఠినమార్గణముల.
12
జంబుమాలి పాషాణ మగల్చిన
కాంచి హనుమ ప్రగాఢబలంబున
పట్టిపెకల్చి ఉపద్రవముగ త్రి
ప్పి విడిచెను మహావృక్షము నొక్కటి.
13
సాలవృక్షము సమూలము గిరగిర
త్రిప్పుచున్న బలదీప్తుని హనుమను
చూచి నిశాచరశూరుడు తెంపున
గుప్పించె శతక్రూర శరములను.
14
నాల్గుబాణముల నఱికెను చెట్టును,
ఐదుశరంబుల బాదె భుజములను,
ఒక నారసమున ఉత్తమాంగమును
పదియలుంగులను వక్షము నేసెను.
15-16
ఉక్కుటమ్ము లటు పెక్కు లొక్కపరి,
తాకిన నొచ్చి ఉదగ్రరోషమున
మ్రోలనున్న పెనుదూల మెత్తి, హరి
జంబు మాలి వక్షంబును మొత్తెను.
17
అంత నసురనాయకు నాకారము
శిరసులేక, కరచరణములు లేక ,
ధనువు లేక , స్యందనములేక, గు
ఱ్ఱములులేక బాణములులేక పడె.



          18
హనుమంతుని తాడనలకు హతమై ,
జంబుమాలి బలశాలి నేలబడ,
అతని మేని నానాభరణంబులు,
పొడిపొడియై నలుమూలల చెదరెను.
          19
కింకర సైన్యము ఖిలమై పోవుట,
జంబుమాలి బలశాలి కూలుటయు,
తెలియ, రావణుడు తెకతెక నుడుకుచు,
క్రుద్ధు డాయె కనుకోన లెఱ్ఱపడ.
          20
రోషముతో గిఱ్ఱున ఘూర్ణిల్లగ
కనులు, ప్రహస్త సుతుని మరణము విని,
అతివిక్రమ వీర్యప్రతిష్ఠులగు,
సచివకుమారుల సందేశించెను.

10 - 6 - 1967