శ్రీ సుందరకాండ (రాయప్రోలు సుబ్బారావు)/సర్గ 36

వికీసోర్స్ నుండి

శ్రీ

సుందరకాండ

సర్గ 36


                  1-3
సీత నమ్మకము చెదరకుండుటకు
హనుమ మఱల నిట్లనె అనునయుగ,
వనచరుడను, దూతను, తెచ్చితి వీ
షింపుము నీ విభుచేతి యుంగరము.
?
నీ విశ్వాసము నిలువరించుటకు
రాముడిచ్చెను కరాంగుళీయకము,
కొనివచ్చితి, కైకొని చూడుము, శో
క ముడిగి , ఊరడిలుము తపస్వినీ !
                   4
ముమ్మరింపగా మోదము మైథిలి
ఉపశమించి, ఆ యుంగరమునుగొని,
భర్త చేతి ఆభరణము నరయుచు
రాగిల్లెను భర్తనె పొందినగతి.
                   5
ఎఱుపులు తెలుపులు గిఱికొను కన్నుల
చెలువము చిమ్మెడి సీతావదనము,
కనబడె హర్షోత్కటమై యప్పుడు,
రాహువు విడిచిన రాకాశశివలె.


                    6
విభుని క్షేమమును విజయంబును విని,
సంతోషము లజ్జయు మిక్కుటముగ
పెనగొన, జానకి ప్రీతిదాతను, మ
హావానరు కొనియాడె నిచ్చమెయి.
                    7
ప్రాజ్ఞుడవు, పరాక్రమశాలివి, కా
ర్యసమర్థుండవు హరికులవర్ధన!
లంఘించితి దుర్లభదుర్గమమగు
ఈ రాక్షస పద మీ వొక్కండవె.
                    8
నూఱామడలు కఠోరమయిన మక
రాలయమును ఒక ఆవు పాదముగ
చేసి దాటితివి నీ సాహస వి
క్రమ బలములు శ్లాఘ్యములు హరీశ్వర !
                    9
నిను సామాన్య వనేచరునిగ భా
మింపను హరివర! బెదరవు చెదరవు
రవ్వంతయినను; రావణ రాక్షసు
పేరు విన్న క్షోభిల్లు లోకములు.
                   10-11
విదితాత్ముడు రఘువీరుడు పంపిన
దూత వగుట నాతో భాషింపగ
అర్హుడ; వాతండరసిపరీక్షిం
చక పంపడు నా సన్నిధి కెవరిని.
                   12
న్యాయ సంగర విధాయి, ధార్మికుడు,
రాఘవుడు, పరాక్రమశాలి సుమి
త్రా సుతు, డిద్దరరణ్య మధ్యమున
నా భాగ్య వశమునన్ కుశలురు గద.


                    13
కాకుత్థ్సాన్వయ రాకా సోముడు,
రాముడు క్షేమముగా మనియుండిన,
వార్ధులు చుట్టిన వసుధా చక్రము
కాల్చడేల? లయకాల వహ్నివలె.
                   14
అమరులనైనను హతమార్పంగల
శక్తినిధులు దాశరథి సోదరులు,
ఐనను నా చెఱమానుప తలపరొ!
లేక అంతమే లేదొ నా చెఱకు!
                   15
బడలడుగద రాముడు మనోవ్యధను,
నా వియోగతపనన్ పొగలడుగద,
పురుషోత్తము డిక ముందుకాదగిన
పనుల ప్రయత్నములను మానడుగద.
                    16
దీనుండయి భ్రాంతిన్ బడి కార్య క
లాపములను ప్రాల్మాలడుగద, పురు
షార్థములు విధాయకముగ జరుపుచు
నుండునె? రాజసుతుండు నిత్యమును.
                    17
తనుపునె మిత్రుల దానసామముల
రెంటను? శత్రుల వెంటను నడుపునె
దానదండ భేదమ్ములు మూడును?
రాముడు జయకాంక్షామనస్వియై.
                    18
కలిసి మెలిసి మిత్రులు వర్తింతురె ?
మిత్రులతో తామెలగునె చనువుగ ?
సుహృదులు రాముని శుభము కోరుదురె?
గారవింత్రె రాఘవుని, వారలును.


19
భగవదనుగ్రహబల మర్ధించునె ?
దైవము తోడయి దారి చూప పురు
షార్థ సిద్ధి తథ్యము; (సకాలమున
దున్నిన పొలములు తొలకరితో వలె.)
20
కలుసుకొనక , చూపులును లేని దీ
ర్ఘ ప్రవాసమున రాముని స్నేహము
నాదెస తెగిపోలేదుగద హరీ!
తేర్చునె యీ చెఱతీర్చినను విభుడు.
21
సుఖముగ పెరిగిన సుకుమారుడు, దుః
ఖము నెఱుగని రా కొమరుడు, రాముడు;
ఇల్లు విడిచి గాసిల్లుచు నడవుల
శోక భరంబున సొగసి పోడుగద !
22
సాధ్వీమణి కౌసల్యాదేవి, సు
మిత్ర దీన చారిత్ర, వారి కుశ
లము విందురె వారము వారము నట,
వినవచ్చునె భరతుని క్షేమంబులు.
23
లోకమాన్యు డిక్ష్వాకు కులీనుడు,
నా విరహదురంత వ్యధల నలిగి,
అన్య మనస్కుండై అలయడు గద !
రక్షించునె నను రఘుకుల తిలకము.
24
అన్నను దేవునియట్లు భజించును
భరతుడు భయభక్తులతో నాతడు,
మంత్రి సురక్షితమయిన భీషణా
క్షౌహిణీ బలము నంపునె నాకయి.


25
శ్రీమంతుడు సుగ్రీవుడు నాకయి
వెడలివచ్చునే వీరకపులతో !
ఖరదంష్ట్రలతో కఱకుగోళ్ళతో
రక్కసి మూకల రక్కి త్రెక్కొనగ.
26
శుద్ధ శూరకుల సోముండు, సుమి
ట్రానందను, డరిదాహకు, డస్త్ర వి
శారదుండు లక్ష్మణుడు వధింపడె !
తన శరముల నీ తామసకోటిని.
27
రణరంగములో రాముని శస్త్రా
స్త్రదవానలమున మ్రగ్గి రావణుడు
పుత్రమిత్ర కళత్రముగా హత
మారుట చూతునె అల్పకాలమున.
28
నా వియోగ తపనకు శుష్కించెనొ !
పసిడివన్నెలతో పద్మపరిమళము
విసరు విభుని ముఖబింబ మెండలో
నీరింకిన కాసార కమలమయి.
29
త్యజియించెను రాజ్యము ధర్మార్థము,
నడిపించెను కాల్నడన న్నడవికి,
శోకవ్యధ లించుకతోప వపుడు,
చెదరదుగద ఆహృదయస్టైర్యము.
30
తల్లిగాని, మఱి తండ్రిగాని, ఇత
రులుగాని రఘువరునకు స్నేహమున
కా రధికులు నాకంటె, నిందనుక
బ్రతికియుంటి ప్రియువార్తను వినుటకె.


31
ఇట్లు మైథిలి హరీంద్రునితో మధు
రార్థములగు వాక్యములు పలికి విర
మించెను, హనుమయె మిగత రామకథ
చెప్ప నాలకించెడి వేడుకతో.
32
సీత యట్టులు వచించిన దంతయు,
విని హనుమంతుడు భీమ విక్రముడు,
శిరసున చేతులు చేర్చి వినయముగ
వాకొన దొడగెను ప్రత్యుత్తరముగ.
33
నీ విచ్చటనుంటివి బందెనబడి
యని తెలియక తోడ్కొనిపోడాయెను
రాముడు; మును శీఘ్రముగ శచీదే
విని దేవేంద్రుడు కొని చనినట్టుల.
34
నేను పోయి విన్పించిన వెంటనె
నానాభల్లుక వానరవీరుల
సేనలతో చెచ్చెర విచ్చేయును
రణకోవిదుడగు రాముడు సాధ్వీ !
35
రాఘవుడు శరపరంపరలను గు
ప్పించి, వార్థి స్తంభింప జేసి, సై
న్యములతో విడిని, నాశ మొనర్చును
లంకతోడ నెల్లర నిశాచరుల.
36
రాముని రణయాత్రా మార్గంబున
మృత్యు వెదిర్చిన, దైత్యులు దేవత
లంద ఱేకమయి అడ్డిన, నాతని
ఆగ్రహాస్త్రముల కాహుతి యగుదురు.


37
నీవు కనబడని నిష్ఠుర శోకము
లోన మునిగి తేలుచు రఘురాముడు,
సుఖము నెఱుంగక క్షోభిలుచుండును,
సింహము బాధించెడి యేనుగువలె,
38
ఇది సత్యంబని యేను బాస తిం
దును; పుట్టి, పెరిగి, మను, వింధ్యాచల
మలయమందరాచలముల తోడని,
అందలి కందఫలాన్నము తోడని.
39
ఇంతంతలు కను, లెఱ్ఱని పెదవులు ,
కుండలముల మెఱుగులతో శోభిలి
పున్నమచంద్రుని బోలిన రాముని
మోమిదె చూతువు పూజ్య పురంధ్రీ!
40
ఐరావతమం దమరేంద్రునివలె,
ప్రస్రవణ నగముపై రఘునందను,
కన్నుల తమి తమకంబులు తీరగ
చూతువు శీఘ్రమె పూతచరిత్రీ !
41
మాంసము ముట్టడు, మధువును తాకడు,
కాలోచితముగ కానల లోపల
దొరికిన కాయలు దుంపలు తిని, నీ
రాని తృప్తిపడు రాజకుమారుడు !
42
అంతరాత్మ నీయందు లగ్నముగ
శోకనిరతి తదేక ధ్యాన ప
రాయణుడై గాత్రమ్మున ప్రాకెడి
చీమల దోమల పాముల నెఱుగడు.


43
కామవశుండయి రాముండేదో
ధ్యానమున మునిగి అన్యము నేమియు
చింతింపడు రవ్వంతయును మనో
వాక్కాయ వ్యాపారదూరుడయి.
44
రాజోత్తముడగు రాముడు నిద్దుర
రాక తపించును రాత్రిందివములు,
కన్నులు మూసిన కలవరించు సీ
తా యని పలుమరు తీయని యెలుగున.
45
పండుగాని పుష్పముగాని, మ ఱే
రమ్యమగు పదార్థంబుగాని కని,
ఉడికి ఉబుకు నిట్టూర్పులు పుచ్చుచు
హా ! ప్రియా యను తహతహ మైమఱచి.
46
రఘునందనుడు,స్థిర వ్రతనిష్ఠను,
నిన్నె యెపుడు ధ్యానించును, పిలుచును,
సీత సీతయని వా తెఱ కదలుచు,
యత్నించును నీ అడపొడ లెఱుగగ.
47
రామునివలె దుర్భర దుఃఖితయగు,
జనకజ, ప్రియుకీర్తన విని కనబడె,
శేషమేఘములు చిందులు మానగ
చంద్రుడు పొడిచిన శారద నిశివలె.