Jump to content

శ్రీ సుందరకాండ (రాయప్రోలు సుబ్బారావు)/సర్గ 29

వికీసోర్స్ నుండి

శ్రీ

సుందరకాండ

సర్గ 29

   
        
            1
బాధలు విడువక వేధింపగ, సం
తోష మెఱుంగని దురదృష్టను, దీ
నను సీతను వైకొనె శుభచిహ్నలు,
శ్రీమంతులను పరిజనంబులవలె.
             2
నలుపుతెలుపు జీఱలు తళుకొత్తగ,
వంపుకురులతో వాలిన ఱెప్పల
యెడమ కన్నొకటె జడికొని అదిరెను,
చేపలు కొట్టిన చెందామరవలె.
            3
అగరు చందనము లలద నెసగి, ప్రియు
నుపలాలనలకు యోగ్యంబయి, కం
డగల గుండ్రని జనకజ యెడమచెయి
అదరసాగె వడి పదపడి చిరముగ.
            4
ఏట వాలయిన యేనుగు తొండము
పోలి, ఒత్తుకొని, క్రాలు ఎడమతొడ,
వదలక పలుతడవలు కదలాడెను,
కట్టెదుటను రాఘవు డున్నట్టుల.
                       



                5
మేలిమి పసిమిని మెయిమెఱయగ, దా
నిమగింజల దంతములు తొలక, శుభ
గాత్రి, వినిర్మల నేత్ర మేన, కొం
చెము మాసిన చేలము దిగజాఱెను.
              6
పూర్వాపరముగ పొడకట్టిన శుభ
చిహ్నములు తలచి సీత తెప్పఱిలె,
గాలికి ఎండకు క్లాంతమైన వి
త్తనము వానలకు తలిరుపోయుగతి.
               7
అధరబింబ మెఱుపార, కనులు, కను
బొమలు, ఱెప్పవంపుల కురులు మెఱయ,
సితరదనములు హసింప, సీత శో
భిల్లెను రాహువు విడిచిన శశివలె.
               8
ఆఱగ శోకము, జాఱగ తందర,
తీఱగ తాపము, మీఱగ హర్షము,
సీతముఖము భాసిల్లెను; చంద్రో
దయమున పులకితమయిన రాత్రివలె.