శ్రీ సుందరకాండ (రాయప్రోలు సుబ్బారావు)/సర్గ 37

వికీసోర్స్ నుండి

శ్రీ

సుందరకాండ

సర్గ 37


1
హనుమ వచనములు విని ధర్మార్థం
బుల నిటు లడిగెను పూర్ణ చంద్రముఖి,
కపివర ! నీ వాక్యము లమృతములో
విషమును కలిపిన విధమున నున్నవి.
2
ఇతరాసక్తుల నెఱుగక రాముడు
ధ్యానపరాయణు డాయెనంటి, నా
విరహశోకమున వికలు డాయె నం
టివి వెంటనె, పొసగవుగద రెండును.
3
అతి విస్తరమగు ఐశ్వర్యంబున,
కడు దారుణమగు కష్ట దైన్యమున,
పెనుపాశంబులు బిగిచి మానవుల
లాగును దైవ మధోగతి నంటగ.
4
విధి చెయిదము తప్పింపగరానిది
ప్రాణుల కెల్లను; రాముండును, ల
క్ష్మణుడును నేనును మ్రగ్గెద మార్తిని
గతి మోక్షంబులు గానరాని వెత !


5
నడిసముద్రమున నావ పగిలిపోన్
నీళ్ళలోనబడి, సుళ్ళు గుండములు
ముంచి తేల్చ శోషించు రాఘవుడు,
గడచి యెప్పటికి గట్టెక్కునొ గద.
6
రక్కసిమూకల నుక్కడించి, పా
పిష్ఠి రావణుని పిలుకుమార్చి, లం
కాపట్టణము పెకల్చి, విజయుడై
నను చూచునొ యెన్నడు నా నాథుడు ?
7
వేగిరింపుమని విభునితో నివే
దింపుము వానర తిలకమ ! నా ఆ
యుష్కాలం బిక ఒక్క వత్సరమె ;
పిదప నేను జీవింపను సత్యము.
8
జాలి యెఱుగని నిశాచర నాథుడు
ఒక్క యేడు గడువొసగె; దానిలో
పదినెల లాయెను ఇదివఱకె హరీ !
మిగిలియున్నవి సుమీ రెండు నెలలె.
9
నన్ను పంపు యత్నముచేసె విభీ
పణు, డాతని అనుజన్ముడు పలుమఱు,
మనవిచేసి, బ్రతిమాలి, భంగపడె;
మాఱదు రాక్షసు క్రూరమానసము.
10
దుష్టుడు రావణు డిష్టపడడు తా
ముచ్చిలించినది యిచ్చివేయుటకు,
వెదకులాడుచున్నది మృత్యువు రణ
ముఖమున కాలము మూడెను వీనికి.


11
నల పేరిటి కన్యక, విభీషణుని
పెద్దకూతు; రా పిల్ల స్వయముగా
తల్లి పంప, నా దరికి వచ్చి, యీ
వృత్తాంతము వినిపించె నొంటరిగ.
12
ధృతిమంతుడు, కులవృద్ధుడు, మేధా
వి, వినయశీలుడు, విద్వాంసుడు, రా
వణున కిష్టు, డనవద్యు ; డవింధ్యుడు
కృతాకృత్యము లెఱిగిన హితవరి.
13
ఆతడు రాగల అవిధిని పొడగని
రామునితో వైరము రాక్షసకుల
నాశమూలమని నాటగచెప్పెను,
విహిత వాక్యములు వినడు దురాత్ముడు.
14
తలపోయుదు, హరితల్లజ ! నా మది
ప్రాణేశుడు సత్వరమె కలియునని,
అంతరాత్మయును అతిశుద్ధముగా
నున్నది, గుణసంపన్నుడు రాముడు.
15
పౌరుషమును, చేవయు, ప్రభావమును,
మెత్తని చిత్తము, మిత్ర కృతజ్ఞత,
శక్తి విక్రమోత్సాహములు కలవు,
వలసినన్ని రఘువంశ సోమునకు.
16
పదునాలుగు వేల దనుజగణమును,
అనుజుడు సై తము అండలేనియెడ,
చెండాడెను రాముం డొక్కడె హరి !
అతనికి వెఱువని అరికుల మున్నదె?


17
ఆబోతుంబలె అతిబలిష్ఠుడగు
రాఘవు డే వ్యసనాఘాతములను
ఇంత చలింపడు, ఎఱుగుదు నే నది,
దేవేంద్రు శచీదేవి విధంబున.
18
రాముని శరధారాపాతము మా
ర్తాండు నిదాఘాతపమై మండగ,
వైరి రాక్షసుల వాహినీజలము
లాఱి, యింకి, అడుగంటి హరించును.
19
ఇట్లు సీత యేమేమో వదరుచు
భర్తృవిరహతాపము సెలలెత్తగ,
కనుల నశ్రువులు కార్చుచు నిలబడె,
వానరు డంతట వైదేహిని గని.
20
పలికె నిట్టుల, తపస్విని ! రాముడు
నీ వేదనలు వినిన యంతనె కపి
భల్లూకచమూ బలములతో శ్రీ
ఘ్రమె వచ్చును లంకకు శంకింపకు.
21
కాదంటివొ రాకాచంద్రముఖీ !
తప్పించెద నిన్నిప్పుడె దైత్యుల
నరకయాతనల నడుమనుండి, నా
వెన్ను పలకపయి వేంచేయుము వెస.
22
వేల్పు ముడుపువలె వెన్నున నిడుకొని
దాటుదు వార్థిని తారాపథమున;
కలదు శక్తి లంకను రావణుతో
పెళ్ళగించుకొని వెళ్ళుటకైనను.


23
హవ్యవాహనుడు యజ్ఞాహుతులను
దేవేంద్రున కందించు విధంబున,
నిన్నర్పించెద నేడె, ప్రస్రవణ
గిరి పైనున్న సుకృతికి రామునకు.
24
రాక్షస సంహారమునకు వెడలిన
విష్ణుమూర్తివలె వెలయు నీ విభుని
రాఘవుని, సుమిత్రానందనుతో
చూతు వీ దినమె శుక్లయశస్విని !
25
నినుగన నుత్కంఠితుడై ఆశ్రమ
మందు నున్న రఘునందను చూతువు,
మేరుపర్వతముమీద సుఖాసీ
నుండయిన సురేంద్రునివలె శోభని.
26
దేవీ ! మది సందేహింపకు, తి
న్నగ కూర్చుండుము నా వీపున; రో
హిణి చంద్రునివలె, నీవును రాముని
కలిసికొనెడి యోగ మపేక్షింపుము.
27
చలువలు చిమ్మెడి చంద్రునితో నటు,
చుఱచుఱ లాడెడి సూర్యునితో నిటు,
మాటలాడుచున్ దాటెదు వార్థిని,
నా వెన్నున తిన్నగ కూర్చుండిన.
28-29
నిను కొనిపోయెడి నను వెంటాడగ
జవసత్వంబులు చాలవు లంకా
వాసుల; కేగతి వచ్చితి నిటు, లా
గతి పోగల నాకాశ మార్గమున.


30
అద్భుతంబులగు హనుమ వాక్యముల
నాలకించి సర్వాంగములును పుల
కించి పొంగ, పలికెను మైథిలి హను
మంతునితో విస్మయ హర్షంబుల.
31
దూరము పయనము, దారి గాలిలో,
నను నీ వెట్టులు కొనిపోగలుగుదు ?
ఘటనాఘటనలు గమనింపని ఉ
త్సాహము మీ కపి జాత్యము హనుమా !
32
మానవ పూజ్యుని నానాథుని సా
న్నిధ్యంబును పొందింప తలచితివి;
ఎట్టుల కొనిపోయెద విది సాధ్యమె ?
అల్పము నీ కాయము హరిపుంగవ !
33
సీత సందియము చెవిని సోకగనె,
చింతలో మునిగె శ్రీమన్మారుతి,
తలవనితలపుగ తనకు క్రొత్త ప
రాభవంబు సుప్రాప్తమాయెనని.
34
ఈ యసితేక్షణ యెఱుగ దింత నా
సామర్థ్యమును నిజప్రభావమును,
చూచుగాక యీ సుముఖి యిపుడు నా
కామరూప రేఖా ప్రకాశనము.
35-36
అని భావింపుచు హనుమయు నంతట
చెట్టునుండి దిగి, సీతను దగ్గరి,
ఆమెకు నమ్మక మాదుకొనగ, ఆ
కారము పెంచుట కారంభించెను.


37.
మేరుపర్వతము మించి మందరా
చలము మించి అతిశయమగు రూపున
ప్రళయకాల తీవ్రములగు ప్రభలన్
నిలిచె హనుమ మైథిలి కట్టెదుటను.
38
విపరీతముగా పెరిగి కొండవలె,
రాగివన్నె తేఱగ మోమున, వ
జ్రములవంటి నఖములును కోరలు
గోరగింప, కపికుంజరు డిట్లనె.
39
కొండలు కోనలు, కోటలు తోటలు,
ప్రాసాదంబులు ప్రాకారంబులు
అన్నిటితో, అసురాధిపుతో, లం
కను సాంతము నే కొనిపోగలుగుదు.
40
దేవీ ! నీ సందేహము మానుము,
తేకువతో బుద్ధి నిలువరింపుము,
అపనయింపు మిసుమంత రామల
క్ష్మణుల తీవ్రతీక్షణ శోకంబును.
41
అని పలికెడి అనిలాత్మజు, పర్వత
సంనిభు, కపికుంజరమును చూచుచు,
పూచిన తామరపువ్వులవంటి వి
శాల నేత్రముల జానకి యిట్లనె.
42
తెలిసికొంటి హరికుల వీరాగ్రణి !
తావక బలసత్వ ప్రభావములు,
పవనుని వేగము భానుని తేజము
పొంది పొసగి నీ యందు పాదుకొనె.


43
మహిలో నరసామాన్యు డెవ్వడును
మఱియొక డింత సమర్థు డగపడడు,
పారములేని లవణ మహార్ణవము
దాటివచ్చి తీ దరికి మహాకపి !
44
నీ గమన బలోద్వేగము లెఱుగుదు,
ననుకొని పోగలవనియును నమ్ముదు
కాని, రాఘవుని కార్యసిద్ధిని, వి
చారించు టవశ్యము మునుముందుగ.
45-47
నీతో నే పయనించుట యుక్తము
కాదు హరీశ్వర ! కడలిమీద వే
గాతివేగమున అరుగునపు డడలి
మూర్చిలి నే పడిపోదును నడుమన,
?
జాఱి త్రుళ్ళిపడ సాగర జలముల,
మకర తిమింగిల మత్స్యజాతమున
కన్నం బగుదును హరికుల వర్ధన !
దిక్కుమాలిన మృతియగును నా కది.
48
శత్రుకుల వినాశకుడవు నీవు, ని
జంబె, కాని రాజాలను నీతో,
నిను కళత్రవంతునిగా లోకము
శంకించును నిశ్చయము మహాకపి !
49
నీవు నన్ను కొనిపోవుజాడ గని
దుర్గమ విక్రమధూర్తులైన రా
క్షసులు వెంటబడి కారింతురు, చల
పట్టి రావణుడు కట్టడి చేయగ.


50
బల్లెము, లీటెలు బద్దలు, తూపులు
పట్టి రక్కసులు చుట్టుముట్టగా,
వీరకళత్రము వెంట ఉన్నదని
భయసంశయములు పైకొను నీకును.
51
ఉప్పరమున ఏ యూతలేక, ఏ
ఆయుధములు లే, కాయుధధారు ల
నేక రాక్షసుల నెదిరి పోరు, చెటు
నను రక్షింపగ నగు నీకు హనుమ !
52
క్రూరకర్ములగు ఘోరరాక్షసుల
తో తలపడినన్ , తుముల సమరమగు,
ఆ సంకుల సమయమున నేను నీ
వెన్ను పట్టెడలి వ్రేలు కాడుదునొ.
53
భీమబలాడ్యులు వేలు దానవులు
వివిధాయుధ కోవిదులు, నిను నిరా
యుధుని, ఒక్కరుని, యోడింపగ నో
పుదురు పోరితంబున ఎటులై నను.
54
యుద్ధము చేయుచు ఒక్కప్పుడు నీ
వెడపెడ మొగ మిడితేని; క్రిందపడ,
నన్ను పట్టి బందంబులేసి రా
క్షసులు మఱల లంకకు కొనిపోదురు.
55
లేక , నన్ను బల్మిని నీ చేతుల
నుండి లాగుకొన నోపుదు రేనియు,
పగగొని చంపగవచ్చు, జయాపజ
యమ్ములు రణమున నమ్మగరానివి.


56
అట్లుగాక , ఇక్కట్లమారి ర
క్కసులు కసరి వెక్కసముగా హిం
సించిన, నేనె త్యజింతు ప్రాణములు,
వృధయగు నీ పని, వ్యధ మిగులును హరి !
57
ఈ నిశాచరుల సేనల చంపగ
చాలు దీవు కపిసత్తమ ! చూడుము ! .
రాక్షస సంహారమునకు పుట్టిన
రామునికీర్తి పరాస్తమగు నపుడు.
58
అదియుగాక ఈ యసురఘాతకులు
నను కొని చని మానవులు మెసలని ర
హస్యదేశమున ఆకట్టినచో,
తెలియదు దాశరథులకు నా యునికి.
59
నా చెఱ తీర్చుటకై చేసిన నీ
యత్నము లన్నియు వ్యర్థమగు నపుడు ;
కాన నీవు రాఘవు తోడ్కొని లం
కకు వచ్చుటయే కర్తవ్య మిపుడు.
60
అరసి చూడుము, మహాత్ముని రాముని
మనుగడయును, లక్ష్మణసహోదరుల
బ్రతుకును, మీ కపిరాజు జీవితం
బు, నిపుడు నాతో ముడివడి యున్నవి.
61
మామక రక్షణమతులు రాఘవులు,
వానరులును నా పట్ల నిరాశను
చెందిరేని, కపి శేఖర ! విడుతురు
వారు ప్రాణంబులు వీరోచితముగ.


62
వానరేంద్ర ! నా ప్రాణవల్లభుని
తక్క మఱొక్కని తాకను సత్యము;
అస్ఖలితంబగు అస్మదీయ పా
తివ్రత్యముతో దీక్ష పట్టితిని.
63
నన్ను పట్టి స్యందనమున నిడి, పఱ
తెంచునపుడు, పరదేహము తగిలెను,
ఏమి చేయుదు, అనీశ, ననాథను,
పరబలాత్కృత నవశను నే నపుడు.
64
ఎప్పటికైన శమించునె నా వెత !
రావణుని పది శిరములు నేలబడి,
అతని బలంబులు హతమై, నప్పుడు
ననుకొని చను టొప్పును రాఘవునకు.
65
రణదుర్జయుడగు రాముని శౌర్యము
వింటిని వీనుల, కంటిని కన్నుల,
నాగదేవ గంధర్వ రాక్షసుల
నెవ్వడు నాతని, కెనగా డనిమొన.
66
గాలి తోడయిన కీలిపోల్కి, ల
క్ష్మణుడు తోడుగా, రణమున చాపము ,
నెక్కడి దైత్యుల చక్కాడు మహేం
ద్రప్రతాపు నెదురన్ నిలుతు రెవరు ?
67
దురమున లక్ష్మణుతోడ, దిగ్గజము
వలె రాక్షసులను పడత్రొక్కుచు, బా
ణాగ్నులు రేగ, యుగాంత భానుడగు
రాము నెదురు వారలు కల రెవ్వరు ?


           68
కావున బలములతో వేగమె రా
ముని తోడ్కొని రమ్ము, ప్రియ విరహమున
కృశియించెడి నా ఖేదము నార్చుము
సుఖమును చేకూర్చుము మహాకపీ !