శ్రీ సుందరకాండ (రాయప్రోలు సుబ్బారావు)/సర్గ 38

వికీసోర్స్ నుండి

శ్రీ

సుందరకాండ

సర్గ 38


1
అట్లు జానకి నయంబుగ పలికిన
ఆలకించి హృదయము హర్షింపగ,
సమయజ్ఞు డు, వాచావిశారదుడు
కపిశార్దూలం బపుడు పల్కె నిటు.
2
నీ భాషితము లనింద్య చరిత్రీ !
సకల స్త్రీలకు స్వాభావికములు,
సాధ్వీచరితల సంప్రదాయములు,
సీతా శోక వినీతార్థంబులు.
3
నీ వన్నట్టుల నా వీపున మి
న్నక కూర్చుండి, మణగి, నూఱామడ
కడలిని దాటుట కష్టమె అబలకు;
చాలవు నీ తను జవసత్వంబులు.
4-5
తాకను రామునితక్క అన్యునని
వినయముగా చెప్పిన రెండవ కా
రణము నీకె తగు రాముని పత్నికి;
ఎవతె పలుకగల దిట్టిమాట సతి !



6
విన్నవింతు దేవీ ! నే చూచిన
శీలవృత్తములు, చెప్పిన నీ సా
ర్థక వాక్యములను సకలము, కా
కుత్థ్సునితో నట కుంచక పెంచక .
7
రాముని పై నా ప్రేమనిష్ఠలకు
పలుకారణములు కలవు తపస్విని !
స్నేహంబున చిగిరించిన మానస
మతిశయింప, నటు లభివర్ణించితి.
8
మొదట, దాటరానిది మహార్ణవము,
పిదప లంక ప్రవేశ మసాధ్యము,
రెండింటి సమర్థించిన నా బల
పాటవములు తెలుపగ నటు లాడితి.
9
నిన్ను విభునితో నేడే చేర్పగ
ఉత్సాహము చిగురొత్తగ, గురుభ
క్తియు నెక్కొన, పలికితినటు నురవడి,
దేవీ ! వేఱుగ భావింపకు మది.
10
నాతో ప్రస్థాన మిపు డసంగత
మగుచో, నీ విరహమున వేగు రా
రామునికి గుర్తుగా పుణ్యవతీ ! లాం
ఛన మేదయిన ప్రసాదింపగ తగు.
11
అని విధేయముగ హనుమ పలుక
దేవకన్య భాతిని భాసిల్లెడి
జనకసుతయు బాష్పము లాకట్టిన
ఎలుగు రాలుపడ ఇట్లనే మెల్లగ.


12
ప్రియ లాంఛన మిది విభున కిమ్ము, మును
ఫలతరూదకప్రాజ్యమూలమగు
చిత్రకూటమున చెరి, కాపురం
ముంటిమి, గిరిపూర్వోత్తర తటమున,
13
తరువులతో క్రిక్కిరిసి, వివిధ పు
ష్పసువాసనలు విసరుచుండ, ఏ
కాంతవాస యోగ్యమయి, తాపసుల
ఆశ్రమములలో విశ్రుతం బగుచు.
14
సిద్ధులు విడిసి వసించుచున్న మం
దాకిని దరి నిద్దరము తిరిగితిమి
చాలసేపు, వేసరి నే నొరగితి
చెమటనీట తడిసిన విభు నొడిలో.
15
అపు డచ్చట మాంసార్థముగా ఒక
కాకి నన్ పొడిచె, గడ్డలు రువ్వితి,
విడిచిపోక అది పెడల దాగి, క్ర
మ్మఱ వచ్చెను మాంసము మరగిన తమి.
16
బలిపిండములకు అలవాటయి ఆ
పాడుకాకి నరపలలము రుచిగొని,
మానలేక పలుమఱు నన్ పొడిచెను,
పొంచియుండి దాపులనె దాగుకొని.
17
చలమున, పోక, పిశాచి కాళకా
కోలము నా మొలనూలులాగె, నే
కినిసి కసరి దానిని అదల్చుచుం
డగ నీ వారసి నవ్వితి వల్లన.


18
నాథుడు నవ్విన నానయు కోపము
నగ్గలించె, వాయసమును వదలక
విడిచిపోక నను వేధింపగ, దెస
మాలి వల్లభుని మాటున కేగితి.
19
ఱొమ్ముచీఱి, కాకమ్ము కొసరి నా
చీర లాగినన్ చిన్నపుచ్చుకొని,
సిగ్గును కోపము లగ్గపట్ట నీ
యంకమునె మఱల నాశ్రయించితిని.
20
కాకపీడనకు కాఱియపడి, క
న్నీళ్ళతో మొగము నిండగ, కన్నులు
తుడుచుకొనుచు చేడ్పడియుండగ క
టాక్షంబుల నన్నాదరించితివి.
21-23
విసిగి, వేసరిలి విరమించి, నిదుర
పోతి చాలసేపు విభు నంకమున
పిదప రాఘవుడు నిదురించెను నా
యొడిలోపల శిరసిడి సుఖంబుగా.

ఒడ లెఱుంగక ప్రియుని యొడినే నిదు
రించి లేవగనె, పొంచియున్న కా
కోల ముచలమున వ్రాలి నాపయి త
టాలున స్తనములు చీలిచె చివ్వున .
24.
స్తనముల గాయములను కాఱిన ర
క్తపు చుక్కలతో తడిసె, నంత, కా
కోల బాధలకు తాళలేక , సుఖ
సుప్తినున్న రఘుసోముని లేపితి.


25
గాయములయి రక్తము కాఱిన నా
వక్షంబును రఘువల్లభు డారసి,
క్రుద్ధుండై ఎడకోడె త్రాచువలె
బుసలు చిమ్ముచున్ కసరి యిట్టులనె.
26
ఎవడు తెగించి ఒడ లెఱుగ కిచట నీ
ఱొమ్ము గీఱి గాయమ్ములు చేసెను?
అయిదుతలల కాలాహితోడ చె
ల్లాటల కెగబడె చేటుమూడి యిటు,
27
అనుచు విభుడు వాయసమునకై పరి
కించి చూడసాగెను నలువైపుల ;
అది నా కెదురుగ కదలక యుండెను
నెత్తురు జొత్తిలు కత్తిగోళ్ళతో.
28
ఆ వాయస నాయకుడు, మహేంద్రుని
వరసుతు డనియును, వాయువేగమున
భూసంచారంబునకు వెడలి, దిగి
వచ్చెనని తెలియవచ్చె విభున కెద.
29
అంత, మహాభుజు డాగ్రహోగ్రుడయి,
కనుచూపులు కనకన భ్రమియింపగ,
పారజూచి ఆ బలిపుష్టము నెడ
క్రూరమగు ప్రతీకారము తలచెను.
30
తా నాసీనుండైన చాప నొక
దర్భను బ్రహ్మాస్త్రముగా అభిమం
త్రించి వైచెను, జ్వలించుచు అది వా
యసమునంటి వెన్నాడెను వదలక ,


31
బ్రహ్మాస్త్రము వెంబడిపడ, కాకము
ప్రాణభీతితో పాతర లాడుచు,
సంరక్షణకయి సర్వభూతలము
దిగ్దిగంతములు తిరిగి త్రిమ్మరెను.
32
తండ్రి యింద్రుడును, తక్కిన సురలు, మ
హర్షు లెల్ల పొమ్మనితోయగ, వెఱ
నిస్సహాయుడై , నీవే దిక్కని,
కడకు రాఘవుని కాళ్ళమీద బడె.
33
శరణాగత రక్షణ దీక్షితుడగు
కాకుత్థ్సుండా కాక పిశాచిని
మన్నించెను చంపతగినదైనను,
శరణని భూమిని చాగిలి వ్రాలగ.
34
తిరిగితిరిగి బలమఱి, దుఃఖించుచు
క్రమ్మఱిలిన కాకము గని రాముడు,
బ్రహ్మాస్త్రము త్రిప్ప నశక్యము, దీ
నికి చూపుము శాంతిని నీ విపుడనె.
35
కాక మంత రాఘవ ! నీ యస్త్రము
నా కుడికన్ను కొనందగు ననె; అ
ప్పుడు కుడికంటిని పొడిచె నస్త్రమున
రాముడు, కాకికి ప్రాణము దక్కెను.
36
రాజు దశరథుని, రక్షకు రాముని,
ప్రస్తుతించుచున్ ప్రణతులు సలిపి, ని
జాలయంబునకు అరిగె వాయసము
వీరుడు రాముడు విడిచిపుచ్చగా.


                    37-38
నాకొఱకప్పుడు కాకిమీద బ్ర
హ్మాస్త్ర మెత్తితివి, అకటా ! ఏల యు
పేక్షిం తిపుడు మహీధవ ! నిన్నెడ
బాపి నన్ను కొనివచ్చిన రాక్షసు.
                   39
నాటి వీర కరుణారసంబులను
నేడు నా పయిన నెఱుపుము రాఘవ !
నిను నాథునిగా గొను సౌభాగ్యము
కలిగి, అనాథను వలె తపింతు నిట.
                   40
ధర్మములందు ఉదాత్త ధర్మము ద
యా విశేషమని నీవె చెప్పగా
వింటిని, తావక వీరవిక్రమో
త్సాహము లెఱుగుదు సాటిలేనివని.
                   41
నీ గాంభీర్యము సాగర మట్టిది,
కదలదు చెదరదు కలతలు చెందదు;
నాల్గు సముద్రముల నడిగడ్డకు పా
లకుడవు, సురనాయక సమానుడవు.
                  42
అస్త్రశస్త్ర విద్యా కుశలుడు, భుజ
బల పటిష్ఠు, డనవద్య సత్యసం
ధుడు, రాఘవు డెందుకు సంధింపడు,
ధనువున నస్త్రము దైత్యుల దునుమగ.
                  43
నాగాసుర గంధర్వులేని, ఆ
మరుతు లేనియును మార్కొనజాలరు
రణరంగంబున, రాముని క్రూర శ
రప్రయోగ ధారాపాతంబును.




                  44
ఆ వీరుడు నాయాతన లింత త
లంచి, జాలిని కలంగెనేని, ఇటు
లూరకుండ గానేల, వ్రాలిరా
క్షసులను క్షయలోకమునకు పంపడు.
                  45
రిపువాహినులకు గ్రీష్మతపనుడగు
లక్ష్మణు డమితబల ధురంధరు, డ
న్న యనుమతినిగొని నాశము చేయడు
కంటకులగు రక్కసుల నెందులకు ?
                  46
అగ్ని సమానులు, అనిల సంనిభులు,
తేజోజవశక్తి ప్రతాపు,లీ
పురుష వ్యాఘ్రంబులు సమర్థులై
ఏమిటి కిట్టు లుపేక్షింతురు నను.
                 47
చేసిన నా దుష్కృత మేదో కల
దతి బలవత్తరమైనది, తథ్యము;
లేకయున్న రిపులోక దాహకులు
బయిసిమాలి విడువరు న న్నీగతి.
              48
కనుల నశ్రువులు కాఱ దీనముగ,
కరుణ గద్గదస్వరయై పలికిన
వై దేహి విలాపము విని, కరగిన
మనసు చివుకుమన హనుమ యిట్లనెను.
               49
దేవీ! నమ్ము మీదే ఒట్టు తినెద,
రాముడు నీ పయి ప్రాణములన్నియు
పెట్టి, సర్వసుఖ విముఖుడాయె, ల
క్ష్మణుడు తపించు విషాదవేదనల.



                    50
కన్నుల చూచితి నిన్నెటులో యిట,
తఱిగా దిది చింతాచింతనలకు,
దుఃఖాంతము చూతువు వై దేహీ !
ఇంతటిలోనె అదృష్టవశంబున,
                   51
పులిపోతంబులవలె బలిష్ఠులగు
రాజసుతులు వార లిరువురును, నిను
చూచు సంభ్రమము రాచ లేచి, కా
లిచి లంకను బూడిద కావింతురు.
                   52
దశకంఠుని బాంధవ బలములతో
ఘోరరణంబున కూల్చి రాఘవుడు,
నిను తోడ్కొనిపోవు నయోధ్యకు, ము
జ్జగములు మెచ్చగ జనక కుమారీ!
                   53
ఏమి చెప్పదగు నేనుపోయి, అట
ధీమంతులయిన రామలక్ష్మణుల
తో, సుగ్రీవునితో, కపివీరుల
తో నదెల్ల నాతో చెప్పు మిచట.
                   54
హనుమ చెప్పినది ఆమూలము విని,
సురసుత బోలిన శుచిముఖి మైథిలి,
శోకముతో మనసు తపింపగ, ఇ
ట్ల నె కపిసత్తము డాకర్ణింపగ.
                   55
సుమనస్విని, ప్రస్తుత చరిత్ర, కౌ
సల్య లోకరక్షకుగా కడుపున
కన్న రాముని సుఖ మడిగి, శిరసును
వంచి, సలుపు మభివాదము మారుతి !

సుందరకాండ


                    56
రమ్యమాల్యములు, రత్నహారములు,
పృథివీ రాజ్యము, ప్రియ కళత్రమును
స్వేచ్ఛగా విసర్జించిన లక్ష్మణ
పుత్రునికన్న సుమిత్ర ధన్యయగు,
                   57
తల్లి దండ్రులను తనిపి, అడవులకు
నడచు అన్నవెంబడి వచ్చె, నఖిల
సుఖములు విడిచి, విశుద్ధుం; డన్నకు
అనుకూలుడు పావనశీలు డతడు.
                   58-59
సింహపు మూపుల శృంగారముతో,
దీర్ఘబాహువులు తేజరిల్లు ప్రియ
దర్శనుడు, మహోదారుడు, సుఖములు
కోర, డన్న కనుకూలుం డాతడు.
                   60
వృద్ధ జనుల సేవించును, శుభ సం
పల్లక్షణములకెల్ల నాస్పదుడు,
గంభీరుడు, లక్ష్మణు, డర్చించును
నన్ను తల్లివలె, నాథుని పితవలె.
                   61
రాజసుతుడు, సర్వప్రియుండు, నా
మామగారికి సమానుడు, పరిమిత
భాషి, అపరిమిత పౌరుషరాశి నా
కన్న ప్రియుడు రాఘవునకు ఆతడు.
                   62
రాముం డేకార్యమునకు పనిచిన
సాధ్యాసాధ్య విచారణ సలుపక,
నిర్వహించు దానిని; రఘునందను
డతని చూచుకొని పితనే మఱచును.

సర్గ 38

                   63
నా పక్షంబున నా మాటలుగా
కుశలమడుగు మనుగుంగతి లక్మణు;
దక్షుడు, కోమలు, డక్షతశుచి,
కన్న ప్రియుడు రాఘవునకు తమ్ముడు.
                  61
వానరసత్తమ ! ప్రాణగొడ్డమగు
ఈ కష్టము గట్టెక్కించుట నీ
భారము, తగిన ఉపాయసాధనలు
నిర్ణయించుటకు నీవె ప్రమాణము.
                  65
నీ సాయము, పూనికయును, నను కొని
పోవగ రాముని పురికొల్పగవలె,
నా చెప్పినదంతయు పలుకుము రా
మునితో, శూరుడయిన నాథునితో,
                  66
ప్రాణంబులు బిగబట్టియుందు నొక
మాసము దాకను, మాసము దాటిన
జీవింపను రఘుశేఖర ! సత్యము
పలికితి నీతో ప్రాణసాక్షిగా.
                  67
పాపి, కామి, రావణుడు , నన్నిటుల
పట్టితెచ్చి నిర్బంధింపగ, దుర
పిల్లుచుంటి, విడిపింపగతగు; పా
తాళ కౌశికనుబోలె రఘూత్తమ !
                   68
అనుచు సీత అపుడపుడె, హనుమ క
ర్పించె చీర ముడివిప్పి, దివ్యభూ
షణమును చూడామణిని, రామున క
భిజ్ఞానముగ అర్పింపుమనుచు ధృతి.

సుందరకాండ


                    69
అపురూపంబగు ఆ శిరోమణిని
స్వీకరించి తన వ్రేలికి తొడిగెను,
ఆదిచాల కది అరపకపోయెను
బలిసియున్న కపి బాహాంచలమున.
                   70
మణిరత్నము కై కొని హనుమంతుడు
సీతకున్ ప్రదక్షిణముగ అభివం
దనము నెఱపి, యెంతయు వినయంబుగ
ఒక పార్శ్వంబున కోసరిలె నొదిగి.
                   71
సీతాదర్శన జాతానంద స
ముత్కంఠిత హృదయుం డగు హనుమకు
హృదయ మెప్పుడో యెగసిపోయె రా
ఘవునికడ, కచట కాయమె యుండెను.
                   72
తన ప్రభావబలమున సీతను కని,
ఆమె దాచిన శిరోమణి గైకొని,
సుడిగాలి విసరి విడిచిన గిరివలె,
సుఖియై గమనోన్ముఖు డాయె, హనుమ.