శ్రీ సుందరకాండ (రాయప్రోలు సుబ్బారావు)/సర్గ 28

వికీసోర్స్ నుండి

శ్రీ

సుందరకాండ

సర్గ 28



                   1
తన దుష్కామితమును రావణు డటు
తెలిపినవిని వై దేహి భయార్తిని
కళవళపడి గాసిలె.నడవిని సిం
హముబాఱి పడిన ఆడేనుగువలె.
                   2
భయపెట్టగ రావణుడు, రక్కసులు
చుట్టుముట్టి చెఱపెట్ట సీతయే
డ్చుచు నుండెను, జనశూన్య గహనమున
వర్జింపబడిన బాలిక పోలిక.
                   3
కాలము రానిది కాదు మృత్యువని
పెద్దలు చెప్పిన సుద్ది యథార్థము,
దుస్సహ భయమున క్రుస్సి కుములుచున్
బ్రతికెద నెంతటి పాపరాశినో.
                   4
సుఖము లేక, యించుకయును, దుఃఖము
పుట్టలు పెట్టగ, గట్టిపడిన నా
గుండె యెండియు పగులదు ముక్కలుగ;
పిడు గడచియు నెఱెపడని బండవలె.


                  5
నా దోషము సుంతయు లేదిందుకు;
చంపవచ్చు రాక్షసు డప్రియురా
ల ననుచు; అటులని అద్విజునకు ద్విజు
డీయ తగునె ఆమ్నాయ మంత్రమును.
                 6
లోకనాథు డిక్ష్వాకు డిందు రా
కున్న రాక్షసుడు నన్నుకోయు నిక
సన్నని శితశస్త్రముల గర్భగత
శిశుశల్యములను ఛేదించు పగిది.
                7
నేరమునకు బందెంపడి, ఉరికయి
వేగు తస్కరుని వేదనవలె; ఈ
రెండుమాసములు నిండవు నాకె
న్నటికిని, దుఃఖమున మఱుగుచున్నను.
                 8
హా ! రామా ! రామానుజ లక్ష్మణ !
హా కౌసల్యా ! అకట సుమిత్రా !
అల్లాడెద నేనల్పభాగ్య నిట;
ఉవ్పెనపాలయి ఉలుకు నావవలె.
                 9
నా మూలంబున నాడు రామల
క్ష్మణు లుడిపోయిరి మాయమృగము మిష
కోడెలు పోలిన జోడు సింహములు
పిడుగుపాటుతో అడగారిన గతి.
             10
మృగరూపము ధరియించి మోహపె
ట్టెను దుష్కాలము నను, తత్ఫలముగ
కోలుపోతిని రఘుకులాభరణుని,
గుణమణియగు లక్ష్మణుతో నప్పుడు.


              11
హా రామ ! మనోహరముఖరాకా
సోమ ! దీర్ఘ భుజ శోభనకామా!
సత్యవ్రత ! రాక్షనులు నన్నిచట
కడతేర్చెడి సంగతి నీ వెఱుగవు.
              12
ఇతర దైవముల నెఱుగ, కోర్పుతో
నేలపాన్పుగా, నియత ధర్మముల
పరగితి పాతివ్రత్య దీక్ష ; వ్య
ర్థంబాయె నది కృతఘ్ను సేవవలె.
              13
ధ్వంసమాయె నా ధర్మాచరణ ము,
వ్యర్థమాయె నా పాతివ్రత్యము'
చిక్కి, చాయచెడి చెంత నీవు లే
కాఱెను సంగమ నాశాకిరణము.
             14
నడపి తండ్రియానతి, తలపెట్టిన
వ్రతము పూర్తిగ నివర్తించి, కృతా
ర్థుడవై, యింటి వధువులు భజింపగ,
సుఖియించెద వనుచున్ భావించెద .
              15
నీయెడ బద్దస్నేహంబున సలి
పితిని దీర్ఘముగ వ్రతములు తపములు,
వ్యర్థములై కొనివచ్చె నాశన మి
సీ ! త్యజింతు దురదృష్ట జీవితము.
              16
ఈ హేయపు బ్రతు కిపుడె త్యజింతు వి
షము త్రాగియొ, శస్త్రము నర్థించియొ ;
శస్త్రముగాని విషంబుగాని నా
కిచ్చు దాత యొక డిచట కనబడడు.



             17
ఇటు పలు తెఱగుల కటకటపడి, క
ష్టము గట్టెక్కగ జనకజ తెగబడి
తన జడనే ఉరిత్రాడుగా పెనచె,
యముని పాదమూలము చేరుదునని.
             18
సర్వమృదుల రంజనగాత్రి సమీ
పించి శింశుపావృక్షము, శాఖను
పట్టుకొనెను, భావమున రామల
క్ష్మణులను కులమును స్మరియించుచపుడు.
            19
శోక నిమిత్తములుగాక, లోకమున
ధైర్యకారణార్థ ములని చిరముగ
సుప్రసిద్ధమగు శుభశకునంబులు
తోచె భావి ఫలసూచన లార్యకు.