శ్రీ సుందరకాండ (రాయప్రోలు సుబ్బారావు)/సర్గ 43

వికీసోర్స్ నుండి

శ్రీ

సుందరకాండ

సర్గ 43


1
హనుమ కింకరుల నటు తెగటారిచి,
ధ్యాన స్తిమితుండయి చింతించెను,
మట్టము చేసితి మంగళవనమును
తాకనైతి చైత్యప్రాసాదము.
2
తోటవలెనె యీ మేటి సౌధమును
సైతము సాంతము చదును చేసెదను,
అని తలపోయుచు అనిల సుతుడు తన
బలము చూపు సంభ్రమమున పురికొని.
3-4
మేరుశృంగముల మేరమీఱు ఆ
మేడమీదికి దుమికి కూర్చుండెను
హనుమానుడు, జగతిని ఉదయించిన
రెండవ భగవానుండు సూర్యుడన .
5
కదలింపగ శక్యంబుకాని చై
త్యప్రాసాదము అడుగంట కుదిపి,
జయలక్ష్మీ లాంఛనుడై వెలిగెను;
పారియాత్ర పర్వత సమప్రభల.


6-7
కాయము పెంచి స్వకీయ మహిమచే,
దండ చఱచె హరి, దద్దరిల్లె లం
కాపురి, పక్షులు గలగల రాలెను,
కావలివారలు కళవళ మందిరి.
8
జయము ! రాఘవుని శస్త్రాస్త్రములకు,
జయము ! లక్ష్మణస్వామి బాహులకు,
జయము ! రామవాత్సల్య లాలితుం
డగు సుగ్రీవ మహానుభావునకు.
9
ధర్మకర్మ పరతంత్ర చరితుడగు
కోసలేంద్రునకు దాసదాసుడను,
వైరి హంతకుడ, మారుతాత్మజుడ,
హనుమంతుడ విఖ్యాతనామకుడ.
10
పదివందల రావణు లెదిర్చినను
మోకరించి పడమొత్తుదు రణమున
పిడుగురాళ్ళతో సుడివడ కొట్టుదు
కండలు పెరుకుదు కాళ్ళగోళ్ళతో.
11
లంకగడ్డ మూలము లగల్చి, సీ
తకెఱగి, అభివాదములు సలిపి,రా
క్షసలోక సమక్షంబున నేగెద,
ఇష్టార్థము ఫలియింప సమృద్ధిగ.
12
అని యార్చుచు చైత్యప్రాసాదము
మీద నిలిచి సామీరి అసురులకు
భీతిగొలుప నిర్ఘాతపాత ని
స్సాణ ఘోరముగ ఝంకారించెను.


13
ఆ ప్రళయ ధ్వని, కలిగి లేచి ప్రా
సాదరక్షకులు శతసహస్రములు,
బల్లెము, లీటెలు, బరిసెలు బాణము
లూని వాయుసుతు నుధ్ధతి మూగిరి.
14
ఇనుపకట్లు బిగియించిన గుదియల,
బెట్టిదంబులగు బిరుసుదండముల,
భానుజ్వాలలు బోని బాణముల,
గట్టిగ కొట్టిరి కపి యూధపమును.
15
నలుగడలను దానవసైన్యంబులు
త్రుళ్ళి కవియ, మారుతితోచె నడుమ;
గంగావాహిని పొంగిన వెల్లువ
నడుమ ఘూర్ణిలెడి సుడిగుండమువలె.
16
అది గని హనుమయు, ఆగ్రహించి, చై
త్యప్రాసాదాంతరమున ఒక బం
గారు దూలము పెకల్చి, త్రిప్పె నూ
ఱంచుల ధారలు మించ మంటలయి.
17-18
స్తంభము త్రిప్ప, ప్రచండ కర్షణకు
ఎసకమెసంగిన యింగలములతో
తగులబడెను చైత్యప్రాసాదము
చూచు రక్కసుల నేచి వధించెను.
19
వీరావేశము వెక్కసింప, ఇం
ద్రుడు తన కులిశముతోబలె, దైత్యుల
తూలగొట్టి తుత్తునియలుగా, ఆ
కాశ మెక్కి, ఆగడముగ నిట్లనె.


20-21
ననుబోలిన వానరులు బలిష్ఠులు,
సుగ్రీవాజ్ఞల చొప్పున పెక్కురు,
ధరణీతల మంతటను తిరిగెదరు;
వారలలో అల్పజ్ఞుడ హనుమను.
22
పదియేనుంగుల బలముగల ఘనులు,
వారికంటె పదివంతు లధిక బలి
ష్ఠులు, వేయిగజంబుల బీరముగల
వార లనేకులు వానర వీరులు.
23-24
ప్రవహించు నదీరయమును, వాయు బ
లంబును కలిగిన లాంగూలధరులు,
గోళ్ళును కోరలు క్రూరాయుధములు
గా వత్తురు సుగ్రీవుని పనుపున.
25
వారందఱు మిము పట్టిచీల్చి చెం
డాడెద, రిక మీరగపడ, రుండరు,
మీ రావణు డడగారు లంకతో;
కాకుత్థ్సులతో కలహఫలం బిది.

6 - 6 - 1967