శ్రీ సుందరకాండ (రాయప్రోలు సుబ్బారావు)/సర్గ 45
శ్రీ
సుందరకాండ
సర్గ 45
1
దానవ రాజాజ్ఞానియుక్తులయి
వహ్నిజ్వాలలవలె దీపించుచు
మంత్రి పుత్రు, లసమాను, లేడుగురు
సదనము లెడలిరి కదనము వేడ్కను.
2
అస్త్రశస్త్రవిదు, లమిత బలిష్ఠులు,
ఖ్యాతిగన్న విలుకాండ్రు, పరస్పర
జయకాంక్షామత్సరు, లపార సే
నాబలాంగ సన్నాహు లందఱును.
3
బంగరు మోకులు బంధించిన స్తం
భాలమీద జెండాలు భ్రమింపగ,
పారసీకములు పన్నిన రథములు
మేఘగర్జనల మించి రటింపగ.
4
దృఢపరాక్రమ ధురీణులు, మంత్రి త
నూజులు కనకధనుస్సులు పొరిపొరి
మ్రోయింపుచు, తనివోయి కనబడిరి;
మెఱుపుల నుఱుముల మేఘంబులవలె.
5
ఆ వీరుల కడుపార కన్నత
ల్లులు, చుట్టము, లిష్టులు నప్పుడు భయ
శంకితులై అలజడిబడి కలగిరి,
కింకరవధ కథ కెలక మనసులను.
6
ఒకరి నొకరు త్రోసికొనుచు మంత్రికు
మారులు వెడలిరి తోరణంబుపై
కూరుచున్న కపికుంజరు మీదికి,
కరగ రాపిడికి కాంచనభూషలు.
7
శరపాతంబులు జలధారలుగా,
రథరటనము గర్జా ఘోషముగా,
బోరున కురిసెడి కారు మేఘముల
మాదిరి వ్రాలిరి మంత్రికుమారులు.
8
తెఱపిలేని బహుశరధారలలో
తెప్పతేలు కపి తీరు కనబడెను,
ప్రళయ మేఘముల వానముసురు లో
పల మునుగుపడిన పర్వతంబువలె.
9
జడిగొని కురిసెడి శరపాతంబును.
దిరదిర తిరిగెడి తేరుల వడియును
వ్యర్థము చేసెను హనుమ, భ్రమింప చే
యుచు నక్కుచు నిక్కుచు వినువీథుల,
10
ధనువులు ధగధగమన పెనగు కుమా
రుల లోపల మారుతి చూపట్టెను,
మెఱయు మబ్బులను చెరగి చెంగనా
లాడు వాయువు మహా ప్రభువువలె.
11
సచివకుమారులు సగ్గిమగ్గి గ
గ్గోలుపడ, కెరలి, కొఱలి, బిట్టఱచి,
విక్రమించె వేవేగ హనుమ దు
ర్వార శత్రుబలవాహిని మీదికి.
12
అఱకాలను కొందఱ తన్నెను, పా
దములతోడ కొందఱిని తాచెను, పి
డికిట కొందఱ పొడిచెను, కొందఱిని
చీల్చే గోళ్ళతో చియ్యలు వ్రయ్యగ.
13
ఱొమ్ముల కొందఱ గ్రుద్దెను, కొందఱ
తొడల నడుమ పచ్చడిగా మెదిపెను,
కొందఱు కుప్పలు కూలిరి హనుమ ప్ర
చండ ధ్వనులకు గుండెలు పగులగ,
14
సచివపుత్రు లవసానమంద నటు,
చావక మిగిలిన సైన్యము లదవద
బెదరి ఆర్తులయి పదిదిక్కులను ప
లాయితులైరి యథాయథ లగుచును.
15
ఏన్గులు తొండము లెత్తి యేడిచెను,
గుఱ్ఱములు బెగడి గుదిగొని కూలెను,
విఱిగిన ధ్వజములు చిరిగిన ఛత్రప
తాకల తోడ రథాలు బోర్లపడె.
16
నెత్తురు కాల్వలు నిండుగ పాఱెను,
దండుబాట లంతటను గండ్లుపడె,
రూపుమాసి లంకాపురము భయ
క్షోభారవముల కుతకుత ఉడికెను,
17
చండపరాక్రమశాలి మహాకపి,
మంత్రికుమారుల మట్టుపెట్టి, యటు
పునరాహవ సంమోహ కాంక్షతో,
తోరణాంచలము నారోహించెను.